[కవిరాజశిఖామణిగా తనని తాను ప్రకటించుకున్న నన్నెచోడుని ఉనికీ, కాలనిర్ణయమూ, అతని కావ్యం కుమారసంభవము – వీటిపై విస్తృతంగానే వాదోపవాదాలు జరిగేయి. నన్నెచోడుడు ఎప్పటివాడో నిర్ధారించటానికి అనేకమంది పండితులు ప్రయత్నించారు. ఈ కవి వ్రాసిన కావ్యం ఎందుకు విశిష్టమైనదో, ఈ కవి ఏకాలంవాడో అతని కావ్య లక్షణాల ఆధారంగా ప్రతిపాదిస్తూ, రచయిత ఇక్కడ ప్రచురిస్తున్న వ్యాసంలో మొదటి భాగం ఇది – సం.]
ఆ హరాద్రిసుతల కతుల హర్ష మెసఁగె, దేవ సం-
దోహమునకు వీరలక్ష్మితోడ వేడ్క లొందెఁ, బు-
ణ్యాహఘోష మెసఁగె, మునిజనాశయమ్ముల న్మహో-
త్సాహమయ్యె నక్కుమారసంభవంబునం దిలన్
– నన్నెచోడుని కుమారసంభవము (10.50)
ఆ కుమారసంభవ ఘడియలో భూమిపై గొప్ప ఉత్సాహము కలిగింది. హరునికి, పార్వతికి ఎనలేని ఆనందం కలిగింది. దేవతల బృందానికి వీరలక్ష్మితో వేడుక లయ్యాయి. మునుల ఆశ్రమాలలో జనన కాలమందు చేయు పుణ్యాహవాచనాలు మారుమ్రోగాయి. ఈ పద్యం ముద్రాలంకారముతో ఉత్సాహవృత్తములో కుమారసంభవ ఘట్టమును వర్ణించే పద్యం [1],[2].
అందరికీ కవిత్రయపు భారతము తెలుసు, కవిసార్వభౌముని శృంగారనైషధము తెలుసు, అష్టదిగ్గజాల ప్రబంధాలు తెలుసు, మూరురాయరగండని ఆముక్తమాల్యద తెలుసు. కాని నన్నెచోడుని కుమారసంభవమనే రమ్య తారకను కప్పిన మబ్బు ఒక శతాబ్దం ముందు మాత్రమే తొలగినది. దీనికి కారకుడు శ్రీ మానవల్లి రామకృష్ణకవి. కవిగారు తంజావూరు సరస్వతీమహలులో దీనిని మొట్టమొదట పందొమ్మిదవ శతాబ్దపు ఆఖరి దశకములో చూచారు. ఈ కావ్యం రెండు భాగాలుగా 1909, 1914లలో ప్రకటిత మయ్యాయి. 2009 కుమారసంభవపు పునర్జన్మకు శతజయంతి అని చెప్పవచ్చు.
నన్నెచోడుడు లేక నన్నిచోడుడు ఒక కవి, ఒక చిన్న రాజు, కవిరాజు. నన్ని అంటే తెలుగులో అందమైన, ప్రియమైన అని అర్థం, అదే పదానికి కన్నడములో సత్యము, అనురాగము, ప్రేమ, నిశ్చయము, అనుబంధము అనే అర్థము ఉంది, తమిళములో దీనికి మంచి, గొప్ప అని అర్థము. తన గొప్పదనంపై ఇతనికి భరోసా ఉండింది కాబట్టి తన్ను తానే కవిరాజశిఖామణి అని చెప్పుకొన్నాడు. తెలుగు సాహిత్యంలో ఎందరో రాజకవులు – నన్నెచోడుడు, భద్రభూపాలుడు, కృష్ణదేవరాయలు, కట్టా వరదరాజ భూపతి, రఘునాథరాయలు, కదిరీపతి, విజయరాఘవుడు, విజయరఘునాథుడు, మున్నగువారు. వీరిలో ప్రథముడు నన్నెచోడుడే. ఇతడు చోడ (చోళ) వంశానికి చెందిన వాడు. తన వంశం కరికాలచోళునికి చెందినది అనీ, తాను దక్షిణ దేశానికి సూర్యునివంటి వాడు అనీ చెప్పుకున్నాడు.
కం. కలుపొన్న విరులఁ బెరుఁగం
గలుకోడి రవంబు దిశలఁ గలయఁగఁ జెలగన్
బొలుచు నొరయూరి కధిపతి
నలఘు పరాక్రముడఁ డెంకణాదిత్యుండన్(1.54)
జాతి పొన్న చెట్టులతో నిండి, జాతి కోళ్ళ ధ్వనులతో నిండి ఉండే ఒరయూరికి (తమిళ దేశంలోని ఉరయూర్) అతి పరాక్రమవంతుడైన టెంకణాదిత్యుడనే రాజును నేను. ఈ టెంకణమనునది ఇప్పటి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ప్రాంతమని [3], అక్కడికి దగ్గరలోనే మరొక ఒరయూరు ఉండిందని చరిత్రకారుల ఉద్దేశము.
తన కవిత్వం పాఠకుల హృదయాలను తాకుతుందనే ఆత్మ విశ్వాసం ఉండింది ఈ మహాకవికి. అందుకే మంచి కవిత్వం అన్నది విలుకాని బాణములా ఎదురుగా ఉండే వాని గుండెను తాకాలి. అట్టిదే కవిత్వం, అట్టిదే బాణము. మిగిలినవానిని ఆ పేరితో పిలవడం భావ్యమా, దానిని పట్టిన చేయి చేయి యేనా అంటాడు ఈ పద్యంలో-
కం. ముదమునఁ గవికృత కావ్యము
నదరున విలుకాని పట్టినమ్మును బర హృ-
ద్భిదమై తల యూఁపును, బెఱ
యది కావ్యమె చెప్పఁ బట్ట నదియున్ శరమే(1.41)
పుట్టుపూర్వోత్తరాలు
నన్నెచోడుని తండ్రి చోడబల్లి, తల్లి శ్రీదేవి. చోడబల్లి పాకనాటి 21 వేల గ్రామాలకు రాజు. ఇప్పటి నెల్లూరు జిల్లాలోని కొన్ని తాలూకాలు, ముఖ్యముగా ఉదయగిరి ప్రాంతము, ఈ పాకనాటిలో ఉండేదని చెబుతారు. ఇతని గురువు జంగమ మల్లికార్జునదేవుడు. వచ్చిన చిక్కల్లా తండ్రి కొడుకులయిన చోడబల్లి-నన్నెచోడులు ఎందరో ఉన్నారు! నన్నెచోడుని కుమారసంభవముపైన జరిగిన తర్జనభర్జనలు, వాదోపవాదాలు మరే తెలుగు కావ్యంపైన జరిగి ఉండలేదన్నది అతిశయోక్తి కాదు. దీనికి కారణము – రామకృష్ణకవిగారు ఈ గ్రంథపు శైలినిబట్టి, వారు పరికించిన శాసనాల ఆధారాలను బట్టి నన్నెచోడుడు నన్నయకంటె ఒక శతాబ్దం ముందు జీవించిన కవియని ఉద్ఘాటించారు [4]. ఇది ఆ కాలపు కవిపండితలోకంలో ఒక సంచలనాన్నే కలిగించింది. దీని ఫలితం, ఇప్పటి పరిస్థితి, ఏమంటే, నన్నెచోడుని కాలాన్ని ఐదు విధాలుగా చెప్పవచ్చు. అవి – (1) నన్నయకు ముందు, (2) నన్నయకు సమకాలం, (3) నన్నయ తిక్కనలకు మధ్య కాలం, (4) తిక్కన తరువాతి కాలం, (5) అసలు నన్నెచోడుడు అనే కవి లేడు, అతని పేరితో మరెవ్వరో ఈ గ్రంథాన్ని రచించారు!
