అంతస్తుకు రెండు అపార్ట్‌మెంట్స్ చొప్పున మూడంతుస్తుల్లో ఆరు కాపురాలున్న అయిదారు వందల భవనాల కాలనీ మాది. తీర్చిదిద్దినట్టుండే వీధులు, పంచరంగుల కేకులతో కట్టిన మిఠాయి నిర్మాణాల లాంటి ముచ్చటైన భవంతులు, ఆగంతుకులెవరైనా వస్తే వచ్చిందెవరో తెలుసుకోవడానికి వీలుగా తలుపులో అమర్చి ఉంచిన ‘అద్దపు కన్నూ’, వచ్చిన వాళ్ళెవరైనా ఏదైనా వస్తువులు తీసుకొచ్చి వుంటే చేయి మాత్రం బయటికి చాపి వాటిని తీసుకోవడానికి వీలుగా ఏర్పాటుచేసిన గొలుసు అమరిక.
పచ్చని చెట్లతో పూలమొక్కలతో పచ్చిక బయళ్ళతో ప్రశాంత మనోహరమైన వాతావరణం. కాలనీ చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ. మెయిన్ రోడ్డు పైనుంచి లోపలకు రావడానికి ఏర్పాటు చేసిన ఏకైక ప్రధాన ద్వారం. అక్కడ అహర్నిశలూ కాపలా వుండే ఘూర్ఖాలు. ఇదంతా చూస్తే పూర్వకాలంలో ప్రాగ్జోతిషం, పాటలీపుత్రం, కన్యాకుబ్జం లాంటి మహా నగరాల కెట్టి రక్షణ ఉండేదో అంతటి భద్రత మాకాలనీకీ ఉందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
కాలనీ వాళ్ళం కదా! పడమట దిక్కున రెండు కిలోమీటర్ల దూరాన ఉన్న ఊరితో మాకట్టే సంబంధాలు ఉండవు. కిరాణాకొట్లు, ఫ్యాన్సీ షాపులు, ఫాస్ట్‌ఫుడ్ సదుపాయాలు, పోస్టాఫీసు, లైబ్రరీ మొదలైన వన్నీ కాలనీలోనే ఉన్నాయి.
ఉద్యోగుల్ని తూర్పుగా పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్యాలయాలకు తీసుకెళ్ళడానికి డిపార్టుమెంటు వారి ప్రత్యేక బస్సు సర్వీసులున్నాయి. ఉదయం ఎనిమిది కొట్టగానే మెట్లపైనుంచి ప్రారంభమయ్యే బూట్ల టకటకలు రోడ్లపైకి వచ్చి అక్కడనుంచి ముందుకు సాగి ప్రధాన ద్వారం దగ్గర ఆగిపోతాయి.
“ఏమండీ సుందర్రావు గారూ! నిన్న సాయంకాలం లైబ్రరీ దగ్గర కనిపించలేదే?”
“అయ్యా శ్రీనివాసన్ సార్! రండి రండి. ఆనందవికటన్ కావాలంటిరే, మాకోసరం తెస్తిని. తీసుకెళ్ళి సదువుకోండబ్బా!”
“అబ్బా నంజుండబ్బా! చిత్రదుర్గా నుంచి ఎప్పుడొస్తివి?”
“క్యాహైజీ అగర్వాల్?”
“ఈ రోజు పేపర్ చూశావా? అయినా చూసి ఏం లాభంలే. న్యూస్ పేపర్లలో ఈ కుంభకోణాల్ని గూర్చిన వార్తలు చదువుతుంటే కడుపు తరుక్కుపోతుందయ్యా.”
ఇలా పలకరింపుల సంబరాలతోనే ఉద్యోగులు బస్సెక్కేస్తారు. సరే, ఉద్యోగప్రయాణం గురించి మనకెందుకు? వదలిపెడదాం. పిల్లలు స్కూళ్ళకు వెళ్ళిపోయాక, మగవాళ్ళు ఆఫీసుల కోసం బయలుదేరాక కాలనీ లోని సుగుణమణి, జలజలోచన, చారుమతి ఇళ్ళకు తాళాలు వేసుకొని పార్కులోకొచ్చి చెట్లనీడలో కూర్చుంటారు. శిరోమణి, దేవసేన, రాజేశ్వరి, విజయ, ప్రసూనలు సాధారణంగా రీడింగు రూములోనే కలుసుకుంటుంటారు.
