మా అమ్మ గదే!

అలవాటు తప్పిన రోడ్డూ, ఉదయపు ఎనిమిదిగంటల రద్దీ. హైవేలోకి మెర్జ్‌ అయ్యేసరికే తలప్రాణం తోక కొచ్చినట్టనిపించింది. గుండె వేగం హెచ్చింది.

దానికి తోడు రాత్రి సరిగా నిదర పట్టలేదు. పాప పక్కగదిలో ఏడుస్తున్నట్టే ఉంది… అమ్మ జోకొడుతున్నట్టూ… మధుని తను మాటిమాటికీ లేపుతూనే ఉంది. ఉండబట్టలేక ఒక రాత్రివేళ లేచి వెళ్ళి చూసింది కూడా. గదంతా ఖాళీగా బావురుమంటూ కనిపించింది.

ఎంత బ్రతిమలాడింది అమ్మని ఇంకొక్క అర్నెల్లు ఉండమని? మూణ్ణెళ్ళు కూడా కాలేదు ఇక ఉండనంటే ఉండనంది. అప్పటికీ అన్ని అస్త్రాలూ ప్రయోగించి చూసింది.

“అక్క చిన్నాని కన్నప్పుడు అన్ని రోజులు చూసుకోలేదా వాళ్ళని?”

“మా ఫ్రండ్‌ సమత వాళ్ళ అమ్మయితే ఒక ఏడాదంతా ఉంది.”

“ఇంకో రెణ్ణెల్లాగితే చుట్టుపక్కల చూడదగ్గ చోట్లన్నీ తిరిగి రావచ్చు.”

“తోచకపోతే ఇండియన్‌ టీవీ ఛానెల్స్‌ తీసుకుందాం.”

“నీకసలు నామీద ప్రేమ ఉంటేగా?”

“పిట్స్‌బర్గ్‌ వెంకటేశ్వరస్వామిని చూడకుండా పోతావా?”

“కూతుర్నిట్లా వదిలేసి పోటానికి మనసెట్లా ఒప్పుతోంది నీకు?”

“మా అమ్మ గదే ఉండవే!”

ఒక్క కళ్ళనీళ్ళతో శోకాలు తప్పించి అన్నీ అయ్యాయి. అమ్మ దేనికీ చెక్కు చెదరలేదు. ఒకటే మాట మీదుంది. “ఇక్కడ నాకు పిచ్చెత్తిపోతూంది. అయినా నీకేనా కాపురం? నా కాపురం నాకూ ఉందమ్మాయ్‌! మీ నాన్నను వదిలి ఇన్నిరోజులు ఉన్నానా ఎప్పుడయినా? నీకంతగా కష్టమయితే పాపను నాతో తీసుకు వెళతానన్నాగదా?”

మధు ఇష్టపడలేదు. డే కేర్‌ సెంటర్ల వివరాలు సేకరించడం మొదలుపెట్టాడు ఫ్రండ్స్‌కి ఫోన్లు చేసీ, ఇంటర్నెట్‌లో వెదికీ. తనే అతన్ని ఒప్పించింది. పిల్లల్ని సరిగ్గా పట్టించుకోని డే కేర్‌ సెంటర్లూ, ఎప్పుడూ అంటించుకొచ్చే ఏవో ఇన్ఫెక్షన్లూ, డాక్టర్ల చుట్టూ తిరుగుళ్ళూ, ఎందుకేడుస్తున్నారో తెలియని బాధలూ, పిల్లల పెంపకంలో ఓనమాలు తెలియని భయాలూ, నిదర చాలని మొహాలతో ఆఫీసులో కునికిపాట్లూ అన్నీ వివరించి చెప్పేసరికి ఒప్పుకోక తప్పలేదు ఏ రోజూ రాత్రి ఏడింటికి కానీ ఇల్లు చేరని మధుకి.