నన్నెచోడుడు నన్నయకు ప్రాచీనుడు అని చెప్పినవారిలో మానవల్లి రామకృష్ణకవి, నడకుదుటి వీరరాజు పంతులు, నేలటూరి వేంకటరమణయ్య గారలు ప్రముఖులు. దేవరపల్లి కృష్ణారెడ్డి ఇద్దరు నన్నియలు సమకాలీనులని ఒక పుస్తకాన్నే రాశారు [5]. చాగంటి శేషయ్య వీరిని సమర్థించారు. కాని చాలమంది పండితులు నన్నెచోడుని కాలము నన్నయతిక్కనలకు మధ్య కాలమని తీర్మానించారు. కోరాడ రామకృష్ణయ్య [6], నిడదవోలు వేంకటరావు, ఖండవల్లి లక్ష్మీరంజనం, దివాకర్ల వేంకటావధాని, ముఖ్యంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారలు, ఈ వాదాన్నే బలపరచారు. శ్రీపాద లక్ష్మీపతి శాస్త్రులు చోడుడు తిక్కన తరువాతి వాడని ప్రతిపాదించారు. ఇక పోతే కొర్లపాటి శ్రీరామమూర్తి నన్నెచోడుని కుమారసంభవము ప్రాచీనగ్రంథమా [7] అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని లేవదీశారు. వీరి దృష్టిలో ఈ కావ్యము ఒక కూటసృష్టి (fake), మానవల్లి రామకృష్ణకవిగారే నన్నెచోడుని పేరితో కుమారసంభవాన్ని రాశారు. అన్ని వాదాలకు వాదిప్రతివాదులు హేతువులను చూపించారు [8]. నన్నెచోడుడు కుమారసంభవములో వాల్మీకి కాళిదాసాది సంస్కృత కవులను తప్ప మరెవ్వరినీ తలవలేదు. నన్నయ కూడా తన భారతములో మరే పూర్వాంధ్రకవి పేరెత్తలేదు. కావున ఈ విధంగా ఎవరు ముందో ఎవరు తరువాతో చెప్పలేము. ఛందఃపరముగా కొన్ని హేతువులను ఈ వ్యాసపు తరువాయి భాగంలో నేను ప్రతిపాదిస్తున్నాను. కానీ దానికి ముందు కుమారసంభవములోని కొన్ని వైశిష్ట్యాలను చెప్పడం ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము.
ప్రబంధపరమేశ్వరుడు
తెలుగులో ప్రబంధయుగం నన్నెచోడునితో ప్రారంభమైనదని చెప్పడములో సందేహం లేదు. ఎఱ్ఱాప్రెగడకు ప్రబంధపరమేశ్వరుడని బిరుదు ఉన్నా, మనుచరిత్ర ప్రబంధ యుగానికి నాందీవాక్యం పలికినా, కుమారసంభవములో ప్రబంధానికి కావలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. చోడుడే అష్టాదశ (అరణ్యము, జలక్రీడ, సూర్యోదయం, చంద్రోదయం, పుత్రోదయం, మంత్రాలోచనలు, యాత్ర, సంభోగము, రాజు, యుద్ధం, సముద్రము, సురాపానము, ఋతువులు, నగరము, వివాహము, కొండ, విరహము, రాయబారము) వర్ణనలతో తాను ఈ పుస్తకాన్ని రాస్తున్నానని ఇలా చెబుతాడు –
కం. వన జలకేళీ రవి శశి
తనయోదయ మంత్ర గతి రత క్షితిప రణాం
బునిధి మధు ఋతు పురోద్వా
హ నగ విరహ దూత్య వర్ణ నాష్టదశమ్మున్(1.44)
ఈ విషయాన్నే విన్నకోట పెద్దన తన కావ్యాలంకారచూడామణిలో [9]కూడా వివరిస్తాడు. అప్పకవి వీటికి మరిన్నీ నాలుగు (వేట, మౌనీంద్ర పుణ్యాశ్రమము, కన్యాంగ సౌందర్య కథనము, దౌహృదము) కలిపాడు [10]. అష్టాదశ వర్ణనలను అన్నీ ఇక్కడ వ్యాఖ్యానించడానికి చోటు లేకపోయినా, సురాపానం గురించి ఒక పద్యాన్ని మీతో పంచుకొంటాను. ఏ పేరుతో పిలిచినా గులాబీ పూవే కదా! బహుశా అలాటిదే మదిర కూడా అంటాడు కవిరాజు.
చం. అమరులు త్రావుచో నమృతమందురు దీని, నహివ్రజం బజ
స్రముఁ గొని యానుచో నిది రసాయనమందురు, భూసురౌఘ మా
గమవిధి సోమపాన మని గైకొని యానుదు, రెందుఁ జక్రయా
గమునెడ వస్తువందు రిది కౌళికు, లీ సుర పేర్మి వింతయే!(9.130)
దేవతలు తాగితే అది అమృతము అవుతుంది, పాతాళంలోని నాగులు తాగితే అది ఒక రసౌషధము అవుతుంది, ఇక బ్రాహ్మణులు శాస్త్రోక్తముగా దీనిని సోమపానమని తాగుతారు, ఇక శాక్తేయులకు శ్రీచక్రయాగ సమయములో ఇది వస్తువవుతుంది. ఎందరు ఎన్ని పేరులతో తాగినా, మద్యపు గొప్పదనం వింతయే సుమా! ముల్లోకాలలో ఇది ముచ్చటైనదే అని ఈ రాజకవి అంటాడు. మరి రాజు కదా, రాజు రత్నహారి, అతనికి దొరకని మధువులుంటాయా?
తాను వ్రాయబోయే గ్రంథాన్నిగురించి ఇలా చెప్పుకొన్నాడు –
చం. రవికులశేఖరుండు కవిరాజశిఖామణి కావ్యకర్త స
త్కవి భువి నన్నెచోడుఁ డటె, కావ్యము దివ్యకథం గుమార సం
భవ మటె, సత్కథాధిపతి భవ్యుఁడు జంగమ మల్లికార్జునుం
డవిచలితార్థ యోగధరుఁ డట్టె, వినం గొనియాడఁ జాలదే(1.57)
సూర్యవంశపు రాజు సత్కవి కవిరాజశిఖామణి నన్నెచోడుడు కావ్యకర్త, మరి కావ్య వస్తువో దివ్యమైన కుమారసంభవ వృత్తాంతము, ఇక కథానాయకుడో భవ్యుడు, అచలిత యోగియైన జంగమ మల్లికార్జునుడు, దీనిని విన్నవారు పొగడకుండ ఉండగలరా? ఈ పద్యమే బహుశా పోతనను పలికెడిది భాగవతమట అనే పద్యాన్ని రాయడానికి ప్రోత్సాహించిందేమో?
జాను తెనుగు
తెలుగు కవిత్వంలో మార్గ కవిత, దేశి కవిత, వస్తు కవిత, జాను తెనుగు అనే పదాలను నన్నెచోడుడు సృష్టించాడు. ఆ పదాల ఉపయోగాన్ని కింద గమనించవచ్చు. మొట్టమొదట మార్గకవిత పుట్టింది, తరువాత చాళుక్యరాజులు దేశికవితను తెలుగులో పుట్టించారు అనే భావంతో ఉన్న పద్యమును చూడండి-
కం. మును మార్గకవిత లోకం
బున వెలయఁగ దేశికవితఁ బుట్టించి తెనుం
గున నిలిపి రంధ్రవిషయం
బునఁ జనఁ జాళుక్యరాజు మొదలుగఁ బలువుర్(1.23)
చం. సరళముగాఁగ భావములు జానుఁదెనుంగున నింపు పెంపుతోఁ
బిరిగొన, వర్ణనల్ ఫణితి పేర్కొన, నర్థము లొత్తగిల్ల, బం
ధురముగఁ బ్రాణముల్ మధు మృదుత్వ రసంబునఁ గందళింప న క్షరములు సూక్తు లార్యులకుఁ గర్ణరసాయనలీలఁ గ్రాలగన్(1.35)
సహజముగా అందముగా పెనవేసికొనిన భావాలతో, అర్థవంతములైన మంచి పదాలతో, మృదు మధుర రసముతో ప్రాణము పోసికొని, మొలకెత్తి బుధజనుల చెవుల కింపుగా జాను తెలుగులో కావ్యం రాస్తానని పై పద్యంలో చెప్పుకొన్నాడు. అంటే తాను వాడే తెలుగు భాష అందరికీ అర్థమయ్యేటట్లు ఉంటుంది అన్నాడు కవి. జాను తెలుగు అంటే అచ్చ తెలుగని అనుకోరాదు.
సీ. మృదురీతి సూక్తు లింపొదవింప మేలిల్లు
భావమ్ము నెలమిఁ బ్రీత్యావహముగ
మెఱుగులఁ గన్నులు మిఱుమిట్లు వోవంగఁ
గాంతి సుధాసూతి కాంతిఁ జెనయ
వర్ణన లెల్లచో వర్ణన కెక్కంగ
రసములు దళుకొత్తి రాలువాఱ
దేశి మార్గంబులు దేశీయములుగా న-
లంకారములఁ దా నలంకరింపఆ. నాదరించి విని సదర్థాతిశయమున
బుధులు నెమ్మనమున నిధులు నిలుప
వలవదే సమస్త వస్తుకవీశ్వర
నూత్న రుచిర కావ్య రత్నవీథి(1.36)
మెత్తని మాటలు ఇంపునీయగా, మంచి భావాలు వికసించి ఆనందం కలిగించగా, మెరుపుతో చీకటి కమ్మిన కనులకు చంద్రుని వెన్నెలవలె కాంతి కలిగించగా, వర్ణనలు అన్నిచోట్ల మెప్పు పొంది నవరసాలు వన్నెతో ప్రవహించగా, దేశి మార్గ రీతులు దేశీయములైన అలంకారాలతో శృంగారించుకొనగా, వస్తువునే ప్రధానముగా నుంచుకొని వ్రాసిన కవిశ్రేష్ఠుల కావ్యాలనే రతనాల వీథిలో పండితులు ఆదరంచి విని తమ మనసులో నిధులని ఎంచుకొనరా ఈ కావ్యాన్ని అన్నాడు ఈ పద్యంలో.
