తలపోసినకొద్దీ తరిగేది…

మలయాళ సాహితీ కారుడు, సాంస్కృతిక కార్యకర్త, ఉద్యమకారుడు, బుద్ధిజీవి, చింతనాపరుడు ఎమ్.గోవిందన్ సంతాప సభానంతరం, వారి శిష్యులు కొందరు ఒక చోట చేరి, ఆయన గురించిన ఒక స్మృతి సంచిక తీసుకురావాలన్న అంశాన్ని గూర్చి చర్చించడం మొదలుపెడతారు. వాళ్ళ చర్చ మలయాళ సాహిత్యంలో, చిత్రసీమలో, రాజకీయ సిద్ధాంతాల్లో, తాత్వికతలో ఎమ్.గోవిందన్ గారి ప్రభావం, ఆయన తాత్త్వికత, చింతనా శైలీ ఏర్పరచిన కొత్త పోకడల మీదుగా సాగుతుంది. ఆ శిష్యులందరూ కూడా నిజ జీవిత పాత్రలే – ప్రసిద్ధ రచయితలు, కవులు, చింతనాపరులు, చిత్రకారులే. సరదాగా, వ్యంగ్యంగా మొదలయ్యే వాళ్ళ సంభాషణ ఎమ్.గోవిందన్‌గారి అనుమానాస్పద మరణం గూర్చి తాత్త్వికంగా ప్రశ్నిస్తుంది – తాత్త్వికంగానే సమర్ధిస్తుంది.

ఇది జరిగిన కాలం 1989. అప్పుడు జరిగిన ఆ సంభాషణలో ఈ కథారచయిత కూడా ఒక ప్రేక్షకుడిగా ఉన్నాడు. ఇందులోని పాత్రలన్నీ మారుపేర్లతో ఉన్నప్పటికీ కొంచెం మలయాళ సాహిత్య, రాజకీయ అవగాహన ఉన్నవారికి ‌వీళ్ళు ఎవరన్నది తెలిసే అవకాశాలున్నాయి. ఆ పాత్రల గూర్చి అవగాహన లేనివారికికూడా ఈ కథ, సంఘాన్ని ప్రభావితం చేసి మరణించిన ఒక మనిషి జీవితం గురించి గొప్ప తాత్విక, తార్కిక కోణాన్ని చూపెడుతుంది – కొన్ని ప్రశ్నలను రేకెత్తిస్తుంది. ఈ కథలో ఎమ్. గోవిందన్ పాత్ర ఎమ్.కె అన్న పేరుతో చెప్పబడింది.


ఏ.కె.ఎస్ బాబు కోసం వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. రవీంద్రనాథ్ పెట్టెలోంచి ఒక సీసా బయటికి తీశాడు. జాన్ జోసెఫ్, అబ్దుల్ హమీద్, గంగాధరన్ ముగ్గురూ ఆయనేం చేస్తున్నాడో గమనిస్తున్నారు. ఆయన వాళ్ళనేం పట్టించుకోవడంలేదు. అక్కడ మేజా మీదున్న గాజుగ్లాసు తీసి దాన్లో మిగిలి ఉన్న నీళ్ళను, తెరిచి ఉన్న వాష్‌రూమ్ లోపలికి విసిరాడు. సీసాలో సగానికున్న రమ్మును వేల్తో కొలత చూస్తూ జాగ్రత్తగా గ్లాసులోకి ఒంపాడు. గ్లాస్ పైకెత్తి కళ్ళతోనే ఎంతుందో చూసుకుంటూ ప్లాస్టిక్ కూజాలోని నీళ్ళను కొన్ని గ్లాసులో కలిపాడు. అతను తాగుతూంటే ఆ ముగ్గురూ చూస్తూ వున్నారు. ఆ ముగ్గురిలో హబ్దుల్ హమీద్ మందు ముట్టడు. మిగిలిన ఇద్దరికి ఎప్పుడైనా ఓసారి తాగే అలవాటుంది. త్రిస్సూరులో కలవడం అంటూ జరిగితే మాత్రం తాగడం ఖాయం. ఇప్పుడు మాత్రం వాళ్ళు తాగాలనుకోవడం లేదు, రవీంద్రనాథ్ కూడా ‘తాగుతారా’ అంటూ వాళ్ళనేమీ అడగలేదు.

మూతి తుడుచుకుంటూ వచ్చిన రవీంద్రనాథ్, “నాటుసారాలాగా మండిపోతోంది. తమిళనాడునుండి సరాసరి స్పిరిట్‌నే డైరెక్టుగా ఇక్కడికి పంపించేస్తున్నారు,” అన్నారు.

“ఈయనింకా రాకుండా ఏంచేస్తున్నాడు?” అడిగాడు జాన్, బాబుగురించి.

“వస్తాడు. వచ్చే దారిలో పాత మిత్రులెవరూ ఎదురుపడకుండా ఉండాలి,” అన్నాడు గంగాధరన్.

గంగాధరన్ సిగరెట్ ముట్టించుకున్నాడు. జాన్‌కీ గంగాధరన్‌కీ, ఇద్దరికీ సిగరెట్టు అవసరం పడ్డట్టుంది. హమీద్ వెళ్ళి కిటికీ పక్కన నిలుచున్నాడు. బయటినించి వస్తున్న గాలి తగులుతూంటే అతనికి హాయిగా ఉంది. ఆ గెస్ట్‌హౌస్ వెనక ఒక పెద్ద మామిడి చెట్టుంది. ఆకులు రాలిన ఆ చెట్టు కొమ్మలు, ఆ మిద్దె అంత ఎత్తుకు పెరిగి, కిటికీకి అడ్డంగా చాలా భాగాన్ని ఆక్రమించాయి. మామిడి చెట్టు గాలికి రాల్చిన ఆకులు మగ్గు వాసన, ఎర్ర చీమలనుండి పుల్లని వాసన కలగలిసి వస్తోందని హమీద్‌కు అనిపించింది.

రవీంద్రనాథ్‌కు విపరీతంగా చెమటలు పోస్తున్నాయి. గాలి, వీపుకు తగిలేందుకు తెల్ల జుబ్బాను వెనక్కు లాక్కుని, కాళ్ళు చాపుకొని కూర్చున్నాడు. కళ్ళు మూసుకొని గాలిని ముఖానికి తగలనిచ్చాడు. గాలి సరిపోక ఫ్యాన్ స్పీడు పెంచమంటాడేమో, అనుకున్నాడు హమీద్.

ఆ వెంటనే “ఆ ఫ్యాన్ స్పీడు పెంచు,” అన్నాడు రవీంద్రనాథ్.

“అది మూడులోనే తిరుగుతోంది,” అన్నాడు హమీద్.

“వాడికి గాలి చాలడంలేదు,” అన్నాడు జాన్.

“అతని లోపలున్న గాలి బయటికి పోతున్నట్టుంది తమ్ముడూ! లోపలి గాలి మాత్రమే మన సొంతం. బయటి గాలి లోపలికి పోతే అదే వేగంలో వెనక్కి తిరిగి వచ్చేస్తుంది,” అన్నాడు గంగాధరన్.

రవీంద్రనాథ్, “గాలిని నాన్చి పులవబెట్టకొరేయ్! ఇట్టాంటి గాలుల్ని ఎన్నెన్ని చూశాను నేను,” అన్నాడు. త్రేనుస్తూ, అటూ ఇటూ కదులుతూ “ఎన్నో సుడిగాలుల్లో చిక్కుకుని అల్లాడిన పక్షిని నేను, మీరందరూ ఇక్కడ నిక్కర్లేసుకుని తిరుగుతున్న రోజుల్లో సి.పి. రామసామి అయ్యర్ ఆధ్వర్యంలో పోలీసులు నా తలకు రెండువేల రూపాయలు వెల కట్టారు,” అన్నాడు. కుర్చీకి పక్కనున్న యాష్ ట్రేలో మిగిలున్న సిగరెట్ పీకను గుచ్చి ఆర్పేసి, “రెండువేలు… ఆరోజుల్లో రెండు వేలు పెడితే త్రిసూర్లో మాంచి ఇల్లు వచ్చేది.” అన్నాడు.

“నీ పెళ్ళాన్నే నిన్ను పట్టించెయ్యమని చెప్పి ఆ ఇల్లు కొనుక్కోవాల్సింది. ఈ రోజున ఆ ఇంటి రేటు ఇరవై లక్షలుండేది త్రిస్సూర్లో,” అన్నాడు గంగాధరన్.

