గ్రామ్యాదేశ నిరసన సభ – జయంతి రామయ్య పంతులు గారి ప్రసంగము

[ఈ ప్రసంగము ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక సంపుటి -1 సంచిక- 2 నుండితీసుకున్నాము (పే.151-58). ఆ సంచికలోని ఈ పేజీలను యథాథతంగా ఇక్కడ (pdf 807KB)చూడవచ్చు. – సం. ]

గ్రామ్యభాషయే గ్రాంథిక భాషగా మార్పవలెనని మన ప్రతిపక్షుల వాదము దుర్బలముగను, దోషభూయిష్ఠముగను, గాన్పించుచున్నది. ప్రస్తుత మాంధ్రవాఙ్మయమంతయు సామాన్యులకు దుర్గ్రాహ్యమనియు, దురవగాహన మనియుఁ జెప్పుట మిక్కిలి సాహసము. అనుభవవిరుద్ధము. ఇతర భాషలలో వలెనే యాంధ్రమునందును అర్థ సౌలభ్యము లేని గ్రంథములరుదుగ నచ్చటచ్చటఁ గాననగును. ఈ గ్రంథములయొక్క కాఠిన్యము ప్రౌఢమైన శైలి వలనఁ గలుగుచున్నది. గ్రంథరచన యందుఁ గల పాక విశేషములను వ్యాకరణ నిర్బంధములని భావించి పుస్తక రచన యందు వ్యాకరణ నియమములను బాటింప నక్కఱ లేదనుట గొప్ప పొరపాటు. సులభ శైలిని వ్యాకరణ యుక్తముగ వ్రాసిన హృదయ రంజకము లగు నాంధ్ర గ్రంథములు వేనవేలు గలవు. ఆంధ్ర వాఙ్మయము నందలి కాఠిన్యము అల్ప సాహిత్యము వలన నేర్పడుచున్నది కాని వేఱు కాదు. చాలవఱకు నాంగ్ల భాష కొఱకై మాతృభాష నుపేక్ష చేయుట వలన దుర్గ్రాహ్యత్వము వాటిల్లుచున్నది. సామాన్యముగ మాతృభాష నుపేక్ష చేయు పాఠశాలలో సయితము ప్రతి తరగతినుండియు నేవురార్వురు కవులు బయలువెడలుచున్నారు కాఁబట్టి యాంధ్రవాఙ్మయము నిజముగా కఠినమయినది కాదని స్పష్టము కాఁగలదు.

జయంతి రామయ్య పంతులు
జయంతి రామయ్య పంతులు
(వాడపల్లి శేషతల్పశాయి గారికి కృతజ్ఞతలతో)

వాడుకలో నున్న భాష కాలక్రమమున మాఱుచుండునను మాట సత్యమే. ఏకకాలమున వివిధ మండలములయందుచ్ఛారణలోనే కాక యర్థములందు సయితము భేదములుండుట సహజము. కాని యేభాషయైనను గ్రాంథిక భాషగా నంగీకరించిన తరువాత దానిలో నావశ్యకమైన మార్పులు కొలఁదిగ నెందేనిఁ గలుగును. ఆంగ్ల భాషాచరిత్రను జదివిన వారందఱకును ఈ విషయము స్పష్టము కాఁగలదు. ఆంగ్ల వాఙ్మయ పితామహుఁడనఁదగు చాసరు తరువాత నింగ్లీషు భాషలో జరిగిన మార్పులు వర్ణక్రమమునందే తప్ప వ్యాకరణనిబంధనలలో తక్కువ. ఇంతియుకాక మన ప్రతిపక్షులు వాదించునట్లు ఆంగ్ల భాషలో నున్న ప్రాచీన, మధ్యమ, నవీన భేదములు ఆంధ్రభాషలో కూడ నుండవలెననుట యసంభవము. ఇంగ్లీషు భాషతోడి సామ్యము మన భాషకు వర్తింపదు. ఏలయన షేక్సుపియరు మహాకవి కాలమువఱకును ఆంగ్లభాష గ్రాంథిక భాషయగుటకు పరిణామముఁ బొందుచునే యుండెను. ఆంధ్రభాష యన్ననో ఇంగ్లీషు భాషవలెఁ గాక వాగనుశాసనుని కాలముననే అనఁగా పదునొకండవ శతాబ్దము నాఁటికే పరిపూర్ణ పరిణామమును బొంది సాధారణ గ్రాంథిక భాషగా పండిత కోటి యొక్క యంగీకారమును బడసియుండెను. ఈ కారణము బట్టియే మన భాషలో నింగ్లీషు భాషలోవలె ఆంగ్లోసాక్సనుకు సరియైన వాఙ్మయము లేదు.

గ్రాంథిక భాషలో వ్యాకరణ విషయమైన మార్పులు సేయునప్పుడు మిక్కిలి ప్రయాసతో ఆజన్మాంతము భాషాపరిశ్రమము చేసిన పండితకోటి యొక్క యభిప్రాయము ననుసరించి చేయవలెనుగాని ప్రతి గ్రంథకర్తయు తనకు దోఁచిన మార్పులతో పుస్తకముల వ్రాయఁ దొడంగినచో భాషకు గొప్ప యనర్తకము వాటిల్లును. సర్వ సాధారణమగు గ్రాంధిక భాష ధ్వంసమయి యొక మండలము వారు వ్రాసిన గ్రంథము లింకొక మండలములోని వారికి దుర్గ్రాహ్యము లగును. ఇంతియుకాక నిత్యకృత్యములయందు వాడుకలోనున్న భాషలో గ్రంథములను వ్రాసిన యెడల వాఙ్మయమంతయు పేలపిండివలె నిస్సారమై యుద్గ్రంథముల యొక్క యుత్పత్తికిని ఇదివరకున్న యుద్గ్రంథములలోని సారము గ్రహించుటకు ప్రతిబంధక మేర్పడును. కావున గ్రామ్య భాషలలో వ్రాసిన పుస్తకములను పాఠశాలలో పఠనీయ గ్రంథములుగా నియమింపఁ గూడదని దొరతనము వారికి దెలుపుట భాషాభిమానుల యొక్క కర్తవ్యమై యున్నది. ఈ యుద్యమమును నెఱవేర్చుకొనుటకుఁ బఠనీయ గ్రంథ నిర్ణయ సభ (Text book committee) లో తెలుఁగు వారి సంఖ్య హెచ్చించుట యవసరము. తెలుగు పుస్తకములు నియమించుటలో నాంధ్రేతరులు నాంధ్రేతర భాషలు మాతృభాషగా గల సభ్యుల యభిప్రాయములఁ బట్టి దొరతనమువారు పఠనీయ గ్రంథముల నివేదించుటవలన మన యాంధ్రభాషకు మిక్కిలి యన్యాయము జరుగుట సహజము. ఈ యన్యాయము వారించుటకు తెలుగులో పఠనీయ గ్రంథములను తెలుఁగు మాతృభాషగాఁ గల సభ్యులే నియమింపవలెనని కూడ దొరతనము వారికి మనము తెలియఁ బఱచుకొనవలెను. కాఁబట్టి ఈ తీర్మానమును మీరందఱు నేకగ్రీవముగ నామోదించెదరని నమ్ముచు నేనింతట విరమించుచున్నాఁడను.