ఒక సాధారణ ప్రేమ

రాత్రి రెండు దాటింది. ప్రతిభకు నిద్ర రావడం లేదు. బయటనుంచి వినిపిస్తున్న కుక్క ఏడుపు ఇంట్లోని నిశ్శబ్దానికి మరింత పదును పెడుతూ, ఆమె గుండెను పిండేస్తోంది. తన బెడ్‌రూమ్ తలుపు నెమ్మదిగా తెరిచి కిచెన్‌లోకి అడుగుపెట్టింది. నిన్న రాత్రినుంచి ఏమీ తినలేదు. ఆకలితో కడుపు నకనకలాడుతోంది; కానీ గొంతు దాకా ఎగదన్నుకొస్తున్న బాధ మధ్య తినాలనే స్పృహే కలగడం లేదు. ఆర్‌ఓ ఫిల్టర్ నుంచి నీళ్లు గ్లాసులోకి పట్టుకుని గటగటా తాగి హాల్లోకి వచ్చింది.

గోడ మీద వెండి ఫ్రేమ్‌లో తన పెళ్లి ఫోటో అలాగే ఉంది. మధ్యలో కూర్చున్న అమ్మమ్మ, ఇరుపక్కలా అమ్మ-నాన్న, వాళ్ల వెనక నిలబడ్డ తను, ఆనంద్. పెళ్లయిన మర్నాడు సత్యనారాయణ స్వామి వ్రతం ముగిశాక దిగిన ఫోటో అది. ఆ ఫోటోలో ఆనంద్ నవ్వులో ఎంత నిజాయితీ, భవిష్యత్తు మీద ఎంత ఆశ ఉన్నాయో చూసినప్పుడల్లా బాధ అనిపించేది.

రెండేళ్ల పెళ్లి బంధం, విడాకులు, ఆ తర్వాత మూడేళ్లు ఈ ఇంట్లో గడిపిన ఒంటరి రాత్రులు… అన్నీ దాటుకుంటూనే ఇక్కడిదాకా వచ్చింది. ఆ ఫోటో తీసేయమని నాన్న ఎన్నోసార్లు చెప్పారు. కానీ తను ఒప్పుకోలేదు. అమ్మమ్మ బతికున్నప్పుడు అందరూ కలిసి నవ్వుతూ దిగిన చివరి జ్ఞాపకం అది.

ఆనంద్ చెడ్డవాడు కాదు… బహుశా అతను తనతో కఠినంగా ఉండి ఉంటే అతను గుర్తొచ్చినప్పుడల్లా తన మనసుకి ఇంత బాధ ఉండేది కాదేమో. ఎంత మంచి మనిషైనా, నచ్చని జీవితాన్ని అతనితో పంచుకోవడం రోజురోజుకూ ఒక నరకంలా మారుతుందని ఆ పెళ్లయ్యాకే తెలిసింది. అతని సహనం, అతని మంచితనం… చివరికి తనను బంధించే గోడలుగా మారాయి.

లోకం మనకోసం రాసిపెట్టిన పాత్రల్లో ఇమిడిపోవడానికి మనుషులు జీవితాంతం ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ లోపల మనసు, శరీరం రెండూ నిరంతరం ఒక నిజాన్ని చెప్తున్నప్పుడు… ఆ అబద్ధపు పాత్రలో ఎలా ఊపిరి పీల్చుకోవాలి? ‘తను తప్పుడు మనిషా? లేక లోకపు తీర్పులకు ఎదురీది బతికే హక్కు తనకు లేదా?’ అన్న ప్రశ్న ప్రతిభను ఏళ్ల తరబడి లోపలినుంచి తొలిచేసింది.

నిజానికి ఈ అంతర్మథనం నిర్మలతో మొదలైంది కాదు. ఇది తన లోపల ఎప్పటినుంచో దాగుంది. ఇంటర్మీడియట్ రోజుల్లోనే కావ్య క్లాస్ రూమ్ మెట్లు దిగి వెళ్తుంటే చూడటానికి, మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా పక్కన పడేసి కారిడార్‌లో నిలబడేది. కాలేజీలో అమ్మాయిలంతా హీరోల గురించో, ట్యూషన్ లో కుర్రాళ్ల గురించో మాట్లాడుకుంటుంటే, తన మనసంతా కావ్య చుట్టూనే తిరిగేది. అప్పట్లో దీనికో పేరు ఉందని తెలీదు; ఒక నిర్వచనం వెతుక్కోవాలన్న ఆలోచనా రాలేదు. అది తప్పు అని ఏ రోజూ అనిపించలేదు… కేవలం తనలోనే దాచుకోవాల్సిన ఒక సీక్రెట్‌లా మిగిలిపోయింది.

