అరుగు మీద ఇబ్బందిగా కదిలారు నారాయణ గారు.
అప్పటికి ఓ అయిదు నిమిషాలనుంచీ, గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్న రెడ్డి గారు, వారి వాక్ప్రవాహానికి ఆటంకం కలిగిస్తూ బావి గిలక ప్రక్కన కూర్చుని అదే పనిగా అరుస్తున్న కాకి వైపు కోపంగా ఓ చూపు చూసి, “…ఎంత బ్రహ్మాండంగా జరిగిందనుకున్నారు? ఎన్ని బళ్ళూ, ఎంత మంది జనం… చెప్పడానికి నా నోరు చాలడం లేదనుకో” అని అలుపుతీర్చుకోవడానికి ఆగారు.
“అబ్బా… అంత బాగా జరిగిందా? ఇంతకీ ప్రభలెన్నొచ్చాయి? ఎంత పెద్దవొచ్చాయి?” అడిగారు సుబ్బరాజు గారు. ఆశ్చర్య ప్రకటన కోసం తెరుచుకున్న పెంచలయ్య గారి నోరు, తెరుచుకున్నట్లే ఉంది.
అప్పాపురం నుంచి హిందూపురం వెళ్ళే దారిలో, దారికి కాస్త ఎడంగా ఒక శివాలయం ఉంది. దాని ప్రక్కనే ఒక పాడుబడ్డ చేద బావి ఉంది. బావికి పాతిక ముప్పై అడుగుల్లో ఒక పెద్ద మర్రి చెట్టుంది. చెట్టు చుట్టూ కట్టిన అరుగు మీద కూర్చొని ఉన్నారందరు.
“అక్కడికే వస్తున్నా, నేను లెక్క పెట్టలేదు కానీ చాలానే వచ్చాయన్నారు. ఎంత పెద్ద ప్రభలో… దేదీప్యమానమైన లైటింగులు… అబ్బో అల్లాంటి ప్రభల్ని ఇంత వరకు ఎవరూ కట్టి వుండరు, ఇకముందు కట్టలేరు,” అంటూ తన్మయత్వంతో అర్థనిమీలిత నేత్రులయ్యారు రెడ్డి గారు.
నిన్నా మొన్నా హిందూపురంలో జరిగిన తిరనాళ్ళకు వెళ్ళొచ్చిన రెడ్డి గారు, అదే అరుగు మీద కూర్చున్న మిగిలిన వాళ్ళకు తిరనాళ్ళ సంబరాల గురించి చెబుతున్నారు. మంచి మాటకారి, మాట్లాడాలన్న తపన ఎక్కువగా కలవాడూ కూడా కావడంతో, ఏ విషయాన్నైనా సరే ఆసక్తికరంగా చెప్పగలరు. అలాగని మాట్లాడాలి అన్న ఏకైక ధ్యేయంతో అవాకులు చవాకులు పేలి అందరి బుర్రలు తినరు.
వింటున్న నారాయణ గారు, తిరనాళ్ళ వరకూ పోన్లే అని సరిపెట్టుకున్నారు గానీ, ప్రభల విషయానికొచ్చేసరికి వారి మనసు చివుక్కుమంది. ఇక రెడ్డి గారి పోకడలకు అడ్డు పడక తప్పదనిపించింది.
అనిపించిందే తడవుగా “అయ్యా రెడ్డి గారు, మీరు వేయి నాలుకల ఆదిశేషుడిలా అతిశయోక్తులు వల్లించడం ఏమీ బాగోలేదు. అలాంటి తిర్నాల ఎన్నడూ జరగలేదంటే నాకేమాత్రమూ ఇబ్బంది లేదు. కానీ ప్రభల విషయంలో మాత్రం మీరు మరీ గోరంతల్ని కొండంతలు చేస్తున్నారు” అన్నారు నారాయణ గారు మహదావేశంతో.
