విన్నంత కన్నంత తెలియవచ్చినంత

[శాస్త్రీయ భాషా పరిశోధనలో అంతర్జాతీయ ప్రమాణాలకు తీసిపోని భాషా శాస్త్రవేత్త, అభ్యుదయ సాహిత్యోద్యమకారుడు, పాత్రికేయ గురువు బూదరాజు రాధాకృష్ణ గారు గత నెల జూన్ 4, 2006 న మరణించారు. నన్నయ పూర్వకాలంలోని శాసన భాషమీద, తెలుగు మాండలికాలపై వీరు చేసిన పరిశోధనలు, ఆధునిక వ్యవహారకోశం, ఈనాడు భాషా స్వరూపం, తెలుగు జాతీయాలు, వాడుక మాటలు లాంటి ఉపయుక్తమైన గ్రంథాలు ఆయన ప్రతిభాపాటవాలకు గీటురాళ్ళు. తెలుగు భాషాభివృద్ధికి  వారు చేసిన కృషికి ఇదే మా నివాళి. – సంపాదకులు]

నాకు యుక్తవయసులో ఆధునిక తెలుగు సాహిత్యం మీద ఆసక్తి ఉండేది. అమెరికా వచ్చింతర్వాత అది మరుగున పడింది. భాషాశాస్త్రం గురించి బొత్తిగా ఏమీ తెలియదు. రెండేళ్ళ క్రితం “తెలుగు నాడి” లో “తెలుగుమాట” శీర్షిక చూసిందాకా బూదరాజు రాధాకృష్ణ గారి పేరు గూడా వినలేదు! అప్పుడైనా పెద్దగా పట్టించుకోలేదు.

పోయిన సంవత్సరం కొత్త పుస్తకాల కోసం వెతుకుతుంటే తెలుగులో ఓ కొత్తరకమైన పుస్తకం కనిపించింది – బూదరాజు గారి “మరవరాని మాటలు.” ఇంగ్లీషులో Dictionary of Quotations లాంటిది. అయిదువేలకి పైగా గ్రంథాలను పరిశీలించి, నాలుగు వందల మందికి పైగా – నన్నయ నుండి చండీదాస్ దాకా – రాసిన రచనల్లోంచి, నాలుగు కాలాల పాటు నిలిచే రచయితల మాటలని సంకలన పరచారు.

ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తూ, తెలుగు సాహిత్యంలో వైవిధ్యలేమిని బూదరాజు గారు నిష్కర్షగా వివరించారు: “కవి, కవిత, స్త్రీ, ప్రేమ, జీవితం వంటి సర్వసాధారణ విషయాలను ప్రస్తావించిన వాళ్ళ సంఖ్య అపారం. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలనూ ఆధునిక సమాజం సంభావించే విషయాలనూ విమర్శించిన, వివరించిన వాళ్ళ సంఖ్య తక్కువ.”

అలాగని ఇంగ్లీషులో సంస్కృతంలో వున్న పుస్తకాలతో పోల్చుకొని క్రుంగిపోకుండా మనకున్నదాంట్లోనే వున్న సొగసులని చూపిస్తూ, యువతరం మీద ఎంతో వుత్సాహాన్ని వెలిబుచ్చారు: “సుప్రసిద్ధులనుకుంటున్న అనేక రచయితలకన్నా అంత ప్రసిద్ధులు కాని యువతరం రచయితలు వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు. జీవం జవం గల భాషనూ భావాలనూ ప్రకటిస్తున్నారు.”

దీంట్లో నాక్కనిపించిన లోపం రచయితల సూచికలో పేజీల వివరాలు లేకపోవడం. తెలుగు పుస్తకాల్లో సరయిన సూచిక (Index) లేకపోవడం కొట్టొచ్చినట్లు కనపడే లోపం; ఈ విషయంలో పాతకాలపు ప్రచురణకర్తలే నయం. ఈ పుస్తకం అంకితపు మాటలు నన్ను ప్రత్యేకంగా ఆకర్షించాయి: “ప్రతికూల మిత్రులకు.” ఈ రచయిత ఎవరో గడుసువాడులాగుందే, మరికాస్త తెలుసుకుందాం అని ప్రయత్నిస్తే ఆయన స్వీయ చరిత్ర దొరికింది.

“విన్నంత కన్నంత” లో బూదరాజుగారి విశిష్ట వ్యక్తిత్వమేగాకుండా సామాజిక జీవిత చరిత్ర కూడా వెల్లడవుతుంది. ముందుగా నాకాశ్చర్యమూ సంతోషమూ కలిగించింది – ఆయన మా ఊరికి పది పదిహేను మైళ్ళ దూరంలో వున్న వేటపాలెం గ్రామ వాస్తవ్యుడు కావడం. నాకిన్నాళ్ళూ తెలియనందుకు నా అజ్ఞానానికి సిగ్గు వేసింది. వేటపాలెం చీరాల పట్టాణానికి అయిదారు మైళ్ళ దూరంలో వున్న గ్రామం. ఆ ఊరు “జీడిపప్పు”కి పెట్టినపేరు.

అంతకన్నా గొప్ప పేరు గలది ఆ వూళ్ళోని “సారస్వత నికేతన” గ్రంథాలయం – మన రాష్ట్రంలో కెల్లా చరిత్రాత్మకమైనది. అది ఈ పుస్తకంలో అనేకసార్లు ప్రస్తావనలోకొస్తొంది. దానికి 1929లో మహాత్మాగాంధీ శంకుస్థాపన చేశారు. నిజానికి చీరాలలో కన్నా వేటపాలెం లోనే సాంస్కృతిక వాతావరణం ఎక్కువ; అందుకు కేంద్రం గ్రంథాలయమే. డబ్బూ, చదువుకోడానికి సమయమూ అంతగాలేని అనేకమంది పౌరులు ఈ సమావేశాలకి వచ్చి పెద్దలని గూడా తమ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టేవాళ్ళు.