కాని యిక్కడ మార్గకవిత అంటే ఏమిటో, దేశికవిత అంటే ఏమిటో? సంగీత శాస్త్రములో మార్గసంగీతము అంటే శాస్త్రీయ సంగీతమని, దేశి అంటే సామాన్యముగా ప్రజలు పాడుకొనేది అని అభిప్రాయము ఉంది [11]. అలాగే మార్గకవితంటే సంస్కృత కవిత్వమా? దేశికవిత అంటే దేశి ఛందస్సుతో నిండిన తెలుగు కవిత్వమా? కన్నడములో మనకు ఇప్పుడు లభించిన గ్రంథాలలో అతి పురాతనమైనది నృపతుంగుని కవిరాజమార్గము [12]. దానిని కన్నడములో ‘మార్గము’ అనుట వాడుక. ఇది ఒక లక్షణగ్రంథము. మార్గకవిత అంటే కవిరాజమార్గములో చెప్పబడిన రసాలతో కూర్చిన కవిత లాటిదా అనే సందేహం నాకు వస్తుంది. కవిరాజమార్గం కూడా చంపూకావ్యమే. ఇందులో కూడా సంస్కృత, దేశి పద్యాలు ఉన్నాయి. ఇందులో కూడా చిత్రకవిత్వం ఉన్నది. పంపభారతములో కూడా మార్గదేశి కవితల ప్రస్తావన ఉన్నది. వస్తుకవిత అనే పదం నాగవర్మ ఛందోంబుధిలో, పంపకవి భారతములో కూడా వాడబడినది. కవిత వర్ణకము (వర్ణనలతో), వస్తుకము (కథతో) అని రెండు విధాలు. కథాప్రధానమైన కవిత్వము వస్తుకవిత యేమో? తరువాత వస్తుకవితను గురించి రేచన కవిజనాశ్రయములో, విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణిలో ప్రస్తావించారు [9]. వస్తుకవిత అంటే సహజమైన, అకృత్రిమమైన కవిత్వం అని కూడ అనుకోవచ్చు.
సర్వమంగళము
కావ్యాలను శ్రీకారముతో ప్రారంభించుట వాడుక. నన్నయ కూడా భారతాన్ని “శ్రీవాణీగిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు…” అని ప్రారంభించాడు. నన్నయ భారతాన్ని తెలుగులో రాసినా మొదటి పద్యం సంస్కృతములో రాశాడు. కాని నన్నెచోడుడు కుమారసంభవాన్ని కింది తెలుగు పద్యంతోనే ప్రారంభించాడు.
స్ర. శ్రీవాణీంద్రామరేంద్రార్చిత మకుటమణి శ్రేణిధామాంఘ్రిపద్మా
జీవోద్యత్కేసరుండాశ్రిత జనలసితాశేష వస్తుప్రదుం డా
దేవాధీశుండు నిత్యోదితుఁడజుఁడు మహాదేవుఁడాద్యుండు విశ్వై
కావాసుండెప్పుడును మాకభిమతములు ప్రీతాత్ముఁడై యిచ్చుగాఁతన్(1.1)
విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు నమస్కారము చేయగా వారి కిరీటాలలోని మణుల కాంతులు అడుగుదామరల కేసరములవలె ప్రకాశించుచున్నవి. ఆశ్రయించినవారి కోర్కెలను తీర్చువాడు, నిత్యప్రకాశితుడు, పుట్టుక లేనివాడు, ఆది దేవుడు, ఈశ్వరుడు, విశ్వమందంతట ముఖ్యవాసుడు ఐన ఆ దేవాధీశుడు సదా ప్రసన్నుడై మా అభీష్టములను తీర్చుగాక అని అర్థం కుమారసంభవములోని ఈ మొదటి పద్యానికి.
ఇది అతనికి జాను తెనుగుపై గల మమకారాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఒక విషయం తప్పక చెప్పాలి. స్రగ్ధరా వృత్తపు గణాలు – మ-ర-భ-న-య-య-య. ఈ పద్యం “మ-ర” గణాలతో ప్రారంభమయినది, దీనిని మొదటి పద్యముగా చోడుడు రాశాడు, అందువల్ల యుద్ధంలో “మర”ణించాడు అనే ఒక కథ ఉంది. అలా ఒక పద్యాన్ని కూడా అధర్వణాచార్యులు తన ఛందస్సులో రాశాడని [1], అందువలననే తరువాతి కవు లెవ్వరూ స్రగ్ధరను మొదటి పద్యముగా రాయలేదు అని చెబుతారు. కాళిదాసాది కవులు సంస్కృతములో స్రగ్ధరలో దేవుని స్తుతి చేస్తూ మొదటి పద్యం రాశారు. వారెవ్వరూ అకాలమృత్యువు పాలయ్యారని వదంతులు లేవు. నన్నెచోడుడు వృత్తౌచిత్యమును పాటించుటలో అందెవేసిన చేయి. స్రగ్ధర అంటే మాలాధారి అని అర్థము. పెళ్ళికొడుకైన ఈశ్వరుడు మాలాధారియే గదా? పెళ్ళికూతురైన పార్వతి కూడా స్రగ్ధరయే. వారి మంగళోద్వాహాన్నిగురించిన కావ్యం కనుక స్రగ్ధరతో ఆరంభించియుండవచ్చు. కొర్లపాటి శ్రీరామమూర్తిగారేమో మానవల్లి రామకృష్ణకవి తన పేరిలోని మా-రా లను సూచించుటకై మ-ర గణాలతో ఆరంభమయ్యే స్రగ్ధరను ఎన్నుకొన్నారన్నారు [7]. వారి దృష్టిలో నన్నెచోడుడనే కవియే లేడుగా! లోకో భిన్న రుచిః అని అందుకే అంటారు కాబోలు! మంగళాది మాత్రమే కాదు, మంగళ మధ్యమమై, మంగళాంతమై ఉండాలి కావ్యం. అందువలననే నన్నెచోడుడు తన కావ్యాన్ని మంగళమహాశ్రీ వృత్తముతో అంతం చేసినాడు. దీనినిగురించి విపులముగా ఇంకొక వ్యాసములో చర్చిస్తాను.
ఇష్టదేవతాస్తుతి
ఇష్టదేవతాస్తుతిని కూడా ఈ కవియే ప్రారంభించినట్లుంది. నన్నయ ఒక రెండు పదాలలో “హరిహరాజగజాననార్కషడాస్య మాతృసరస్వతీ గిరిసుతాదిక దేవతాతతికిన్ నమస్కృతి సేసి” (ఆది పర్వము – 1.21) భారత రచనకు పూనుకొన్నాడు. నన్నెచోడుడు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పద్యం రాశాడు. అందులో కన్నడ భారతములోని పంపకవివలె [13] మన్మథుని కూడా స్తుతించాడు. ఆ పద్యము
కం. హరుఁ డాదిగ సకల చరా
చరమయ జీవాళి నెల్ల సతతముఁ గామా
తురులుగ వశగతిఁ జేసిన
మరుఁ డీవుత నఖిలవశ్యమతి మత్కృతికిన్(1.9)
చరాచర ప్రపంచములో ఈశ్వరుడు మొదలుకొని ప్రాణికోటి కంతటినీ కామాతురులుగా తన వశం చేసికొన్న ఆ మన్మథుడు నా కావ్యానికి అందరూ వశం చేసికొనే శక్తిని ప్రసాదించుగాక! కావ్యములో మన్మథునికి ఒక ముఖ్య పాత్ర ఉంది. కావున స్మరుని స్మరించడం సబబే కదా! తరువాత కేతన కూడా మన్మథస్తుతి చేశాడు. అంతే కాదు, సూర్యుని కూడా చోడుడు వేడుకొన్నాడు.
