ఆహారమూ భయమూ
మాత్రమే మిగిలేయి
నిద్ర దూరపు చుట్టం
మైథునం మరిచిపోయిన
యౌవనపు స్మృతిలేశం
నిత్య సంఘర్షణ
నైమిత్తిక కార్యకలాపాల
సమాహారం
ప్రపంచమంటే
సహాయకుల గుంపు
పనివాళ్ల వరుస
పటాల్లో గోడమీద
అతుక్కుపోయిన
దైవానుగ్రహం
ప్రపంచమంటే
పాల పొట్లాం
కూరగాయల బండి
సరుకుల అంగడి
దవాఖానా
ప్రపంచమంటే
వసారాలో వాలుకుర్చీ
మంచం మీద
దులిపిన దుప్పటి
ప్రపంచమంటే
గుప్పిట మందుబిళ్ళ
గ్లాసులో నీళ్ళ చుక్క
క్రమం తప్పకుండా
మోగే గడియారం
చుట్టూ ఉన్న ప్రపంచం
దాటి
మరో ప్రపంచం
కనిపిస్తూ వినిపిస్తూ
ఊదారంగు ఊహలో
మెరుస్తూ
గతజల సేతు బంధనం చేస్తూ
ఇంద్రజాలికుడు
నిలబెట్టిన తాడుమీద
ఎగబాకుతూ
ప్రపంచం
చందనం వాసనలా ఉంటుంది
ప్రపంచం
దీపంలా వెలుగుతూ
అగరు ధూమంలా
చుట్టేస్తూ