అరవైయేళ్ళ భగీరథమ్మ వినాయకుడి గుడి మండువాలో ఆంధ్రవాల్మీకం చదివి పది పదిహేను మంది శ్రోతలకు (వీరిలో వయసు మళ్ళిన వాళ్ళతో బాటుగా వయసు మళ్ళని జిజ్ఞాసువులు గూడా వుంటారు) అర్థవివరణ చేస్తూ వుంటుంది. వాళ్ళంతా ఎవరిళ్ళకు వాళ్ళు చేరేది మధ్యాహ్నం పన్నెండుకే పన్నెండున్నరకు బడినుంచి పిల్లలొస్తున్నారు గదా! వాళ్ళకన్నాలు పెట్టి మళ్ళీ బడికి పంపించేశాక విశ్రాంతి. టీవీ చూడ్డమైనా, పుస్తకం చదవడమైనా అర్థంతరంగా ఆగిపోవడమే మామూలు.
నిద్రకునుకు తీసుకునేటప్పటికి గంట నాలుగు దాటి వుంటుంది. ‘అమ్మో! పిల్లలొస్తారు, ఆయనొస్తారు ఆవురావురుమంటూ. ఏదైనా టిఫిను చేసేయాలి.’ ఇక చూసుకోవలసిందే తమాషా. కాలనీ అనే యంత్రం అమాంతంగా స్టార్టయిపోతుంది. కొళాయిల్లోంచి నీళ్ళు దూకుతాయి, మిక్సీలు గొంతు విప్పుతాయి, గ్యాస్ స్టవ్‌లు క్రమబద్ధీకరించిన మంటల్ని విరజిమ్ముతాయి.
అలాంటి ఒక సాయంకాలపు వేళ చెట్ల నీడలు చూస్తూ, గాలి హాయిగా వీస్తూ, పక్షులు చెట్టు పైన్నుంచి చెట్టుపైకి ఎగురుతూ, పిల్లలు ఆటస్థలాల్లో ఆడుకుంటూ అందాలతో ఆనందాలతో ప్రకృతి పరవశించి పోతున్న వేళ చామన చాయతో, పొందికైన క్రాఫింగుతో, నశ్యం రంగు ప్యాంటుతో, తెలుపు పైన ఊదారంగు చారల చొక్కాతో, ఖాళీ క్యారియరు వాటర్ బాటిల్ ఉన్న ప్లాస్టిక్ బుట్ట చేతబట్టుకుని ఒక ముప్పై అయిదేళ్ళ ఉద్యోగి బస్సు దిగాడు.
బస్సు దిగేటప్పటికతడు గుంపులో గోవిందయ్య. పాపం వార్తల్లో కెక్కాలన్న ఊహగానీ, ప్రయత్నం గానీ లేనివాడు. ఆనాటి సంఘటన కతడి ప్రమేయం ససేమిరా లేదు. అయితే అది జరిగిన తర్వాత అతడి జీవితం అంతకు మునుపటి జీవితంతో పోల్చుకోవటానికి వీల్లేనంతగా మారిపోయింది. అతడు తనకు, ఊహకు, ప్రయత్నానికి అతీతంగా వార్తల్లోకెక్కిపోయాడు. వక్కపలుకు నోట్లో వేసుకొని కొరికినంతసేపట్లో అతడి ఊరూ, పేరూ, స్వభావం, హాబీలు, భార్యాబిడ్డల గుణగణాలు మొదలైనవన్నీ కాలనీలో ఒకరికొకరు చెప్పుకోవలసిన, చెప్పగా చెవి ఒగ్గి వినవలసిన ముఖ్యవిషయాలుగా మారిపోయాయి.
అతడిపేరు షణ్ముగసుందరం. స్వస్థలం చిదంబరం దగ్గర తిరుమంగళం. తండ్రి ప్రైమరీ పాఠశాల టీచరు. మేనమామ మద్రాసులో ఉండడం వల్ల అతడు పైచదువులు కొనసాగించ గలిగాడు. గిండీ ఇంజనీరింగు కాలేజీలో పట్టా పుచ్చుకున్నాడు. భార్య పేరు శివగామి. ఒక కూతురు, పేరు దేవయాని. వయస్సు తొమ్మిదేళ్ళు. కొడుకు ఏడేళ్ళవాడు, పేరు పార్థు. అన్యోన్య దాంపత్యం, కుదురైన బిడ్డలు. అతడి ఉద్యోగ జీవితం ప్రారంభం కావడం ఇక్కడే. కన్‌స్ట్రక్షన్ డిపార్టుమెంట్‌లో సెక్షన్ హెడ్. సాయంకాలం అతడిల్లు చేరుకునేటప్పటికి పిల్లలు ప్లేగ్రౌండుకు వెళ్ళి వుంటారు. ముఖం మాత్రం కడుక్కొని ఈవలికొచ్చేసరికి భార్య వేడిగా కాఫీ కప్పు చేతికిస్తుంది. కాఫీ సేవనంతో పిచ్చాపాటీ మొదలవుతుంది.
