సాహిత్య లోకంలో కవులంతా ఒక సమష్టి కుటుంబం. తెలుగు కవుల కుటుంబం వేరు, సంస్కృత కవుల కుటుంబం వేరు అన్న వాదన అర్థం లేనిది. మొత్తం ఒక సమష్టి కుటుంబం. ఏ ప్రభావం ఎక్కడ ఎవరి మీద ఉందంటే, అది సులభంగా తేలే విషయము కాదు. తీగ కదిలిస్తే డొంక కదులుతుంది. సాహిత్యానుశీలనంలో వ్యక్తుల కంటే ఆయా కవుల కావ్య సమగ్రతే ప్రధానమైనది. ఏ కవిని గురించి విశ్లేషించినా, ఆ కవి అనుభావమే పాఠకుల, విమర్శకుల మనస్సులలో ప్రధానంగా ప్రతిఫలించాలి. తెలుగు భాషా సాహిత్యాలపై ఇతర భాషా సాహిత్యాల ప్రభావాన్ని పరిశీలించడం ఒక ముఖ్యమైన విమర్శనాంశం. విశేషించి, శ్రీనాథుని సాహిత్యంపై సంస్కృత కవుల ప్రభావం, తద్వారా తెలుగు కావ్య ప్రపంచం పొందిన నూతన వికాసం అత్యంత విశిష్టమైనవి.
ముందుగా అందరికి పరిచయమున్న ఒక శ్రీనాథుని పద్యానికి నాదైన అన్వయంతో ప్రారంభిస్తాను:
దాక్షారామ చళుక్య భీమవర గంధర్వాప్సరో భామినీ
వక్షోజద్వయ గంధసార ఘుసృణ ద్వైరాజ్య భారంబు న
ధ్యక్షించున్ గవిసార్వభౌమ! భవదీయప్రౌఢసాహిత్యముల్!
— కాశీఖండము పీఠిక—14వ పద్యం
ఈ పద్యం చూసిన వెంటనే అందరూ ఏదో అతని గురించిన కథలు వాటిని బట్టి స్త్రీలోలత్వమో ఏదో అంటుంటారు. నాకు అలా తోచదు.
ఇక్కడ గంధసార-ఘుసృణ-ద్వైరాజ్య-భారంబు అన్న సమాసం కీలకం. గంధసారం అంటే మంచి గంధం. ఘుసృణం అంటే కుంకుమపువ్వు. ఈ గంధసారం దక్షిణాపథానికి ప్రతీక. మలయ పర్వతం దక్షిణంలో ఉంది కదా! ఘుసృణం కుంకుమపువ్వు కాశ్మీర దేశానికి, ఉత్తరదేశానికి ప్రతీక. కాశ్మీరజం అని దానికి మరోపేరు. నా దృష్టిలో ఈ గంధసారం తెలుగు భాషకు ప్రతినిధి. ఆ ఘుసృణమేమో సంస్కృత భాషకు ప్రతినిధి. కాబట్టి ‘గంధసారఘుసృణద్వైరాజ్యభారం’ అంటే సంస్కృతాంధ్ర భాషా ప్రభుత్వము అన్నమాట. ఆ ప్రభుతను అధ్యక్షించేవి ఏవి? ప్రౌఢ సాహిత్యములు అధ్యక్షించేవి. సాహిత్యములు అక్కడ ఎలా అధ్యక్షిస్తాయి? ఎక్కడ? దాక్షారామ చళుక్య భీమవర గంధర్వాప్సరో భామినీ వక్షోజద్వయమునందు అధిష్టించేవి గంధసార ఘుసృణములు అవుతాయి గానీ, ప్రౌఢ సాహిత్యములు కావు కదా! భవదీయ ప్రౌఢ సాహిత్యములు అక్కడ అధివసిస్తున్నాయి. ఈ ప్రౌఢ సాహిత్యములు ఎటువంటివి? గంధసార ఘుసృణ ద్వైరాజ్య భారాన్ని — గంధసారం అంటే మంచి గంధము, ఘుసృణం అంటే కుంకుమ పువ్వు. అంటే తెలుగు మంచి గంధం లాగా ఉంటుంది. మంచి గంధం యొక్క పరిమళ తరంగముల మాదిరిగా ఉంటుంది. ఆ దేదీప్యమానమైనటువంటి కుంకుమ పువ్వు ఉందే అది చాలా ఓజస్వితా లక్షణం కలది, అదేమో సంస్కృత భాషకు ప్రతినిధి. ఆ రెండు సాహిత్య సామ్రాజ్యాలకు అధ్యక్షత వహించేది తన ప్రౌఢ హిత్యము అని ఈ పద్యం ద్వారా చాటి చెప్పుకొన్నాడని చెప్పుకోవచ్చును.
