[ఈ ప్రసంగము ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక సంపుటి -1 సంచిక- 2 నుండితీసుకున్నాము (పే.25-28). ఆ సంచికలోని ఈ పేజీలను యథాథతంగా ఇక్కడ (pdf 807KB)చూడవచ్చు. – సం. ]
మహోన్నతులగు మహామంత్రి సమేతులు నగు మహారాజ శ్రీ
మదరాసు గవర్నరు దొరవారికి,
ఈ దిగువను వ్రాళ్ళు చేసిన యాంధ్రభాషాభిమానులు
వినయ పూర్వకముగాఁ జేయు మనవి
ఏమనగా:-
- ఇప్పుడిప్పుడు కొలఁదిమంది తెలుఁగు భాషను తమ యిచ్ఛానుసారముగా “సంస్కరింప” వలయునను నభినివేశమును గల్పించుకొని తదనుగుణముగా గ్రాంథిక భాషను విడిచిపెట్టి గ్రంథములిఁక గ్రామ్యభాషయందే రచింపవలయునని వాదించుచున్నారు. మఱియు గ్రామ్యభాషయందు రచింపఁబడిన గ్రంథములఁ బాఠశాలలో నుపయోగించునటు లొనర్చుటకు యత్నములు జరుగుచున్నట్లు తెలియవచ్చినది. ఇట్లభిమానముతో వాదించు వారిద్దఱు ముగ్గురు మాత్రమే. వారి వాదము నామోదించువారి సంఖ్య యత్యల్పము. రెండు కోట్ల కధికమగు నాంధ్రుల సంఖ్యలో నణుమాత్రము. వీరి వాదము గ్రాంథిక భాషాసంప్రదాయమునకు విరుద్ధమగుటయే గాక ఆంధ్రలోకమున కెంతయు నసమ్మతమని దృఢముగను నిశ్చయముగను మనవి చేయుచున్నారము.
- కాలక్రమమున మాఱుచుండుట భాష స్వభావమనియు, మాఱక యెన్నటికి నొక్కరీతిగానే యుండవలయునని వాదించుట యశాస్త్రీయమనియు, భాషకు గ్రామ్యాగ్రామ్య భేదము భాషాస్వరూపము నెఱుంగని పండితమ్మన్యులచేఁ గల్పింపఁబడినది గాని వాస్తవము గాదనియు, ఇప్పటి గ్రాంథిక భాష సంస్కృత పదములతోడను, సాంస్కృతిక వాక్య రచనా విశేషములతోడను, వర్తమానమందు వాడుకలో లేని కేవల పురాతన పద ప్రయోగములతోడను నిండియుండుటంజేసి పండితులు కాని వారలకు దురవహగాహమనియు, సర్వసామాన్యముగా నందఱకును దెలియుటయే గ్రంథరచన యొక్క ముఖ్య లక్షణము కావున నింతటి నుండి గ్రంథముల నాంధ్రదేశమం దుత్తమ జాతి స్త్రీ పురుషులు సంభాషణయందు వాడుచున్న భాషయందే వ్రాయవలెననియు, ఈ పద్ధతి యాంగ్లేయ భాష యందుండుటచే నాంధ్రులకుఁగూడ ఆచరణీయమనియు నీవిపరీత సంస్కార వాదుల మతము.