బీటెక్ ముగిసి, అడ్వర్టైజింగ్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాకగానీ నెమ్మదిగా బోధపడలేదు… ఇది ఏ జబ్బో, బలహీనతో కాదు, తన సహజమైన ఐడెంటిటీ అని. అయినా ఇంట్లో ఆ నిజాన్ని చర్చించే ధైర్యం చాలక, పెళ్లి ప్రస్తావన రాగానే తను కూడా మిగతా ఆడపిల్లల్లాగే ఒక మగాడితో ఎలాగోలా సర్దుకుపోవచ్చనే గుడ్డి భ్రమలో పడింది. అందుకే ఆనంద్ సంబంధానికి తల ఊపింది. అలవాట్లను బలవంతంగానైనా మార్చుకోవచ్చేమో గానీ, పుట్టుకతో వచ్చిన అస్తిత్వాన్ని మార్చుకోలేమని అప్పుడు గ్రహించలేకపోయింది.

నిశ్చితార్థం అయ్యాక ఆనంద్ చనువుగా దగ్గరకు తీసుకోబోయినప్పుడు ప్రతిభ ఒళ్లు గడ్డకట్టుకుపోయింది. ఏ చలనమూ లేని ఆమెను చూసి, ‘సారీ… పెళ్లయ్యాక నీకు కంఫర్టబుల్‌గా అనిపించినప్పుడే మనం దగ్గరవుదాం’ అని ఆనంద్ నవ్వి ఊరుకున్నాడు. హనీమూన్‌కి మాల్దీవులు వెళ్దామంటే వద్దంది; ఏకాంతాన్ని తప్పించుకోవడానికే కుటుంబమంతా కలిసి వైష్ణోదేవి ట్రిప్‌కి వెళ్దామంది. రెండేళ్ల కాపురంలో పైకి అంతా నార్మలే… ఆఫీసు ముచ్చట్లు, ఇంట్లో నవ్వులు, వంట పనులు. కానీ అతను ఒక్క అడుగు దగ్గరకు వేసినా తను అప్రయత్నంగా వెనక్కి జరిగిపోయేది. అతని కళ్లల్లో ఆ ఆశ, ఆ తర్వాత పుట్టుకొచ్చే నిరాశ, ఆ వెనుకే దాచుకునే ఓర్పు చూసిన ప్రతిసారీ లోపల ఏదో ముక్కలైపోయేది.

ఓ రాత్రి అతను తట్టుకోలేక తనను హత్తుకోబోయాడు. ఆ స్పర్శ తగలగానే తను ఒక బండరాయిలా బిగుసుకుపోయింది. అతను ఎంత సున్నితంగా దగ్గరకు తీసుకోవాలని చూస్తున్నా, పైన తిరుగుతున్న ఫ్యాన్ రెక్కల వైపు చూస్తూ ఒక ఘోరమైన శిక్షను అనుభవిస్తున్నట్టు మాట్లాడకుండా, ఊపిరి బిగపట్టి పడుకుంది. ఆమె కళ్లల్లోంచి కారిన కన్నీళ్లు అతని ఛాతీ మీద పడ్డాయి. ఆ తడి తగలగానే అతను అదిరిపడి దూరంగా జరిగిపోయాడు.

“ప్రతిభా… నీకు వేరే ఎవరైనా ఇష్టమా? మీ ఇంట్లో బలవంతంగా ఈ పెళ్లి చేశారా?” అని గొంతు వణుకుతుండగా అడిగాడు. “లేదు…” అంది. ఆ సమాధానం నిజమే అయినా, ఆ నిశ్శబ్దం వెనుక ఎన్ని జీవితాలు నలిగిపోతున్నాయో తలచుకుంటే ఆమె దుఃఖం ఆగలేదు.