నారాయణ గారు కూడా మాటకారే. అన్ని విషయాల్లోనూ తమకు అపారమైన జ్ఞానం కలదనీ, తమ జ్ఞాన కాంతుల్ని చుట్టూ ఉన్న పామర జనుల అజ్ఞానాంధకారం పై ప్రసరించాలనీ, అలా ప్రసరించి లోకాన్ని ఉద్ధరించాలనీ వారి తపన! దాంతో అన్ని విషయాల్లోనూ తల దూర్చి, చుట్టూ ఉన్న వాళ్ళకు తలనొప్పి కలిగిస్తుంటారు. కొంత మంది “పోన్లెద్దూ, పెద్దాయన! ఊ కొడితే పోలా,” అనుకుంటారు. మరి కొందరు, “ఇంత వయసొచ్చినా, అన్నిట్లోకి తగుదునమ్మా అని వేళ్ళు, కాళ్ళు పెట్టి లాక్కోలేక పీక్కోలేకా సతమతమవడమెందుకు… అందరినీ సతాయించడమెందుకూ…” అని చాటుగా అనుకుంటూ ఉంటారు.
“ఆ ప్రభల్ని చూస్తే మీరలా అనరు నారాయణ గారు. ఎంతెత్తు వనుకున్నారు? చుక్కల్ని తాకినట్లనిపిస్తే…’నభూతో నభవిష్యతి’ అంటారు చూడండి అలా” అంటున్న రెడ్డి గారి మాటల్ని, మధ్యలో తుంచేస్తూ…
“మళ్ళీ అదే కూ…” అతి కష్టమ్మీద తమాయించుకుని “…మాట! ఇంతకు ముందు ఎవరూ కట్టలేదని, ఇకముందు ఎవరూ కట్టలేరని మీరెలా చెప్పగలరు?” వస్తున్న కోపాన్ని బలవంతంగా ఆపుకుంటూ అన్నారు నారాయణ గారు.
వాళ్ళలో కొందరు నారాయణ గారంతగా కోప్పడ్డానికి గల కారణాలు గురించి ఆలోచించసాగారు. కొందరైతే గొడవ ముదిరి పాకాన పడితే, రుచికరమైన వినోదం దొరుకుతుందేమోనని, సౌకర్యంగా సర్దుకుని కూర్చున్నారు.
నారాయణ గారి కళ్ళు కాస్త ఎర్రబడ్డాయి. చేతులు చిన్నగా కంపిస్తున్నాయి.కంఠం పిసరంత వణుకుతోంది.
“అరుగు దగ్గరనుంచీ, ఇంటికెళ్ళే లోపు ఏమౌతుందో తెలీదు కానీ, ఇకముందు అలాంటి ప్రభలు ఎవరూ కట్టలేరని ఎలా చెప్పగలరూ?” దీర్ఘం తీశారు అనంతయ్య గారు, తన ప్రక్కన కొన్ని క్షణాల ముందు పడ్డ కాకి రెట్ట గురించి తను ఊహించలేక పోవడాన్ని గుర్తు చేసుకొని, వేదాంత ధోరణిలో.
అలా అన్న వెంటనే నాలుక కరుచుకున్నారు. చేత్తో నొసటి మీద గట్టిగా చరుచుకున్నారు. కానీ అప్పటికే, జరగాల్సింది జరిగి పోయింది.
అదే అరుగుమీద, చెట్టుకు వెనుక వైపు కూర్చున్న భక్త బృందం చెవుల్లోకి అనంతయ్య గారి వేదాంత పూరితమైన మాటలు ప్రవహించాయి.
