కలో నిజమో తెలియనంత అలసటగా ఉంది. ఎలాగో పని ముగిసింది. ఇక ఇంటికి పోడమే. ఈ సోమవారాలు వస్తే ఒళ్ళు మరీ హూనమవుతుంది. ఊరి మెయిల్‌బాక్స్ పేపర్‌లో అడ్వర్టైజుమెంట్ల కాగితాలు పెట్టాలి. అందులోని కూపనులు వగైరాలు వీకెండ్ షాపింగుకు ఉపయోగపడుతాయి. సోమవారాలు ఫుల్‌టైం పని, మిగిలిన రోజులు మధ్యాహ్నం నుంచి సాయంకాలం దాకా. నెలకు సుమారు వెయ్యి డాలర్లపైనే వస్తుంది నాకు ఈ పార్ట్‌టైం పనితో.
మధ్యాహ్నమే రేడియోలో చెబుతున్నారు రాత్రికి సుమారు ఐదారు అంగుళాల మంచు కురుస్తుందని. పార్కింగ్‌లాట్‌కి రాగానే చల్లటిగాలి వణికించింది. కారు స్టార్టు చేసి టైం చూశా. పదకొండు కావొస్తోంది. ఇంటికి వెళ్ళడానికి సుమారు ఒక గంట పడుతుంది. వీణ ఈ వేళకి నిద్ర పోయుంటుంది. రమేశ్ ఏం చేస్తున్నాడో? వీణ అన్నం సరిగా తిన్నదో లేదో? ఆలోచిస్తూనే చిన్నగా హైవేలో మెర్జ్ అయ్యాను. ట్రాఫిక్ ఎక్కువగా లేదు. టేప్‌డెక్‌లోకి చేతికి అందిన ఒక కేసెట్ నెట్టాను. పాటలు వినకుండా, ఆ పాటలు పట్టుకొచ్చే జ్ఞాపకాలూ ఆలోచనలూ లేకుండా కారు నడపలేను. నేను వినే ఒక్కో పాట 32 సంవత్సరాల నా జీవితంలోని ఒక్కొక్క సంఘటనకి ఫ్ల్యాష్‌బ్యాక్. అన్నీ నాకిష్టమైన పాత పాటలే. మంచు పడటం మొదలయింది చిన్నగా.
కలకానిదీ, నిజమైనదీ… నాన్నగారు నన్నూ, విజయనూ కాలేజీ చదివించడానికి పడ్డ కష్టాలు, తిప్పలు జ్ఞాపకానికి వచ్చాయి. వారి ఒక్క కోరికా ఇద్దరాడపిల్లల్నీ చక్కగా చదివించి, పెళ్ళి చేసి అత్తవారింటికి పంపడమే. ప్రతి టర్ముకూ ఫీస్ కట్టే సమయానికి అమ్మ చంద్రహారం బ్యాంకుకు వెళ్ళేది. దానిని విడిపించేంతలో ఇంకొక టర్ము వచ్చేసేది. నాన్న పెన్షన్ లోను, ఊళ్ళో పొలంపైన వచ్చే కొంచెం రాబడీ, నానాకష్టాలు పడి చదివించారు. విజయదేమో ఎం.ఎస్‌సీ కెమిస్ట్రీ, నాదేమో సంస్కృతంలో ఎం.ఏ.! కాలేజి చదువు ముగిసింతరువాత పని వేట ప్రారంభమయింది. కంప్యూటింగ్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ వాళ్ళకి పని సులభంగా దొరుకుతుంది గానీ సంస్కృతం చదివిన వాళ్ళకు ఉద్యోగాలు ఎవరిస్తారు? ఉన్న ఊళ్ళో బడిలో టెంపరరీ సంస్కృతం టీచర్‌గా చేరాను. బ్రతుకంతా ఇలానే టెంప్‌గా బతకాలేమో, కుదురుగా ఎప్పటికి ఉంటానో, ఇవే భయాలు అప్పట్లో నాకు. ఆలోచనల్ని తెగ్గొడుతూ మరుగేలరా ఓ రాఘవా… తక్కువ బ్యాక్‌గ్రవుండ్ మ్యూజిక్‌తో ఉండే ఈ పాటంటే నాకు ఎంత ఇష్టమో. టేపుతో పాటు కలిసిపాడుకుంటూ మళ్ళీ గతంలోకి జారిపోయాను.