షష్ఠ్యంతములు
నన్నెచోడుడు సృష్టించిన మరొక పద్ధతి ఇప్పటిప్పటివరకు కావ్యాలలో కొనసాగింది. అది కథాప్రారంభానికి ముందు షష్ఠ్యాంతాలలో కృతిభర్తను పొగడి కావ్యాన్ని అంకితం చేయడం. దీనినిగురించి [14] నేను సోదాహరణముగా ఈ మధ్య చర్చించియున్నాను. ఇతడు ఆశ్వాసాంత పద్యాలను కూడా విభక్త్యంతముగా వ్రాసినాడు కాబట్టి అవతారికాంతమును కూడా షష్ఠీవిభక్త్యంతముగా వ్రాసియుండవచ్చు. కుమారసంభవమునుండి మచ్చున కొక ఉదాహరణ –
కం. వినుత బ్రహ్మర్షికి, న-
త్యనుపమ సంయమికి, సజ్జనాభరణునకున్,
మనుజాకార మహేశున,
కనుపమ చరితునకు, మల్లికార్జున మునికిన్ (1.66)
నన్నెచోడుడు కుమారసంభవమును తన గురువైన జంగమ మల్లికార్జునకు అంకితం చేసినాడు. అంతే కాకుండా తన గురువునకు, ఈశ్వరునికి అభేద భావాన్ని కల్గించి అతడిని ఈశ్వరునిగా భావించి షష్ఠ్యంతాలను వ్రాసినాడు. అందుకే పై పద్యములో మనుజాకార మహేశునకు అని చెప్పినాడు. మల్లికార్జున మునికి మహేశ్వరునకు అద్వైతత్వమును కవి ఆపాదించాడు. పంపకవి కన్నడములో రాసిన విక్రమార్జునవిజయము అనే నామాంతరముగల భారతములో కూడా ఇలాగే ఉంది [15]. అందులోని నాయకుడైన అర్జునునికి అంకితమిచ్చిన రాజుకు అభేదత్వాన్ని కలిగించి అర్జునుని గుణాలను రాజుకు ఆపాదించాడు పంపకవి. కన్నడములో ప్రావీణ్యము గడించిన చోడునికి ఇది బాగా తెలిసి ఉంటుంది. తరువాతి కాలంలో తిక్కన కూడా నిర్వచనోత్తర రామాయణాన్ని రాజుకి అంకితము చేసి, అందులోని కథానాయకుడైన శ్రీరామునికి, మనుమసిద్ధికీ అభేదత్వాన్ని చూపినది గమనార్హము. నన్నెచోడుడు శివకవియైనా విష్ణుద్వేషి కాడు. బ్రహ్మవిష్ణువులు శివుని అంశములే అని ఈ కవి తలంపు. ఈ కవికి ఎక్కడ చూచినా శివుడే కనిపిస్తాడు. మన్మథుడు మామిడిచెట్టును చూచి శివుడని భ్రమించిన తీరును గమనించండి.
సీ. పలకెడు కారాకు లలితాస్థి చయముగా,
సోలు కొమ్మలు పలు కేలుగాఁగ,
బాల పల్లవములు వ్రేలు కెంజడలుగా,
పెనఁగు తీఁగలు దొడ్డ ఫణులు గాఁగఁ,
గలకంఠ నికరంబు గళమునఁ గప్పుగాఁ,
బుప్పొడి మేన విభూతి గాఁగ,
ఫలములు వరదాన ఫలములుగా, నలి
మాలికల్ రుద్రాక్ష మాలికలుగ,ఆ. శంభుమూర్తిఁ దాల్చి సహకార భూరుహ
చక్రవర్తి నవవసంతవేళ
నతిశయిల్లుచుండె నక్కడఁ గని మది
నుదరిపడి మనోజుఁ డోసరింప (4.101)
రంగులు మారే పండుటాకులు ఎముకల ప్రోవును తలపించిందట, వాలే కొమ్మలు ఎన్నో చేతులవలె ఉండినవట, తలిరాకులు వేలాడే ఎర్రటి జడలవలె తోచిందట, కోకిలల గుంపు కంఠమునందలి మచ్చవలె కనబడిందట, పుప్పొడి వీబూదివలె తేలియాడిందట, పండ్లు దానఫలములవలె ఆకారాన్ని దాల్చాయట, తుమ్మెదల బారు రుద్రాక్షమాలికలవలె కనబడిందట, ఆ వసంతకాలములో శివుని రూపాన్ని దాల్చినట్లుండిన మామిడిచెట్టును చూచి శివుని జయించాలని బయలుదేరిన మన్మథుడు బెదిరిపడ్డాడట.
ఆశ్వాసాంత పద్యాలు
కావ్యాలలో సామాన్యముగా ఆశ్వాసాంత పద్యాలు సంబోధన రూపములో ఉంటుంది. నన్నయ సభాపర్వాంతములో రాసిన రాజరాజనరేంద్రుని ఉద్దేశించి రాసిన పద్యము –
ఉత్సాహ. రాజవంశవార్ధిచంద్ర, రాజదేవ, నిత్యల
క్ష్మీజయాభిరామ, ధర్మమిత్త్ర, విద్వదం
భోజవనపయోజమిత్త్ర, భూరి కీర్తి కౌముదీ,
రాజితత్రిలోక నిఖిలరాజ, నిత్యపూజితా!
– నన్నయభట్టు, సభాపర్వము (2.322)
కాని నన్నెచోడుని ఆశ్వాసాంత పద్యాలు విభక్తులతో అంతమవుతాయి [16]. అట్టి పద్యాలకు ఒక ఉదాహరణ –
వనమయూరము. మేరునగధీరు, నిరమిత్రు, సుచరిత్రున్,
వారిధిగభీరు, నిరవద్యు, జనవంద్యున్,
జారుతరమూర్తి, నతిశాంతు, గుణవంతున్,
మారహరు, సర్వజనమాన్యు, మునిమాన్యున్. (3.113)
మేరుపర్వతము బోలు ధైర్యవంతుని, శత్రువులు లేనివానిని, విమల చరిత్రుని, సముద్రమువలె లోతైన వానిని, అనింద్యుని, జనవంద్యుని, అందమైనవానిని, శాంత స్వభావుని, గుణవంతుని, మన్మథవిజేతను, జనులందరిచే గౌరవించబడువానిని, మునులచే మాన్యుడైన మల్లికార్జునుని అభినందింస్తున్నాడు కవి యిక్కడ.
కుమారసంభవ కథ
కావ్య కథనాన్నిగురించి నన్నెచోడుడే అవతారికలో ఇలా చెప్పాడు-
మ. సతి జన్మంబున్ గణాధీశ్వరు జననము దక్షక్రతు ధ్వంసముం బా
ర్వతి జన్మంబున్ భవోగ్రవ్రతచరితయు దేవద్విషత్ క్షోభమున్ శ్రీ
సుత సంహారమ్ము భూభృత్సుత తపము నుమాసుందరోద్వాహమున్ ద
ద్రతిభోగంబుం గుమారోదయము నతఁడరిం దారకుఁబోర గెల్వున్(1.68)
సతీదేవి జన్మము, గజముఖుని పుట్టుక, దక్షుని యాగము దాని వినాశనము, పార్వతి పుట్టుక, ఈశ్వరుని ఘోర తపస్సు, తారకాసురుని దారుణ చర్యలు, కామదహనము, పార్వతి తపస్సు, వారి పెళ్ళి, ఆదిదంపతుల కామకేళి, కుమారసంభవము, తారకాసుర సంహారము అనే పన్నెండు అంశాలు ఈ కావ్యములోని పన్నెండు ఆశ్వాసాలలో కథాభాగములు. ఈ కథలో కొన్ని చమక్కులు ఉన్నాయి. నన్నెచోడుని కుమారసంభవము కాళిదాసుని కుమారసంభవమునకు అనువాదము కాదు. ఇది స్వతంత్ర కావ్యము. ఇతని కుమారసంభవము ఉద్భటుని కుమారసంభవముపైన ఆధారపడినది. ఇందులోని కథ తమిళదేశములో వ్యాప్తిలో ఉండే కథ. ఇందులోని వినాయకుడు పార్వతి పిండిబొమ్మకు ప్రాణాలు పోసిన చిన్నవాడు కాడు. సతిపతుల వనవిహారములో ఏనుగుల సంభోగాన్ని చూచిన దాక్షాయణికి తాము కూడ పెనవేసికొన్న ఏనుగులలా సరసులో ఆనందిస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. దాని ఫలితమే గజముఖుని జననము. ఈ ఘట్టాన్ని అతి సుందరముగా మత్తేభవిక్రీడితవృత్తములో ముద్రాలంకారముతో నన్నెచోడుడు వ్రాసిన తీరును గమనించండి –
మ. హృదయాహ్లాదముతోడఁ బాయక సదా నైక ప్రకారంబులన్
మదనాసక్తిఁ బెనంగుచున్న విలసన్మత్తేభవిక్రీడితం
బది దాక్షాయణి సూచి కౌతుకరతైకా లీన భావాభిలా
షదృగత్యుజ్జ్వల దీధితుల్ నెఱపె నీశాననాబ్జంబుపైన్(1.101)
షణ్ముఖుని జననవృత్తాంతము కూడా ఇందులో చిత్రముగా వివరించబడినది. అగ్నిదేవుడు శివుని చూడ వచ్చాడు. ఆ సమయంలో ఈశ్వరుడు, పార్వతి కామక్రీడలో నున్నారు. చెప్పకుండా, చేయకుండా అలా వచ్చిన అగ్నిపైన శివుడు తన వీర్యాన్ని చల్లుతాడు. అగ్ని దాని మంటకు తాళజాలక బ్రహ్మ సలహా ప్రకారము శరవణసరసికి వస్తాడు. అక్కడ సప్తఋషుల భార్యలు నగ్నంగా జలక్రీడ చేస్తున్నారు. వారిని చూచి అగ్ని కామాతురుడయ్యాడు. అగ్నిని చూచిన తక్షణం అరుంధతి బట్టలు కట్టుకొంటుంది. కాని మిగిలినవారు అగ్నితో తృప్తి పొందుతారు. ఆ సమయంలో శివుని వీర్యం వారి గర్భములలోకి ప్రవేశిస్తుంది. ఈ ఆరుగురు భయంతో, అవమానంతో తమ గర్భపిండాలను ఆ శరవణసరసిలో తామరాకులలో వదలి ఇంటికి వెళ్తారు. వారి పతులు వారిని తిరస్కరించగా బ్రహ్మ శివుని వీర్యాన్ని మోసినందులకై జ్యోతిర్లోకములో కృత్తికలుగా ప్రకాశించమని వారికి వరం అనుగ్రహిస్తాడు. శరవణసరసిలోని ఆరు పిండాలు ఒక్కటై షణ్ముఖరూపాన్ని దాల్చి పుట్టుతుంది. అలా జరుగుతుంది కుమారస్వామి జననము.
