తాళం వెనుక తాళం తీస్తూ పోతే
తలపులలా తెరుచుకుంటూనే
వుంటాయి.

శూన్యమైన గది మూలల్లోనూ
ముడుచుకున్న జ్ఞాపకాలు
మళ్ళీ తలలెత్తి చూస్తాయి.

కాఠిన్య కాంస్యభూమిని చూసి గాలి, నక్షత్రాలు,
సరివిచెట్టు, హోటల్, బ్రతుకు కదలికలు,
సర్వావయాలూ నిజంగానే రవంత నిర్జీవమైనాయి,
రాయిగామారిన అహల్య ఏ రాముడికోసమో ఎదురుచూస్తున్నది.

పిట్టలు పారే వేళకి ముందే
దండెం మీది నీ బట్టలు మోసుకుని నేనో
లేరంగుల ఇంద్రధనుస్సునై ఇంటిలోకి నడవడం
ఒక రంగులకలలా ఉంటుంది.

నీ మీద నేనొక పద్యం
నీ వీపు పలక మీదో
చన్నుల గుండ్రాల మీదో
మొదలుబెట్టి నప్పుడు
నువ్వు తెచ్చిపెట్టుకున్న
బడాయి బింకం
సడలిపోతుంది

నిద్రిస్తున్న రహదారిని లేపి
కృతజ్ఞతలు చెప్పాలని ఉంది

నిద్రాభంగమైన
ఆ ప్రశాంతతను గమనించాలని ఉంది

ఇక అప్పుడు, నా మెడ చుట్టూ చేతులు వేసి నువ్వు నన్ను దగ్గరకి లాక్కుంటే, మంచు రాలి కాలం వొణికే వేళల్లో, ఎవరో చివ్వున ఒక నెగడును రగిలించిన కాంతి-
మరి అప్పుడే ఎక్కడో గూ గూ మని పావురాళ్ళ కువకువలు
మరి బ్రతికే ఉన్నామా మనం, అప్పుడు?

నువ్వు పరాకుగా ఒంటరిగా సంచరిస్తున్నప్పుడు, నీ ఇంటి పెరట్లోనో
రద్దీ వీధులలోనో ఒక హస్తం నిన్ను తాకి వెళ్ళి పోతుంది. అప్పుడే ఉతికి
ఆరవేసిన వస్త్రం గాలికి కదిలి ఇంత తడిని నీ ముఖాన చిమ్మినట్టు-

అక్టోబర్ లో అడుగు పెట్టేసరికి
చుట్టూ వున్న చెట్లన్నీ
ముదురు రంగు కాషాయాల్ని ధరించటం మొదలెడతాయి

పిల్లలమంతా మళ్ళీ రెక్కలు విప్పుకున్న
సీతాకోకచిలుకలమవుతాము
కట్టుతాళ్ళు విప్పుకున్న లేగదూడలమల్లే బయటికురుకుతాము
నోళ్ళు తెరుచుకుని ఆఖరి వానచుక్కలు అందుకుంటూ…

రెక్కలు విప్పుకొన్న దూది కొండల్లో
చెట్లూ, ఏనుగులూ, కొండశిలవలూ ఇంక యేవో
అగపడినట్టే పడి మాయమవుతుంటాయి
వాటి కిందగా ఒంటరిగానో గుంపులుగానో
దేన్నీ పట్టించుకోకుండా
రెక్కలాడిస్తూ పోతున్న పిట్టలూ-