ఇన్నిరకాల అభినయాలూ.. నవరసాల పోషణలూ..
అంత సీనేం లేదు.. తెరలన్నీ నెమ్మదిగా దించేద్దూ..
స్విచ్‌లన్నీ ఒక్కటొక్కటే ఆఫ్‌చేసి..మ్యూట్‌బటన్‌నొక్కేసి
ఒక మంద్రగీతం లోకి మగతగా..మెల్లగా..
వంతెన కింద కాలవ నిశ్శబ్దంలోకి..
యాంత్రికపుటిరుసు వొదిలి దారి తప్పి మాంత్రికలోకంలోకి..
లేజీగా ఎప్పుడేనా ఒక సాయంత్రం..
బధ్ధకంగా ఒక్కణ్ణే ఈ సాయంత్రం..
ఇదంతా ఎన్నటికీ తరగని పరుగే కాదా!
గుండ్రంగా తిరిగే కాళ్ళకు బ్రేకులు వేసి..
ఇదంతా ఎప్పటికీ తప్పని గొడవే కదా!
ఆ తప్పొప్పుల పట్టిక అవతల పెట్టేద్దూ!
తాపీగా ఒకటేనా ఒక సాయంత్రం..
అవన్నీ ఇంత ఉమ్మూసి అరచేత్తో చెరిపేద్దూ!
ఒక పగటి కలను వెచ్చగా కళ్ళకు కప్పుకునో
ఒక నలిగిపోయిన జ్ఞాపకాన్ని మెత్తగా విప్పుకునో…
ఒక స్వప్నం.. ఒక జ్ఞాపకం..
ఈ రెంటి మధ్యా ఒదగని అనుభవమేది?
కంటి చివర తళుక్కుమనే ఆఖరి కిరణపు మెరుపూ
పెదవి చివరి వొంపు దగ్గర వక్రీభవించే ఆలోచనా..
వెల్వెట్‌మడతల్లోకి మెత్తగా కూరుకుని..
ఫర్లేదు.. ఎలాగూ బ్రతికేప్పుడు!
ఎందుకూ ఎదురుచూడని ఒక సాయంత్రం
బధ్ధకంగా ఒక పారలల్‌జీవితం!