పెంపకం

హవామహల్ దగ్గర బీచికి పార్వతి ఆరేళ్ళ కూతురు మల్లికని తీసుకొచ్చింది. కనుచూపు దూరంలో ప్రదీపు, కొడుకు మహార్ణవ్ చెయ్యి పుచ్చుకుని నడుస్తూ వాడికేదో చెబుతున్నాడు దూరంగా ఏరాడకొండా, కొండమీద సెర్చిలైటు చూపిస్తూ. వాళ్ళిద్దరినీ చూస్తుంటే పార్వతికి ఏ బట్టల దుకాణంలోంచో షోకేసులో వుండే తండ్రీకొడుకుల బొమ్మలు ప్రాణం పోసుకుని నడిచి వచ్చేస్తున్నట్టుంది.

ఆవిడ వాళ్ళవేపు నాలుగడుగులేసి వాళ్ళు దగ్గరికి వచ్చేవరకూ ఆగి నవ్వుతూ పలకరించింది.

పార్వతీ, ప్రదీపూ అన్నదమ్ముల పిల్లలు. ప్రదీపు వుద్యోగరీత్యా ఢిల్లీ వెళ్ళి మూడేళ్ళవుతోంది. స్నేహితుడి పెళ్ళికి వచ్చేడు కొడుకుని తీసుకుని. కొడుక్కి విశాఖపట్నం వూరూ, సముద్రమూ చూపించాలని అతనికి మహా ఉత్సాహంగా వుండింది. అతనికి సముద్రం అనంతం, గంభీరం, అఖాతం – ఎంతో అర్థవంతంగా కనిపిస్తుంది. సముద్రపు ఒడ్డున పెరిగినవారు జీవితాన్ని అర్థం చేసుకోగలరని నమ్ముతాడు ఇదమిత్థమని కారణాలు వివరించలేకపోయినా. అందుకే కొడుక్కి మహార్ణవ్ అని పేరు పెట్టుకున్నాడు.

“రా, ఇక్కడ కూర్చుందాం” అంది పార్వతి. విశాఖపట్నం బీచికి పరిశుభ్రమైన గాలి కోసం రావడం అక్కడి జనాల జీవితాల్లో ఒక ద్వంద్వం. వున్నంతలోనే కాస్త శుభ్రంగా వున్నట్టు అనిపించిన జాగా చూసి ఇద్దరూ కూర్చున్నారు పిల్లలమీద ఓ కన్నేసి వుంచి.

మల్లిక “హా! రావణాసురుడి తల” అంటూ సిమెంటు దిమ్మల వారనున్న ముళ్ళబంతిలాటి ఎండుగుత్తిని అందుకుంది.

“ఏంటదీ” అన్నాడు మహార్ణవ్ కదలకుండా.

“రావణాసురుడి తల. ఇలా గాలిలో వదిల్తే అలా అలా దొర్లుకుంటూ పోతుంది” అంటూ ఇసకలో కొంచెందూరం వెళ్ళి దాన్ని వదిలింది. అది మునివేళ్ళమీద నడుస్తున్నట్టు గాలిలో దొర్లుతూ పోసాగింది.

మల్లిక మహార్ణవ్ చెయ్యి పుచ్చుకుని రా! రా! అంటూ దానివెంట పరుగెత్తసాగింది.

వాళ్ళు పదడుగులయినా వేశారో లేదో, ప్రదీపు కేకేసేడు, “అర్ణవ్, చాలు, వెనక్కొచ్చేయండి ఇద్దరూ” అంటూ.

పార్వతి “ఫరవాలేదులే. దూరం వెళ్ళరు” అంది శాంతంగా.

పిల్లలిద్దరూ వచ్చేశారు వెనక్కి తిరిగి, తిరిగి చూస్తూ. ఆ రావణాసురుడి తల ఎంత దూరం వెళ్తుందో చూడాలని వుంది కానీ ప్రదీపు కేకతో మహార్ణవూ, వాడివెంటే మల్లికా వెనక్కి వచ్చేశారు.

తిరిగొచ్చి మల్లిక తల్లితో “నేను నీళ్ళలోకి వెళ్తాను” అంది.

