ఊరుభంగం – సమూలానువాదం: 2

పూర్వరంగం

కథాసంగ్రహం, పాత్రలు

ఇక్కడ చూడండి

మరికొన్ని విశేషాలు

  1. విష్కంభకంలో బీభత్సమూ, రౌద్రమూ ప్రధానరసాలైతే, నాటకంలోని ఈ భాగంలో కరుణరసం ఎక్కువగా ప్రవహిస్తుంది; ఆ తరువాతి ప్రాధాన్యం వీరరసానికి.
  2. ఈ ఘట్టంలో పాండవులూ కృష్ణుడూ కనిపించరు. ఇందులో వచ్చే దుర్యోధనుడి భార్యలూ, కుమారుడూ మహాభారతంలోని పాత్రలు కారు.
  3. నాటకం విషాదాంతమవడం, రంగస్థలంపై మరణాన్ని ప్రదర్శించడం భారతీయనాటకసంప్రదాయానికి ఎదురీతే అని చెప్పాలి.
  4. భాసకృతాలైన దూతవాక్యం, దూతఘటోత్కచం నాటకాలకు భిన్నంగా ఈ నాటకంలో కనబడే దుర్యోధనుడు దుష్టుడు కాడు. అతడి దౌష్ట్యం అతడి పశ్చాత్తాపప్రకటనలోనే ఉంటుంది. పాత్ర చిత్రణలో, ఇతర పాత్రలు తనతో వ్యవహరించే తీరులో దుర్యోధనుడిపట్ల నాటకరచయిత స్పష్టమైన సానుభూతిని ప్రదర్శిస్తాడు. ఈ చిన్న నాటకం పరిధిలో దుర్యోధనుడి యుద్ధవైముఖ్యాన్ని, తల్లిదండ్రులపట్ల భక్తిని, స్వాభిమానాన్ని, కౌటుంబికప్రీతినీ చక్కగా ఆవిష్కరిస్తాడు, భాసుడు. ముఖ్యంగా తన కుమారుడితో మాట్లాడుతున్న సందర్భంలో, ఆ దుఃఖాన్ని అంటుకొని ఒక లాలిత్యం ఉంటుంది.
  5. దర్పాన్ని, కోపాన్ని, వీరత్వాన్ని ప్రకటించాల్సిన సందర్భాలలో ప్రధానంగా శార్దూలవిక్రీడితవృత్తాన్ని ఎంచుకున్నాడు, నాటకరచయిత. కరుణరసాన్ని ఒలికించాల్సిన చోట అనుష్టుప్, ఉపజాతివంటి చిన్న వృత్తాలను ఎంచుకున్నాడు. పసివాడైన దుర్జయుడితో ఇతర పాత్రలు మాట్లాడే సందర్భాలలో వాక్యాలు చాలా చిన్నగా ఉండడం ఇంకో విశేషం.
  6. తాను పోయాక తర్పణజలాలనివ్వడం కోసమైనా పాండవులు బ్రతికి ఉండాలంటాడు, దుర్యోధనుడు. యుధిష్ఠిరుడు జలప్రదానం చేస్తున్నప్పుడు, దుర్జయుడు తన భుజాన్ని తాకుతూ కూర్చోవాలని చెబుతాడు. తర్పణం ఇచ్చేందుకు తన నూరుగురు కొడుకుల్లో ఎవరూ మిగలలేదని వాపోతాడు దుర్యోధనుడు. మరణానంతరజీవితాన్ని మనవారు ఎంతగా పట్టించుకునేవారో తెలియజేస్తాయి ఈ ప్రస్తావనలు.
  7. దుర్యోధనుడితో తాను సహగమనం చేస్తానని మాలవి చెప్పినప్పుడు, ఎవ్వరూ హాహాకారాలూ, ఆహాకారాలూ చేయరు. అదేదో అంత చిన్న విషయమైనట్లు దాటుకొని పోతారు.
  8. దుర్యోధనుడి అంతిమక్షణాలలో తన పితరులు, కర్ణుడు, సోదరశతమూ, ఐరావతపు శిరోభాగాన కూర్చున్న బాలాభిమన్యుడూ తన కళ్ళ ముందు కదలాడుతారు. ఆ వెంటనే, వీరస్వర్గం పాకేజీలో భాగమైన ఊర్వశి మొదలైన అప్సరసలూ కనబడడం Déjà Vu భావాన్ని కలిగిస్తుంది.
  9. చివరి శ్లోకంలోని తొలి రెండు పాదాలను తనవిగా చేసుకొని ధృతరాష్ట్రుడు అడవికి వెళ్ళిపోతాడు. ధనుర్బాణాలతో బాటు మూడో పంక్తిని పట్టుకొని అశ్వత్థామ సౌప్తికపర్వం కథలోకి వెళ్ళిపోతాడు. మిగిలిపోయిన చివరివాక్యాన్ని బలరాముడు భరతవాక్యంగా మలిచి నాటకాన్ని ముగిస్తాడు.
  10. ఈ నాటకానికి చిలకమర్తి లక్క్ష్మీనరసింహంగారి అనువాదం ఇక్కడ లభిస్తుంది. దీపాల పిచ్చయ్యశాస్త్రిగారూ అనువదించారట. ఆ అనువాదం ఆన్లైన్లో దొరకలేదు.




(తతః ప్రవిశతి బలదేవః।)

బలదేవః:
భో భోః పార్థివాః! న యుక్తమిదమ్।

మమ రిపుబలకాలం లాఙ్గలం లఙ్ఘయిత్వా
రణకృతమతిసన్ధిం మాం చ నావేక్ష్య దర్పాత్।
రణశిరసి గదాం తాం తేన దుర్యోధనోర్వోః
కులవినయసమృద్ధ్యా పాతితః పాతయిత్వా ।। 27 ।।

భో దుర్యోధన! ముహూర్తం తావదాత్మా ధార్యతామ్।

సౌభోచ్ఛిష్టముఖం మహాసురపురప్రాకారకూటాఙ్కుశం
కాలిన్దీజలదేశికం రిపుబలప్రాణోపహారార్చితమ్।
హస్తోత్క్షిప్తహలం కరోమి రుధిరస్వేదాద్ర్రపఙ్కోత్తరే
భీమస్యోరసి యావదద్య విపులే కేదారమార్గాకులమ్ ।। 28 ।।


(బలరాముడు ప్రవేశిస్తాడు)
బలరాముడు:
ఓ రాజులారా! తగదిది.

శత్రువుల సైన్యానికి యమసమానమైన నాగలిని లెక్కచేయకుండా, గర్వం కొద్దీ, యుద్ధనియమాలు అతిక్రమించి, నన్నూ నిర్లక్ష్యం చేసి, రణరంగంలో దుర్యోధనుడిని తొడలపై గదాప్రహారం చేసి, కుల-వినయ-సమృద్ధులతో సహా నేలకూల్చాడు.

ఓ దుర్యోధనా, కొద్దిసేపు ప్రాణాలను నిలిపి ఉంచుకో.

సాల్వుడి సౌభపురాన్ని రుచి చూసిన మొన కలిగినది, మహా-అసురుల నగరాల ప్రాకారద్వారాలకు అంకుశం వంటిది, యమునానది ప్రవాహగతిని మరల్చినది, శత్రుబలాల ప్రాణాల కానుకచేత పూజించబడ్డది అయిన ఈ నాగలితో, నేడు, రక్తమూ, చెమటల బురదతోనున్న భీముడి విశాలమైన వక్షస్థలాన్ని పంటపొలంవలె దున్నివేస్తాను.


(నేపథ్యే)
ప్రసీదతు ప్రసీదతు భగవాన్ హలాయుధః।

బలదేవః:
అయే ఏవం గతోఽప్యనుగచ్ఛతి మాం తపస్వీ దుర్యోధనః। య ఏషః,

శ్రీమాన్ సంయుగచన్దనేన రుధిరేణాద్ర్రానులిప్తచ్ఛవి-
ర్భూసంసర్పణరేణుపాటలభుజో బాలవ్రతం గ్రాహితః।
నిర్వృత్తేఽమృతమన్థనే క్షితిధరాన్ముక్తః సురైః సాసురై-
రాకర్షన్నివ భోగమర్ణవజలే శ్రాన్తోజ్ఝితో వాసుకిః ।। 29 ।।


(తెర వెనుకనుంచి)
భగవన్ బలరామా! శాంతించండి.
బలరాముడు:
అయ్యో! ఈ దశలోనూ నన్ను అనుసరిస్తున్నాడు, దీనుడైన దుర్యోధనుడు. ఇతడు –

రక్తమనే యుద్ధచందనపు మైపూత తడితో మెరుస్తూ ఉన్నాడు. భూమిపై పాకుతూ దుమ్ము అంటి ఎరుపు చాయకు తిరిగిన తెల్లని భుజాలతో బాల్యదశను పొందినవాడు, అమృతమథనం పూర్తయ్యాక, సురాసురులు మందరపర్వతంనుంచి విడిపించాక, అలసటతో తన శరీరాన్ని సముద్రజలాలలోనికి ఈడ్చుకుపోతున్న వాసుకిలా ఉన్నాడు.