అప్పటి వరకు రాత్రి దర్శనమిచ్చిన దేవుడి గురించి ఒకరు, ఉదయాన్నే నిద్ర లేపి రెండు ఆపిల్ పళ్ళు చేతిలో పెట్టి దీవెనలందించిన దేవత గురించి మరొకరు చెబుతుంటే, నేనేమీ తక్కువ తినలేదంటూ ఇంకొకరు రాత్రి లఘుశంకకు తాను లేచినప్పుడు, దేవుడు తన భక్తిని మెచ్చి ఒసంగిన రెక్కలతో ఆకాశానికెగిరి, చంద్ర లోకంలో రెండు ఘడియలు విహరించి వచ్చిన అనుభవాన్ని మిగిలిన వారితో పంచుకుంటున్నారు. ఎవరికి వారు, ఎదుటి వాళ్ళు తమ చెవుల్లో పూలు పెడుతున్నారని మనసులో అనుకున్నా, పైకి మాత్రం మీ పూజ అలాంటిది, మీ దీక్ష గొప్పది, మీ తపస్సు పరమేశ్వరుడు మెచ్చాడు లాంటి మెచ్చుకోలు మాటలతో ఒకరినొకరు ఉబ్బేసుకుంటూ మర్రి చెట్టు కొమ్మలకు తలలు తాకించుకుంటూంటారు. అలాంటి సమయంలో చెట్టుకు మరో వైపు నుంచి వచ్చిన అనంతయ్య గారి మాటలు ఆ భక్తాగ్రేసరుల్ని పరవశింపజేశాయి.
ఉత్సాహంగా, వాళ్ళు అనంతయ్య గారి సరసకు వెళ్ళి కూర్చున్నారు.
“అవును, ఇంకో నిమిషంలో ఈ మర్రిచెట్టు కూకటి వేళ్ళతో సహా కూలిపోవచ్చు. మనం హాయిగా స్వర్గానికి ఎగిరి పోవచ్చు. ఎవరు చూడవచ్చారు,” అన్నారు భక్తుల్లో ఒకరు.
“ఇక్కడి వాళ్ళందరూ స్వర్గానికే వెడతారన్న భరోసా ఏమిటి?” సందేహం లేవనెత్తాడు మరో భక్తుడు.
వాళ్ళనలాగే వదిలేస్తే, మాటలనుంచీ పాటలదాకా, అక్కణ్ణుంచీ కీర్తనలు, భజనలు దాకా వెళ్ళి పోతారని, ప్రభల గురించి జరుగుతున్న చర్చ పక్క దోవ పడుతుందని భావించి, భక్తులు మినహా అందరూ లేచి, అరుగుకు మరో వైపుకు వెళ్ళారు. కొందరైతే అనంతయ్య వైపు కొర కొర చూశారు.
చర్చను కొనసాగిస్తూ “ముందు ముందు ఎవరైనా కడతారో లేదో తెలియదు కాని, ఇంతకు ముందు మాత్రం అంత ఎ్తౖతెన పెద్ద ప్రభలను ఎవ్వరూ కట్టలేదు. ఆ అలంకరణ, లైటింగులూ ఎవరూ చేయలేదు,” అన్నారు రెడ్డి గారు దృఢంగా. వీరు కాస్త పట్టు విడుపు గలవారు. వితండవాదం చేసి గొడవ పెట్టుకునే తత్వం కాదు వీరిది.
“ఇంతకు ముందు జరగలేదని ఎలా చెప్పగలరు? ఏమో ప్రక్క ఊళ్ళలో వారికంటే అఖండులు ఎవరైనా అంతకంటే అట్టహాసంగా ప్రభలను ఇంతకు ముందు కట్టారేమో?! అయినా, ఆ ప్రభలే గొప్పవని నిరూపించే సాధనాలు, యంత్రాలు, మంత్రాలు, రాళ్ళూరప్పలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా?” కాస్త వెటకారం ధ్వనించింది నారాయణ గారి మాటల్లో.
“వారు చూసిన వాటిలో అవే గొప్పవేమో! అయినా, మీరు ఈ ప్రభల్ని చూడకుండా అవి గొప్పవి కాదని ఎలా చెప్పగలరు?” అడిగారు పూజారి గారు, చెట్టు చాటునుంచి తొంగి చూస్తూ.
మండుతున్న నారాయణ గారి వంటి మీద, మరి కాస్త పెట్రోలు పోసినట్లైంది. తిట్ల దండకం ఎత్తుకుందామనుకున్నాడు. అరుగు కట్టుబాట్లు గుర్తొచ్చాయి.
ఆ కట్టుబాట్ల కథ తెలియాలంటే ఆ అరుగు గతం కాస్త తెలియాలి.