- ఈ వాదము దోష భూయిష్ఠమయి యున్నది. తెలుఁగునందు గ్రాంథికభాష దుర్బోధమని చెప్పుట యతిసాహసము. అనుభవ విరుద్ధము. కొన్నిగొన్ని గ్రంథము లతిప్రౌఢముగా నుండుట చేత పాండిత్య విహీనులకు సులభముగా బోధపడక పోవచ్చును. అట్టివి ప్రాచీన గ్రంథములందంతగా లేవు. అట్టి గ్రంథములన్ని భాషలయందును గలవు. ఈ కాఠిన్యము పాక భేదము ననుసరించినది గాని లక్షణము వలనఁగలిగినది కాదు. సులభముగా గ్రహింపఁదగిన సలక్షణ గ్రంథముల నేకము గలవు. అవి యాంధ్రదేశమందెల్లెడలఁ బ్రచారములో నున్నవి. నేఁడు గూడ భాషాసేవకు లనేకులీ సలక్షణ భాష చేతనే సుబోధనలగు గ్రంథములనేకములు రచించుచున్నారు. నిర్ధుష్ట భాషచేత గ్రంథరచన చేయఁగలవారి సంఖ్య మొత్తము మీఁద కొంచెమయినను, అట్టి గ్రంథములను గ్రహింపఁగల వారనేకులుందురు. ఇట్టులే యన్ని భాషలయందును, ప్రౌఢ కవులు కొలఁదిమంది, చదివి గ్రహింపగలవారు పెక్కురు. అట్లు కాకున్న ప్రౌఢ కావ్యములు లేకపోవలసి వచ్చును. కొంతకాలమునుండి సలక్షణమగు తెలుఁగున రచింపఁబడిన నాటక గ్రంథము లనేకములు పుట్టుచున్నవి. నాటక సమాజము లనేకము లేర్పడి యీ నాటకములను ప్రదర్శించుటయు వేల కొలఁది జనులా నాటకములఁ జూచి యానందించుటయు జరుగుతున్నది.
- ఆంగ్లేయ భాషయందె యెక్కువ పరిచయము గల యీ కాలమువారికి కొందఱకు సలక్షణాంధ్ర గ్రంథములు కొన్ని కష్ట సాధ్యములుగా నుండవచ్చును. ఈ లోపము వారి మాతృభాషా వైముఖ్యమువలనఁ గలిగినదని వారు సర్వ సామాన్య విషయములం గూర్చి యొకరితో నొకరు ప్రసంగించునపుడు గూడ యథేచ్ఛముగాఁ బ్రయోగించు నాంగ్ల పదములే చాటుతున్నవి. కేవలము వీరల సౌకర్యార్థము భాషామర్యాదల మార్పవలెనని వాదించుట ధర్మము కాదు. వర్తమానము నందాంగ్లేయ విద్యాధికులగు పలువురాంధ్రులు మాతృభాషాభిమానము కలిగి తధ్భాషా పరిచయమును వృద్ధి నొందించుకొనుటయే కాక యాభాషయందు గ్రంథములఁ గూడ రచియించుచున్నారు. నూతన సలక్షణ గ్రంథరచనకై యనేక సమాజము లేర్పడుచున్నవి.
- సంభాషణ రూపముగా మాత్రమే వ్యవహరింపఁబడుచున్నంత వఱకు జనులనోళ్ళఁబడి దేశభేదమువలనను కాలభేదమువలనను మాఱుచుండుట భాష స్వభావము. అట్టి భాష గ్రాంథికమైన పిమ్మట ననఁగా నా భాషచే గ్రంథములు రచించుట కారంభమయిన పిదప పూర్వపు వికార గుణము తగ్గి భాషకు లక్షణ మేర్పడి దేశ భేదములచే భిన్నము గాక యేక రూపముగా నుండును. ఇది సర్వ గ్రాంథిక భాషలకు సమాన లక్షణము. అట్లు కానిచో కొన ప్రదేశమున రచింపఁబడు గ్రంథములు వేఱొక ప్రదేశమునను, ఒక కాలమున రచింపఁబడు గ్రంథములు కాలాంతరమందును బొత్తిగాఁ దెలియకపోవుట తటస్థించి గ్రంథరచనయొక్క ప్రయోజనమునకే భంగము కలుగును. ఈ దుస్థితి యాంధ్ర దేశమున కింకను బట్టలేదు గాని “సంస్కార” వాదుల యుద్యమము కొనసాగినచోఁ బట్టుననుటకు సంశయము లేదు.
- పూర్వ మధ్యాధునిక కాలభేదముచేత ఆంగ్లేయ భాష మూఁడు విధములుగా నున్నదనియు, పూర్వ కాల భాషకు ఆధునిక భాషకు భేదమత్యంతము కలదనియు, ఆంధ్ర భాషకుఁ గూడ నట్టి పరిణామము కలిగిన ట్లూహింపవలయుననియుఁ గొందఱి యాశయము. ఆంగ్లేయ భాష యందుఁ గలిగిన మార్పులు చాలవఱకా దేశము నార్మను దేశీయులచే నాక్రమింపఁ బడియుండిన కాలమునందు సర్వ సామాన్య గ్రాంథిక భాష యేర్పడి యుండక పోవుటచేఁ గలిగినవనియు, ఆంగ్లేయ గ్రాంథిక భాషా పితామహుఁడనదగిన చాసరు నాఁటి భాషకు నిప్పటి భాషకును భేదము బొత్తిగా లేకపోలేదు గాని వానికిఁగల ముఖ్య భేదము వర్ణ క్రమము (Spelling) నకు సంబంధించినది గాని లక్షణమునందంతగా మార్పులు కలుగలేదనియు ఆంగ్లేయ పండితులు చెప్పుచున్నారు.
