[అమెరికా పర్యటన సందర్భంగా షికాగోలో ఉంటూ అడిగిన వెంటనే ఈ వ్యాసాన్ని మాకందించిన కె. కె. రంగనాథాచార్యులు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు — సం.]
భారత దేశంలో అగ్రగామి భాషా శాస్త్రవేత్త అయిన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు గురించి విద్యారంగంలో పనిచేసేవారికి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఆయన ఎనభయ్యవ జయంతి సందర్భంగా ఈమాట వారు ఒక ప్రత్యేక సంచికను విడుదల చెయ్యడం ఆ మేధావికి మేటి గౌరవమే. సందర్భం వచ్చింది గనుక వారిని కొత్త తరానికి స్థూలంగా పరిచయం చేయడం, అంతర్జాతీయ భాషాశాస్త్ర రంగంలో అగ్రగామిగా గుర్తింపు రావడానికి కారణమైన వారి కృషిని వివరించడం అవసరం అనుకుంటాను.
కృష్ణమూర్తిగారు 1955 లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి భాషాశాస్త్రంలో ఏ. ఏం (ఎం. ఏ). అదే విశ్వవిద్యాలయం నుంచి 1957 లో పి. హెచ్. డి పొందారు. 1949-62 మధ్య ఆంధ్ర, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలలో తెలుగుశాఖలో అధ్యాపకులుగా పనిచేశారు. 1962 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంధ్రదేశంలోనే మొదట భాషా శాస్త్ర శాఖ ప్రారంభమైనప్పుడు ఠాగూర్ చైర్ ఆచార్యులుగా నియుక్తులై స్థాపక శాఖాదిపతి అయ్యారు.
అప్పుడు కృష్ణమూర్తిగారికి ముప్పై నాలుగేళ్ళు. విశ్వ విద్యాలయం ఆర్ట్స్ కాలాశాల ప్రిన్సిపల్‌గా ఆర్ట్స్ ఫాకల్టీ డీన్‌గా కూడా పనిచేశారు. సిండికేట్‌కి రెండుసార్లు ఎన్నికయ్యారు. 1986 నుంచి 1993 వరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్‌గా ఉన్నారు. ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్నప్పుడే చాలాసార్లు అమెరికన్, ఆస్ట్రేలియాన్ విశ్వవిద్యాలయాల్లో ఆహుత ఆచార్యులుగా, విజిటింగ్ ఫెలోగా పనిచేశారు. యుక్త వయస్సులోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక వర్గ సభ్యులైనారు. కేంద్ర సాహిత్య అకాడమీలో అయిదేళ్ళు జనరల్ కౌన్సిల్ సభ్యులుగా, మరో అయిదేళ్ళు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. తెలుగు అకాడమీకి రూప కల్పన చేసిన వారిలో కృష్ణమూర్తిగారొకరు. విద్యా, పరిశోధన వ్యాసంగాన్ని పాలన బాధ్యతలను వైరుధ్యం లేకుండా నడిపిన చాలా తక్కువమంది విద్యావేత్తలలో కృష్ణమూర్తిగారు చెప్పుకోవలసినవారు. కృష్ణమూర్తిగారు తులనాత్మక, చారిత్రక, వర్ణనాత్మక భాషా, శాస్త్ర శాఖలన్నింటిలోనూ సమానంగా కృషి చేసారు. వారి సిద్ధాంత వ్యాస విషయం తెలుగు ధాతువుల స్వరూప విదూషణం.
కృష్ణమూర్తిగారి సిద్ధాంత వ్యాసగ్రంథం
తెలుగును కేంద్రీకృతం చేసుకొని తోటి ద్రావిడ భాషలలోని ధాతువుల తులనాత్మక పరిశీలన ఈ గ్రంథంలోని ముఖ్య విషయం. తులనాత్మక అధ్యయనం ద్వారా మూల ధాతువుల స్వరూపాలని పునర్మిర్మించే ప్రయత్నం ఈ గ్రంథంలో కనిపిస్తుంది. పరిశొధన క్రమంలో భాగంగా సిద్ధాంత వ్యాసం రావడానికి ముందే ద్రావిడ భాషలలోని ధ్వనులు, ధ్వని విపరిణామాలకు సంబంధించి వ్యాసాలు ప్రచురించారు. పరిశోధనలన్నిటి సమాహారంగా “వెర్బల్ బేసెస్-ఎ కంపారటివ్ ఆండ్ డిస్క్రిప్షన్ స్టడీ” అనే గ్రంథం 1961 లో వెలువడింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్ ద్వారా ఈ గ్రంథం అచ్చయింది. ద్రావిడ భాషల తులనాత్మక అధ్యయనానికి ఆకర గ్రంథంగా, తెలుగు వర్ణనాత్మక, చారిత్రక అధ్యయనాలకు నమూనాగా ఈ గ్రంథం నిలచింది. ద్రావిడ భాషలకు సంబంధించిన పరిశొధనను, ప్రచురణలను కృష్ణమూర్తిగారు నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. తెలుగు భాషారంగంలో కృష్ణమూర్తిగారి కృషిని ప్రత్యేకంగా పేర్కొనాలి. భాషా సామాజిక పరిశీలన, మాండలిక విజ్ఞానం, భాషా చరిత్ర, భాషా యోజన, భాషా నవీకరణ, మాతృభాషలో విద్యాబోధన, యువజన విద్య మొదలైన రంగాలలో ఆయన కృషి చేశారు. మాండలిక వృత్తి పదకోశాలు భారతీయ భాషలలోనే తొలి ప్రయత్నం.