శ్రీనాథునిపై సంస్కృత కవుల ప్రభావం
లోలోర్మిపంక్తుల నోలలాడి
భట్టబాణమయూరభారతీసందర్భ
సౌభాగ్యగరిమంబు సంగ్రహించి
భాససౌమిల్లక ప్రతిభాసమున్మేష
హేలావిశేషంబు నిచ్చగించి
మాఘభారవివచోమకరందనిష్యంద
మాధుర్యమునకు సమ్మదము నొంది
రాజశేఖరుఁ గవిరాజు ప్రస్తుతించి
ధీరమతి నన్నపార్యునిఁ దిక్కయజ్వ
శంభుదాసునిఁ గరమర్థి సన్నుతించి.
— శృంగారనైషధము 1.7
ఈ పద్యం శ్రీనాథుని సమగ్ర కావ్య దృష్టికి, ఆయన పొందిన సంస్కృతాంధ్ర సాహిత్య వారసత్వానికి అద్దం పడుతుంది. ఆయన కవిత్వంలో వ్యాస, వాల్మీకి మహర్షుల వాక్సుధాతరంగాలలో ఓలలాడిన పవిత్రత ఉంది. భట్టబాణ, మయూర మహాకవుల వాణి నుండి ఆయన సేకరించిన సౌభాగ్యగరిమ ఆయన రచనల్లోని గాంభీర్యాన్ని, శబ్ద వైచిత్రిని సూచిస్తుంది. మాఘ, భారవి కవుల కవిత్వంలోని మకరందమాధుర్యానికి సంతోషించి, “కాళిదాసు మనంబులోఁ గాంచి మ్రొక్కి”నాడంటే, ప్రతిభలోనూ, ప్రౌఢిమలోనూ శ్రీనాథుడు ఆ మహాకవుల లక్షణాలన్నింటినీ తనలో జీర్ణించుకున్నాడని స్పష్టమవుతోంది. విశేషమేమిటంటే, సంస్కృత కవులందరినీ స్మరించిన శ్రీనాథుడు, అదే పద్యం చివరలో ‘నన్నయ, తిక్కన, శంభుదాసులను’ (తెలుగు కవిత్రయాన్ని) అత్యంత భక్తితో సన్నుతించడం ద్వారా ఆయనకు సంస్కృతాంధ్ర భాషల పట్ల ఉన్న సమన్వయ దృష్టి వ్యక్తమవుతుంది.
సప్తసాగర మహా జలధరములు
వప్రక్రియాకేళి వశవిశీర్ణ సువర్ణ
మేదినీధర రత్న మేఖలములు
పక్వజంబూఫల ప్రకట సంభావనా
చుంబిత భూభృత్కదంబకములు
వికటకండూల గండక దేహ మండలీ
ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు
వాసవాద్యమృతాశన వందితములు
విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు
మించి విఘ్నోపశాంతి గావించుఁ గాత.
