[ఈ వ్యాసము అయ్యంకి వేంకటరమణయ్య గారి సన్మాన సంచిక (1943) “సరస్వతీ సామ్రాజ్యము” (పుటలు 2 – 6) నుండి గ్రహించబడినది. – సం.]
ప్రాచీనాంధ్ర మనగా నేది? – ఎంతవరకు పోవుట అను ప్రశ్న కలుగకమానదు. ప్రాఙ్నన్నయ్య పాఠ్యభాగము నందలి తెలుగుశాసనముల కాలమువఱకు పోగలము. అది ప్రాచీనాంధ్రమే. అప్పటి శాసనసభకు భిన్నమగు వ్యావహారికభాష వేరుగా నున్నదో లేదో తెలియదు. కాని తరువాతి నన్నయాది కవుల గ్రంథములందలి భాషకును, దీనికిని భేదము కలదు. నన్నయాది కవుల కాలమున మాత్రము వారి గ్రంథములలోని భాషకు పరిణామరూపమును, దానికంటే భిన్నము నగు వ్యావహారిక భాష యున్నట్లు తెలియుచున్నది. కేతనాదుల యాంధ్రభాషావిభాగము, అందు గ్రామ్యమునకు వారిచ్చిన యుదాహరణలే యిందులకునిదర్శనము. అప్పటినుండి యిప్పటివరకు గ్రాంథికము వ్యావహారికము గూడ నెన్నిమార్పులు పొందినను, గ్రాంథికము, వ్యావహారికము అను భేదము మాత్రము నిలిచియున్నది. కావున స్థూలదృష్టికి ప్రాచీన శాసనభాష, గ్రాంథిక భాష, వ్యావహారిక భాష యని తెలుగు మూడు తెఱగులుగ పొడగట్టుచున్న దన వచ్చును. భాషలో నీ మార్పులెందుకు కలుగుచున్నవో పరిశీలించిన దాని పరిణామక్రమరీతులు గూడ గోచరింపగలవు.
వ్యవహారమున త్వరితోచ్చారణము మార్పున కొక కారణము. త్వరితోచ్చారణమున నొక పదమునందలి కొన్ని ధ్వనులు లోపించవచ్చు. కొన్ని యొకదానిలో నొకటి కలసిపోవచ్చును. కావున పదస్వరూపము మారును. ఉచ్చారణావయవములందలి లోపము: పదములలోని ధ్వనులను సరిగానుచ్చరింప లేక పోవుటచే నొకదాని కొకటి వచ్చుట – లేక తడబడుట మొదలగు మార్పులు కలుగును. ఇట్టి మార్పులు భాషలో నొక్కొక్కప్పుడు వ్యాప్తి జెంది స్థిరముగా నిలిచిపోవును. పదములలోని స్వరము, ఊనిక మొదలగువానిలో గలుగు మార్పులను బట్టి మఱికొన్ని మార్పులు గలుగును. మొత్తము మీద నీ విధముగ గలుగు మార్పులు లోపాగమవ్యత్యయాదిరూపమును జెందు నని చెప్పవచ్చును.
ప్రాచీన శాసన భాష తరువాతి భాషకంటే ననేకవిషయముల భిన్నము. ప్రాచీనముగనే కనబడును. అందు ప్రధానమగు విషయ మేమనగా నం దగపడు నొక వింతధ్వని. ఇది దక్షిణ దేశభాషల కన్నిటికిని సమాన మగుటచే వానితో తెనుగునకుగల సంబంధమును స్థిరపరచుచున్నట్లున్నది. తమిళమున నిది యిప్పటికిని వ్యవహారములో నున్నది. కన్నడమున తెనుగునందు వలెనే చిరకాలము క్రిందటనే యంతరించినది. ఇది కన్నడమున ‘ఴ’ అను రీతిని వ్యాయబడి ష్+జ అను ధ్వని కలదిగా చెప్పబడుచున్నది. ఈ లిపియే కన్నడాంధ్రశాసనములలో గానవచ్చుచున్నది. ఈ వర్ణము నుచ్చరించుటలో గల విశేషమే ఇది ఈ భాషలలో ననేకవిధములుగా మారిపోవుటకు గారణమై యుండును. ప్రాచీన కన్నడమునను తమిళమునను ఇది నిలిచియున్నను తరువాతి కన్నడమున నిది ‘ళ’ గాను, తెనుగున ‘డ’ గాను మారినది. ఈ భాష లన్నింటిలో నిది ళ, ర, ల, య అను ధ్వనులుగ మారుటయు కలదు. తెనుగులో ళ :ర:డ అను ధ్వనులతో గూడి మన నిత్యవ్యవహారములో నున్న అనేక పదము లీ యక్షరముతో గూడిన ప్రాచీన భాషాపదముల పరిణామము లగుటయే మనము గమనింపవలసిన విశేషము. ప్రాచీన తెలుగు శాసనములలోని వానిలో కొన్ని – ఇతరములు కొన్ని..