ఇంకో ఏడెనిమిది గంటల్లో ఇండియాలో అడుగు పెడతారు. నాన్నగారు బాంబే వస్తారు గనక భయం లేదు. ఎందుకో అకస్మాత్తుగా సంతోషం వేసిందామెకు. పెదాలమీదికి చిన్న నవ్వొకటి ఉబికింది. సురక్షితమైన చేతుల్లో తన బిడ్డ ఉన్న సుఖభావన. ఒక పెద్ద బరువు దిగినట్టు మనసంతా తేలికయింది.

పార్కింగ్‌ లాట్‌లో కారు పార్క్‌ చేశాక తలుపు తీసుకు దిగుతున్నప్పుడు వెనక సీట్లో పాప పాలసీసా కంటపడింది. మనసు మళ్ళీ వికలమయింది. అట్లాగే వాడిన మొహంతో ఆఫీసులో అడుగు పెట్టింది. తన క్యూబికిల్‌ వైపు వెళుతుంటే అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ లారా ఎదురయింది.

“వెల్‌కం బ్యాక్‌ లేఖా! అదేమిటి మొహం వేలాడేసుకున్నావ్‌, మళ్ళీ ఆఫీసుకు రావలసి వచ్చిందనా లేక సాయంత్రం దాకా పాపను వదిలి ఉండాలనా?”

“అదేమీ లేదు. కొంచెం అలసిపోయానంతే!” నవ్వు తెచ్చుకుంటూ అంది.

“అయితే ఏం చేస్తుంది పాప? మంచి డే కేర్‌  సెంటర్‌  దొరికిందా?”

“పాప బ్రహ్మాండంగా ఉంది. మా అమ్మే చూసుకుంటూంది దాన్ని!”

“అవునా, ఆమె రిటైరయిపోయిందా ఏమిటి?”

నవ్వొచ్చింది అమ్మ రిటైరవడమంటే! “లేదు, మా అమ్మ ఎక్కడా పని చేయటం లేదు!”

“అదృష్టవంతురాలు!”

“మీ పిల్లలేం చేస్తున్నారు?” కొత్త ప్రశ్న. ఎప్పుడూ వాళ్ళ గురించి అడగలేదామెను.

“మావాడికి టెన్నిస్‌ టోర్నమెంట్లు జరుగుతున్నయ్‌, బాగా ఆడుతున్నాడు. అమ్మాయి మ్యూజిక్‌  నేర్చుకుంటానంటూంది, చూడాలి!”

“సరే తర్వాత కలుద్దాం,” చెప్పేసి తన క్యూబికిల్‌ చేరుకుంది. సొంత ఇంట్లో అడుగు పెట్టినట్టనిపించింది. బేబీ టియర్స్‌ మొక్క వాడిపోలేదు. బహుశా లీసా పోస్తూండి ఉండాలి నీళ్ళు దానికి. ఓ నాప్‌కిన్‌ తీసుకుని మోనిటర్‌ మీదా బల్ల పైనా పేరుకున్న దుమ్మంతా దులిపింది. కంప్యూటర్‌ స్విచాన్‌ చేసి లాగిన్‌ చేశాక తమ గ్రూప్‌లో అందరికీ ఈమెయిల్‌ పంపింది తనకు డెలివరీ అయ్యాక వాళ్ళంతా కలిసి పంపిన బొకేకి కృతజ్ఞతలు తెలుపుతూ. రెండు నెలలుగా పేరుకుపోయిన ఈమెయిల్సన్నీ ఒక్కటొక్కటే తెరిచి చూస్తుంటే ఒక్కరొక్కరే వచ్చి చేరారు, సిండీ, ఎలెక్స్‌, బెత్, లీసాలు, “వెల్‌కం బ్యాక్‌  లేఖా!” అంటూ.

“అయితే వెకేషన్‌ బాగా ఎన్జాయ్‌ చేశావా?” ఎలెక్స్‌  నవ్వుతూ అడిగాడు.

“వెకేషనా?” చిరుకోపమూ, నవ్వూ కలిసిన గొంతుతో, “నువ్వుకూడా ప్రెగ్నెంట్‌ అయితే ఎంచక్కా వెకేషన్‌ ఎన్జాయ్‌ చేయొచ్చు చూసుకో మరి!” అంటూ నవ్వింది సిండీ.