కొన్నాళ్లు కాపురాన్ని సరిచేసే ప్రయత్నాలు జరిగాయి, మారిటల్ కౌన్సిలింగ్ అన్నారు, ‘ఫ్రిజిడిటీ’ అన్న ముద్ర వేశారు; ఇద్దరి మధ్య మాటలు పెరగాలన్నారు, కాస్త ఏకాంతం కావాలన్నారు. ఆనంద్ చేయగలిగిందంతా చేశాడు; తను ప్రయత్నించిందా అంటే అవునని చెప్పలేము, అప్పటికే ఒక మగాడితో కలిసి బతకడం ఇక తనవల్ల కాదనే నిర్ణయానికి వచ్చేసింది.

ఆ తర్వాత విడాకులు. మళ్లీ ఈ పుట్టింటి గడప. ఈ మూడేళ్లలో అమ్మమ్మ కాలం చేసింది, నాన్న రిటైర్ అయ్యారు. ఆ మూడేళ్ల ఒంటరితనంలోనే తన ఉనికికి ఒక క్లారిటీ వచ్చింది. ఎప్పుడూ ‘గుడ్ గర్ల్’ అనే ట్యాగ్ కోసమే బతికింది — క్లాస్ ఫస్ట్, మంచి ఉద్యోగం, అణకువగల కూతురు. కానీ ఆ ఊపిరాడని పెళ్లి బంధంలోంచి బయటకు రావడమే తను జీవితంలో చేసిన అత్యంత ధైర్యమైన పని; కుటుంబం, సమాజం దృష్టిలో అది ఎంత పెద్ద తప్పిదమైనప్పటికీ. తనను తాను స్వీకరించడమే మొదటి స్వేచ్ఛ అని అర్థమైన రోజుల్లో… నిర్మల నెమ్మదిగా జీవితంలోకి వచ్చింది.

మొదట ఆఫీస్ కొలీగ్‌గా, తర్వాత తన మనసులోని సంఘర్షణను అర్థం చేసుకోగల ఒకే ఒక్క ఫ్రెండ్‌గా, ఆ తర్వాత… బతుకులోని శూన్యానికి ఒక తోడుగా. నిమ్మి అని తను పిలిచే నిర్మల కూడా తనలాంటిదేనని, తనను ఇష్టపడుతోందని తెలిసిన రోజున… ఎండిపోయిన జీవితం మీద మొదటిసారి చిరుజల్లు కురిసినట్టయింది.

ఆఫీస్ క్యాంటీన్‌లో నిర్మలతో అన్న మాటలు గుర్తొస్తున్నాయి: “ఈ అడ్వర్టైజింగ్ అంతా ఒక అందమైన అబద్ధాన్ని అమ్మడమే కదా నిమ్మి. బట్టతల లేని వాళ్లతో బనియన్ యాడ్స్, స్ట్రెచ్ మార్క్స్ లేని మోడళ్ల శరీరాలు, ఇరవై లక్షలమంది రాసే ఎగ్జామ్‌లో డజన్ టాపర్ల ఫోటోలు పెట్టి హోర్డింగులు… లేనిదాన్ని ఉన్నట్టు నమ్మించడమే మన పని. కానీ ఆ అబద్ధాలే మన నిజజీవితాన్ని సఫొకేట్ చేస్తాయి.”

నిమ్మి తన కళ్లల్లోకి చూసి చిన్నగా నవ్వింది. “బయటి లోకాన్ని నమ్మించొచ్చు ప్రతిభా. కానీ మనతో మనం అబద్ధాలాడి, మనల్ని మనం మోసం చేసుకోకుండా బతకగలిగితే చాలు.”