“పద” అంటూ పార్వతి కూడా లేచి, “నువ్వు ఇక్కడే వుంటావా?” అనడిగింది ప్రదీపుని.

“పద. నేనూ వస్తాలే.” అంటూ అతనూ లేచేడు.

మల్లిక ఇసకలో కూరుకుపోతున్న కాళ్ళు ఒకొకటే కూడదీసుకుంటూ నడకలాటి పరుగుతో ఒడ్డుకి వచ్చింది. ఆవెనకే మహార్ణవ్ కూడా నడుస్తున్నాడు నెమ్మదిగా. వాడికి నీళ్ళలో దిగాలన్న సరదా లేదు.

మల్లిక జరజర పాకుతూ వస్తున్న నీళ్ళని చూస్తూ ముందుకి సాగింది.

“మరీ లోపలికి వెళ్ళిపోకు. ఈ అలల్ని నమ్మలేం.” అంది పార్వతి కూతుర్ని హెచ్చరిస్తూ. ఆ తరవాత ప్రదీపువేపు తిరిగి “ఏమిటి ఆలోచిస్తున్నావు?” అని అడిగింది.

“ఏంలేదు. వీళ్ళు ఎప్పుడు పెరిగి పెద్దవాళ్ళవుతారా, ఎలా తయారవుతారా అనీ,” అన్నాడు.

“ఎప్పుడో ఏమిటి? పెరుగుతూనే వున్నారు కదా పుట్టిందగ్గర్నుంచీ. ఎలా తయారవుతారంటే ఏమో.” అంది పార్వతి తేలిగ్గా.

“అదేమిటి అలా ఆంటావు? మనమే వాళ్ళని తీర్చి దిద్దాలి. వాళ్ళకి మనం నేర్పాల్సినవి చాలా వున్నాయి. మనం కలగజేసుకోకపోతే ముళ్ళడొంకలా తయారవుతారు అడ్డూ అదుపూ లేకుండా. అప్పుడు ఆతప్పు ఎవరిది?”

“సర్వైవల్ స్కిల్. పరిస్థితులని బట్టి వాళ్ళకి అదే వంట బడుతుంది అని నా అభిప్రాయం” అంది పార్వతి మల్లికమీద ఓ కన్నేసి వుంచి.

మల్లిక ఉవ్వెత్తున లేచి పడుతున్న తరంగాల్లో నిల్చుని అరికాళ్ళకింద తొలిచేస్తున్నట్టు జారిపోతున్న నీళ్ళని చూస్తూ గలగల నవ్వుతోంది హాయిగా.

మహార్ణవ్ మాత్రం అలలకి నాలుగు గజాల దూరంలో ఆగిపోయేడు హోరుమంటూ మీది మీదికి వస్తున్న అలలని అందులో గెంతులేస్తున్న మల్లికనీ చూస్తూ.

“రా, అలలు ష్ ష్ మని, రా, రా ” అంది హడావుడి చేసేస్తూ. మహార్ణవ్ అడ్డంగా తలూపేడు పెదిమలు బిగబట్టి “రాను” ఆగకుండా ఒకటి తరవాత ఒకటిగా వచ్చి పడుతున్న అలలు చూస్తూ.

పెద్ద కెరటం వచ్చేస్తోంది. “ఏయ్ చూడు, చూడు” అన్నాడు బెదిరిపోతూ.

మల్లిక అటు తిరిగేసరికి అప్పటికే పెద్ద అల ఒకటి దగ్గరకొచ్చేసి ఒక్క వూపున విరుచుకు పడింది. తుంపరలు మొహంమీద పడకుండా మల్లిక పక్కకి తిరిగి చేతులు అడ్డు పెట్టుకుంది మొహానికి. నడుం వరకూ బట్టలు తడిసిపోయేయి. మల్లిక కిలకిలా నవ్వింది.

మహార్ణవ్ తుళ్ళిపడి మరో అడుగు వెనక్కి జరిగేడు. “నీ పరికిణీ తడిసిపోయింది, ఛీ” అన్నాడు మొహమంతా వికృతంగా పెట్టి.