— హరవిలాసము పీఠికలో 5వ పద్యం
తెలుగు పద్యమా ఇది? శ్రీనాథునిది ఈ పద్యం, హరవిలాసంలోనిది. పైకి ఇది తెలుగు పద్యంగానే కనిపిస్తున్నప్పటికీ, ఇందులో అడుగడుగునా సంస్కృత కవుల ప్రగాఢమైన ప్రభావం, సంస్కృత సమాస సౌందర్యం ఉట్టిపడుతున్నాయి. “కలితశుండాదండ గండూషితోన్ముక్త…” అంటూ ఏనుగు తొండం చాపడం, ముడుచుకోవడం (సంహార విక్షేపములు) వంటి గంభీరమైన దృశ్యాలను శ్రీనాథుడు ఈ పద్యంలో కళ్ళకు కట్టాడు. సంస్కృత వాఙ్మయంతో పరిచయం ఉన్నవారికి ఇందులో ఒక్కొక్క సమాసం ఒక్కొక్క సంస్కృతకవిని గుర్తుకు తెస్తుంది.
సంస్కృత కవులనుండి పదబంధాలను స్వీకరించడంలో ఆయన చూపిన నేర్పు అనన్యసామాన్యం. భవభూతి ఉత్తరరామచరితలో ప్రయోగించిన కింది శ్లోకాన్ని పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది:
ఏతే తే కుహరేషు గద్గదనదద్గోదావరీ వారయః
మేఘాలంబిత మౌళినీల శిఖరాః క్షోణీభృతో దాక్షిణాః
— ఉత్తరరామచరితమ్ 2.30
దీనిలోని “గద్గదనదద్గోదావరీ” అనే పదబంధం పట్ల వ్యామోహంతో, దానిని సరాసరి తీసుకొచ్చి తన పద్యంలో ఎంత అద్భుతంగా ఇమిడ్చాడంటే, ఆ భావం పూర్తిగా శ్రీనాథుని సొంతమే అన్నట్లుగా భాసిస్తుంది.
కుహర క్రోడకటాహ గద్గదనదద్గోదావరీ సింధువా
ర్లహరీ శీకరమాలికా శిశిరముల్ పంపాసఖుల్ దండకా
గహనగ్రాహులు వాయువుల్ తపసికిన్ కల్పించె నాహ్లాదమున్.
— కాశీఖండము 3.14
శ్రీనాథుడు కేవలం ఒక అనువాదకుడు మాత్రమే కాదు, తాను చదివిన సంస్కృత కవుల మనోహరమైన భావాలను, విలక్షణమైన పదబంధాలను తనవిగా చేసుకున్న ఒక మహాభావుకుడు. మయూరుని సూర్యశతక శ్లోకాలను కేవలం ఆంధ్రీకరించడమే కాకుండా, వాటిని అత్యంత ప్రౌఢమైన సీస పద్యాలలో బంధించిన తీరు అద్వితీయం. ఉదాహరణకు, మయూరుని ఈ స్రగ్ధరా వృత్త శ్లోకాన్ని శ్రీనాథుడు ప్రౌఢమైన సీస పద్యంగా మలిచిన విధానం చూడండి:
ధూర్ధ్వస్తాగ్ర్యగ్రహాణి ధ్వజపటపవనాందోళితేందూని దూరం
రాహౌ గ్రాసాభిలాషా తదనుసరతి పునర్దత్త చక్రవ్యధాని
శ్రాంతాశ్వ శ్వాస హేలాధుత విబుధధునీ నిర్ఝరాంభాంసి భద్రం
దేయాసుర్వో దవీయో దివి దివసపతేః స్యందన ప్రస్థితాని ॥
— మయూరుడి సూర్యశతకం-66
శ్రీనాథుని సీనపద్యం:
ధూళిపాళీ మిళద్ద్యు స్థలములు
ధ్వజపట పల్లవోద్ధత మరుత్సంపాత
పరికంప మానోడు పరివృఢములు
గ్రాసాభిలాషానుగత విధుంతుద పునః
ప్రాప్త చక్రవ్యధోపద్రవములు
శ్రాంతాశ్వ నిబిడ నిశ్వాస ధారాధుత
స్వర్ధునీ నిర్ఝర జలచరములు
పద్మబాంధవుని రథప్రస్థితములు
సాఁగె నది దక్షిణాయనసమయ మగుట
దర్దురముమీఁద మలయభూధరముమీఁద.
