అవచనం వచనం ప్రియసన్నిధా-
వనవలోకనమేవ విలోకనమ్
అవయవావరణం చ యదంచల-
వ్యతికరేణ తదంగసమర్పణమ్
– కాళిదాసు
పలుకునో, వివరణమునో, ప్రశ్ననో మ
లచి, ప్రియజిగీష విడుచుట ప్రణయమునకు
ప్రకటరూపము కాబోదు; లలితమైన
హృదయభూమిక స్పందించి కదలనపుడు.ఒకరి యంతరంగసమరశకలములకు
ప్రాతిపదికలను వెతికిపట్టి, ఫలిత
శాపములను విధించు విస్తారఖేల
కొరకు కాదు ప్రియమనోనుకూలనములు.మాట వెనుకటి మౌనము, తేటగుండె
చప్పుడుల మధ్య నిశ్శబ్దసాంద్రగీతి
ప్రియవిచారనిశ్చలతలో లీనమైన
యంత, బాహ్యచేష్టలు ప్రాణవంతమగును.