హీహీహీ అంటూ నవ్వింది మల్లిక, “నాకేం బయ్యంలేదు,” అంటూ గబగబా వచ్చి మహార్ణవు చెయ్యి పట్టుకుని, “రా, రా” అంటూ లాగింది. “నేన్రాను” అంటూ చెయ్యి విదిలించుకుని మరో అడుగు వెనక్కి వేశాడు వాడు.

పార్వతి మల్లికని కేకలేసింది, “వాడు రానంటూంటే, ఎందుకలా లాగుతావు. వూరుకో” అంది. మల్లిక మహార్ణవు చెయ్యి వదిలేసింది. కాని తన పంతం వదల్లేదు, “ఎందుకు రావూ” అంది.

పార్వతి, “ఇంక చాల్లే నీళ్ళలో ఆటలు. పద. ఇద్దరూ గవ్వలేరుకు రండి” అంది వాళ్ళ ధ్యాస మార్చడానికి. ప్రదీపుకి ఆమాటలు మరోలా వినిపించేయి. తన కొడుకు నీళ్ళలోకి దిగడని పార్వతి నిర్ణయించేసినట్టు అనిపించింది. “వాడికేం భయం లేదు. పదరా. బాగుంటుంది. కాళ్ళకింద నీళ్ళు కదులుతుంటే కితకితలు పెడుతున్నట్టు బావుంటుంది” అన్నాడు కొడుకుతో.

పార్వతి నవ్వింది. “బాగుంది నీ మార్కెటింగు చాకచక్యం. వాడికా సరదా వుంటే వాడే వెళ్తాడు కదా.” అంది.

ప్రదీపు తీక్షణంగా చూశాడు పార్వతివేపు. “నువ్వు మొదట్నించీ ఇంతే. మీ నాన్నగారు ఏం చెయ్యమంటే అదే. చదువు అంటే చదవడం, లిటరేచరంటే లిటరేచరు. నీకో బుర్ర వుందనీ, దాన్ని నువ్వు ఉపయోగించుకోవచ్చనీ ఎప్పుడయినా తట్టిందా నీకసలు?” రూక్షణంగా అన్నాడు. కొడుకుమీంచి కళ్ళు తిప్పకుండానే.

పార్వతి తెల్లబోయింది. ప్రదీపు మాటలు అర్థం చేసుకోడానికి రెండు క్షణాలు పట్టింది.

తరవాత నెమ్మదిగా, “నీకెందుకలా అనిపించిందో కానీ మానాన్నగారెప్పుడూ నాఇష్టమే అనేవారు” అంది.

“నువ్వే అన్నావు మీనాన్నగారు లిటరేచరు చదవమన్నారని” అని గుర్తు చేసేడు ప్రదీపు.

“అవును. ‘అన్నారు’ అన్నాను కానీ ‘నాకు అది ఇష్టంలేదు’ అనలేదు కదా. పెద్దవాళ్ళు వాళ్ళకి తోచిన సలహాలు వాళ్ళు ఇస్తారు. అది కూడా తప్పేనా?”

“ఏమో నువ్వు అలా అంటున్నట్టు అనిపించలేదు అప్పట్లో నాకు.”

పార్వతి మళ్ళీ చూసింది అతనివేపు. ఎప్పుడూ లేనిది ఈ వాదనలు ఇప్పుడు ఎక్కడినించి వస్తున్నాయి అన్నట్టుంది ఆ చూపు. ఓక్షణం ఊరుకుని, “మీనాన్నగారు నిన్ను బిజినెస్ చెయ్యమన్నారని నువ్వూ చెప్పేవు కదా” అంది.

ప్రదీపు వులిక్కిపడ్డాడు. కొంచెంసేపు ఆలోచించి, “మేం ఇద్దరం చర్చించుకున్నాం ఏ సబ్జెక్టు మంచిది అన్న విషయం” అన్నాడు.