(తతః ప్రవిశతి భగ్నోరుయుగలో దుర్యోధనః।)

దుర్యోధనః:
ఏష భోః!

భీమేన భిత్వా సమయవ్యవస్థాం
గదాభిఘాతక్షతజర్జరోరుః।
భూమౌ భుజాభ్యాం పరికృష్యమాణం
స్వం దేహమర్ధోపరతం వహామి ।। 30 ।।

ప్రసీదతు ప్రసీదతు భగవాన్ హలాయుధః।

త్వత్పాదయోర్నిపతితం పతితస్య భూమా-
వేతచ్ఛిరః ప్రథమమద్య విముఞ్చ రోషమ్।
జీవన్తు తే కురుకులస్య నివాపమేఘా
వైరం చ విగ్రహకథాశ్చ వయం చ నష్టాః ।। 31 ।।


(తొడలు విరిగిన దుర్యోధనుడు ప్రవేశిస్తాడు)
దుర్యోధనుడు:
ఇదిగో –

యుద్ధనియమాన్ని ఉల్లంఘించిన భీముడి గదాప్రహారం వలన గాయపడి శిథిలమైన తొడలతో ఉన్న నేను సగం చచ్చి ఉన్న నా దేహాన్ని భుజాలతో ఈడుస్తున్నాను.

పూజ్యులైన బలరాముడు శాంతించు గాక.

నేల కూలి ఉన్న నేను నా ఈ శిరస్సును మీ పాదాల మ్రోల వాలుస్తున్నాను. వెంటనే మీ కోపాన్ని విడిచిపెట్టండి. శత్రుత్వమూ, కలహపు కథా, మేమూ నశించిపోయాము. కురువంశానికి తర్పణజలం ప్రదానం చేయగల మేఘాలవంటి ఈ పాండవులు సజీవంగా ఉండెదరుగాక.

బలదేవః:
భోః దుర్యోధన! ముహూర్తం తావదాత్మా ధార్యతామ్।

బలరాముడు:
ఓ దుర్యోధనా! కొద్దిసేపు నీ ప్రాణాలను నిలబెట్టుకో.

దుర్యోధనః:
కిం భవాన్కరిష్యతి।

దుర్యోధనుడు:
ఏమి చేయనున్నారు?

బలదేవః:
భో శ్రూయతామ్,

ఆక్షిప్తలాఙ్గలముఖోల్లిఖితైః శరీరై-
ర్నిర్దారితాంసహృదయాన్ముసలప్రహారైః।
దాస్యామి సంయుగహతాన్సరథాశ్వనాగాన్
స్వర్గానుయాత్రపురుషాంస్తవ పాణ్డుపుత్రాన్ ।। 32 ।।

బలరాముడు:
వినవోయీ!

నా నాగలి అంచుతో ఈ పాండవుల దేహాలపై చారికలను ఏర్పరిచి, నా రోకలి దెబ్బలతో మూపులను, రొమ్ములను చీల్చి, యుద్ధంలో చంపివేయబడ్డ రథాశ్వాలతో, గజాలతో సహా వారిని నీ వెంట స్వర్గయాత్రకు పంపుతాను.

దుర్యోధనః:
మా మా భవానేవమ్।

ప్రతిజ్ఞావసితే భీమే గతే భ్రాతృశతే దివమ్।
మయి చైవం గతే రామ! విగ్రహః కిం కరిష్యతి।। 33 ।।

దుర్యోధనుడు:
వద్దు, వద్దు. మీరు అట్లా చేయకండి.

భీముడి ప్రతిజ్ఞ నెరవేరింది. నా నూరుగురు సోదరులు స్వర్గస్థులైనారు. నేనూ గతించనున్నాను. ఇంకా కలహం ఎందుకు?

బలదేవః:
మత్ప్రత్యక్షం వఞ్చితో భవానిత్యుత్పన్నో మే రోషః।

బలరాముడు:
నా కంటి ఎదుట నీవు వంచించబడ్డందుకే నాకు ఈ క్రోధం.

దుర్యోధనః:
వఞ్చిత ఇతి మాం భవాన్ మన్యతే।

దుర్యోధనుడు:
నేను వంచించబడ్డానని మీరనుకుంటున్నారా?

బలదేవః:
కః సంశయః।

బలరాముడు:
సందేహమా?

దుర్యోధనః:
హన్త భో! దత్తమూల్యా ఇవ మే ప్రాణాః। కుతః

ఆదీప్తానలదారుణాజ్జతుగృహాద్బుద్ధ్యాత్మనిర్వాహిణా
యుద్ధే వైశ్రవణాలయేఽచలశిలావేగప్రతిస్ఫాలినా।
భీమేనాద్య హిడిమ్బరాక్షసపతిప్రాణప్రతిగ్రాహిణా
యద్యేవం సమవైషి మాం ఛలజితం భో రామ! నాహం జితః ।। 34 ।।

దుర్యోధనుడు:
అలా కాదు, ఆర్యా. నా ప్రాణాలకు సరైన మూల్యమే చెల్లించబడింది. ఎలాగంటే –

దారుణమైన అగ్నిలో దగ్ధమవుతున్న లక్క ఇంటినుండి బుద్ధికుశలతతో ప్రాణరక్షణ చేసుకున్నవాడూ, కుబేరుడి అలకాపురిలో జరిగిన యుద్ధంలో వేగంగా కొండరాళ్ళను విసిరినవాడూ, రాక్షసరాజైన హిడింబుడి ప్రాణాలను కొల్లగొన్నవాడూ అయిన భీముడు నన్ను ఈనాడు ఈవిధంగా వంచనతో ఓడించాడంటే, బలరామా, నేను ఓడిపోలేదనే అర్థం చేసుకోవాలి నీవు.

బలదేవః:
భీమసేన ఇదానీం తవ యుద్ధవఞ్చనాముత్పాద్య స్థాస్యతి।

బలరాముడు:
యుద్ధంలో నిన్ను వంచించిన భీమసేనుడు ఇప్పుడు జీవించి ఉండగలడా?

దుర్యోధనః:
కిం చాహం భీమసేనేన వఞ్చితః।

దుర్యోధనుడు:
నేను భీమసేనుడిచే వంచితుణ్ణయ్యానా?

బలదేవః:
అథ కేన భవానేవంవిధః కృతః।

బలరాముడు:
మరి నిన్ను ఈవిధంగా వంచించినదెవరు?

దుర్యోధనః:
శ్రూయతామ్,

యేనేన్ద్రస్య స పారిజాతకతరుర్మానేన తుల్యం హృతో
దివ్యం వర్షసహస్రమర్ణవజలే సుప్తశ్చ యో లీలయా।
తీవ్రాం భీమగదాం ప్రవిశ్య సహసా నిర్వ్యాజయుద్ధప్రియ-
స్తేనాహం జగతః ప్రియేణ హరిణా మృత్యోః ప్రతిగ్రాహితః ।। 35 ।।

దుర్యోధనుడు:
వినండి.

పారిజాతవృక్షంతో సహా ఇంద్రుడి గర్వాన్ని హరించినవాడూ, వేయి దేవతాసంవత్సరాలపాటు యోగమాయతో నీటిలో నిద్రించినవాడూ, లోకానికంతా ప్రీతిపాత్రుడైనవాడూ అయిన ఆ హరియే భయంకరమైన భీముడి గదలో ప్రవేశించి, కపటరహితమైన యుద్ధాన్ని ఇష్టపడే నన్ను, హఠాత్తుగా, మృతువుకు అప్పజెప్పాడు.