అఴిసిన – అడిచిన
ఴిస్సి – డయ్యు – డస్సిన
చోఴి – చోడ
మేఴాబ – మేడాంబ
కొఴిల్చి – (భా) కొఱలు – చ్ఫ్. క. త. కొఱ్వు – కొబ్బు – తె. క్రొవ్వు
పఴికివిషయ – ప్రక్కి
ప్ఱోలు – ప్రోలు
పఴమటి – పడుమటి
తాన్ఱికొండ – తాడికొండ
ఎఴవేలు – ఏడువేలు – త. క. ఏఱు – తు – ఏళు
కన్నడము – బాఴో = జీవనె – బ్రదుకు
తమిళము – కన్నడము – కీఴో – క్రిందు – కీడు
త – కిఱింజు – చిఱుగు
త – తిగఱో, పుగఱో – తెగడు – పొగడు etc
శాసనభాషలో ‘న్ఱ’ తరువాతి భాషలో ‘న్డ’ అయినది.
వాన్ఱు – వాణ్డు – వాండు – వాఁడు
మూన్ఱు – మూండు – మూఁడు
ఏళుచున్ఱి – ఏలుచుండి
‘ఏళు’ శబ్దం తరువాతి భాషలో , ఏలు అయినది. ఇంకను వెనుకకుబోయినచో తమిళము ‘ఆళ్’ అనునది ధాతువు, పాలించు అనియే యర్థము. పదాది ‘అ’కారము తెనుగున ‘ఏ’ అగుట కలదు. త – ఆఱు – తె – ఏఱు – త- ఆండు – తె – ఏఁడు : త – ఆనై – తె – ఏనుగ. శాసనభాషలో “సంవత్సరంబుళ్” మొదలగు కొన్ని రూపములలో గనబడు బహువచన ‘ళ’ కారము తరువాత ‘ల’కారముగ మారినది. ‘ఏళేవారు, ఏళుబాది శమ్మాకారికి’ మొదలగు చోటుల ప్రాచీన ధాతువులోని ‘ళ’ కారము కూడ నిందు నిలిచి నట్లున్నది. ఆ కాలమునకు “ఏళే” అను రూపము గ్రాంథికమో, వ్యావహారికమో, చెప్పలేముకాని, తరువాతికాలములోనిది గ్రామ్యముగా గ్రహింపబడినది. “చూసెటివారు : చేసెటివారు” అనువానిని కేతనయు, “పాడేము, సూసేము, పైలురాగాసేము” అని పెద్దనయు, వీనిని గ్యామ్యమున కుదాహరణములుగా నిచ్చినారు. ‘ఏలేడు’ వెళ్ళెడు’ ‘చూచెడు’ మొదలగు రూపముల నుండి తుది డువర్ణ లోపముచే వెనుకటి యచ్చునకు దీర్ఘమువచ్చి ‘ఏలే’ వెళ్ళే, చూచే అను రూపములు వ్యవహారమున నేర్పడియుండును. ‘చేయువారు – అంగీకార్యమే కాని ‘చేనువారు’ గ్రామ్యమైనది. ఏలేటీ, చూచేటీ అనునవి పాడెడివారము – అనువానినుండి ఏలె, చూచె, అనురూపముల సామ్యముచే – పాడేవారము – పాడెము, చూచేవారము చూచెను – అని యేర్పడియుండును. మువర్ణ లోపముచే వెనుకటి యచ్చునకు దీర్ఘమువచ్చిన – వేసములు – వేసాలు : దోసాలు మొదలైనవి కూడ గ్రామ్యములలోనే చేర్పబడినవి – పెద్దన లక్షణమున. కాని ముత్యాలు మొదలగువానికి సాధుత్వము కల్పించినారు ఆర్వాచీనలాక్షణికులు. ‘దానిని’ – ఇకారలోపముచే ‘దాన్ని’ వాని (డికి) ని, > వాణ్ణి, వలెనే వాటిని, > వాట్ణి – వాటి – సముచ్చయార్థమున – వాటీ యగును. ‘తెచ్చుతారు’ అనునది తెస్తారు అనుదానికి బూర్వరూపము. “వస్తాడా హరి సొమ్ములు తెస్తాడా?”