పత్రికలు చదువుకోవడం, టీవీ చూడ్డం, పిల్లలకు హోమ్‌వర్కులో సాయపడ్డం, తిరుమంగళం నుంచో మద్రాసునుంచో జాబులొస్తే ఒకొక్క వాక్యాన్ని చదివి అభిప్రాయాలు ప్రకటించడం ఈ మాత్రమే వాళ్ళ వ్యవహార జగత్తు. సరే, షణ్ముగసుందరం ఆరోజు సాయంకాలం బస్సు దిగాడన్నది ప్రస్తుతాంశం. ఉత్తరంగా వెళ్ళే రోడ్డుపైన కమ్యూనిటీ హాలుదాకా వెళ్ళి అక్కడ పడమరకు తిరిగితే సన్నటిరోడ్డుకు ఎడమవైపు వున్న కట్టడంలోని రెండో అంతస్తులోని ఒక వాటాలో అతడి కాపురం. ఇంటి నెంబరు సి123.
షణ్ముగసుందరం మెట్లెక్కాడు. ఎన్నడూ లేనిది మూసిన తలుపు బిగించిన తాళంతో వ్రేలాడుతూ ఉంది. “ఏమిట్రా ఇది. ఈ వేళప్పుడు ఈమె ఇంట్లో లేకుండా ఎక్కడికి పోయింది?” అనుకున్నాడు షణ్ముగసుందరం. ఎదురింట్లో వాళ్ళనడుగుదా మనుకుంటూనే కాళ్ళ క్రిందనున్న తివాచీ పైకి తీశాడు. తాళం చెవి కన్పించలేదు. మామూలుగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆమె తాళం చెవి తివాచీ క్రింద పెట్టి వెళ్ళడం మామూలే!
“ఈ వేళప్పుడు ఎక్కడికి వెళ్ళివుంటుందబ్బా?” అనుకుంటూ తన జేబులోని డూప్లికేటు తాళం చెవితో తలుపు తెరిచాడు. కథలో ఇక్కడిదాకా గీత గీస్తే ఇంతకు మునుపటిదంతా వెలుగనీ ఆపైన పరుచుకున్నదంతా చీకటనీ గుర్తించాలి.
లోపలి కెళ్ళిన షణ్ముగసుందరం రెండే రెండు నిముషాల్లో గావుకేకలు పెడుతూ బయటకు పారిపోయి వచ్చేశాడు.
ఏమిట్రా ఈ గగ్గోలు అన్నట్టుగా చుట్టుప్రక్కల కొన్ని ఇళ్ళలోని కిటికీలు తెరుచుకున్నాయి. కొందరు ధైర్యవంతులు గబగబా మెట్లెక్కి అపార్టుమెంటులోకి జొరబడ్డారు. క్రిందనే నిల్చుండి పోయిన వాళ్ళు, ఏమైంది ఏమైందని పైకి వెళ్ళిన వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. అంతా అయోమయం గందరగోళం!
వాస్తవం స్పష్టంగా అవగతం కావడానికి పదిపదిహేను నిముషాల కాలం పట్టింది. శివగామి వంటింట్లో అలమరాల నడుమ సన్నటి జాగాలో పొడవునా పడివుంది. అమ్మాయి బెడ్‌రూమ్‌లో మంచానికడ్డంగా పడివుంది. ముందువైపు హాల్లో కుర్రవాడు కుర్చీలోనే తల వాల్చేసి వున్నాడు. ముగ్గురి గొంతుకల చుట్టూ ఊపిరి తిరగకుండా ప్లాస్టిక్ తాడు లాంటి దానితో బిగించినట్టు కుశాగ్రబుద్ధులైన పరిశీలకులు పోల్చుకున్నారు. కాలనీ అన్నివైపుల నుంచీ కమ్యూనిటీ హాలు దిశగా జనసంచలనం ప్రారంభమైంది.
“ఏమండీ, ‘షణ్ముగసుందరం’ అంటున్నారు ఎలా వుంటాడతను? పొట్టిగా బొద్దుగా బట్టతలతో..”
“అబ్బే అయివుండదండీ! బస్సులో కొందరు ‘సుందరం, సుందరం’ అని పిలుస్తుండగా చూశాను. అతను సన్నగానే ఉంటాడు. లేదంటే క్రమబద్ధంగా పెంచిన గుబురు గడ్డంతో ఎలుగుబంటిలా కనిపించినట్టు జ్ఞాపకం.”