(నేపథ్యే)
ఉస్సరహ ఉస్సరహ అయ్యా! ఉస్సరహ।
ఉత్సరతోత్సరతార్యాః! ఉత్సరత।

బలదేవః:
(విలోక్య) అయే అయమత్రభవాన్ ధృతరాష్ట్రః గాన్ధారీ చ దుర్జయేనాదేశితమార్గోఽన్తఃపురానుబన్ధః శోకాభిభూతహృదయశ్చకితగతిరిత ఏవాభివర్తతే। య ఏషః,

వీర్యాకరః సుతశతప్రవిభక్తచక్షు-
ర్దర్పోద్యతః కనకయూపవిలమ్బబాహుః।
సృష్టో ధ్రువం త్రిదివరక్షణజాతశఙ్కై-
దైవైరరాతితిమిరాఞ్జలితాడితాక్షః ।। 36 ।।


(తెర వెనకనుంచి)
జరగండి, అయ్యలారా! పక్కకు జరగండి.
బలరాముడు:
(అటువైపు చూసి) అరె! పూజ్యుడైన ధృతరాష్ట్రుడు గాంధారితో కలిసి దుర్జయుడు దారిచూపుతూ ఉండగా, అంతఃపురపరిజనం వెంబడించి రాగా శోకావిష్టుడై తడబడుతున్న అడుగులతో ఇటే వస్తున్నాడు. ఈయన –

పరాక్రమానికి నివాసస్థానమైనవాడు; తన నూరుగురు కుమారులను కన్నులుగా చేసుకున్నవాడు; అభిమానధనుడై నిలిచినవాడు; బంగారు యూపస్తంభాలవంటి చేతులు కలవాడు; సందేహం లేదు, స్వర్గాన్ని కాపాడుకోలేమేమోనన్న భయంతో దేవతలు తమ శత్రుత్వమనే చీకటితో ఇతడి కళ్ళపై దెబ్బ కొట్టినందున ఈయన అంధుడై జన్మించాడు.


(తతః ప్రవిశతి ధృతరాష్ట్రో గాన్ధారీ దేవ్యౌ దుర్జయశ్చ।)

ధృతరాష్ట్రః:
పుత్ర క్వాసి।


(ధృతరాష్ట్రుడు, గాంధారి, దుర్యోధనుడి భార్యలిద్దరు, దుర్జయుడు ప్రవేశిస్తారు.)
ధృతరాష్ట్రుడు:
పుత్రా, ఎక్కడున్నావు?

గాన్ధారీ:
పుత్తఅ! కహిం సి।
పుత్రక! క్వాసి।

గాంధారి:
నాయనా! ఎక్కడున్నావు?

దేవ్యౌ:
మహారాజ! కహిం సి।
మహారాజ! క్వాసి।

రాణులిద్దరూ:
మహారాజా, ఎక్కడున్నారు?

ధృతరాష్ట్రః:
భోః! కష్టమ్।

వఞ్చనానిహతం శ్రుత్వా సుతమద్యాహవే మమ।
ముఖమన్తర్గతాస్రాక్షమన్ధమన్ధతరం కృతమ్ ।। 37 ।।

గాన్ధారి! కిం ధరసే।

ధృతరాష్ట్రుడు:
అయ్యో, ఎంత కష్టం!

నేటి యుద్ధంలో నా కొడుకు వంచనతో చంపబడ్డాడని విని కన్నీటితో నిండిన నా కన్నులు మరింత గుడ్డివైపోయాయి.

గాంధారీ, ఉన్నావా?

గాన్ధారీ:
జీవావిదమ్హి మన్దభాఆ।
జీవితాస్మి మన్దభాగా।

గాంధారి:
జీవించే ఉన్నాను, దురదృష్టవంతురాలిని.

దేవ్యౌ:
మహారాఅ! మహారాఅ!
మహారాజ! మహారాజ!

రాణులిద్దరూ:
మహారాజా! మహారాజా!

రాజా:
భోః! కష్టమ్। యన్మమాపి స్త్రియో రుదన్తి।

పూర్వం న జానామి గదాభిఘాత-
రుజామిదానీం తు సమర్థయామి।
యన్మే ప్రకాశీకృతమూర్ధజాని
రణం ప్రవిష్టాన్యవరోధనాని ।। 38 ।।

దుర్యోధనుడు:
అయ్యో, ఎంత కష్టం. నా భార్యలు సైతం విలపిస్తున్నారు!

ఇంతకు ముందెన్నడూ, గదాఘాతపు బాధను ఎరుగను నేను. ఇప్పుడు, తమ తలలపై మేలిముసుగులు తొలిగిపోయి శిరోజాలు అందరికీ కనబడుతుండగా నా అంతఃపురస్త్రీలు యుద్ధరంగాన ప్రవేశించడంతో ఆ బాధ నా అనుభవంలోకి వస్తున్నది.

ధృతరాష్ట్రః:
గాన్ధారి! కిం దృశ్యతే దుర్యోధననామధేయః కులమానీ।

ధృతరాష్ట్రుడు:
గాంధారీ! కురుకులంలో జన్మించినందునకు గర్వించేవాడైన దుర్యోధనుడు నీకు కనబడుతున్నాడా?

గాన్ధారీ:
మహారాఅ! ణ దిస్సది।
మహారాజ! న దృశ్యతే।

గాంధారి:
లేదు, మహారాజా!

ధృతరాష్ట్రః:
కథం న దృశ్యతే। హన్తభో! అద్యాస్మ్యహమన్ధో యోఽహమన్వేష్టవ్యే కాలే పుత్రం న పశ్యామి। భోః కృతాన్తహతక!

రిపుసమరవిమర్దం మానవీర్యప్రదీప్తం
సుతశతమతిధీరం వీరముత్పాద్య మానీ।
ధరణితలవికీర్ణం కిం స యోగ్యో న భోక్తుం
సకృదపి ధృతరాష్ట్రః పుత్రదత్తం నివాపమ్ ।। 39 ।।

ధృతరాష్ట్రుడు:
ఎందుకు కనబడడం లేదు? అయ్యో! నా కుమారుణ్ణి వెదికి చూడవలసిన సమయంలో చూడలేకపోతున్న నేను ఈనాడు నిజంగా గుడ్డివాడినయ్యాను. ఆహ్, యమాధమా!

సమరంలో శత్రువులను నశింపజేయగలిగినవారు, అభిమానంతో, శౌర్యంతో విరాజిల్లేవారు, మహావీరులూ, నేడు భూమిపై చెల్లాచెదురుగా పడిపోయినవారూ అయిన నూరుగురు కొడుకులకు జన్మనిచ్చినందున గర్విస్తూ ఉన్న ఈ ధృతరాష్ట్రుడు తన పుత్రులు అర్పించే తర్పణజలాలను కొద్దిగానైనా స్వీకరించేందుకు అర్హుడు కాడా?

గాన్ధారీ:
జాద సుయోధణ! దేహి మే పడివఅణం। పుత్తసదవిణాస దుత్థిదం సమస్సాసేహి మహారాఅం।
జాత సుయోధన। దేహి మే ప్రతివచనమ్। పుత్రశతవినాశదుఃస్థితం సమాశ్వాసయ మహారాజమ్।

గాంధారి:
నాయనా దుర్యోధనా! నాకు సమాధానం చెప్పు. నూరుగురు పుత్రులు నశించి దురవస్థలోనున్న మహారాజును ఊరడించు.

బలదేవః:
అయే। ఇయమత్రభవతీ గాన్ధారీ।

యా పుత్రపౌత్రవదనేష్వకుతూహలాక్షీ
దుర్యోధనాస్తమితశోకనిపీతధైర్యా।
అస్రైరజస్రమధునా పతిధర్మచిహ్న-
మార్ద్రీకృతం నయనబన్ధమిదం దధాతి ।। 40 ।।

బలరాముడు:
ఓహ్! ఈవిడ వందనీయురాలైన గాంధారి –

కొడుకుల, మనుమళ్ళ ముఖాలను చూడాలనే కుతూహలం లేనిది; దుర్యోధనుడి అస్తమయం కారణంగా కలిగిన దుఃఖం ఆమె ధైర్యాన్ని యావత్తూ తాగివేసింది; పాతివ్రత్యసూచకంగా ఆమె ధరించిన నేత్రబంధం ఇప్పుడు ఎడతెగని కన్నీళ్ళతో తడిసిపోయింది.

ధృతరాష్ట్రః:
పుత్ర దుర్యోధన! అష్టాదశాక్షౌహిణీమహారాజ! క్వాసి।

ధృతరాష్ట్రుడు:
పుత్రా దుర్యోధనా! పద్దెనిమిది అక్షౌహిణుల మహారాజా! ఎక్కడున్నావు?

