గురువారం పొద్దున్న నేను నిద్ర లేచేప్పటికే గోపాల్‌ఆఫీసు కెళ్ళేందుకు రెడీ అవుతున్నాడు. నేను కాఫీ పెట్టుకుని (“మా అల్లుడు కాఫీ అన్నా తాగడు, మహా బుధ్ధిమంతుడు” అని మురిసిపోతుంది మా అమ్మ, అతను తాగేవి ఆవిడకి తెలీదు పాపం!), మొహం కడుక్కొచ్చి కాఫీ చప్పరిస్తూ ఈమెయిల్‌చూస్తుంటే, బాసు బూట్లేసుకుని “ఏయ్‌నీలూ, కారు తాళం!”అని ఎదురు చూస్తున్నాడు. ఆరు నూరైనా, రోజూ కారు తాళంతో బాటు ఈ బుధ్ధావతారానికి ఒక ముద్దిచ్చి సాగనంపటం నా దినసరి కర్తవ్యం అయి కూర్చుంది. గోపీ ముద్దు పుచ్చేసుకుని వెళ్ళి పోబోతుంటే సడన్‌గా గుర్తొచ్చింది, అతని టై పట్టుకుని ఆపేశాను,
“ఏయ్‌గోపూ, ఇవ్వాళ్ళ దైరకుందానా డాన్స్‌కంపెనీ వాళ్ళ జపనీస్ డాన్స్ ప్రోగ్రాముంది సాయంత్రం ఏడింటికి. మర్చిపోక తొందరగా వచ్చెయ్యి. నేను డిన్నర్‌రెడీగా వుంచుతా,” అని చెప్పాను. తను తలూపి వెళ్ళిపోయాడు.
నేను ప్రతి రోజూ విధిగా దర్శించే వెబ్‌సైట్లన్నీ చూసుకుని, ఇక లాబ్‌కి పోవాలి అనుకుంటూ చివరిగా మళ్ళీ ఈమెయిల్‌చూడబోతే, గోపాల్ దగ్గర్నించి, “సారీ డియర్, సాయంత్రం ప్రోగ్రాముకి రాలే”నంటూ ఈమెయిల్!
నాకు వొళ్ళు మండుకొచ్చింది. మళ్ళీ ఏదో ప్రాజెక్టు నెత్తిమీది కొచ్చి వుంటుంది. డాక్టరైతే వేళా పాళా లేకుండా రోగులసేవలో పడివుంటారని చెప్పి కంప్యూటర్‌ఇంజనీర్‌ని చేసుకుంటే .. ఇతగాడి పనీ అలాగే వుంది, రోజుకి ఇరవై నాలుగ్గంటలు చాలవు పనికి! సరే, ఏం ముంచుకొచ్చిందో కనుక్కుందామని ఫోన్ చేశా.
“గోపాల్ హియర్”
“ఆ, నేనే. ఏంటి సాయంత్రం రాలేనంటావ్? మళ్ళా ఏదన్నా ప్రాజెక్టు డెడ్‌లైనా?”
“ఓ, ఈమెయిల్‌చూశావా? అదీ .. ప్రాజెక్టు కాదు. నువ్వు చెప్పినప్పుడు గుర్తుకి రాలేదూ, వర్కుకి డ్రైవ్‌చేస్తుంటే గుర్తు కొచ్చింది, కారుకి బ్రేక్స్ మార్పించాలి. ఇవ్వాళ సాయంత్రం షాపు వాడి దగ్గర ఎపాయింట్‌మెంట్ తీసుకున్నాను. మరి ఆ పని పూర్తయ్యేప్పటికి లేటవ్వచ్చు అందుకనీ ..”
“అబ్బ, ఆ బ్రేకులేదో ఇవ్వాళ్ళే చెయ్యాలా? రేపో ఇంకో రోజెప్పుడైనా ..”
“అహా, నీకు తెలుసుగా అది రెండు వారాలుగా ట్రబులిస్తోందీ .. అప్పుడు కాల్ చేస్తే షాపు వాడు ఇవ్వాళ్టికి ఇచ్చాడు డేటు. ఇది గనక మిస్సైతే .. ఏ క్షణాన నడి రోడ్డులో అది విరిగి చస్తుందోనని భయపడి చస్తున్నాను ..”
“అయ్యా, బాబూ, నువ్వేమీ చచ్చిపోవద్దు .. బాంకు సేఫ్టీబాక్సులో దాచిపెట్టిన నా తాడు ఇంకా గట్టిగానే ఉందిలే,” అన్నాను కసిగా. ఇంతలో ఒక బ్రిలియంటైడియా తట్టేసింది నా బుర్రకి.