ఓ రోజు నేను ఇంట్లో కాలు పెట్టేటప్పటికి అమ్మ గొంతు వినిపిస్తోంది “సుమా, ఎలాగైనా నువ్వు చెప్పవే మీ అన్నకు, మీ అమ్మ నాన్నలకు; మా బరువులో సగం తగ్గుతుంది, నీకు మేము ఎప్పుడూ ఋణపడి ఉంటామే” అంటూ. సుమ నా స్నేహితురాలు, అమ్మతో మాట్లాడుతూ ఉంది. “మీరు పెద్దవాళ్ళు, అలా అనకండి, శ్రీదేవి చిన్నప్పటినుండి నా స్నేహితురాలు” అంటూ. తరువాత సుమ చెప్పింది, వాళ్ళన్నయ్య అమెరికానుండి వచ్చాడట, పెళ్ళి చేసికొని వెళ్ళాలనుందట. సుమ అతనితో చెప్పిందట “మా శ్రీదేవిని ఎందుకు చూడరాదు” అంటూ. రమేశ్ పొడవుగా ఉంగరాల జుట్టుతో చూడడానికి బాగానే ఉంటాడు. సుమ వాళ్ళింట్లో చాలాసార్లే చూశాను అంతకు ముందు. వాళ్ళ నాన్న అమ్మలు కూడా నాకు తెలుసు. తర్వాతి రోజే వచ్చారందరూ మా ఇంటికి. వాళ్ళ అమ్మ నన్ను ఒక పాట పాడమంది.
“ఇదేంటే అమ్మా, శ్రీదేవి పాటను ఎన్ని సార్లు వినలేదు నువ్వు, ఇప్పుడిదంతా ఎందుకు?” అంటూ సుమా రమేశులు ఇద్దరు ఆమెను వారించబోయారు. “పర్లేదులేండి పాటేగా” అంటూ అమ్మ కూడా “పాడవే” అన్నది నన్ను. మరుగేలరా ఓ రాఘవా, నాకు ఎంతో నచ్చిన కీర్తన కాబట్టి ఇష్టంగానే పాడాను. నేను నచ్చానని రమేశ్ చూపులే చెప్పినై. అమ్మా నాన్నా కూడా ఆనందపడ్డారు. రమేశ్ ఒప్పుకొన్నాడు, మరో పది రోజుల్లోనే ముహూర్తం, ఎందుకంటే రమేశ్‌కు సెలవులు చాల తక్కువ. పెళ్ళయిన ఒక వారం రోజులలో అతను మళ్ళీ అమెరికా వెళ్ళి నాకు వీసా పేపర్లు పంపుతాట్ట.
మర్రోజు సుమ వచ్చింది. మెల్లగా తన పర్సునుండి ఒక చీటీ బయటికి తీసింది. “తీస్కోవే, అన్నయ్య ఇవ్వమన్నాడు”. ఏదో తెలియని గగుర్పాటుతో దాన్ని చదవడానికి వెనకాడాను. “చదువు”, అంటూ చేతితో పొడిచింది సుమ. నేను కాగితపు మడతలు విప్పి చదివాను. మొదట అర్థం కాలేదు. మళ్ళీ చదివా. “సరే, చదివింది చాలు, ఇప్పుడు పాడు. రమేశ్‌కు ఇదొక పిచ్చి, తనకేదైనా ఓ పాట నచ్చితే అదే బాణీలో తానూ రాస్తాడు” అంటూ సంచినుండి ఒక టేప్‌రికార్డర్ తీసింది. సిగ్గు పడుతూనే మెల్లిగా గొంతు సవరించుకొన్నాను.
