చీమ తల కన్నా చిన్నదేదీ అంటే, అది తినే ఆహారం అని సామెత. తెలుగులో వెలువడుతున్న పుస్తకాలలోని సాహితీనాణ్యత కన్నా కనాకష్టంగా ఉన్నదేదీ అంటే, జవాబు ఆ పుస్తకాల ముందుమాటలు అని. పుస్తకం నుంచి కాపీ పేస్టు ఉటంకింపులు, వాటి మీద కాసిని ప్రశంసలతో, ఈ రచయిత ఇలాంటి రచనలు మరెన్నో చెయ్యాలనే ఆశీర్వాదపు ఆకాంక్షతో ముగించడం – తెలుగునాట ముందుమాట కేవలం ఒక కాండెసెండింగ్ టెంప్లెట్. అడిగో అడిగించుకునో, కొండొకచో నవతరం పట్ల ఇది తమ గురుతరబాధ్యత అనుకునే స్మగ్వినయంస్మగ్వినయము = A state of being smug about one’s apparent వినయము. చూడుడు: వ్యథ – 2004తో తామే భరోసా ఇచ్చో, ముందుమాటలు రాసే సాహిత్యప్రముఖులందరికీ తెలియాల్సింది దాని వల్ల వారి కీర్తి ఏమీ పెరగదని, వారికి కొత్త గుర్తింపేమీ రాదని. సరికదా, ఆ ముందుమాట పేలవంగా ఉంటే ఉన్న కాస్త గౌరవమూ పోతుందని. ఉండే ప్రాంతాన్ని బట్టో, లేదూ తాము చదివిన ఏ ఒకటో రెండో కథలూ కవితలను బట్టో కవిరచయితలకు ప్రవాసం, భావుకత్వం, ఆవేశం, అర్బన్, స్త్రీవాదం వంటి ముద్రవేసి, సదరు ముద్రకు అనుగుణంగా కొన్ని పాదాలు, పేరాలు ముక్కలుగా ప్రస్తావించి పోల్చుతూ, తమ జ్ఞానాన్ని ప్రదర్శించడం – రాసే ముందుమాట ఆ పుస్తకం గురించో లేక తమ గురించో అర్థంకాని స్థితికి వచ్చేశాం. పుస్తకం ప్రపంచానికి కిటికీ అయితే ముందుమాట పుస్తకానికి కిటికీ. ముందుమాట పుస్తకానికి ఒక దిక్సూచి. అది రచయితను, వారి సాహిత్యాన్ని, శకలాలుగా కాక సంపూర్ణంగా విశ్లేషించి విమర్శిస్తుంది. పాఠకుడు తనంతటతాను తెలుసుకోలేని విభిన్నపార్శ్వాలని చూపిస్తుంది. అవసరమైన చోట ఆ సాహిత్యానికి ఒక చారిత్రిక సందర్భాన్నీ ఇస్తుంది. అందుకని, ముందుమాట రాయాలంటే ముందు ఆ పుస్తకంతో కొంతకాలం బతకాలి. దాని వస్తువును కూలంకషంగా పదివైపుల నుంచి పరిశీలించాలి. మంచిచెడ్డలు, లోతుపాతులు బేరీజు వేయాలి. ముందుమాట రాయడంలో ఒక కొత్తవిషయాన్ని కనుక్కున్న శాస్త్రజ్ఞుడి శ్రమ, ఆనందం, గర్వం ఉండాలి. అయితే, ఇంత అర్థవంతమైన ముందుమాటలు మనకు తెలుగులో కనపడవు. అలాంటి అవకాశం అన్నిసార్లూ రచయితలు కల్పిస్తున్నారా అన్నది ప్రశ్న అయినప్పుడు ముందుమాట రాయలేనని తప్పుకొనే ఆదినిష్ఠూరం అందరికీ మంచిది. వెరసి, ఈ టెంప్లెట్ ముందుమాటలను రచయితలు ఆశించడంలో సదరు ముందుమాటకులు-రచయితలు తాము ఒకే సాహిత్యపరమైన రాజీకి చెందినవారిమని సూచించడం, తద్వారా తమ సాంగత్యాన్ని ప్రదర్శించడం మినహా వేరే ఉద్దేశ్యం కనిపించదు. సమస్య ఏమిటంటే, ఈ తప్పనిసరి ముందుమాటల వల్ల పుస్తకం తనంతట తానుగా నిలబడగల అవకాశాన్ని కోల్పోతుంది. ముందుమాటకులు ఎంత ఇరుకు చూపుతో కథలను లేదా కవిత్వాన్ని పరిచయం చేస్తారో, అదే ఇరుకు దారి పాఠకులకూ ఎదురుగా కనపడి, రచన వైశాల్యాన్ని గుర్తించడం కష్టమయేలా చేస్తుంది. పుస్తకంలోని కొత్త ధోరణులకు, పరిచయాత్మకంగా పాఠకులకు అడ్డం పడకుండా ఉండే ముందుమాటల వల్ల లాభం లేకపోయినా నష్టం లేదు. కాని, తమ రచనల పట్ల గౌరవమూ నమ్మకమూ ఉన్న రచయితలే ఆలోచించుకోవాలి, ఇట్లాంటి ముందుమాటలు ఎవరి కోసం, ఎందుకోసం అన్నది. అయినా ముందుమాటకులు ప్రాచీనకవిత్వం చదువుకున్నారో లేదో కానీ, శతకాలు బానే చదువుకున్నారు. కొండ అద్దమందు కొంచమై ఉంటుందిరా అంటే, కొంచముండుటెల్ల కొదువ కాదని అరువు మాటలతోనే బైఠాయిస్తారు.
శీర్షికలు శీర్షికలు
అబద్ధాలాడకూడదు. నిజఁవే. కాని, మనసులో ఉన్నవన్నీ చెప్పకూడదు అని ఈమధ్యనే తెలిసింది. అందులోనూ, అమ్మా బామ్మా లాంటివాళ్ళతో. నాకు ఏఁవిటో బాగోలేదు. నాకు ముసురు పట్టింది అని చెప్పేననుకో. ఇంక చూడు రాద్ధాంతం చేస్తారు. దిష్టి తీస్తారు. తాయెత్తు కడతామంటారు. ఆంజనేయస్వామి బిళ్ళ గొలుసు మెళ్ళో వేస్తామంటారు. అందుకని అబద్ధం ఆడొచ్చు!
అతీతవాహకత్వం ఇంకా ప్రయోగశాలలకే పరిమితం కానీ అర్ధవాహకాలు (semiconductors) మన దైనందిన జీవితాన్నే పూర్తిగా మార్చివేశాయి! ఈ రోజుల్లో ట్రాన్సిస్టర్లు, చిప్పులు (chips), కంప్యూటర్లు, సెల్ ఫోనులు, లేసర్లు, వగైరాలు లేకుండా మనకి రోజు గడవదు కదా!
వీధి చివర మలుపు అంచున వున్న దీపస్తంభపు తీగ గాలి ఊయల వూగుతుండగా దానిని వేళ్ళ మధ్య ఉన్న నా కలంతో చలన స్తంభన విద్యకు కట్టుచేసి కాగితంలోకి చేర్చడంలో వున్న మహదానందాన్ని నేను మరెక్కడా పొందలేదు. నాకు ఊహ ఎరిగిననాటి నుండి ఇప్పుడు ఇంతవాణ్ణి అయ్యాకా కూడా నా జీవితంలో నేను బొమ్మ వేయకుండా వున్న ఒక్క రోజు లేదు.
ఆ మాట మరి దేనికో తగిలినట్టయిన రంగారెడ్డిలో మళ్ళీ తెలియని భయం ప్రవేశించింది. తెలియకుండానే జేబు మోస్తున్న బరువు స్పృహలోకి వచ్చింది. ఊహల్లో ఉన్నదాన్ని వాస్తవంలోకి తేవడానికి తను పెట్టుకున్న గడువు మరీ దగ్గరగా ఉందేమో. కాలేజీలో చేయలేని ధైర్యం క్యాంపులో మాత్రం వస్తుందా? ఇది కొంత ఇన్‌ఫార్మల్‌గా ఉండగలిగే జాగా కావడంతో ఎక్కువ వీలు ఉంటుందనిపించింది.