- ఆంధ్ర భాషయన్ననో:- 11 వ శతాబ్దారంభమునాఁటికే యనఁగా నార్మనులు ఇంగ్లాండు నాక్రమించుకొనక పూర్వమే యున్నత స్థితికి వచ్చియుండెను. గ్రాంథిక భాష యేర్పడి నేఁటికిఁగూడ నుత్తమ గ్రంథముగా నెన్నఁబడుచున్న యాంధ్రభారతమందు మూఁడు పర్వము లాశతాబ్దము పూర్వార్థము నందు రచింపఁబడియుండెను. పిదప మాతృభాషాభిమానులగు నాంధ్ర రాజులే దేశమును కలకాలము పరిపాలించు చుండుటంజేసి భాష నిజ మర్యాదానుసారముగనే క్రమక్రమముగా వృద్ధి నొందుచు వచ్చినది. పదపడి కొంత కాల మాంధ్రదేశములోఁ గొంత భాగము మహమ్మదీయులచే నాక్రమింపఁ బడియుండెను గాని భాషా మర్యాద లదివఱకే స్థిరపడి యుండుటంబట్టి రాజకీయ వ్యవహారముతో సంబంధించి కొన్ని పారసీకాద్యన్యదేశ్య పదములు వ్యవహారిక భాషయందుఁ జేరుటతప్ప భాషాస్వరూపమును భేదమేమియుఁ గలుగలేదు. కాబట్టి యాంగ్లేయ భాషా సామ్యమును బట్టి యాంధ్ర భాష మాఱవలెనని వాదించుట యశాస్త్రీయము. క్రొత్త తెలుఁగు ప్రాఁత తెలుఁగు నను భేదము “సంస్కార” వాదుల స్వకపోల కల్పితము గాని వాస్తవము గాదు. ఆంధ్రులకు దుర్బోధము. ప్రాచీనాంగ్లేయ భాషకుఁ బోల్పఁ దగిన వస్తువు తెలుఁగులో లేదు. వీరలు క్రొత్త తెనుఁగనునది గ్రామ్య భాషయే గాని వేఱుగాదు.
- గ్రాంథిక భాషా సాహచర్యముచే సంస్కరింపఁబడిన యుత్తమాంగ్లేయ సంభాషణ భాషకును ఇప్పటి యాంధ్రుల సంభాషణ భాషకును సామ్యము చెప్పుట యక్రమము. భాషా శైలికంటె గద్య కావ్యముల భాషా శైలికంటె గద్య కావ్యముల భాషాశైలియు, అంతకంటెఁ బద్య ప్రబంధ శైలియు ప్రౌఢములు. ఆంగ్లేయ భాషయందు నాటకములు గద్య గ్రంథములు పెక్కులుండుటచేతను, చదువాదేశమందధికముగా వ్యాపించియుండుటచేతను, అచ్చు యంత్రముల యుపయోగము ప్రబలుటచేతను, ఆక్సుఫర్డు, కేంబ్రిడ్జి పట్టణములందలి యున్నత విద్యాలయముల మూలమునను గ్రాంథిక భాషాసంబంధమెక్కువయయి సంభాషణ భాష ప్రౌఢమగుటయుఁ దానికిని గ్రాంథిక భాషకును గలయంతర మల్పమగుటయుఁ దటస్థించినవికాని గ్రాంథిక భాష ప్రౌఢిమ తగ్గుట ఇందుకుఁ గారణము కాదు.