“ఆ ఇంటితోబాటు ఆమె ఇంకెవర్నైనా తెచ్చిపెట్టుకునుంటే?” అన్నాడు జాన్.

“పోరా, వెధవా!” అన్నాడు రవీంద్రనాథ్.

కిందనుండి అడుగుల శబ్దం, మాటలూ వినిపించాయి. “ఎవరు?” అని అడుగుతూ రవీంద్రనాథ్ పైకి లేచాడు.

ఆయన ఏదో తొందర్లో ఉన్నాడని హమీద్‌కి అనిపించింది. “అది కవిగారి గొంతు కదా?” అడిగాడు గంగాధరన్.

“చిలుక చప్పుడు” రామవర్మ గట్టిగా అన్నాడు. ఆయనను వాళ్ళ కాలేజీ స్నేహితులు చిలుక వర్మ అని పిలిచేవాళ్ళు. ఆయన రిటైరయ్యే రోజు ఒక స్టూడెంటు, “చిలుక ఎగిరిపోతోంది. పంజరం మిగిలిపోయింది” అంటూ ఆర్ద్రతతో ఊహాజనితమైన ఒక కవిత చదివితే సభ మొత్తం పగలబడి నవ్వింది. ఎవరితో మాట్లాడుతూ వస్తున్నారో తెలియడం లేదు. రామవర్మ తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు. వెనక్కి తిరిగి బయట నిలబడి ఉన్న యువకుడితో “లోపలికి రా,” అన్నాడు. వచ్చిన వాడు చెరిగిన తలతో, బెదురు చూపులతో బాగా పెరిగిన గడ్డంతో, బక్కపలచటి శరీరంతో పిచ్చిపిచ్చిగా ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉన్నాడు.

“చిలుకా! ఎవరు వీడు? నక్సలైటా?” అడిగాడు రవీంద్రనాథ్.

“పాఠమా? భేదమా?” జాన్ నవ్వాడు.

ఆ రోజుల్లో కళా సంస్కృతీ వేదిక అనే సంస్థ ‘మూల పాఠం’ అనే పత్రికను ప్రచురించేది. ఆరు నెలల తర్వాత అది మూతబడింది. విప్లవ సాంస్కారిక వేదిక అనే మరో సంస్థ మొదలై దానినుండి ‘పాఠభేదము’ అనే పేరుతో ఇంకో పత్రిక వెలువడింది.

“తర్వాత రానున్న సంచిక ‘భేదాభేదపాఠం’ అన్న పేరుతో ప్రచురించే అవకాశం ఉంది,” అన్నాడు ఎమ్.కె. “ఇక్కడ అద్వైత దర్శనం అలానే వృద్ధి చెందింది! అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం, ద్వైతాద్వైతం, శుద్ధాద్వైతం, అద్వైతాద్వైతం…”

గంగాధరన్ తీక్షణంగా చూస్తూ, “ఆ చివరిగా చెప్పిన అద్వైతాద్వైతం ఎవరిది?” అని అడిగాడు.

“నాదే! ఇప్పటికిప్పుడు వండాను,” అన్నాడు. గదంతా పగలబడి నవ్వింది. ఎమ్.కె. మామూలుగా నవ్వాడు. నవ్వుల తర్వాత ఒకసారి గాఢంగా బీడీ పొగను పీల్చడం ఆయన అలవాటు.

రామవర్మ “ఈ పిల్లాడిది తమిళనాడు, కథలు రాస్తాడు! మలయాళంగూడా తెలుసు,” అన్నాడు.

“ఇలాంటి చిన్న చిన్న శాల్తీలన్నీ నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాయి,” అన్నాడు రవీంద్రనాథ్. “ఇంతకీ ఇతనిది ఏ కేటగిరీ రోగం? విప్లవమా, అస్తిత్త్వవాదమా లేక మామూలు మలబద్ధకమా?”

రామవర్మ, “వేదాంతం! నేను ఎవర్ని? ఏమిటి ఇదంతా? ఎందుకు? దేనికి?” చేతులు చాపి నాటకీయంగా చెప్పాడు.

జాన్ తొడమీద చరిచి గట్టిగా నవ్వుతూ, “శుభం. చచ్చింది గొర్రె! ఇంకో ముప్పైయేళ్ళు ఆ దెయ్యం కూర్చోనివ్వదు ఇతడ్ని. వేదాంతం, మూలశంక రెండూ ఒక్కటే,” అన్నాడు.

“కరెక్టే! లోపలున్నది అవసరం లేకున్నా బయటకు చొచ్చుకుని వచ్చి లోకంతో ఒరుసుకుని పుండులా తయారవుతుంది,” అన్నాడు రవీంద్రనాథ్. రామవర్మ నవ్వుతూ ఆ కుర్రాణ్ణి కూర్చోమని చెప్పాడు. “చివరగా ఒక విషయం. మందుగుండు అయిపోయిన రాకెట్‌లా ఎక్కడికో వెళ్ళి పడిపోతాడు. లేదంటే ఉత్త చేతుల్తో విభూతిని తీసిస్తూ ఎలాగోలా తృప్తి పడతాడు.”

హమీద్ “అరవోళ్ళని గేలి చెయ్యడం ఎందుగ్గానీ, వచ్చిన పని చూడండి,” అన్నాడు.

“బాబు రాలేదా?” అడిగాడు రామవర్మ.

“వస్తున్నాడనే ఎదురుచూస్తూ ఇక్కడ కూర్చొని ఉన్నాం.”

“సిగరెట్టు ఉందా?” అడిగాడు రామవర్మ.

రవీంద్రనాథ్ వెతుక్కుని “ లేదు! ఒక పాకెట్ తీసుకు రమ్మని చెబుతాను,” అంటూ పైకి లేచాడు.

కిందినుంచి గొంతులు వినిపించాయి. ఏ.కె.ఎస్.బాబు, చిత్రకారులు కె.వి.బాలన్ మేడమీదికి వస్తున్నారు. చెక్క మెట్లు ఎక్కుతున్న శబ్దం వినపడుతోంది.

చిత్రకారులు బాలన్ తన అలవాటు ప్రకారం పెద్ద గొంతుతో “ఏం జరుగుతూందిక్కడ? ప్రభుత్వాన్ని కూల్చే కుట్రేమన్నానా?” అన్నారు.

బాబు “వచ్చే దారిలో బాలన్ అన్న కలిశారు,” అన్నాడు.

బాలన్ “నేనిక్కడకు ఓరియంట్ బుక్స్ థామస్‌ను కలవాలని వచ్చాను. వాడు నాకు డబ్బులు ఇవ్వాలి. ఓ అరగంట వాడి పిచ్చి వాగుడంతా విని ఓ రెండొందలు లాక్కొన్నాను. ఆ బూజునంతా తల్లోనుంచి దులుపుకోవాలంటే దాంట్లో యాభై ఖర్చుపెట్టి ఇప్పుడు తాగాలి.”

ఆయన రవీంద్రనాధ్‌నే చూస్తూ, “ఉందా?” అనడిగాడు. “అదిగో అక్కడ, సంచీలో,” రవీంద్రనాథ్ చూపించాడు. బాలన్ లేచెళ్ళి ఆ సంచి లోపల చెయ్యి పెట్టి తడిమి బుడ్డిని పైకెత్తారు. ఆయన అందులో ఉన్న ద్రవాన్ని గాజు గ్లాసులోకి ఒంపుకుని నీళ్ళు కలుపుతున్న శబ్దం వినపడుతోంది.

రవీంద్రనాథ్ బయటకు వెళ్ళి సిగరెట్టు కోసం పిల్లవాడిని పురమాయించి లోపలికి వచ్చాడు. “టీ తెమ్మని చెప్పాను,” అని చెబుతూ కూర్చున్నాడు. రామవర్మ కింద పడి ఉన్న సిగరెట్టు పీకనొక దాన్ని పైకెత్తి, తన దగ్గర మిగిలి ఉన్న అగ్గిపుల్లతో దాన్ని అంటించి రెండుసార్లు గాఢంగా పీల్చాడు. ఇంతలో నిప్పు వేడి చేతికి తగిలి కింద పారేశాడు. ఆయన చిన్న గడ్డంలో పొగ దూరి మెల్లగా తొలిగిపోయింది. హమీద్ మాత్రం అయిష్టంగా కూర్చొని ఉన్నాడు, ఇక అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోవాలనిపించింది. అక్కడున్న వాళ్ళు ఎవ్వరూ అసలు విషయం గురించి మాట్లాడటం లేదు. మాట్లాడాలంటేనే భయపడుతున్నట్లు ఏవో పనికిమాలిన విషయాలను గూర్చి మాట్లాడుతున్నారు. “ఏదో ప్రణాళిక ఉన్నట్టు కంఠన్ చెప్పాడే?” అన్నాడు.