గూఢచారి కోడిపెట్ట: యాజమాన్యం ఎప్పుడూ పనివారిమీద ఒక కన్నేసి ఉంచాలి. కేవలం వారితో సమర్థవంతంగా పని చేయిస్తే సరిపోదు. వారి మెదడులోనూ ఖాళీలుంచకూడదు. అలా ఖాళీ ఉండి, పనివారికి ఆలోచనలొచ్చినప్పుడల్లా చరిత్రలో ఏం జరిగిందో, యాజమాన్యం వారికి తెలుసు. అందుకే వారి ఆలోచనల్లో ఎప్పుడూ కుట్ర గురించిన భయాలుంటూనే ఉంటాయి.
దానిబలమే నా ఊపిరి
ప్రతిక్షణం, ప్రతీ ఘడియా
దానివల్లే!
గుప్తంగా దాంట్లోనే
నా గుండె చప్పుళ్ళు
దాక్కుని ఉన్నాయి.
తనంతే. భావోద్వేగాలు నియంత్రించుకోలేదు. ఏవైనా ప్రకృతి ఉత్పాతాలు, ప్రమాదాలు, కరోనా కాలంలో వలస జీవుల వెతలు, మరణాలు… టీవిలో చూస్తే ఏడ్చేస్తుంది. ఎవరి కష్టాలు చూసినా ఏదో ఆందోళన. పెళ్ళి అప్పటి కన్నా ఇప్పుడు చాలా నయం. మందులేవైనా రాసిస్తారా అనడిగేవాడిని మా డాక్టర్‌ని. మీ ప్రేమే మందు అనేవారాయన. తన గురించి ఆయనకి పూర్తిగా తెలుసు.
వద్దన్నా కాళ్ళకు చుట్టుకుంటున్న
తీగలను విదిలించడమెలాగో
తెలియని స్ధితి
తెలియని కలవరపాటుతో
ఊహల ఉలికిపాటు
చీకట్లోకి చూపులు పాతేస్తూ
ఆలోచనలను పాతరేస్తూ
గూట్లో ఒదిగిన పిట్ట
ఇన్నాళ్ళూ నన్ను చిత్రించుకుని మురిసిన
నుదురుగోడ మసకబారుతుంది.
నా గుండెపువ్వుపై చలాకీగా ఎగిరే
తూనీగల రెక్కలు ముడుచుకుంటాయి.
నాలోంచి ప్రవహించిన అక్షరాలన్నీ
నా ఛాయాచిత్రం ముందు చేరి
దీపాలై వెలుగుతుంటాయి.
ఈ నవలలో అతను తీసుకున్న జీవితం వాస్తవం, గతానికి చెందిన వాస్తవం. దీన్ని చిత్రించటానికి రచయిత చరిత్రతో దిగిన సంభాషణలో రచయితకు అనేక పాత్రలు తారసపడ్డాయి. అతనితో ఘర్షణపడ్డాయి. ఆ తరువాత అతని నుంచి స్వయం ప్రతిపత్తి కల్పించుకుని తమని గురించి తామే యదార్థంగా పరిచయం చేసుకుంటామని కథకుడితో తెగేసి చెప్పాయి.
చివరికి ఒకరోజు పిల్లయింటివాళ్ళు వచ్చి లగ్నపత్రికలు కూడా రాసుకొని పోయారు. అయ్యో! ఆ రోజు మేళం శబ్దం విని నా పంచప్రాణాలు పోయాయి. కామేశ్వరయ్యరుకు యెలా ఉందో, మీనాక్షి మనసు ఎంత తల్లడిల్లిందో, రుక్మిణి ఎలా సహించిందో! అంతా ఈశ్వరునికే తెలుసు. నాగరాజన్‌కు పిసరంత కూడా దయ, పశ్చాత్తాపం లేకుండా పోయింది కదా అని నేను యేడవని రోజు లేదు.
కాసేపటికి ఒక పడవ నెమ్మదిగా అటువైపు వచ్చి గుడిసె ముందున్న కొబ్బరి చెట్లకు సమీపంలో ఆగింది. దాని ఆశలు మళ్ళీ చిగురించాయి. ముందుకాళ్ళ మీద సాగిలపడి, తోక ఊపుతూ ఆవలించింది. పడవలోంచి ఒకడు కొబ్బరి చెట్టెక్కి, ఒక కొబ్బరి బోండాం కోసుకొని నీళ్ళు తాగి, దొప్పల్ని నీళ్ళలో విసిరేసి, పడవ నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. కుక్క నిరాశతో చూస్తూ ఉండిపోయింది.