“అమ్మో మళ్ళీనా?” ఎలెక్స్‌ మహా తుంటరి. అందరూ నవ్వారు.

“ఇంతకీ మీ అమ్మాయి ఫొటోలు చూపించవే?” లీసా అడిగింది. పర్స్‌లోంచి నాలుగు ఫొటోలు తీసి అందించింది.

“ఎంత అందంగా ఉంది! అసలు నీలా లేనే లేదు!” ఎలెక్స్‌ మళ్ళీ.

“అబ్బ, ఆ జుట్టు చూడు ఎంత బావుందో?” సిండీ అరిచింది.

“ఆ కనుబొమ్మలూ, కనురెప్పల చివరి వెంట్రుకలూ చూడు! నీ అందమైన పెద్ద కళ్ళే వచ్చినట్టున్నాయి,” లీసా అంది. ఫొటోలు ఒకరి చేతుల్లోంచి ఇంకొకరి చేతుల్లోకి మారుతూండగా అడిగింది బెత్, “ఎవరీమె?”

“ఓ, అది మా అమ్మ!”

“మీ అమ్మా? ఇండియానించి ఇంత దూరం వచ్చిందా పాపను చూడడం కోసం?” సిండీ ఆశ్చర్యపోతూ అడిగింది.

“చూడటం కోసంగాదు. నన్నూ పాపనూ చూసుకోవటం కోసం!” నవ్వుతూ కొంచెం గర్వంగా చెప్పింది.

“నిజంగా?” బెత్ నమ్మనట్టు అడిగింది.

“అబ్బ, నాకూ అట్లాంటి అమ్మ ఉంటే ఎంత బాగుణ్ణు!” లీసా అంది.

“అయితే మీ అమ్మ ఎప్పటిదాకా ఉంటుందిక్కడ?” బెత్ అడిగింది.

“నిన్ననే వెళ్ళిపోయింది.”

“అయితే పిల్లల పెంపకంలో ట్రెయినింగ్‌ ఇచ్చి వెళ్ళిందన్న మాట,” లీసా అంది.

లేఖ నోరు తెరిచేలోగానే ఎలెక్స్‌ అడిగాడు, “అయితే నీ ఫస్ట్‌ నైట్‌ ఎట్లా ఉంది?”

“ఏమిటీ?” బిత్తరపోయింది లేఖ.

“అదే, ఒంటరిగా పాపను చూసుకున్న మొదటి రాత్రి!”

“నాకు తెలుసు మీ ఇండియన్‌ భర్తలు! మీ ఆయన ఏమన్నా సాయం చేస్తున్నాడా?” బెత్ అడిగింది.

“చేస్తాడప్పుడప్పుడు. కానీ మా పాప ఇప్పుడిక్కడ లేదు,” ఎందుకో చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది.

“ఏమిటీ?” నలుగురూ ఒకేసారి అరిచారు.

“అవును, మా అమ్మతో ఇండియా వెళ్ళింది,” వాళ్ళ అరుపులకి చిరాకేసింది.

“ఎందుకూ?” సిండీ ఇంకా ఆశ్చర్యం తగ్గని గొంతుకతో.

“మా అమ్మే తీసుకు వెళతానంది. ఇండియన్‌ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల మీదకంటే మనవల మీద మమకారం పెచ్చు.”

“అయినా నువ్వెట్లా తీసుకు వెళ్ళనిచ్చావ్‌” బెత్.

“పాపను డే కేర్‌ లో పెట్టటం నాకిష్టం లేదు. ఎన్నెన్ని కథలు వింటున్నాం వాటి గురించి! అనుభవంగల మా అమ్మ చేతుల్లో సురక్షితంగా ప్రేమపూరితమైన వాతావరణంలో పెరుగుతుందంటే మనశ్శాంతి!”

“కానీ అది నీ పాప కదా? ఇంకొకళ్ళకి ఎట్లా ఇచ్చేస్తావ్‌ ఎంత అమ్మయినా?” సిండీ.

