[శ్రీ స్మైల్ జ్ఞాపకార్థం, వారి ‘ఖాళీ సీసాలు’ కథను ఇక్కడ పునః ప్రచురిస్తున్నాం. ఈ కథను ప్రచురించడానికి మాకు ప్రత్యేక అనుమతి నిచ్చిన శ్రీమతి యాస్మిన్ ఇస్మాయిల్ గారికి కృతజ్ఞతలు – సం.]
అతను కే.జీ. హాస్పిటల్ వరండాలో నడుస్తున్నాడు – బయటికి రావడానికి గేటు దగ్గరికి. అతని మొహం పాత బ్రౌన్ పేపర్లా ఉంది. అతని చొక్కా పాలిపోయిన నీలిరంగులో అతంది కానట్టుగా వుంది. పైజామాలా ఉన్న ప్యాంటు ఇస్త్రీ మడతలు పోయి మోకాళ్ళ ముందు అసహ్యంగా వుబ్బి, వెనక ముడుతలు పడిపోయి వుంది. ఆ బట్టల్లో అతని పాతికేళ్ళూ నీర్సంగా బలహీనంగా నలభై యేళ్ళలా కనిపిస్తున్నాయి.
అతను చాలా చికాగ్గా బయటికొస్తున్నాడు – మెల్లగానే.
హాస్పిటల్‌లో అతని తల్లి ఆవిడకీ, అతనికీ తెలీని జబ్బుతో పడి వుంది.
హాస్పిటల్ వరండాలో నుంచి అతను బయటికొచ్చి గేటుదగ్గర నిలబడ్డాడు. అతని వెనక నిస్తేజంగా రోగిలాగా ఉంది హాస్పిటల్.
ప్యాంటు జేబులో డబ్బుల్ని తడిమింది అతని కుడిచెయ్యి. వేళ్ళకి ఒక పది పైసల బిళ్ళ, ఒక అయిదు పైసల బిళ్ళా తగిలాయి, మురికి గుంటనీట్లో అడుగున జాగ్రత్తగా దాక్కున్న కప్ప పిల్లల్లా.
నేను పదిహేను పైసల మనిషిని. ధరలు ఆకాశాన్ని పెళ్ళి చేసుకున్న ఈ విశాఖపట్నంలో నేను పదిహేను పైసల మనిషిని. ఈ పదిహేను పైసల్తో నేనో ఖాళీ సీసా కొనుక్కోవాలి, ఆ నర్సు ఎడమ రొమ్ము గోక్కుంటూ “సీసా తేలేదా? తెచ్చుకో, మందు పోసిస్తా” అంది. “మీ దగ్గరుంటే…” అంటూ నసిగితే “నేనేమైనా సీసాల్యాపారం చేస్తున్నానేటి?” అంది చికాగ్గా. ఏయ్! గొట్టం ప్యాంట్ డాక్టర్ కుర్రాడా! నువ్వు హాయిగా జాయిగా డాక్టరైపోయావ్. నీకు డబ్బుంది. నాకు లేదు. అవకాశం నీది. ఆకాశం నాది. నేను బీదాణ్ణి. నాకు తెలిసిన యిరవై యేళ్ళ నుంచీ నేను బీదాణ్ణే. నా బాబూ, నా తాతా, నా ముత్తాతా అంతా బీదాళ్ళే అయ్యుంటారు బాబూ. వో కారులో కుక్కతో పోతున్న టక్కుల పిల్లా! నీ కుక్క కారు లోంచి ఏం దర్జాగా మనుషుల్ని చూస్తోంది. పో పో! నీ కుక్కకి వీధికుక్కలు కుక్కల్లా కనిపించవ్.
పోవే పిల్లా పో. పోయిచూడు ఆ లీలామహల్లో ఇంగ్లీష్ సిన్మానీ!