దీనికి కావలసిన విధి, విధానాలను కృష్ణమూర్తిగారు శాస్త్రీయంగా రూపొందించారు. తాను స్వయంగా వ్యవసాయ, చేనేత వృత్తి పదకోశాలను తయారు చేశారు. తిక్కన పద ప్రయోగకోశం సంపాదకులలో ఆయన ఒకరు. పద ప్రయోగకోశాలను తయారు చేసే పద్ధతులను కూడా రూపొందించారు. వయోజన వాచకాలను కూడా కృష్ణమూర్తిగారు రాశారు. కొండభాషకు ఆయన తయారు చేసిన వ్యాకరణం ప్రత్యేకమైన గుర్తింపు పొందింది.
అరవై అయిదేళ్ళు దాటగానే 1993 లో హైదరాబాదు విశ్వవిద్యాలయము నుంచి పదవీ విరమణ చేశారు. ఈ పది పదిహేనేళ్ళ కాలంలో వివిధ దేశాలలో విశ్వవిద్యాలయాలలో పరిశోధక సభ్యుడుగా, విజిటింగ్ స్కాలర్‌గా విద్వత్సభ్యులుగ పర్యటించారు. భిన్న విశ్వవిద్యాలయాలు తమ దగ్గర ఉండడానికి అవకాశాలు కలుగజేసి పరిశోధన, గ్రంథరచన చేయడానికి సౌకర్యలు కల్పించాయి. హవాయీ విశ్వవిద్యాలయం (1995) టెక్సాస్ విశ్వవిద్యాలయం (1995), ఆస్ట్రేలియన్ లింగ్విస్టిక్ ఇన్స్టిట్యూట్ (1996), ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిస్టారికల్ స్టడీస్, ప్రిన్స్ టన్ (1999-2000), స్టాన్‌ఫోర్డ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ స్టడీస్ ఇన్ బిహేవియరల్ సైన్సెస్ (2000), ఆస్ట్రేలియాలోని లాట్రోబే విశ్వవిద్యాలయం (2001)మొదలైన సంస్థలలో, విశ్వవిద్యాలయాలలో తానున్న కాలాన్ని కృష్ణమూర్తిగారు తమ పరిశోధనకు ఉపయోగించుకున్నారు. ఈ కాలంలోనే ద్రావిడ భాషలకు సంబంధించిన రెండు ముఖ్య గ్రంథాలను పూర్తి చేశారు. 2003 లో మూడు నెలల పాటు జర్మనీలో లీబ్జిగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎవల్యూషనరీ ఆంథ్రపాలజీలో అతిథి శాస్త్రవేత్త (visiting professor) గా ఉన్నారు.
గత పది సంవత్సరాలలో కృష్ణమూర్తిగారివి ఆరేడు గ్రంథాలు వెలువడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి ‘లాంగ్వేజ్, ఎడ్యూకేషన్ ఆండ్ సొసైటీ’ కంపారటివ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ కరెంట్ పెర్‌స్పెక్టివ్స్ (2001), ది ద్రవిడియన్ లాంగ్వేజెస్ (2003), తెలుగు వ్యాస సంకలనం, భాష-సమాజం-సంస్కృతి (2000) అనే గ్రంథాలు. 2004 జూన్ నెలలో ఆయన సహ సంపాదకత్వం వహించిన తెలుగు కథల ఆంగ్లానువాదం సాహిత్య అకాడమీ ప్రచురణగా వచ్చింది. ‘కంపారటివ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్స్’ గ్రంథాన్ని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. కృష్ణమూర్తిగారు పరిశోధనకు ఉపక్రమించిన కాలం (సుమారు 1950) నుంచి ఇటీవలి వరకు ద్రావిడ భాషల అధ్యయన రంగంలో చేసిన మౌలిక పరిశోచన వ్యాసాల సంకలనం ఇది. కేవలం యథాతథ వ్యాసాల సంకలనం మాత్రమే కాదు . వ్యాస విషయాలకు సంబంధించి తరువాత జరిగిన చర్చ స్పందనలు, వాటిని గురించి తన స్పందనలు, సమాధానాలు, వ్యాఖ్యానాలు, పునరాలోచనలు, కొత్త ప్రతిపాదనలు కూడా జత చేర్చారు. అందువల్లనే ఈ గ్రంథానికి సమగ్రత ఏర్పడింది.
