India Vs Australia cricket match చూస్తున్నాను.ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలవడం నేను ఉదయాన్నే నిద్ర లేవడం లాంటిదే! ఎప్పుడో గాని జరగదు. ఇరవైరెండేళ్ళ తరవాత ఇందియా ఆస్ట్రేలియా లో ఒక టెస్ట్ మ్యాచ్ గెలుస్తోందని. సంవత్సరం లో కనీసం ఒక్క సారి కూడా సూర్యోదయానికి ముందు నిద్ర లేవని నేను 5.30 కి అలారం పెట్టి లేచి చూస్తున్నాను.ఇంటిలో ఎవ్వరూ నిద్ర లేవ లేకపోవడం తో నేను ఒక్కడినే నాకు కావల్సిన చానల్స్ అన్నీ మార్చుకొంటూ చూస్తున్నాను.డ్రింక్స్ బ్రేక్ వచ్చినప్పుడు బ్రేక్ ఫాస్ట్‌లుంచ్ బ్రేక్ వచ్చినప్పుడు స్నానం చేసి మళ్ళా టివి ముందు సెటిల్ అయ్యిపోయా.ఈలోగా శ్రీను గాడు వచ్చాడు.సరిగ్గా అప్పుడే గంగూలీ ఔటయ్యాడు.”లెగ్ పెట్టావు రా శని గా” అన్నాను.వాడిని ఏమైనా అనే చనువుంది.
“నువ్వు ఇంజినీర్ వి రా.ఈ ఐరన్ లెగ్ లు,శకునాలు నమ్ముతావా? ” వెటకారం గా అన్నాడు.శ్రీను గాడు నా ఇంజినీరింగ్ క్లాస్మేట్‌ఇంజినీరింగ్ కంప్లీట్ అయ్యాక నేను ఎంటెక్ కీ వాడు జాబ్ కీ వెళ్ళిపోయి కాలం విడదీసిన రెండు చెట్టు కొమ్మల్లా విడిపోయాం. ఆ తర్వాత ఎప్పుడైనా ఇద్దరం ఒకేసారి శెలవు మీద వచ్చినప్పుడు కలవడం.దూరం మనుషుల్ని దగ్గర చేస్తుందో లేదో నాకు తెలియదుగానీ పాత స్నేహితుల్ని మళ్ళీ కలవడం మాత్రం మంచి అనుభూతి.
ఈలోగా మళ్ళీ డ్రింక్స్ బ్రేక్ వస్తే చానల్స్ అన్నీ ఒక్కొక్కటే మారుస్తున్నాను.ఏ చానల్ లోనూ సంతౄప్తి కరమైన ప్రోగ్రాం ఒక్కటీ రాకపోవడం తో అలా ముందుకు వెళుతున్నాను.చివరికి భూమి గుండ్రం గా ఉన్నట్టు,ముందుకో వెనక్కో తెలియని మనిషి మేధ ప్రస్థానం లా మొదటి చానలే వెక్కిరిస్తూ పునర్దర్శనం.
“అమీబా నుంచి అనంత విశ్వం వరకు వలయం పై జపనీయుల తత్వాన్ని నీదైన శైలి లో రిమోట్ కంట్రోల్ తో నిరూపించావు రా” నవ్వుతూ అన్నాడు శ్రీను గాడు.
ఒక్క ముక్క అర్ధమైతే చెప్పుతో కొట్టు అన్నా.”ఏం లేదు రా అమీబా నుంచి అండ పిండ బ్రహ్మాండం వరకు అంతా వలయమే…ఆది అంతం లేని ప్రయాణమే! అన్నాడు.ఇప్పుడు కాస్త నయమనిపించింది వాడి వివరణ.వాడికి philosophy మీద ఆశక్తి ఎక్కువ.జ్ఞాన సముపార్జన మీద మక్కువ ఉన్న ప్రతి వ్యక్తీ తత్వవేత్తే అంటాడు.సోక్రటీస్ నుంచి రసెల్ దాకా చదివాడు.స్వేచ్ఛ మీదా,స్వాతంత్రయం మీదా చాలా సునిశితమైన అభిప్రాయాలున్నాయి వాడికి.అయితే వాడు తొందర గా ఎవ్వరితోనూ కలవలేడు.అధిక సమయాలు అంతర్ముఖం గా ఉంటాడు.అందుకే వాడు చదివే కొద్దీ పేజీలొచ్చే నవలలాంటి వాడు.అలాంటి శ్రీను గాడు నాకు ఇంత క్లోజ్ అవడం లో ఒకే బస్ రూట్ లో ఉన్న మా ఇల్లులు,బస్ లో ఇద్దరినీ కలిపి ర్యాగింగ్ చేసిన సీనియర్లు, ఒక్కరం చదివితే కొరుకుడు పడని ఇంజినీరింగ్ పుస్తకాలు కారణాలు గా చెప్పుకోవచ్చు.