- ఆంధ్ర భాషయందలి గ్రంథములు ప్రాయికముగా పద్య రూపములుగానే యుండుట చేత గ్రాంథిక భాషకును వ్యవహారిక భాషకును అంతర మాంగ్లేయ భాష యందు కంటె నెక్కువగా నున్నది. నాటకములును గద్య కావ్యములును ఇప్పుడిప్పుడు బయలుదేరుచున్నవి. ఈనాఁటి గ్రంథకర్తలు సులభమగు ద్రాక్షాపాకముననే గ్రంథముల రచించుటకు యత్నించుచున్నారు. పలువురట్లు రాయగలుగుతున్నారు. ఈప్రకారమికఁ గొంతకాలము జరిగిన పిమ్మట నీ గ్రాంథిక భాషా సంబంధముచే నాంగ్లేయ భాష యందువలెనే యక్ష్యరాస్యుల వ్యావహారిక భాష ప్రౌఢమయి స్థిరపడుననుటకు సందేహము లేదు. ఇప్పుడే యారంభమయినది. చదువుకున్న వారనేకు లుత్తర ప్రత్యుత్తరములందును, ఉపన్యాసము లిచ్చునప్పుడును, వార్తాపత్రికలయందును సలక్షణమగు భాష నుపయోగించుచున్నారు. అక్షరాస్యుల వ్యవహారిక భాషకును, గ్రాంథిక భాషకును భేదము తగ్గించుటకు న్యాయమైన మార్గమిది గాని “సంస్కార” వాదులు చెప్పునది కాదు.
- “సంస్కార” వాదులు చెప్పునట్లు ఏకరూపమును సర్వ సామాన్యము నగు వ్యావహారిక భాష ప్రస్తుత మాంధ్ర లోకమందు లేదు. జాతి భేద దేశ భేదములను బట్టి యది వివిధముగా నున్నది. ఇందులో నేదియో యొక దేశమందొక జాతి వారిచే వ్యవహరింపఁబడుచున్న భాషయందు గ్రంథముల రచింపుదమన్న నవి యితర దేశములందును ఇతర జాతులకును సంస్కారవాదులు కోరునంత సులభముగా నర్థమెట్లగును? ఆ భాష కొక లక్షణమేర్పఱచి యాలక్షణము నందఱు మన్నింప వలయునని చేసికొన్నచో నదియు నొక గ్రాంథిక భాషగా నేర్పడి వర్తమాన గ్రాంథిక భాషయం దారోపింపఁబడిన దోషములకన్నింటికి పాత్రము కాదా? గ్రాంథిక భాష యొక్కటియే తెలుఁగు దేశమంతటను తెలియఁదగి యున్నది.
- కాలక్రమమున గ్రాంథిక భాషకూడఁ గొంతవఱకు మాఱుచుండుననుట సత్యమే. ఆ ప్రకార మాంధ్రభాషకూడ మాఱుచునే యున్నది. పూర్వ కవి ప్రయోగముల కంటె భిన్నములగు ప్రయోగములు తరువాతి కవుల గ్రంథములలోఁ గనఁబడుచున్నవి. వానిని లాక్షణికులంగీకరించి యున్నారు. కాని గ్రాంథిక భాషయందు మార్పులు విలంబముగను బహుకవి సమ్మతముగాను గలుగును. భాషాలక్షణ విచారము చేయునప్పుడు తత్తత్కాలములందు ప్రామాణికులుగా నెన్నఁబడు వారి గ్రంథములందలి ప్రయోగములే ప్రమాణము గాని మఱియేదియు ప్రమాణము కానేరదు. సుప్రతిష్ఠితమగు నీ మర్యాదకును ఆంధ్రభాషాసంప్రదాయమునకు విరుద్ధముగా నిద్దఱు ముగ్గురు చేరి తమ యిచ్ఛానుసారముగా భాషను మార్చెదమనుట హాస్యాస్పదము.