మాటలతో వచ్చిన చిక్కే ఇది. ఏదో మాటల సందర్భంలో ఓమాట అంటాం. దానికి ఎదుటివారు ఎలాటి టిప్పణి ఇచ్చుకుంటారో మనకి తెలీదు. తెలీదు కనక మనకి వివరణలు ఇచ్చుకునే అవకాశం కూడా లేదు. ఇదుగో ఇలా ఏ పదేళ్ళకో వస్తే రావచ్చు. పార్వతి కళ్ళలో సన్నని హాసరేఖ తృటికాలం మెరిసి మాయమయింది. అది ప్రదీపు దృష్టి దాటిపోలేదు. ఇహ అట్టే పొడిగించడం ఇష్టంలేక ఊరుకున్నాడు.

ఎడ తెగకుండా వచ్చి పడుతున్న అలల దగ్గర తడి ఇసకలో నిల్చున్న మల్లిక అంటోంది, “పోనీ, కొంచెం దూరం, ఇక్కడికి రా.”

మహార్ణవ్ కదల్లేదు, “ఛీ, నేన్రాను ఆ వుప్పునీళ్ళలోకి. నాకసయ్యం,” అన్నాడు.

ఇహ వాడు నీళ్ళలోకి రాడని నిర్థారణ అయిపోయింది ఆపిల్లకి.

“పోనీ, పిచిక గూళ్ళు కడదామా? ఇక్కడికి అలలు రావు” అంది.

“వస్తాయి. ఇసక తడిగా వుంది కద.”

“ఎప్పుడో చాలా పే..ద్ధ అల, ఇప్పుడు కాదులే, నిన్నో ఎప్పుడో వచ్చింది.” అంది ఆరిందాలా చేతులూ, కళ్ళూ తిప్పుతూ.

”ఊఁహూ. నేను రాను. తడి ఇసక ఛీ నాకసయ్యం.” మహార్ణవ్ మొహం చిట్లించాడు మరో అడుగు వెనక్కేసి.

“రాతిల్లు పిచికలు వచ్చి పడుకుంటాయి తెలుసా?”

“ఏం కాదు. పిచికలు చెట్ల మీద వుంటాయి. నీకేం తెలీదు” అన్నాడు మహార్ణవ్.

ఆమాట అన్నతరవాత వాడికి కొంచెం తృప్తిగా వుంది. లేకపోతే ఏమిటి అన్నీ తనకే తెలుసన్నట్టు మాటాడుతుంది. గంటసేపయి చూస్తున్నాడు దాని వాలకం. వాడికి చాలా కోపం వచ్చింది.

ప్రదీపు చూశాడు. ముందుకి వెళ్ళాల్సిన కొడుకు మరో అడుగూ మరో అడుగూ వెనక్కి వేస్తూ పోతున్నాడు. పార్వతికి కూడా అలాగే తోచివుంటుంది అనుకోడం మరీ కంటకప్రాయంగా వుంది అతడికి. పార్వతి కూతురికున్నపాటి గుండెబలం తనకొడుక్కి లేదా?

తన విసుగు కప్పిపుంచుకుంటూ, “వెళ్ళరా. నీళ్ళలో వెళ్ళి ఆడుకోడానికేఁవిటి కష్టం? దాన్ని చూసయినా నేర్చుకోరాదూ?” అన్నాడు.

“ఊరుకుందూ. అదేదో ఘనకార్యం అయినట్టు ఏఁవిటా సతాయింపు? ఇవేమేనా అంతర్జాతీయ పోటీలా ఏమిటి? వాడు బంగాళాఖాతంలో పాదం మోపితే గానీ జన్మ ధన్యం కానట్టు దెప్పుతావేమిటి?” అంది పార్వతి.

“మనం పిల్లలకి ధైర్యం నేర్పాలి కానీ భయాలు మప్పడం ఏమిటి? ఇవాళ నీళ్ళంటే భయం, మనం ఊరుకుంటే రేపు తాడుని చూసినా తుళ్ళిపడతారు,” అంటూ పాంటు పైకి లాక్కుంటూ కొడుకు దగ్గరకొచ్చి, జబ్బ పుచ్చుకుని, “రా, నేను కూడా వస్తాను. భయంలేదులే. నాచెయ్యి పుచ్చుకో.” అంటూ నీళ్ళవేపు లాక్కుపోయేడు.

మహార్ణవ్ “నేను రాను” అంటూ గింజుకుంటున్నాడు.