— కాశీఖండము 1.127
ధూర్ధ్వస్తాగ్ర్యగ్రహాణి అన్న మయూరుని సమాసం చూడగానే, ‘ఓహో! నీకేం తెలుసును, నేను చెబుతాను విను’ అని మయూరుణ్ణి మెప్పింపజేసినట్టుగా వ్రాసాడు:
ధూర్దండ ఘట్టన త్రుటిత గ్రహగ్రావ
ధూళిపాళీ మిళద్ద్యుస్థలములు
అలాగే, ధ్వజపట పవనాందోళితేందూని… అన్నదానికి ప్రతిగా:
ధ్వజపట పల్లవోద్ధత మరుత్సంపాత
పరికంప మానోడు పరివృఢములు
శ్రాంతాశ్వ శ్వాస హేలాధుత విబుధధునీ నిర్ఝరాంభాంసి అన్నదానికి:
శ్రాంతాశ్వ నిబిడ నిశ్వాస ధారాధుత
స్వర్ధునీ నిర్ఝర జలచరములు
మయూరుని శ్లోకాన్ని అనువదిస్తూ, నువ్వా-నేనా అన్నట్లుగా మూలాన్ని మించిన ప్రౌఢిమను ప్రదర్శించి మయూరుడికే సవాలు విసిరాడా అన్నట్లుగా రచన చేశాడు. అల్పాల్ప కవులు ఎవరైనా ఈ రకంగా మూలసమాసాలను వాడితే గ్రంథచౌర్యం అంటాం. అల్పకవులు అలా చేసిన వెంటనే మనకు భేదం తెలుస్తుంది. వాడు ఎంతవరకు అనుకరించాడో అంతవరకు దేదీప్యమానంగా ఉంటుంది, తర్వాత వాడి రంగు బయటపడుతుంది కదా! శ్రీనాథుని అనుసరణ పూర్తిగా వేరు. ఏ మూలకవి భావనతోనైనా శ్రుతి కలిపే శతతంత్రీవీణ శ్రీనాథుని కవిత. వాళ్ళ భాషానిగుంభనములు ఆయన తీసుకోవడం ఎలా ఉంటుందంటే, మూలకవులకు ఒక యోగ్యతాపత్రం — certificate — ఇచ్చినట్లుగా, వారిని అనుగ్రహించినట్లుగా ఉంటుందే తప్ప, ఎరువు తీసుకొన్నట్లుగా ఉండదు.
అలాగే, శ్రీనాథుడు చేసిన వర్ణనలలో అచ్చతెలుగు అందం కూడా అద్భుతంగా ఆవిర్భవిస్తుంది. “శాతః శ్యామాలతాయాః పరశురివ” అన్న శ్లోకానికి అనువాదంగా “చిరుసాన పట్టించి, చికిలి జేయించిన గండ్రగొడ్డలి నిశాగహనలతకు,” అని అంటేగాని ఆయనకు తృప్తి వుండదు. ఆ సీసపద్యానికి వ్రాసిన ఎత్తుగీతిలో అరుణోదయాన్ని అచ్చతెలుగులో ప్రకటించిన తీరు చూడండి:
కుంటు వినతా మహాదేవి కొడుకుఁ గుఱ్ఱ
సవితృసారథి, కట్టెఱ్ఱ చాయ వేలుపు
అరుణుడుదయించె ప్రాగ్దిశాభ్యంతరమున.
