అడుగుతున్నది మిమ్మల్నే! చెప్పండి సార్‌

“ఏవండీ మీపేరు?”

“తణిగాచలం!”

“వయసు?”

“అరువది”

“ఏం జేస్తుంటారు?”

“నేనేం జేద్దునండీ! మావాడుదా ఇక్కడ ఎంప్లాయీ.”

“మీరేంజేస్తుంటారు?”

“ఏంజెయ్యను సార్‌! ఏదో టిఫిను, హిందూ పేపరు, మధ్యాహ్నం భోజనం,  నిద్ర…”

“సరే సరే. పోయిన బుధవారం ఉదయం పదికీ పదకొండుకీ మధ్య  సి123 నుంచి ఏదైనా చావుకేక విన్పించిందా?”

“విన్పించలేదని చెప్పేదానికి ఎట్లా మాళును సార్‌? మాది ఎదురిల్లే గదా. పైగా అది నాను పేపరు సదివే టైం మా ప్లాట్‌ ముందర కుర్సీ వేసుకొని పేపరు సదువుతా  వుంటిని. పదకొండు గాక ముందే అనుకుంటా, ఆ ఇంట్లో నించి ఎవురో ఆడమనిసి అరిసినట్టుదా  అనిపించింది. ఆ యింటమ్మ బాత్‌ రూంలో గాన కాలుజారి పడిందేమో అనుకుంటిని.”

ఒకవైపు ఇలా పరిశోధన కొనసాగిస్తూ ఇంకొకవైపున కాలనీలో  నివశిస్తున్న వారి భయాందోళనలు పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. పగటిపూట  కూడ సాయుధ పోలీసుల గస్తీ కొనసాగుతోంది. కాలనీ ఆవరణలో ఏ అనుమానితుడు  కనిపించినా పోలీసు గుప్పిట్లోంచి బయటపడేసరికి వాడికి తాత ముత్తాతలు కనిపిస్తున్నారు.

“మీరెవరు?”

“ఎక్కడికెళ్ళి వస్తున్నారు?”

“ఏ పని మీద వెళ్ళారు?”

“మీ అడ్రసేమిటి?”

“మీ ఇంటి నెంబరెంత?” అన్న ప్రశ్నల్ని అక్కడ ఏండ్లుగా పూండ్లుగా నివశిస్తున్నవాళ్ళు కూడా  ఎదుర్కోక తప్పడం లేదు. పాలు, పళ్ళు, కూరగాయలు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళు గూడా “ఇదేం గొడవరా బాబూ! ఈ పోలీసులతో తంటా మనకెందుకు?” అనుకుంటూ  మెయిన్‌ గేటు దగ్గర నుంచే తిరిగి వెళ్ళిపోతున్నారు.

“దాదాపు రెండు వారాలు గడిచినా నేరస్తుల్ని పట్టుకోలేక పోతున్నారంటే  వీళ్ళేం పోలీసులండే?” సంశయాత్ములు చెవులు కొరుక్కోసాగారు.

ఇంతలో ఒక ఘోరవార్త గాలిలో కలిసి ఇంటింటికీ ప్రాకి వచ్చింది. “తల్లినీ, బిడ్డల్నీ గుట్టు చప్పుడు గాకుండా మట్టుబెట్టే అవకాశం  వుంటేగింటే ఒక్కడికే వుంటుందండీ!”

“ఎవరికి?”

“ఇంకెవరికండీ? ఆమె భర్తకే!”

“కారణం ..?” కారణం పైన ఊహాగానాలు సాగిపోతున్నాయి.

అయితే ఈ ఊహాగానాలన్నింటినీ వమ్ము చేస్తూ నెలరోజుల నాటికి  దినపత్రికల్లో కాలనీ హత్యలకు సంబంధించిన హంతకుణ్ణి గురించిన ప్రముఖవార్తలు  వెలువడ్డాయి.

“మూడు ఘోరమైన హత్యలు చేసింది ఒక్కడే!”

“కిరాతక హంతకుడు పట్టుబడిన వైనం!”