“పరవాలేదులెండి. మనిషి సజీవుడై వున్నాడు కదా! రేపో మాపో కనిపించక పోతాడా?”
“ఏం సజీవుడో! తగిలిన దెబ్బకింక కోలుకుంటాడా అనేదే అనుమానం. అయినా మానవ మాత్రుడికి రాదగిన కష్టమా?”
మరొకవైపు కాలనీ మహిళల ఆసక్తి ఇంకొక విధంగా కొనసాగుతోంది. “ఎవరో శివగామి అంటమ్మా! నాకైతే చూచిన జ్ఞాపకం లేదు. అరవావిడగదా! మిగిలిన వాళ్ళతో అంతగా కలిసేది కాదేమో…”
“చొరవ రెండు పక్కల నుంచీ వుండాలి గదమ్మా రాజేశ్వరీ! మనమే ఆమెను ఆంతరంగికంగా దగ్గరకి చేరనివ్వలేదేమో…?”
“ఇంతకూ మనిషెవరో తెలియకపోయినా ఊహాగానాలెందుకు? నాకు తెలిసి ప్రతి శుక్రవారం ఉదయం తలంటిపోసుకొని వదులు జారుముడిలో పువ్వులు తురుముకొని విభూది పట్టెలపైన ఇంతేసి కుంకుమ బొట్టు పెట్టుకొని ఓ అరవావిడ వినాయకుడి గుడికొస్తుండేది. ఇదంతా మద్రాసు ఆడవాళ్ళ సాంప్రదాయం. ఆ శివగామి కూడా మద్రాసే అంటున్నారు గదా…” ఇలా ఈ పరామర్శలన్నీ ‘బీటింగ్ అరౌండ్ ది బుష్’గా పరిణమించాయే గానీ అసలు మనుషులెవరో చాలామందికి స్ఫురించలేదు.
ఇంతకూ ఆ షణ్ముగసుందరమనే దైవోపహతుడితోను, శివగామి అనే అల్పాయుషును అడిగివచ్చిన ఆవిడతోనూ ముఖపరిచయం కలిగిన వాళ్ళెందరు? పలకరించిన వాళ్ళెందరు? సన్నిహితంగా మిత్రత్వం కలిగిన వాళ్ళెందరు?
ఇంతకూ వాళ్ళు కొద్ది నెలల క్రితం వచ్చిన వాళ్ళేం గాదు. దాదాపుగా పదేళ్ళుగా వుంటున్న వాళ్ళ ఐడెంటిటీని గురించి కూడా కాలనీవాళ్ళు ఊహాగానాలు సల్పవలసి వచ్చిందంటే మానవతా సంబంధాలు మరమ్మత్తుకు వీలుబడనంతగా శైథిల్యం చెందినట్టు గాదా? ‘ఊరా, అడివా?’ అంటుంటారు. మా కాలనీ వ్యవహారం చూస్తుంటే ఈ రెండింటికీ అట్టే తేడా వున్నట్టులేదు మరి!
ఎదురు చూడని దారుణసంఘటన ఏదైనా సరే అది జరిగిన తర్వాత కాసేపటి వరకు దాని తీవ్రత ఏపాటిదో తెలిసిరాదు. మనసు తాత్కాలికంగా మొద్దుబారిపోతుంది. మళ్ళీ దానిలో కదలిక రావాలంటే షాక్ ట్రీట్‌మెంట్ లాంటిది మరొకటి అవసరమవుతుంది. పరిపరి విధాలుగా నోటికొచ్చినట్టల్లా మాట్లాడుకుంటున్న జనంలోకి ఒక పోలీసు జీపు చొచ్చుకురావడం అలాంటి సన్నివేశమే!
ఆగిన జీపులోనుంచి లాఠీ లూపుకుంటూ అయిదారుగురు పోలీసులు దిగారు. సబ్ ఇన్స్‌పెక్టరు ముందు సీటులోంచి క్రిందికి దూకినంత పనిచేశాడు. పోలీసులు “తప్పుకోండి తప్పుకోండి. అందరూ మీమీ ఇళ్ళకు వెళ్ళండి. వెళ్ళక పోయారో మా లాఠీలకు పని చెప్పవలసి వస్తుంద”ని హెచ్చరిస్తూ నేరస్థలాన్ని నిముషాల్లోనే నిర్మానుష్యం గావించారు.