ఆ రాత్రి ఆఫీస్ నుంచి నిమ్మి తన కారులో తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చింది. గేటు బయట కారు ఆపి, ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని కూర్చున్నారు. ఆ చిన్న స్పర్శలో ఒక ప్రశాంతత.. అలవాటుగా దగ్గరగా జరిగి ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. ప్రతిభ వాళ్ల నాన్న రాఘవరావు నిర్మల వైపు వచ్చి, కారు విండోలోంచి పలకరించే ప్రయత్నం చేశాడు… ఇద్దరూ ఈ అనుకోని పరిస్థితికి ఖంగు తిన్నారు. కారు అద్దం అవతలనుంచి నాన్న కళ్లలో కనిపించిన ఆ షాక్, అవమానం, ఆ పచ్చి వేదన…

నిర్మల కంగారుగా కారు రివర్స్ చేసి చీకట్లోకి వెళ్లిపోయింది. ప్రతిభ డోర్ తెరిచి బయటకు వచ్చింది. గేటు ముందు నిలబడి, నిలువునా రాయిలా నిలబడిపోయిన నాన్న వైపు ఒక్క క్షణం చూసింది. ఆయన నోట్లోంచి ఒక్క మాటా రాలేదు; కేవలం వణుకుతున్న శరీరం తప్ప. తను కూడా ఏమీ మాట్లాడలేకపోయింది. బరువెక్కిన అడుగులతో హాల్లోంచి తిన్నగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు గడియ వేసుకుంది.

ఈ మూడు రోజులుగా ఇంట్లో నాన్న, ప్రతిభ మాట్లాడుకోలేదు.


ప్రతిభ గదిలోకి వెళ్లి తలుపు గడియ వేసుకున్న చప్పుడు, బెడ్‌రూమ్‌లో నిద్రపట్టక పడుకున్న రాఘవరావు చెవిన పడకుండా పోలేదు.

తెల్లవారుజామున ఐదున్నరకే ఆయన మంచం దిగి హాల్లోకి వచ్చాడు. పోయినేడు బ్యాంక్‌ ఉద్యోగంలోంచి రిటైర్ అయ్యాడాయన. దాదాపు నలభై ఏళ్ల సర్వీసులో ఉద్యోగిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. నిరుపేద కుటుంబంనుంచి వచ్చాడు. ఆయన చిన్నప్పుడే తండ్రి చనిపోతే, తల్లి కూలి పని చేసి చదివించింది. మ్యాథ్స్ ట్యూషన్లు చెప్పుకుంటూ యూనివర్సిటీలో సీటు సంపాదించి వెంటనే బ్యాంక్ ఉద్యోగం, ఆ పైన చుట్టాల ద్వారా వచ్చిన లక్ష్మి సంబంధం… ప్రతిభను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు.

ఆ పాత రెగ్జిన్ సోఫాలో కూర్చుని, ఒడిలో మడతపెట్టిన న్యూస్ పేపర్‌ను పదే పదే నలుపుతూ శూన్యంలోకి చూడసాగాడు రాఘవరావు. మూడు రోజుల క్రితం ప్రతిభ గురించి తెలిసిన విషయం, ఆ పైన లక్ష్మితో మాట్లాడి పూర్తి నిజం తెలుసుకున్నాక, ఎలా స్పందించాలో ఆయనకు పాలుపోవడం లేదు.

ఆనంద్ గుర్తొచ్చాడు. ఎంత పద్ధతైన కుర్రాడు. విడాకుల కాగితాలు వచ్చాక “మావయ్యా, నా వైపునుంచి నేను చేయగలిగింది అంతా చేశాను… కానీ తన మనసులో నేనంటే ఏమాత్రం ఇష్టం లేదు, తను నాతో ఉండలేదు,” అంటే, వాళ్లిద్దరి జీవితానికి సంబంధించిన ఇంత పెద్ద నిర్ణయం ఆలోచించే తీసుకుంటార్లే అని సర్దిచెప్పుకున్నాడు. కానీ ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు నిజం… ప్రతిభకు ఆడవాళ్లంటేనే ఇష్టం అని ఊహించడానికే ఆయన మనసు ససేమిరా అంగీకరించడం లేదు. ఆయన చాదస్తుడు కాదు; ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి, సైన్స్‌ని నమ్మే మనిషే. ఇలాంటి బంధాల గురించి ఎక్కడో చదివినప్పుడు అది ఎక్కడో దూరంగా ఉన్న ఇంకో ప్రపంచం అనుకున్నాడే తప్ప, రేపు తన కన్నకూతురే ఆ ప్రపంచంలోంచి ప్రశ్నగా మారి తన ముందు నిలబడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ నిజం తన ఇంట్లోనే ఎదురయ్యేసరికి, ఆయనకి ఆలోచన ముందుకి సాగడం లేదు.