మరుగేలనే ఓ దేవికా
మరుగేల నిరంతర
ప్రేమ రసామృత సింధునదీ
నవరూపమాఅన్ని నీవేగదా యంతరాత్మలో
చెన్నుగాను తుదకు చేరినాముగా
నిన్నెదప్ప జూడ నెన్నడేని యొరుల
నన్ను బ్రోవ రావే నాకు జీవ మీవే
“అది సరేగాని, ఈ దేవిక ఎవరే?” అన్నాను సుమతో.
“సంస్కృతం చదివావు, ఇంత మాత్రం తెలీదా? దేవి అంటే పెద్ద అమ్మవారు! దేవిక చిన్న అమ్మవారు, ఈ శ్రీదేవి!”
“నేనేం చిన్న అమ్మవారిని కాను, దేవికాకు బదులు దేవి యిక అనాలి.”
“సరే, అలాగే పాడు, మళ్ళీ రికార్డు చేస్తాను.”
“వద్దమ్మా, చిన్నమ్మవారుగానే ఉంటాను. నే మళ్ళీ పాడలేను.”
రమేశ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. పని థియరిటికల్ రిసర్చ్. చిన్నప్పటినుండి సాహిత్యం పిచ్చి కూడా కొద్దిగా. ఎన్నిసార్లు వాదించుకునే వాళ్ళమో సాహిత్యం గురించి. పెళ్ళయిన తరువాత రమేశ్ మరో విచిత్రమైన పని చేయడానికి మొదలుపెట్టాడు, అదేమంటే, నెల తప్పకుండా ఈ మాసపు పాట అని ఒక పాట రాసి నాకు బహుమతిగా ఇవ్వడం. మనసులో ఆనందంగా ఉన్నా అది ఒక్కొక్కప్పుడు విడ్డూరంగా తోచేది. ఇంత ప్రేమా ఈ మనిషికి నేనంటే అనిపించేది. తను లేని జీవితాన్ని ఊహించటానికి కూడా నాకు భయమే.
మంచు కురవడం కొంచెం ఎక్కువైంది. కార్లు నిదానంగా కదులుతున్నై. ఇంటికింకా నలభై నిమిషాలు డ్రైవు. టేపును ఆపి రమేశ్ రాసిన మరుగేలరా పాటను రాగం తీయడం మొదలెట్టాను. తెలీకుండానే కళ్ళల్లో నీళ్ళు, రమేశ్‌ని తల్చుకుంటుంటే. నా నోటి పాట ఆగిపోయింది. సెప్టంబరు 11, ఆ రోజు నాకు డాక్టర్ అపాయింట్‌మెంటు. రమేశ్‌ను కూడా రమ్మన్నాను. తనకు ప్రాజెక్టు మీటింగ్ ఉంది, రానన్నాడు. బలవంతం చేసి పిల్చుకొని వెళ్ళాను. నేను అలా చేసి ఉండకపోతే, అబ్బా… బలవంతంగా ఆలోచనల్లోంచి బైటపడి మళ్ళీ టేప్ ఆన్ చేశాను. “నీవు లేక వీణా నిలువలేనన్నదీ…”.
ఈ తొమ్మిదేళ్ళలో జీవితాలు ఎంత మారాయో. వీణ పుట్టే సమయంలో ఏ పేరు పెట్టాలో అని ఎంత చర్చించుకొన్నామో? అదెందుకో దేవుళ్ళందరికీ మగ పిల్లవాళ్ళే, ఆడ పిల్లలే అసలు లేరు, వారి పేరు పెట్టుకొందామంటే. చివరకు పాప పుడితే వీణ, బాబు పుడితే రమణ అని పేరు పెడ్దామని తీర్మానించుకొన్నాము. వీణ పుట్టింది, ఈ ఎనిమిదేళ్ళలో మా ఇద్దరి జీవితాలకు కేంద్రమయింది. వీణ పుట్టిన తరువాత నేను కూడా ఏవైనా కోర్సులు చేసి పనిలో చేరుదామంటే రమేశేమో “నీకెందుకే, మహారాణీలా పాడుతూ వీణాగానం చేస్తూ ఉండక. ఆ పడే పాట్లేవో నేను పడతాగా” అని పడనివ్వలేదు.