అమ్మా! నువ్వెవర్వి? ఏ వీధి నీది! ఏ మురికివాడలో ఏ గుడిసె నీడ నీది? ఎందుకిలా ముళ్ళకంపలా నీ జుట్టు? పొగబారిన చూరులాంటి నీ కళ్ళలో – ఏమిటది చూపా? తల్లీ! ఏవిట్నీ బాధ? ఏవిట్నీ కథ? నీకు తల్లీ తండ్రీ భర్తా లేరా? పిల్లా పీచూ చీకూ చింతా వున్నాయా? అలా వెళ్ళకమ్మా – సగం నీళ్ళ మట్టికుండ నడుస్తున్నట్టు అలా వెళ్ళకమ్మా! శ్రుతి తప్పిన గీతం ఏడుస్తున్నట్టు… హేయ్, పందీ! హాస్పిటల్‌లో రౌండ్లు కొట్టి వస్తున్నావా? ఏఏ మూలల కెళ్ళావ్? ఏఏ పెంటల్ తిన్నావ్? పెంటల్ చెప్పిన కథలు చెప్పు – ఎవడికి అజీర్ణం? ఎవడికి కలరా? ఇంకెవడికి నెత్తురు విరేచనాలు?
చెప్పు పందీ చెప్పు.
నీవు చెప్పిన కథలనేవీ పత్రికల్వేయవ్.
ఏయేయ్! గుర్రంపిల్లా కాలేజీ గర్లా! చంపకు! తెంపకు నరాల తాళ్ళు. మొన్న నీలాటిదే పెటపెట్లాడేదెవతో – ఆ లక్ష్మీ టాకీస్ దగ్గర రూపాయి తీసుకుని బుగ్గ కొరికి, మెడ నిమిరి రోగాల్లేని రేవతంటే ఏ రిక్షాకైనా తెలుసునంటూ, ఛ! పచ్చి లంజ. రోగాల రొంపి. ” అప్పుడేటైంది నాయనా, బాధ! అబ్బా అంటున్నావ్ ఇప్పుడింజషనిస్తుంటే? అన్నాడు ఆ కంపౌండరు. ఒరే! రోగాల గూట్లో తొంగొనే మనిషీ! ఏం చేయను రోగాల్తెచ్చుకోక!
అతను హాస్పిటల్ గేటు దగ్గరే నిలబడి వున్నాడు.
గేటు పక్కనే కుష్టురోగి చర్మంలా వున్న పాత బల్లల మీద రంగు రంగుల బందీల్లాగా ఖాళీ సీసాలు – అమ్మకానికి. ఆ బల్లల పక్కనే చిన్న చిన్న బల్లల మీద నిలవ రొట్టెలు. కుళ్ళిన ద్రాక్షపళ్ళూ, పునుకులూ, పాసిన యిడ్లీలూ, ఎండిపోయిన బత్తాయిలూ, మధ్య మధ్య వాటినన్నిట్నీ పలకరిస్తోన్న ఈగలూ.
ఆ బల్లలకి కాస్త వెనక హాస్పిటల్ గోడ ప్రక్కన మురికి కాలువ. అందులో రోడ్డు మట్టానికి గజం కింద నీళ్ళు మురిగ్గా నల్లగా సిరా పారుతున్నట్లు, పెంటా, నీరూ, కంపూ తేలిపోతూ. మురికి కాలవ గట్టుమీద ఏడెనిమిదేళ్ళ ఇద్దరాడపిల్లలూ, పదేళ్ళ కుర్రాడు. దొడ్డికి కులాసాగా కూచుని ఒక్కొకళ్ళు పోసిన వుచ్చ ఎంత పొడవై ఎంత దూరం పాకిందో గొప్పగా చెప్పుకుంటూ, ఒకళ్నొకళ్ళు డబాయించుకుంటూ, వాళ్ళకి కాస్త దూరంగా ఒక ముసిలి కుక్కా, నాలుగు పంది పిల్లలూ పెంటలు కెలుకుతూ తింటూ.
హాస్పిటల్ గేటుకి ఎదురుగా, రోడ్డుకి అవతలి వైపున వాలులో హోటళ్ళూ, బేకరీలూ, షాపులూ, రోడ్డుమీద కార్లూ, సైకిళ్ళూ, స్కూటర్లూ, సిటీ బస్సులూ, ఆడా మగా – కొందరు అందంగా, హుందాగా, నిర్భయంగా. కొందరు భయంగా, బితుకు బితుగ్గా – పోతూ,
ఖాళీ సీసాలున్న బల్లవైపు చూడక ముందు ఇతన్ని చూసి.