“అవునూ, నువ్వెందుకు సాయంత్రం షాపుకి పోయి కూర్చోవడం? లంచి టైములో కారిచ్చేసి వొస్తే వాడే చేసి వుంచుతాడుగా, హాయిగా సాయంత్రం వచ్చేప్పుడు తెచ్చేసుకోవచ్చు. ఉన్నాడుగా నీ శిష్యుడు శేషు, నిన్ను షాపుకి తీసుకెళ్ళి తీసుకొస్తాడు”
“అవుననుకో, కానీ లంచి మానుకోవాలి వెళ్ళి రావాలంటే. నేనైతే మానేస్తా ననుకో. పాపం శేషుని గూడా మానెయ్య మంటే .. బావుండదేమో? అందుకే ఇలా సాయంత్రం కానిచ్చేస్తే సరి. ప్రోగ్రాముకి నువ్వెళ్ళొచ్చెయ్”
“పోనీ ఒక పని చెయ్, ఏ మాత్రం వీలున్నా డైరెక్టుగా థియేటర్‌దగ్గిరి కొచ్చెయ్. నేను షో మొదలయ్యే దాకా నీ కోసం చూస్తాను.”
“ఎందుకులే నీల్‌స్. నువ్వు హాయిగా కూర్చుని ఎంజాయ్‌చెయ్యి. నాకెలాగూ కుదర్దులే!”
అంటూ వేరే మాటకి తావులేకుండా హడావుడిగా ఫోన్ పెట్టేశాడు.
నాకు పిచ్చి కోపమొచ్చింది నా మొగుడి మీద. అసలు నా మొగుడికి వుంటే గదా, పెళ్ళాంతో కలిసి ప్రోగ్రాము కెళ్ళాలీ అని. మనిషికి మళ్ళీ మంచి టేస్టే వుంది, బాలమురళి గానాన్ని చెవులప్పగించి వింటాడు, కూచిపూడి భరతనాట్యం ప్రోగ్రాములేవన్నా వూళ్ళో జరిగితే తప్పకుండా వెళ్ళి ముందు వరసలో కూర్చుని గుడ్లప్పగించి చూస్తాడు. ఎటొచ్చీ విదేశీ నాట్య సంగీతాల దగ్గరే వస్తుంది గొడవంతా .. నాకేమో, ఎట్లాగూ ఈ దేశంలో వున్నాం గదా, అందులోనూ యూనివర్సిటీలో బోలెడు దేశ దేశాల ప్రోగ్రాములు జరుగుతుంటాయి, నాలుగూ చూసి ఆనందించాలని. గోపీకి అవి అంతగా నచ్చవు, “ఆ ఏవుంది, ఆ డాన్సుల్లో, ఓ అభినయమా, ఓ భావమా? పిచ్చిగా తైతెక్కలాడ్డం .. దానికి తోడు ఆ సంగీతం వొకటి, ఏనుగులు ఘీంకరిస్తున్నట్టూ, కుక్కలు మూలుగుతున్నట్టూనూ,” అని తీసి పారేస్తాడు. ఐనా నేను బెదిరించో బెల్లించో నాకిష్టమైన ప్రోగ్రాము లన్నిటికీ తనని లాక్కుపోతూనే వుంటాను. ఈ రోజసలు ఈ కారు సర్వీసు భాగోతమంతా గోపీ ఈ మోడర్న్‌డాన్స్‌ఎగగొట్టటానికేసెటప్ చేశాడేమో? ఏబ్బే, మనిషికి అంత తెలివి గూడానా. పుంఖానుపుంఖాలుగా కంప్యూటరు కోడ్లు రాసేస్తాడు గానీ, యిలాంటి దుర్మార్గపు తెలివితేటలు లేవు గోపీకి!
‘మీరజాల గలడా నా యానతి ‘ అని నాకు నేనే కూని రాగం తీసుకుంటూ స్నానాని బయల్దేరాను. నే నొక్కదాన్నే వెళ్ళలేనా అంటే .. మహరాణిలా వెళ్ళగల్ను, కానీ వొక్కదాన్నీ ఎందుకెళ్ళాలి? అక్కడ అందరూ జంటలు జంటలుగా వస్తారు, నేను మాత్రం ఏక్ నిరంజన్ అంటూ పోతే .. అదేం బావుంటుంది? నాకంటూ ఇంచక్కటి ఎస్కార్టు ఒకడుండగా! దానికి తోడు మనం చూసిన అనుభవాన్ని ఇంకొకళ్ళతో .. ముఖ్యంగా ప్రియమైన మొగుడితో పంచుకున్న అనుభవం వేరు కదా.
స్నానం ముగించి పని కెళ్ళేందుకు తయారవుతుండగా, నా కోపం అతగాడి శిష్య పరమాణువూ, జిగురు దోస్తూ ఐన శేషునాయుడి మీదికి తిరిగింది. శేషు బాబు పసి పాపాయి, పాపం ఒక పూట లంచి మానుకోలేడు గురూగారి కోసం! అతగాడు ఈ దేశంలో దిగినప్పణ్ణించీ ఈయన గారు ఎన్ని చేసిపెట్టలేదు, డ్రైవింగ్ నేర్పించడం దగ్గర్నించీ, టాక్సులు ఫైల్‌చెయ్యడం, గ్రీన్‌కార్డుకి అప్లై చెయ్యడం దాకా .. ఇంకా, ఎన్నిసార్లు మా యింట్లో లంచికి తయారై పీకల్దాకా మెక్కలేదు .. ఎన్నిసార్లు వర్కునించి రాత్రి పది దాటాక వొచ్చి, “శేషుని కూడా తీసుకొచ్చానోయ్, ప్రాజెక్ట్ ఫినిషింగ్‌లో బాగా లేటైంది. తనొక్కడూ ఇప్పుడు యింటికెళ్ళి ఏం వొండుకుంటాడనీ,” అంటూ మొగుడు ఈ తోకతో సహా దిగబడితే అప్పటికప్పుడు మళ్ళీ అన్నం వొండి పెట్టలేదూ .. ఆ మాత్రం కృతజ్ఞత లేదు మనిషికి .. ‘రానీ, రానీ ఈసారి భోజనానికి రానీ, బియ్యంతో బాటు కడిగి పారేస్తా నాయుణ్ణి ’ అని పళ్ళు నూరుకుంటూ ఇల్లు వొదిలి లాబుకి బయల్దేరాను.