రాజా:
అద్యాస్మి మహారాజః।

దుర్యోధనుడు:
ఈనాడు, మహారాజునా?

ధృతరాష్ట్రః:
ఏహి పుత్రశతజ్యేష్ఠ। దేహి మే ప్రతివచనమ్।

ధృతరాష్ట్రుడు:
ఇక్కడికి రా, నూరుగురు కుమారులలో పెద్దవాడా! నా మాటకు మారుపలుకవయ్యా.

రాజా:
దదామి ఖలు ప్రతివచనమ్। అనేన వృత్తాన్తేన వ్రీలితోఽస్మి।

దుర్యోధనుడు:
మారు మాట్లాడుతున్నాను కదా. ఇలా కరిగినందుకు నేనెంతో సిగ్గుపడుతున్నాను.

ధృతరాష్ట్రః:
ఏహి పుత్ర! అభివాదయస్వ మామ్।

ధృతరాష్ట్రుడు:
ఇటురా నాయనా, నాకు నమస్కరించు.

రాజా:
అయమయమాగచ్ఛామి। (ఉత్థానం రూపయిత్వా పతతి) హా ధిక్। అయం మే ద్వితీయః ప్రహారః। కష్టం భోః!

హృతం మే భీమసేనేన గదాపాతకచగ్రహే।
సమమూరుద్వయేనాద్య గురోః పాదాభివన్దనమ్ ।। 41 ।।

దుర్యోధనుడు:
ఇదిగిదిగో, వస్తున్నాను. (లేవబోయి కూలబడతాడు) అయ్యో! రెండవ దెబ్బ ఇది నాకు. ఆఁ, ఎంత కష్టం!

గదాప్రహారంతో నన్ను పడగొట్టి జుట్టు పట్టుకున్న భీమసేనుడు నా తొడలనే కాదు, నా తండ్రికి పాదాభివందనం చేయగల పటుత్వాన్నీ హరించాడు.

గాన్ధారీ:
ఏత్థ జాదా!।
అత్ర జాతే!

గాంధారి:
ఇటు రండి, బిడ్డలారా!

దేవ్యౌ:
అయ్యే! ఇమా మ్హ।
ఆర్యే! ఇమే స్వః।

రాణులిద్దరూ:
ఇక్కడే ఉన్నామమ్మా!

గాన్ధారీ:
అణ్ణేసహ భత్తారం।
అన్వేషేథాం భర్తారమ్।

గాంధారి:
మీ భర్తను అన్వేషించండి.

దేవ్యౌ:
గచ్ఛామ మన్దభాఆ।
గచ్ఛావః మన్దభాగే।

రాణులిద్దరూ:
దురదృష్టవంతురాళ్ళము, వెళతామమ్మా.

ధృతరాష్ట్రః:
క ఏష భోః! మమ వస్త్రాన్తమాకర్షన్ మార్గమాదేశయతి।

ధృతరాష్ట్రుడు:
ఎవరయ్యా అది? నా వస్త్రాన్ని లాగుతూ దారిని చూపిస్తున్నారు?

దుర్జయః:
తాద! అహం దుజ్జఓ।
తాత! అహం దుర్జయః।

దుర్జయుడు:
తాతా, నేను దుర్జయుడను.

ధృతరాష్ట్రః:
పౌత్ర దుర్జయ! పితరమన్విచ్ఛ।

ధృతరాష్ట్రుడు:
మనవడా దుర్జయా! నీ తండ్రిని వెదుకు.

దుర్జయః:
తాద! పరిస్సంతో ఖు అహం।
తాత! పరిశ్రాన్తః ఖల్వహమ్।

దుర్జయుడు:
అలిసిపోయి ఉన్నాను, తాతా!

ధృతరాష్ట్రః:
గచ్ఛ, పితురఙ్కే విశ్రమస్వ।

ధృతరాష్ట్రుడు:
వెళ్ళు, నీ తండ్రి ఒడిలో విశ్రమించు.

దుర్జయః:
తాద! అహం గచ్ఛామి। (ఉపసృత్య) తాద! కహిం సి।
తాత! అహం గచ్ఛామి। తాత క్వాసి।

దుర్జయుడు:
తాతా! నేను వెళతాను (పక్కకు వెళ్ళి) నాన్నా! ఎక్కడున్నావు?

రాజా:
అయమప్యాగతః। భోః! సర్వావస్థాయాం హృదయసంనిహితః పుత్రస్నేహో మాం దహతి। కుతః,

దుఃఖానామనభిజ్ఞో యో మమాఙ్కశయనోచితః।
నిర్జితం దుర్జయో దృష్ట్వా కిన్ను మామభిధాస్యతి ।। 42 ।।

దుర్యోధనుడు:
వీడూ వచ్చేసాడు. అన్ని అవస్థల్లోనూ హృదయానికి అతి సన్నిహితంగా ఉండే పుత్రస్నేహం నన్ను దహించివేస్తున్నది. ఎందుకంటే –

దుఃఖమంటే ఏమిటో తెలియక నా ఒడిలో నిదురించడం అలవాటైన వీడు పరాజితుడై ఉన్న నన్ను చూసి ఏమంటాడో కదా.

దుర్జయః:
అఅం మహారాఓ భూమీఏ ఉవవిట్ఠో।
అయం మహారాజో భూమ్యాముపవిష్టః।

దుర్జయుడు:
ఈ మహారాజు భూమిపై కూర్చొని ఉన్నాడు.

రాజా:
పుత్ర కిమర్థమిహాగతః।

దుర్యోధనుడు:
కుమారా, ఇక్కడికెందుకు వచ్చావు?

దుర్జయః:
తువం చిరాయసి త్తి।
త్వం చిరాయసీతి।

దుర్జయుడు:
నీవు ఆలస్యం చేసావని.

రాజా:
అహో అస్యామవస్థాయాపపి పుత్రస్నేహో హృదయం దహతి।

దుర్యోధనుడు:
అహో, ఈ అవస్థలోనూ పుత్రప్రేమ నన్ను దహించివేస్తున్నది.

దుర్జయః:
అహం పి ఖు దే అఙ్కేఉవవిసామి। (అఙ్కమారోహతి)
అహమపి ఖలు తే అఙ్కేఉపవిశామి।

దుర్జయుడు:
నేను నీ ఒడిలో కూర్చుంటాను (ఒడిలోకి ఎక్కబోతాడు).

రాజా:
(నివార్య) దుర్జయ! దుర్జయ! భోః! కష్టమ్।

హృదయప్రీతిజననో యో మే నేత్రోత్సవః స్వయమ్।
సోఽయం కాలవిపర్యాసాచ్చన్ద్రో వహ్నిత్వమాగతః ।। 43 ।।

దుర్యోధనుడు:
(నివారించి) దుర్జయా! దుర్జయా! ఏమి ఈ దురవస్థ!

హృదయానికి ప్రీతిని కలిగించేవాడు, కన్నులపండుగే తానైనవాడు, ఈ నా చందమామ కాలవైపరీత్యం కారణంగా నిప్పులాగా కనిపిస్తున్నాడు.

దుర్జయః:
అఙ్కే ఉవవేసం కిణ్ణిమిత్తం తువం వారేసి।
అఙ్క ఉపవేశం కిన్నిమిత్తం త్వం వారయసి।

దుర్జయుడు:
ఒడిలో కూర్చోనివ్వడం లేదెందుకు?

రాజా:
త్యక్త్వా పరిచితం పుత్ర! యత్ర తత్ర త్వయాస్యతామ్।
అద్యప్రభృతి నాస్తీదం పూర్వభుక్తం తవాసనమ్ ।। 44 ।।

దుర్యోధనుడు:
నీకు చిరపరిచితమైన స్థలాన్ని వదిలిపెట్టి, కుమారా! ఎక్కడో ఒకచోట కూర్చోవాలి నీవు. నీవు గతంలో కూర్చుంటూ ఉండిన ఈ ఒడి ఇకపై నీది కాదు.

దుర్జయః:
కహి ణు హు మహారాఓ గమిస్సిది।
కుత్ర ను ఖలు మహారాజో గమిష్యతి।

దుర్జయుడు:
ఎక్కడికైనా వెళుతున్నావా మహారాజా?

రాజా:
భ్రాతృశతమనుగచ్ఛామి।

దుర్యోధనుడు:
నూరుగురు తమ్ముళ్ళను అనుసరించి వెళుతున్నాను.

దుర్జయః:
మం పి తహి ణేహి।
మామపి తత్ర నయ।

దుర్జయుడు:
నన్నూ అక్కడికి తీసుకెళ్ళు.