కుమారుని జననాన్ని వర్ణిస్తూ చోడుడు రాసిన ఉత్సాహవృత్తాన్ని వ్యాసారంభములో మీకు తెలియజేశాను. ఇలా కుమారసంభవకథ అతి నూతనమైనది, విలక్షణమైనది. కాళిదాసు కుమారసంభవములోని కుమారుడు నేరుగా శివునికి, పార్వతికి పుట్టినవాడు, కాని నన్నెచోడుని కుమారుని తలిదండ్రులు ఎవరు? శివుని వీర్యమువల్ల పుట్టాడు కాబట్టి శివుడు తండ్రియా, లేక వీర్యాన్ని మోసిన అగ్ని తండ్రియా? అదే విధముగా కృత్తికలుగా మారిన ఋషిపత్నులు తల్లులా, లేక వీర్యానికి దోహదమైన పార్వతియా? వీటిపైన పుస్తకాలనే రాశారు [17]. గీతలో కృష్ణుడు సేనానినామహం స్కందః (భగవద్గీత, 10.24) అని అంటాడు. కుమారస్వామి హిందూదేవతలలో ఒక ముఖ్య దైవము, తమిళనాడులో స్కందునికి గుడులు, పండుగలు, వ్రతాలు మున్నగునవి సర్వసామాన్యము.
కుమారసంభవకావ్యము ఛందోరీతిగా అత్యుత్తమమైన గ్రంథము. అందులోని కొన్ని విశేషాలను క్లుప్తముగా ఇక్కడ తెలియబరుస్తాను. ఇంతకు ముందే నన్నెచోడుని కొత్త పంథాగురించి చెప్పాను. కావ్యారంభములో షష్ఠ్యంతాలను వ్రాయడం తెలుగు సాహిత్యానికి నన్నెచోడుడు ప్రసాదించిన ఒక గొప్ప కానుక. అలాగే మంగళమహాశ్రీవృత్తముతో కావ్యాన్ని అంతము చేయడం.
ఛందోవిశేషాలు -వృత్తౌచిత్యము
వృత్తౌచిత్యాన్ని పాటించడములో నన్నెచోడునిలాటి కవి లేడంటే అది అతిశయోక్తి కాదు. మూడింటికి ఒకటికన్న ఎక్కువగా కందపద్యాన్ని ఈ కావ్యంలో మనము చదువవచ్చు. పన్నెండు గీతులలో ఆర్యాగీతి ఒకటి. దానినే కందముగా కన్నడ, తెలుగు సాహిత్యాలలో స్వీకరించారు. కందము ప్రాకృతములోని స్ఖంధ అ నుండి పుట్టినది. కుమారసంభవము స్కందుని చరిత్ర. స్కందుని ద్రావిడభాషలో కందన్ అంటారు. మూడు భాషలను ఎరిగిన చోడుడు అందుకేనేమో ఈ సార్థకనామ పద్యాన్ని ఈ కావ్యంలో వాడాడు. పార్వతి ఆర్య కనుక ఆర్యాగీతిని వాడాడు అంటారు మరికొందరు [8]. దీనికి నిదర్శనముగా పార్వతి సౌందర్యాన్ని వర్ణిస్తూ వరుసగా 31 కందపద్యాలు మనకు ఈ కావ్యంలో కనబడుతాయి. కందాన్ని అల్లడములో అతని కౌశల్యము అపారము. ఉదాహరణకు రెండు మూడు కందపద్యాలను ఇక్కడ ఉదహరిస్తాను.
కం. తన జనకుఁడురు స్థాణువు,
జనని యపర్ణాఖ్య, దా విశాఖుండనఁగాఁ
దనరియు నభిమతఫలముల
జనులకు దయ నొసఁగుచుండు షణ్ముఖుఁ గొలుతున్ (1.8)
తండ్రి పెద్ద మోడు, తల్లి ఆకులు లేనిది, తానో కొమ్మలు లేనివాడు. అలా కోరికలను తీర్చెడివాడైన ఆరుముగములవానిని పూజిస్తున్నాను. మోడైన చెట్టుకు, ఆకులు లేని చెట్టుకు పుట్టిన కొమ్మలులేని చెట్టు అభీష్టములను తీర్చే కల్పవృక్షమట. ఇక్కడ స్థాణువు అంటే శివుడు, అపర్ణ అంటే పార్వతి, విశాఖుడు అంటే కుమారస్వామి. ఇలా శ్లేష, విరోధాభాస అలంకారాలను వాడాడు చోడకవి.
కం. గిరిసుత మై కామాగ్నియు
హరుమై రోషాగ్నియుం దదంగజుమై ను-
ద్ధుర కాలాగ్నియు రతిమై
యురు శోకాగ్నియును దగిలి యొక్కట నెగసెన్ (5.52)
పొరలు పొరలుగా భావాలు ఈనాటి కవిత్వములోనే కాదు, ఆనాటి కవిత్వములో కూడ ఉన్నవి. ఇక్కడ నాలుగు పాదాలలో నలుగురికి నాలుగు విధాలైన అగ్గి. మన్మథుని ప్రభావమువల్ల పార్వతి దేహము కామాగ్నితో కందిపోతుంది. ఇక పోతే శివుడి దేహము భావాతీతుడైన తన్ను కూడ తికమకలు పెట్టించిన మన్మథునిపైని రోషాగ్నితో రేగిపోతుంది. ముక్కంటి మూడవ కన్ను తెరిచాడు. కాలుని అగ్నితో మదనునికి కాలము నిండింది. దీనినంతా చూస్తున్న రతి దేహము శోకాగ్నితో కంపించింది. ఈ నాలుగు అగ్నిశిఖలు కలిసి ఒక్కటై పైకి లేచినవంట.
కం. జలవాసులైన హరి ల-
క్ష్ములు వర్షనిశావసానమున మేల్కని క
న్నులు విచ్చి చూచినట్టులు
జలజోత్పల రుచులు వెలసె శారదవేళన్ (6.113)
దీని అర్థము – శరత్కాలములో తామరలు, కలువలు అప్పుడే వర్షాకాలము అనే రాత్రికాలపు యోగనిద్రనుండి లేచిన జలవాసులైన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కన్నులవలె ఉన్నాయట. ఇది నా దృష్టిలో ఒక గొప్ప పద్యము. ఎందుకంటే, సామాన్యముగా మనము పద్మాక్షుడు, ఇందీవరలోచన అనే పదాలను వాడుతూ ఉంటాము. అనగా ఆ పూల అందాన్ని, సాదృశ్యాన్ని కన్నులకు ఆపాదిస్తాము. కాని ఇక్కడ దానికి విలోమముగా ఉన్నది కవి భావన. కళ్ళు పూలలా లేవు. పూలే కళ్ళలా ఉన్నాయట.