ఒకసారి తెలుగులెంక తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు ప్రసంగించడానికి వచ్చారు. ఆయన మాట్లాడటం మొదలు పెట్టీ పెట్టక ముందే, ఒక సభ్యుడు లేచి, “అయ్యా, తిక్కన భారతం లో మీ దృష్టిలో చెత్తపద్యమనిపించే దొకటి చదివి, మీరు రాసిన మంచి పద్యం కూడా చదివి, మీరే విధంగా అభినవ తిక్కన బిరుదుకు తగిన వారో వివరించి మాకు జ్ఞానం ప్రసాదించండి” అన్నాడు. “ఎవరో ఒక నిండు సభలో ఇస్తే కాదనలేక తీసుకున్నాను గాని, నేనంతటి వాణ్ణి కాదు” అని తుమ్మల సమాధానం ఇచ్చారు. తుమ్మల వారి వినయం, సభ్యుడి తెంపరితనం ఈ కాలపు సభల్లో వింటామా? కంటామా? అంటారు బూదరాజు.

“ఈమాట”లో ఈమధ్య “ఏతావాతా” అనే పదం ఎక్కువగా వినబడుతోంది. దీని అర్థమేమిటా అని “శబ్దార్థరత్నాకరము”లో వెతికితే కనపడలేదు. బూదరాజు గారి “మాటల వాడుక: వాడుక మాటలు; అనుభవాలు-న్యాయాలు” పుస్తకంలో దీనికి చక్కని వివరణ ఉంది

కులమతాభిమానాలున్నా అవి ద్వేషాలుగా మారలేదనీ, పంచాయతీరాజ్ ఎన్నికలు వచ్చింతర్వాతనే అవి దురభిమానాలుగా ద్వేషాలుగా మారాయనీ, మత ప్రసక్తి వచ్చినా ఎంత సులభంగా సమసిపోయేదో నిరూపించడానికి చీరాలలో కళ్ళారా చూసిన – సాహెబుగారికీ పంతులుగారికీ మధ్య జరిగిన – కుస్తీ పోటీని వర్ణించారు.

స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే సామాజిక వాతావరణం లో కలిగిన మార్పులన్నీ చెప్పాలంటే పది మహాభారతాలవుతుందంటూ, క్లుప్తంగా వివరించిన భాగంలో ఆసక్తికరమైన విషయాలెన్నో వున్నాయి. పళ్ళు తోముకోడానికి కచ్చిక, బొగ్గు, వేపపుల్లలనుంచి పళ్ళపొడికి, చద్దన్నం నుంచి ఇడ్లీ కాఫీలకి, భావకవిత్వం నుంచి వచన అభ్యుదయ సాహిత్యానికి తొందరతొందరగా మార్పులొచ్చాయి. అప్పట్లో సాహితీ పత్రికలన్నిటిలోనూ మకుటం లేని మహారాణి “భారతి”. బెంగాలీ సాహిత్యం ప్రభావంతో కొన్ని కులాలలో పేర్ల చివరన బాబు, చౌదరి వచ్చి కలిశాయి. దాతృత్వంతో మొదలైన విద్యాసంస్థల్లో “మన వాళ్ళు” వుండాలనే భావం విస్తరించింది.

ఆయన హైస్కూల్లో చదువుకుంటున్నప్పుడు తెలంగాణా పోరాట సమయం. కమ్యూనిస్టు మహా నాయకులిద్దరు – పుచ్చలపల్లి సుందరయ్య, బద్దె ఎల్లారెడ్ది – వేటపాలెం ఊరికి పడమట తోటల్లో రహస్య జీవనం మొదలెట్టారు. తూర్పున పొలాల్లో గుడిసెలో బూదరాజు గారి దూరపు బంధువూ కమ్యూనిస్టూ అయిన కస్తూరి కుటుంబరావు గారు భూగర్భ జీవనం గడుపుతున్నారు.

వీళ్ళిక్కడ దాక్కున్నారని తెలిసినా ఎంత వెతికినా స్థానిక పోలీసులకి దొరక్కపోతే మలబార్ పోలీసులు వచ్చి వూళ్ళోవాళ్ళని వేధించడం మొదలెట్టారు. ఆబాధ పడలేక సారస్వత నికేతనం కార్యదర్శి మధ్యవర్తిత్వంతో రాజీ కుదిరిస్తే కుటుంబరావు గారు పిస్టలు ఇచ్చేశారు. అరెస్టుచేసి విచారణ చేస్తామని మాట ఇచ్చిన పోలీసులు వెంటనే ఆయన్ని అక్కడే వేలమంది కళ్ళ ఎదుటే కాల్చి చంపి, ఒంగోలు సమీపం లోని చింతలపాలెం లోని చింతలతోపులో పోలీసులతో హోరాహోరీ పోరాడి మరణించాడని పేపర్లో, రేడియోలో ప్రకటించారు!

బూదరాజు గారికి మనసు విరిగి, కాంగ్రెసు మీదా ప్రభుత్వం మీదా ద్వేషం కలిగి, పగ తీర్చుకోడానికి తెలంగాణా పోరాట దళాల్లో చేరడానికి కూడా సాహసించారు. అడవిపట్టున నాలుగు రోజులుండేటప్పటికి ఆవాతావరణం వొంటికి పడకపోవడంతో బుద్ధొచ్చి ఇంటికి చేరుకున్నారు.