2004 లో రాయల్ సొసైటీ అఫ్ ఎడింబరో ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు తమ సంస్థ విద్వత్సభ్యులు (fellow) గా ఎంపికైనట్లుగా ప్రకటించింది. విద్యా, వైజ్ఞానిక రంగాలలో ఇది చాలా అరుదైన గౌరవం. అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైంది. మానవీయ, సామాజిక శాస్త్ర రంగాలనుంచి ఈ గౌరవానికి ఎన్నికైన విద్వత్సభ్యులలో కృష్ణమూర్తిగారొక్కరే భారతీయులు.
విద్యా, వైజ్ఞానిక రంగాలలో పురోగతి, ప్రయోజనకరమైన జ్ఞానం లక్ష్యాలుగా స్కాట్‌లాండ్‌లో 1783లో ఏర్పడిన సంస్థ రాయల్ సొసైటీ ఆఫ్ ఎడింబరో. బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయాలు, విద్యా, వైజ్ఞానిక పరిశోధన సంస్థలు జాతీయ ‘అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటర్స్’ గా గుర్తించిన స్వతంత్ర సంస్థ. రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ విజ్ఞాన శాస్త్ర రంగానికి మాత్రమే పరిమితం అయింది. రాయల్ సొసైటీ ఆఫ్ ఎడింబరో విజ్ఞాన, సాంకేతిక శాస్త్ర రంగాలలో పాటు, మానవీయ, సామాజిక రంగాలలో కూడా పనిచేసే బహుళ విద్యా విషయక సంస్థ. ప్రసిద్ధ స్కాటిష్ ఆర్థిక శాస్త్రవేత్త ఆడం స్మిత్ (1723-90) సంస్థ వ్యవస్థాపక సభ్యుడు. సంస్థ విద్వత్సభ్యులుగా ఎన్నికైనవారిలొ వాల్టర్ స్కాట్, జోసెఫ్ బ్లాక్, చార్లెస్ డార్విన్, విల్లియమ్ వర్డ్స్ వర్త్ వంటి ప్రసిద్ధులున్నారు. బ్రిటీష్ రాణి సొసైటీ ప్రధాన పోషకురాలు. సదస్సులు, వర్క్ షాప్‌లు నిర్వహిచడం, ప్రసిద్ధులు ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం, పూర్తి సమయం పరిశోధన చేసేవారికి ఆర్ధిక వనరులు చేకూర్చడం సంస్థ నిర్వహించే ముఖ్యమైన పనులు. వీటితోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో విద్వాంసులను గుర్తించి సభ్యత్వాలను, గౌరవ సభ్యత్వాలను ఈ సంస్థ ఇస్తుంది. విద్వత్సభ్యుల ఎన్నిక విధానం చలా నిష్కర్షగా ఉంటుంది. కనీసం నలుగురు విద్వత్సభ్యులుగా ఉన్నవారు విద్వాంసుడి పేరుని వివరాలతోపాటు ప్రతిపాదిస్తారు. అలా వచ్చిన పేర్లలో కొన్నిటిని ప్రత్యేక కమిటీ ఆమోదిస్తుంది. తరువాత సంస్థకి సంబంధించిన కౌన్సిల్‌కి ఈ పేర్లు వెళతాయి. కౌన్సిల్ ఆమోదంతో విద్వాంసుల పట్టిక తయారౌతుంది.