“వీధులను మురికి చేయకుము. మురికియే వ్యాధులకు కారణము”. ఎవరన్నారీ మాటా? గాంధీయా, నెహ్రూయా, ఇందిరాగాంధీ నెహ్రూయా, ఎవరన్నారు?
మురికిని వీధి చేయకుడు. వీధియే వ్యాధికి కారణము.
లేకపోతే
వ్యాధియే వీధికి కారణము.
అందువల్ల – వీధిని మురికి చేయకుము. మురికిని వీధి చేయకుము.
అనండి బాబూ అనండి; అనండనండి.
“సీసా కావాలేటి బాబూ? రాండి! రాండి! ఆర్నాలు”.
గేటుకి ఎడమవైపున ఆడది, చీర తప్ప జాకెట్‌లేని శరీరంతో ముప్ఫై యేళ్ళు బిగుతుగా ఆహ్వానంగా కనిపిస్తుంటే.
అతను.
ఆ పైట వెనక రెండేళ్ళ వైధవ్యంలో పది పదిహేనుమందివో ఇంకెంతమందివో – ఇరవయ్యో ముప్ఫయ్యో చేతులు, వందో నూటయాభయ్యో వేళ్ళు మత్తుగా, ఆవేశంగా హాయిగా తడిమి.
నిమిరీ నలిపీ ఏదేదో చేసేసిన రొమ్ముల్ని, కాస్త బిగుతు సడలినా అందంగా పొంకంగా కనిపిస్తుంటే.
వాటిని చూపుల్తో తడుముతూ, తడువుతూ ఆవిడవైపు అడుగేస్తుంటే –
హమ్మయ్య! పొద్దుటేల్నుంచీ బేరం సారం నేదనుకున్నా. ఆర్నాలన్నా బేరవాడి పావలాకైనా ఏదో సీసా తీసేసుకుంటాడీ బాబు. పావాలా వొస్తే చెల్లెలికి రెండు తెల్లకాయితాల బొక్కుల్కొనచ్చు. నంజకొడుకు ఆ రంగడు నిన్న రేత్రి ఎద్దల్లే కుమ్మి, కుక్కల్లే కొరికి రెండ్రూపాయలిచ్చి, అరగంటాగొచ్చి “పైడీ! పోలీసొచ్చాడే మామూలియ్యాల్గానీ ఆ రెండిటీ, ఆనంక సూసుకుందాం” అని గుంజేసుకుపోనాడు. ఆ రెండులో చెల్లికి చౌకలో ఏదన్నా జాకీటు ముక్కా, రెండు రిబ్బన్లూ కొనచ్చనుకున్నా. గుంటెంత అందంగా ఉంటాది! అది సదువుకుని, పెద్దదైంతరవాత – సీ! సీ! ఈ బతుకా – మారాణల్లే బతకాలది, యంట్రామారావొంటి మొగుడొచ్చి జమునల్లే వుండాలది. పదకొండేళ్ళే అయినా గుంటంటాదీ – “ఆ రంగడూ ఆళ్ళూ రేత్రులు ఎందుకొస్తారే అప్పా” అని. దానికేటెరిక. అది బాగడ్డానికే. దాని బతుకు ఎంగిలాకల్లే కుక్కల్నోటో, పందుల్నోటో సిరక్కుండా వుండానికే నానలా సత్తున్నానని. సారా యాపారవన్నా చేద్దావంటే పెట్టుబడి కావాలాయె. తెలివితేటలుండాలాయె, పోలిసోళ్ళు జాగరపు కళ్ళల్లే తిరుగుతారాయె.
పేచి గీచీల సిక్కులుండకూడదనుకుంటే మామూళ్ళు కక్కాలాయే. ఆ నరకం కంటే ఒళ్ళమ్ముకోడమే సుకం. ఎవడో ఓడు నికార్సుగా దొరుకుతాడు… ఓ డబ్బున్న ఆసామీ నెవణ్ణో ఎప్పుడేనా వల్లో ఏసుకోవాల, వంటి బిగువు పోతే ఎవడూ దగ్గరికి రాడు.