కలిమిలేములు కష్టసుఖాలు కావడిలో కుండలనే… అవును నిజమే కలిమి లేములు కావడి కుండలే. ఎందుకు ఈ రోజు ఈ టేపును పెట్టానో? ప్రతీ పాటా ఇలా మా జీవితంలో ఒక్కో అధ్యాయం లాగా. మెల్లగా అపార్ట్మెంటునుండి ఒక చిన్న ఇంటికి, తరువాత ఇంటరెస్ట్ రేట్లు తగ్గాయని దాన్నమ్మి మరో పెద్ద ఇంటికి మారాం. సాఫీగా ఎంతకాలమో జరగలేదు జీవితం.
రమేశ్‌వాళ్ళ కంపెనీని మరో కంపెనీ కొనుక్కొన్నారట. కంపెనీని డౌన్‌సైజ్ చేస్తారట. రమేశ్ పని థీరెటికల్, తక్షణమే దాని ఫలితాలు కనపడవు. అందువల్ల రమేశ్‌ను లేఆఫ్ చేశారు. రమేశ్ కొన్నాళ్ళు దీన్ని గురించి అంతగా పట్టించుకోలేదు. మరో కంపెనీలో పని దొరక్కపోతుందా అనే ధీమాతో ఉన్నాడు. కానీ దొరకలేదు. దెబ్బతిన్న ఎకానమీ, కొత్త ప్రభుత్వంలో పరిస్థితి మారుతుందేమో? నాకా నమ్మకం ఎక్కువగా లేదు. దురాశకు, పేరాశకు దేశాలు లేవు, సరిహద్దులు లేవు. కూడబెట్టిన నాలుగు రాళ్ళు ఖర్చవుతూ వచ్చాయి. మార్ట్‌గేజ్ కట్టడం కూడా కష్టమయింది. పైగా కుప్పకూలిన హౌసింగ్ మార్కెట్. ఉన్న ఇంటిని పెద్ద నష్టానికి అమ్ముకొని ఒక చిన్న అపార్ట్‌మెంటుకు మారాం, ఫోర్‌క్లోసింగ్ తప్పినందుకు దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ.
అప్పుడే బడికి వెళ్తున్న వీణకు ఆ ఇల్లు మారడం, బడి మార్చడం నచ్చలేదు. పాత స్నేహితులను వదలి ఇక్కడికి వచ్చాక బెంగ పెట్టుకుంది. నెలకు ముందు ఆట్లాడుతూ ఐసుపైన జారి పడి చేయి విరిగింది. క్యాస్ట్ వేశారు. ఉద్యోగం పోయిన తరువాత హెల్త్ ఇన్షూరన్స్ లేదు. కోబ్రాకు ముందుకంటె మూడింతలు కట్టాలి. నేనే రమేశ్ వద్దన్నా ఈ టెంపరరీ జాబ్‌కు ఒప్పుకొన్నా. ఈ రిసెషన్ కాలంలో ఎంత ఉన్నా సరిపోదు, మరి ఏమీ లేని మా పరిస్థితిని తట్టుకోవడానికి ఇది అత్యవసరమయింది. “అదేమే సంస్కృతంలో ఎమ్మే చేశావు, ఈ ఉద్యోగమేమిటే”, అని మొత్తుకుంది విజయ. దానికేం తెలుసు ఇక్కడి పరిస్థితులు? ఉన్న పని పోవడం, మరో పని దొరక్కపోవడం, రమేశ్‌ను కూడా బాగా మార్చివేసింది. ముందున్న చలాకీదనం, హుషారు తగ్గింది. ఎప్పుడూ ఏదో పోగొట్టుకొన్నవాడిలా ప్రవర్తిస్తున్నాడు. విడవకుండా ఎడతెగక మాట్లాడే మనిషి ఇప్పుడు పిలిచినా పరధ్యానంగా ఆ, ఊ అనడం తప్పించి మరే మాట పలకడం లేదు. దీనితోబాటు ఇల్లు మార్చాక పాత స్నేహితులు కూడా మరచిపోయారు. ఎవరి పని వాళ్ళకి కదా మరి. పార్టీలకు రమేశ్‌ను అందరూ పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఏ ఆహ్వానాలు రావడం లేదు.