“ప్రణాళిక ఇదే. నేను చెప్తాను” అంటూ బాలన్ పెద్ద గొంతుతో మధ్యలో కలగజేసుకున్నాడు. “నేను ముందే కంఠన్‌తో చెప్పాను. బాబుతో కూడా ఈ విషయం గురించే మాట్లాడుతూ వచ్చాను. ఒక మంచి స్మృతి సంచిక తేవాలి. వెంటనే! ఆరు నెలల లోపల.” జాన్, “స్మృతి సంచికా! ఇక్కడ సంతాపసభలో మాట్లాడిన విషయాలను విన్నాక, ‘వీళ్ళు ఎవరిని గూర్చి మాట్లాడుతున్నారని నేను వీడిని అడిగాను… ప్రియమైన వారు, విజయాన్ని సాధించిన వారు, మంచివారు అయిన ఎవరో కాథలిక్ ఫాథర్ గురించి మాట్లాడుతున్నారని వీడన్నాడు.”

“మన విశ్వాసం అటువంటిది మరి. మరణించిన వాళ్ళు దేవుళ్ళైపోతూ ఉంటారు. కనుక అన్ని దైవగుణాలూ వాళ్ళకు వచ్చేస్తూ ఉంటాయి,” అన్నాడు గంగాధరన్. “చూడబోతే, వీళ్ళు పెద్దాయనకు చక్కెర పొంగలి నైవేద్యాలు కూడా పెట్టేసేలా ఉన్నారు!” అన్నాడు జాన్.

“అలాంటి మనిషిని ప్రేమకు ప్రతిరూపం అని చెప్తున్నారంటే…?” అన్నాడు గంగాధరుడు. “నేను కారు ఆక్సిడెంటుకు గురై నలభై రోజులపాటు ఆస్పత్రిలో ఉన్నాను. మధ్యలో రెండుసార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళారు ఆయన. ఒక్కసారైనా నన్ను చూడడానికి రాలేదు. తర్వాతెప్పుడో నేను ఆయన్ను కలిసినప్పుడు ఏదీ జరగనట్టు మిలాన్ జీలాస్ ‘రెయిజ్ అండ్ ఫాల్’ పుస్తకాన్ని గూర్చి మాట్లాడటం మొదలుపెట్టారు.”

కొంచెం ఆగి, “ఆయనకు ఎవరి మీదా ప్రేమ ఉన్నట్లు లేదు. బహుశా ఉంటే గింటే కొడుకుమీదా, కూతురిమీదా ప్రేమ ఉండవచ్చు. కాని వాళ్ళ దగ్గరా ఆ ప్రేమను చూపలేదు. ఆయన వాళ్ళ బాధ్యతలను తీసికొన్నదీ లేదు,” అన్నాడు జాన్.

“సమస్త మానవాళి మీదా ప్రేమ ఉన్న వాళ్ళు, విడివిడిగా మనుష్యులపట్ల ప్రేమను చూపరు. విడిగా మనుష్యుల పట్ల ప్రేమగా ఉన్న వాళ్ళు మానవాళి పట్ల ప్రేమగా ఉండరు,” అన్నాడు రవీంద్రనాథ్.

“ఎవరు చెప్పింది?” అన్నాడు హమీద్.

“ఏం? నేను చెప్పకూడదా?” అన్నాడు రవీంద్రనాథ్.

“ఘోరాతిఘోరం ఏమిటంటే ఆయన్ను ‘మహాకవి’ అని ఎమ్.పి. నారాయణన్ అనడం… ఎమ్.కె. ఆ మాటను విని ఉంటే, ‘థూ’ అని ఖాండ్రించి ఊసి ఉండును. ‘కవితలు రాయడమే నాకు చేతనై ఉంటే, ఇన్ని తంటాలూ నేనెందుకు పడతానురా పిచ్చినా కొయ్యా!’ అని ఉండేవారు,” అన్నాడు గంగాధరన్.

“అయినా ఆయన కవితలు రాశారు,” అని జాన్ చెప్పాడు.

“అలా పుంఖానుపుంఖంగా కవితలు రాసి రాశులు పోశాకే కదా, తానొక కవి కాదు అన్న జ్ఞానం వచ్చింది ఆయనకి,” అన్నాడు రామవర్మ.

“వ్యాసాలు రాసి, తానొక వ్యాసకర్తను కాదని తెలుసుకొన్నారు. వేదికల్లో మాట్లాడి మాట్లాడి ఉపన్యాసకుడిని కాదని తెలిసింది. ఒక పార్టీని ప్రారంభించి, తాను రాజకీయవేత్తని కానన్న జ్ఞానాన్ని పొందారు. పాపం పెద్దాయన జీవితమంతా జ్ఞానోదయం పొందుతూనే గడిపేశారు.”

తాగిన మద్యం కలిగించిన మిక్కిలి కోపంతో బాలన్, “మనమొక స్మృతి సంచికను తీసుకొని వస్తున్నాం,” అన్నాడు. “గొప్ప స్మృతి సంచిక. అసలైనది. దానిలో మనందరం రాస్తే చాలు,” అన్నారు.

“అందులో అతి ముఖ్యమైన ఆయన ఆలోచనలను సేకరించి వేద్దాం,” అన్నాడు రామవర్మ.

“నిజానికి ఆయనొక గొప్ప సంభాషణాకారుడు. ఆయన బలం సంభాషణే! ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ దారి తప్పి, భ్రమించి నిలచిపోయిన ఎమ్.కె. మన కాలానికి చెందిన మహామేధావి, చింతనాపరుడు. ఒక సిద్ధాంతంగా దాన్ని నిశితపరచి ఉంటే, ఒక పుస్తకంగా తెచ్చి ఉంటే, ఆయన శంకరులు, రామానుజులు, మాధ్వుల వరుసలో రావలసిన తత్త్వజ్ఞాని!” అన్నాడు జాన్.

“ఏం, వాళ్ళ గురువుగారు ఎమ్.ఎన్. రాయ్‌ని ఆ వరుసలోకి చేర్చవా?” అడిగాడు హమీద్.

“ఇదిగో చూడు. రాయ్ గొప్ప జ్ఞాని. మన గురువుకు గురువు. కానీ శుష్కజ్ఞాని. దార్శనికత అంటూ లేదు ఆయనలో. లోపల కవిత్వం లేనివారిలో దార్శనికత బయటపడదు. శంకరులు, రామానుజులు, మాధ్వులు గొప్ప కవులు. కవితలు రాయని కవుల్లో గొప్ప తత్త్వజ్ఞానులు కాగలరు.”

“మనమొక సంచికను తెద్దాం… ఆయన మనతో మాట్లాడిన వాటన్నిట్నీ అందులో రాద్దాం. అది, ఆయన తన జీవితాంతం ఏం సాధించాడన్న దాన్ని భవిష్యత్తుకి చాటుతుంది,” అన్నాడు చిత్రకారుడు బాలన్.

“ఒక్క పుస్తకమైనా రాయని, ఒక్క చింతనామార్గాన్నైనా స్థాపించని ఆ వ్యక్తి తన జీవితకాల సాధనగా, కొత్త ఆలోచనా తరంగాలను ఏర్పరిచారు. ఆయన ప్రభవంతోనే చిత్రలేఖనంలో, సాహిత్యంలో, చలనచిత్ర రంగంలో, రాజకీయ సిద్ధాంతాల్లో ఇన్నేసి మార్పులు వచ్చాయి. కేరళ జ్ఞాన సంపాదనలో క్రొత్తవైన అభివృద్ధి పథకాలన్నిటిలో ఆయనే నాందిగా ఉన్నారు.”