ఆ రోజు సాయంత్రం థియేటర్‌దగ్గర గోపాల్‌వస్తాడేమోనని ఎదురు చూస్తూనే వున్నా. ఎక్కడో చిన్న ఆశ, ఆ వెధవ కారు పని తొందరగా పూర్తయ్యి రాకూడదా అని. ఇంక ప్రదర్శన మొదలవుతున్నట్టు బెల్ మోగేసరికి ఆశ వొదిలేసుకుని నా సీట్లో వెళ్ళి కూర్చున్నా. ఇలాంటి ప్రోగ్రాముల్లో ప్రదర్శన మొదలు పెట్టాక ఎవర్నీ లోపలికి రానివ్వరు. ఇక ఇవ్వాళ్టికి ఇంతే. కాసేపు విచారంగానూ, కోపంగానూ వుంది గానీ, డాన్సు మొదలయ్యేప్పటికి ఆ విచిత్ర దృశ్య కావ్యంలో లీనమై పోయాను.
నేను యూనివర్సిటీ బస్సు పట్టుకుని ఇంటికి చేరేప్పటికి పదైంది. గోపీ డైనింగ్‌టేబుల్‌దగ్గర లాప్‌టాప్‌మీద పని చేసుకుంటున్నాడు. నేను లోపలికి రాగానే హడావుడిగా లేచి, “చూడు, నీ కోసం ఏం తెచ్చానో” అంటూ కిచెన్లోకెళ్ళి కృష్ణా స్వీట్స్‌డబ్బా తెచ్చి నా ముందు తెరిచాడు. అందులో నాకెంతో ఇష్టమైన జిలేబీలు. నా కింకా తను ప్రోగ్రాముకి రాలేదన్న కోపం పోలా. నేను నిర్లక్ష్యంగా సోఫాలో కూలబడి చురచురా చూస్తూ, “సడన్‌గా పెళ్ళామ్మీద ఏంటి అంత ప్రేమ? ప్రోగ్రాముకి రాకుండా ఎగ్గొట్టినందుకు లంచమా ఇది?” అన్నా.
తను సహృదయంతో చేసిన మంచి పనికి నేను ఇలాంటి విపరీతార్థం తియ్యగలనని ఊహించలేదు కాబోలు, బాసు తత్తర పడి, మహా అమాయకంగా మొహం పెట్టి,
“ఛ ఛ, అది కాదు నీల్స్ సర్వీస్‌స్టేషన్నించి వస్తుంటే .. దార్లోనే గదా, నీ కిష్టమని ఆగి కొనుక్కొస్తే ..ఆ, అది సరే, నీ ప్రోగ్రాం బాగుందా?” అన్నాడు. మాట మారుస్తున్నాడని తెలుస్తూనే వుంది.
“ప్రోగ్రాం కేవీ? బ్రహ్మాండంగా వుంది. నువ్వు అక్కడికి రాలేదు సరే, రానందుకు బ్రేకుల పనైనా ప్తూౖరెందా?” అన్నాను నేను తీవ్రత ఏమాత్రం తగ్గించ కుండానే.
“ఆ, ఆ, అందుకోసమనే గదూ నేను వాడి దగ్గర కూర్చుని మరీ పని పూర్తి చేయించుకుంది. అందుకే బాగా లేటయింది. ఎనీవే, ఇంకో యాభై వేల మైళ్ళ వరకూ బ్రేకులకి ఢోకా లేదు. ప్రోగ్రాముకెళ్ళే హడావుడిలో నువ్వు గూడా తిన్నట్టు లేదు, రా భోంచేద్దాం,” అన్నాడు.
నాకప్పటికి అర్థమైంది గోపీ కూడా, డిన్నర్‌రెడీగా వున్నా, అన్నం తినకుండా నా కోసం కనిపెట్టుకు కూర్చున్నాడని. నా మనసు కరిగి పోయి కోపం గాలికెగిరి పోయింది. తన చేతులో వున్న స్వీట్ల డబ్బాలోంచి ఒక జిలేబీ ముక్క తీసుకుని, ముని పంట కొరికి దాన్నలాగే నా గోపీ నోటికి భాగం అందించాను, అతన్ని క్షమించేస్తూ.