“మీ అమ్మను చూస్తుంటే నీరసంగానూ, వయసు పైబడినట్లూ ఉంది. చూసుకోగలదా మీ పాపను?” లీసా.

“మనవాళ్ళలాగా జుట్టుకూ పెదాలకూ రంగూ, మేకప్పూ వేసుకోలేదు కనక అట్లా ఉందంతే!” ఎలెక్స్‌. అమ్మకు మేకప్‌ తల్చుకుంటే నవ్వొచ్చింది.

“ఇక్కడ ఇండియన్స్‌ అంతా అంతే చేస్తారు. అంతెందుకు, నేనూ మా అమ్మమ్మ దగ్గరే పెరిగాను!”

“అయితే మిమ్మల్ని పెంచనప్పుడు మీ అమ్మకు మాత్రమేం అనుభవముంటుంది? మీ అమ్మమ్మను పిలిపించుకోవలసింది!” బెత్ గొంతులో ఏమూలో కాస్త వ్యంగ్యం! ఆమె ఎప్పుడూ అంతే! ఏవో విసుర్లు విసురుతూనే ఉంటుంది. అందుకే తను కాస్త ఎడంగానే ఉంటుందామెకు.

“ఈ పద్ధతి బానే ఉన్నట్టుంది. అయితే మీ పాప పిల్లల్ని నువే పెంచాలి గదూ?” సిండీ అడిగింది. కవ్వించడానికందో, నిజంగా అడుగుతుందో అర్థం కాలేదు.

వాళ్ళ చేతుల్లోంచి ఫొటోలు తీసుకుంటూ అంది, “అదెప్పటి మాట! అప్పుడు చూసుకోవచ్చు!”

“మనం చుట్టుపక్కల ఉండం గదా అప్పుడు! నాకు తెలుసు వాళ్ళ అమ్మాయిని మోసం చేస్తుంది!” ఎలెక్స్‌.

“మీటింగ్‌ టైమవుతూంది,” అంటూ వెళ్ళిపోయింది సిండీ.

“ఏదో ప్రొడక్షన్‌ ప్రాబ్లం వచ్చింది చూడాలి,” అంటూ వెళ్ళిపోయారు లీసా, బెత్.

“బెంబేలు పడకు, వీళ్ళంతా నీ గురించి అసూయ పడుతున్నారంతే!” కన్ను గీటి అన్నాడు ఎలెక్స్‌.

“నాకు తెలుసు! బాస్‌ను కలవాలి,” అంటూ లేచింది. ఇక ఆఫీసులో అందరికీ తెలిసిపోతుంది కొద్దిసేపట్లో. చాలా మందికి అదో వార్త అవుతుంది.

“నీకోసం చాలా పని అట్టే పెట్టాడులే పో!” అంటూ వెళ్ళిపోయాడు ఎలెక్స్‌.

మా ప్రేమలూ అనుబంధాలూ వేరు. మీలా మిగతా కుటుంబ సభ్యుల కష్టనష్టాలను పట్టించుకోకుండా మా కుటుంబ వ్యవస్థ ఉండనివ్వదు! మనసులో అనుకుంటూ బాబ్‌ గదివేపు నడిచింది.


శనివారం పొద్దున్నే నిదర లేపుతూ ఫోన్‌.

“నేనక్కా శిల్పను మాట్లాడుతున్నా!”

“ఓ వచ్చేశావా? అమ్మ చెప్పింది మొన్న ఫోన్‌ చేసినపుడు. ఎట్లా అయింది ప్రయాణం?”

“బాగా అయిందక్కా ఎక్కడా ప్రాబ్లం కాలేదు! ఎక్కడేం చేయాలో కిరణ్‌ ముందే చెప్పాడు!”

“కొత్త కాపురం ఎట్లా ఉంది?”

కొంచెం సిగ్గు పడుతూ నవ్వుతూ చెప్పింది. “బావుంది!”

“ఇండియాలో ఎట్లా ఉన్నారంతా? మాయింటికి వెళ్ళావా? మా పాపను చూశావా?”