ఇళ్ళకైతే వెళ్ళారుగానీ తలుపులు కిటికీలు బిగించుకున్నా జనానికి నిబ్బరం లేకపోయింది. లోకంలో ఎక్కడో ఉన్నారని భావించబడుతూ వచ్చిన హంతకులు ఇప్పుడు కాలనీలోనే వున్నారు. ఇప్పుడున్నా లేకపోయినా మధ్యాహ్నం పన్నెండూ ఒంటిగంటకు మధ్య ఇక్కడున్నారనడానికి మూడు నిర్జీవమైన శరీరాలు సాక్ష్యంగా వున్నాయి. ఈ స్పృహ కలగడంతో బయట ఏమాత్రం చిన్న అలికిడి అయినా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. బిగ్గరగా మాట్లాడుకోడానికైనా నిబ్బరం లేకపోయింది. తలుపులకు తాళాలు బిగించి కాలనీ వాసులందరూ కమ్యూనిటీ హాల్లోకి వెళ్ళి అక్కడ అల్లీబిల్లీగా పడుకోగలిగితే ఎంత బాగుండునోననిపించింది. భయం భయంగానే మరునాటి ఉదయం తెల్లవారింది.
“ఏవండీ! ఈ రోజు సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండిపోగూడదూ?” ప్రతి ఇంట్లోని గృహిణి నోటి వెంట ఈ అభ్యర్థన వెలువడింది.
“పరవాలేదు. తలుపేసుకో. ఎవరైనా తలుపు తడితే గాజుకన్నులో నుంచి పరిశీలనగా చూసిగానీ తియ్యకు. పిల్లల్ని స్కూలుకు పంపొద్దు. ఎన్నో తతంగాలుంటాయి. వాళ్ళు జడుసుకోగలరు.” గృహస్థులు మెలకువలు చెబుతూనే మెయిన్ రోడ్డు వైపు నడిచారు. అప్పటికి షణ్ముగసుందరం బంధువుల్లో ముఖ్యమైన వాళ్ళందరూ వచ్చి దిగేశారు. కమ్యూనిటీ హాలు ప్రాంతాలకు వెళ్తే అరవవాళ్ళ శోకాలు హృదయవిదారకంగా విన్పిస్తున్నాయి. అంతలో పోలీసులు కలగజేసుకొని కళేబరాలను పోస్టుమార్టంకి తీసుకెళ్ళిపోవడం కాలనీకంతా కొండంత రిలీఫయిపోయింది.
అయినా హంతకుల భయం పూర్తిగా వైదొలగలేదు. అది చిమ్మచీకటిలా, కారుమబ్బులా జనావాసం పైన క్రమ్ముకొనే వుంది. భయాందోళనలు పోగొట్టడానికి పోలీసులు తమ చేతనైన కృషి తాము చేస్తున్నారు. కాలనీలో ఓ పోలీసు ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. పగటిపూట కూడా పోలీసులు కాలనీ వీధుల్లో గస్తీ తిరుగుతూ కనిపించిన ప్రతి వ్యక్తి పైన ప్రశ్నలు గుప్పిస్తున్నారు. మగవాళ్ళనడిగి లాభం లేదని వాళ్ళకు తెలిసిపోయింది. ఆ సమయంలో ఆఫీసు డ్యూటీలో వుండిపోవడం వాళ్ళ పాలిటికొక వరమై పోయింది. ఎటొచ్చీ స్త్రీలను, వృద్ధుల్ని ఇంటరాగేట్ చేయడమే ప్రస్తుతానికి పోలీసులకు అందుబాటు ఉన్న పరిశోధనాప్రక్రియ అయిపోయింది.
“ఏమ్మా! నీపేరేంటి?”
“నా పేరా సార్… నన్ను రూపకళ అంటారండీ!”
“ఇది మీఇల్లే కదూ?”
“అవునండీ!”
“సి123 మీకెంత దూరంలో వుంది?”
“ఎంతో ఎక్కడిది సార్! మాపైనింటికి ఎదురువైపు ఇల్లేగదా!”
“మంచిదమ్మా! పోయిన బుధవారం పదో లేక పదకొండు గంటల ప్రాంతంలో నువ్వింట్లోనే వున్నావు గదా?”
“ఉన్నానండీ!”
“అప్పుడు నీకు ప్రాణాలు విలవిలలాడిపోయేటట్టుగా గావుకేక ఏదీ వినిపించలేదా?”
“అబ్బే, లేదండీ!”
“చాలా ముఖ్యమైన విషయమమ్మా! కాస్త జ్ఞాపకం చేసుకొని మరీ చెప్పు తల్లీ?”
కాసేపు మౌనం, మనసులోనే ఏవో తర్జనభర్జనలు చేసుకుంటున్నట్టు నిల్చున్న రూపకళ నోటిలోంచి ఒక మాట (అదైనా ఎంత భాగ్యం!) బయటపడింది.