మంచు మరింతగా కురుస్తోంది. ట్రక్ ఒకటి ఎదురుగా వచ్చింది. దాని లైట్లు కళ్ళపైన పడి ఒక క్షణం చీకటి కమ్మింది. పరధ్యానంతో కారు నడపకూడదని ప్రయత్నిస్తూనే ఉన్నా. అయినా, తరుముకొస్తున్న ఆలోచనలు, ఈ రోజు మరీ ఎక్కువగా. అలసట వల్లనేమో. పడమట సంధ్యారాగానికి మురిసిపోయి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ చీకట్లు అలముకొంటున్నాయి. “పడిలేచే కడలి తరంగం, జీవితమే ఒక నాటకరంగం” పాడుతున్నాడు ఘంటసాల. సంస్కృతంలో కావ్యాలకన్న నాటకాలంటే నాకు చాలా ఇష్టం. వచ్చిన కొత్తలో, వీణ పుట్టకముందు, కొలంబియాలో కొన్ని కోర్సులు చేశాను. అప్పుడు మృచ్ఛకటికంపైన ఒక పేపర్ కూడా రాశా. ఇప్పుడు ఏడేళ్ళ తరువాత మా జీవితం కూడా మృచ్ఛకటికంలాగే వట్టి మట్టి బండి అయింది. వీణకేమో ఖరీదైన ఆటవస్తువులు కొనలేక మట్టిబండ్లతోనే సరిపెట్టుకోమంటున్నాము, దానికి నచ్చట్లేదని తెలిసి కూడా.
మృచ్ఛకటికలో దరిద్ర చారుదత్తుడు వర్ణించే బీదతనంతో ఇప్పుడు మాకూ అనుభవమే.
సంగంనైవ హి కశ్చిదస్య కురుతే సంభాషతే నాదరా
త్సంప్రాప్తో గృహముత్సవేషు ధనినాం సావజ్ఞమాలోకయేత్
దూరాదేవ మహాజనస్య విహరత్యల్పచ్ఛదో లజ్జయా
మన్యే నిర్ధనతా ప్రకామమపరం షష్ఠం మహాపాతకం
దరిద్రుని ఎవ్వరూ గౌరవించి ఆదరించి మాట్లాడరు. పండగ దినాలలో ధనికుల ఇంటికి వెడితే తిరస్కార భావంతో చూస్తారు. ఖరీదైన దుస్తులు వేసికోని అతడు సిగ్గుతో అందరికీ దూరంగా ఉంటాడు. మా పరిస్థితి కూడా చారుదత్తుడిలాగే ఉంది. తమ ఇంటికీ ఎవ్వరూ పిలవడం లేదు, మేమూ ఎవరింటికి వెళ్ళడమూ లేదు. ఎవరినైనా చూస్తే వాళ్ళడిగే మొదటి ప్రశ్న “మీ ఆయనకు కొత్త పని దొరికిందా” అంటూ. లేదంటే “అయ్యో పాపం, ఏం చేస్తున్నారు, ఎలా కాలం గడుపుతున్నారు” అంటూ జాలి చూపిస్తారు. పంచమహా పాతకాలతో కలిపి దారిద్ర్యం అనేది ఆరవ మహా పాతకం అంటాడు శూద్రకుడు. దారిద్ర్యం, ఆత్మవిశ్వాసం పోగొట్టుకోవడం, మానసిక క్షోభ ఇవన్నీ దాంపత్య సుఖానికి కూడా శత్రువే. ఎంత కాలమైంది రమేశూ నేనూ దగ్గరై. ఏదీ ఆ కోరిక, ఆ తపన, ఆ ప్రేమావేశం. ముకుళించిన హృదయ కమలం, అబ్బ! శీతాకాలం చాలా క్రూరమయింది! శూద్రకుడు అంతటితో ఆపకుండా…
దారిద్ర్య శోచామి భవంతమేవమ-
స్సమచ్ఛరీరే సుహృదిత్యుషిత్వా
విపన్నదేహే మయి మందభాగ్యే
మమేతి చింతా క్వ గమిష్యసి త్వం
అని అన్నాడు. ఓ పేదరికమా, నిన్ను చూస్తే నాకు జాలి కలుగుతుంది. నువ్వేమో నన్ను స్నేహితునిలా అంటి పెట్టుకొని నాతోనే ఉన్నావు. నేనొక వేళ చచ్చిపోతే నీ గతేమవుతుందనేదే నా చింత సుమా! ఉన్నట్లుండి కొరడాతో కొట్టినట్లయింది. ఈ బాధలతో రమేశ్ చావు ప్రయత్నాలు చేయడు కదా! కాలంకాని కాలంలో, దేశంకాని దేశంలో అతణ్ణి నమ్మి అంటుకొని ఉండే నన్ను, వీణను అనాథగా చేయడు కదా?