“రాండి బాబూ రాండి! ఈ మాత్రం సీసా కావాలా? ఇంకా పెద్దదే కావాలా! రండి సూద్దురు గాని-”
ఆర్నాలా ఆ ఖాళీ సీసా! ఒసేయ్ – జాకెట్టు లేని.. ఆర్నాలే అది, కంటినిండా వున్నావని నీవైపొస్తుంటే ఆర్నాలంటావ్? నా దగ్గర పదిహేను పైసలే ఉన్నాయి. పదిహేను పైసల పాదుషాన్ నేను… పదిహే…
“పదిహేను పైసలకిస్తావా? అంత పెద్దదొద్దు – అంతకంటే చిన్న సీసా చాలు”
“పావలా అవుద్ది బాబూ – పైసా తగ్గదు”
“బాబూ! ఇదిగో బాబూ! నేనిస్తా రండి. బేడిద్దురు చాలు. పెద్ద సీసాయే, చూడండి” గేటుకి కుడి ప్రక్క నుంచి ఇంకో ఆడది. అతుకుల చీరలో, జాకెట్ లేకుండా – నల్లగా, సన్నగా.
బేడ! బేడ కావాలి బాబూ నాకు. పొద్దుటేల్నుంచి టీనీళ్ళేవు. కొంపలో వున్న ముప్పావలానీ రాత్రి ఆడట్టుకెళ్ళేడు. ఇంక అయిపు లేడు. తాగి ఏమూల తూగిపడిపోనాడో, పడిపోయి ఏమూలన్నా సచ్చిపోనాడో ఎరికనేదు. గుంటడూ గుంటదీ ఏ బస్సుల్కాడో అడుక్కుంటా వుంటారు. అది పాడుద్ది, ఆడు చెక్కల్కొడ్తాడు. ఆడుకోవాల్సిన ఈడులో పాడు పిల్లలు అడుక్కుంటన్నారు బాబూ! ఈ పసికూన చూడు. గరుకురాళ్ళ నేల మీద, ఆకాశాన్ని ఏటో అడుగుతున్నట్లు చేతులాడించేస్తాంది. ఆకాశం బరువుగా మీద పడిపోతున్నట్టు కాళ్ళు ఎగరదన్నేస్తోంది బాబూ! దీనికి పాలీడానికి పాల్లేవు. రొమ్ము బీడైపోనాది. పాడైపోనాది. లబ్బర్పీకని సీకినట్టు పసిది రొమ్ముల్ని సీకుద్ది బాబూ, రొమ్ముల్లోంచి ఏటొస్తాది నీ తల్లి బాత్తప్ప… బేడ సాలు టీ నీళ్ళొస్తాయ్, కాస్త ఆధరువు. బతకడం ఎంత కష్టం బాబూ! ఏ యింటికాడైనా ఆంట్లు తోముకుందామంటే నాకు పనీరు. అప్పుడెప్పుడో బుద్ధి దొంగగడ్డి తినేసింది. బతుకు మీద తీపి ఏటైనా సేయిస్తాది. ఆ పైడల్లే ఒళ్ళమ్ముకుందావన్నా జిగేది, బిగేది? వొంపులేవి, వొయ్యారాలేవి? ఏదీ నేదు. ఆ సీసాలమ్ముకుంటున్నా. ఆడున్నాడా! మొగుడే. తాగుతాడు, తంతాడు. రిచ్చావోడు, ఆడు తెచ్చేదెంతో ఆడికే యెరుక. ఆ రాముడికే యెరుక. ఆ సారా కొట్టోడికే యెరుక. బిడ్డలున్నారు బాబూ, ఆకలి గడ్డలు.
నూకాలమ్మ మనసులో ఆలోచనల హోరు, జోరు హోరు.
బేడే అంటోంది. మూడు పైసలేం తీసుకుంటా గానీ, కొనేస్తా పదిహేను పైసలిచ్చి.
“ఏదీ సీసా చూపించు” అతను గేటువైపు నుంచి ఎడమవైపుకి వచ్చాడు.