— కాశీఖండము 1.121
తరువాతి కవులపై శ్రీనాథుని ప్రభావం
శ్రీనాథుడు ఏర్పాటు చేసిన ఈ కవితా మార్గం, ఆయన పెట్టిన ఒరవడి తరువాతి కాలంలోని ప్రబంధ కవులకు ఒక రాజమార్గం అయింది. ఆయన సంస్కృత భాషను సర్వంకషంగా భర్జించుకుని, జీర్ణించుకుని సృష్టించిన ఓజస్సు ప్రబంధ కవులను తీవ్రంగా సమ్మోహపరిచింది. అల్లసాని పెద్దన, ధూర్జటి, తెనాలి రామకృష్ణ, కృష్ణదేవరాయలవంటి ప్రబంధ కవులందరూ శ్రీనాథుని విధానాలనే అనుసరించి తమ తమ ప్రత్యేక శైలులను నిర్మించుకున్నారు.
ఖండగ్రావము చండకుండలివిశంకవ్యాప్తి కింపైన శ్రీ
ఖండస్థాణువు శారికాశుకవిహంగవ్రాతపుండ్రేక్షుకో
దండక్రీడకు నీడమై తపమతి స్థైర్యంబునం జేయగన్
శ్రీనాథుని శైలిని పోలిన పై పద్యం శ్రీనాథునిది కాదు. ధూర్జటి రాసినది. (శ్రీకాళహస్తి మాహాత్మ్యము 1.73)
జ్యోతిర్లింగవిశుద్ధరత్నఖని మోక్షోపాయదుగ్ధాబ్ధివే-
లాతీరావని డుంఠి నామకగజాలానంబు గంగామృత-
స్రోతోనిస్సృతిచంద్రగోళ, మనమించున్ గాశి శ్రీరాశియై.
ఇది తెనాలి రామకృష్ణునిది. (పాండురంగ మాహాత్మ్యము 1.99)
భవదభ్యర్ణ వికీర్ణ కృత్రిమ సరిత్పాథస్తరంగాహతైం
దవ పాషాణ వితర్దికా తలమునన్ నాళీకపత్రాక్షు లు
త్సవమొప్పన్ విహరించుచున్ సరసవాచాప్రౌఢిమల్ మీఱగన్ .
ఇది పెద్దన గారిది. (మనుచరిత్రం 3.74)
అలాగే, శ్రీనాథుని ఈ పద్యం చూడండి:
సేవాహేవాకపాక శిశిర మరుత్ ప్ర
స్తావ పరికంప్యమాన జ
టావళియగుచతఁడు వింధ్యమల్లనఁ జేరెన్
ఈ పద్యం కాశీఖండంలోనిది (1.88). నారద మహర్షి వింధ్య పర్వత ప్రాంతానికి వచ్చాడు. ఆ నర్మదా నదినుంచి వచ్చే ఆ నీటి గాలి తరగల చేత ఆయన జడలు కదులుతున్నాయి అన్నాడు.
ఆ శ్రీనాథుని పద్యంలాంటి పద్యం రాయాలని ప్రలోభంతో పెద్దనగారు ఇది రాశాడు:
పల్లవిత కదంబ ముకుళ పరిమళ లహరీ
హల్లోహల మద బంభర
మల్లధ్వనులెసగ విసరె మరుదంకురముల్.
— మనుచరిత్రము 2.6
వాళ్ళిద్దరినీ చూసి తెనాలి రామకృష్ణ కవీ రాసాడు, అగస్త్యుని మీద పద్యం.
ఝంపా సంపాద్యమాన జలకణరేఖా
సంపాత శీతలానిల
సంపద వొదలించె పరమ శైవోత్తంసున్.
— పాండురంగ మాహాత్మ్యము 1.128
అలాగే, శ్రీరంగానికి పెరియాళ్వార్లు వేంచేసినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఓ పద్యం చెప్పాడు:
చపాళీ పాళీభవద్విపంచీ స్వన భృం
గాళీ కవేర దుహితృ మ
రాళీ ధ్వనులెసగ గాడ్పు వ్రతి వడ యుడిపెన్.
— ఆముక్తమాల్యద 6.92
ఈ పద్యాలకన్నింటికీ మూలస్ఫూర్తి అయిన పద్యం ఏది? పైన మనం చెప్పుకొన్న “రేవాతరంగశీకర” అన్న శ్రీనాథుని పద్యం.