లక్ష్మణ్ కొట్టిన ఫోర్ తో నా గతానుభూతుల నెమరువేత కి తెరపడింది.మళ్ళీ మ్యాచ్ ఇంట్రెస్టింగా మారడం తో చూస్తున్నాం.ఈ లోగా ఇంట్లోంచి మా చెల్లెలు శైలజ వచ్చి టివి ముందు కూర్చొంది (రాబోయే పెను తుఫాను కి సూచన గా ఈదురు గాలులు ప్రారంభమైనట్టు).ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ప్రతిరోజు పెనుతుఫానే ఇంట్లో.. నాకు కావల్సిన స్పోర్స్ట్ చానల్స్ గురించి నేను,చూయింగ్ గం లా సాగుతూ ………. ఉండే ఆ ఏడుపుగొట్టు సీరియల్స్ గురించి శైలు.ఈ రిమోట్ కంట్రోల్ మీద ఆధిపత్యం కోసం ప్రతి ఇంటిలోనూ గొడవ మామూలేనేమో!
ఇప్పుడు “ఏడవాలని ఉంది” సీరియల్ వస్తుంది రా అన్నయా.ఈ మ్యాచ్ పెడితే ఎలా? (తుఫాను హెచ్చరిక).రిమోట్ మీద ఆధిపత్యం కోసమైతే నేమి,మధ్యలో యాడ్స్ టైం లో మ్యాచ్ చూడ్డానికైతే నేమి నేను కూడా అప్పుడప్పుడు ఈ సీరియల్స్ చూసేవాడిని.అన్ని సీరియల్స్ ఒకేలాగ ఏడుస్తాయి సీరియల్ లోని నిజం ఏడుపు సాక్షి గా! అన్ని సీరియల్స్ లోనూ వాళ్ళే నటీనటులు సినిమా డైరక్టర్లు కొత్త కోసం వెంపర్లాట వల్ల చాన్సులు తగ్గిపోయిన నడివయసు హీరోయిన్లు,ఇంక సినిమాల్లో కుర్ర వేషాలు వేసి ఫైట్లు చెయాలేని వౄద్ధ హీరోలు. సీరియల్ పేర్లు మాత్రం మారుస్తారనిపిస్తుంటుంది.నా ఇంజినీరింగ్ స్టార్ట్ అయినప్పుడు ప్రారంభమైన “వింత శోకాలు” సీరియల్ నా ఇంజినీరింగ్ కంప్లీట్ అయిపోయి సంవత్సరం దాటుతున్నా అది మాత్రం అయి చావట్లేదు.ఖర్మ.అది అయిపోతే శోకసముద్రాలు ప్రారంభం. ఆంధ్ర మహిళల సహనం మీద నాకున్న సందేహాలన్నీ ఈ దెబ్బతో పటాపంచలైపోయాయి, తెలుగు సినిమా ఆఖర్లో హీరో మీద హీరోయిన్ కి ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయినట్టు.