‘ఇదే బాబూ, ఇదే”
తీసేసుకున్నాడు బాబు, పదిహేను పైసలిచ్చి. మూడు పైసలుంచేసుకో అన్నడు ధర్మాత్ముడు.
మందు కోసం చేతిలో ఈ ఖాళీ సీసా. ఒంటి మీద ఈ మాసిన బట్టలు, ఇదే నేను. అమ్మ ఏ బత్తాయిలు కావాలంటుందో, ఏ ద్రాక్షలు తింటనంటుందో.
అనదు.
నేను ఇవేం కొనలేనని అమ్మకి తెలుసు. అందువల్ల అటువంటివేం అడక్కుండానే చచ్చిపోనైనా చచ్చిపొతుంది అమ్మ.
అమ్మా చచ్చిపో!
సిరులు పొంగే భరతభూమిలో చచ్చిపోయి
ఆ స్వర్గ దేశమో, నరక దేశమో పోయి
పాడమ్మా పాడు…
ఏ దేశమేగినా ఎందు కాలిడినా..
అతనికి హాస్పిటల్ వరండా రాక్షసుడి గొంతులా వుంది. ఆ నర్సులూ, రోగులూ, డాక్టర్లూ నిలువుగా నడుస్తున్న వికృతపు గొంగళీ పురుగుల్లా వున్నారు.
అతని వెనక – గేటు దగ్గర –
పైడి: ఏటే నంజకానా! నూకాలమ్మా! సీసా నేనమ్మనిదాన్నీ! నువ్వమ్మే దానివటే! బేడ కిచ్చేసినాది ఓ యబ్బ ఈ అన్నపూర్ణ! నా కాడికొస్తాన్నవాణ్ణి బేడని ఆశ్చూపి సీసా అమ్మేశావే. నీతిలేని నంజ.
నూకాలమ్మ: ఏటే పైడీ పేల్తాన్నావ్! మళ్ళా తూలు మాట. ఫెళ్ళుమంటాది చెంప. రాలిపోగలవ్ పళ్ళు… నువ్వూ తక్కువ ధరకిస్తే జమిందారైనా మొగ్గుతాడే. నంజంటావే – రంకులాడి, కిల్లాడి.
పైడి: ఏటే నేన్రంకుదాన్నా? నువ్వే రంకువి, నీ తల్లి రంకుది. దాంతల్లి రంకుది. నీ పిల్ల రంకుదవుద్ది.
పైడితల్లి కోపంతో పామై నూకాలమ్మ దగ్గిరికి పోయి చెంప ఛెడీల్మనిపించింది.
నూకాలమ్మకి ఆ దెబ్బతో శోషొచ్చినట్టనిపించింది. కాయలు రాల్చడానికి రేక్కాయ చెట్టుకొమ్మను కుర్రాడు పట్టుకు వూపినట్టుంది ఆ దెబ్బ.
ఆ దెబ్బతో నూకాలమ్మ కూడా పామైపోయింది. దెబ్బతిన్న పామై పోయింది.
సత్తువ తెచ్చుకుంది. చేతుల్ని విసురుగా గాలిలోకి వూపింది. పైడికి మెడమీద తగిలింది ఒక చేతి దెబ్బ. ఆ చేతికే పైడి కొప్పు మెత్తగా తగిలింది. దీని కొప్పట్టుకొని మెడ సాగదీస్తా. కుయిక్‌మని చావాలి. నంజ. నా పిల్లలు రంకువాళ్ళవుతారంటాదీ.
పైడి: కొప్పొదల్వే. రాకాసి ముళ్ళకంప! అమ్మో సచ్చాన్రో!
(ఈ నూకాలమ్మని సంపేయాలి. పేణం పోతున్నట్టుండాది కొప్పు నాగేస్తుంటే, దీని పనిట్టా కాదు).
నూకాలమ్మ: ఆమ్మో! నంజా! సీర నాగేత్తున్నావే! యేటే! యేటే! ఆగవే! ఉసే పైడీ! సిగ్గునేదే నీకు. సీరే – లాక్కే! అయ్యో! అయ్యో! సూత్తూ వూరుకుంటారేటి బాబూ! సీర నాగేస్తన్నాదిది.