మర్నాడు నేను లాబుకి నడిచి వెళ్తుంటే మా పక్క ఎపార్ట్‌మెంట్లో వుండే లీ పెంగ్‌అనే చైనీస్‌అమ్మాయి తోడు తగిలింది. పలకరింపులైనాక తను అన్నది,
“నిన్న సాయంత్రం నా యింటి పీసీలో ఏదో వైరస్‌వచ్చినట్టుంది. నా దగ్గర ఇంట్లో వైరస్‌క్లీనింగ్‌సాఫ్ట్‌వేరేదీ లేదు. నీ దగ్గర వుందేమోనని నీకు కాల్‌చేస్తే నువ్వు బయటి కెళ్ళావల్లే వుంది. ఇవ్వాళ్ళ ఒక ఇంపార్టెంట్‌పేపరొకటి సబ్మిట్‌చెయ్యాలి. నాకు బలే టెన్షనై పోయింది. డిన్నరయ్యాక నేను చెత్త బయటపారేసి వొస్తుంటే గోపాల్ అప్పుడే కారు పార్క్‌చేసి వొస్తున్నాడు. చాలా లేట్‌గా పని చేస్తాడల్లే వుందే .. దానికి తోడు డ్రైక్లీనింగ్‌కూడా పికప్ చేసుకున్నాడల్లే వుంది. అబ్బ, నువ్వెంత అదృష్టవంతురాలివో నీలిమా! నా మొగుడూ వున్నాడు ఎందుకు, చెత్త పారేసి రమ్మంటే టీవీలో ‘ఫ్రెండ్స్ షో చూస్తూ కూర్చున్నాడు. గోపాల్‌పాపం ఆ డ్రైక్లీనింగ్‌తో అవస్థ పడుతూ వస్తున్నాడు. నేను ఆఫర్‌చేశాను నేనొక వస్తువు పట్టుకొస్తానని .. అతనికి చాలా మొహమాట మల్లే వుందే .. ఎనీవే, తనని అడిగాను ఏదన్నా ఏంటీ వైరస్‌సాఫ్ట్‌వేర్‌వుందా అని .. వెంటనే వచ్చి పాపం చాలా సాయం చేశాడు ..”
ఇలా ఆ అమ్మాయి మా దార్లు వేరయ్యే వరకూ ఛాటర్‌బాక్సులా వాగుతూనే వుంది. మేం విడి పోయేటప్పుడు, “గోపాల్‌కి మళ్ళీ నా తరపున థాంక్స్‌చెప్పు,” అని వెళ్ళిపోయింది. నేను లాబుకి చేరుకుని నా పని చేసుకుంటుండగా ఎందుకో లీ అన్న మాటలు మనసులో మెదిలాయి. అలా ఒక ప్రశ్న రూపు దిద్దుకుంది గోపీ నిన్న డ్రైక్లీనింగ్ పికప్ చేసుకున్నాడా? అదెలా సాధ్యం?
మేమెప్పుడూ డ్రైక్లీనింగ్‌మా యింటికి దగ్గర్లో వుండే ఒక షాపులో ఇస్తాం. ఆ షాపు పని వారపు రోజుల్లో సాయంత్రం ఏడింటికల్లా మూసేస్తారు. నిన్న గోపీ సర్వీస్‌స్టేషన్నించి వూళ్ళో కొచ్చేప్పటికి ఏడు దాటి వుండాలి కదా, ఏడింటికి ముందే వూళ్ళోకొస్తే తను ప్రోగ్రాముకే వచ్చి వుండచ్చు కదా, పోయి డ్రైక్లీనింగ్‌పికప్ చేసుకోడానికి ఎందుకు వెళ్తాడు? ఒకవేళ గోపీ కోటు విప్పి భుజమ్మీద వేసుకుంటే దాన్ని చూసి లీ డ్రైక్లీనింగ్‌అని పొరపడిందేమో? ఎందుకు పొరపడుతుంది .. డ్రైక్లీనింగ్‌ఐతే షాపువాళ్ళు ఇచ్చే ప్లాస్టిక్‌రాప్‌లో వుంటుందిగా? ఇలా అనుమానాలు ఒకదాని వెనక ఒకటి చేరి కవాతు చేస్తున్నై నా మనసులో. లాభం లేదు, ఈ సంగతేంటో తేల్చుకోవాల్సిందే.
లంచికి ఇంటికెళ్ళి ముందు బెడ్రూమ్ క్లోసెట్ తెరిచి వేళ్ళాడుతున్న బట్టల్ని పరిశీలించాను. లీ చెప్పింది నిజమే. కొత్తగా డ్రైక్లీన్ చేసిన బట్టలు నీట్‌గా పాలిథీన్‌రాప్‌లో హేంగర్లనించి వేళ్ళాడుతున్నై, నా స్వెట్టరూ, బ్లేజరూ గోపీ సూట్లతో బాటు. నిన్న సాయంత్రం నేను ప్రోగ్రాముకి డ్రెస్‌చేసుకుంటున్నప్పుడు ఇవిక్కడ లేవు ఖచ్చితంగా. గోపీయే వీటిని పికప్‌చేసుకుని వుండాలి. నిన్ననే పికప్‌చేసుకుని వుండాలి. అంటే .. ఈ మనిషి ఏడింటికి ముందే వూళ్ళోకొచ్చి వుండాలి.