వేటపాలెం లోని సారస్వత నికేతన్ బూదరాజుగారికి మొదటి విశ్వవిద్యాలయం అయితే, రెండోది, ఇంటర్మీడియట్ చదవటానికి గుంటూరు వెళ్ళినప్పుడు, అక్కడి రైల్వేస్టేషన్. స్టేషన్ ఆవరణలో అమరావతి రోడ్డువైపున్న ఖాళీ స్థలంలో రోజూ సాహితీగోష్ఠి జరిగేది. గుంటూరులోని సాహితీకారులేకాక, చుట్టుపక్కల అమరావతి, నరసరావుపేట నుండి కూడా వచ్చి పాల్గొనేవారు. కరుణశ్రీ, జాషువా, కుందుర్తి, బెల్లంకొండ, శిష్ట్లా, ముదిగొండ, అమరేంద్ర మొదలైనవాళ్ళంతా అలా పరిచయమయిన వాళ్ళే.

మలేరియాతో మంచానపడితే నాలుగురోజులు అంటిపెట్టుకొని కాపాడిన జాషువా సంరక్షణ మరిచిపోలేనిది. “జాషువా కవిత్వం రవ్వలు రాలుస్తుందిగాని ఆయన మాత్రం పరమసౌమ్య శాంతమూర్తి. మీసాలూ కోటూ ఆయన నిజస్వరూపాన్ని మార్చి చూపుతాయి,” అంటారు బూదరాజు. జాషువా ఈలవేసి సంప్రదాయ నాటకరంగ పద్ధతిలో పద్యగానం చేస్తుంటే గుంటూరు ప్రజలు గుంపులు గుంపులుగా చూసేవాళ్ళు. అప్పటినుంచీ వున్న కవితా వ్యసనం బూదరాజు గారినెప్పటికీ వదల్లేదు.

వాల్టేరులోని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చేరిన బూదరాజు, B.Sc., Honors లో సీట్లు సిఫారసు వున్న వాళ్ళకే ఇస్తున్నందుకు ప్రొఫెసర్ తో ఎదురుతిరిగారు. ఆయన, క్రమశిక్షణ పాటించనందుకు వెళ్ళగొట్టి, “ఈ యూనివర్సిటీలో నీకు పుట్టగతులుండవు” అని బెదిరించాడు. “నా ఇష్టం వచ్చిన మరో కోర్సులో చేరి ఈ మూడేళ్ళూ నిన్ను నిద్రపోనీ” నని బూదరాజు శపథం చేశారు. ఆ విధంగా “Science వెలగబెట్టాల్సినవాడు తెలుగు తగలేస్తున్నాడ”ని ఇంట్లో వాళ్ళకి చిర్రెత్తుకొచ్చింది.

ఒకరోజు గ్రంథాలయంలో సరయిన తెలుగు పుస్తకాలేమీ కనిపించక నిరుత్సాహపడి, తిరిగివస్తూ, ఓ సంస్కృత మూలగ్రంథం కనిపిస్తే, షెల్ఫ్ నుంచి తీశాడో లేదో, తనకి రెండేళ్ళు సీనియర్ అయిన నాయని కృష్ణకుమారి గారు నిలవేసి, “నీకేమర్థమవుతుంది? నాకవసరం” అని లాక్కోబోయారు. “నాకు అర్థమవుతుందో కాదో తేల్చే అధికారం మీకేముంది?” అని బూదరాజు రెట్టించారు. ఈ గొడవ విని లైబ్రేరియన్ అబ్బూరి రామకృష్ణరావు గారు పరిగెత్తుకొచ్చి సర్దిపుచ్చారు.

ఆతరవాత బూదరాజు అబ్బూరిగారి కుటుంబసభ్యుల్లో ఒకరన్నంతగా దగ్గరయారు. అబ్బూరి ప్రభావం శ్రీశ్రీ మీద వున్నట్లే బూదరాజుమీద గూడా పడింది. భాషని ప్రత్యేక విషయం గా తీసుకోడానికీ, “క్షుద్రవిషయాలకు గ్రాంథికం వాడి గొప్పవాటికి వాడుకభాష వాడాలనే” నిర్ణయానికీ అబ్బూరే దోహదం.

సాహితీ రంగాల్లోనే కాక, విద్యార్థి రాజకీయాల్లోనూ అనేకరకలైన గొడవల్లోనూ తలదూర్చి, పొట్టి శ్రీరాములుగారి ఆత్మార్పణ తర్వాత జరిగిన పోలీసు కాల్పులతో చివరకి పోలీసు రికార్డుల్లో బూదరాజు పేరు చిరస్థాయిగా చేరిపోయింది. విద్యార్థి దశతర్వాత ఆయన రాజకీయాల్లో పాల్గొనలేదు.

మరో పది నిమిషాల్లో రైలు బయలుదేరుతుందనగా విశ్వనాథ సత్యనారాయణగారు ఎక్కారు. ఆయన్ను నేను గుర్తించాను గాని నేనెవరో ఆయనకు తెలియదు. ఆయన రచనలకన్నా ఎన్నో రెట్లు ఆయన వ్యక్తిత్వం గొప్పదనీ, కాని ప్రవర్తన విపరీతంగా కనిపిస్తుందనీ అబ్బూరి వారెప్పొడో చెప్పారు. ఆటపట్టించి చూద్దామనిపించింది.

డిగ్రీ చదువు పూర్తిచేసి, పరిశోధన చేసే ఆసక్తి వున్నా, కుటుంబ ఆర్థిక పరిస్థితుల మూలంగా, చీరాలలోనే వుపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. అక్కడ క్లాసులో పచ్చిబూతులున్న శృంగారభావనలున్న పాఠ్యాంశాలను చెప్పలేక బాధపడేవారు. “భామినీ విలాసం”లో వున్న “రతిత్వర పీడాలస నాకయోషి దధరస్వాదూపహాసంబు మత్సరసాలాపవిలాస మేసుకృతి యాస్యంబందు లాస్యం బిడున్?” అన్నదాన్ని తెలుగులో అంతమంది ఆడపిల్లల ముందర – అందులో చాలామంది బంధువులు – చెప్పలేక వృత్తినుండి బయటపడాలనిపించేది.