“పోలీసుల దగ్గర నేరం ఒప్పుకున్న హంతకుడు!”

వాడి పేరేమిటో అనవసరం. అత్యవసరంగా వాడికి కొంత పెద్ద మొత్తం లోనే డబ్బు కావలసి వచ్చింది. కాలనీలో తొమ్మిదింటి పైన మగవాళ్ళుండరనీ, ఆడవాళ్ళని  బెదిరించి నగలు లాక్కోవడం సులభమనీ లెక్కగట్టాడు. ఓ ఇల్లాలు కిరాణాకొట్టుకు వచ్చి తిరిగి  వెళ్తోంది. ముద్దాయి (?) గమనించాడు. ఆమెను తాను వెంబడిస్తున్నట్లు అనుమానం రాకుండా  జాగ్రత్త పడుతూ దూరం నుంచే ఆమెను వెంబడించి ఆమె ఇంట్లో కెళ్ళిన తరువాత తలుపు తట్టి  రేషన్‌ కార్డులు పంపిణీ చేసే రెవెన్యూ బంట్రోతునని చెప్పుకున్నాడు. ఆమె లోపలికొచ్చి కూర్చోమంది.

“నీళ్ళు కాస్త ఇప్పిస్తారా?” అని అడిగాడు.

మంచి నీళ్ళు తేవడం కోసం ఆమె వంటగదిలోకి వెళ్ళగానే వీడు  తటాలున ఆమెపైకి దూకి మెడలోని నగలు తెంచుకోబోయాడు. ఆమె బిగ్గరగా కేకపెట్టేసరికి  జేబులోంచి నైలాను దారం తీసి దాంతో ఆమె గొంతు బిగించేశాడు. నగలు చేతికి చిక్కించుకోగానే  బయటికొచ్చేసి తన దారిన వెళ్ళిపోయి వుండేవాడే… తలుపు కాస్త తీసి చూసే సరికి  ఎదురింటి ముసలాయన గుమ్మం ముందర కుర్చీ వేసుకొని పేపరు చదువుకుంటున్నాడు. ఆయన లేచి లోపలికి  వెళ్ళే దాకా అతడు లోపల వుండక తప్పదు. శవంతో పాటుగా ఇంట్లో ఒంటరిగా ఉండడంతో  వాడి మనసు పరిపరి విధాలుగా పోతోంది. ఇంతలో పన్నెండు కాగానే బడినుంచి  పిల్లలొచ్చేశారు. వాళ్ళు తలుపు తడుతుంటే తీయకపోవడం ఎలా? అనుమానం రాదా? తలుపు తీసి వాళ్ళను  లోపలకు రానిచ్చాడు. అపరిచితుడ్ని చూసి పిల్లలు కంగారు పడిపోయారు. “అమ్మా! అమ్మా!” అని  ఎలుగెత్తి అరవబోయారు. హంతకుడికి మళ్ళీ నైలాన్‌ తాడుతో అవసరం తప్పలేదు.  చంపాలనుకోలేదు. వాళ్ళ నోళ్ళు మూయించాలనుకున్నాడు. కానీ వాళ్ళే తొందరపడి పోయారు.

“అమ్మో! చూశారా? ఎలా జరిగిందో?! అబ్బబ్బ! ఆ గుండెలు తీసిన బంటు  ఎలా ఉంటాడో ఒకసారి చూస్తే బాగుండును కదండీ…!”

కాలనీవాసుల సంకల్పబలం చాలా గొప్పది. మరునాటి సాయంకాలం ఏడుగంటలప్పుడు ఎవరైనా పోల్చుకుంటారేమోనన్న  ఉద్దేశంతో చేతులకు బేడీలు బిగించి వున్న ముద్దాయిని (?) ఏడుగురు పోలీసుల రక్షణలో  తీసుకొని కాలనీ వీధులన్నింటా త్రిప్పించాడు ఇన్స్‌పెక్టరు.

“అరరె… వీడేనా! భుజాన ఓ సంచీ తగిలించుకొని కాలనీలో  తిరుగుతూ ఒకటి రెండు సార్లు కనిపించాడండీ!”