“తలుపులు వేసుకొని వున్నానండీ. ఎవరో అరచినట్టే తోచింది. కోతి ఏదైనా ఇంట్లో దూరిందేమో అనుకున్నాను.”
“మంచిదమ్మా! తలుపులు జాగ్రత్తగా వేసుకో తల్లీ!” అని ఆమెకు జాగ్రత్తలు చెప్పి వాళ్ళ ఎదురింటి తలుపు తట్టాడు పోలీసు ఇన్స్‌పెక్టర్.
“అమ్మా! నీపేరు?”
“ఇందుమతి సార్!”
“సి123 మీకెంత దూరంలో వుంది?”
“ఎంతో దూరం ఎక్కడిది సార్ మాపై ఇల్లే కదా!”
“ఓహో పైదే కదూ. చూడండి ఇందుమతి గారూ, పోయిన బుధవారం పదీ పదకొండు గంటల ప్రాంతంలో మీరు ఇంట్లోనే ఉన్నారు కదా?”
“ఉన్నానండీ!”
“ఆ సమయంలో మీపై ఇంట్లోంచి ప్రాణాలు పోయేట్టుగా అరచిన గావుకేక ఏదీ నీకు విన్పించలేదా?”
“అస్సలు విన్పించలేదండీ!”
“కొంచం ఆలోచించి చెప్పు తల్లీ!”
కాసేపు మౌన వ్రతం పాటించాక ఆమె నోటినుంచి ఒకమాట బయటపడింది. “ఆరోజు కాస్త ఎక్కువ టిఫిను తినడంతో ఆసమయంలో మంచి నిద్రలో ఉన్నానండీ…”
“మంచిదమ్మా! తలుపులు జాగ్రత్తగా వేసుకొని నిద్రపో తల్లీ.” అని ఇన్స్‌పెక్టర్ అనడమే తరువాయి రిమోట్ కంట్రోల్ స్విచ్ నొక్కినట్టుగా తలుపులు మూసుకుపోయాయి.
“ఏవండీ మీపేరు?”
“తణిగాచలం!”
“వయసు?”
“అరువది”
“ఏం జేస్తుంటారు?”
“నేనేం జేద్దునండీ! మావాడుదా ఇక్కడ ఎంప్లాయీ.”
“మీరేంజేస్తుంటారు?”
“ఏంజెయ్యను సార్! ఏదో టిఫిను, హిందూ పేపరు, మధ్యాహ్నం భోజనం, నిద్ర…”
“సరే సరే. పోయిన బుధవారం ఉదయం పదికీ పదకొండుకీ మధ్య సి123 నుంచి ఏదైనా చావుకేక విన్పించిందా?”
“విన్పించలేదని చెప్పేదానికి ఎట్లా మాళును సార్? మాది ఎదురిల్లే గదా. పైగా అది నాను పేపరు సదివే టైం మా ప్లాట్ ముందర కుర్సీ వేసుకొని పేపరు సదువుతా వుంటిని. పదకొండు గాక ముందే అనుకుంటా, ఆ ఇంట్లో నించి ఎవురో ఆడమనిసి అరిసినట్టుదా అనిపించింది. ఆ యింటమ్మ బాత్ రూంలో గాన కాలుజారి పడిందేమో అనుకుంటిని.”
ఒకవైపు ఇలా పరిశోధన కొనసాగిస్తూ ఇంకొకవైపున కాలనీలో నివశిస్తున్న వారి భయాందోళనలు పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. పగటిపూట కూడ సాయుధ పోలీసుల గస్తీ కొనసాగుతోంది. కాలనీ ఆవరణలో ఏ అనుమానితుడు కనిపించినా పోలీసు గుప్పిట్లోంచి బయటపడేసరికి వాడికి తాత ముత్తాతలు కనిపిస్తున్నారు.
“మీరెవరు?”
“ఎక్కడికెళ్ళి వస్తున్నారు?”
“ఏ పని మీద వెళ్ళారు?”
“మీ అడ్రసేమిటి?”
“మీ ఇంటి నెంబరెంత?” అన్న ప్రశ్నల్ని అక్కడ ఏండ్లుగా పూండ్లుగా నివశిస్తున్నవాళ్ళు కూడా ఎదుర్కోక తప్పడం లేదు. పాలు, పళ్ళు, కూరగాయలు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళు గూడా “ఇదేం గొడవరా బాబూ! ఈ పోలీసులతో తంటా మనకెందుకు?” అనుకుంటూ మెయిన్ గేటు దగ్గర నుంచే తిరిగి వెళ్ళిపోతున్నారు.