తనూ, భార్య లక్ష్మీ ఏ రోజూ ప్రతిభను కట్టుబాట్ల మధ్య ఉంచాలని చూడలేదు. తమకు దొరకని సంతోషాలు, తమకు దక్కని స్వేచ్ఛను తమ ఒక్కగానొక్క కూతురు అనుభవించాలనుకున్నారు. అందుకే సివిల్ ఇంజనీరింగ్ చదివిన ప్రతిభ, గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవ్వమన్న తన మాట కాదని అడ్వర్టైజింగ్‌ ఫీల్డ్ లోకి వెళ్తానంటే కాస్త బాధ అనిపించినా… ఆమె ఇష్టం కోసం వెనక్కి తగ్గాడు. ఆఖరికి విడాకుల విషయంలో కూడా, సమాజం ఏమనుకుంటుందో అన్న భయం ఉన్నా, అడ్డు చెప్పకుండా ప్రతిభ నిర్ణయాన్ని సమర్థించాడు.

కానీ కూతురు ఇప్పుడెటు వెళ్తోంది ? రేపు సమాజం ముందు ఎలా నిలబడుతుంది? దీని భవిష్యత్తేమిటి?


కిచెన్‌లోంచి కాఫీ డికాషన్ వాసన వచ్చింది. లక్ష్మి స్టవ్ కట్టేసింది.

ముప్పై ఒక్క ఏళ్ల క్రితం పన్నెండో తరగతి చదువు పూర్తి కాగానే ఈ ఇంట్లో అడుగుపెట్టిన తనను రాఘవ ఎంతో ఆదరంగా చూసుకున్నారు. పెళ్లయిన కొన్నేళ్లకే తన తండ్రి చనిపోయినప్పుడు రాఘవే పెద్ద కొడుకై నిలబడ్డారు; తండ్రి వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చి, అత్తగారిని తెచ్చి చివరిదాకా కన్నతల్లికన్నా ఎక్కువగా చూసుకున్నారు. అంతటి నిండైన మనిషి కళ్లల్లో ఈ మూడు రోజులుగా కనిపిస్తున్న కోపాన్ని, అసహనాన్ని లక్ష్మి గమనిస్తూనే ఉంది. కూతురు జీవితం ఇంత పెద్ద మలుపు తిరిగినా తను కనీసం కన్నీళ్లు కూడా పెట్టుకోకుండా పనుల్లో ఎలా పడిపోతోందన్నదే ఆయన ప్రశ్న. ఆయనలాగే తానూ గుండెలు బాదుకుంటూ కూర్చోవాలా?

అయినా, తల్లికి రుజువులు అక్కర్లేదు కూతురి మనసు అర్థం చేసుకోవడానికి.

ప్రతిభ బీటెక్ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు వాళ్ల ఫ్రెండ్ గాయత్రి ఇంటికొచ్చిన ఆ రాత్రి… గాఢనిద్రలో ఉన్న ఆ అమ్మాయి ముఖాన్ని ప్రతిభ అంత తీక్షణంగా, ఇష్టంగా చూస్తున్న చూపును ఆనాడే గమనించింది లక్ష్మి. ఆ విషయమే తన తల్లితో చెప్తే, ఆమె ముందు కాస్త ఆశ్చర్యపోయినా, ‘కొన్నిసార్లు ప్రేమ సమాజం గీసిన గీతల లోపలే పుట్టాలని నియమమేం లేదు లక్ష్మి, మన పిల్ల మనసుని మనం కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు?’ అంది. లక్ష్మి కూతురి మనసుని అర్థమైతే చేసుకుంది కానీ రాఘవకు ఎలా చెప్పాలో తోచక ఊరుకుంది; ప్రతిభతో కూడా ఎలా మాట్లాడాలో తెలియక మిన్నకుండిపోయింది. పెళ్లి పీటల మీద ఆనంద్ తాళి కడుతున్నప్పుడు కూతురి కళ్లల్లో కనిపించిన ఆ శూన్యం ఆమెకు తెలుసు; ఏదో జైలు జీవితానికి సిద్ధపడుతున్నట్టున్న ఆ చూపును రాఘవ కనిపెట్టలేకపోయారు. ఏడాది తిరక్కుండానే ఆనంద్ ఫోన్ చేసి బాధపడుతుంటే రాఘవ కంగారు పడటం చూసి, తాను ఆ రోజే ఈ పెళ్లి ఆపి ఉండాల్సిందని ఎంతగానో బాధపడింది లక్ష్మి.