కాబట్టి, “శ్రీనాథుని సాహిత్యం మీద సంస్కృత కవుల ప్రభావం ఉంది.” అన్నంత మాత్రంచేత చాలదు. శ్రీనాథుడు సంస్కృత కవులను, సాహిత్యాన్ని చాలా మేసి ఆరగించుకొన్నాడు. ఆ మేత యొక్క సారాంశం అంతా అతని వాక్కుకు పట్టి ఉంది. ఆయన సాహిత్యాన్ని తరువాత ప్రబంధకవులు మేసినందువల్ల ఆ సంస్కృత వాఙ్మయంలోని సౌందర్యం, ఓజస్సు అంతా తెలుగు సాహిత్యంలోకి వచ్చేసింది. మరి మిగిలిన దేశభాషల సంగతి నాకు తెలియదు. ఈ సంస్కృతాన్ని అంత జీర్ణించుకొని, తనలో భాగంగా కలుపుకోగల భాష తెలుగు భాష అన్న విషయాన్ని వాళ్ళు సాహిత్యం ద్వారా ప్రయోగించి నిరూపించారు.
మన ప్రబంధాల్లో రతిని వర్ణించడానికి ఒక పాతిక ముప్పై పద్యాలు ఉన్నాయి. వీటన్నిటికీ కులగురువు ఏదంటే ఈ శ్రీనాథుని పద్యం:
వ్యగ్రబాలాహస్తవనరుహంబు
ధవకృతాధరబింబదశనక్షతివ్యథా
భుగ్నలీలావతీభ్రూలతంబు
ధరణినాయకభుజాపరిరంభమండలీ
గాఢపీడితవధూఘనకుచంబు
వరనఖాంకురమృదువ్యాపారపులకిత
నీరజాక్షినితంబోరుయుగళి
బస్తి ఘర్మసలిల మస్తి కంప
మస్తి భీతి యస్తి హర్ష మస్తి వ్యథం
బస్తి వాంఛ మయ్యె నపుడు రతము
— శృంగారనైషధము 7.177
క్రియాపదాలతో సహా అద్భుతమైన సమాసాలు చేసి, సంస్కృత భావనను అచ్చమైన తెలుగు పద్యంగా అనిపించేలా చేయడంలో శ్రీనాథుని నేర్పు అనన్యసామాన్యం. దీనికి సమ్మోహపడి పెద్దన:
మామూల పరిచుంబితాధరోష్ఠ
మతిశయప్రేమ కల్పిత దంత సంబాధ
మగణితగ్లాని శయ్యానిపాత
మతివేల మణిత యాచ్ఞార్థ గల్లచపేట
మతిదీన వాక్సూచితాత్మవిరహ
మంకుర త్పులక జాలావిద్ధ సర్వాంగ
మానంద కృతహారవాననాబ్జ
తాక్ష మాస్విన్న గండ మాయత్త చేష్ట
మాస్తిమిత భూషణారవ మావధూటి
ప్రథమసురతంబు గంధర్వపతిఁ గరంచె.
— మనుచరిత్రము 3.116
ఇప్పుడేమిటంటే సంస్కృతం చదవని వాళ్ళకి కూడా ఆ సంస్కృత సాహిత్యం యొక్క పుష్టిని కలిగించే లక్షణం ఆ శ్రీనాథుని పద్యాల్లో ఉంది. ఆ తరువాతి కాలపు కవులు శ్రీనాథుడి మార్గానికి, ఒరవడికి సమ్మోహితులయ్యారు. ఆ సమ్మోహం కొన్ని శతాబ్దాల దాకా పోలేదు. అసలు ఎప్పుడూ పోదనుకుంటాను. ఈ పద్యం చూడండి:
నీతాస్వాద్యతరప్రగల్భవచనస్నిగ్ధాననాంభోజ సం
ధాతీర్థంకర మాగధోల్బణము నానా మేదినీరాట్సభా
గీతిస్వాదు మనోజ్ఞమై ధనువు మ్రోఁగెన్ రాజలోకంబులన్.