జాన్, “అవును. ఆయనను సి.ఐ.ఏ. గూఢచారి అని కూడా అన్నారు. మార్పును తెచ్చినవాడు అని కూడా అన్నారు. వక్రభాష్యకుడనీ అన్నారు. వ్యక్తిగత వాదాన్ని ప్రచారం చేస్తున్నాడన్నారు. ఈ రోజు ఆయన అందించిన సహకారం గురించి ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. ఆయన లేకుంటే మనకిప్పుడున్న ఈ ఆధునిక చింతన, తాత్త్వికతలే ఉండేవి కావు!” అన్నాడు.

రామవర్మ, “అది అక్షర సత్యం! కాని ఆయన మాట పిడుగుపాటువంటిది. కాస్త గందరగోళంగా మాట్లాడేటప్పుడు మాత్రం ఆయన తత్వం తారాస్థాయికి చేరుకుంటుంది. మనం ఆ గందరగోళాన్ని, సందిగ్ధతని మనలోకి ఎక్కించుకొని, ప్రశ్నించుకుని తెలివి తెచ్చుకుని మన దారుల్లో మనం నడిచాం. అలా ప్రశ్నించుకుని, ఆ ప్రశ్నలతోనే మన ఆలోచనలను పదును పెట్టుకున్నాం, మనవైన కళలను ఏర్పరచుకొన్నాం. ఈ రోజు మనం ఆయన సిద్ధాంతాలుగా జ్ఞాపకం తెచ్చుకొనేవన్నీ, ఆ సందిగ్ధతనుండి ఏర్పరచుకున్నవే అవుతాయి. అవే స్పష్టమైన ఆలోచనలు సిద్ధాంతాలుగా రూపుదిద్దుకున్నాయి. పద్ధతి ప్రకారం ముందుకు సాగడానికి లక్ష్యాలుగా మారాయి. ఆయన వాటిని స్పష్టంగా చెప్పలేదు. ఆయన చెప్పిన అస్పష్టమైన మాటలన్నీ, సంపూర్ణంగా మాయమయ్యాయి. ఎందుకంటే అవి విత్తనాలు కాబట్టి. మొలకెత్తిన తర్వాత విత్తనాలన్నవి మిగలవు. ఈ రోజున ఉన్న మొక్కలు, వృక్షాలు మాత్రమే ఆ బీజాలకు సాక్ష్యాలు,” వెనక్కి తిరిగి ఆ యువకుడిని చూపుతూ, “ఇదిగో! మూడవ తరం కూడా వచ్చింది, మనకు తెలియని దూరప్రదేశంనుంచి. మరొక భాషనుండి!” అన్నాడు.

టీ, సిగరెట్లు వచ్చాయి. ఆ సమయానికి అవి వారందరికీ అవసరం అనిపించాయి. అందరూ టీ తీసుకున్నారు. తమిళ యువకునితో జాన్, “టీ తీసుకో” అన్నారు. అతడు సిగ్గుతో “వద్దు” అన్నాడు. “తీసుకో! ఇక్కడ మొహమాటపడనక్కర్లేదు. ఇది ఎమ్.కె. బస చేసిన గది. ఆయన ఎవరికన్నా గొప్పా కాదు, తక్కువా కాదు. అందరికీ ఆయన ఎమ్.కె.నే!” అన్నాడు.

తమిళ యువకుడు టీ తీసుకున్నాడు. గంగాధరన్, “సిగరెట్ కావాలా?” అని అడిగాడు.

“అయ్యో,” అంటూ తమిళ యువకుడు తడబడినాడు.

జాన్, “కావాలంటే ‘రమ్’ కూడా తీసుకో. పాడై పోవడానికి కమ్యూనిజానికి తరువాత తాగుడే ఉత్తమమైన మార్గం,” అన్నాడు.

“వేదాంతం కూడా దానికి ఏమాత్రం తీసిపోయింది కాదు,” అన్నాడు గంగాధరన్.

“వేదాంతం కూడా హస్తప్రయోగంలాంటిదంతే. దానివల్ల ఏ సమస్యా లేదు. ‘అహం బ్రహ్మాస్మి’, మించిపోతే కనుచూపు మందగిస్తుంది అంటారు,” అన్నాడు రవీంద్రనాథ్.

“నాటు వైద్యశాలల్లో ఇచ్చే ‘మదనకల్ప లేహ్యం’ దానికి మంచిది. బోధేశ్వరం స్వామీజీ, ప్రతి నెలా ఒక కిలో తీసుకొంటున్నట్లు వినికిడి,” అన్నాడు గంగాధరన్.

వాళ్ళు సిగరెట్లను అంటించుకుంటున్నపుడు, ఎ.కె.ఎస్. బాబు, “నేను పోయిన ఆదివారం ముఖ్యమంత్రిని కలిశాను,” అన్నాడు. అందరూ ఆ మాటకై ఎదురు చూస్తున్నారని, అక్కడ నెలకొన్న మౌనం చెప్పింది. వారందరినీ ఒకసారి కలయజూసిన తరువాత, “ఎమ్.కె. మరణం గురించి అడిగారు,” అని చెప్పారు బాబు. “ఓ” అన్నాడు జాన్.

“ఏం జరిగింది? ఆరోజు ఎవరెవరు ఆయనను కలిశారు? వంటివి అడిగారు,” అన్నాడు బాబు.

గంగాధరన్ కోపంగా, “ఏం జరిగింది? ఆయన కుమార్తె వివాహం. ఆయనకు తెలిసిన వారందరూ వచ్చి ఉన్నారు. స్నేహితులు, శత్రువులు, అందరూ కలిశారు, మాట్లాడుకున్నారు, నవ్వుకున్నారు… బీడీలు కాల్చారు. వేరేమున్నది?” అన్నారు.

ఎ.కె.ఎస్ బాబు, “కాదు. ఆయన మనస్సుకు కష్టం కలిగేలా వేరే ఏమైనా జరిగిందా అని అడిగారు ముఖ్యమంత్రి,” అన్నాడు.

“చెప్పవలసింది కదా! సారాయి కాంట్రాక్టర్ల దయవలన, కమ్యూనిస్టు పార్టీ పాలనలో ఉన్నందువల్ల, ఆయన మనసు విరిగి ఉన్నారని,” అన్నాడు రవీంద్రనాథ్.

“మధ్యలో మాట్లాడొద్దు,” అన్నాడు హమీద్. “చెప్పు. ఆయన ఇంకేమైనా చెప్పారా?”

బాబు కొన్ని క్షణాల తరువాత, “స్పష్టంగా చెప్పలేదు. ఆయన ఉన్న స్థానంలో అలా కట్టె-కొట్టె-తెచ్చె అని మాట్లాడటం కుదరదు కదా? అయితే అటాప్సీ రిపోర్ట్ ఆయన చేతికి వచ్చి ఉంది. అందులో ఏదో ఉంది!” అన్నాడు.

“దాంతో ఆయన ఏం చేయబోతున్నారట?” అడిగాడు గంగాధరన్.

“ఏమీ చేయబోవడం లేదు. పూర్తిగా దర్యాప్తు చేయించినట్టున్నారు. సందేహించడానికి ఏమీ లేదు అని తెలిసిన తరువాత, దీన్ని పెద్దది చేయవద్దు అని చెప్పినట్టున్నారు.”

మళ్ళీ కొంతసేపు అక్కడ నిశ్శబ్దం!

మళ్ళీ బాబు అందుకుంటూ, “యాభైలలో, వారు ఎమ్.కె.గారి శిక్షణా తరగతులకు వచ్చారు. ఎమ్.కె. పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీలో మమేకమై ఉన్న రోజులవి. ‘ఆయనను నా ఉపాధ్యాయునిగానే భావించాను. నాకే కాదు, నేడు నాలాంటి ఎందరికో ఆయన గురువులాంటి వారు. కాబట్టి ఆయన పేరు శాశ్వతంగా అలానే జనాల మనసుల్లో నిలిచిపోవాలి. ఇటువంటి ఒక వార్త బయటకు వస్తే, ఆయన జీవితలక్ష్యం పూర్తిగా వ్యర్థమై పోతుంద’ని చెప్పారు” అన్నాడు.

గంగాధరన్ నిట్టూర్చాడు. హమీద్ బయలుదేరి వెళ్ళిపోవాలి అని మళ్ళీ సర్దుకుంటున్నాడు. కొంతసేపు ప్రశాంతత నెలకొన్నది. చిత్రకారుడు, “మరొక టీ చెప్పొచ్చు కదా?” అన్నాడు. రవీంద్రనాథ్ లేచి బయటకు వెళ్ళాడు.