నాకున్న కల్పనా సామర్థ్యమంతా, విజిటింగ్ కార్డులని తయారు చెయ్యడంలో చూపిస్తుంటాను. నా ప్రింటింగ్ వర్క్‌లో, నా అడ్రస్ కార్డ్‌లు నేనే తయారుచేసి, ఊళ్ళో నాకు కనపడ్డవాళ్ళందరికీ ఇచ్చాను. వాటికున్న ప్రయోజనాన్ని కూడా విప్పి చెప్పాను. మెల్లిమెల్లిగా మా పేటలోవాళ్ళే కాకుండా, చుట్టుపక్కల పేటల్లోనివాళ్ళు కూడా తమ విజిటింగ్ కార్డ్‌లని నా దగ్గర ప్రింట్ చేయించుకోవడం మొదలుపెట్టారు.
అందువలన భారతదేశప్రభుత్వము బ్రిటీషువారి చేతులలో నుండి భారతీయుల చేతులలోనికి ఎంత త్వరితముగమారిన నంత మంచిది అనుభావము వ్యాపించెను. అయితే ఈ భావము ఇంగ్లాండులోనెంత తీవ్రముగ వ్యాపించియున్నదో భారతదేశీయులెరుగరు. బ్రిటిషువారు చెప్పు మాటలను భారతీయులు విశ్వసింపరైరి. లూయీఫిషరుగారి గాంధీజీ జీవితములో ఈ సంగతిని చెప్పియున్నారు.
ఒకసారి చదివి వదిలేసే నవలగాదు. అలా చేస్తే ఆ అనుభవం ‘కష్టాల కొలిమి’ అనిపించే అవకాశం ఉంది. రెండోసారీ మూడోసారీ చదవడం, అనువాదం కోసం ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్నీ మథించడం – ఏ నవల విషయంలో అయినా ఇవి ఒక సమగ్ర అవగాహనకు రహదారి అవుతాయి. ఈ నవల విషయంలోనూ అదే జరిగింది.
రెండు దారులుంటాయి. ఒకటి నలిగిన, ఎవరినీ ఇబ్బంది పెట్టని, దేనితోనూ పేచీ లేని, అందరికీ ఆమోదయోగ్యమైన దారి. మరొకటి దాన్ని ఒప్పుకోలేని, రాజీ పడలేని, తోడు దొరకని, తనకు నచ్చిన సూటి బాట. ఏదీ తేలిక కాదు. ఏ బాట పట్టినా యుద్ధం లోపలి మనిషితోనో, బయటి సమాజంతోనో తప్పనిసరి అవుతుంది కొందరికి ఈ కథల్లోని పాత్రలకు లాగే.
క్రితం సంచికలోని గడినుడి-60కి మొదటి ఇరవై రోజుల్లో ఇరవై ఒక్కరి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-60 సమాధానాలు.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
ప్రసిద్ధ సాహిత్యకారుల జయంతులు వర్ధంతులూ పేరిట ఉండుండీ కొంత చప్పుడు చెయ్యడం ద్వారా, తెలుగుజాతి, భాష మీద తనకింకా ప్రేమ ఉందని చాటుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఈ చప్పుళ్ళు చేసే తెలుగుజాతి పరిధి మాత్రం చాలా చిన్నది. ఏనాడో రాసేసి చేతులు దులిపేసుకున్నవాళ్ళు, ప్రస్తుతం విరివిగా రాస్తున్నవాళ్ళు, రేపో మాపో తమ ప్రచురణలతో ముందుకు రాబోతున్నవాళ్ళు, పత్రికల, సభల నిర్వహకులు – తెలుగుసాహిత్య వర్తమాన చిత్రంలో ఎటు తిరిగినా కనపడేది ఈ నలుగురే. ఏతావాతా రచయితలే మనకు మిగిలిన పాఠకులు. వీరందరికీ ఒకరితోటి ఒకరికి అవసరం. కనుక సాహిత్యానికి సంబంధించి ఉన్నదున్నట్లు చెప్పడానికి భయం. అందుచేత వీరివల్ల