రాజా:
గచ్ఛ పుత్ర! ఏవం వృకోదరం బ్రూహి।

దుర్యోధనుడు:
వెళ్ళు, కుమారా. భీమసేనుడితో ఆ మాట చెప్పు.

దుర్జయః:
ఏహి మహారాఅ! అణ్ణేసీఅసి।
ఏహి మహారాజ! అన్విష్యసే।

దుర్జయుడు:
రా, మహారాజా! నీకోసం వెదుకుతున్నారు?

రాజా:
పుత్ర కేన।

దుర్యోధనుడు:
ఎవరు, కుమారా?

దుర్జయః:
అయ్యాయే అయ్యేణ సవ్వేణ అన్తేఉరేణ అ।
ఆర్యయార్యేణ సర్వేణాన్తః పురేణ చ।

దుర్జయుడు:
తాతా, నాయనమ్మా, అంతఃపురంలోని వారందరూ.

రాజా:
గచ్ఛ పుత్ర! నాహమాగన్తుం సమర్థః।

దుర్యోధనుడు:
వెళ్ళు కుమారా, నేను రాలేను.

దుర్జయః:
అహం తుమం ణఇస్సం।
అహం త్వాం నేష్యామి।

దుర్జయుడు:
నేను నిన్ను తీసుకెళతాను.

రాజా:
బాలస్తావదసి పుత్ర।

దుర్యోధనుడు:
నీవు చిన్నవాడివిరా, కుమారా.

దుర్జయః:
(పరిక్రమ్య) అయ్యా! అఅం మహారాఓ।
ఆర్యాః! అయం మహారాజః।

దుర్జయుడు:
(పక్కకు తిరిగి) అమ్మలారా! ఇదిగో మహారాజు.

దేవ్యౌ:
హా హా! మహారాఓ!
హా హా! మహారాజః।

రాణులిద్దరూ:
అయ్యో, అయ్యో! మహారాజా!

ధృతరాష్ట్రః:
క్వాసౌ మహారాజః।

ధృతరాష్ట్రుడు:
ఎక్కడున్నాడు మహారాజు?

గాన్ధారీ:
కహిం మే పుత్తఓ।
కుత్ర మే పుత్రకః।

గాంధారి:
ఏడీ నా కొడుకు?

దుర్జయః:
అఅం మహారాఓ భూమీఏఉవవిట్ఠో
అయం మహారాజో భూమ్యాముపవిష్టః।

దుర్జయుడు:
ఇదిగో, నేలపై కూర్చొని ఉన్నాడు మహారాజు.

ధృతరాష్ట్రః:
హన్త భోః! కిమయం మహారాజః।

యః కాఞ్చనస్తమ్భసమప్రమాణో
లోకే కిలైకో వసుధాధిపేన్ద్రః।
కృతః స మే భూమిగతస్తపస్వీ
ద్వారేన్ద్రకీలార్ధసమప్రమాణః ।। 45 ।।

ధృతరాష్ట్రుడు:
అయ్యో! ఇతడా మహారాజు!

స్వర్ణస్తంభమంత ఎత్తున ఉండేవాడు, లోకంలో తానొక్కడే రాజులందరిలోనూ ఇంద్రుడిలా ఉండేవాడు, దీనుడై, తలుపు గడియలో ఒక ముక్కలా నేలన పడి ఉన్నాడు.

గాన్ధారీ:
జాద సుయోధణ! పరిస్సంతోసి।
జాత సుయోధన! పరిశ్రాన్తోఽసి।

గాంధారి:
నాయనా సుయోధనా, అలిసిపోయావా?

రాజా:
భవత్యాః ఖల్వహం పుత్రః।

దుర్యోధనుడు:
నీ కుమారుడిని కాదా, తల్లీ?

ధృతరాష్ట్రః:
కేయం భోః!।

ధృతరాష్ట్రుడు:
ఎవరిది?

గాన్ధారీ:
మహారాజ! అహమభీదపుత్తప్పసవిణీ।
మహారాజ! అహమభీతపుత్ర ప్రసవినీ।

గాంధారి:
మహారాజా! భయమెరుగని కుమారుడికి తల్లిని నేను.

రాజా:
అద్యోత్పన్నమివాత్మానమవగచ్ఛామి। భోస్తాత కిమిదానీం వైక్లవ్యేన।

దుర్యోధనుడు:
ఇప్పుడే పుట్టినవాడిలా కనబడుతున్నాను నాకు నేను. తండ్రీ, ఎందుకీ అలవిమాలిన దుఃఖం?

ధృతరాష్ట్రః:
పుత్ర కథమవిక్లవో భవిష్యామి।

యస్య వీర్యబలోత్సిక్తం సంయుగాధ్వరదీక్షితమ్।
పూర్వం భ్రాతృశతం నష్టం త్వయ్యేకస్మిన్హతే హతమ్ ।। 46 ।।

ధృతరాష్ట్రుడు:
కుమారా! దుఃఖించకుండా ఎలా ఉంటాను?

బలపరాక్రమాల అతిశయంతో యుద్ధమనే యజ్ఞంలో దీక్ష పూనిన నీ నూరుగురు సోదరులు నశించిపోయారు. నీ ఒక్కడి మరణంతో అంతా నశించిపోతుంది.


(పతతి।)

రాజా:
హా ధిక్। పతితోఽత్రభవాన్। తాత! సమాశ్వసయాత్రభవతీమ్।


(పడిపోతాడు)
దుర్యోధనుడు:
అయ్యయ్యో! పూజ్యుడైన జనకుడు కిందపడిపోయాడు. తండ్రీ, పూజ్యురాలైన నా తల్లిని ఊరడించండి.

ధృతరాష్ట్రః:
పుత్ర! కిమితి సమాశ్వసయామి।

ధృతరాష్ట్రుడు:
పుత్రా! ఏమని చెప్పి ఊరడించమంటావు?

రాజా:
అపరాఙ్ముఖో యుధి హత ఇతి। భోస్తాత! శోకనిగ్రహేణ క్రియతాం మమానుగ్రహః।

త్వత్పాదమాత్రప్రణతాగ్రమౌలి-
ర్జ్వలన్తమప్యగ్నిమచిన్తయిత్వా।
యేనైవ మానేన సమం ప్రసూత
స్తేనైవ మానేన దివం ప్రయామి ।। 47 ।।

దుర్యోధనుడు:
యుద్ధంలో వెనుతిరగకుండా హతుడయ్యాడని. ఓ తండ్రీ, దుఃఖాన్ని చిక్కబట్టుకోవడం ద్వారా నన్ను అనుగ్రహించండి.

మీ ఒక్కరి పాదాల మ్రోలనే శిరస్సు వంచి నమస్కరించిన నేను, మండే అగ్నిని సైతం లెక్కచేయకుండా, ఏ స్వాభిమానంతోనైతే పుట్టానో ఆ స్వాభిమానంతో స్వర్గానికి వెళుతున్నాను.

ధృతరాష్ట్రః:
వృద్ధస్య మే జీవితనిఃస్పృహస్య
నిసర్గసంమీలితలోచనస్య।
ధృతిం నిగృహ్యాత్మని సంప్రవృత్త
స్తీవ్రస్సమాక్రామతి పుత్రశోకః ।। 48 ।।

ధృతరాష్ట్రుడు:
జీవితేచ్ఛ నశించినవాడినీ, పుట్టుకతో కళ్ళు మూసుకుపోయి ఉన్నవాడినీ అయిన నా హృదయంలో జన్మించిన తీవ్రమైన పుత్రశోకం నన్ను నిలువెల్లా ఆక్రమించి నా ధైర్యాన్ని నశింపజేస్తున్నది.

బలదేవః:
భోః! కష్టమ్।

దుర్యోధననిరాశస్య నిత్యాస్తమితచక్షుషః।
న శక్నోమ్యత్రభవతః కర్తుమాత్మనివేదనమ్ ।। 49 ।।

బలరాముడు:
అయ్యో, కష్టం!

దుర్యోధనుడిగురించి ఆశను కోల్పోయి, శాశ్వతంగా కన్నులు మూతబడిపోయి ఉన్న ఈ పూజ్యుడికి నేను ఇక్కడే ఉన్నానని చెప్పలేనిప్పుడు.

రాజా:
విజ్ఞాపయామ్యత్రభవతీమ్।

దుర్యోధనుడు:
పూజ్యురాలైన నా తల్లికి విన్నవించుకుంటున్నాను.