ఈ పట్టిక మూడు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరిగే సంస్థ విద్వత్సభ్యుల సాధారణ సమావేశంలో ఈ పట్టికనుంచి కొందరు విద్వత్సభ్యులను ఓటుతో ఎన్నుకుంటారు. మూడింట రెండువంతులు ఓట్లు వచ్చిన వారే విద్వత్సభ్యులుగా ఎన్నికవుతారు. సాధారణ విద్వత్సభ్యులుగా ఏదో ఒక రూపంలో స్కాటిష్ సంబంధం ఉన్నవారే ఎన్నికవుతారు. బ్రిటన్‌కి వెలుపల వారిని స్థానికేతర విద్వత్సభ్యులు (corresponding fellows)గా ఎన్నుకుంటారు. సాధారణ సభ్యత్వంతో పోలిస్తే స్థానికేతర సభ్యుల ఎన్నిక చాలా నిష్కర్షగా ఉంటుంది. ప్రత్యేక క్షేత్రంలో అంతర్జాతీయ స్థాయి కృషిని కరస్పాండింగ్ ఫెలోల ఎన్నికలో పరిగణనలోకి తీసుకుంటారు. కృష్ణమూర్తిగారు ఎన్నికైంది కరస్పాండింగ్ ఫెల్లోగా. రాయల్ సొసైటీ ఆఫ్ ఎడింబరో అరుదుగా కొంతమందిని గౌరవ సభ్యులుగా ఎన్నుకుంటుంది. సాధారణంగా రాయల్ కుటుంబానికి సంబంధించినవారుగాని, నోబెల్ బహుమానం స్థాయిలో గౌరవాలు పొందినవారుగాని గౌరవ సభ్యులుగా ఎన్నికౌతారు. హరగోబింద సింగ్ ఖురానా, అమర్త్య సేన్ గౌరవ సభ్యులుగా ఎన్నికైనవారిలో ఉన్నారు.
కృష్ణమూర్తిగారు ఇంతకు ముందే అనేక జాతీయ, అంతర్జాతీయ గౌరవాలు పొందారు. 1985లో లభించిన లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ అమెరికా గౌరవ సభ్యత్వం వీటిలో ఒకటి. అంతకు ముందు ఈ గౌరవం సునీతికుమార్ చటర్జీకి లభించింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 2003 మార్చిలోనే కేంద్ర సాహిత్య అకాడమీ కృష్ణమూర్తిగారిని విశిష్ట సభ్యులుగా ఎన్నిక చేసింది.
కృష్ణమూర్తిగారు సమగ్రతావాది. విషయ ప్రస్తుతిలో పరిపూర్ణతను, నిర్దిష్టతను, నిర్దుష్టతను ఆయన ఆశిస్తారు. ‘ది ద్రవిడియన్ లాంగ్వేజెస్’ అనే గ్రంథం కేంబ్రిడ్జి యూనివర్సిటి వారి ప్రపంచ భాషల సర్వేక్షణ ప్రచురణ క్రమంలొ భాగంగా వచ్చింది. చైనీస్, జపనీస్, ఇండో-ఆర్యన్, కెల్టిక్, రొమాన్స్, కారియన్, ఆస్ట్రేలియన్ మొదలైన భాషలను గురించిన గ్రంథాలను కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. సుమారుగా అయిదు వందల నలభై పేజీలు దాటిన గ్రంథం ‘ది ద్రవిడియన్ లాంగ్వేజెస్’. ద్రావిడ భాషారంగంలో తొలినుంచి జరిగిన పరిశోదనలు, తన పరిశోధనలు, అధ్యయనాలను సమన్వయించి ద్రావిడ భాషలకు సంబంధించిన సమగ్ర ఆకరంగా ఈ గ్రంథాన్ని తయారుచేశారు కృష్ణమూర్తిగారు. ఇది కేవలం సర్వేక్షణ గ్రంథంగా మాత్రమేగాక ద్రావిడ భాషలకు సంబంధించిన అధ్యయన విజ్ఞాన సర్వస్వంగా రూపొందింది. కొన్ని దశాబ్దాలుగా నలుగుతూ ఉండి రెండు, మూడు సంవత్సరాలుగా చేసిన నిరంతర కృషి ఫలితమే ఈ గ్రంథం. ఇంతవరకు వెలుగులోకి వచ్చి అధ్యయనం జరిగిన ఇరవైయారు ద్రావిడ భాషల నిర్మాణం, వాటి తులనత్మక పరిశీలన, మూల భాషా నిర్మాణ పునర్నిర్మాణం ఈ గ్రంథంలో పొందుపరిచారు కృష్ణమూర్తిగారు. ద్రావిడ భాషలకు సంబంధించి ఈ గ్రంథంలో తడవని అంశం అంటూ లేదు. ద్రావిడ పదవ్యుత్తి, చరిత్ర, ద్రావిడుల, ద్రావిడ భాషల చరిత్ర పూర్వదశ, చారిత్రక దశ, ద్రావిడ భాషలలోని సమాన పదాల ఆధారంగా మూల ద్రావిడ సంస్కృతి పునర్నిర్మాణంతోపాటు ద్రావిడభాషలను ఒక కుటుంబానికి చెందినవిగా గుర్తించడానికిగల సమాన లక్షణాలు, ఆర్య ద్రావిడ భాషల ఆ దాన, ప్రదానాలు, ద్రావిడ భాషా రంగంలో జరిగిన పరిశోధన వివరాలు, భారత ఉపఖండం ఆవల భాషా కుటుంబాలతో ద్రావిడ భాషలకు గల సంబంధాలు, , లిఖిత ద్రావిడ భాషల లిపి పరిణామం మొదలైనవి విస్తృతంగా ఇతర విద్వాంసుల అభిప్రాయాలతో పాటు ప్రస్తుత గ్రంథంలో లభిస్తాయి.
