(మహె జబీన్ గారి కవితలు “ఆకురాలు కాలం” సంకలనంగానూ, ఆ తర్వాత వివిధ పత్రికల్లోనూ వెలువడి ఎంతగానో ప్రశంసించ బడ్డాయి. మహె జబీన్ కవయిత్రి గానే కాకుండా సాంఘిక సంక్షేమ కార్యకర్తగా కూడా ఎంతో దీక్షతో పనిచేస్తున్నారు.)
నేనేం చేయను బాలగోపాల్
నా కొడుకు మాట వినడం లేదు
బ్రతికే ప్రాధమిక హక్కుపై
వాడికి పెద్ద మమకారం లేదు గాని
మాట్లాడుతూ బ్రతికే మనిషి
గాయపడటం భరించలేక పోతున్నాడు
“మనకు పౌరసత్వం లేదు
పౌరహక్కులు లేవు
ఎలాగో ఒకలా బతికేద్దాం
కుక్కలు పందులతో పాటు మైనారిటీలురా” అన్నాను
“మాట్లాడకురా ఉద్యమం మాటెత్తకురా
మానవహక్కులు మరిచిపోరా”
ఎంతెంతో చెప్పాను
ఎన్నోసార్లు చెప్పాను
“మాట్లాడితే నడిరోడ్డు మీద నరికేస్తారురా”
భయపెట్టాను
“ఒక్కగానొక్క కొడుకువిరా”
sentiment తో ప్రయత్నించాను
కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను
నవమాసాలు మోసిన సంగతి
తొమ్మిదిసార్లు గుర్తుచేసాను
వింటేగా
మాట్లాడటానికి ఎన్నిలేవు ప్రపంచంలో
రాజకీయాలు కుంభకోణాలు సినిమాలు
ఎన్నికలు వాగ్దానాలు కంప్యూటర్లు
చివరికి telephone sex talks
ఇవన్నీ వదిలేసి
పౌరహక్కులు అంటాడేంటి
వీడికి పిచ్చిగాని పట్టిందా
ఇదంతా నీవల్లే జరిగింది బాలగోపాల్
నీరాతలు మాటలతో వాడిలా అయ్యాడు
అక్కడ రాలిపడ్డ రక్తపు చుక్కలు
లెక్కపెట్టుకు రమ్మంటున్నాడు
నేనేం చేయను వాణ్ణి వదులుకోలేను
నా కొడుకు ఎంచుకున్న దారే నాదారి