(నూకాలమ్మ కింద పడిపోయి చీరని చేతుల్తో గట్టిగా పట్టుకుని… )
బాబూ!
(చీరొదిలి రెండుచేతులూ కింద ఆనించి లేచి నిలబడబోతుంటే పైడి నూకాలమ్మని దబేలున కింద పడదోసి బరబరా బరబరా)
అయ్యో… సీ… సీర.. ఆగ.. ఎంత పంచేశావే పైడీ! అదేటే అదేటే!
(అయ్యో నా సీరని ఎటో ఇసిరేబోతున్నాదిది… ) నీకు దండవెడతానే –
(అయ్యో! నా సీరని ఆ మురిక్కాలవలోకి ఇసిరేసినాది.)
(నా వొంటిమీద సీరనేదు. అయ్యో! ఇందరు మగాళ్ళు, ఆడాళ్ళు అందరూ అందరూ నన్నూ నా మొండిమొలనూ సూస్తన్నారు.)
నంజా! సూడే! నీ పంచెప్తా!
(నూకాలమ్మ పైడి చేతిమీద కొరికి… )
పైడి: అమ్మో! అమ్మో!
నూకాలమ్మ: నా సీర నాగేసినావ్ కాదే.
(పైడి జుట్టుని నూకాలమ్మ ఎడమచేత్తో చిందర వందర చేస్తూ, కుడిచేత్తో పైడిని డొక్కలో పొడుస్తూ వొంగి, పైడి చీరని పైకెత్తి, లాగి, గుంజి, చీర వూడి రాకపోయేటప్పటికి పైడి మీద కలబడి పైట పట్టుకుని, భుజం మీద కొరికి పైడి చీరని దొరకపుచ్చుకుని జిర్రు జిర్రున కవ్వం లాగుతున్నట్టు లాగేసి… )
ఇప్పుడెట్టా వుందే పైడీ?
పైడి: (బాబోయ్ ఇది పిచ్చికుక్కల్లే కరిచేసినాది. నెత్తురు).
పైడి చీరను మురిక్కాలవలో పడేట్లు విసిరేసింది నూకాలమ్మ. అది అందులో పడలేదు. కాలవకి కాస్త పక్కన – పంది పెంట మీద పడింది.
పైడి అలాగే బట్టల్లేకుండా నూకాలమ్మ మీద విరగబడింది.
ఇద్దరూ కలబడ్డారు. కింద దొర్లారు. సగం లేచి మళ్ళా పడ్డారు. కిందా మీదా పడ్డారు. దొర్లారు… దొర్లారు.
నూకాలమ్మ హఠాత్తుగా లేచింది. పట్టు విడిపించుకుని, గబగబా పరుగెత్తింది.
మురికి కాలవలో పడకుండా వుండిపోయిన పైడి చీరను, కాకి సబ్బు ముక్కని కరుచుకుపోయినట్లు లంకించుకుని.
“చావే పైడీ, చావు. నా చీరను మురిక్కాలవలో పరేసినావ్ గదే. నీ సీర నేనెత్తుకు పోతా. మొండిమొల తోనే చావే నంజా చావు”.
నూకాలమ్మ – పరుగు, దొంగ లాగా. చీరని ఆదరా బాదరా తొడల మధ్య కప్పుకుని పరుగు, ఒకటే పరుగు.
ఇదంతా నిమిషాల్లో అయిపోయింది.
కిందపడి వున్న పైడి గభాలున లేచింది. తన చీర పట్టుకు పారిపోతున్న నూకాలమ్మని పట్టుకోవాలనుకుంది. నూకాలమ్మ మెరుపై పోయింది. మరుగైపోయింది.