ఈ మధ్య నిర్మల ఇంటికి వస్తుంటే కిచెన్ నుంచే చూసేది. వాళ్ల ఇంగ్లీష్ మాటలు తనకు అర్థం కాకపోయినా, తన కూతురి ముఖంలోకి మళ్లీ నవ్వు రావడం చూసింది. కొన్నేళ్లుగా కనిపించని ఆ కళ, నిర్మల పక్కన ఉన్నప్పుడు మళ్లీ కనిపించింది. రాఘవ పెంచిన పద్ధతివల్లే ప్రతిభ ఇంత బలమైన మనిషిగా ఎదిగింది; కానీ ఈ రోజు లోకం ఏమనుకుంటుందో అన్న భయమే ఆయన్ని బాధపెడుతోంది. లోకం ముందు తలదించుకోవాల్సి వస్తుందని ఆయన కుమిలిపోతున్నారు. కానీ తన కూతురు ఏ తప్పూ చేయలేదని లక్ష్మికి తెలుసు. ఈ సమాజానికి విరుద్ధంగా తన కూతురు ఎలా నెట్టుకొస్తుంది అనే ప్రశ్నలకు లక్ష్మి దగ్గర ఇప్పుడు జవాబు లేదు; కానీ తన కూతురి విచక్షణ మీద, ధైర్యం మీద నమ్మకమైతే ఉంది.
ఆమె కాఫీ గ్లాసు హాల్లోకి తెచ్చి టీపాయ్ మీద పెట్టింది. “కాఫీ తాగండి,” అంది మామూలుగా. రాఘవ ఆమె వైపు చూడలేదు.


గేటు చప్పుడు విని గుమ్మం దగ్గరికొచ్చిన రాఘవకి సత్యం కనిపించాడు. సత్యం రాఘవకి కజిన్ అయినప్పటికీ సొంత అన్నదమ్ముల్లా ఉంటారు. ఇద్దరికీ ట్రాన్స్‌ఫర్లు అయినా కూడా పాతికేళ్లుగా పక్క పక్క ఇళ్లల్లోనే వారి కుటుంబాలు ఉంటున్నాయి. సత్యానికి, లతకి పిల్లలు లేరు. పిల్లలు లేని ఆయన ఇంట్లో ప్రతిభ చిన్నప్పుడు ఆయన చేయి పట్టుకుని ‘సత్యం బాబాయ్, ఇంకో లెక్క పెట్టివ్వవా’ అని అడుగుతుంటే సొంత కూతురేమో అన్నట్టు మురిసిపోయేవాడు.

నిన్న మధ్యాహ్నం లక్ష్మి సత్యం ఇంటికి వెళ్లి ఆయనతో, ఆయన భార్య లతతో జరిగిన విషయం చెప్పి బాధపడింది. రాత్రి సత్యం ప్రతిభకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఎప్పటిలాగే ప్రతిభ చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడింది. నాన్న తన వల్ల బాధపడ్డాడనే దిగులు ఉంది తప్ప, తనేదో తప్పు చేశానన్న అపరాధ భావం లేకపోవడం చూసి, సత్యానికి ఆమె ధైర్యం నచ్చింది.
హాల్లోకి వచ్చిన సత్యం రాఘవ పక్కనే సోఫాలో కూర్చున్నాడు. కాసేపు నిశ్శబ్దం అలాగే ఉండిపోయింది. ఎలాంటి లెక్చర్లు ఇవ్వకుండా, సోఫాలో ఉన్న బట్టలు మడతపెడుతూ నెమ్మదిగా అన్నాడు.