- ఈ యపూర్వ సంస్కార వాదుల మతానుసారముగా రచింపఁబడిన గ్రంథములు ప్రచారములోనికి వచ్చిన యెడల ఆంధ్రులకుఁ గ్రమగ్రమముగా నిప్పటి గ్రాంథిక భాషతోఁ బరిచయము తగ్గి కొంతకాలము గతించిన పిమ్మట నిప్పటి తెలుఁగు గ్రంథము లన్య భాషాగ్రంథములవలె దురవగాహములగుట తటస్థించును. అందువలన రాఁబోవు జనులకుఁ దమ దేశపు పూర్వ వృత్తాంతము బొత్తిగాఁ దెలియకపోవును. నాగరకులను ఖ్యాతిగల ప్రతిజాతియొక్కయు పూర్వాచారములు, పూర్వపురుషుల యుదారభావములు, ఆశయములు, వారు కని పెట్టిన విషయములు మొదలగునవి యన్నియు ననఁగా బహుకాల సంచితమగు నాగరకతా సారమంతయు వారివారి వాఙ్మయములందు నిక్షిప్తమైయుండును. జనులు వాఙ్మయము నర్థము చేసికొనలేక పోయినచో వారలకుఁదమ పూర్వ వృత్తాంతము, పూర్వ మర్యాదలు తెలియక పోవును. తమ పూర్వ వృత్తాంతము మఱచిపోవుట కంటె ఘోరతరమైన విపత్తేజాతివారికిని దటస్థింపఁబోదుకదా!
- పిల్లలకును పామరులకును సులభముగా బోధపడునట్లు గ్రంథములు రచించుట కనేక మార్గములు కలవు. అట్టి గ్రంథములయందు సర్వ సామాన్యముగా నందఱకు నర్థమగు పదములనే ప్రయోగించవలెను. తఱచుగా సందుల సడలింపవలయును. వాక్యములు చిన్నవిగా నుండవలయును. విషయము కూడ చదువరుల తెలివికి లోపడినదిగా నుండవలెను. గ్రంథములు సులభముగా రచియింపవలెనన్న నివి మార్గములు కాని గ్రామ్య భాషను బ్రయోగించుట సరియైన మార్గము కాదు. ఆంగ్లేయ భాషలో పసిపిల్లల నిమిత్తము వ్రాయు చిన్న పుస్తకములు సైతము గ్రామ్య భాషలో వ్రాయరు. తెలుఁగులో నేల వ్రాయవలెను?
- సరియయిన పర్యాయపదములు దేశ భాషయందు దొరకని యెడల అన్య దేశ్య పదముల గ్రహించుట కభ్యంతరము లేదు. కాని దేశ భాషా పరిచయ మపమును అన్య దేశ భాషా పరిచయమధికము నగుటచే దేశ భాషయందలి పర్యాయ పదముల నన్వేషించకయే యన్య భాషాపదముల యథేచ్ఛగాఁ ప్రయోగించుట నింద్యము. అట్లు ప్రయోగించిన యెడల భాషలలో నెల్ల లలితమనిపించుకొన్న యీ తెలుఁగు సంకరమై కర్ణకఠోరమగును. సంస్కృత పదము లనవసరముగాఁ బ్రయోగించిరనియే కదా సంస్కారవాదులు కొందఱు పండితుల నిందించుచున్నారు. అట్టి తామన్య దేశ్య శబ్దముల నిరంకుశముగా నెట్లు ప్రయోగింప నొప్పును?
- మీఁదఁ గనపఱచిన హేతువులంబట్టి యీ యపూర్వ సంస్కారవాదుల వాదమును నిషేదించి వర్తమాన మర్యాదానుసారముగా సలక్షణభాషచే రచింపఁబడిన గ్రంథములను మాత్రమే పాఠశాలల యందుపయోగించునట్లును, తదితర గ్రంథములను పయోగింపకుండునట్లును శాసింపవలయునని దొరతనమువారినిందు మూలముగా మఱి మఱి వేఁడుచున్నారము. మఱియు, తెలుఁగు “టెక్ట్సుబుక్కు కమిటీ” లో తెలుఁగు మాతృభాషగాఁ గల వారిద్దఱు మాత్రమే యున్నారు. తెలుఁగు తెలియని వారు తెలుఁగు గ్రంథములనియమించుట న్యాయము కాదు గనుక ఆ “కమిటీ” లోని సభ్యులందఱు తెలుఁగు మాతృభాషగాఁ గలవారుగా నుండున ట్లేర్పాటు చేయవలయునని కూడఁ బ్రార్థించుచున్నారము.
ఇట్లు,
విన్నవించెడి యాంధ్రభాషాభిమానులు.
విన్నవించెడి యాంధ్రభాషాభిమానులు.