“అదుగో, అటు చూడు. చి…న్న.. అల వస్తోంది. మన బాత్రూంలో పారే తూమునీళ్ళ పాటి లేదు. అయినా అలల్లో దిగితేనే కదా తెలిసేది ఆ అనుభవం ఎలా వుంటుందో, అది నీకు బాగుందో లేదో. దాన్ని చూడరాదూ. దానికున్నపాటి కలేజా లేదూ నీకు?” అన్నాడు.

ఆ కుర్రకుంక బుల్లిగుండెల్లో పౌరుషం రెచ్చగొట్టడానికి అతను పడే తాపత్రయం చూస్తూంటే పార్వతికి ఎబ్బెట్టుగా అనిపించింది. హోరుమంటూ ఆకాశంవేపు నిలువెత్తు లేచి విరుచుకుపడి ఒడ్డున చాపచుట్టలా పరుచుకుంటున్న తరంగాలని చూస్తుంటే మహార్ణవు గుండెల్లో చిన్న వణుకు వస్తోంది. ప్రతి అల తనని మింగేయడానికే తనమీదకే వచ్చేస్తున్నట్టుగా వుంది. మల్లిక ‘ఇంక చాలు పోదాం’ అంటే బాగుండును అని వుంది వాడికి.

అసలు అలా అలల్లో నిలబడి, కాళ్ళకింద మన్ను తొలిచేస్తుంటే కలిగే ఆనందం ఏమిటో ఎంత తన్నుకున్నా అర్థం కావడంలేదు వాడికి. దారిపక్కన దాలిగుంటలో ముడుచుకు పడుకున్న ఊరకుక్కని తంతే ఇంకా ఎక్కువ అనందం కదా. అదే అన్నాడు రెండురోజుల కిందట మహార్ణవ్ మల్లికతో.


ఆరోజు ప్రదీపూ, మహార్ణవ్ పార్వతిఇంటికి వచ్చారు చుట్టపుచూపుగా. పెద్దవాళ్ళు నడవలో కూర్చుని మాటాడుకుంటుంటే, పిల్లలిద్దరూ వీధిలో ఆడుకుంటున్నారు. రోడ్డువార ముడుచుకు పడుకున్న వూరకుక్కని చూసి “దాన్ని తన్ననా?” అన్నాడు మహార్ణవ్ దానివేపే చూస్తూ.

“ఎందుకూ దాన్ని తన్నడం?” అంది మల్లిక.

“ఊరికే”

“అది కరిస్తే?”

“అదేం కరవదు” అన్నాడు మహార్ణవ్ అమితోత్సాహంతో. తాను కుక్కని తన్నగల శూరుడని మల్లికకి ఋజువు చేయాలి.

“కుక్క కరిస్తే నలభై ఇంజీషనులు తీసుకోవాలిట బొడ్డుచుట్టూ” అంది మల్లిక.

వాళ్ళ స్కూల్లో ఓ అబ్బాయి కుక్కని తంతే అంతే అయింది. మహార్ణవ్ కుక్కని తన్నకుండా చేయరా దేవుడా అని మనసులో కోరుకుంది అర్జంటుగా.

దేవుడు మల్లిక మాట విన్నాడో, మహార్ణవుడు ఇంజక్షను మాట విన్నాడో కానీ ఆపూట వాడు కుక్కని తన్నడం జరగలేదు.

నిన్న వాడు కుక్కని తన్నలేదు. ఈరోజు వాడు ఈ సముద్రపు ఒడ్డున నీటిలో కాలు పెట్టడం జరగదు.


ప్రదీపు తటాలున లేచి, “పిల్లలకి అలాటి భయాలు వుండకూడదు. చిన్నప్పుడే పోవాలి.” అంటూ రెండంగల్లో ప్రదీపు మహార్ణవుని నీళ్ళలోకి ఈడ్చుకు వెళ్ళి అలల్లో నిలబెట్టేడు. మల్లిక బెదిరిపోయి వెనక్కి జరిగి తల్లి పక్కన ఒదిగి నిలబడిపోయింది.

