గేటెడ్ కమ్యూనిటీ

4

“అయితే మిత్రులిద్దరూ గొడవ పడ్డారన్న మాట” అంది సుధ, సతీష్ చెప్పిందంతా విని.

“గొడవేం కాదులే. అర్జున్ తో దోస్తీ అంటే ఇలాంటి వాటికి సిద్ధ పడాల్సిందే. తిక్క వెధవ” అది మెచ్చుకోలో, తెగడ్తో తెలీకుండా అన్నాడు సతీష్.

అర్జున్ సంగతి నాకు తెలియదు కానీ మంగ బంగారం. అటువంటి మనిషి అంత నిర్దయగా ప్రవర్తించాలంటే ఎంతటి క్షోభ అనుభవిస్తుంటుందో.

“ఆశ్చర్యమేం లేదు. మంగతో పార్క్ కెళ్ళానని చెప్పానా అక్కడా ఇలాంటి గోలే నాకు” అంది సుధ, అంతవరకూ దాచిన సంఘటనని చెప్పడానికి సిద్ధ పడుతూ.

“మొన్న గురువారం నాడు. పిల్లలందరికీ ఏదో శెలవ. నువ్వూ, అర్జున్ ఆఫీసుకు వెళ్ళినప్పుడు నేనూ మంగా కలిసి పిల్లల్ని పార్కుకి తీసుకెళ్ళామని చెప్పాను.. గుర్తుందా?” అడిగింది సుధ.

“ఆ.. నువ్వు ఫోన్ చేశావ్, నేనే ఎందుకు గుర్తొచ్చానా అని… ”

“అవును. నేరుగానే చెప్పిందిలే… మీతో అయితే కారులో వెళ్ళిరావచ్చు… ఈ ఎండలో ఇద్దరు పిల్లల్ని తీసుకుని సిటీ బస్సులో వెళ్ళే ఓపిక లేకే మీకు ఫోను చేశాను అని చెప్పేసింది” అంది సుధ.

“పోనీలే ఆమాత్రం నిజాయితీ అన్నా ఉంది” అన్నాడు సతీష్.

“అదికాదు ముఖ్య విషయం. పార్కులో ఉన్న రెండు ఉయ్యాలల్లో ఇద్దరు పిల్లల్నీ కూర్చో పెట్టి ఊపడం మొదలు పెట్టింది. అరగంట అయినా వదల్దు. మన వాడు ఆ పక్క ఎవణ్ణో దోస్తీ చేసుకుని హారీ పోటర్ గురించి మాట్లాడు తున్నాడు. చుట్టు పక్కల బోలెడు మంది పిల్లలు ఆ ఉయ్యాల చుట్టూ ప్రదక్షిణాలు. మంగ పిల్లల్ని దింపి వేరే పిల్లలకి ఇస్తే బావుణ్ణని నా కెంత అనిపించినా నోరు మెదపలా. ఓ బామ్మగారు వచ్చి మంగతో పిల్లల్ని దింపి నా మనవరాల్ని ఎక్కిస్తావా లేదా అని గొడవ.

నాకు తల కొట్టేసినట్టనిపించింది. మంగ తడువుకోకుండా ఇంకో అయిదు నిమిషాలు అని తన పని తాను చేసుకు పోయింది. చుట్టు పక్కల అందరూ బయటకే వినపడేటట్టుగా ఎన్ని అన్నా చీమ కుట్టినట్టయినా లేదు మంగకి. నాకు ఆశ్చర్యమేసింది”.

“గుడ్… నువ్వేం వేలు పెట్టలేదుగా” అనుమానంగా అడిగాడు సతీష్.

“దాదాపు వేలు పెట్టలా. అంతా అయిపోయాక నోరు ఊరుకుంది కాదు. పాపం ఆ పెద్దావిడకి ఇచ్చేస్తే పోయేదేమో … ఆ చంటిది ఆవిడ ప్రాణం తీసేస్తోంది ఆ ఉయ్యాల కోసం అన్నా” గాలి పీల్చుకోవడానికి ఆగింది సుధ. ఊపిరి బిగ పట్టి వింటున్నాడు సతీష్. మళ్ళీ మొదలు పెట్టింది సుధ.

“మీకేమండీ చెపుతారూ… మీ పిల్లాడు రేపు మీ కమ్యూనిటీ పార్క్ లో ఆడుకుంటాడు. మళ్ళీ మీలాంటి వాళ్ళు కారులో తీసుకొస్తే తప్పా మా పిల్లలకి ఈ ఉయ్యాల దొరకదు. ఇంత అభిమానం, పరువు కాపాడు కోవాలంటే సిటీ బస్సులూ, పబ్లిక్ పార్కులూ కష్టం. ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళాలంటే మా ఆయన రావాలి. ఆయన ఆదివారం తప్పా రారు. ఆది వారం నాడు ఇంకా ఎక్కువ గొడవలు పడాలి. కాసేపు చెపులు మూసు కోవటమే శరణ్యం ఇక్కడ పని కావాలంటే” మంగ అన్న మాటల్ని తానే అన్నట్టుగా అభినయిస్తూ చెప్పింది సుధ.

“హు… కాస్త జాగ్రత్తగా ఉండాలి అర్జ్జున్, మంగలతో. మర్చేపోకు, అంతకాక పోయినా అలాంటి ప్రపంచం లోంచే వచ్చాం మనం” భార్యకు చెప్తున్నట్టున్నా తనకే చెప్పుకుంటూ అన్నాడు సతీష్.

“నాకు తెలియదా. అర్జున్ సంగతి నాకు తెలియదు కానీ మంగ బంగారం. అటువంటి మనిషి అంత నిర్దయగా ప్రవర్తించాలంటే ఎంతటి క్షోభ అనుభవిస్తుంటుందో” బయటకే వినపడేలా అనుకుంది సుధ.