స్నో ఎక్కువయింది. కారు కొద్దిగా జారుతూ ఉంది. ఇంకెంత, ఒక పది నిమిషాల్లో ఇల్లు. వెళ్ళి పడుకొంటే చాలు. అలసటా, ఆలోచనల్తోనే సతమతమవుతున్న నాకు, రమేశ్ ఏదైనా చేస్తాడేమో అన్న ఆలోచన ఇప్పుడు నన్ను చిత్రహింస చేస్తోంది. తలంతా దిమ్ముగా ఉంది. హైవేనుండి ఎక్సిట్ ఎలా తీసుకున్నానో, ఇంటి కెళ్ళే దారిలోకి ఎలా తిరిగానో గుర్తు లేదు. అపార్టుమెంటు కాంప్లెక్సు ముందు పోలీసు కార్లు, ఎర్రగా నీలంగా లైట్లు కళ్ళు బైర్లు కమ్ముతూ, పసుపు పచ్చని ‘డూ నాట్ క్రాస్’ టేపులు. కారుకడ్డంగా ఒక ఆఫీసర్ ఆపమని చేయి చూపిస్తూ. అక్కడే కారును పార్కు చేసి అపార్ట్మెంట్ బిల్డింగ్ వైపు నడిచాను. అంత రాత్రైనా దీన్ని చూడ్డానికి అక్కడ నాలుగైదుగురు చేరారు. అక్కడే నిలుచున్న ఒక పెద్దామెను ఏమయిందని అడిగాను.
“సంబడీ మర్డర్డ్ హిస్ చైల్డ్ అండ్ టుక్ హిస్ ఓన్ లైఫ్, వాట్ ఎ పిటీ!.”
నా గుండె ఆగినట్లయింది. ఇదేమో, అన్ని ఆలోచనలు ఒకే దారి తీస్తున్నాయి భగవంతుడా! “ఎందరు తండ్రులు లేరు, ఎందరు పిల్లలు లేరు, అన్నిటికీ ఇలా భయపడకే దేవీ” అన్నది మనసు. నా అపార్ట్మెంట్‌కు వెళ్ళవలసిన వాకిలి వద్ద మరి కొందరు పోలీసు ఆఫీసర్లు నిల్చున్నారు.
“యూ కెనాట్ గో ఇన్, మాడం!”
“బట్, బట్ ఐ లివ్ హియర్ ”
“విచ్ అపార్ట్మెంట్?”
“టూ-ఓ-టూ.”
“ఆర్ యూ మిస్సెస్ రజాంపడూ?”
“ఎస్, ఐ యాం మిస్సెస్ రాజంపాడు, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ప్లీస్ టెల్ మి?”
“సారీ మేం, హేయ్ జాక్, ది మిస్సెస్ ఈస్ హియర్.”
కారులో ఒక క్షణం కలిగిన ఆలోచన నిజమయిందా? “వీణా, రమేశ్” అంటూ అరుస్తూ పడిపోయాను.
“దేవీ, దేవీ” అంటూ ఎవరో కదిపారు. “రమేశ్, వీణా” అంటూ అరుస్తూనే ఉన్నా.