అప్పుడు –
అలా ఒంటిమీద బట్టల్లేకుండా నిలబడడం పైడికి భయంకరంగా అనిపించింది. బాధనిపించింది. కళ్ళు ఏడుపు సముద్రాలయ్యాయి. కిందపడి వున్న తను ఎందుకు లేచానా, అనుకుంది. అలాగే నేల మీద బోర్లా పడుకుని వున్నా పోయేదనుకుంది. చేతుల్తో రొమ్ముల్ని కప్పుకుంది. కోడిపెట్ట రెక్కల కింద పిల్లల్ని దాస్తున్నట్టు. ఈసారి రెండు చేతులూ తొడలమీదకి, తొడల మధ్యకి. రొమ్ములు, రొమ్ములు గాలి నెదిరిస్తున్నట్టు! ఒక చెయ్యి మళ్ళా రొమ్ముల కడ్డంగా, ఒక చేయే తొడల మధ్య నొక్కుకొని, అటూ ఇటూ చూస్తే.
మనుషులు మనుషులు మనుషులు మనుషులు ఎటు చూసినా మనుషులే.
వాళ్ళ తలలు తలలు తలలు.
తలల సముద్రం. తలలలలలల సముద్రం.
వాళ్ళ కళ్ళల్లో కోరికల పిచ్చి పిచ్చి ముళ్ళు.
మురికి కాలవలో నూకాలమ్మది తాను విసిరేసిన చీర మురికి నీళ్ళకి సిగ్గేమోనన్నట్టు చిందర వందరగా కప్పుతూ నల్లగా, మురిగ్గా, కంపుగా నవ్వుతూ.
చీరని తీయాలంటే అంత కిందకి దిగాలి. గజం కిందకి. నడుం వంచినా, అడుగు కదిపినా ఎన్నో కళ్ళు – దయ కురిపించేవి, భయం గాండ్రుమనేవి, ప్రేఁవొలకబోసేవి, పగ రగిలించేవి, కళ్ళు. మొరెట్టుకొనేవి, కోసేవి, వూసేవి, నిమిరేవి, ముద్దెట్టుకునేవి. ఇన్ని కళ్ళు. ఇలాంటిలాంటి కళ్ళు. ఎలాంటెలాంటెలాంటివొ కళ్ళు.
ఆడదాన్ని, నన్ను, ఒంపులొంపులదాన్ని, జిగిబిగిదాన్ని చూస్తుంటే, చూస్తుంటే.
పోట్లాటలో ఏ మూలకో పోయిన తను ఆడదాన్ననే జ్ఞానం సంగతీ అప్పుడు అప్పుడంటే అప్పుడే ఒక్కసారిగా ఫెడీలున బట్టలేని ఒంటిమీద కంచీతో కొట్టినట్లు కొడితే –
అయ్యో అయ్యో అయ్యయ్యో. నేనాడదాన్ని. ఒంటిమీద బట్టలేనిదాన్ని. ఈ వీధిలో వానలో ఆవల్లే నుంచున్నదాన్ని. ఇంతేసిమందిలో రకరకాలుగా మారిపోయినదాన్ని. ఒరే దేవుడా! సచ్చినోడా! వల్లకాటిరావుడా! ఆకాశం సీల్చుకొచ్చి నా మానానికి అడ్డడరా నువ్వు. కాసుకోడానికి పాండవుల పెళ్ళావేఁ కావాల్రా. ఈ రొమ్ముల కడ్డం నిలబడరా, ఒరే దేవుడా. ఈ మనుషులు – నా సంకల్ని చూసి యేటి సేయాలనుకుంటున్నారో, బొడ్డు కిందకి తొళ్ళ మధ్యకి ఎన్ని కళ్ళు ఎన్నెన్ని సార్లు బురదలో ఎడ్ల కాళ్ళల్లే దిగబడిపోయుంటాయో! ఓ కుర్రాడా, నీ చెల్లినిలా మొండిమొలతో నిలబెడితే సూసేవాడివా? నీ తల్లి ఇల్లా తల్లడిల్లి పోతుంటే సూసేవాడివా? ఓ అమ్మా నువ్విలా ఇంతమంది మొగాళ్ళ నడుమ నిలబడగలవా? పావలా, అమ్మా, పావలా. పావలా కోసం నాను, బేడ కోసం ఆ నూకాలమ్మా బట్టలూడ లాగేసుకున్నాం, ఆడోళ్ళవనే వూసు మర్చిపోనాం. అయ్యా నీటు బాబూ, నిగనిగ బూట్లబాబూ! నీ ఆడాళ్ళు సిల్కు నైలాన్ సీరల్లో దాంకుంటారు. బేళ్ళు పావలాలు పారేసుకుంటారు. పారేస్తారు. నవ్వుకుంటారు. నవ్వులుగా సెప్పుకుంటారు. బాబుల్లారా, అమ్మల్లారా! ఒరే ఒరే ఒసే ఒసే పైసలకి ముడిపడిపోయిన పేణాలివి. ఒరే ఒరే పోలీసూ, బడ్డీకాడ బీడీ కాలుస్తూ నిలబడున్నావా? తప్పుల్జరక్కుండా ఒప్పుల్జరిగేట్టు సూత్తాం అంటారు గదరా మీరు! నాయం అన్నాయం చూస్తారు గదరా మీరు! నాయనా అయినా ఇదంతా సూస్తూ వూరుకున్నావా బాబూ! నేను రంకుదాన్నేనయ్యా, ఒళ్ళమ్ముకునే దాన్నేనయ్యా. అద్దె సైకిల్నే బాబూ, సీకట్లో సిగ్గూ సెరం సీరానారా ఇడిచేసేదాన్నే బాబూ! రోగాల పురుగుల పుట్టని – దాచుకున్న దాన్నే బాబూ.