నన్నెచోడుడు వ్రాసిన లయగ్రాహి, లయహారిణులు కూడా వృత్తౌచిత్యములో తీసిపోవు. లయనిలయుడైన ఆ నటసార్వభౌముని స్తుతికి ఈ వృత్తాలు ఉచితమైనవే కదా! కింద అట్టి లయగ్రాహి ఒకటి –
ల. తాళరుతి గీతిరుతి మేలి తత వాద్యరుతి చాల రసవంతమయి యోలి నులియం, ద
త్తాలగతి మెట్టుచును గేలఁ జరు లిచ్చుచును జాలి యనురాగమునఁ గ్రాలుచు సుఖాబ్ధిం
దేలుచును మై మఱచి వ్రాలుచును గెత్తుచును లోలగతి నేత్ర భుజ చాలనతోఁ బ్రే
తాలయమునందు సుఖలీల నెఱసంజ ననుకూలగతి నాడు శివు శూలి నుతియింతున్ (2.101)
తాళధ్వనులు, గీతధ్వనులు, శ్రేష్ఠమైన వాద్యనాదములు, ఎంతో రసవంతముగా ధ్వనించుచుండగా, ఆ తాళగతి కనుగుణముగా ఆడుచు, చేతులతో చప్పట్లు చేస్తూ కరుణతో, ప్రేమతో పొంగిపోతూ, ఆనందసముద్రములో ఒడలు మరచి సోలుచూ, గంతులు వేస్తూ, చలిస్తున్న కన్నులతో, భుజాలతో స్మశానములో నిండు సంజలో అనువుగా నాట్యము చేసే ఆ శివుని శూలధారిని పొగడుతాను అన్నాడు కవి యిక్కడ. సంగీతమునుగురించి, నాట్యాన్నిగురించి చోడునికి గల ప్రావీణ్యత ఈ పద్యములో విదితమైనది.
చాలా చోటులలో తరువోజను తరుపద అని నన్నెచోడుడు పేర్కొంటాడు. తరువోజ స్త్రీల దంపుళ్ళ పాట అని భావన. దంచడానికి వాడే రోకలి చెట్టు కొయ్యతో చేసిందే కదా. అది తరువైతే, రోకళ్ళ పాట తరుపదమవుతుంది గదా! అందుకే చోడుడు తరువోజను తరుపదమని పిలిచాడని నా ఊహ. కొన్ని తరువోజలు ప్రత్యేకముగా స్త్రీల కోసం కేటాయించబడి నట్లున్నాయి. అట్టి దొకదానిని కింద చదవండి. కామదహనం పిదప రతీదేవి శోకాన్ని కాళిదాసు వియోగినీవృత్తములో [18] ఒక సంపూర్ణ ఆశ్వాసములో విశ్లేషించాడు. నన్నెచోడుడు ఒక చిన్న తరువోజలో ఆ శోక సంఘటన జరిగిన వెంటనే రతి స్పందించిన విధాన్ని చెబుతాడు.
తరు. కాయజుఁ డా యగ్నిఁ గాలెనొ నెఱయఁ గాలంగ నెడ యెద్ది? కడు భీతిఁ
బాఱి పోయెనో? ననుఁ బెట్టి పోవునే? కడచి పోయిన నీ భస్మపుంజ మెక్కడిది?
మాయయో యిది? యని మది యఱఁ బొదల మ్రాకుల చెట్టుల మఱుపునఁ గలయ
నా యింతి భ్రమగొని యడలడి సంశయాకులచిత్తయై యాత్మేశు రోసె (5.61)
శివుడు మూడవ కన్ను తెరిచాడు, ఆ అగ్గిలో మన్మథుడు బుగ్గి అయినాడు, మిగిలిందల్లా అతడుండిన చోట ఒక బూడిద కుప్ప మాత్రమే. అది ఒక క్షణం ముందు అతడు అక్కడ ఉన్నాడన్న విషయానికి గుర్తు. మన్మథుని భార్య రతి అక్కడికి వచ్చింది. కాయజుడు అగ్నిలో కాలిపోయాడా అని తన్ను తానే ప్రశ్నించుకొన్నది. అయితే అలా ఒక్క క్షణంలో కాలిపోవడానికి అవకాశం ఉందా? ఒక వేళ భయపడి పారిపోయాడేమో? అలా ఎన్నటికీ జరుగదు, నన్ను వదలి తాను వెళ్ళిపోతాడా, అది అసంభవం. అలా వెళ్ళిపోతే ఇక్కడ ఉండే ఈ బూడిద కుప్ప మరెవరిది? ఒక వేళ ఇదంతా తన కళ్ళ ముందర జరుగుతుండే ఒక మాయ యేమో? అలా ఎన్నో ఆలోచనలతో పొదలను, చెట్లను కలయ జూడసాగింది. ఆమె భ్రాంతి, దుఁఖము, సందేహము మున్నగు వివిధ భావాలతో సతమమవుతూ తన ప్రాణనాథుడైన మన్మథుని మరణాన్ని తలచి చింతిస్తుంది.
ఛందోవిశేషాలు – ముద్రాలంకారం
పద్యపు పేరు పద్యములో దొరలితే దానిని ముద్రాలంకారము అంటారు. సామాన్యముగా ఛందోగ్రంథాలలో వృత్తపు ఉదాహరణ పద్యాలలో ఈ ముద్రాలంకారము కనబడుతుంది. దీనిని పంపాది కన్నడ కవులు విరివిగా వాడారు. పంపభారతమునుండి ఒక ఉదాహరణ (13)
మ. బక కిమ్మీర జటాసురోద్ధత జరాసంధర్కళం సంద కీ
చకరం నూర్వరుమం పడల్వడిసిదీ, త్వచ్చండ దోర్దండ ము
గ్ర కురుక్ష్మాపమహీరుహప్రకరమం మత్తేభవిక్రీడిత
క్కె కరం పోల్వెగె వందు భీమ రణదొళ్ నుర్గాడదేం పోకుమే
– పంపకవి, విక్రమార్జునవిజయం, 9.25
బకుడు, కిమ్మీరుడు, జటాసురుడు, జరాసంధుడు, కీచకుడు మున్నగు నూరుగురిని పోరిలో నేల గూల్చిన భయంకరమైన నీ భుజదండాలు ఉగ్రులైన కురురాజులనే చెట్టులతో ఏనుగులలా యుద్ధభూమిలో ఆటాడుకొనకుండా ఉంటుందా అని అర్థం దీనికి. కన్నడ సంప్రదాయాన్ని అనుసరించిన చోడుడు కూడా ముద్రాలంకారాన్ని మరువలేదు. నేను ఇంతకు ముందే ముద్రాలంకారాలతో కూడిన ఉత్సాహ మత్తేభవిక్రీడిత పద్యాలను తెలిపాను. ఇప్పుడు మరి కొన్ని –
మ.కో. మెత్త మెత్తన క్రాలు దీవు సమీరణుండ, మనోభవుం
డెత్తకుండఁగ వేగకూడఁగ నెత్తు, మెత్తక తక్కినన్
జత్తు సుమ్ము వసంతుచే నని చాటునట్లు చెలంగె నా
మత్తకోకిల లారమిం గడు మాసరంబగు నామనిన్ (4.108)
అందమైన ఆమనివేళలో ఆ తోటలోని మత్తకోకిలలు “ఓ పవనమా, నీవేమో మెల్లమెల్లగా వీస్తున్నావు. మన్మథుడు నీపై దండయాత్ర చేయకముందు నీవే త్వరగా వానిపై దండెత్తు, అలా చేయకపోతే వసంతుడు నిన్ను చంపుతాడు, జాగ్రత్త సుమా” అని హెచ్చరించేటట్లు ధ్వనులు చేశాయట.
స్వా. ఆ గిరీంద్రసుత హర్షముతో శై
వాగమోదిత విధాయతితో సు
స్వాగతాభిమత వాక్యములం ద
భ్యాగతోచిత సపర్యలఁ దన్సెన్(7.5)
పార్వతీదేవి శైవాగమములు విధించిన తీరుగా సంతోషముతో సుస్వాగత వాక్యాలను పలికి అతిథులకు చేయవలసిన మర్యాదలను చేసి తృప్తి పొందింది. ఇందులోని కడపటి పదమును తనిసెన్ బదులు తన్సెన్ అని వాడాడు కవి. ఇట్టి ప్రయోగములు ఈ కావ్యములో కొల్లలు.