“వొచ్చే ముందురోజే వెళ్ళొచ్చానక్కా! పాప అచ్చం నీలానే ఉందంటున్నారంతా! నువు కంగారు పడతావని చెప్పలేదట పెద్దమ్మ, పాపకు నాలుగు రోజులనించీ జ్వరం! ఆ రోజే తగ్గిందట! రాత్రులు నిదర పోకుండా పెద్దమ్మను ఒకటే ఏడిపిస్తుందట! పెద్దమ్మయితే ఎంత చిక్కిపోయిందో ఒక నెలరోజుల్లోనే! బీపీ కూడా బాగా ఎక్కువయిందట!”

“పాపకు జ్వరమొచ్చిందా? నాలుగు రోజులే! డాక్టర్‌ దగ్గరికి వెంటనే తీసుకుపోలేదటనా?” దిగులు నిండిన గొంతుతో అడిగింది.

“తగ్గిపోయిందక్కా! ఆ రోజయితే ఒకటే కేరింతలు! నా దగ్గరికి వచ్చి నన్నొదలదే! సరళత్త దగ్గరికి అసలు పోలేదు. సరళత్త తెలుసా అందరితోటీ ఏం అంటూందో ఏం రెండేళ్ళు ఉద్యోగం మానేసి పిల్లను చూసుకోకూడదూ? అన్ని నెలలు పిల్లను చూడకుండా అసలు ఎట్లా ఉంటుందీ? ఈ వయసులో ఆ పసిపిల్లతో వాళ్ళకీ పాట్లేమిటీ? వాళ్ళ ఆరోగ్యాలూ అంతంత మాత్రమాయే! అంటూంది. పార్వతి పిన్ని కూడా ఆమెకి వంత!”

మండుకొచ్చిందామెకి. “సరళత్త మాటలకేమొచ్చెలే! ఇప్పుడు ఉద్యోగం మానేస్తే మళ్ళీ వచ్చినట్టే! ఈ సంవత్సరం ప్రమోషన్‌ కూడా రాబోతుంటే ఇప్పుడెట్లా మానను? మధ్యన ఆవిడ బాధేమిటి అమ్మ తనే కావాలని తీసుకు వెళితే? అయినా వాళ్ళకు మాత్రం ఏం తోస్తుంది మేమంతా తలో మూలా ఉంటే? పాపన్నా ఉంటే వాళ్ళకు కాస్త కాలక్షేపం. ఫోన్‌ చేసినప్పుడల్లా చెప్తూనే ఉంటారు,  పాప లేకపోతే పిచ్చెత్తేదమ్మాయ్‌ అంటూ! అది కూడా వాళ్ళకి బాగా అలవాటయింది!”

“అంతేలే! ఇవాళ రేపు అమెరికా పసిపిల్లలంతా ఇండియాలోనే పెరుగుతున్నారు గదా! కిరణ్‌ లేచినట్లున్నాడు. ఉంటానక్కా, నా నంబరుంది కదా నీ దగ్గర?”

“ఆఁ అమ్మ ఇచ్చిందిలే! తర్వాత కాల్‌ చేస్తా! ఉంటా.” ఫోన్‌ పెట్టేయగానే అడిగాడు మధు. “ఎవరికి జ్వరం పాపకా?”

“అవును, నాలుగు రోజులపాటు! తగ్గిందటలే!” జ్వరపడిన పాప పక్కన లేకపోయానన్న దిగులింకా వదల్లేదామెను.

“ఏమిటో నాన్ననయ్యానన్న మాటే గానీ అట్లా ఏమీ అనిపించడం లేదు. దాని బోసి నవ్వులూ, బోర్లా పడి పాకటమూ, మొదటి అడుగూ, మొదటి మాటా… అన్నీ మిస్సవబోతున్నామా? అదసలు మనల్ని గుర్తు పడుతుందా? తలుచుకుంటే ఎంత బాధగా ఉంటుందో! ఇంత సంపాదిస్తూ ఇలాంటి చిన్న చిన్న ఆనందాల్ని కూడా దక్కించుకోలేకపోతున్నామే!”

