వీథి వీథంతా
చేతులు కలిపి
చితుకులతో
నిప్పు పాటయ్యేవారు
అవి
వెచ్చని బతుకు క్షణాలు
చుట్టూ చేరిన
మనుషులు
కురిసే జ్ఞాపకాల సెగ
అల్లుకున్న
పొగమంచు పంజరం
కథలు పుట్టేవి
వెచ్చని రెక్కల కుర్రాడు
మంచులో మునిగిన కథ
మంచు తెర మీద విరిసిన
కాంతి పూల కథ
నవ్వులు
మొలిచేవి
మా పెద్దోళ్ళు
పాత సరదాలు చెప్పి
మా లోలోపల
చిన్న ఎండను రేపేవాళ్ళు
ఎవరు నోరు విప్పినా
పొగపూలు రాలేవి
నాలుగు దిక్కుల నుంచి
చుట్టుముట్టినా
మేం దర్జాగా కూర్చుని
వేడి వేడిగా ఉండేవాళ్ళం
చలి
కోరలు
పెరికేస్తామని
తోక ముడిచేది