“నేను అర్థం కాకనే అడుగుతున్నాను. ఇటువంటి వార్త బయటకు వస్తే, ఆయన జీవితసాధనలను లేకుండా అదెలా చేయగలదు?” అడిగాడు రామవర్మ.

హమీద్ కోపంతో, “జీవించడం కొరకే తాత్త్వికత! మరణించడానికి తాత్త్వికత అక్కరలేదు,” అన్నాడు. “బ్రతకడం తెలియని వారు చెప్పిన తాత్త్వికతకు విలువెక్కడిది? మరణించడానికి తత్త్వాలెందుకు?”

రామవర్మ నెమ్మదిగా, “జీవించడానికి కూడా తాత్త్వికత అవసరం లేదు. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే తాత్త్వికత అవసరం. మరణాన్ని అర్థం చేసుకోవడానికికూడా తాత్త్వికత అవసరమే. తాత్త్విక విచారణలో అర్థభాగం మరణాన్ని గూర్చినదే!” అన్నాడు.

ఏ మాత్రం కోపం తగ్గకనే హమీద్, “ఇదంతా నాతో చెప్పవలసిన అవసరం లేదు. కొంతకాలంగా ఇక్కడ అందరూ మాట్లాడేది, ఆత్మహత్యను గురించి మాత్రమే! నిజమైన తాత్త్విక ప్రశ్న ఆత్మహత్య మాత్రమే అన్నాడుగా కామూ? మరణించడం కూడా ఒక కళే అనేశాడు సిల్వియా ప్లాత్! ఈయన చెప్పొచ్చేదీ అంతేనా? ఇంక చెప్పడానికి కొత్తగా ఏమీ లేదు కదా? చూడబోతే, మొత్తంగా ఒక సమూహానికే మానసిక స్తబ్ధత, నరాల బలహీనతా వచ్చినట్టుంది! నేను అంతే చెప్పగలను,” అన్నాడు వగర్చుతూ!

రామవర్మ, “నేను చెప్పేది అది కాదు. మానసిక స్తబ్ధత, నరాల బలహీనత లేకుండా ఒక ఆత్మహత్య జరుగకూడదా ఏమిటి? బాగా ఆలోచించుకొని, ఒకానొక స్పష్టమైన మానసిక స్థితిలో తీసుకోబడిన ఒక మంచి ముగింపు. చేయవలసిందంతా చేయడం పూర్తి అయింది అని ఒకనికి తెలిసినప్పుడు, ఇక చేయాల్సినదేమీ లేదు అని స్పష్టమైనప్పుడు, శుభప్రదమైన ఒక ముగింపుగా అది జరగకూడదా ఏమిటి? నిజంగా తెలుసుకోవాలనే అడుగుతున్నాను!” అన్నాడు.

బాబు, “నిజానికి ఆ రోజు ఆయనే దీన్ని గూర్చి ఒక విధంగా నాతో చెప్పారు. ఆ రోజు గురువాయూరులో వివాహం తంతు ముగిసిన తరువాత మేడమీదికి వెళ్ళాం. చైత్రం సత్రంలో ఆయన గది. సాంగ్యాలన్నీ ముగిసినప్పుడు నేను, ఆయన మాత్రమే సత్రంలో మిగిలి ఉన్నాము. పెళ్ళికుమారుని తరపు వారు పెళ్ళికుమార్తెతోబాటు బయలుదేరి వెళ్ళిపోయారు. మిట్టమధ్యాహ్నం ఆ ఆచారం జరిగింది. దానికి ఒక గంట సమయం పట్టింది. అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని బయలుదేరి పోవడానికి అంత సమయం పట్టింది,” అన్నాడు బాబు.

“ఎమ్.కె. అలసిపోయున్నారు. మేడమీదకు వెళ్ళేటప్పుడు సురేన్ వెనకే వచ్చాడు. ఎప్పట్లాగే బాగా తాగి ఉన్నాడు. ‘మిస్టర్ ఎమ్.కె! ఐయాం సురేన్. సురేంద్రనాథ్, నాట్ సురేంద్రనాథ్ దత్త. నాట్ సురేంద్రనాథ్ బెనర్జీ. ఓన్లీ సురేన్…’ అన్నాడు. ఎమ్.కె. నాతో, ‘అతడికి ఏదైనా ఇచ్చి పంపు’ అన్నారు. నేను వంద రూపాయలు ఇచ్చాను. అతడు దాన్ని తీసికొని గట్టిగా, ‘డబ్బుతో నా నోటిని మూయించడం కుదరదు. మిస్టర్ ఎమ్.కె! హూ ఆర్ యూ? వాట్ ఆర్ యూ? యు అచీవ్డ్ వాట్? ఒకే, యూ ఆర్ గ్రేట్. అయితే నీవొక పెద్ద ఫెయిల్యూర్. యూ ఆర్ ఏ డిౙాస్టర్. యూ ఆర్ నథింగ్ బట్ ఏన్ ఎమ్టీ ఈగో… నీవేమీ చేయలేదు. నీవు రాసిందంతా చెత్త! నీవు తీసిన సినిమాను ఎవరూ చూడలేదు. నీవు తయారు చేసిన శిష్యుల్లో ఎవరికీ నువ్వు చెప్పిన విషయాల పట్ల విశ్వాసం లేదు. నువ్వు ప్రారంభించిన పార్టీని ఎన్‌సైక్లోపీడియాలో మాత్రమే వెదకాలి. హ..హ..హ..హ..’ అని నానా యాగీ చేశాడు.

“ఎమ్.కె. నాతో ‘మరో వంద రూపాయలివ్వు’ అన్నారు. మరొక వంద రూపాయలు చూడగానే సురేన్ ఎగబడి లాక్కున్నాడు. ‘వెరీ గుడ్. ఇక్కడే కదా ఉంటారు, నేను మళ్ళీ వస్తాను. నా స్నేహితులు కాచుకొని ఉన్నారు’ అని చెప్పి వెళ్ళిపోయాడు. గదిలోకి వెళ్ళగానే ఎమ్.కె. పంఖాను ఆన్ చేసుకుని మంచం మీద పడుకున్నారు. నేను, ‘మంచినీళ్ళు కావాలా?’ అని అడిగాను ‘ఔను’ అన్నారు. ‘తలనొప్పి మాత్ర కావాలి. ఉందా?’ అనడిగారు. ‘లేదు’ అన్నాను. ‘నా పెట్టెలో చిన్న బుడ్డీలో బి.పి.మాత్ర ఉంది. దాన్ని ఇవ్వు’ అన్నారు. నేనొక మాత్ర తీసి యిచ్చాను. దాన్ని మింగి, నీళ్ళు తాగి పడుకున్నారు. కొంతసేపట్లోనే సహజస్థితికి వచ్చేశారు.

జాన్ “మరుసటి రోజు ఆ మాత్రల బుడ్డి ఖాళీగా ఉందన్నారూ?” అని అడిగాడు.

హమీద్ “వాడు కలిగించిన దిగులువల్ల కావొచ్చా?” అన్నాడు.

“అతడు అలా మారి చాలా రోజులు అవుతూంది. ఆయన వాడిని పెద్దగా లెక్క చెయ్యలేదు,” అన్నాడు రవీంద్రనాథ్.

జాన్, “టీచర్ పోయినప్పుడు కొంచెం బాధపడ్డారు. కానీ అది కూడా ఒక్క నెల మాత్రమే! కూతురికి పెళ్ళి చేయాలని కూడా దిగులు పడలేదు. ఆమె తన వివాహాన్ని తనే నిర్ణయించుకుని చెప్పినప్పుడు కూడా, చాలా మామూలుగానే తీసుకున్నారు,” అన్నాడు.

గంగాధరన్ “కాని, ఆమె వివాహం చేసుకోవడం ఆయనకు ఒక రకంగా ఓదార్పు కూడా! పెళ్ళి జరిగిన రోజే ఆ ఓదార్పు ఆయన ముఖంలో కనిపించింది!” అన్నాడు.

హమీద్, “’ఆమె అత్తగారింటికి వెళ్ళిన తరువాత తనను చూసుకోవడానికి ఎవరూ లేరు,’ అని తలచారా ఏమిటి?” అనడిగాడు.