దానితో పాటు ముక్కుసూటిగా పోయే మనిషికావడాన పై అధికారులతో ఇబ్బందులు తోడు! ఒకసారి మెట్రిక్ పరీక్షలు రాసేవాళ్ళని, బూదరాజూ, vice principal నాయుడు గారూ కాపలా కాస్తున్నారు. నాయుడు గారు బయటకి వెళ్తూ, ఇద్దరబ్బాయిలను చూపెట్టి వాళ్ళని “ఓ కంట కనిపెట్టమని” చెప్పారు. అబ్బాయిలిద్దరూ జేబుల్లోంచి కాగితాలు తీశారు. బూదరాజు వాళ్ళని బయటకు వెళ్ళగొట్టారు. పది నిమిషాల్లో తిరిగి వచ్చిన నాయుడు గారికి వాళ్ళు లేని కారణం తెలిసి ముఖంలో నెత్తురు చుక్క లేదు. వాళ్ళిద్దరూ vice chancellor గారి అన్న కొడుకులు; అందుకని కాస్త “కనిపెట్టి చూడండి” అన్నారు!

ఆ సాయంత్రం వాళ్ళిద్దరిలో ఒకడు తన బలం చూపించటానికి బూదరాజు మీదకి వచ్చాడు. “చదివి రాసి పరీక్ష నెగ్గు, బెదిరించి నువ్విక్కడ గంటగూడా బతకలేవు” అని బూదరాజు తెగింపు. “నీవు Science చెప్పగలవా? తెలుగు మేష్టారువి. చదివించగలవా?” అని రెట్టించి మాట్లాడితే సవాలుగా తీసుకుని చదువు చెప్పాడు. అతను నీతిగా పరీక్ష రాసి నెగ్గి, ఎంతో మారిపోయి పై చదువుల్లో ఉత్తమ విద్యార్థి ననిపించుకున్నాడు. రీసర్చికి విశాఖ చేరి “వీర కమ్యూనిస్టు”గా మారి ఫాక్టరీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పాయాడు – అతనే వాసిరెడ్డి వెంకటప్పయ్య. అతనితోపాటు మరణించింది N.S. ప్రకాశరావు. వాళ్ళని గుర్తుంచుకోడానికని రావిశాస్త్రి “రత్తాలు-రాంబాబు” నవలని వాళ్ళిద్దరికీ అంకిత మిచ్చాడు.

అయిదారేళ్ళు ఉద్యోగం చేసింతర్వాత సెలవు పెట్టి PhD చెయ్యడానికి తిరిగి వాల్టేరు చేరారు బూదరాజు.

2

ఈ పుస్తకంలోకెల్లా బూదరాజుగారి వ్యక్తిత్వాన్ని బాగా ప్రతిఫలించే సంఘటన ఒకటుంది. దానిని ఆయన మాటల్లోనే పూర్తిగా చదివితే రక్తి కడుతుంది:

“పరిశోధన కాలంలో 1961 వేసవినాటి ఒకానొక అనుభవం నేను జీవితాంతం మరిచిపోలేనిది. ఇంటి పనిమీద వేటపాలెం వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు దర్జాగా సెకండు క్లాసులో బయలుదేరాను. విజయవాడ నుంచి పార్సిల్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం. రాత్రి ఏడెనెమిది గంటల సమయంలో రైలెక్కాను. పెట్టెలో ఎవరూలేరు. పైన పక్కపరిచి ఎవరూ రాకపోతే కింది బెర్తుమీద పడుకుందామని అదీ ఆక్రమించాను. పెట్టెలో ఉండేవే నాలుగు బెర్తులు. ఓ పావుగంట తరవాత ఇద్దరు సామానుతో ఎక్కి రెండోవైపు పక్కలు పరిచారు.

మరో పది నిమిషాల్లో రైలు బయలుదేరుతుందనగా విశ్వనాథ సత్యనారాయణగారు ఎక్కారు. ఆయన్ను నేను గుర్తించాను గాని నేనెవరో ఆయనకు తెలియదు. ఆయన రచనలకన్నా ఎన్నో రెట్లు ఆయన వ్యక్తిత్వం గొప్పదనీ, కాని ప్రవర్తన విపరీతంగా కనిపిస్తుందనీ అబ్బూరి వారెప్పొడో చెప్పారు. ఆటపట్టించి చూద్దామనిపించింది.

మెడచాచి వంచి రెండు వేళ్ళు కలిపి ఒక వైపు విస్తరించి తుపుక్కున ఉమ్మి, “పైన ఎవరని” ప్రశ్నించాడాయన. “పరమాత్ము” డన్నాను. “కింద ఎవ”రన్నాడు. “అధమస్థుణ్ణి నేనున్నా”నన్నాను. “వాలకం చూస్తే తెలుగు మాస్టారులాగుంది గాని ఈ వెధవ వేషమేమి?” టన్నాడు. “వేషాన్నిబట్టి విధవాత్వమాపాదించే మనం ఆ వేషధారులకు బానిసలుగా మూడు వందల ఏళ్ళున్నాం. ఆక్షేపించి సాధించేదేమి”టన్నాను. “పొగరుబోతులాగున్నావ్. నేను పెద్ద రౌడీనని తెలుసా?” అంటూ ఒక పక్క సంచీతో కూర్చున్నాడు.