“దేవీ, నేనే రమేశ్‌ను, పీడకల వచ్చిందా? లే లే, లేచి కూర్చో, నీళ్ళు తాగుతావా?” అంటూ రమేశ్ గొంతు ఎక్కణ్ణుంచో వినిపిస్తోంది.
“రమేశ్? రమేశ్! మరి పోలీసులు, వీణ … వీణ ఎక్కడ? వీణను నువ్వు చంపేశావా?”
“నీకు నిజంగా పీడకలే వచ్చింది. వీణ నువ్వు ఇంకా రాలేదంటూ ఎప్పుడో నిద్రపోయింది. నువ్వు వచ్చావు. స్నోలో డ్రైవు చేసి చాలా అలసటగా ఉందంటూ డ్రస్సు కూడా మార్చుకోక పడుకొన్నావు. లే, లే, డ్రస్సు మార్చుకొని ఏమైనా తిను, లేకపోతే పాలైనా తాగి పడుకో.”
చిన్నగా లేచాను. ఇంకా వణుకు తగ్గలేదు. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. లేచి గదిలోకి వెళ్ళి నిద్రపోతున్న వీణను క్యాస్టు కట్టిన చేయి సరిచేసి, ముద్దుపెట్టుకున్నా. నైటీ వేసికొని వచ్చి రమేశ్ పక్కనే కూర్చున్నాను. నా భుజం మీద చేయి వేసి దగ్గరగా తీసుకున్నాడు. మెల్లగా కుదుటపడసాగాను.
“రమేశ్, రమేశ్, అది నిజంగా కలేనా? కానీ నా కళ్ళముందు జరిగినట్లుంది. ప్రతి ఒక విషయం గుర్తుంది.”
“దేవీ నీకు పనెక్కువ అయింది. చాలా టెన్షన్‌లో ఉన్నావు. కొద్దిగా రిలాక్స్ కావాలి నువ్వు. మనకూ మంచి రోజులు వస్తాయి, తప్పక వస్తాయి, నేను ఆశావాదిని. నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దు. జీవితంలో ఇది ఒక పీడకల అనుకొందాము. రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది. యూనివర్సిటీ పనికి. జీతం మునపటిలా ఆరంకెలు కాకపోయినా, మన అవసరాలకు సరిపోతుంది. దొరికే ఛాన్సు ఉంది. రేపు పాడించాలనుకొన్నా నీతో. నీకోసం ఈ మాసపు పాట రాశాను. చూడు.”
నను పాలింప నడచి వచ్చితివో
నా ప్రణయ దేవీవనకుసుమము నీవెగా నిజముగ
జీవనకుసుమము నీవెగాగిరిసుత నీలమణి వర తనువుతో
సరముల ముత్యపు సిరి యురముతో
సరసిజదళముల మృదు కరముతో
వరముల నొసగగ నగు ముగముతోనను పాలింప నడచి వచ్చితివో
నా ప్రణయ దేవీ
“నల్లగా ఉన్నానని సూటిగా చెప్పరాదూ, దానికొక పాట రాయాలా?” అని అన్నా రమేశ్‌ను ఉడికించడానికి.
“సరే విరిసిన వెన్నెలవలె తనువుతో అని పాడుకో.”
“ఊ, తరువాత?”
“నీ సిరి ఉరాన్ని చూపిస్తావా?” హృదయకమలం వికసించింది. ఆగకుండా కన్నీళ్ళు వాన ముత్యాల్లా రాలి రమేశ్ చేతిపైన.
“దేవీ, నువ్వింకా ఆ పీడకలను తలచుకొంటున్నావా, తొందరగా మరచిపో.”
“దాన్ని ఎప్పుడో మరచిపోయా, సరే నీ ఈ మాసపు పాట పాడుతా వింటావా?” రమేశ్ గుండెపై తల ఆనించాను.
“ఇప్పుడు వద్దు, రేపు పాడుదువు గానిలే, ప్రస్తుతానికి ఈ క్షణాల్ని ఇలా నన్ను మూటకట్టుకోనీ”