“దాదాపు రెండు వారాలు గడిచినా నేరస్తుల్ని పట్టుకోలేక పోతున్నారంటే వీళ్ళేం పోలీసులండే?” సంశయాత్ములు చెవులు కొరుక్కోసాగారు.
ఇంతలో ఒక ఘోరవార్త గాలిలో కలిసి ఇంటింటికీ ప్రాకి వచ్చింది. “తల్లినీ, బిడ్డల్నీ గుట్టు చప్పుడు గాకుండా మట్టుబెట్టే అవకాశం వుంటేగింటే ఒక్కడికే వుంటుందండీ!”
“ఎవరికి?”
“ఇంకెవరికండీ? ఆమె భర్తకే!”
“కారణం ..?” కారణం పైన ఊహాగానాలు సాగిపోతున్నాయి.
అయితే ఈ ఊహాగానాలన్నింటినీ వమ్ము చేస్తూ నెలరోజుల నాటికి దినపత్రికల్లో కాలనీ హత్యలకు సంబంధించిన హంతకుణ్ణి గురించిన ప్రముఖవార్తలు వెలువడ్డాయి.
“మూడు ఘోరమైన హత్యలు చేసింది ఒక్కడే!”
“కిరాతక హంతకుడు పట్టుబడిన వైనం!”
“పోలీసుల దగ్గర నేరం ఒప్పుకున్న హంతకుడు!”
వాడి పేరేమిటో అనవసరం. అత్యవసరంగా వాడికి కొంత పెద్ద మొత్తం లోనే డబ్బు కావలసి వచ్చింది. కాలనీలో తొమ్మిదింటి పైన మగవాళ్ళుండరనీ, ఆడవాళ్ళని బెదిరించి నగలు లాక్కోవడం సులభమనీ లెక్కగట్టాడు. ఓ ఇల్లాలు కిరాణాకొట్టుకు వచ్చి తిరిగి వెళ్తోంది. ముద్దాయి (?) గమనించాడు. ఆమెను తాను వెంబడిస్తున్నట్లు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ దూరం నుంచే ఆమెను వెంబడించి ఆమె ఇంట్లో కెళ్ళిన తరువాత తలుపు తట్టి రేషన్ కార్డులు పంపిణీ చేసే రెవెన్యూ బంట్రోతునని చెప్పుకున్నాడు. ఆమె లోపలికొచ్చి కూర్చోమంది.
“నీళ్ళు కాస్త ఇప్పిస్తారా?” అని అడిగాడు.
మంచి నీళ్ళు తేవడం కోసం ఆమె వంటగదిలోకి వెళ్ళగానే వీడు తటాలున ఆమెపైకి దూకి మెడలోని నగలు తెంచుకోబోయాడు. ఆమె బిగ్గరగా కేకపెట్టేసరికి జేబులోంచి నైలాను దారం తీసి దాంతో ఆమె గొంతు బిగించేశాడు. నగలు చేతికి చిక్కించుకోగానే బయటికొచ్చేసి తన దారిన వెళ్ళిపోయి వుండేవాడే… తలుపు కాస్త తీసి చూసే సరికి ఎదురింటి ముసలాయన గుమ్మం ముందర కుర్చీ వేసుకొని పేపరు చదువుకుంటున్నాడు. ఆయన లేచి లోపలికి వెళ్ళే దాకా అతడు లోపల వుండక తప్పదు. శవంతో పాటుగా ఇంట్లో ఒంటరిగా ఉండడంతో వాడి మనసు పరిపరి విధాలుగా పోతోంది. ఇంతలో పన్నెండు కాగానే బడినుంచి పిల్లలొచ్చేశారు. వాళ్ళు తలుపు తడుతుంటే తీయకపోవడం ఎలా? అనుమానం రాదా? తలుపు తీసి వాళ్ళను లోపలకు రానిచ్చాడు. అపరిచితుడ్ని చూసి పిల్లలు కంగారు పడిపోయారు. “అమ్మా! అమ్మా!” అని ఎలుగెత్తి అరవబోయారు. హంతకుడికి మళ్ళీ నైలాన్ తాడుతో అవసరం తప్పలేదు. చంపాలనుకోలేదు. వాళ్ళ నోళ్ళు మూయించాలనుకున్నాడు. కానీ వాళ్ళే తొందరపడి పోయారు.
“అమ్మో! చూశారా? ఎలా జరిగిందో?! అబ్బబ్బ! ఆ గుండెలు తీసిన బంటు ఎలా ఉంటాడో ఒకసారి చూస్తే బాగుండును కదండీ…!”