అని అప్పకవి దీనిని తన కాలమునగ్రామ్యమున కుదాహరణముగా నిచ్చుటచేత గ్రామ్యము కూడ కాలక్రమమున నెట్టి పరిణామమును బొందుచున్నదో తెలియవచ్చుచున్నది. కేతన కాలములో ‘తెచ్చుతారు’ గ్రామ్యము – యకారాంతములగు ‘చెయ్’ మొదలగు వానినుండి యేర్పడిన ‘చేస్తాడు’ అనువాని సామ్యమున గాని, లేదా తకారసాహచర్యమున గాని, తెచ్చుతారు (ఆజ్లోపము) తెచ్‌తారు > తెన్‌చారు – తెస్తారు అను రూపమేర్పడినది. తెచ్చుతారు అనునది ‘తెచ్చుదురు్’ అనుదానినుండి ‘చేయువారూ అనునట్టి రూపముల సామ్యముచే నేర్పడినది.తెచ్చుదురు – వర్ణసమీకరణము (assimilation) మూలముగా ‘తెత్తురు’ అయినది. ఈ రూపమే శిష్టకవులచే – నన్నయాదులచే గ్రహింపబడుట చేత ఆ కాలమున ‘తెచ్చుతారు’ గ్రామ్యమైనది కాబోలు. తరువాత దానినుండి వచ్చిన ‘తెస్తారు’ కూడ గ్రామ్యమే. గ్రామ్యము నుండి పుటినది గ్రామ్యమే కదా. కానియిట్లే చేయుదురు – నుండి ‘చేతురు’, చేసుదురు’ ఉకారలోపముచే ‘చేస్తురు’ అను రూపము లేర్పడగా ఒకటి అసాధువు, ఒకటి గ్రామ్యమునైనది. అసలు మూలధాతువు ‘తర్’ అనునది తమళకన్నడములలోనిదే రూపము – కని అది తెలుగున ‘తెర్’ అయి, తెర్+ఉతు(ఉచు)= తెచ్చు అయినది. ‘తెచ్చు’ అనుదానినే మనము ధాతువనుచున్నాము. ఇనివిధములగు మార్పులలో వైయాకరణుడు ధర్మనియమము చేయవలసియున్నది. లోకమును బట్టి తెర్+ఉచు=తెచ్చు అయినట్లే వర్+చు=వచ్చు, మెచ్చు, పుచ్చు – ఇత్యాదులు. కొర్ -బు-వు > క్రొవ్వు : తర్‌గు – త్రగ్గు -తగ్గు, ఎరుదు>ఎద్దు: మొలక > మొల్క – మొక్క, వెడలు > వెళ్ళు, కొలది> కొల్‌ది>కొద్ది : వలదు>వల్దు>వద్దు, పెండీలి>పెండ్లి>పెళ్ళి, కన్నులు – కణ్+లు)>కండ్లు, > కళ్ళు ఇత్యాది రూపములన్నియు అజ్లోపము, వర్ణసమీకరణాదులచే భాషలో నేర్పడుచుండును. రెండు భిన్నశబ్దములు కలసినపుడు స్వరము ఊనిక అనునవి వానియర్థమును సూచించుటకు, వానిలోని మార్పులకు గూడ కారణ మగుచుండును. గంగ+అను+గంగను అనునప్పుడు రెండవ యక్షరముమీది యూత అర్థస్పురణకు గారణమగును. పుట్టినయిల్లు – పుట్టినిల్లు – పుట్టిల్లు, మావటివాడు – మావటీఁడు, (ఈఁడు ప్రత్యయమైనది) చేసిన -వాడు- చేసినాడు – (న లోపముచే) చేసి+ఆడు>చేసేడు, కొట్టినాను – కొట్టిఅను, కొట్యాను – కొట్టాను. వీనిలో సమీకరణముల మూలముగా క్రొత్త ధ్వని బయలు దేరుటచే నివి లక్షణపరిగ్రాహ్యములు కాలేదు. శిష్టప్రయోగముచే పరిగ్రాహ్యములు కావచ్చును.
వ్యవహారములో ననేక రూపము లిట్లే కాలక్రమమున మార్పు జెందినవి. చేయవలయునని చేయవలెనని – చేయాలనెని (నకారలోపము, పూర్వాచ్చుకు దీర్ఘము) చెయ్యాల్‌నని – చెయ్యాలని – ఇట్లే – ఉండవలెను _ ఉండాలి: దానిలోనుండి> దానిలోనుంచి > దానిలోంచి – ఇత్యాదులు. ఇట్టి వ్యావహారిక భాషారూపము లనేకములు నేడు పలువురువ్రాయు వ్యాసములలో గానవచ్చుచు ప్రామాణికత్వమును బడయగలిగిన స్థితిని బొందుచున్నవి. శిష్టవ్యవహారమే ప్రామాణికత్వమునకు మూలముగదా, అట్టివాని పరిణామక్రమము నారని భాషాశాస్త్రము పద్దతిని వాని స్వరూపలక్షణములను వివరించుట వైయాకరణుని, లేదా భాషాశాస్త్రజ్ఞుని పని. కాని అనంతములగు నిట్టి రూపములకు లక్షణము కల్పించుట సాధ్యమేనా? అనునది యొక ప్రశ్న కలుగకమానదు ఈ భాషలో లేదా ఈ రూపములను బ్రయోగించుచు, వస్తుగౌరవము, భావగాంభీర్యము, రసపోషణము గలిగిన రచనలు బయలుదేరినచో నీ రూపములను వద్దనువా రుందురా? ఉన్నను గ్రంథములకు, గ్రంథములతో పాటూ రూపములకు , భాషకు, కలిగిన గౌరవము కలుగక పోవునా ? కాలగతిని గలుగు పరిణామము నాపువారెవరు?