ఆ అరుగు కట్టించిన క్రొత్తల్లో, ఉదయం సాయంత్రం చాలా మంది అక్కడకు చేరే వాళ్ళు. ఊరి రాజకీయాలు, ప్రక్క వూరి విశేషాలు పక్కింటి వాళ్ళ కబుర్లు, గుళ్ళో జరిగిన హరికథా కాలక్షేపం గురించిన అభిప్రాయాలు… ఇలా బుర్రకి తోచిన అన్ని విషయాల మీద ఎవరి నోటికి వచ్చినట్లు వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఎవరికి వారు, వారు చెప్పిందే కరెక్టని అనుకోవడం, అలా మిగిలిన వాళ్ళు కూడా అనుకోవాలనుకోవడంతో… గొడవలు మొదలయ్యేవి. అవి చిన్నగా అరుపులై, తర్వాత బూతులయ్యేవి. ఒక్కోసారి పరిస్థితి ఒకర్నొకరు జుట్లు పట్టుకుని కొట్టుకునేదాకా పోయేది.
మర్రి చెట్టు దేవాలయం భూముల్లోనే ఉంది కనుక, గుడి మీద గౌరవం గల ఒక ధర్మకర్త గారు, అరుగు దగ్గరకు వచ్చే అందరినీ ఒకసారి సమావేశ పరచి రాజకీయాల గురించి మాట్లాడ్డాలు, తగాదా పడ్డాలు, కొట్టుకోవడాలు, ఒకడ్నొకడు బూతులు తిట్టుకోవడాలు లాంటివి అరుగు దగ్గర చెయ్యొద్దనీ, అలాంటివి చేయడం వల్ల గుడికి వచ్చే జనాలు తగ్గుతున్నారని చెప్పారు. మాటలతోటే వీళ్ళని దారిలో పెట్టడం సాధ్యం కాదని తెలిసిన వాడు కనుక ఎవరైనా తన మాట పెడచెవిన పెట్టినట్లు తెలిస్తే, అరుగు దగ్గరకు అతన్నే కాదు ఎవరినీ రానివ్వనని ప్రకటించారు. ఎందుకైనా మంచిదని ఈ విషయాలని ఒక బోర్డు మీద కూడ పెయింట్‌తో వ్రాయించి, చెట్టుకు వ్రేళ్ళాడగట్టారు. అరుగు దగ్గరి కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతను గుడి పూజారి పైన ఉంచారు.
రాజకీయాలు, బూతులు, కనీసం ఒకర్నొకరు తిట్టుకునే స్వాతంత్య్రం కూడా లేని చోట కాలక్షేపమేమి దొరుకుతుందని కొంతమంది అరుగు దగ్గరకు రావడం మానేశారు. ఒక ఏడెనిమిది మంది మాత్రం క్రమం తప్పకుండా వచ్చి, మర్రి చెట్టుకు ఏడాదికి ఎన్ని ఆకులు పుడతాయి, ఆవు పేడతో అందంగా ఎలా పిడకలు కొట్టవచ్చు, పిడకలతో కళాత్మకంగా ఎలా పొయ్యి వెలిగించవచ్చు, మిరపకాయ బజ్జీలు రుచికరంగా ఎలా చేయవచ్చు — లాంటి రసవత్తరమైన విషయాలు ముచ్చటించుకుంటూ కాలక్షేపం చేయడం చూసి, అప్పుడప్పుడూ వచ్చి తొంగి చూసేవాళ్ళు కూడా, అటువైపు రావడం మానేశారు.
కానీ అరుగు దగ్గరకు క్రమం తప్పకుండా వచ్చేవాళ్ళు మాత్రం వారి ముచ్చట్లు ఆ ఊళ్ళోనే గాక ప్రక్క ఊళ్ళల్లోనూ, పట్టణాల్లోనూ, దేశదేశాల్లోనూ ప్రచారమై, అందరిలోనూ భయంకరమైన మార్పులు తెస్తున్నాయనుకొని గర్విస్తుంటారు.
పూజారి గారికి సమాధానమిస్తే, విషయం కాస్తా తీర్థ ప్రసాదాల వైపు వెళుతుందని శంకించి, ప్రశ్న విననట్లు నటిస్తూ రెడ్డి గారిని చూడసాగారు కొందరు.