“మనకు మిగిలింది పొగరే కదా. మా ఊళ్ళో నేనూ రౌడీనే”నన్నాను. “ఔరా! నీ శరీరపుష్టికి రౌడీయిజమా?” అంటే “డేవిడ్ శరీర పరిమాణం చిన్నదైనా గోలియత్ను పరాభివించలేదా?” అన్నాను. “నీవు కిరస్తానమా? ఏ వూరు మీది?” అని ప్రశ్నిస్తే మావూరేదో చెప్పి “అంగుష్ఠమాత్రః పురుషః” అన్నారు కదా. శరీర పరిమాణం ప్రధానమా?” అని అడిగాను. “సరే. సంగతి తేల్చుకుంటా. ఏ శాస్త్రం చదివావు? ఎందులో చర్చిస్తా”వన్నాడు. “వ్యాకరణంలోగాని, భాషాశాస్త్రంలోగాని పోరాడగల”నన్నా.

“the cold touch of poverty”ని “దుర్భరదారిద్ర్యం” అని అనువదించండి గాని “దారిద్ర్యశీతలస్పర్శ” అనవద్దు. అలాగే “చల్లని కడుపు”ను “శీతలగర్భం” అని రాయవద్దు.

“ఆ రెండో కూత కూయకు. నాకు అసహ్యం. భాషాశాస్త్రజ్ఞులమనే పాశ్చాత్య సేవకులు పాణిని అగౌరవించారు. మలేచ్చులు – వాళ్ళ మొహం చూడ”నన్నాడు. “అలాగయితే అటు తిరిగి కూర్చోండి. నేనుగూడా అపాణినీయ ప్రయోగాలు చేసే కవులను అసహ్యించుకుంటా”నన్నా. “ఆఁ” అంటుండగానే “నేను అంతో ఇంతో అష్టాధ్యాయి చదివా. అలాగే భాషాశాస్త్రం కూడా. ఆధునిక పాశ్చాత్య భాషా శాస్త్రజ్ఞులందరూ పాణిని ప్రాతస్మరణీయుడని గౌరవిస్తారు. పాణినికి దొంగదండాలు పెట్టి అప్రామాణిక ప్రయోగాలుచేసే వాళ్ళకన్నా బహిరంగంగా పాణిని పాతకాలపు వాడనే వాళ్ళు సజ్జనులు కాదా?” అని అడిగా.

క్రూరంగా చూసి, “ప్రేమాభిమానాలున్న చోట చీత్కారమూ ఉంటుంది. దేవుణ్ణి భక్తులు బహువిధాల దూషించారు. ఆపాటి తెలియదా?” అని నిలవేశాడు. “మీరు థూ. Shakespeare కూడా కవేనా? అని బహిరంగ సభలో ఈసడించింది భక్తి పారవశ్యంతోనా? మేం కలలో కూడా పాణిని మహర్షిని అలా అవమానించం. మేం అగౌరవించామనటానికి నిదర్శనముందా?” అన్నాను.

అప్పుడాయన “ఎవడో అజ్ఞాని, కానీ మీకు ఆరాధ్యుడు. బ్లూం ఫీల్డా వాడి పేరు? వాడికేం తెలిసి పాణిని భాషాజ్ఞానానికి సమాధి కట్టాడని కూశాడు?” అని ప్రశ్నించాడు. “మీరా బ్లూం ఫీల్డు పుసకం చదివి అందులో దూషించాడాని గుర్తించారా?” అన్నాను. “నేను చదవలేదు. చదివిన వాళ్ళు చెప్తే నమ్మా”నన్నాడు. “అంత బాగా చదివి అర్థం చేసుకుని మీకు అబద్ధం చెప్పిన ఆ పండితుడెవరు?” అంటే “యూనివర్శిటీ తెలుగు శాఖలో ఉన్న .. గారు. మంచివాడు. నేనంటే బోలెడు అభిమానం. నాకాతడు అబద్ధాలూ, అప్రమాణాలూ చెప్ప”డని వివరించాడు. “ఆయనకు మీరంటే చాలా గొప్ప అభిమానమని నాకూ తెలుసు – నాకు నచ్చిన కవి విశ్వనాథ ఒకడు – అని రాసినవాడే కదూ?” అంటే “నీకెలా తెలుసా సంగతి?” అని నిలదీశాడు. “ఆ పద్యం ఆయన చదివిన సభలో నేనొక శ్రోతనో, ప్రేక్షకుణ్ణో. ఆ విషయం అలా ఉంచండి. బ్లూం ఫీల్డు రాసిన వాక్యం – Panini’s grammar is a monument of human intelligence – అన్నది. Monument అంటే ఏతాజ్ మహల్లాంటి గోరీయో అని అర్థం చేసుకున్న పండితుడి మాట నమ్మి మీరిలా మామీద ధ్వజమెత్తారు. చెప్పుడు మాటాలు వినరాదనీ, విన్నా నమ్మరాదనీ మీకు తెలీదా?” అన్నాను.

వెంటనే లేచి నుంచుని “మీరు – ఆ బ్లూం ఫీల్డ్ మీరన్నట్లే రాశాడని సాక్ష్యం చూపితే – జీవితాంతం అతణ్ణి దగ్గరకు రానీను” అని క్షణమాగి “ఈ ప్రసంగం రావటమే మంచిదయింది. రేపు ఉదయం 10 గంటలకు నేను తెలుగు శాఖకు వస్తున్నా – ఆ సోమయాజి అంటే నాకు పడకపోయినా. అక్కడ లిఖిత నిదర్శనం చూపాలి. ఎవరిమాట నిజమో తేలేదాకా నేను మీ ఇంట్లోనే దిగుతానని రాశా గాని, …వింటికి పోను. మా అన్న గారింటికి వెళ్తా – పిలవని పేరంటంగానైనా” అన్నాడు. “మీ అన్నగారెవ”రంటే “మల్లంపల్లి వా”రన్నాడు. ఆరాత్రి ఇతర ప్రసంగాలతో ఎవరం నిద్రపోకుండా మాట్లాడుకున్నాం.