శ్రీనాథుని పోకడనుసరించి ఎవరో ప్రబంధకవి వ్రాసిన పద్యం కాదిది. ఇరవయ్యో శతాబ్దపు కవిసమ్రాట్టు వ్రాసిన పద్యం ఇది.
చివరిగా నేను అనువాదం చేసిన విక్రమోర్వశీయంలోని ఒక పద్యాన్ని ఉటంకిస్తున్నాను:
సర కుంభాపఘన స్థలద్గతి, వశా సంప్రాపితాయల్లక
జ్వర సంవర్ధిత చిత్తభూ వివిధచేష్టా బంధురోన్మాద మం
ధర గంధద్విపరాజ మేగెడునిదే కాంతారాంతరాధ్వమ్ములన్
ఇది విక్రమోర్వశీయం నాలుగో అంకంలో ఒక ఆక్షిప్తకంలో పురూరవుని ప్రవేశాన్ని మదగజగమనంతో పోల్చే ఈ పద్యం. ఎలా రాశాను నేను? ఆ శ్రీనాథుడు ఆవేశించినందువల్లనే కదా!
ఆ విధంగా సంస్కృత కవుల ప్రభావం శ్రీనాథుని ద్వారా ప్రవహించి, ప్రబంధ కవులచేత పెంపొందించబడి, తెలుగు సాహిత్య రంగానికి సరికొత్త శోభను సమకూర్చింది. సాహిత్య చరిత్రలో ఎన్ని సారస్వతోద్యమాలు వచ్చినా, ప్రాచీన కావ్య సంప్రదాయం అనే జీవనది నిరంతరం తనంతట తానుగా ప్రవహిస్తూనే ఉంటుంది.
కవిత్వంలో ప్రతిభ అనేది సహజసిద్ధంగా ఉద్భవించేదే తప్ప, ఆధునిక విశ్వవిద్యాలయాల డిగ్రీల ద్వారా తయారు చేయబడేది కాదు. ప్రాచీనకవులు ఏ విశ్వవిద్యాలయాల్లో చదువుకోకపోయినా అద్భుతమైన శతకాలను, ప్రబంధాలను సృష్టించారు. కాబట్టి, కావ్యతత్త్వాన్ని కేవలం ముక్కలు ముక్కలుగా విడదీసి చూసే విశ్లేషణలకే పరిమితం కాకుండా, మన ప్రాచీన కావ్యవాఙ్మయాన్ని సమగ్రమైన దర్శనంతో అధ్యయనం చేయాలి. ఈ అపారమైన ప్రాచీన వాఙ్మయ సంపదకు వారసులైన ఆధునికులకు సారస్వతానుశీలనం, సాహిత్య విద్యాభ్యాసం కలిగించి, ఆ వాఙ్మయాన్ని అర్థం చేసుకునే సమ్యగ్విచార దక్షులుగా ముందుతరాలను తయారు చేయడానికి అవసరమైన వనరులను, వాతావరణాన్ని విశ్వవిద్యాలయాలు కల్పించి ఆధునిక గురుకులాలుగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కానిపక్షంలో ఆ సంపదకంతకీ మీరు వంచితులు కాబోతున్నారు, ఆ విషయం హెచ్చరిస్తున్నాను నేను!
[ఈ వ్యాసం 1985లో మల్లంపల్లి శరభయ్యగారు నరసాపురంలో ఒక జాతీయగోష్ఠిలో చేసిన ప్రసంగం ఆధారంగా నిర్మితమైనది. ఆడియో సేకరించిన అరిపిరాల నారాయణరావు గారికి, ట్రాన్స్క్రైబ్ చేసి ఈమాట సంపాదకులకు అందజేసిన వాడ్రేవు చినవీరభద్రుడుగారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఉపన్యాసాన్ని వ్యాసంగా మార్చే ప్రయత్నంలో ఏవైనా దోషాలు దొర్లితే వాటి బాధ్యత సంపాదకులదే. – సం.]