జాన్, “ఎవరు ఎవరిని చూసుకోవడం? ఆయన అలా ఆలోచించే వారు కారు. ఈ రోజువారీ లౌకిక భావోద్రేకాలతో వారికి సంబంధమే లేదు!” అన్నాడు.

గంగాధరన్, “ఆయన సంతృప్తిగానే ఉన్నారు. చిన్న చిన్న విషయాలు ఆయనను పెద్దగా బాధించ లేదు. ఆయన ఎప్పుడూ ఏదో ఒక పుస్తకంలోనో లేదా ఒక ఆలోచనలోనో పూర్తిగా మునిగి ఉండటాన్ని మాత్రమే చూశాను. ఒకసారి నేను ఒక నాటకం రిహార్సల్‌లో టి.ఎస్.నారాయణ మీనన్‌ను కొట్టానన్న విషయాన్ని గురించి చెప్పాను. దాన్ని ఆయన ఒక నిముషం మాత్రమే విన్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఆయన ప్రాధాన్యత ఇవ్వరు. ఆయన మనసు వెంటనే మాట్లాడుకొంటున్న విషయానికి మళ్ళింది. ఆయనకు ఇలాంటివేవీ దిగులు కలిగించేవి కావు!” అన్నాడు.

రవివర్మ, “ఆ రోజు ఆయన ఏమన్నారు?” బాబుని అడిగాడు.

“సురేన్ చెప్పిన దాన్ని గురించి అడిగారు. ఆయన జీవితానికి పరమార్థం ఏమిటని నేను ఏమి ఆలోచిస్తున్నానో చెప్పమని అడిగారు. ఆయన దగ్గర్నుండే ఆధునిక సాహిత్యం, కొత్త తరం సినిమా, మార్క్సిజంనుండి పరణమించి ముందుకి సాగాల్సిన రాజకీయ లక్ష్యం – ఇవన్నీ మొదలవుతున్నాయి అని అన్నాను నేను. ఆ మాటలు వారికి చాలా తృప్తిని కలిగించాయి.

“మామూలుగా ఎక్కువ మాట్లాడని ఆయన ఆరోజు మాట్లాడాలన్న మానసిక స్థితిలో ఉన్నారేమో, ఒక బీడీ ముట్టించుకుని దీర్ఘంగా పీల్చారు. ‘నువ్వు చెప్పేది వింటుంటే నాకు సంతోషంగా ఉంది. అయితే అలా ఒకరి కృషినో, అందుకున్న లక్ష్యాలనో, సహకారాన్నో బాహాటంగా నిర్ధారించి చెప్పడం వీలు కాదు. లెనిన్‌గూర్చిగానీ గాంధీనిగూర్చిగానీ అలా స్పష్టంగా చెప్పడానికి వీలు కాదు. కానీ వారు పోషించిన పాత్ర, అందించిన సహకారం ఎంతవరకు అన్నది స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది,’ అన్నారు. ‘అవతార పురుషులకు పుట్టుక అన్నది లక్ష్యం. రాక్షసుల పుట్టుకకు కూడా లక్ష్యం ఉంది. నేను అవతార పురుషుడినా, రాక్షసుడినా అన్నది తెలియదు. కానీ, పుట్టుకకు సార్ధకతగా నేను భావించిన దాన్ని సాధించాను. వెనక్కి తిరిగి చూస్తే, ఒక్క రోజును కూడా వ్యర్థపరచ లేదు అనుకుంటున్నాను. కాబట్టి సంపూర్ణమైన సంతృప్తితో ఉన్నాను,’ అన్నారు.

“కాసేపు మౌనంగా ఉండి, కొనసాగిస్తూ, ‘మళ్ళీ మళ్ళీ నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను. ఏదైనా తీరని కొరత ఉందా? ఏదైనా లోటు ఉన్నట్టు అనిపిస్తోందా అని? నా భ్రమలతో నేను ఏర్పరచుకున్న నమ్మకం కాదు కదా ఇదంతా? చాలాసార్లు ప్రశ్నించుకుంటున్నాను. ఒకే జవాబు! లేదు, ఏ విధమైన కొరతా లేదు. చేయగలిగినదంతా చేశాను. చేయవలసింది ఏ కొంచెం కూడా మిగిలి లేదు. ఇక నేను చేయడానికి అంటూ ఏమీ లేదు. ఇంకేమైనా చేయడం అంటే, చేసిన దాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉండాలి, జ్ఞాపకాలను కూర్చుకొంటూ ఉండాలి. అంతే! లేదా చేసిన వాటినే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉండాలి. అన్నీ వార్ధక్యపు చాదస్తాలే! ఇ.ఎమ్.ఎస్. అదే చేస్తున్నాడు. నేను కూడా అదే చేయాలి’ ఆయన ముఖం ధ్యానంలో ఉన్నట్లు అనిపించింది. బీడీ పొగను వదిలారు. అది ఆయన్నుండి సన్నని మేఘమాలికలా విడివడి గాలిలో కలిసిపోయింది.

“నేను, ‘అలా ఏమీ కాదు. ఇ.ఎమ్.ఎస్.ను ఈనాటికీ ఓడ కెప్టెన్ అనే అనాలి. చరిత్రలో నిలిచిపోయే పనిని కొనసాగిస్తూనే ఉన్నారు’ అన్నాను. ఆయన, ‘లేదు. అది ఒక భావన మాత్రమే! ఆయన చుట్టూ ఉన్న వారందరూ నటిస్తున్నారు. ఆ నటన వారికి కూడా అనుకూలమైనదిగానే ఉంది. మన మెత్తమీద మనమే పడుకొని, పడుకొని ఏర్పరచే పల్లంవంటిదే మనం చరిత్రలో ఏర్పరచే స్థానం కూడా. అది మనకు చాలా సౌకర్యమైనది, ఇష్టమైనది, మృదువైనది కూడా! దానిలో పడుకుని, చుట్టూ ఆవరించియున్న కాలాన్ని అర్థం చేసుకోకుండా, గడిచిన కాలాన్ని గురించి ఊహించుకుంటూ ఉండటమే చాలామంది చేసే పని. వృద్ధులు అటువంటి ఒక లోకాన్ని సృష్టించుకుంటారు. అటువంటి లోకాన్ని వారి దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా అనుభూతి చెందుతుంటారు. వారు కూడా ఆ లోకం లోనికి జొరబడి, దానిలో జీవించడం ప్రారంభిస్తారు. చివరిసారిగా ఇ.ఎమ్.ఎస్‌ను చూడడానికి వెళ్ళాను. ఆయన చుట్టూ యువకులు. అయితే వా‌రందరూ కూడా యాభై అరవైలలో జీవిస్తూ ఉన్నారు…’ అన్నారు.

“ఆయన ఏం చెప్పాలనుకొంటున్నారో నాకు అర్థం కాలేదు. ఆయన, ‘లేదా కనులు విప్పార్చి చుట్టూ చూడాలి. పండి, రాలి… చెట్టు క్రింద మనం పడి ఉన్నామన్న వాస్తవాన్ని నమ్మాలి. దానికి చాలా గొప్ప నిగ్రహం, శక్తి కావాలి. అది స్వయంగా చేసుకునే హింసలాంటిది. పశ్చాత్తాపమో, జాలో లేకుండా దాన్ని చేయగలమనుకుంటే మంచిది. కాని అది కర్మయోగులకు మాత్రమే సాధ్యమవుతుంది. బుద్ధిజీవులకు అది చేతకాదు. నేను కర్మయోగినికాను. కర్మయోగులైన పెక్కుమంది గాంధేయవాదులను, కమ్యూనిష్టులను నేనెరుగుదును. నేను వారిని పోలిన వాడిని కాను. నేను ఉత్తి బుద్ధిజీవిని మాత్రమే. అది నా వల్ల కాదు!’ అని అన్నారు.