కళ్ళెదురుగా సాక్ష్యం కనిపిస్తున్నా అమాంతం ముద్దాయి అనే ముద్ర గోపీ మీద వేసెయ్యటానికి నాకు మనసొప్పకుండా వుంది. నిన్నటి జిలేబీల కరకర ఇంకా తీపిగా గుర్తొస్తోంది. ఏమో, నిన్న డ్రైక్లీనింగ్ షాపు వాడు లేటుగా తెరిచి వుంచాడేమో .. ఎలా నిర్ధారించుకోవడం? ఇలా ఆలోచిస్తుంటే ఒక లైటు వెలిగింది బుర్రలో. వెంటనే కంప్యూటర్లో నెట్‌స్కేప్‌తెరిచి మా ఇద్దరికీ జాయింటుగా ఉన్న క్రెడిట్‌కార్డ్‌ఎకౌంట్లో లాగిన్ అయ్యాను. అప్‌టుడేట్ ఇన్ఫర్మేషన్! క్రెడిట్‌కార్డుతో చేసిన ప్రతి ట్రాన్సాక్షన్‌ఎంత ఖర్చు ఏ షాపులో ఏ రోజున జరిగిందో చూపిస్తున్నది. ఏ రోజున అనే కాదు, ఎన్ని గంటల ఎన్ని నిమిషాలకు జరిగిందో కూడా చూపించే మహత్తరమైన మంత్ర దర్పణమిది! ఇలా స్క్రోల్‌డౌన్ చేస్తే .. అదుగో నిన్న .. సర్వీస్‌స్టేషన్లో అక్షరాలా నూటెనిమిద డాలర్ల యాభైమూడు సెంట్లు. అది జరిగింది సాయంత్రం ఐదూ నలభై మూడుకి! అంటే .. అయిదుమ్ముప్పావుకే సర్వీస్ స్టేషన్లో పనైపోయిందన్న మాట. అక్కణ్ణించి వూళ్ళోకి డ్రైవ్ చెయ్యటానికి సుమారు ఇరవై నిమిషాలు .. మహా ఐతే అరగంట. ఇంకొంచెం స్క్రోల్‌డౌన్ చేసి చూద్దాం .. అదుగో .. డ్రైక్లీనింగ్ షాపులో ఇరవై రెండు డాలర్ల నలభై సెంట్ల ఖర్చు .. నమోదైంది ఆరూ ముప్ఫయ్యారుకి! హమ్మ దొంగ, దొరికి పోయాడు!! డ్రైక్లీనింగ్ పికప్‌చేసుకున్నాక గూడా గోపీ ప్రోగ్రాముకి ఈజీగా అందుకుని వుండచ్చు. కావాలని, డెలిబరేట్‌గా ఎగ్గొట్టాడన్న మాట! ఎంత ఘోరం .. ఎంత మోసం? పైగా నా కళ్ళ తుడుపుకి జిలేబీలు!! జిలేబీల కరకరతో నా కళ్ళు కప్పుదా మనుకున్నాడూ .. రానీ, తన పని చెబుతా. మన డిటెక్షన్ దెబ్బకి ఆ కంప్యూటర్‌బుర్ర అదిరిపోవాలి. “గోపాల, గోపాల, దొరికేవు గోపాలా” అని “ప్రేమికుడు” పాట స్టైల్లో కూనిరాగం తీస్తూ కిచెన్లో కెళ్ళాను.
నేనిలా విజయగర్వంతో విర్రవీగుతూ, ఒక కప్పుడు హెర్బల్‌టీ పెట్టుకుని వెచ్చగా చప్పరిస్తూ కూర్చుంటే .. ఇంకో అనుమానం భూతంలా తలెత్తింది. లీ పెంగ్‌చెప్పిన ప్రకారం గోపాల్‌వచ్చేప్పటికి టీవీలో ‘ఫ్రెండ్స్’ వస్తున్నది .. అంటే ఎనిమిది దాటి వుండాలి. డ్రైక్లీనింగ్‌షాపులో పని ఆరూ ముప్ఫయ్యారుకే ఐపోతే .. ఎనిమిది దాటిందాకా గోపీ ఎక్కడున్నట్టు? ఏం చేస్తున్నట్టు? నాకెందుకో ఒక్కసారిగా వెన్నులో చలి పుట్టుకొచ్చి వొళ్ళు జలదరించింది.
నిన్న కరకర్లాడుతూ మురిపించిన జిలేబీలు ఇవ్వాళ్ళ కడుపులో వానపాముల్లా మెలిదిరుగుతూ వెక్కిరిస్తున్నై. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. ఎప్పుడైనా గోపాల్‌శేషుబాబుతో కలిసో, ఇంకెవరన్నా కొలీగ్స్‌తోనో బారుకెళ్ళి బీరు కొట్టి వస్తుంటాడు. అలాంటప్పుడు తను నాకు ముందే ఫోన్ చేసి చెప్పటమో, లేకపోటే వెల్లొచ్చాకనైనా చెప్పటమో చేసేవాడు. అది నాకు పెద్ద పట్టింపు కాదు. మరెందుకు నిన్న తనేవీ చెప్పలేదు? ఐదూ పది నిమిషాలు కాదు .. గంటన్నర పైగా .. అంత నాకు చెప్పకుండా చేసే పని ఏమై వుంటుంది? పోనీ తన ఆఫీసుకి ఫోన్‌చేసి డైరెక్ట్‌గా అడిగేస్తే ..