కాలనీవాసుల సంకల్పబలం చాలా గొప్పది. మరునాటి సాయంకాలం ఏడుగంటలప్పుడు ఎవరైనా పోల్చుకుంటారేమోనన్న ఉద్దేశంతో చేతులకు బేడీలు బిగించి వున్న ముద్దాయిని (?) ఏడుగురు పోలీసుల రక్షణలో తీసుకొని కాలనీ వీధులన్నింటా త్రిప్పించాడు ఇన్స్‌పెక్టరు.
“అరరె… వీడేనా! భుజాన ఓ సంచీ తగిలించుకొని కాలనీలో తిరుగుతూ ఒకటి రెండు సార్లు కనిపించాడండీ!”
“సి123 లో దారుణం జరిగిన మరునాడు కూడా చూసిన జ్ఞాపకం!”
“అయినా మీసాలైనా సరిగ్గా రానివాడు ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్ట గలడని ఎలా అనుకుంటాం సార్…?”
“అయ్యా! మీరు అనుకోవడానికి వీలున్నా ఏమీ అనుకోరు. చూడ్డానికి వీలున్నా చూడరు. స్పష్టంగా విన్పించినా వినిపించుకోరు. ఏమండీ సార్! అడుగుతున్నది మిమ్మల్నే! చెప్పండి. ఇక్కడ జరిగిన ఘోర హత్యలకు ప్రత్యక్షంగా బాధ్యత వీడేనని నేను ఒప్పుకొంటున్నాను. మరైతే పరోక్షంగా బాధ్యత వహించాల్సిన వారి పరిస్థితి ఏమిటి?” నిక్కచ్చిగా ఓ ప్రశ్నను సంధించి జవాబు కోసం నిరీక్షిస్తూ ఉండిపోయాడు ఇన్స్‌పెక్టర్.
కాలనీ వాసులకు మతిపోయినంత పనైంది. వాళ్ళొకరి మొహం ఒహరు చూసుకున్నారు. ఇన్స్‌పెక్టర్ ఆరోపణ ఏమిటో అర్థం అయినా ఏం జవాబు చెప్పాలో తోచక నీళ్ళు నమలసాగారు.
“అయ్యా! మీరేమీ చెప్పరని నాకు తెలుసు. నేనే చెబుతున్నాను వినండి. హత్యలు జరిగిన ఇంట్లో నుంచి ఒక ఆడమనిషి చేత ఆర్తనాదం చేయించి ఆ తరువాత మేము వాకబు చేసి చూశాము. దాదాపు పది పన్నెండు ఇళ్ళ వాళ్ళకు ఆ కేక స్పష్టంగా వినిపించినట్టు తెలిసింది. అలా విన్న వాళ్ళలో కనీసం ఒక్కరైనా తోటిమనిషి పట్ల కొంచం అక్కర, శ్రద్ధ చూపివుంటే మొదటి హత్య జరగగానే నేరస్తుడు దొరికిపోయి వుండేవాడు. కనీసం పిల్లలైనా బ్రతికి బయటపడి వుండేవారు.
ఆ ఇల్లాలును చంపినవాడు వీడే! సరే అందుకు అభిప్రాయభేదం లేదు. కానీ పిల్లల హత్యలకు బాధ్యత వహించవలసిన వాళ్ళు ఇక్కడ ఇంచుమించు ఇరవైమందైనా ఉన్నట్టు మా విచారణలో మేము తేల్చుకున్నాము. వాళ్ళ కెవరు శిక్ష విధిస్తారు?”
నాటికీ నేటికీ ఆ ప్రశ్న మా కాలనీలోనూ అంతకన్నా ఎక్కువగా నాలోనూ ద్వనిస్తూనే వుంటుంది. షణ్ముగసుందరం ఇంటికి సరిగ్గా వెనకవైపు ఇల్లు మాది. ఆరోజు నాకు మధ్యాహ్నం డ్యూటీ అవడంతో కాస్తంత తొందరగా భోజనాని కుపక్రమిస్తున్న వేళ లీలగా విన్పించిన కేక కలవరపెట్టినా ఎక్కడో గొడవలే అనుకొని తాపీగా భోజనం చేసి డ్యూటీకి వెళ్ళిపోయిన సందర్భం నన్ను వెంటాడుతూనే వుంటుంది. పోలీసు విచారణలో నిర్ధారించుకున్న చట్టాతీత బాధ్యతాయుతమైన ఇరవైమంది నేరస్థుల్లో నేనూ ఒకడినన్న విషయాన్ని మాత్రం ఎన్నటికీ మరువను.