“రఘు అన్నాయ్… నీకు చెప్పగలవాడిని కాదు… కానీ లోకం గురించి మనకి భయాలు ఉండటం సహజమే. ఏం చేయాలో, ఎలా స్పందించాలో నాకు కూడా తెలీదు. కానీ ఒకటి తెలుసు, మన ప్రతిభ చాలా గట్టిది. తన జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిగలది. దాని నిర్ణయాలను గౌరవించడం కుటుంబసభ్యులుగా మన బాధ్యత అనుకుంటాను…”

రాఘవరావు సత్యం వైపు చూశాడు. ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. చేతివేళ్లు వణికాయి కానీ ఏమీ మాట్లాడలేదు. సత్యం ఆయన భుజం మీద చేయి వేసి, ఎక్కువ మాట్లాడకుండా నెమ్మదిగా లేచి వెళ్లిపోయాడు.

పొద్దున్న తొమ్మిది గంటలు దాటాక… ప్రతిభ బెడ్‌రూమ్ తలుపు తీసిన చప్పుడు అయింది.

ఆమె ముఖం పాలిపోయి ఉంది. రాఘవరావు కూర్చున్న సోఫాకి కొద్ది దూరంలో వచ్చి నిలబడింది.

రాఘవరావు ఆమె వైపు చూశాడు. గుండెల్లోంచి ఎగదన్నుకొస్తున్న ప్రశ్నలన్నీ గొంతు దాకా వచ్చి ఆగిపోయాయి. లోకపు కట్టుబాట్లన్నీ కూతురి మీద ప్రేమ ముందు కరిగిపోతున్నట్టు అనిపించింది.

“ఆఫీస్‌కి వెళ్తున్నావా?” అన్నాడు రాఘవరావు. బొంగురుపోయిన ఆ గొంతులో మూడు రోజుల తర్వాత మొదటిసారి జీవం వినిపించింది.

ప్రతిభ తల ఊపింది. “అవును నాన్నా.”

“టిఫిన్ చేసి వెళ్లు,” అన్నాడు నెమ్మదిగా. ప్రతిభ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

ఆ తర్వాత రోజుల్లో ఇంట్లో పెద్ద మార్పులేమీ జరగలేదు; విప్లవాలు ఏమీ రాలేదు. కానీ మూడు రోజులుగా ఉన్న ఆ బిగుసుకుపోయిన వాతావరణం మెల్లగా కరిగి, ఆ మనుషులు సాధారణ జీవితంలోకి వస్తున్నారు.

వారం తర్వాత, ఒక శనివారం సాయంత్రం గేటు బయట కారు ఆగింది.

రాఘవరావు పేపర్ పక్కన పెట్టి కిటికీ లోంచి చూశాడు. ప్రతిభ పక్కనే నిర్మల—అడుగుల్లో భయం, ముఖంలో మొహమాటం.
ప్రతిభ లోపలికి వచ్చి, “నిర్మల వచ్చింది నాన్నా,” అంది.

రాఘవరావు వెంటనే లేవలేదు. ఆయన చూపులు నిర్మల మీదే నిలిచాయి.

వంటింట్లోంచి లక్ష్మి వచ్చింది. ఆమె కళ్లలో ఎలాంటి తడబాటూ లేదు. “రా అమ్మా, కూర్చో… కాఫీ పెడతాను,” అంటూ వెళ్లిపోయింది.

నిర్మల సోఫా అంచున బింకంగా కూర్చుంది.

రాఘవరావు కళ్లద్దాలు తీసి ఒళ్లో పెట్టుకుంటూ, “ఆఫీస్‌లో పని బాగానే నడుస్తోందా అమ్మా?” అన్నాడు. గొంతులో గంభీరత ఉంది, కానీ ఏ చేదూ లేదు.

“బాగానే ఉంది అంకుల్,” అంది నిర్మల నెమ్మదిగా.

ప్రతిభ పక్కనే నిలబడి నాన్న వైపు చూసింది. ఆమె కళ్లల్లో అప్పటిదాకా ఉన్న ఒక రకమైన బిగింపు నెమ్మదిగా కరిగిపోవడం ఆయన గమనించాడు.

వంటింట్లోంచి పొయ్యి వెలిగించిన చప్పుడు. మరిగే పాల వాసన.

రేపు లోకం ఏమంటుందో రాఘవకు తెలీదు. కానీ తన కూతురి ముఖంలో ఆ క్షణం కనిపించిన ప్రశాంతతను చూశాక, ఇక ఏ ప్రశ్నకూ భయపడాల్సిన అవసరం లేదనిపించింది ఆయనకు.