.. ఊహూ .. గోపీ ఇలా రహస్యంగా ప్రవర్తించడం నా తెలివి తేటలకే సవాల్‌గా అనిపించింది .. దీన్ని నా డిటెక్షన్‌తోనే పట్టుకోవాలి! లాజికల్‌గా ఆలోచిస్తే .. ఈ కుట్రలో శేషుబాబుకీ ఏదో భాగం వుండే వుంటుంది. సో, నాయుడి దగ్గర్నించే ఈ సమాచారం రాబట్టాలి .. ఇంకెప్పుడూ మా యింట్లో తనకి పులిహోర వొండి పెట్టనని బెదిరిస్తే .. తనే దార్లోకొస్తాడు.
అనుకున్నదే తడవు, ఆఫీస్‌లో శేషునాయుడికి కాల్‌చేశాను.
“శేషు హియర్”
“ఏయ్‌నాయుడూ, నేను, నీలిమని.”
“అమ్‌బాబోయ్ ఏటండొదిన గారూ, ఏటి మామీద్దయొచ్చీసింది?”
“చాల్లే వేషాలు. ఏంటి, కొంచెం టైముందా మాట్లాడ్డానికి?”
“మీరు కాల్జెయ్యటవేటి, నాకు టైములేక పోడమేటి? చెప్పండి. గురూగార్ని పిలవమంటారా?”
“కాదులే, అసలీ మధ్య నువ్‌కనపడ్డం లేదు, ఎలాగున్నావో పలకరిద్దామని. నిన్న పులిహోర చేశాను, నువ్వే గుర్తొచ్చావు. ఆ మధ్య వైకుంఠ ఏకాదశికి చేసినప్పుడు లొట్టలేసుకుంటూ తిన్నావుగా! అందుకని. ఇంకా కొంచెం మిగిలింది, ఇవ్వాళ్ళ నీకు పేకెట్‌కట్టి పంపిద్దా మనుకున్నా. ఇంతలోకే మీ గురూగారు ఉరుకులూ పరుగులూనూ. నీకు చెప్పలేదా?”
“అమ్‌బాబోయ్ మీ పులిహోరే! అదెట్టా మర్చిపోతాను? చూశారా, చూశారా, గురుడు కూడా ఒక్క మాటైనా చెప్పలేదు. నిన్న ఆ యెదవ షాపులో బ్రేకులు మారుస్తానికి కంపెనీ ఇచ్చాను గదా. ఛ, బలే ఛాన్సు మిస్సై పోయానన్నమాట.”
“పులిహోర దేముందిలే, వొచ్చే ఆదివారం లంచికి రా, చేసి పెడతా. నువ్వు కూడా వెళ్ళావా షాపుకి గోపీతోబాటు ?”
“మరి? గంట సేపు బోరు కొడుతుంది భాయ్‌అని గురుడు రిక్వెష్టు జేస్తే! గురుడు రిక్వెష్టు జెయ్యడం, మనం కాదంటామా ?”
“అవున్లే, గొప్ప గురుభక్తి పరాయణుడివి. పోనీ ఆ పనయ్యాక నువ్వూ ఇంటికొచ్చి ఉండచ్చుగా ? డిన్నర్‌కేం చేశావు మరి ?”
“ఆ, ఏదో లెండి, మామూలే. బ్రేకుల పనయ్యాక .. దార్లో జిలేబీలు కొనుక్కుని .. మీ యింటి దగ్గిరి కొచ్చీసరికి డ్రైక్లీనింగ్‌అన్నాడు గురుడు. మీరేదో తందనానా డాన్సు కెళ్ళారంటగా నిన్న.”
“అవును, ఏడింటికి షో. షోకి తనక్కూడా టిక్కెట్టుందని మర్చిపోయాడా మీ గురువు? ఇంకా నేను మీకు సర్వీస్‌స్టేషన్లోనే లేటయ్యి ప్రోగ్రాముకి రాలే దనుకుంటున్నా !”
“అమ్‌బాబోయ్ వొదిన గారూ, మీ కొశ్చెన్జూస్తే ఇదేదో పితలాటకం లాగుంది. నన్నొదిలెయ్యండి.”
“అబ్బ, పర్లేదు చెప్పవోయ్ ఏవన్నాడేంటి మీ గురుడు.”
“ఏబ్బే, లాభం లేదు వొదిన గారూ. మీ ఆయన్నే అడగండి. మై లిప్స్‌ఆర్ సీల్డ్”
“ఏయ్‌నాయుడూ, ఆ రోజు పులిహోర రుచి గుర్తుందిగా? ఇంకోసారి మా యింటో పులిహోర తినాలని ఉంటే .. మర్యాదగా చెప్పేసెయ్”
“అబ్బా, నా వీక్‌పాయింటు మీద నొక్కేశారే .. మీ పులిహోర కోసమనీ .. గురూ, ఈ గురుద్రోహిని క్షమించు.”