“బాధ నీకు మాత్రమేనా? ఇదంతా సరదాకి చేస్తున్నామా? మన భవిష్యత్తూ, తర్వాత దాని భవిష్యత్తూ బాగుండాలనే కదా? ఇక్కడ మనం ఆఫీసుల్లో పని చేసి అలసిపోయి ఇంటికి వచ్చి దాని ఆలనా పాలనా చూడగలిగేవారమా? అక్కడ మా అమ్మ ఇరవయినాలుగు గంటలూ పక్కన ఉంటుందనీ, అక్కడ చక్కగా పెరుగుతుందనే కదా పంపింది?”

“ఏమో నాకయితే తెచ్చుకుంటేనే బావుంటుందనిపిస్తోంది!”

“అదేమిటి? అన్నీ అలోచించుకునే కదా పంపింది? నేను నా ఉద్యోగం మానలేను. ఉద్యోగం చేస్తూ దాని బాగోగులు చూడడం నా వల్ల కాని పని. నువు చేసే సాయం ఎంత మాత్రం? పాప ఇక్కడ ఉన్నప్పుడు ఎన్ని సార్లు డయపర్స్‌ మార్చావో చెప్పు?”

“సర్లే పొద్దున్నే గొడవెందుకు? మనసులో బాధ వెళ్ళగక్కుతున్నా అంతే!”


పనిమీద కింది అంతస్థుకి వెళ్ళింది మేరీ దగ్గరికి. వాళ్ళ సిస్మ్ నుంచి తమ సిస్టమ్‌కి రావలసిన ఫైల్‌ వివరాలు మాట్లాడి రాబోతుంటే పక్క క్యూబికిల్‌ నుంచి లిండా వచ్చింది, “చిన్న పిల్లాడికి జ్వరం తగ్గిందా ఇవాళ?” అంటూ.

“ఇవాళ బాగానే ఉన్నాడు, డే కేర్‌లో వదిలి వచ్చాను!” మేరీ చెప్పింది.

“చిన్న పిల్లాడా? ఎవరు మీ మనవడా?” కుతూహలంగా అడిగిందామె.

“ఓ నీకు తెలియదా? మేరీ తల్లయింది మళ్ళీ!” లిండా నవ్వుతూ అంది.

“లేదు, జోకేస్తున్నావు కదూ?” యాభయ్యేళ్ళ పైనే ఉన్న మేరీకి ఇప్పుడు పిల్లాడా?

“లేఖ తికమక పడుతుంది, నువ్వాగు లిండా!” అంటూ టేబుల్‌ మీది ఫొటో తీసి చూపుతూ చెప్పింది. “ఈ ముగ్గురికీ ప్రస్తుతం ఫాస్టర్‌ పేరెంట్స్‌మి.”

“అంటే?”

“తల్లిదండ్రుల నిర్లక్ష్యానికీ, ఎబ్యూజ్‌కీ గురయిన పిల్లల్ని గవర్నమెంట్‌ ఏజెన్సీలు వాళ్ళనించి విడదీసి తాత్కాలికంగా ఫాస్టర్‌ పేరెంట్స్‌తో ఉంచుతాయి. వాళ్ళని పెంచడానికి ఆర్థికంగా కూడా సాయం చేస్తాయనుకో! తల్లిదండ్రులు వాళ్ళ ప్రవర్తన మార్చుకున్నట్లు జడ్జి ఎదుట నిరూపించలేకపోయినట్లయితే అప్పుడు ఆ పిల్లల్ని దత్తతకి ఇచ్చేస్తారు!”

“అవునూ, మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి కోర్ట్‌కి?” లిండా అడిగింది.

“ఇంకో రెండు నెలలయ్యాక! వీళ్ళకి తల్లి ఒక్కతే, తండ్రి లేడు. ఆమె కూడా డ్రగ్స్‌ అలవాటునించి బయట పడినట్టులేదు. స్థిరమైన ఉద్యోగం లేదు. మొన్న పిల్లల్ని చూడటానికి వచ్చింది.జాలి వేసింది కానీ ఈ పిల్లల్ని ఆమె సక్రమంగా పెంచే స్థితిలో లేదు. ఆ సంగతి అర్థం కావడం లేదామెకు! ఆ జడ్జికీ జాలెక్కువ. ఇంకెన్ని వాయిదాలేస్తాడో!”

