మెట్రోపాలిటన్ ఆంబియంట్ శూన్యంలో,
నా గొంతుక కేవలం కరప్ట్ అయిన ఆడియో ఫైల్.
కాంక్రీటు మ్యాట్రిక్స్ క్రింద, నాడుల స్పందన
ఒక సిస్టమ్ గ్లిచ్‌లా రికార్డయింది.
నా ఆత్మలో
అలజడి మాత్రం ఆగిపోలేదు;
ఫైబర్ ఆప్టిక్ తీగలకు అతీతంగా,
అనంతపు కోడ్‌లో,
ఒక అసంపూర్ణ ఆర్కెస్ట్రాను
నేను కంపోజ్ చేస్తున్నాను.
ఏ లాగ్-ఆఫ్ క్షణాన, ఈ రాగం
నీ ప్రొఫైల్‌కు శ్రుతి కలుపుతుందో?
యాంటీ-వైరస్ స్కాన్ దాటి, నా స్వరం వెనుక
దాగున్న ఏకాంతపు ఆల్గరిథమ్ ఎప్పుడు నీకు అర్థమౌతుందో?
ఈ డిజిటల్ తెరల ఫైర్‌వాల్ వెనుక,
నిన్ను చేరేందుకు నా పాటకు
ఇప్పుడు రియల్-టైమ్ కనెక్షన్ లేదు;
వాస్తవానికి
నా కళకు లైక్ బటన్ నొక్కే హృదయాలు,
ఈ ట్రెండ్ లో ఫేడ్ ఔట్ అయ్యాయి.
నిజానికి, ఈ లాభనష్టాల డేటాసెట్‌లో,
నీ మనసు, ఆకాశం లేని క్లౌడ్-స్టోరేజ్‌లా మిగిలిపోయింది.
అవసరాల అడ్వర్టైజ్‌మెంట్లలో పడి,
భావ దారిద్య్రపు టోపోగ్రఫీలో దాహంతో ఎండిపోయావు.
రియాలిటీ ఫిల్టర్‌ను కోల్పోయిన శూన్యంలో మిగిలిపోయావు.
నా ఫ్రీక్వెన్సీ నీ సెన్సార్‌కు దూరమయ్యాక,
నీ అంతరంగపు సంగీతం శాశ్వతంగా మ్యూట్ అయిపోయింది.
శూన్యంలో తేలుతున్న శిథిల స్మారక స్తూపాలు
నీ మ్యూట్ బటన్‌ను చూసి వ్యంగ్యంగా నవ్వుకుంటున్నాయి.
ఈ లోహ మోహాల నియోన్ జ్వరంలో,
కళా విన్యాసాలలోని నిప్పూ,
ఆ కాసిన్ని కనీసపు కదలికలూ,
నిరాశలో బూడిదయ్యే లోపు.
మరొక్కసారి,
నీలోని డార్క్ మోడ్‌ను ఛేదించుకొని,
హృదయాకాశంలో మేఘాలై పురివిప్పుకుంటున్న
గానాలను విను!
ఇరుకు బంధాల పిక్సెల్స్‌ను విదిలించి,
పిరికి మౌనాల స్క్రీన్‌ను పగులగొట్టి,
సింథటిక్ కాంతి కిరణాలు,
తొలి వర్షాన్ని తాకినంత తీవ్రంగా,
నా స్వరాన్ని ఒక్కసారి,
లోలోపలి స్పందనతో ఆలకించు.
నా నాడుల మీద అవతరించి,
ఊపిరి పోసుకుంటున్న పాటను,
డౌన్‌లోడ్ చేసుకో!
నా పాట పల్లవి నుంచి
చరణాల దాకా అన్నింటినీ
నీ సిస్టమ్‌కు రీబూట్ పాయింట్స్‌లా అలింగనం చేసుకో.
ప్రేమ అనే పాత ప్రోటోకాల్‌ను మళ్లీ ఇన్‌స్టాల్ చేసుకో!
***