చం. జలజము సావి కోకములు షట్పదముల్ పఱతెంచి తద్దయున్
నలి వినుతాస్యమండలము నాసికయున్ శశిబింబ చంపకం
బులు సవి డాయనొల్ల కతి మోహమునం బెడఁబాయనోప కా
కులమతి నున్న భంగిఁ గుచకుంతలవక్త్రము లొప్పు గౌరికిన్ (8.8)
చక్రవాక పక్షులకు వెన్నెల అంటే అయిష్టం. అదే విధంగా తుమ్మెదలకు సంపంగి పూలు పడవట. కానీ ఈ రెంటికీ తామరపూలు ప్రియమైనవి. పార్వతి ముఖాన్ని దూరంనుండి చూచి పద్మమని భ్రమించి అవి ఆమె దగ్గరకు చేరుతాయి. తీరా దగ్గరకు వచ్చిన తరువాత ఆమె ముఖకాంతి వెన్నెలను జ్ఞప్తికి తెస్తుంది చక్రవాకాలకు, ఆమె ముక్కు చంపకాన్ని జ్ఞప్తికి తెస్తుంది తుమ్మెదలకు. పద్మమని వెళ్దామా లేక వెన్నెల, సంపంగి అని దూరముందామా అనే భ్రమలో పడ్డాయి అవి. అట్టి సుందరమైన ముఖము, వెండ్రుకలు, స్తనాలు ఉన్నాయి గౌరికి. పార్వతి ముఖం వెన్నెలలా, కేశాలు నల్లని తుమ్మెదలలా, కుచాలు చక్రవాకములలా ఉన్నాయని దీని ఐతిహ్యము. సంపంగి ముక్కుపైన ప్రసిద్ధమైన పద్యం “నానాసూన వితాన వాసనల సారంగ మేలా నన్నొల్లదటంచు …” శతాబ్దాల తరువాత వ్రాయబడినది. నన్నెచోడుడు మానిని, మణిగణనికర వృత్తాలను కూడా ముద్రాలంకారముతో వ్రాసినాడు.
ఛందోవిశేషాలు – నెఱసున్నగా మారిన అరసున్న
నన్నెచోడుని కొన్ని పద్యాలలో మరొక ప్రత్యేకత ఉన్నది. అదేమంటే దీర్ఘము మీది అరసున్నను నిండుసున్న చేయడం. ఈ పద్ధతి ఇప్పుడు కూడా తమిళ దేశంలో తెలుగు మాట్లాడేవారిలో ఉంది [19]. కోతిని కోంతి అని, మూతిని మూంతి అని, చీకిలిని చీంకిలి అని అక్కడ వినడం సామాన్యం. పూర్వకాలంలో అరసున్నను, నిండు సున్నను రెంటినీ నిండు సున్నగా రాసేవారు (శిలాశాసనాలపై చెక్కేవారు). ఈ రెండిటికీ మధ్య ఉండే తేడా దాని తరువాత వచ్చే హల్లును రాసే పద్ధతిలో తెలుపుతారు. కోతిని కోంతి అని సంతసమును సంత్తసము అని రాసేవారు ఆ కాలంలో. నాచన సోముడు కూడా ఇలాటి ప్రయోగాలు చేశాడట. ఈ గుణముతో ఉండే చోడుని ఒక పద్యము –
కం. పోండిగ నగజ తపశ్శిఖి
మూండు జగంబులను దీవ్రముగఁ బర్వినఁ బ్ర
హ్మాండము గాఁచిన కాంచన
భాండము క్రియఁ దాల్చెఁ దత్ప్రభాసితమై(6.157)
పార్వతి తపస్సు అనే అగ్ని మూడు లోకాలలో ఒప్పిదముగా వ్యాపించగా, ఆ నిప్పు జ్వాలతో ఆకాశం ఒక బంగారు కుండలా ప్రకాశించిందట. పోఁడి, మూఁడు అనే పదాలను పోండి, మూండు అని వ్రాసి ప్రాసను చెల్లించాడు కవి ఈ పద్యములో.
ఛందోవిశేషాలు – చిత్రకవిత్వం
నన్నెచోడుని తెలుగులో చిత్రకవిత్వానికి పితామహుడని చెప్పవచ్చు. గర్భ కవిత్వాలు, బంధ కవిత్వాలు, మున్నగు వాటిని కుమారసంభవములో చూడ వీలవుతుంది. ఒకే కంద పద్యంలో ఎన్నో కందపద్యాల లక్షణాలు ఉండేటట్లు వ్రాయవచ్చు. ఒకప్పుడు ఛందస్సు, రచ్చబండ గుంపులలో నేను ఇట్టి ద్వాదశకందమును చర్చించాను [20]. నన్నెచోడుని చతుర్విధ కందాన్ని కింద ఇస్తున్నాను. ఇందులోని నాలుగు కందాలు ముద్దగా ఉండే అక్షరాలతో ప్రారంభమవుతాయి.
కం. సుజ్ఞానయోగతత్త్వ వి-
ధిజ్ఞులు భవ బంధనములఁ ద్రెంచుచు భువిలో
నజ్ఞానపదముఁ బొందక
ప్రాజ్ఞులు శివుఁ గొల్తు రచల భావనఁ దవులన్(12.217)
మంచి జ్ఞానము, యోగము, తత్వము తెలిసినవారు, జీవితంలోని బంధాలను తెంచివేసి అజ్ఞానములో లీనమవక ఏకైక దీక్షతో శివుని పూజిస్తారు అని దీనికి అర్థం.
చంపకమాలలో కూడా కందాన్ని గర్భితము చేయడానికి వీలవుతుంది. ఇట్టి చంపకమాల ఒకటి ఈ కావ్యములో ఉన్నది (12.219). సర్వలఘుకందము కూడా ఒకటుంది ఈ కావ్యంలో.
కం. తగుఁదగదని మనమున మును
వగవగ నొడఁబడఁగ వగవ వగవఁగ బడయున్
దగుఁ దగదని వగవనివగ
వగవగఁ బనిగలదె తనకు వగ మఱి జగతిన్(10.187)
ఒక పని చేయడానికి ముందు మంచిదా చెడ్డదా అని ఆలోచించాలి. అలా చేయకుండా పని చేస్తే అది తనకు, ప్రపంచానికి దుఃఖాన్ని కలిగిస్తుంది అని దీని భావం. ఇలాటి సర్వలఘు (పాదాంతపు గురువు తప్ప) కందమొకటి పోతన భాగవతములో కూడా ఉంది (అడిగెదనని కడు వడి …, భాగవతము 8.103). బహుశా నన్నెచోడుని పై పద్యం పోతనకు స్ఫూర్తి నిచ్చిందేమో?
ఇతడు గోమూత్రికా చక్ర బంధాలతో కూడా పద్యాలను వ్రాసినాడు. గోమూత్రికా బంధ పద్యములో ఒకటి విడిచి మరొక అక్షరము మొదటి రెండు, చివరి రెండు పాదాలకు సమానముగా ఉంటుంది.
కం. స్థిరమతి శుభసితమూర్తీ
వర సురవర దనుజ దురితవనధి సుకీర్తీ
హరదతి శుభయుతమూర్తీ
స్మర పురహర తనుభిదురిత జనన సుకీర్తీ (10.85)
స్థిరమతీ, శుభమైన తెల్లని ఆకారముగలవాడా, సురాసురుల పాపసముద్రాన్ని ఇంకింప జేయువాడా, పాపాలను హరించే మంగళకరమయిన ఆకారము గలవాడా, మన్మథుని, త్రిపురాలను భేదించిన వజ్రాయుధమువంటి దేహముగలవాడా అని ఈశ్వరుని సంబోధిస్తున్నాడు కవి ఈ పద్యములో.
పద్యార్ధ యమకాలంకారాన్ని కూడా కింది కంద పద్యములో మనము చూడవచ్చు. ఇందులో మొదటి రెండు పాదాలు చివరి రెండు పాదాలు ఒక్కటే. కాని అర్థాలు వేరు. సంధిగతముగా యమకాన్ని, శ్లేషను అతి చమత్కారముగా తరువాతి కాలములో చేమకూర వేంకటకవి విజయవిలాసములో వాడాడు.
కం. తానేలవచ్చు భూపతి
మానవపతి చరిత నీతిమార్గంబైనన్
తానేలవచ్చు భూపతి
మానవపతి చరిత నీతిమార్గంబైనన్ (10.181)
రాజు నీతిమార్గములో నడిస్తే అతడు భూసతిని పాలించవచ్చు. కాని అతని నడవడిక ఈతి మార్గమైనచో ఆ భూసతి అతడిని ఎందుకు సమీపిస్తుంది అని వ్యంగ్యముగా సూచించాడు కవి ఈ పద్యములో.
దశకం శతకానికి మార్గదర్శియా?