గాన్ధారీ:
భణాహి జాద!।
భణ జాత!

గాంధారి:
చెప్పు నాయనా!

రాజా:
నమస్కృత్య వదామి త్వాం యది పుణ్యం మయా కృతమ్ ।
అన్యస్యామపి జాత్యాం మే త్వమేవ జననీ భవ ।। 50 ।।

దుర్యోధనుడు:
నీకు నమస్కరించి చెబుతున్నాను. నేను ఏమైనా పుణ్యం చేసి ఉంటే, మరొక జన్మలోనూ నీవే నా తల్లివి కావాలి.

గాన్ధారీ:
మమ మణోరహో ఖు తుఏ భణిదో।
మమ మనోరథః ఖలు త్వయా భణితః।

గాంధారి:
నా కోరికే నీ నోట పలికింది.

రాజా:
మాలవి! త్వమపి శ్రృణు।

భిన్నా మే భ్రుకుటీ గదానిపతితైర్వ్యాయుద్ధకాలోత్థితై-
ర్వక్షస్యుత్పతితైః ప్రహారరుధిరైర్హారావకాశో హృతః।
పశ్యేమౌ వ్రణకాఞ్చనాఙ్గదధరౌ పర్యాప్తశోభౌ భుజౌ
భర్తా తే న పరాఙ్ముఖో యుధి హతః కిం క్షత్రియే రోదిషి ।। 51 ।।

దుర్యోధనుడు:
మాలవీ, నీవూ విను.

ద్వంద్వయుద్ధంలో గదాఘాతాలవల్ల నా నుదురు చిట్లిపోయింది. రొమ్మున తాకిన దెబ్బలనుంచి చిందిన నెత్తుటి కారణంగా హారాలను ధరించగల అవకాశం హరించుకుపోయింది. చూడు, ఈ గాయాలు – దండకీర్తుల్లా నా భుజాలను అలంకరించి ఉన్నాయి. నీ భర్త యుద్ధంలో వెన్ను తిప్పకుండా మరణిస్తున్నాడు. ఓ క్షత్రియవనితా, ఎందుకు ఏడుస్తున్నావు?

దేవీ:
బాలా ఏసా సహధర్మ చారిణో రోదామి।
బాలా ఏషా సహధర్మచారిణీ రోదిమి।

మాలవి:
మూర్ఖురాలిని. మీ సహధర్మచారిణిని. అందుకే ఏడుస్తున్నాను.

రాజా:
పౌరవి! త్వమపి శ్రృణు।

వేదోక్తైర్వివిధైర్మఖైరభిమతైరిష్టం ధృతా బాన్ధవాః
శత్రూణాముపరి స్థితం ప్రియశతం న వ్యంసితాః సంశ్రితాః।
యుద్ధేఽష్టాదశవాహినీనృపతయః సంతాపితా నిగ్రహే
మానం మానిని! వీక్ష్య మే న హి రుదన్త్యేవంవిధానాం స్త్రియః ।। 52 ।।

దుర్యోధనుడు:
పౌరవీ! నువ్వూ విను.

వేదవిహితమైనవీ, చేయాలని కోరుకున్నవీ అయిన వివిధయజ్ఞాలను చేసాను. బంధువులకు ఆలంబనగా నిలిచాను. శత్రువులను గెలిచాను. ఆశ్రయించినవారిని వంచించకుండా వారికి వంద ప్రియాలను కలిగించాను. యుద్ధంలో పద్దెనిమిది సేనావాహినుల రాజులను అడ్డగించి బాధించాను. అభిమానధనురాలా, నా దర్పాన్ని చూసాక కూడా నీవంటి స్త్రీలు ఈ విధంగా రోదించరు కదా.

పౌరవీ:
ఏక్కకిదప్పవేసణిచ్చఈ ణ రోదామి।
ఏకకృతప్రవేశనిశ్చయా న రోదిమి।

పౌరవి:
సహగమనం చేయాలని నిశ్చయించుకున్నాను కనుక రోదించను.

రాజా:
దుర్జయ! త్వమపి శృణు।

దుర్యోధనుడు:
దుర్జయా, నీవూ విను.

ధృతరాష్ట్రః:
గాన్ధారి! కిం ను ఖలు వక్ష్యతి।

ధృతరాష్ట్రుడు:
గాంధారీ, ఏమి చెప్పబోతున్నాడు?

గాన్ధారీ:
అహం పి తం ఏవ్వ చిన్తేమి।
అహమపి తదేవ చిన్తయామి।

గాంధారి:
నేనూ అదే ఆలోచిస్తున్నాను.

రాజా:
అహమివ పాణ్డవాః శుశ్రూషయితవ్యాః, తత్రభవత్యాశ్చమ్బాయాః కున్త్యా నిదేశో వర్తయితవ్యః। అభిమన్యోర్జననీ ద్రౌపదీ చోభే మాతృవత్పూజయితవ్యే। పశ్య పుత్ర!

శ్లాఘ్యశ్రీరభిమానదీప్తహృదయో దుర్యోధనో మే పితా
తుల్యేనాభిముఖం రణే హత ఇతి త్వం శోకమేవం త్యజ।
స్పృష్ట్వా చైవ యుధిష్ఠిరస్య విపులం క్షౌమాపసవ్యం భుజం
దేయం పాణ్డుసుతైస్త్వయా మమ సమం నామావసానే జలమ్ ।। 53 ।।

దుర్యోధనుడు:
నన్ను సేవించినట్లే పాండవులను సేవించు. పూజ్యురాలైన గాంధారి ఆజ్ఞలవలెనే, కుంతీదేవి ఆజ్ఞలనూ నెరవేర్చు. సుభద్రా ద్రౌపదులు నీ తల్లులవలె పూజించదగ్గవారు. కుమారా, చూడు –

‘ప్రశంసనీయమైన సంపదలను కలిగినవాడు, స్వాభిమానంతో ప్రకాశించే హృదయం కలిగినవాడు అయిన నా తండ్రి తనకు సమవుజ్జీ అయినవాడిని యుద్ధంలో ఎదుర్కొని హతు’డయ్యాడన్న శోకాన్ని విడిచిపెట్టు. వెడల్పైన వస్త్రంతో కప్పబడ్డ యుధిష్ఠిరుడి కుడిభుజాన్ని తాకుతూ, పాండవులతో కలిసి నాకు నీవు తర్పణజలాలను సమర్పించాలి.

బలదేవః:
అహో వైరం పశ్చాత్తాపః సంవృత్తః। అయే శబ్ద ఇవ।

సన్నాహదున్దుభినినాదవియోగమూకే
విక్షిప్తబాణకవచవ్యజనాతపత్రే।
కస్యైష కార్ముకరవో హతసూతయోధే
విభ్రాన్తవాయసగణం గగనం కరోతి ।। 54 ।।

బలరాముడు:
అహో, శత్రుత్వం పశ్చాత్తాపంగా పరిణమించింది. ఏదో శబ్దం వినబడుతున్నది…

యుద్ధసన్నాహసూచకాలైన దుందుభులు మ్రోగకుండా నిశ్శబ్దంగా ఉన్న ఈ సమయంలో, బాణాలు, కవచాలు, వింజామరలు, ఛత్రాలు చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటిదీ, యోధులూ, సారథులూ హతులై పడిపోయినటువంటిదీ ఈ యుద్ధభూమిలో ఎవరిదో ఈ ధనుష్టంకారం కలవరపడిపోయిన కాకులను ఆకాశంలోకి ఎగిరేలా చేస్తున్నది.


(నేపథ్యే)

దుర్యోధనేనాతతకార్ముకేణ యో యుద్ధయజ్ఞః సహితః ప్రవిష్టః ।
తమేవ భూయః ప్రవిశామి శూన్యమధ్వర్యుణా వృత్తమివాశ్వమేధమ్ ।। 55 ।।

(తెర వెనుకనుంచి)
పూర్వం, వింటిని ఎక్కుపెట్టిన దుర్యోధనుడితో సహా ఈ యుద్ధమనే యజ్ఞానికి వచ్చాను. నేడు, అధ్వర్యువుచేత అశ్వమేధక్రతువు పూర్తి చేయబడ్డాక జనశూన్యమైన ఆ యజ్ఞస్థలంలో తిరిగి ప్రవేశిస్తున్నాను.