“అయితే రెణ్ణెల్లయ్యాక మళ్ళీ ఏజెన్సీ వాళ్ళు తీసుకెళ్ళి ఎవరికయినా దత్తతకిచ్చేస్తారా?”

“ఎవరికో కాదు, మేమే వీళ్ళని దత్తత తీసుకుందామనుకుంటున్నాము!”

“ఒక్కర్నే తీసుకుంటే బావుండేదిగా! మరీ ముగ్గురంటే కష్టం కాదూ?” అదీ ఈ వయసులో!

“కష్టమే! మేం ఫాస్టర్‌ పిల్లల కోసం వెళ్ళినప్పుడు కూడా ఒక కుటుంబపు పిల్లల్నందరినీ ఉంచుకుంటామని చెప్పాము. ఒకే కుటుంబానికి చెందిన పిల్లలంతా ఒక్కొక్కరొక దిశగా చెదిరిపోయి తలో చోటా పెరగే దుస్థితి రాకుండా చేయాలని మా కోరిక”

“అసలీ అయిడియా ఎట్లా తట్టింది మీకు? ఈ వయసులో?” నవ్వింది మేరీ. “ఒక ఆదివారం చర్చ్‌ నుంచి వచ్చాక భోంచేస్తూ ఉంటే ఎందుకో ఇల్లంతా ఖాళీగా అనిపించింది. దాన్ని చిన్నపిల్లల నవ్వులతో నింపాలని ఇద్దరికీ తోచింది.”

“ఎంత వయసులీ పిల్లలికి?” ఫొటో చేతిలోకి తీసుకుని చూస్తూ అడిగింది.

నవ్వుమొహాలతో ఒక అమ్మాయీ, ఇద్దరబ్బాయిలు. తెల్లజుట్టూ, నీలి కళ్ళూ.

“పాపకి అయిదేళ్ళు, పెద్దాడికి మూడు, చిన్నాడు ఏడాదిన్నర,” మేరీ చెప్పింది.

వాళ్ళిద్దరికీ వస్తానని చెప్పి వచ్చేసింది గానీ ఆరోజంతా ఆ విషయమే మనసులో కదలాడుతూ ఉంది. ఈ వయసులో ఉద్యోగం చేస్తూ ముగ్గురు పిల్లల్ని ఎట్లా సాకగలుగుతుంది? అందుకు కావలసిన మానసిక శారీరక శక్తులు ఆమెకి ఎక్కణ్ణుంచి వస్తున్నాయి? కోరి నెత్తిమీదికి ఈ కష్టం ఎందుకు తెచ్చుకుంది? తన పాప కళ్ళల్లో మెదిలింది. ఆలోచన ఒక దరికి చేరేసరికి మనసు తేలికపడింది.

సాయంత్రం ఇంటికొచ్చాక టీ చేసుకుని తాగుతూ శిల్పకి ఫోన్‌ చేసింది. అదీ ఇదీ మాట్లాడాక మేరీ విషయం చెప్పింది.

“నిజంగానా? అంత ముసలామెకు ఎంత ధైర్యం? ఉద్యోగం చేస్తూ ముగ్గురి పిల్లల్ని పెంచుతుందా?” శిల్ప కూడా ఆశ్చర్యపోయింది. “అయితే నువ్వు…” ఏం చెప్పబోతుందో వినిపించుకోలేదామె.

“సరళత్త ఏదో అందని చెపుతుంటివే! ఈ ముసలావిడ ఉద్యోగం చేసుకుంటూ ముగ్గుర్ని పెంచగా లేంది మా అమ్మ ఇంటి పట్టున ఉండి ఒక్క పాపను చూసుకోవడం  ఎంత తేలికో చూడు!”

“అంతేలే అక్కా!” తేరుకుని తిప్పుకుని అంది శిల్ప.

రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...