సాహిత్యానికి ఒనగూడే లాభం ఏమిటన్నది అర్థం కాదు కాని, నష్టం మాత్రం ఊహించలేనిదేం కాదు. సాహిత్యాన్ని అభిరుచిగా, అలవాటుగా ఇంటింటిలోనూ కనీసం పత్రికలుగానైనా చూసే రోజులనుండి కేవలం సోషల్ మీడియా గుంపుల్లో బాతాఖానీకి పనికొచ్చే భాషగా మిగుల్చుకోవడంలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆలోచనల లోతులను లైకుల సంఖ్యతోను, ప్రతిపాదనల బలాన్ని మంది షేర్‌లతోనూ కొలుచుకోవడం మొదలైనప్పుడే, నిజమైన పాఠకుడికోసం విభిన్నంగా శ్రద్ధగా రాయడం పట్ల కవిరచయితలకు అవసరమూ లేకపోయింది. అందుకే ప్రస్తుత సాహిత్యంలో తక్షణ స్పందనలు, హాయిగొలిపే కబుర్లూ కనపడ్డంతగా ఆలోచనతో రాసే రాతలు కనపడవు. ఆలోచన కలిగించే రాతలు అసలే అరుదు. సాహిత్యం మనకు కేవలం ఒక వానపడుతుంటే హాయికోసం పట్టుకొనే హస్తాభరణంగానో, లేదూ కాఫీ టేబుల్ మీద పెట్టుకొనే అలంకరణగానో మిగిలిపోయింది. మనకు సాహిత్యం ఇష్టం అని చెప్పుకొని భుజాలు చరుచుకోవడంపై ఉన్న శ్రద్ధ, ఆసక్తి నిజంగా సాహిత్యం పట్ల లేదు. అందుకే, ఒక సమకాలీన రచయిత రచనల మీద విశ్లేషణ కన్నా, శ్రీశ్రీ పుస్తకపు రీప్రింట్ ఫేస్‌బుక్ గోడల మీద ఎక్కువ హంగామా చేస్తుంది. జాషువాని కులమనో కరుణరసమనో ఒక ఇరుసులో బిగించి చప్పట్లు కొడతాం. విశ్వనాథ అయితే దైవం లేకుంటే దయ్యం, కేవలం అంతే. అడపాదడపా ఏ త్రిపురనో, మోనో, ఇంకెవరినో తలచుకున్నా అది వారి వ్యక్తిగతస్నేహాలు జ్ఞాపకాల నెమరువేత స్థాయిని దాటనివ్వం. వారిగురించి ఎప్పుడూ చెప్పే మాటలే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం. వారి వర్ధంతులూ జయంతులూ, విగ్రహాలూ పటాల ఆవిష్కరణలూ మాత్రమే మనకు ముఖ్యం. ‘తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుల’ని ఒక మాటనేసి, సదరు ఫేస్‌బుక్ పోస్టుల కింద నమస్కారాల ఎమోజీల దండలు వేసి ఎవరి దారిన వారు పోవడం మినహా తెలుగుసాహిత్యకారుల చేతిలో నిశితమైన సాహిత్య విమర్శ విశ్లేషణకు నోచుకున్న ఒక్క తెలుగు కవి/రచయిత కనపడరు. ఇలా సందర్భాల నెపంతో గొప్ప కవిరచయితలకు గౌరవం ఇవ్వకపోగా ద్రోహం చేస్తున్నాం. వాళ్ళ ప్రాసంగికతను చెరిపేస్తున్నాం. అవమానపరుస్తున్నాం. పాత కళ్ళద్దాలను కొత్తతరానికి బలవంతంగా అంటించి వేడుక చేస్తున్నాం. కొత్త వెలుతురులోకి పాత సాహిత్యాన్ని తీసుకెళ్ళలేనప్పుడు, ఊరికే ఉత్సవాల పేరిట అయినవాళ్ళకి వాయినాలిచ్చుకునే చందాన సాగుతున్న ఈ తంతు అనవసరపు ఆర్భాటమే. సాహిత్యసృజన, విమర్శ సమయాన్ని కోరతాయి. తెలుగువాళ్ళు తెలివైనవాళ్ళు. సమయం విలువ తెలిసినవాళ్ళు. దాన్ని సాహిత్యంలో పారేసుకోరు.