బలదేవః:
అయే అయం గురుపుత్రోఽశ్వత్థామేత ఏవాభివర్తతే। య ఏషః,

స్ఫుటితకమలపత్రస్పష్టవిస్తీర్ణదృష్టీ
రుచిరకనకయూపవ్యాయతాలమ్బబాహుః।
సరభసమయముగ్రం కార్ముకం కర్షమాణః
సదహన ఇవ మేరుః శృఙ్గలగ్నేన్ద్రచాపః ।। 56 ।।

బలరాముడు:
ఓహ్! గురుపుత్రుడైన అశ్వత్థామ ఇతడు. ఇటే వస్తున్నాడు.

విప్పారిన తామరల రేకులవలె నిర్మలంగా పెద్దగా ఉన్న కళ్ళు, ప్రకాశిస్తున్న బంగారు యూపస్తంభాలలా పొడవుగా, బలిష్టంగా ఉన్న చేతులు, వేగంతో భయంకరమైన తన ధనువును సారిస్తూ, కొండకొమ్ముపై ఇంద్రధనుస్సుతో నిప్పంటుకొని ఉన్న మేరుపర్వతంలా ఉన్నాడు.


(తతః ప్రవిశత్యశ్వత్థామా।)

అశ్వత్థామా:
(పూర్వోక్తమేవ పఠిత్వా) భో భోః! సమరసంరంభోభయబలజలధిసఙ్గమసమయసముత్థితశస్త్రనక్రకృత్తవిగ్రహాః స్తోకావశేషాః శ్వాసానుబద్ధమన్దప్రాణాః సమరశ్లాఘినో రాజానః! శృణ్వన్తు శృణ్వతు భవన్తః।

ఛలబలదలితోరుః కౌరవన్ద్రో న చాహం
శిథిలవిఫలశస్త్రః సూతపుత్రో న చాహమ్।
ఇహ తు విజయభూమౌ ద్రష్టుమద్యోద్యతాస్త్రః
సరభసమహమేకో ద్రోణపుత్రః స్థితోఽస్మి ।। 57 ।।

కిమనయా మమాప్యప్రతిలాభవిజయశ్లాఘయా సమరశ్రియా। (పరిక్రమ్య)

మా తావత్। మయి గురునివపనవ్యగ్రే వఞ్చితః కిల కురుకులతిలకభూతః కురురాజః। క ఏతచ్ఛ్రద్ధాస్యతి। కుతః,

ఉద్యత్ప్రాఞ్జలయో రథద్విపగతాశ్చాపద్వితీయైః కరై-
ర్యస్యైకాదశవాహినీనృపతయస్తిష్ఠన్తి వాక్యోన్ముఖాః।
భీష్మో రామశరావలీఢకవచస్తాతశ్చ యోద్ధా రణే
వ్యక్తం నిర్జిత ఏవ సోఽప్యతిరథః కాలేన దుర్యోధనః ।। 58 ।।

తత్ క్వ ను ఖలు గతో గాన్ధారీపుత్రః। (పరిక్రమ్యావలోక్య) అయే అయమభిహతగజతురగనరరథ-ప్రాకారమధ్యగతః సమరపయోధిపారగః కురురాజః। య ఏషః,

మౌలీనిపాతచలకేశమయూఖజాలై-
ర్గాత్రైర్గదానిపతనక్షతశోణితార్ద్రైః
భాత్యస్తమస్తకశిలాతలసంనివిష్టః
సన్ధ్యావగాఢ ఇవ పశ్చిమకాలసూర్యః ।। 59 ।।

(ఉపసృత్య) భోః కురురాజ! కిమిదమ్।


(అశ్వత్థామ ప్రవేశిస్తాడు)
అశ్వత్థామ:
(ఇంతకు ముందు చెప్పిన మాటలనే – “పూర్వం, వింటిని ఎక్కుపెట్టిన…” – మళ్ళీ పలికాక) యుద్ధపు సంరంభంలో ఇరువైపులా ఉన్న సైన్యసముద్రాలు ఒకదానితో ఒకటి కలిసిపోతున్న సమయంలో పైకి లేచిన ఆయుధాలనే మొసళ్ళచేత అవయవాలు ఖండితమై అవశిష్టమైన దేహాలతో, కొద్దిపాటి శ్వాసతో సజీవులై, సమరరంగాన కీర్తిని సాధించుకొని ఉన్న ఓ రాజులారా! వినండి, వినండి మీరంతా.

శత్రువు మోసపు బలిమితో తొడలు విరిగిపడిన కౌరవేంద్రుడను కాను నేను. బిగువు సడలి, వమ్మయిపోయిన ఆయుధాల కర్ణుడిని కాను. నేడు, ఈ విజయభూమిలో సమరోత్సాహంతో, అస్త్రాలను పైకెత్తి ఏకాకినై ద్రోణపుత్రుడనైన నేను నిలిచి ఉన్నాను.

ఏ లాభమూ కలిగించని యుద్ధపు ఘనతా, విజయపు ప్రశంసా నాకెందుకు? (రంగస్థలంపై తిరుగుతూ) కాదు, కాదు. నేను నా తండ్రికి తర్పణవిధులలో వ్యగ్రుడనై ఉన్న సమయంలో కురుకులతిలకుడైన దుర్యోధనుడు వంచనకు లోనైనాడు. ఎవరికి మాత్రం నమ్మకం కలుగుతుంది ఈ మాట వింటే –

రథికులతో, గజారూఢులతో, ధనుర్ధారులతోనున్న పదకొండు అక్షౌహిణుల రాజులు మోడ్చిన చేతులను పైకెత్తి ఎవరి ఆజ్ఞకై ఎదురుచూస్తూ ఉంటారో, పరశురాముడి బాణాల తాకిడికి దెబ్బతిన్న కవచాన్ని కలిగిన భీష్ముడూ, నా తండ్రీ మొదలైన యోధులు ఎవరి పక్షాన యుద్ధంలో పోరాడారో, ఆ అతిరథయోధుడైన దుర్యోధనుడు నేడు కాలప్రభావంచేత ఓడించబడ్డాడని స్పష్టంగా తెలుస్తున్నది.

సరే, ఎక్కడున్నాడా గాంధారీనందనుడు? (రంగస్థలంపై అటూ ఇటూ నడిచి, అటూ ఇటూ చూసి) అరె! ఇతడు – ఏనుగుల, గుర్రాల, మనుషుల శవాల, విరిగిపడిన రథాల చుట్టుగోడ నడుమన – యుద్ధమనే సముద్రాన్ని దాటగలిగిన కురురాజు!

కిరీటం పడిపోయినందున గాలికి కదులుతున్న వెంట్రుకలు కిరణాలుగా, గదాఘాతాల వల్ల కలిగిన గాయాల నెత్తుటితో తడిసిన అవయవాలతో, అస్తాద్రి శిలల మధ్య సంధ్యారుణిమను పులుముకున్న సాయంకాలసూర్యుడిలా ఉన్నాడు.

(సమీపించి) ఓ కురురాజా, ఏమిటిది?

రాజా:
గురుపుత్ర! ఫలమపరితోషస్య ।

దుర్యోధనుడు:
సంతోషరాహిత్యానికి ఫలితం, గురుపుత్రా!

అశ్వత్థామా:
భోః కురురాజ! సత్కారమూలమావర్జయిష్యామి।

అశ్వత్థామ:
ఓ కురురాజా! మీ సత్కారానికి కావలసిన సామగ్రిని సమకూరుస్తాను.

రాజా:
కిం భవాన్ కరిష్యతి।

దుర్యోధనుడు:
ఏమి చేయనున్నారు?

అశ్వత్థామా:
శ్రూయతామ్।

యుద్ధోద్యతం గరుడపృష్ఠనివిష్టదేహ-
మష్టార్ధభీమభుజముద్యతశార్ఙ్గచక్రమ్।
కృష్ణం సపాణ్డుతనయం యుధి శస్త్రజాలైః
సంకీర్ణలేఖ్యమివ చిత్రపటం క్షిపామి ।। 60 ।।

అశ్వత్థామ:
వినండి –

గరుడారూఢుడై, శార్ఙ్గమనే వింటిని ఎక్కుపెట్టి, చక్రాన్ని దాల్చి, భీకరమైన నాలుగు భుజాలతో యుద్ధసన్నద్ధుడైన కృష్ణుడిని పాండవులతో సహా – బొమ్మలతో క్రిక్కిరిసిన చిత్రపటాన్ని విసిరికొట్టినట్లు – నేలకు పడగొడతాను.