అదే మంచి అదనుగా భావించి, నారాయణ గారు అనంతయ్య వైపు చూశారు.
అనంతయ్య గారు మర్రి చెట్టు కొమ్మల్లోంచి ఆకాశంలోకి చూస్తూ, “నారాయణ గారన్నట్లు ఇంతకు ముందు అలాంటి ప్రభలు ఎవరూ కట్టలేదని మీరనడం ఏమీ బాగోలేదండీ రెడ్డిగారూ” అన్నారు.
రెడ్డి గారు చెప్పే విశేషాలు వినకుండా, మధ్యలో వీళ్ళ గోల ఏమిటి అని పెంచెలయ్య లాంటి ఒకరిద్దరు అనుకున్నా, మిగిలిన వాళ్ళందరికీ నారాయణ గారి మనోగతం అవగతమైంది.
రెండేళ్ళ క్రితం అప్పాపురంలో జరిగిన తిరనాళ్ళ కమిటీలో నారాయణ గారు మెంబరు. చురుగ్గా, ఉత్సాహంగా తిరనాళ్ళ నిర్వహణలో, మామూలు కంటే ఎక్కువ నడుం వంచి పని చేసారు. ప్రత్యేకంగా ఊరందరి తరఫునా, ఓ ప్రభకు రూపకల్పన చేసి, రంగు కాగితాలతోనూ, రంగు రంగుల లైట్లతోనూ దాన్ని తీర్చిదిద్దించారు. అప్పట్లో ఆ ప్రభ గురించి ఊరంతా బాగుందని చెప్పుకున్నారట, ప్రక్క ఊళ్ళ వాళ్ళు కూడా తెగ మెచ్చుకున్నారట.
నారాయణ గారి భుజాన్ని ‘సెభాష’ని తట్టారట. ఆ కారణంగా అప్పట్లో కొన్నాళ్ళు, వారు నడుం నొప్పితోనూ, భుజం నొప్పితోనూ తీయని బాధననుభవిస్తూ అరుగు వైపు రాలేక పోయారట.
అందరిముందు బయటకు చెప్పుకోరు కానీ, రెండేళ్ళ క్రితం తాము కట్టిన (కట్టించిన కాల క్రమేణా మాటాంతరం చెందింది) ప్రభ ‘నభూతో నభవిష్యతి’ అన్నది వారి అభిమతం!
కాకి పిల్ల కాకికి ముద్దు! ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, ఏ కాకి పిల్ల ఆ కాకికే ముద్దు!!
అందుకే, ఈ రోజు రెడ్డి గారు ప్రక్క ఊరి ప్రభలను ఆకాశానికెత్తుతుంటే, నారాయణగారి మనసు విలవిల లాడింది.
తమ గొప్పతనం గురించి తాము చెప్పుకోవడానికి మామూలుగా అయితే సంశయించరు గానీ, ఇంత రచ్చ జరిగాక తాము కట్టించిన (కట్టిన) ప్రభే గొప్పదని తామే చెప్పుకోడానికి కాస్త మొహమాటపడుతున్నారు.
‘ఈ వయసులో, మన డబ్బా మనం కొట్టుకోవడమేమి బాగుంటుంది! మన తరఫున ఎవరైనా కొడితే సబబుగాను, హుందాగాను, వీనుల విందుగాను ఉంటుంది గానీ!!’ అనీ అనుకున్నారు. కానీ ఎవరు కొడతారు? కొట్టుకోడానికి రంగు రంగుల డిజైన్లతో అలంకరించి, వివిధ సైజుల్లో, ఆకారాల్లో, ఎవరి డబ్బాలు వాళ్ళకున్నాయికదా! అయినా ప్రయత్నించడంలో పోయేదేముంది?!
అనంతయ్య గారి వైపు నర్మగర్భితమైన చూపుల్ని విసిరారు నారాయణ గారు. అర్థమైంది అన్నట్లు, నారాయణ గారికొక్కరికే అర్థమయ్యేలా సైగ చేశారు అనంతయ్య గారు.