“క్షణాల నిశబ్దం తర్వాత, ‘సామాన్య మానవుల వలన అవుతుంది అని అనుకున్నాను. కానీ వారి వలన కానేకాదు అని ఇప్పుడు అర్థం అవుతుంది. సామాన్యులు వృద్ధాప్యంలో వాపోతూనే ఉన్నారు. ఈ లోకం తమను విడిచి దూరంగా వెళ్ళిందన్న సత్యాన్ని భరించడమే వారికి చేతకాలేదు. కాబట్టే యువకులను బాధ పెడుతున్నారు. యౌవనవంతులుగా ఉండటమే తప్పని వాళ్ళు అనుకుంటున్నారు అనిపిస్తూంది. నవ్వులు, ఉత్సాహం… ఏదీ వాళ్ళకు నచ్చడం లేదు. యువకుల విజయాలను కూడా వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. అంతెందుకూ, రుచికరమైన భోజనాన్ని కూడా అసహ్యించుకుంటున్నారు. అయితే వారందరూ ఆ ఓర్వలేనితనాన్ని, ప్రేమవల్ల కలిగే అక్కర, లేదా భయం అని మార్చి చెప్పడానికి నేర్చుకుని ఉన్నారు.’ ఎమ్.కె. నవ్వి, ‘ఎక్కువ భాగం వృద్ధులు, యువకులను ఆక్షేపించేది, వాళ్ళను తిడుతుండేది, వాళ్ళు యువకులు అన్న ఒక్క కారణంవల్ల మాత్రమే…’ అన్నారు.

“నవ్వు ఆపి, ‘వృద్ధాప్యంతో పరిణతి చెంది, సంతోషంగా ఉన్న ఒక్క సామాన్యుడినయినా నేను చూడలేదు. అలా ఒకరు ఉండటం అసంభవం కూడా. ముసలితనంలో పరిణతిని పొందాలంటే జీవితం మొత్తాన్ని ఒక యోగంగా మార్చుకొని జీవించి ఉండాలి… తెలివి కూడా ఒక యోగం కావొచ్చు. దాన్ని జ్ఞానయోగమంటారు. తెలివి యోగంలా మారాలి అంటే, అది దేన్నీ ఆశించని కర్మాచరణకు పాల్పడాలి. ఏ లాభాన్నీ ఆశించని ప్రయత్నంగా ఉండాలి. ప్రకృతి పోకడల్లా ప్రాపంచిక విధులతో కలగలిసి జరగాలి. బుద్ధిజీవులకు ఆ పని సాధ్యం కాదు. అతడు చేసేవన్నీ లాభాన్ని ఆశించిన పనులు మాత్రమే! ఒక లక్ష్యం వైపు సాగే ప్రయాణాలు మాత్రమే.’

ఆయన అలసిపోయి ఉన్నారని అనుకున్నాను. “మీరు రేకెత్తించిన తాత్త్విక భావనలు ఇంకా అభివృద్ధి చెందలేదని అనుకుంటున్నారా? భవిష్యత్తులో అవి మాయమైపోతాయని అనుకుంటున్నారా?” అని అడిగాను.

“ఆయన నాకేసి చూసి, ‘కాదు అనే కదా చెప్పాను. అయితే అవి ఎవరి ఆలోచనలైనా ఒక చిన్న భాగం మాత్రమే మొలకెత్తి వ్యాపి చెందుతాయి. అలా మొలకెత్తినవి నావి కావు. అవి వాళ్ళ లోలోపలే ఉండి ఉంటాయి. మొలకెత్తకుండా ఉన్నవి మాత్రమే నా దగ్గర మిగిలి ఉంటాయి’ అని నిట్టూర్చి… క్షణం ఆగి, ‘నేను ఏం చెబుతున్నానని నాకే స్పష్టత లేదు. ఇలా చెప్తున్నానంతే. తాత్త్వికచింతనల ఆయువుకన్నా మనిషి ఆయువు దీర్ఘమైనది. కాబట్టి ఎక్కువ ఆయువును కలిగియున్న మనిషి తన ఆలోచనల మరణాన్ని తాను చూచే తీరాలి.’

హమీద్, “ఆయనకు పోయిన మే నెలకు అరవై తొమ్మిదేళ్ళు మాత్రమే వచ్చాయి,” అన్నాడు. అందరూ తిరిగి హమీద్ వైపు చూడగా కొంచెం తగ్గి, చూపులను బయటనున్న మామిడి చెట్టుపై నిలిపి తాను నిశ్శబ్దం అయ్యాడు.

బాబు, “ఆయన మాట్లాడింది మొత్తం స్పష్టంగా గుర్తుంది. సాధారణంగా ఇటువంటి మాటల సందర్భంలో నాలో ఉన్న పాత్రికేయుడు మేల్కొంటాడు. దీన్ని నేను భవిష్యత్తరానికి చెప్పబోతున్నానని అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు నేను నా గదికి వెళ్ళగానే, అన్నిటిని డైరీలో రాసిపెట్టాను. దాన్ని రెండుసార్లు చదివాను. కనుక అన్ని మాటలూ అట్టే జ్ఞాపకం ఉన్నాయి” అన్నాడు.

రామవర్మ, “ఉమ్” అన్నాడు.

బాబు “ఆయన ముఖం సంతృప్తితోనూ, ప్రశాంతంగానూ ఉన్నట్లే తోచింది,” అన్నాడు.

“ఎమ్.కె పైకప్పుకేసి చూస్తూ బీడీ పొగ వదిలి, ‘ఏ రకంగా ఆలోచించినా నేను సంతృప్తి చెందాననే అనిపిస్తున్నది. మిగిలేవి ఏ ప్రయోజనం లేని ఒక శరీరం, అనవసరమైన కొన్ని జ్ఞాపకాలు, అర్థం కోల్పోయిన కొన్ని ఆలోచనలు మాత్రమే… విజయాన్ని సంపూర్ణం చేసుకోవాలని, నేనే నా విజయంలో మచ్చలు ఏర్పరచుకోరాదని కూడా అనిపిస్తూ ఉంది’ అని అన్నారు. ‘దాన్ని మీరెలా చేయగలరు?’ అని అడిగాను. ‘నేను పి.సి. జోషిని చివరి రోజుల్లో ముంబై కమ్యూనిష్టు ఆఫీసులో కలిశాను. అప్పుడు అక్కడ ఉన్న ఆయన, ఎంతో గొప్ప పేరుగాంచిన భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ ప్రారంభదశ నాయకులలో ఒకరు కారు. అలసిపోయిన ముదుసలి. చేతులు వణుకుతూ, కమ్యూనిజాన్ని క్రింద పడేసి ముక్కలు చేయగల వారిలా అనిపించారు.’

“నేను మరికొంతసేపు మాట్లాడుతూ ఉన్నాను. ‘బీడీ తీసుకురావడం కుదురుతుందా?’ అనడిగారు. తీసుకుని వచ్చి ఇచ్చాను. రాత్రి భోజనానికి అరటి పళ్ళు కావాలని అడిగారు. అవి కూడా తీసుకుని వచ్చి ఇచ్చాను. ‘నేను వెళ్ళవచ్చా?’ అనడిగితే, ‘పోవచ్చు’ అన్నారు. ‘గురువాయూరులో థామస్ కురియన్‌కు గెస్ట్‌హౌస్ ఒకటి ఉంది. నేను ఆ రోజుల్లో ఈ గురువాయూరు వస్తే అందులోనే ఉండేవాడిని’ అన్నారు. ‘తెలుసు’ అన్నాను. ‘కురియన్ దాన్ని కొట్టివేసి కళ్యాణమండపం కట్టేశారు’ అన్నారు. ఆ మాట ఎందుకు చెప్పారో అర్థం కాలేదు. వారినుండి సెలవు తీసుకున్నాను. మా అక్కవాళ్ళ ఇల్లు అక్కడికి సమీపంలోనే ఉంది. అక్కడికి వెళ్ళి నిద్రపోయి, తెల్లవారుఝామున లేచేటప్పటికి వార్త వచ్చేసింది.

అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. టీ వచ్చింది. వాళ్ళు మళ్ళీ టీ తాగారు. హమీద్ తనకు టీ వద్దని చెప్పాడు. తమిళ యువకుడు తానే టీ తీసుకొని గబగబా తాగాడు. అతడి చేతులు వణుకుతూ ఉన్నాయి. హమీద్, “మనం దీన్ని గురించి ఎవరితోనూ మాట్లాడవద్దు” అన్నాడు. “నువ్వు భయపడుతున్నావు. నీ మతగ్రంథంలో నరకానికి వెళ్ళు దారి అది అని చెప్పబడి ఉంది,” అన్నాడు రవీంద్రనాథ్. హమీద్ కోపంగా, “ఉండనీయండి. దేన్నైనా ఎదుర్కోలేకపోయే స్థితి పిరికితనమే అవుతుంది,” అన్నాడు.