“ఏడవాలనుంది పెడతావా పెట్టవా?” శైలూ గద్దింపుతో నా సీరియల్ ఆలోచనలకి to be continued తగిలించేసి శైలు ని ఒప్పించే ప్రయత్నాలు ప్రారంభించాను. 22 యేళ్ళ తర్వాత ఇండియా మ్యాచ్ గెలుస్తోందే శైలూ.చూడు లక్ష్మణ్ చూడు కవర్ డ్రైవ్ ఎంత అద్భుతం గా కొట్టాడో…అంతా ఆర్టిస్ట్ అని పొగిడేస్తున్నారు చూసావా (అబ్బే ఇవేమీ తన మీద పని చేసినట్టు లేదు)
“పక్కింటి వాళ్ళని అడగొచ్చులే సీరియల్ ఏమైందో”
“రేపు పేపర్ లో చూడొచ్చులే మ్యాచ్ ఏమైందో”
“అన్ని సీరియల్స్ లోనూ అదే కథ కదే శైలూ”
“అన్ని మ్యాచ్చుల్లోనూ అవే షాట్స్ కద రా అన్నయ్యా”
ఇంక దీనితో వాదించలేనని తెలిసి కాళ్ళ బేరానికి వచ్చేసా.నువ్వు పొరపాటున మెడిసిన్ చదువుతున్నావు కానీ శైలూ ఖచ్చితం గా గొప్ప లాయరయ్యేదానివి.ఈ ఒక్క మ్యాచ్ చూడనిస్తే నీకు Tel Mr Softy టెల్ లో Tel ice cream టెల్ కొనిపెడతానే శైలూ. “ఇంతవరకు చాలా సార్లు చెప్పావు.అదేం కుదరదు ఏడవాలనుంది పెట్టాల్సిందే”
మేమిద్దరం ఇక్కడ ఇలా చస్తుంటే శ్రీను గాడు మాత్రం ఎవరివైపూ చెప్పడం లేడు.అసలు వాడికి రెండింటి మీదా ఆసక్తి లేదు మరి.వాడి మౌనాన్ని నాకు అనుకూలం గా మార్చుకొని “చూడు శ్రీనివాస్ కూడా వచ్చి కూర్చొన్నాడా…వాడికి ఆ చెత్త సీరియల్స్ అన్ని చూపిస్తే ఏం బావుంటుంది? అదీ ఇదీ అని నానా రకాలు గా శైలు ని ఒప్పించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది.అయితే ఈ గొడవల్లోనూ,వాదించుకోవడం లోనూ,ఒప్పించుకోవడం లోనూ ఎంత ఆనందం ఉందో మా ఇద్దరికే తెలుసు.
ఈలోగా మ్యాచ్ అయిపోయింది.ఇండియా ఎలాగైతేనేం మ్యాచ్ గెల్చేసింది.ఇక రిమోట్ కి శైలు ని ఏకచత్రాధిపతి ని చేసేసి నేను శ్రీను గాడు బయటకి వెళ్ళిపోయాం.
కొంచెం సేపు మ్యాచ్ గెల్చిందన్న ఆనందం లో వాడు వింటున్నాడో లేదో కూడా గమనించకుండా నాకు తెలిసిన statastics అన్నీ ఏకరువు పెట్టేసి,వాడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం తో ఇంజనీరింగ్ విషయాలు మాట్లాడుకున్నాం.అయితే సంభాషణ ముక్కలు ముక్కలు గా తెగిపోతోంది.అది ఇద్దరు అపరిచిత వ్యక్తుల మధ్య సంభాషణ గా మారకముందే కర్తవ్యం గుర్తొచ్చిన వాడిలా విషయాన్ని వాడికి ఇష్టమైన philosophy మీదకు మళ్ళించా.శ్రీనుగా నువ్వేదో పెద్ద ఫిలాసఫర్ ని అంటావు కదా..ఇప్పుడు జరిగిన ఈ రిమోట్ కంట్రో సంఘటననీ మనిషి స్వేచ్చ నీ రిలేట్ చెయ్యరా చూద్దాం అన్నా.ఆ ప్రశ్న కి అర్ధం నాకే తెలియదు.దానికి వాడు ఇప్పుడు మీ ఇంట్లో జరిగిన విషయం బయటకి చెప్పకపోయినా మీ ఇద్దరికీ ఇష్టమైన విషయం. కానీ ఒక మనిషి అభిప్రాయాలు మరొక మనిషి మీద రుద్దడానికి ఈ రిమోట్ కంట్రోల్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.జాగ్రత్త గా ఆలోచిస్తే ప్రపంచం లో సగానికి పైగా సమస్యలకి కారణం ఒక వ్యక్తి మరొక వ్యక్తి ని కంట్రోల్ చెయ్యాలనుకోవడమే అనిపిస్తుంది.రసెల్ ఒక దగ్గర ఇలా అంటాడు..