తెలుగు సాహిత్యములో శతకాలు సుప్రసిద్ధమయినవి. శతకవాఙ్మయానికి నాందీగీతం పాడినది నన్నెచోడుడేమో? కుమారసంభవములో దారిద్ర్యవిద్రావణా అనే మకుటముతో ఒక దశకము (పది పద్యాలు 10.90-10.99) ఉన్నది. అందులోని మొదటి పద్యము –
శా. శ్రీరామేశ కవీశ్వరాదు లెద నీ శ్రీపాదముల్ భక్తితో
నారాధించి సమస్తలోకసముదాయాధీశు లైరన్న సం
సారుల్ దుఃఖనివారణార్థ మభవున్ సర్వేశు లోకత్రయా
ధారున్ నిన్ మదిఁ గొల్వకుంకి యుఱవే దారిద్ర్యవిద్రావణా! (10.90)
దారిద్ర్యాన్ని దూరం చేయువాడా, ఓ మహేశ్వరా, విష్ణువు, బ్రహ్మ మున్నగువారు హృదయములో నీ దివ్యమైన పాదాలను సేవించి లోకాల కన్నిటికి ప్రభువు లయ్యారు. సామాన్యులైన సంసారులు వారి వెతలను తీర్చుకొనడానికై అభవుడు, సర్వేశ్వరుడు, మూడు లోకలకు ఆధారభూతుడైన నిన్ను మనసులో స్మరించకుండుట సరి యౌనా అని దీనికి అర్థం. ఈ బాణిలో ధూర్జటివంటి కవుల పద్యాలు అందరికీ తెలిసిన విషయమే. ఈ పద్యములోని శ్రీరామేశకవి అను నతడు బహుశా చోడుని సమకాలీకుడై ఉంటాడని కొందరి అభిప్రాయం.
ముగింపు
నన్నెచోడుని కాలంపై ఇంకా వాదోపవాదాలు జరుగుతున్నా, ఒక విషయం మాత్రం నిజం. ఈ కవి తెలుగు సాహిత్యపు ప్రారంభ దశలో జీవించాడు. ఛందఃపరంగా ఇతని కాల నిర్ణయాన్ని చేయడానికి వీలవుతుందా అనే సంగతిని రాబోయే వ్యాసంలో మీకు వివరిస్తాను. నన్నెచోడుడు ఆంధ్రభాషలోని ఆదికవులలో ఒకడు మాత్రమే కాదు. ఇతడు ఒక యుగపురుషుడు కూడా. ఎన్నో కొత్త కొత్త అందాలను తెలుగు కవిత్వానికి పరిచయం చేశాడు. అందులో కొన్ని – ప్రబంధరచనా ప్రణాళిక, అష్టాదశ వర్ణనలు, తెలుగు పద్యంతో కావ్యాన్ని మొదలు పెట్టడం, కావ్యాంతాన్ని మంగళం చేయడానికోసం మంగళమహాశ్రీ వృత్తాన్ని ఉపయోగించడం, కథారంభానికి ముందు కృతిభర్తను ఉద్దేశించి షష్ఠ్యంతాలు వ్రాయడం, ఆశ్వాసాంతంలోని పద్యాలను విభక్త్యంతముగా చేయడం, వాడుకలో ఉండే తెలుగు నుడికారాన్ని విరివిగా జానుతెనుగు రూపంలో వాడడం, మన్మథునితో కూడా సర్వదేవతలను ప్రత్యేక పద్యాలతో స్తుతించడం, కృతిభర్తకు, కథానాయకునికి ఏకత్వం ప్రతిపాదించడం, స్వతంత్రంగా కావ్యకథనాన్ని నడపడం, తగిన సమయాలలో తగినట్లు పద్యాలను రాసి వృత్తౌచిత్యం, ముద్రాలంకారం పాటించడం, గర్భకవిత్వం, బంధకవిత్వం కావ్యంలో ఒక భాగం చేయడం, శతకవాఙ్మయానికి నాందీవాక్యం పలకడం, ఇత్యాదులు.
ఆ అజ్ఞాత కాలం తెలుగు సాహిత్యానికి వసంతఋతువు లాటిది. అందువల్ల ఈ వ్యాసాన్ని అట్టిదే ఒక పద్యంతో అంతం చేయడం సముచితమే. అందంగా మొగ్గలు, పువ్వులు సంపంగి చెట్లలో చాలా ప్రకాశవంతముగా ఆరిపోని ఒక దీపవృక్షములా వెలిగిపోతుందట ఆ వసంతకాలము. అలాగే నన్నెచోడుని ప్రథమాంధ్రప్రబంధకావ్యము కూడా సదా కాంతిప్రసూనాలను వెదజల్లే దేదీప్యమానమైన దివ్వెల తరువులా వెలిగిపోతూ, హృదయానికీ మేధస్సుకు ఆనందాన్ని కలిగించనీ!
కం. నలి మొగ్గలు విరిపువ్వులు
సలలితమయి చూడనొప్పెఁ జనుపక మత్యు-
జ్జ్వలరుచి రేవగ లాఱక
వెలిగెడు నుద్దీప దీపవృక్షమువోలెన్(4.93)
గ్రంథసూచి
- జొన్నలగడ్డ మృత్యుంజయరావు, కుమారసంభవము, ప్రథమ భాగము, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు, 1994. (అధర్వణ ఛందస్సునుండి మగణమ్ముఁ గదియ రగణము …, పుట 3).
- జొన్నలగడ్డ మృత్యుంజయరావు, కుమారసంభవము, ద్వితీయ భాగము, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు, 1998.
(ఈ వ్యాసములో నేను ఉదహరించిన పద్యాలన్నీ పై రెండు పుస్తకాలలోనివి. మొదటి భాగములో రావుగారు రసవత్తరమైన విషయాలతో దీర్ఘమైన పీఠిక నొకటి వ్రాసియున్నారు). - ఎం. ఆదినారాయణశాస్త్రి, రాయలసీమ తెలుగు శాసనాల సాంస్కృతిక అధ్యయనం, ఆదిత్య పబ్లికేషన్స్, అనంతపురం, 1995.
- మానవల్లి రామకృష్ణకవి, మానవల్లికవి రచనలు, సం. నిడదవోలు వేంకటరావు, పోణంగి శ్రీరామ అప్పారావు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు, 1972.
- దేవరపల్లి కృష్ణారెడ్డి, నన్నిచోడకవి చరిత్ర, బీ.ఎన్.కే. ప్రెస్, మదరాసు, 1951.
- కోరాడ మహదేవశాస్త్రి, కుమారసంభవము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 1987. (ఈ పుస్తకపు ఉపోద్ఘాతములో శాస్త్రిగారు ఎన్నో విషయాలను ఆసక్తికరముగా చర్చించారు).
- కొర్లపాటి శ్రీరామమూర్తి, నన్నెచోడుని కుమారసంభవము ప్రాచీనగ్రంథమా?, రమణశ్రీ ప్రచురణ, విశాఖపట్టణము, 1983.
- అమరేశం రాజేశ్వరశర్మ, నన్నెచోడుని కవిత్వము, అజంతా ప్రింటర్స్, సికిందరాబాదు, 1958.
- విన్నకోట పెద్దన, కావ్యాలంకారచూడామణి, సం. వేదము వేంకటరాయశాస్త్రి, (3.92) పురవారాశి అనే పద్యము, జ్యోతిర్మతీ ముద్రాక్షరశాల, మదరాసు.
- కాకునూరి అప్పకవి, అప్పకవీయము, (1.28) పురమును, ఋతుషట్కమును అనే సీసపద్యము, పరిష్కర్తలు గిడుగు రామమూర్తిపంతులు, ఉత్పల నరసింహాచార్యులు, వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1934.
- శార్ఙ్గదేవుడు, సంగీతరత్నాకరము, సం. చర్ల గణపతిశాస్త్రి, లలితా అర్ట్ ప్రెస్, విశాఖపట్టణము, 1987.
- నృపతుంగదేవ, కవిరాజమార్గం, సం. ఎం. వీ. సీతారామయ్య, కన్నడ సాహిత్య పరిషత్తు, బెంగళూరు, 2005.
- నిడుదవోలు వేంకటరావు, ఆంధ్ర కర్నాట సారస్వతములు, క్రాంతి ప్రెస్, మదరాసు, 1962.
- జెజ్జాల కృష్ణ మోహనరావు, షష్ఠ్యంతములు, ఈమాట, మార్చి 2008.
- కోరాడ రామకృష్ణయ్య, సాహితీ నీరాజనం, సం. కోరాడ మహదేవశాస్త్రి, పుట 118, సీతా ట్రస్ట్, విశాఖపట్టణము, 1992.
- నిడుదవోలు వేంకటరావు, నన్నెచోడుని కవితావైభవము, యువభారతి, సికిందరాబాదు, 1976.
- Fred W. Clothey and A.K. Ramanujan, The many Faces of Murukan: The History and Meaning of a South Indian God, Walter de Gruyter, New York, 1978.
- జెజ్జాల కృష్ణ మోహనరావు, వైతాళీయము – వియోగిని.
- కే. మెహర్మణి, మద్రాసు తెలుగు – సామాజిక భాషా పరిశీలన, శ్రీవేంకటేశ్వరా యూనివర్సిటీ, 1999.
- జెజ్జాల కృష్ణ మోహనరావు, ద్వాదశకందము.