అనంతయ్య గారి మొహం క్రొత్త ఆనందంతో వెలిగింది. గొంతు సవరించుకున్నారు. బావి గిలకనెక్కి కూర్చుని తనవైపే చూస్తున్న కాకిని అదిలించారు. అక్కడ చేరిన వాళ్ళనొకసారి పరికించారు. చిరు దరహాసమూ చేశారు.
నారాయణ గారు మాత్రం, ఒక కంట ఆకాశంలోకి చూస్తూ, మరో కంట అనంతయ్యను గమనిస్తున్నారు. అనంతయ్య ఏదో చెప్పబోతున్నారని అందరికీ తెలిసినా, ఏమి చెప్పబోతున్నారో ముగ్గురు ఒకరకంగాను, ఇద్దరు మరోరకంగాను ఊహించుకుని, ఎవరి ఊహ కరెక్టవుతుందోనని ఆదుర్దాగా ఎదురు చూడసాగారు.
“రెడ్డి గారూ, ఇక ముసుగులో గుద్దులాటలెందుకు? హిందూపురంలో మీరు చూసిన ప్రభలకంటే … గొప్ప ప్రభల్ని ఇంతకు మునుపు మన ఊళ్ళో…” అనంతయ్యగారు ఇక్కడి వరకూ చెప్పి, వినేవాళ్ళలో ఉత్కంఠత పెంచడానికన్నట్లు, కాస్త ఆగారు.
ఏమి చెప్పబోతున్నారో ఊహించిన మొహాల్లో నవ్వు రవ్వంత వెలుగు పెంచుకుంది. నారాయణ గారు ఒక కంటి చూపును ఆకాశంలోకి మరికాస్త ఎత్తుకు సారించి, మరో కంటితో అనంతయ్యపై ప్రశంసను చూపించారు.
రెడ్డి గారు మాత్రం తీవ్రంగా ఆలోచిస్తూ అనంతయ్య గారి వైపు చూడసాగారు.
“…అయిదేళ్ళ క్రితం నేను కట్టించిన దాని గురించి అప్పుడే మర్చి పోయారా? నేను కట్టించిన ప్రభ లాంటిది మళ్ళీ ఇప్పటిదాకా ఎవరూ కట్టించలేదు, మీరొకసారి దాన్ని గుర్తు చేసుకుని నిన్నటి వాటితో పోల్చి చూసుకొని… అప్పుడు… అప్పుడు మాట్లాడండి” అత్యంత వేగంగా, ఇతరులు మాట్లాడేందుకు సందివ్వకుండా గబగబా తాము చెప్పదలచుకున్నది చెప్పేశారు అనంతయ్యగారు.
ఇంతదాకా తీసుకొచ్చాక కథ అడ్డం తిరగడం, దాన్ని తాము ముందుగా ఊహించలేకపోవడం చెట్టుకేసి తల బాదుకోవాలనిపించింది నారాయణ గారికి.
ముగ్గురు ఆశ్చర్యపోయారు. వారు ఊహించింది వేరు కాబట్టి!ఆవలిస్తే పేగులు లెక్కెట్టే విద్యలో అఖండులమైపోతున్నామని ఇద్దరు లోపల్లోపల ఈలలు వేసుకున్నారు.
ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టారు రెడ్డి గారు.
ఎర్రబడ్డ మొహంతో, నిప్పులు చిందే కళ్ళతో అనంతయ్య వైపు చూసారు, నారాయణ గారు. వారి చూపులకే శక్తి ఉంటే అనంతయ్యగారు అక్కడికక్కడ బూడిదై పోయేవారు.
ఆలోచించడానికది సమయం కాదనిపించింది నారాయణ గారికి.