రాజా:
మా మా భవానేవమ్।

గతం ధాత్ర్యుత్సంగే సకలమభిషిక్తం నృపకులం
గతః కర్ణః స్వర్గం నిపతితతనుః శన్తనుసుతః।
గతం భ్రాతృణాం మే శతమభిముఖం సంయుగముఖే
వయం చైవంభూతా గురుసుత! ధనుర్ముఞ్చతు భవాన్ ।। 61 ।।

దుర్యోధనుడు:
వద్దు, వద్దు. అలా చేయవద్దు.

పట్టాభిషిక్తులైన రాజులందరూ భూమి ఒడిలోకి చేరుకున్నారు. కర్ణుడు స్వర్గస్థుడయ్యాడు. భీష్ముడు పడిపోయాడు. నా ఎదుటనే, ఈ యుద్ధభూమిలో నా సోదరశతం నశించిపోయింది. నేనూ అదే స్థితిలో ఉన్నాను. మీరు ధనుస్సును విడిచిపెట్టండి.

అశ్వత్థామా:
భోః కురురాజ!

సంయుగే పాణ్డుపుత్రేణ గదాపాతకచగ్రహే।
సమమూరుద్వయేనాద్య దర్పోఽపి భవతో హృతః ।। 62 ।।

అశ్వత్థామ:
ఓ కురురాజా!

యుద్ధంలో ఆ పాండుపుత్రుడు మిమ్మల్ని గదతో పడగొట్టి, జుట్టుపట్టి ఈడ్చి, రెండు తొడలతో బాటు మీ దర్పాన్ని సైతం హరించాడు.

రాజా:
మా మైవమ్। మానశరీరా రాజానః। మానార్థమేవ మయా నిగ్రహో గృహీతః। పశ్య గురుపుత్ర!

యత్కృష్టా కరనిగ్రహాఞ్చితకచా ద్యూతే తదా ద్రౌపదీ
యద్బాలోఽపి హతస్తదా రణముఖే పుత్రోఽభిమన్యుః పునః।
అక్షవ్యాజజితా వనం వనమృగైర్యత్పాణ్డవాః సంశ్రితా
నన్వల్పం మయి తైః కృతం విమృశ భో! దర్పాహృతం దీక్షితైః ।। 63 ।।

దుర్యోధనుడు:
కాదు, కాదు. రాజులకు దర్పమే దేహము. ఈ దర్పం కోసమే కదా ఈ యుద్ధాన్ని తెచ్చిపెట్టుకున్నది? చూడు, గురుపుత్రా –

ఆనాడు – జూదమాడినప్పుడు – కొప్పు పట్టుకొని ద్రౌపదిని సభలోనికి ఈడ్పించాను. యుద్ధభూమిలో, బాలుడని చూడకుండా అభిమన్యుడిని హతమార్పించాను. పాచికల మిషతో ఓడించి పాండవులను వన్యమృగాలతో తోడుగా అడవులలో నివసించేలా చేసాను. సమరమనే యజ్ఞదీక్షను స్వీకరించిన పాండవులు నా దర్పంలో చాలా కొద్ది భాగాన్ని మాత్రమే హరించారు కదా.

అశ్వత్థామాః:
సర్వథా కృతప్రతిజ్ఞోఽస్మి

భవతా చాత్మనా చైవ వీరలోకైః శపామ్యహమ్।
నిశాసమరముత్పాద్య రణే ధక్ష్యామి పాణ్డవాన్ ।। 64 ।।

అశ్వత్థామ:
అన్ని విధాలుగా ప్రతిజ్ఞ చేసాను.

మీపై, నాపై, వీరలోకంపై ఒట్టువేసి చెబుతున్నాను. రాత్రిపూట యుద్ధాన్ని మొదలుపెట్టి ఆ యుద్ధంలో పాండవులను సంహరిస్తాను.

బలదేవః:
ఏతద్ భవిష్యత్యుదాహృతం గురుపుత్రేణ।

బలరాముడు:
గురుపుత్రుడు చెప్పినదే భవిష్యత్తులో జరగనున్నది.

అశ్వత్థామా:
హలాయుధోఽత్రభవాన్।

అశ్వత్థామ:
పూజ్యుడైన బలరాముడు!

ధృతరాష్ట్రః:
హన్త! సాక్షిమతీ ఖలు వఞ్చనా।

ధృతరాష్ట్రుడు:
అహో! ఈ వంచనకు సాక్షి బలరాముడా?

అశ్వత్థామా:
దుర్జయ! ఇతస్తావత్।

పితృవిక్రమదాయాద్యే రాజ్యే భుజబలార్జితే।
వినాభిషేకం రాజా త్వం విప్రోక్తైర్వచనైర్భవ ।। 65 ।।

అశ్వత్థామ:
దుర్జయా! ఇటు రా!

నీ తండ్రుల పరాక్రమానికి వారసత్వమైనదీ, భుజబలంతో సంపాదించినదీ అయిన ఈ రాజ్యానికి – పట్టాభిషేకం లేకుండానే – ఈ విప్రవాక్యంతో రాజువగుదువు గాక!

రాజా:
హన్త! కృతం మే హృదయానుజ్ఞాతమ్। పరిత్యజన్తీవ మే ప్రాణాః। ఇమేఽత్రభవన్తః శన్తనుప్రభృతయో మే పితృపితామహాః। ఏతత్కర్ణమగ్రతః కృత్వా సముత్థితం భ్రాతృశతమ్। అయమప్యైరావతశిరోవిషక్తః కాకపక్షధరో మహేన్ద్రకరతలమవలమ్బ్య క్రుద్ధోఽభిభాషతే మామభిమన్యుః। ఉర్వశ్యాదయోఽప్సరసో మామభిగతాః। ఇమే మహార్ణవా మూర్తిమన్తః। ఏతా గఙ్గాప్రభృతయో మహానద్యః। ఏష సహస్రహంసప్రయుక్తో మాం నేతుం వీరవాహి విమానః కాలేన ప్రేషితః। అయమయమాగచ్ఛామి।


(స్వర్గం గతః।)
(యవనికాస్తరణం కరోతి।)

దుర్యోధనుడు:
ఆహా! నా మనసులోని కోరిక నెరవేరింది. నా ప్రాణాలు నన్ను వదిలివెళ్ళనున్నాయి. ఇదుగో, శంతనుడు మొదలైన పూజనీయులైన నా పూర్వీకులు. కర్ణుడిని ముందుంచుకొని లేచి నిలబడిన నా నూరుగురు సోదరులు. వీడు – ఐరావతపు శిరోభాగాన ఆసీనుడై, ఇంద్రుడి చేతిని పట్టుకొని ఉన్న కూకటి జుట్టు చిన్నవాడు అభిమన్యుడు, నన్ను ఉద్దేశించి కోపంగా మాట్లాడుతున్నాడు. ఊర్వశి మొదలైన అప్సరసలు నన్ను చేరుకుంటున్నారు. ఇదుగో, ఆకృతి దాల్చిన మహాసముద్రాలు! ఇక్కడేమో, గంగ మొదలైన మహానదులు. వేయి హంసలను పూన్చిన విమానం – వీరులు అధిరోహించదగ్గది – యముడే పంపించాడు. ఇదిగిదిగో, వచ్చేస్తున్నాను.

(స్వర్గానికి వెళ్ళిపోతాడు)
(తెర వాలుతుంది)

ధృతరాష్ట్రః:
యామ్యేష సజ్జనధనాని తపోవనాని
పుత్రప్రణాశవిఫలం హి ధిగస్తు రాజ్యమ్।

ధృతరాష్ట్రుడు:
సజ్జనులకు ధనసమానమైన తపోవనాలకు వెళ్ళిపోతాను. ధిక్! పుత్రులు నశించినందున ఈ రాజ్యం ఫలహీనమైపోయింది.

అశ్వత్థామా:
యాతోఽద్య సౌప్తికవధోద్యతబాణపాణిః

అశ్వత్థామ:
బాణాలను చేత పట్టిన ఈ అశ్వత్థామ, నిద్రిస్తున్నవారిని వధించేందుకు ఈనాడే బయలుదేరుతున్నాడు.


(భరతవాక్యమ్)

బలదేవః:
గాం పాతు నో నరపతిః శమితారిపక్షః ।। 66 ।।


(నిష్క్రాన్తాః సర్వే।)
ఊరుభఙ్గం నామ నాటకం సమాప్తమ్


(భరతవాక్యం)
బలరాముడు:
శత్రుబలాన్ని నశింపజేసిన రాజు మన భూమిని కాపాడు గాక!


(అందరూ వెళ్ళిపోతారు)
ఊరుభంగం నాటకం ముగిసింది.