“ఆ, ఆ, క్షమిస్తాళ్ళే, ఏం జరిగిందో చెప్పు.”
“షో ఆరింటికే మొదలై పోయిందీ, మనం గూడా వెళ్ళాలిగాని టైమై పోయిందిగా అన్నాడు గురుడు. మీరెట్టాగా యింటో వుండరన్జెప్పీసి .. ఆ డ్రైక్లీనింగ్‌పక్కనే స్పోర్స్ట్‌బారుకి పోయి బాస్కెట్‌బాల్‌గేము చూస్తా కూర్చున్నాం. ఆయనేమో వీక్‌డేస్‌లో మందు కొట్టడుగా, కోకు తాగుతా కూర్చున్నాడు. మనకట్టాంటి ప్రాబ్లం లేదుగాబట్టి ..”
“బీరు తాగుతూ కూర్చున్నావు. అంతేనా?”
“అంతే! ఎనిమిదింబావుకో ఎప్పుడో గేమై పోయింది. ఇక ఆయన మీ యింటికీ, నేను మా యింటికీ!”
“థేంక్స్, నాయుడూ.”
“ఐతే వొదిన గారూ, నా పులిహోర .. ”
“నాకు నువ్వెంత సాయం చేశావో నీకే తెలీదు. ఇంకొక్క సాయం కూడా చేసిపెట్టు. మనం ఇలా మాట్లాదుకున్న సంగతి మీ గురుడికి చెప్పకు. నేనొక చిన్న సర్ప్రైజ్‌ఇస్తాను. నీ పులిహోర కేం ఢోకా లేదు.”
“ఏటో, మీ దయ, మా ప్రాప్తం!”
“సర్లే. వొచ్చే ఆదివారం లంచికి రా. చేసి పెడతా. వుంటా, బై.”
గోపీ మీద నాకెంత నమ్మకమున్నా, తలెత్తిన అనుమానపు పెను భూతాన్ని వొదుల్చుకోలేక పోయాను. శేషుబాబు చెప్పిన సాక్ష్యంతో నా గుండె బరువు దిగిపోయింది. నానుంచి దాచిపెట్టినది “స్పోర్స్ట్ బారుకి వెళ్ళడం” కంటే భయంకరమైనది కానందుకు నేను ఆనందించినా, గోపీ అసలు విషయం నాకు చెప్పకుండా దాచి పెట్టాలని ప్రయత్నించినందుకూ, నాకు ఇలాంటి భయాన్ని కలిగించినందుకూ అతన్ని క్షమించలేక పోయాను. తగిన శాస్తి జరగాల్సిందే. జస్టిస్ మస్ట్ బె సెర్వ్డ్.
్‌్‌్*** ***
సాయంత్రం గోపాల్‌యింటికొచ్చే లోపల అవసరమైన రంగాన్ని సిద్ధం చేసుకున్నాను. ఆరింటికల్లా వొచ్చేశాడు గోపీ. తను బూట్లు విప్పి వచ్చి సోఫాలో కూర్చోగానే, శుక్రవారం సాయంత్రం గదా, చల్లటి హైనెకిన్ బీరు సీసానీ, ఒక ప్లేట్లో వేడి వేడి పకోడీల్నీ అందించి పక్కనే కూర్చున్నా. తను పకోడీల్ని చూసి “ఏవిటి విశేషం” అన్నట్టు చూశాడు నావేపు.
“ఇంట్లో టిఫిన్ చేసి చాలా రోజులైంది గదా, ఇవ్వాళ్ళ డిన్నర్‌కి ఎటైనా బైటికెళ్దా మనుకున్నా, అంత దాకా ఇది ఉపశమనం అనుకో!” అన్నాను చిరునవ్వుతో.
“కారు బ్రేకులు సరిగ్గా పని చేస్తున్నయ్యా?” అనడిగా, తను పకోడీలు నంచుకుంటూ బీరు సేవిస్తుండగా.
“ఆ, ఆ, బానే వుంది.” అన్నాడు.
“నిన్న డాన్సు పోతే పోయింది, పాపం, ఆ సర్వీస్‌స్తేషన్లో కూర్చుని నువ్వు మంచి బాస్కెట్‌బాల్ గేమ్ మిస్సయినట్టున్నావే.” అన్నా చాలా కేషువల్‌గా.
గోపాల్ మొహంలో చిన్న కలవరపాటు ఒక్క క్షణంలో అలలాగా దొర్లిపోయింది. సర్దుకుని, “అవునుట, ఇవ్వాళ్ళ ఆఫీస్‌లో విన్నాను. నీకెప్పణ్ణించీ బాస్కెట్‌బాల్ మీద ఇంట్రస్టు? ” అని ఎదురు ప్రశ్న వేశాడు. ‘ఐ సీ ’ అనుకున్నా. బాసు ఇంకా దాచిపెట్టాలనే చూస్తున్నాడన్న మాట. ఇక బ్రహ్మాస్త్రం వెయ్యాల్సిందే. కాసేపు అదీ ఇదీ మాట్లాడి సడన్‌గా మాట మార్చి, “నీకు చాలా థేంక్స్‌చెప్పుకోవాలి, డార్లింగ్ నిన్న డ్రైక్లీనింగ్‌పికప్ చేసుకున్నందుకు. ఇవ్వాళ్ళ మా స్పాన్సర్లతో మీటింగుకి సరైన డ్రెస్ లేదే అని విచార పడ్డాను పొద్దుట. తీరా క్లోజ్సెట్‌లో చూస్తే డ్రైక్లీన్ చేసిన బ్లేజర్‌వుంది. థేంక్యూ సో మచ్” అన్నా, తన దగ్గరగా జరిగి బుగ్గ మీద ముద్దు పెడుతూ.