పార్వతి ఊరుకోలేకపోయింది, “ప్రదీప్, ఏమిటా దౌర్జన్యం! ఊరుకో,” అంటూ గబగబా వచ్చి అతని గుప్పిటిలోనుండి కుర్రవాడి జబ్బ విడిపించింది, “నీకు మతి పోయింది ” అంది విసుక్కుంటూ.

మహార్ణవ్ బావురుమంటూ ఏడవడం మొదలు పెట్టేడు, పార్వతిని చుట్టేసుకుని. ప్రదీపు అచేతనంగా నిలబడిపోయేడు తనెందుకు అలా చేసేడో తనకే తెలీనట్టు.

“పదండి. చీకటి పడుతోంది. ఇంటికెళ్దాం” అంది పార్వతి.

బీచికొచ్చేం అన్న సరదా పోయింది. అందరూ మౌనంగా నడుస్తున్నారు.

ప్రదీపు కొంచెంసేపు అయింతరవాత నెమ్మదిగా, “దానికి అలా అంత ఏ భయాలు లేకుండా ఎలా తయారు చేసేవు?” అన్నాడు అనంత దూరాల్లోకి దృష్టి సారించి.

“నేనేమీ చెయ్యలేదు. దానిష్టానికి వదిలేస్తాను సాధారణంగా. అంతే” అంది. మళ్ళీ అతను చిన్నబుచ్చుకుంటాడేమో అనిపించి, “చిన్నప్పటినించీ రోజూ సముద్రం చూస్తూ పెరిగింది కదా. అంచేతేమో దానికి భయం లేదేమో” అని జోడించింది. సముద్రం హోరు పెడుతున్నా వారిద్దరిమధ్య నిశ్శబ్దం ఒత్తుగా తిష్ట వేసుకుంది. ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వారు మునిగి నడుస్తున్నారు బీచిరోడ్డు మీద. వాళ్ళకి కొంచెం ఎడంగా మల్లికా, మహార్ణవ్ నడుస్తున్నారు.

“భయాలు అందరికీ వుంటాయి. ఏదో ఓ రకం. ఒహటి కాపోతే మరోటి. నీకు మాత్రం లేవూ భయాలూ?” అంది భావగర్భితంగా.

ప్రదీపుకి అర్థం అయింది పార్వతి ఏ విషయం గురించి అందో ఆమాట. “అవును. అప్పుడు నాకు బహుశా మహార్ణవ్ వయసే అనుకుంటాను. నాకు చీకటి అంటే భయం. నాభయం పోగొట్టడానికి అంటూ మా నాన్నగారు నన్ను చీకటి గదిలో పెట్టి తలుపేసేరు.”

“మరి నీకు భయం పోయిందా?”

ప్రదీపు నవ్వేడు నిర్మలంగా, “పోయింది ముప్ఫై యేళ్ళు దాటేక.”

హమ్మయ్య అనుకుంది పార్వతి మనసులోనే. వాతావరణం కాస్త తేలిక పడింది. రెండు నిముషాలు ఊరుకుని అంది, “అదే మరి. వాళ్ళకాలంలో వాళ్ళకి తోచినట్టు వాళ్ళు పెంచేరు మనల్ని. మనకాలంలో మనం మనకి చేతనయినట్టు పెంచుతాం. నువ్వూ నేనూ బాగానే కాకలు తీరేం కదా.”

ప్రదీపు ఆలోచనలో పడ్డాడు. “చలంనించీ స్పాక్ వరకూ ఎన్ని పుస్తకాలు చదివేనో”

“నేనూ చదివేను. కాని అవే వేదవాక్యాలు అనుకోను.”

“పిల్లలు ఇన్స్ట్రక్షన్ మాన్యూలుతో రారంటావు.”

“నేనేమీ అనడంలేదు. నాక్కూడా తెలీదనే అంటున్నాను. నామటుకు నాకు ప్రతిరోజూ ఓ చిన్న యుద్ధం అనే అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఆక్షణానికి తోచినట్టు వ్యూహరచన చేసుకుంటానంతే. గెలుపూ, ఓటమీ – రెంటికీ సిద్ధమే నేను” అంది పార్వతి.