తెలవారుజాము నాలుగున్నర గంటలయింది. ఆకస్మాత్తుగా నావైపు తిరిగి “ఓ గంట మాటలు కట్టిపెట్టు. నేను రాసుకోవాలి” అని సంచీలోంచి కాగితాల బొత్తితీసి యమ దీక్షతో నాలుగు పద్యాలు రాసి “ఇక రాయను. బుద్ధి మారింది. ఈ పద్యాలు విని నీ అభిప్రాయం చెప్పు. నీ పరిజ్ఞానమెంతో నాకు తెలుస్తుం”దన్నాడు. పద్యం సంగతి దేవుడెరుగు. ఆ కంఠమాధుర్యం. అందులోని ఒదుగూ పరమాద్భుతం. పక్కబెర్తుల వాళ్ళు లేచి విని ఆయనకు పాదాభివందనం చేశారు. “ఇప్పుడేమంటావ్?” అన్నాడు. “ఈ నాలుగు పద్యాల్లోనేగాక బహుశా మీ ఈ శతకం మొత్తంలో పరాకాష్ఠనందుకున్న భాగం ‘నేనెంత? నాబ్రతుకది యెంత?’ అన్న భాగం” అన్నాను. వెంటనే కౌగలించుకుని “నీవు పొగరుబోతువి, అలాగే. కానీ నానోరు మూయించావీ కూతకూసి. శ్రీ గిరిమల్లేశుణ్ణి ఆరాధిస్తూ మరో విధంగా రాయలేను – నా పొగరు చంపుకోకుండా. అదే కవిత్వమని కూసిన నిన్ను ఏం చెయ్యటానికీ వీల్లేదు. కానీ తుని వస్తున్నట్లుంది. ముఖ ప్రక్షాళనం కానీ. నా చేత్తో నీకు ఇడ్లీలు తినిపిస్తా”నని తొందరపెట్టి అంత పనీ చేశాడు!

కలిసి బయలుదేరాం. మల్లంపల్లి వారింట్లో దించి వస్తుంటే “అన్నా! వీడు నాకు సరిపాత కొత్త స్నేహితుడు – లేదా సరికొత్త పాత స్నేహితుడు. సాయంత్రం కావ్యగోష్ఠికి రమ్మను” అన్నాడు. “సరే”నన్నా. బ్లూం ఫీల్డు రాసింది చూపా. ఆ సాయంత్రం మల్లంపల్లి వారింటికి వెళ్ళా. కిష్కింధాకాండ రాస్తున్నాడు. చదువుతూ మధ్యమధ్య నావైపు చూస్తుంటే నాకే ఇబ్బందిగా ఉంది. నిశ్చలంగా బండరాయిలా కూర్చున్నా. కొంతసేపటికి సుగ్రీవ విషాదఘట్టం వచ్చింది. సీతాన్వేషణకు కోతిమూకను పంపి, అంతకన్నా రాముడికేమీ చేయలేకపోయానన్న నిర్వేదంతో “ఒక వంద దిక్కులైనను లేవు” అనగానే నాతల తిరిగిపోయింది. “ఆఁ” అన్నాను. “అన్నా! బండరాయి కరిగింది. అపిగ్రావారోది త్యపి దళతి వజ్రస్య హృదయ”మన్నమాట నిజమే. ఇక చదవను. వీడు రాక్షసుడు. అయినా చలించాడు. నా కవితా తపస్సు నెరవేరినట్లే”నన్నాడు. ఈయన ఏం మనిషి? ఇది నిందాస్తుతి కిందకు వస్తుందా? స్తుతినింద అనాలా? అనే ప్రశ్న సహృదయులు మని చెప్పుకునే ఆలంకారికులకు కావాలి. నాకు మాత్రం మరపురాని అనుభూతి కలిగింది. విశ్వనాథ విచిత్ర వ్యక్తి. జెకిల్ అండ్ హైడ్ లాంటివాడా? పోల్చదగిన మరో వ్యక్తి లేడా నా ఎరికలో?”

3

బూదరాజుగారు తెలుగు అకాడెమీలో ఇరవై ఏళ్ళు భాషావిషయాలమీద పనిచేశారు. అకాడెమీ పనుల్లో అధికారుల చేతుల్లో ఆయన పడిన అవమానాలు అనేకం. కాని ఎప్పుడూ నిర్మొహమాటంగా అనుకున్నదాన్ని చెప్పటం, ఆత్మగౌరవాన్ని నిల్పుకోవడం ఆయన లక్షణం..

ఒకసారి భాషా సంబంధమైన సదస్సునొకదానికి గవర్నరుని అధ్యక్షత వహించమనికోరడానికి బూదరాజు వెళ్ళారు. అప్పటి గవర్నరు శారదా ముఖర్జీ. అక్కడి అధికారి బూదరాజు గారిని, ఇక్కడ నిలబడండి, గవర్నరు గారికి నమస్కరించి అడిగినవాటికి సమాధానమివ్వమని నిర్దేశించారు. ఆవిడ ప్రవేశించి, తనే ఎందుకు రావాలి, ప్రధానితో కలవాలసిన పనులున్నాయే, వస్తానని రాకపోతే ఏమవుతుంది, ఇలా యక్షప్రశ్నలు – ఆయనని నిలబెట్టే – వేస్తే, బూదరాజుగారికి విసుగొచ్చి, ఆమెకు వినబడీ వినబడకుండా, “యత్నే కృతే యది నసిద్ధ్యతి కో త్ర దోషః?” అని గొణుకున్నారు. ఆమె తక్షణమే లేచి నమస్కరించి నానా మర్యాదా చేయబోయింది. బూదరాజు గారు తటపటాయిస్తూంటే, “మఫ్లంకర్ గారి పుత్రిక ఒక సంస్కృత పండితుణ్ణి అగౌరవపరచిందన్న అపఖ్యాతి రానీకండి! దయచేసి కూర్చోండి!” అని సాదరంగా మాట్లాడింది.