“నో ప్రాబ్లం” అన్నాడు బాసు అమాయకంగా. ఆ అమాయకత్వం చూస్తే అమాంతం ఆ బుగ్గ కొరికెయ్యా లనిపించింది. ఉగ్గ బట్టుకుని దూరంగా జరిగి తననే చూస్తూ అస్త్రం సంధించాను.
“అవునూ, డ్రైక్లీనింగ్‌వాడు ఏడింటికల్లా షాపు మూసేస్తాడు కదూ. నిన్న సాయంత్రం లేటుగా తీసుంది కాబోలు!” అన్నా, నేను కూడా అతనంత అమాయకంగానూ మొహం పెట్టి.
బాసు ఎవరో లాగిపెట్టి లెంపకాయ కొట్టినట్టు అదిరిపడ్డాడు.
“ఇవ్వాళ్ళ మధ్యాన్నం నాయుడితో మాట్లాడా, ఆదివారం లంచికి పిలుద్దామని. నిన్న గేం బాగా ఎంజాయ్‌చేశావా?” అన్నా నాకు సాధ్యమైనంత మృదువుగా.
ఇక మొదలు పెట్టాడు కన్ఫెషన్.
” .. ఆ తందనానా డాన్సులంటే నాకు తలనొప్పని నీకు తెల్సుగా. నేను మామూలుగా రానంటే నువ్వు కష్ట పెట్టుకుంటావు. ఏదో కారు సర్వీసు అలా దైవికంగా కలిసింది అనుకున్నా. తీరా అది కాస్తా తొందరగా ఐపోయింది. ఇంటికొస్తే నువ్వు తప్పకుండా డాన్సుకి లాక్కెళ్తావు. అందుకని, దార్లో ఆగి జిలేబీలు కొనడమూ, డ్రైక్లీనింగ్ పికప్ చేసుకోడమూ చేసినా కూడా .. ఇంకా టైమ్‌మిగిలిపోయింది. నువ్వు అప్పటికి ఇంట్లోంచి బయల్దేరావో లేదో తెలీదు. డ్రైక్లీనింగ్‌నించి బయటికొస్తే పక్కనే స్పోర్స్ట్‌బార్‌కనిపించింది .. ”
నాకు ఈ సమస్య సులభంగా విడిపోయినందుకు ఒక పక్క మనసు తేలిక పడినా, ఇంకో పక్కన మధ్యాన్నం తలెత్తిన అనుమానపు పెనుభూతం గుర్తొచ్చి, అనుకోకుండా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అప్పటిదాకా తలొంచుకుని సంజాయిషీ ఇస్తున్న గోపీ నేనేమీ మాట్లాడక పోయే సరికి తలెత్తి చూశాడు. చూసి కంగారు పడుతూ, “ఏయ్‌నీల్స్ ఛ ఛ, ఏంటిది. ఇంత సీరియస్‌గా తీసుకుంటా వనుకోలేదు,” అన్నాడు నా వేపు తిరిగి చేతులు చాస్తూ.
నేను తన వేపే చూస్తూ, “నన్ను చాలా భయపెట్టావ్ గోపీ. ప్ల్లీీజ్, ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు,” అన్నాను.
ఎంత నిగ్రహించుకుంటున్నా, నా గొంతు వొణికి పోయింది .. నీళ్ళు కళ్ళలో నిండిపోయి గోపీ రూపం వంకర్లుగా కనిపిస్తోంది. తను పూర్తిగా చలించిపోయాడు. గభాల్న ముందుకు వంగి నా చేతులు పట్టుకుని, “అయామ్ సారీ, నీలూ. ప్లీజ్ ఏడవొద్దు. ఛ, అయామ్ ఏనిడియట్!” అన్నాడు దీనంగా.
అంతగా నన్ను కదిలించిన ఎమోషన్లోనూ నాకు గోపీ మొహం చూస్తేనవ్వొచ్చింది. ఐనా సీరియస్‌గా కనపడ్డానికి ప్రయత్నిస్తూ,
“యెస్ యూవార్‌ఏనిడియట్! అందుకు పనిష్మెంట్‌అనుభవించక తప్పదు,” అన్నాను.
“పనిష్మెంటా?” అన్నాడు గోపీ విస్మయంగా. నాకింకా నవ్వొచ్చింది.
“ఆ! ఈ పూటంతా నీకు బందిఖానా!!” అని గోపీని నా చేతుల్తో కట్టి పడేశాను. దొంగ దొరికి పోయాడు!