Dravidian Languages
ఈ గ్రంథంలో ప్రధాన భాగం ద్రావిడ భాషల నిర్మాణానికి సంబంధించినది. సుమారు నాలుగు వందల నలభై పేజీల గ్రంథభాగం. ఇది వర్ణాలు, పద, పదాంశాలు, వాక్యం, పదవాక్యాలు, వ్యాకరణ విభాగాలు మొదలైన అంశాల వర్ణనాత్మక, చారిత్రక, తులనాత్మక అధ్యయనం. ప్రతి అంశానికి సంబంధించి మూల ద్రావిడ భాషా స్వరూప పునర్నిర్మాణం ప్రధాన విభాగంలో ఉన్నాయి. కృష్ణమూర్తిగారి మౌలిక పరిశోధనను, ఆలోచనలను ఈ విభాగం ప్రతిఫలిస్తుంది. ఈ విషయాలన్నీ పూర్తిగా శాస్త్ర, సాంకేతిక పరమైనవి, చారిత్రక, తులనాత్మక అధ్యయనం ఆధారంగా ద్రావిడ భాషల వర్గీకరణ/ఉపకుటుంబ విభజన మరొక ప్రధానాంశం. కాల్డ్వెల్ మొదలుకొని తన దాకా విభిన్న విద్వాంసుల ప్రతిపాదనలను తెలియజేశారు. వీటి లోతుల్లోకి వెళ్ళడానికి ద్రావిడ భాషా పరిశోధన క్రమంతో, చరిత్రతో కొంత పరిచయం అవసరం. ద్రావిడుల చరిత్ర పూర్వదశ విషయంలో చాలా చర్చలు, వివాదాలు ఉన్నాయి. హరప్పన్ నాగరికత ద్రావిడ నాగరికత అని కృష్ణమూర్తిగారు స్థూలంగా అభిప్రాయపడ్డారు. ఆర్య, ద్రవిడ పదాలు జాతులను సూచించే పదాలుకావని ఆయన భావించారు. ద్రావిడులు ఆర్యులు కంటే చాలాకాలం ముందు ఇతర ప్రాంతాల నుంచి భారతఖండంలో ప్రవేశించారన్న వాదం ఒకటి ఉంది. కృష్ణమూర్తిగారు ద్రావిడులను ఉపఖండముల వాసులుగానే భావించారు. ఆధునిక మానవులందరూ ఆఫ్రికా ఖండం నుంచి భిన్న భౌగోళిక ప్రాంతాలలో విస్తరించారనే సిద్ధాంతం ప్రస్తుతం వ్యాప్తిలో ఉంది. ఈ సిద్ధాంతం దృష్ట్యా ద్రావిడుల ప్రాక్చరిత్రను పునరాలోచించవలసి ఉంటుందని కూడ కృష్ణమూర్తిగారంటున్నారు.
అనేక జాతీయ, అంతర్జాతీయ గౌరవాలు పొందడం వెనుక కృష్ణమూర్తిగారి పరిశోధన కృషిని స్థూలంగానైనా ప్రస్తుతించాలనే ప్రయత్నం ఇది. సాంకేతిక యుగంలో అన్ని శాస్త్రాలలోను మౌలిక పరిశోధనల ప్రాధాన్యం తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. భాషా విషయక కృషి కూడా సాంకేతిక శాస్త్ర రంగంలోకి క్రమక్రమంగా వ్యాపిస్తుంది. కృష్ణమూర్తిగారి నిరంతర కృషి భాషా విషయ మౌలిక పరిశోధనల అవసరాన్ని గుర్తిస్తుంది.