“సి123 లో దారుణం జరిగిన మరునాడు కూడా చూసిన జ్ఞాపకం!”

“అయినా మీసాలైనా సరిగ్గా రానివాడు ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్ట  గలడని ఎలా అనుకుంటాం సార్‌…?”

“అయ్యా! మీరు అనుకోవడానికి వీలున్నా ఏమీ అనుకోరు. చూడ్డానికి  వీలున్నా చూడరు. స్పష్టంగా విన్పించినా వినిపించుకోరు. ఏమండీ సార్‌! అడుగుతున్నది మిమ్మల్నే!  చెప్పండి. ఇక్కడ జరిగిన ఘోర హత్యలకు ప్రత్యక్షంగా బాధ్యత వీడేనని నేను  ఒప్పుకొంటున్నాను. మరైతే పరోక్షంగా బాధ్యత వహించాల్సిన వారి పరిస్థితి ఏమిటి?” నిక్కచ్చిగా ఓ ప్రశ్నను  సంధించి జవాబు కోసం నిరీక్షిస్తూ ఉండిపోయాడు ఇన్స్‌పెక్టర్‌.

కాలనీ వాసులకు మతిపోయినంత పనైంది. వాళ్ళొకరి మొహం ఒహరు  చూసుకున్నారు. ఇన్స్‌పెక్టర్‌ ఆరోపణ ఏమిటో అర్థం అయినా ఏం జవాబు చెప్పాలో తోచక నీళ్ళు  నమలసాగారు.

“అయ్యా! మీరేమీ చెప్పరని నాకు తెలుసు. నేనే చెబుతున్నాను వినండి.  హత్యలు జరిగిన ఇంట్లో నుంచి ఒక ఆడమనిషి చేత ఆర్తనాదం చేయించి ఆ తరువాత మేము  వాకబు చేసి చూశాము. దాదాపు పది పన్నెండు ఇళ్ళ వాళ్ళకు ఆ కేక స్పష్టంగా వినిపించినట్టు  తెలిసింది. అలా విన్న వాళ్ళలో కనీసం ఒక్కరైనా తోటిమనిషి పట్ల కొంచం అక్కర, శ్రద్ధ  చూపివుంటే మొదటి హత్య జరగగానే నేరస్తుడు దొరికిపోయి వుండేవాడు. కనీసం పిల్లలైనా  బ్రతికి బయటపడి వుండేవారు.

ఆ ఇల్లాలును చంపినవాడు వీడే! సరే అందుకు అభిప్రాయభేదం లేదు.  కానీ పిల్లల హత్యలకు బాధ్యత వహించవలసిన వాళ్ళు ఇక్కడ ఇంచుమించు ఇరవైమందైనా  ఉన్నట్టు మా విచారణలో మేము తేల్చుకున్నాము.  వాళ్ళ కెవరు శిక్ష విధిస్తారు?”

నాటికీ నేటికీ ఆ ప్రశ్న మా కాలనీలోనూ అంతకన్నా ఎక్కువగా  నాలోనూ ద్వనిస్తూనే వుంటుంది. షణ్ముగసుందరం ఇంటికి సరిగ్గా వెనకవైపు ఇల్లు మాది. ఆరోజు నాకు  మధ్యాహ్నం డ్యూటీ అవడంతో కాస్తంత తొందరగా భోజనాని కుపక్రమిస్తున్న వేళ లీలగా  విన్పించిన కేక కలవరపెట్టినా ఎక్కడో గొడవలే అనుకొని తాపీగా భోజనం చేసి  డ్యూటీకి వెళ్ళిపోయిన సందర్భం నన్ను వెంటాడుతూనే వుంటుంది. పోలీసు విచారణలో  నిర్ధారించుకున్న చట్టాతీత బాధ్యతాయుతమైన ఇరవైమంది నేరస్థుల్లో నేనూ ఒకడినన్న  విషయాన్ని మాత్రం ఎన్నటికీ మరువను.