స్వేచ్ఛాభారం

భ్రమకు వాస్తవానికి మధ్య
కలల జ్ఞాపకాల సాలెగూడు
అదొక ఇష్టమైన బందీఖానా!
వదలాలనిపించని తీపి తెర!

ఆ సాలెగూటి దారాల చిక్కుముడులనే
పట్టుపాన్పులా భావించి
గతం కప్పిన వెచ్చదనంలో
రేపటి బెంగలేని పసిపాపలా
ఆదమరిచి నిదురించాలని
నిశీథి తపన!

ఆ మైకంలోనే
తలరాతని తీర్చిదిద్దే బరువుని దించేసి
నిర్ణయ భారాలన్నీ గాలికొదిలేసి
విధిచేతిలో కీలుబొమ్మగా ఒదిగిపోతే
మెడకు బిగుస్తున్న ఉరితాళ్ళు రక్షణ వలయాలై
బాధ్యతలేని మైకాన్ని నరనరాల్లోకి ఎక్కిస్తుంటే
ఆ బంధనమే అమ్మ ఒడిలా లాలిపాడుతుంది.

కానీ, ఆ మత్తులో ఉన్నంతసేపే ఆనందం!
నిర్దయత్వపు నిట్టూర్పుతో తేరుకునే వేళలో
ఆ సుఖాల పొర ముక్కలుచెక్కలై గుచ్చుకుంటుంది.
నిన్నటిదాకా జోలపాడిన నిశ్శబ్దమే
నేడు అర్థంలేని గోలగా మారి
భ్రమలోకం ఆవలకు నిర్దాక్షిణ్యంగా
విసిరికొడుతుంది.
విఫలనాటకం మిగిల్చిన నిత్య వేదనిది.

నేను తేరుకోకముందే నిదురలేచిన లోకం
పెదవి విరుపులతో వెకిలిగా వెక్కిరిస్తూ
యథార్థం అంచు కొనలను చవిచూపిస్తుంది.
అక్కడి నుంచే ఆశ నిరాశల సందేహాల సందోహాలు
గుట్టలు గుట్టలుగా పుట్టుకొస్తూ.
గందరగోళంలోకి నెట్టివేస్తాయ్.

ఆ దిక్కుతోచని సందిగ్దంలో.. ఏం చేయనూ..?
దేవుడే చూసుకుంటాడని ఊరుకుందునా?
నియత నియమాల వెంట పరుగులెత్తుదునా?
అవన్నీ పరాయి అడుగు జాడలే!
ఏదీ దారిచూపదు
ఏదీ దరి చేర్చదు.
తప్పించుకోలేని శూన్యం వెయ్యిన్నొక్క చేతుల్తో
కౌగిలించి ఊపిరి బిగదీస్తుంది.

ఆ ఊపిరాడని ఉక్కిరిబిక్కిరిలో
నాకు నేనే దిక్కు అని తెలిసిన దిక్కుమాలిన క్షణంలో
వెన్నులోంచి వణుకు పుట్టి
ఉనికిని సైతం కబళిస్తుంది.

అయినా సరే పయనం సాగాల్సిందే!
ఇంత భారాన్ని మోస్తున్న భుజాలు వంగినా కుంగినా
భయాన్ని బాధను దిగమింగి
మోహపు ఉచ్చులో చిక్కులు తొలగిస్తుంటే
గుండె లోతుల్లోంచి ఉబికిన కన్నీటి ధారే
స్తబ్దుగా ఉన్న బతుకును
గమనాన్ని సృష్టించుకునే నదిలా
ఉరకలేయిస్తుంది.

ఆ ఉరక ఉధృతిలో
గతం నీడలన్నీ నదీ ప్రవాహ వేగంలో లీనమై
కరిగిపోతాయి.
తర్కం గీసిన గిరిగీతలను చెరిపేస్తూ
ఏ తీరం చేరాలనే ఆశలేని నా ప్రస్థానం
ఎవ్వరూ ఆపలేని ప్రవాహం అవుతుంది.

ఫలితం ఏదైనా సరే, స్వేచ్ఛ బరువైతే అవ్వనీ.
అదొక యుద్ధం గెలిచిన గాయం.
పరాయి పట్టుపరుపుల మీద
సేదతీరడం కన్నా,
స్వయంకృత గాయాన్ని
గర్వంగా తాకడమే నాకు హాయి!

ఆ మంటను ఆస్వాదిస్తూ ఈ నిప్పుల కొలిమిలోనే
నా అస్తిత్వాన్ని పోతపోసుకుంటాను.
ఆత్మగమనమెప్పుడూ పరాధీనం కాదు
అవును.. ఈ బరువే నిజం.
స్వయందగ్ధ అస్తిత్వ సాక్షాత్కారం!

[ప్రముఖ ఫ్రెంచ్ అస్తిత్వవాది ఝాఁ పోల్ సార్త్ర (Jean Paul Sartre) రచనల ప్రేరణతో]