“ఇదింకా బావుంది. మొహమాటం లేకుండా చెప్పాలంటే,అనంతయ్య గారు చెప్పేవరకు వారు ప్రభలు కట్టించినట్లు మనలో ఎవరికీ గుర్తు లేదంటేనే తెలుస్తోంది అవెంత గొప్పవో! అయినా మన(వారి వుద్దేశ్యంలో వారు)గురించి మనం (ఇది కూడా వారే) చెప్పుకోవడం బావోదు కానీ ఏం చేస్తాం… వాస్తవం అందరికి తెలియాలంటే ఒక్కోసారి చెప్పుకోక తప్పదు. రెండేళ్ళ క్రితం మన వూళ్ళో మనం (బయట వాళ్ళకు ఎలా అర్థమైనా వారి భావం మాత్రం వారు అనే) కట్టించిన ప్రభ ఎంత గొప్పదో, పై ఊళ్ళలో ఎంత పేరుతెచ్చుకున్నదో మీకు వేరే చెప్పాలా? ఇప్పటికీ నేను పని మీద ప్రక్క ఊళ్ళకు వెళ్ళినప్పుడు కనిపించిన ప్రతివాడు ‘నారాయణ గారూ, ఫలానా సంవత్సరంలో మీరు కట్టిన ప్రభ ఎంత బావుందో’ అంటుంటారు. ఇంకా…” చెప్పుకు పోతున్న నారాయణ గారి మాటలకు అడ్డుతగులుతూ,
“ఏడ్చినట్టే వుంది. మరి నేను కట్టిన ప్రభలు చెత్తవనా మీ ఉద్దేశ్యం” అడిగారు ఇంకొకరు కోపంగా. వారిప్పటికి రెండు మూడు ప్రభలు కట్టించి ఉన్నారు.
రెడ్డి గారికి విషయం అర్థమైంది. వారు కూడా గతంలో ప్రభ కట్టించిన వారే! వారు కట్టించిన ప్రభ గొప్పదని వారికీ అనిపించింది. అదే అన్నారు అందరితోనూ.
అరుగు దగ్గర గొడవ విని అటుగా వచ్చిన వాళ్ళు, విషయం తెలిసి, ‘కాగితాలు కత్తిరించడం, మైదా పూయడం, అందంగా కాగితాలు అతికించడం, అలంకరణలు చేయడం, లైటింగులు పెట్టడం ఇంత కష్టపడిందీ మేమైతే బోడి వీళ్ళ గొప్పదనమేమిటి అందులో,’ అనుకుని, వాళ్ళు కూడా “అసలు గొప్పవాళ్ళం మేమే” అంటూ పెద్దగా అరవడం మొదలెట్టారు.
తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల అరుపులు ఎంత మందికి వినిపిస్తాయి?!
అందరూ ఒక్కసారిగా మాది గొప్ప ప్రభ అంటే, మాది గొప్ప ప్రభ అని, తర్వాత మేము గొప్ప వాళ్ళమంటే మేము గొప్ప వాళ్ళమనీ కేకలు, అరుపులూ మొదలు పెట్టారు.
ఎవరి డబ్బా శబ్దాలు వారికి ఇంపు గానీ, పరుల డబ్బా మోతలు ఇబ్బందే కదా! కేకలు, అరుపులూ తిట్లుగా మారాయి.
“మీరు మహా వేస్టుగాళ్ళండి” అని ఒకరు, “తమరు మహా పనికిమాలిన వాళ్ళండీ” అని ఇంకొకరు, “మరే… మీరు మాత్రం చవటన్నర చవటలండీ” అని మరొకరు చాలా మర్యాదగా, బహువచనాల్లో, బహు విధాలుగా తిట్టుకోవడం మొదలెట్టి అక్కడే ఎక్కువసేపు ఆగలేక, నిజం తిట్ల లోకి, తర్వాత బండ బూతుల్లోకి వెళ్ళిపోయారు.
ఆవేశంతో ఊగిపోతున్న నారాయణ గారి చెయ్యి అనంతయ్య గారికి తగలడంతో, బండ బూతులు కొట్లాటలుగా మారాయి. చొక్కాలు చించుకుని, జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్న వాళ్ళను ఆపబోయిన పూజారిగారికీ గట్టిగానే దెబ్బలు తగిలాయి.
ఇదంతా చూస్తున్న కాకి, “మేము చేసే గోల కంటే, వీళ్ళ గోల ఎప్పుడూ ఎక్కువే” అనుకుంటూ, దూరంగా ఎగిరిపోయింది.