“ఆయన దేన్ని ఎదుర్కోలేదు చెప్పు? ఏనాడైనా దేనికైనా భయపడ్డారా? అలా భయపడుతున్నట్టు కనిపించారా? రాజకీయ పోరాటాలను, చెరసాలను, కడు పేదరికాన్ని ఎదిరించి నిలిచారు. డబ్బు లేకుండా ఆయన అల్లాడిన రోజులున్నాయి కదా? అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు, బయట ఏ పట్టూ లేకున్నా, పార్టీని వీడిచిపెట్టి వచ్చారు. స్నేహితులను కోల్పోయి, అవమానాలపాలై, నిందలపాలై, ఒంటరిగా జీవించారు. స్నేహితులే ఆయనమీద దాడులు చేశారు, అప్పుడూ ఆయన జంకలేదు. ఆయనకు హత్యాబెదిరింపు ఇరవై యేళ్ళ కాలంపాటు ఉంది. దేనికీ ఆయన భయపడింది లేదు. ఆయన పిరికివారు కారు. ఆయనను పిరికివారు అని చెప్పే స్థాయికి మనం ధైర్యమున్నవారం కాము,” అన్నాడు రవీంద్రనాథ్.

హామీద్ “అలాగైతే దీన్ని కూడా అదే విధంగా ఎదుర్కొని ఉండవచ్చు కదా!” అన్నాడు.

“నువ్వు మళ్ళీ మళ్ళీ దాని గురించే మాట్లాడుతున్నావు. ఇది ఆయన ఓటమి కాదు. ఆయన సాధించిన విజయం. ఇక్కడ కూడా పూర్తిగా తర్కప్రాధాన్యంతో తీర్మానించుకోవడం ఆయనకు చేతనైంది. ఎటువంటి భావావేశసందిగ్ధత కానీ, క్లిష్టత కానీ లేకుండా ఉండగలిగారు. ఆయన జీవితాంతం చెప్పింది ఈ విషయాన్నే. ఆయన పూర్తిగా సమ్యక్ దృక్పథాన్ని కలిగినవారు. కనుకనే తత్త్వజ్ఞాని. ఇక్కడ ఆ అలవాటు ఉంది. జైనులు ఉపవాసముండి ప్రాణత్యాగం చేస్తారు. హిందువులు గంగానదిలో మునిగి జలసమాధి అవుతారు,” అన్నాడు బాలన్.

హమీద్ వణుకుతున్న కంఠస్వరంతో గట్టిగా, “రైలు క్రిందపడి చనిపోయే మాజీ నక్సలైట్లు, అస్తిత్వాన్ని గూర్చి మాట్లాడుతూ గంజాయి తాగి చనిపోయే నిరుద్యోగ పట్టభద్రులూ… అందరూ తత్త్వజ్ఞానులే కదా,” అనడిగాడు.

“వాళ్ళు వేరే! నీకు అర్థం కావడం లేదు” అంటూ రవీంద్రనాథ్ పైకి లేచి, తన సంచిని తీసుకొని “సరే! నేను బయలుదేరుతాను. నాకు ఆలువాలో ఒక చిన్న పని ఉంది. మీరే చర్చించి తీర్మానించండి. మీరు ఏం చెప్తే నేను అదే చేస్తాను,” అని ముగించాడు.

చిత్రకారులు బాలన్, “ఏదేమైనా మనమొక మంచి స్మృతి సంచికను తీసుకొని వస్తున్నాము. అన్ని రంగాలలోనూ ఆయన సాధించిన విజయాలన్నీ ఒక్క చోట పొందుపరుద్దాం,” అన్నాడు.

గంగాధరన్ కూడా “అవును, ఆ పని చేద్దాం,” అన్నాడు.

రామవర్మ పైకి లేచి, “నేనూ వెళ్ళాలి. ఎ.జి.ఎస్‌.ను కలుస్తానని చెప్పాను,” అన్నాడు.

“నేను చివరిగా ఒకటి అడుగుతున్నాను. ఈ విషయాన్ని మనం మనస్పూర్తిగా అంగీకరించలేకపోతున్నాం కదా? నిజం చెప్పండి!” అన్నాడు హమీద్.

రవీంద్రనాథ్, “ఔను. నిజం చెప్పాలంటే ఇంచుమించు అంతే” అన్నాడు.

చిత్రకారుడు బాలన్ “నేను ఆయన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను,” అన్నాడు.

రామవర్మ, “మనం మనల్నే అక్కడ పెడుతున్నాము. వెనక్కి తిరిగి చూస్తే మనం మన జీవితాల్లో సంపూర్ణత్వాన్ని పొందలేదు. కాబట్టి భవిష్యత్తుని ఊహించుకుంటున్నాము. మనం యాభై యేళ్ళ వాళ్ళమే అయినప్పటికీ, మనకు ఇంకా భవిష్యత్తు మాత్రమే మన నిజమైన బలం, శక్తి బయల్పడే చోటు, మన సాధనలను ఏర్పరచుకొనే రంగస్థలం అని అనుకుంటున్నాము. భవిష్యత్తును గూర్చి కలలు కనే వారికి మాత్రమే ఇదంతా భయాన్ని కలిగిస్తూ ఉంటుంది,” అన్నాడు.

“మూర్ఖత్వం,” హమీద్ అరిచాడు. “కావొచ్చు… ఇలా చెప్తే మీరు ఏమంటారో చూద్దామని మాత్రమే చెప్పాను,” అన్నాడు రామవర్మ.

“అదే కదా ఎమ్.కె పద్ధతి! మాటలు విసిరి లోలోపల దాగున్న ఆంతర్యాన్ని రాబట్టడం. ఆలోచనల్ని రేకెత్తించడం,” అన్నాడు రవీంద్రనాథ్.

హమీద్, “ఎమ్.కె. అటువంటి వారు కాకుంటే, మన ముందు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇన్ని చిక్కుప్రశ్నలు తలెత్తి ఉంటాయా? ఆయన ఇన్నాళ్ళుగా చెప్పిన దానికి, చేసిన దానికి ఇది ఎలా పొసగుతుంది అన్నదే కదా మన సమస్య?” అన్నాడు.

రామవర్మ, “ఔను. అదే సమస్య. కాని నాకు ఇక్కడినుండి మొదలుపెట్టి వెనక్కి వెళ్ళడమే మంచిదని అనిపిస్తుంది,” అన్నాడు. హమీద్ తల ఊపారు.

రామవర్మ, తమిళ యువకుని వైపు తిరిగి, “వెళదామా?” అనడిగాడు.

జాన్ అతడితో, “నీకు ఒంట్లో బాగా లేదా?” అని అడిగాడు.

“అదేం లేదు,” అని అతడు లోగొంతుతో చెప్పాడు.

“మరి ఎందుకు వణుకుతున్నావు?” అడిగాడు జాన్.

అతడు తల మాత్రం ఊపాడు.

“రా” అన్నట్లు రామవర్మ నడవగా, అతడు వెనకే వెళ్ళాడు. వాళ్ళు మెట్లు దిగి వెళుతున్న శబ్దం వినిపించింది. రామవర్మ, కింద ఆ గెస్ట్‌హౌస్ యజమాని ముస్తఫాతో ఏదో మాట్లాడుతూ నవ్వుతున్న శబ్దం వినిపించింది.

హమీద్ “స్మృతి సంచిక అంటే అందులో రెండు భాగాలు ఉండవచ్చు. ఒకటి ఆయనను గూర్చి ఇతరులు వ్రాసేవి, రెండోది ఆయన మాటల సంగ్రహరూపం,” అన్నాడు.

“అలాగైతే రెండు భాగాలుగా ప్రచురించవచ్చు,” అన్నాడు చిత్రకారుడు బాలన్.

“స్మృతి సంచిక విడిగా ఉండనివ్వండి. ఆయన రచనలనుంచి ఎంపిక చేసిన ఒక సంకలనం వేరేగా తీసుకురావచ్చు. ‘రీడర్’ అంటారు కదా, అలాంటిదొకటి,” అన్నాడు జాన్.

హమీద్ నిట్టూర్చి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.


Tamil Version Website Link: https://www.jeyamohan.in/130035/ (ఎణ్ణ ఎణ్ణక్ కుఱైవదు)


జయమోహన్

రచయిత జయమోహన్ గురించి:

జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దం పట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.

 ...