“శక్తి చెడ్డదైతే శక్తి పై మమకారాన్ని మన హౄదయం నుండి తొలగిద్దాము.ఇందులో ఉంది మానవుడి స్వేచ్చ.మనలో సౌందర్య తౄష్ణ,నైతిక జిజ్ఞాస సమకూర్చిన దైవాన్నే ఆరాధిద్దాము.ఆహ్లాదకర జీవిత అనుభూతులనే స్వర్గం గా అంగీకరిద్దాము.కౄషిలో వాంచ లో ప్రతి క్షణము బాహ్య శక్తుల దౌర్జన్యానికి మనం గురౌతున్నాము.కానీ ఊహలో,ఆదర్శం లో మనం స్వేచ్చా జీవులంజీవించి ఉన్న కాసేపు మౄత్యువు ని కూడా ధిక్కరించే స్వేచ్చా జీవులం.”
శ్రీనుగాడు కాస్త ఉద్వేగం గా మాట్లాడుతున్నాడు.ప్రతి మనిషి కీ కొన్ని ప్రత్యేకమైన ఇష్టాలుంటాయి.వాటిని గురించి మాట్లాడేటప్పుడు ప్రతి వ్యక్తీ ఒక రకమైన ఉద్వేగానికి లోనౌతాడు.అటువంటి ఉద్వేగాన్నే నేనిప్పుడు శ్రీనుగాడిలో చూస్తున్నాను.
ఐతే వాడిని మరింత లోతు గా మాట్లాడించాలని ఐతే ఏమిటి రా నీ ఉద్దేశ్యం? ఆ ఏడుపుగొట్టు సీరియల్స్ ని నువ్వూ సమ్ర్ధిస్తున్నావా? అన్నా.
“అది అప్రస్తుతం.నేను మనుషుల స్వేచ్చ గురించి మాట్లాడుతున్నా.వాడి ఆలోచనా త్రాసు ముల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వైపు కి ఒరగదేమో.
వాడిని ఎలాగైనా unbalance చెయ్యాలనిపించింది.అయితే conclusion ఏమిటి? నేను చేసింది తప్పనా నీ అభిప్రాయం?
“ఒకరి తప్పొప్పులు నిర్ణయించడం నా పని కాదు.నాకు తోచింది చెప్పాను”
“లేదు.నువ్వు ఏదీ సూటి గా చెప్పడం లేదు”
“నువ్వు రిమోట్ లో స్విచ్ నొక్క గానే నీకు ఇష్టమైన పాటో పద్యమో వినిపించడానికి నేనేమీ నీ టివి ని కాదు” అన్నాడు.
“ఈ ఉపమానం ఏదో బావుందే” అభినందించకుండా ఉండలేకపోయా. వాడిని unbalance చెయ్యబోయి నేనే unbalance అయిపోయాను.ఇక వాడిని ఇబ్బంది పెట్టకుండా మిగతా విషయాలు మాట్లాడుకున్నాం.
ఇది జరిగిన తర్వాత వాడెప్పుడు ఫోన్ చేసి నన్ను హైదరాబాద్ రమ్మని బలవంతం చేసినా ఏంట్రా శ్రీనుగా రిమోట్ స్విచ్ నొక్కుతున్నావా? నేనేమీ నీ టివి ని కాదు అని వాడిని ఏడిపిస్తూ ఉండే వాడిని.ఇద్దరం తెగ నవ్వుకునే వాళ్ళం.
ఆ తర్వాత ఏదో సెమినార్ కని హైదరాబాదు వెళ్ళాల్సి వచ్చింది.శ్రీను గాడు స్టేషన్ కి వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళాడు.వాడు నలుగురు రూం మేట్స్ తో కల్సి ఉంటున్నాడని తెలిసి ఆశ్చర్యపోయాను.అవసరం ఎంత ఫిలాసఫర్ నైనా మామూలు మనిషి గా మారుస్తుంది కాబోలు.
ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని,స్నానం చేసి టివి ముందు కూర్చొని రిమోట్ ఏది రా అని అడిగా.వాడు టివి రిమోట్ పని చెయ్యడం లేదు రా. టివి కి ఆ రిమోట్ కంట్రోల్ నుండి విముక్తి లభించింది! అన్నాడు.
అప్పుడు వాడు నేను కలిసి నవ్వుకొన్న నవ్వు మిగతా వాళ్ళకి అర్ధం కాక మమ్మల్ని వెర్రి వెధవల్ని చూసినట్టు చూస్తున్నారు.
మా నవ్వు మాత్రం తెరలు తెరలు గా సాగిపోతునే ఉంది.తెలుగు డైలీ సీరియల్స్ లాగే!!!!