ఇంతైనా నేను ఆడదాన్ని, బాబుల్లారా, నేనాడదాన్ని. మీరంతా నన్నూ నా ఒంటినీ రవరవ్వా సూసేశారు, కళ్ళు కల్లుముంతలంత సేసుకుని. నా మానం అభిమానం మీ కళ్ళలో కలిపేసుకున్నారు. నేను బతికేటికి? ఇంక నేను బతికేటికి?
పైడి ఇదంతా అనాలనుకుంది. పైన ఆకాశం చిరిగేట్టు, కింద నేల పేలేట్టు అరవాలనుకుంది. కానీ, గొంతులో సిగ్గు, అభిమానం సీసా మూతిలో బిగుసుకుపోయిన బిరడా అయిపోయాయి. పైడి అరవలేదు కానీ –
హాస్పిటల్ రోడ్డు పక్కన వాలుగా వున్న రోడ్డుమీద వాలులోకి సిటీ బస్సు జోరుగా వరం ఇచ్చే దేవుడిలాగా వచ్చేస్తుంటే,
ఒడ్డునపడి గిలగిల గిలగిలలాడి హఠాత్తుగ నీళ్ళలోకి దూకేసిన చేప లాగా,
బస్సు ముందు చక్రాలకిందికి దూకేస్తే, పైడి దూకేస్తే.
భయం, ఆశ్చర్యం కేకలు రోడ్డుకి అటూ ఇటూ కలగాపులగం అయిపోయినప్పుడు.
నీళ్ళున్న గ్లాసు కిందపడి భళ్ళున పగిలి నీళ్ళు చెల్లా చెదురైపోయినట్టు – అంతవరకూ పైడి శరీరంలో సజీవంగా సక్రమంగా ప్రవహిస్తున్న నెత్తురు రోడ్డుమీద అర్థం లేకుండా, ప్రయోజనం అసలే లేకుండా కళ్ళాపులా చిమ్ముకుపోతే.
నేలకి ఆ నెత్తురు ఏ బాధను నివేదించుకుందో, తల లోంచి బయటపడ్డ మెదడు మట్టిలో ఏ ఆలోచనలు చెసిందో, బయటకు పొడుచుకు వచ్చిన ముంజేతి ఎముక బస్సు ముందు చక్రానికి ఏ దిక్కుని చూపించిందో, రెప్పలు మూయని కళ్ళు ఎవరిని వెయ్యి చావులు శపించాయో.
హాయిహాయిగా వున్న గాలికి, పల్చపల్చగా వున్న ధూళికి, పచ్చపచ్చగా వున్న చెట్లకి, వెచ్చవెచ్చగా వున్న ఎండకి, దూరంగా హోరుహోరుగా వున్న సముద్రానికీ, పైడి మీద బోర్లించిన మూకుడు సమాధి ఆకాశానికీ తెలిసి వుండాలి.
తెలియకపోయీ వుండాలి.