బూదరాజుగారు చాలా ప్రచురణలకి శ్రమపడటం, చివర్లో వాటి బాధ్యతని వేరే వాళ్ళకి అప్పగించి పేరొస్తే వాళ్ళకీ విమర్శలొస్తే ఈయనకీ పంచడం పరిపాటి. ఒకసారి తెలుగు అకాడెమి ప్రచురించిన తెలుగు సాహిత్యకోశంలో అనేక తప్పులున్నాయి – ఆంధ్రమహాభారత రచయితల్లో తిక్కన మూడోవాడు! – దీనికి బాధ్యులెవరని విధానపరిషత్తులో విమర్శలొచ్చాయి. ఒక గౌరవ సభ్యులు సదరు గ్రంథనిర్మాతను ఉరి తీయాలన్నారు. విద్యామంత్రి గారు బూదరాజుని సంప్రదిస్తే ఉరి తీయడమే మంచిదని ఒప్పుకున్నారు. హతాశుడైన మంత్రి గారు తెలుసుకున్నదేమిటంటే ఆ గ్రంథ పరిష్కర్త ఎవరోకాదు – ఆరోపించిన సభ్యుని కుమార్తె!

నిజానికి బూదరాజు గారి ఆత్మకథలో, ఆయన విమర్శ వాత పడని వాళ్ళు బహు తక్కువ. దాదాపు ప్రతిపేజీలోనూ ఏదో ఒక విమర్శ ఉన్నట్లనిపిస్తుంది.

దిగజారిపోతున్న విద్యాప్రమాణాలని ఉదహరిస్తూ ఒక సంఘటన చెప్పారు. 1987లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో కథానికల మీద PhD చేస్తున్న అభ్యర్థుడొకరిని – విజయనగరం వాస్తవ్యుణ్ణి – బూదరాజుగారు, “మీ ఊళ్ళొనే తెలుగు కథ పుట్టిందంటారు. నిజమా?” అని ఎన్ని రకాలుగా అడిగినా ఆ విద్యార్థికి గురజాడ “దిద్దుబాటు” గుర్తురాలేదు. “పోనీ చా.సో. గారు తెలుసా?” అంటే ఆయన ఎవరన్నాడు. ఇలాంటి దుఃఖం కలిగినప్పుడల్లా ఏదోఒక వెకిలి పద్యం రాసుకోవడం అలవాటయిన బూదరాజు రాసిన పద్యం:

“చాగంటి సోమయాజుల
రోగం కుదిరింది; ఎవ్వరున్ విజినగరం
లో గుర్తించరు కథకు
ల్లో గొప్పని; కాలమెంతలో మారినదో?”

ఇప్పుడంటే కంప్యూటర్ వచ్చి అవసరం కనిపించకపోవచ్చుగాని, ఇంగ్లీషు మాతృభాషగా వున్నవాళ్ళు కూడా రాసేటప్పుడు Dicitonary, Thesaurus, “The Elements of Style” లాంటి పుస్తకాలు చేతికి అందుబాటులో ఉంచుకుంటారు. తెలుగు వాళ్ళకి అలవాటు చేసుకుందామన్నా నిఘంటువుకి మించి వాడుక భాషకి సంబంధించిన పుస్తకాలు తక్కువ. ఈలోటుని తీర్చడానికి బూదరాజుగారు చేసిన కృషి చెప్పుకోదగ్గది. విలేకరుల కోసం రాసిన “తెలుగు భాషా స్వరూపం” లో తెలుగు రాయడం అలవాటు తప్పిన నాలాంటి వాళ్ళు నేర్చుకోదగ్గ విషయాలు ఎన్నో ఉన్నాయి. మచ్చుకొకటి:

తెలుగు ఇంగ్లిష్ నుడికారాలను సంస్కృతీకరించి సమాసాలు చేయవద్దు. అలాగే అన్యదేశ్య సమాసాలను మక్కికి మక్కిగా తెలుగు చేయవద్దు. ఉదా. “the cold touch of poverty”ని “దుర్భరదారిద్ర్యం” అని అనువదించండి గాని “దారిద్ర్యశీతలస్పర్శ” అనవద్దు. అలాగే “చల్లని కడుపు”ను “శీతలగర్భం” అని రాయవద్దు.

“ఈమాట”లో ఈమధ్య “ఏతావాతా” అనే పదం ఎక్కువగా వినబడుతోంది. దీని అర్థమేమిటా అని “శబ్దార్థరత్నాకరము”లో వెతికితే కనపడలేదు. బూదరాజు గారి “మాటల వాడుక: వాడుక మాటలు; అనుభవాలు-న్యాయాలు” పుస్తకంలో దీనికి చక్కని వివరణ ఉంది:

ఊతపదాలుగా వాడే మాటల్లో “ఏతావాతా” అనేదొకటి. ఇది ఒకానొక సంస్కృతపదం. అవ్యయం. అంటే విభక్తి ప్రత్యయాలుగాని, వచనంలో మార్పుగాని లేని పదం. దీని అసలర్థం “ఇంతమాత్ర”మని. ఆ అర్థంలో ఎందరీమాటను సరైన సందర్భంలో వాడుతున్నారో చెప్పలేం. దాని సరయిన రూపం “ఏతావత్” అనేది. సంస్కృతంలోని అవ్యయాలను తెలుగులో విడిమాటలుగా వాడకూడదని చిన్నయసూరి వంటి సంప్రదాయ పండితులు నిషేధించినా, “వృథా” వంటి అనేకావ్యయాలను అందరూ వాడుతూనే వున్నారు. “ఏతావాతా నేను చెప్ప వచ్చిందేమిటంటే…” మొదలైన ప్రయోగాలు ఉపన్యాసాల్లో వినిపిస్తుంటాయి. నిజానికి ప్రత్యేకించి ఏదో నిశ్చితార్థమున్న మాటనుగా దీన్ని వాడుతున్నవారు అత్యల్పసంఖాకులు. రాతకోతల్లో “కాగా, ఇది ఇలా ఉండగా, అయితే” వంటి అనేక పదాలను వాడుతున్నట్లే ఈ మాటను కూడా ఊతపదంగా వాడుతుంటారని చెప్పవచ్చు. దీని మూలార్థం తెల్సి ప్రయోగించాలంటే నూటికి తొంభై సందర్భాల్లో ఇది అతికే మాట కాదు.

బూదరాజుగారు ప్రస్తావించిన అనేక వ్యక్తులలో ఇద్దరు: ఆయనకు తెలుగు అకాడెమీలో ఇరవై ఏళ్ళు సహోద్యోగిగా దగ్గరి మిత్రుడిగా ఉన్న తాళ్ళూరి నాగేశ్వరరావు గారు. ఆయన అకాల మరణంతో అనిర్వచనీయ శూన్యభావం ఏర్పడిందని రాసుకున్నారు. తాళ్ళూరి, హితశ్రీ కలిసి “నూట పదహార్లు” అనే పేరుపొందిన కథా సంకలనం తెచ్చినట్లు గుర్తు. కాని దాంట్లో ఉన్నది అర్థ, క్షమించాలి, అర్ధ నూటపదహార్లు మాత్రమేననుకుంటాను. ఊరూపేరూ సంపాదించకుండానే వేరే ప్రపంచమనేది లేకుండా సారస్వత నికేతన గ్రంథాలయంలో పనిచేసిన లైబ్రరీ కామయ్య లాంటి వ్యక్తులు అరుదనీ, ఉన్నా వాళ్ళని గౌరవించేవాళ్ళు ఇంకా అరుదనీ విచారపడ్డారు.

బూదరాజుగారికి తెలుగువాళ్ళ చేతకానితనం మీద ఎంతో నిస్పృహ. మనకంటె చిన్న, పేద వాళ్ళయిన మళయాళ రాష్ట్రీయులు మహా నిఘంటువు కోసం కృషి చేయడం, ఇతర రాష్ట్రాలలో భాషా పండితులకున్న గౌరవం మనలో లేకపోవడం, మన చరిత్ర శాసనాలని సేకరించడంలో మన ప్రభుత్వానికున్న అలసత్వం, కాలం గడిచేకొలదీ అధికారుల పెత్తనం పెరగడం – ఇవన్నీ బూదరాజుగారిని చివరిదాకా బాధపెట్టిన విషయాలు.

చివరకి కొన్ని ప్రశ్నలు – మారిపోతున్న విలువలు ఆదర్శపాత్రమయినవా? పాశ్చాత్యుల జీవన విధానాల్లోని మంచి కన్నా చెడు పట్లే మనకి ఆకర్షణ పెరిగిందా? కులమతభాషా ప్రాంత విద్వేషాలతో తక్షణ సౌకర్యాలకోసం దీర్ఘకాలిక ప్రయోజనాలని విస్మరిస్తున్నామా? – ఇలాంటి ప్రశ్నలతో సమాధానాలను మనకే వదిలేసి స్వీయచరిత్ర ముగించారు.

ప్రతిదాన్నీ విమర్శించే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. నిజానికి బూదరాజు గారి ఆత్మకథలో, ఆయన విమర్శ వాత పడని వాళ్ళు బహు తక్కువ. దాదాపు ప్రతిపేజీలోనూ ఏదో ఒక విమర్శ ఉన్నట్లనిపిస్తుంది. కాని Theodore Roosvelt అన్నట్లు:

“It is not the critic who counts, not the man who points out how the strong man stumbled, or where the doer of deeds could have done better. The credit belongs to the man who is actually in the arena; whose face is marred by the dust and sweat and blood; who strives valiantly; who errs and comes short again and again; who knows the great enthusiasms, the great devotions and spends himself in a worthy cause; who at the best, knows in the end the triumph of high achievement, and who, at worst, if he fails, at least fails while daring greatly; so that his place shall never be with those cold and timid souls who know neither victory or defeat.”

బూదరాజు గారి ముద్రాముద్రిత రచనలు, పరిశోధనలు ఆయన జయాపజయాలకు కలకాలం నిలిచే నిదర్శనాలు.

కొడవళ్ళ హనుమంతరావు

రచయిత కొడవళ్ళ హనుమంతరావు గురించి: పుట్టిందీ పదో తరగతిదాకా చదివిందీ ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో. ఇప్పుడు ఉండేది Washington రాష్ట్రంలో Seattle నగరానికి దగ్గర్లో. ఇంజనీరుగా పని చేసేది సాఫ్ట్ వేర్ రంగంలో. దాదాపు పాతికేళ్ళుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగంలో లీనమై సాహిత్యదృష్టి కొరవడిన లోపాన్ని సరిదిద్దుకోడానికి, గత మూడేళ్ళుగా కొందరు తెలుగువాళ్ళతో పరిచయం, కాస్త తెలుగు చదవడం, ఎప్పుడన్నా ఓవ్యాసం రాయడం - అదీ ప్రస్తుత వ్యాపకం.  ...