చుక్కలు పొడిచాయి.
ఊరంతా బువ్వ తిని నిద్దర్లకి మళ్ళింది.
ఊళ్ళో ఆరుబయట నులక మంచాల మీద పడుకుని ఎప్పటిలాగే పాడేరు ముసలమ్మలు.
దొంగ లింగయ్య గారు
ఉద్యోగపరులు
ఇల్లు దాటంగానే
ఇల్లాలు తుమ్మె
వాకిలి దాటంగానే
వరుడు తాపలికే
నంబి తంబళెదురాయె
నాగు పామెదురాయె
చెవుల పిల్లెదురాయె
చేటు వచ్చే
కన్నాన బోయేవు
కన్నాన వచ్చేవు
కన్నాన నీ తల
ఖండింతురయ్యా!
“కన్నాన కత్తిపీట పెట్టావా?”
“ఆఁ… పెట్టాను!” అరిచారు పిల్లలు.
“వంకిన మంగళం వేశావా?”
“ఆఁ… వేశాను!” అరిచి నవ్వేరు పిల్లలు.
ఈ పాట పాడితే దొంగలు పడరని బామ్మల నమ్మకం.
రామయ్య తోటలో రెన్నాల్లనించి దొంగలు పడుతున్నారంట! చెప్పింది ఓ ముసలమ్మ ఇంకో ముసలమ్మతో.
అసలుకే పీకల్దాక అప్పుల్లో ఉన్నాడు. మళ్ళా అప్పుచేసి తోట మీద పెట్టాడంట!
ఈ ఏడు పిల్ల పెళ్ళి గూడా బెట్టుకున్నాడు.
డబ్బులున్నా లేకున్నా మరి వయసొచ్చిన పిల్లకు పెళ్ళి జెయ్యాల్సిందేగా.
రామయ్య పెళ్ళాం ఆదెమ్మొచ్చి ఒకటే ఏడుపు. రెండ్రోలుగా తిండి గూడా సరింగా తింటంలేదంట. ఎవురో దొంగలు.
అక్కడే మంచం మీద వెల్లికిలా పడుకుని చుక్కలు లెక్కపెడున్న కోటి ఈ మాటలన్నీ చెవినేసుకుని మనూళ్ళో అంత దొంగలు ఎవురబ్బా అనుకుంటూ నిద్దర్లోకి జారుకున్నాడు.
వాడికి నిద్దర్లో జేమ్స్ బాండ్లాగా పిస్తోలు పట్టుకుని దొంగల వెంటబడుతున్నట్టు, వాళ్ళు అంతకన్నా ముందు పరుగున పోతున్నట్టు వాడింకా వాళ్ళ వెంటబడుతుంటే దోవలో లెక్కల మేస్టారు కనిపించి, ఏమిరా కోటీ బడి మానేసి ఎక్కడికి పోతున్నావ్? అని అడిగినట్టు ఇలా ఏవేవో కలలొచ్చాయి.
పొద్దున్నే మెలుకువొచ్చాక, కల్లో తాను జేమ్స్ బాండ్ అయినా లెక్కల మేష్టారు ఎట్టా గుర్తుబట్టాడబ్బా? అనుకున్నాడు.
గబగబా పనులన్నీ పూర్తి చేసుకుని ఈతకోసం వచ్చే స్నేహితుల కోసం ఎదురుచూస్తూ కూచున్నాడు.
వెంకీగాడి ఈల సౌండుకు తువ్వాలు తీసుకొని వరండా దాటి బయటికొస్తూ రేయ్ మల్లిగాడ్రాలా? అని అడుగుతుండగానే మల్లిగాడు మహా ఆత్రంగా పరుగున వచ్చి, “నిన్న రాత్రి రామయ్య తోటలో దొంగ దొరిగినట్టే దొరికి పారిపోయాడంట్రా!” అన్నాడు రొప్పుకుంటా.
“అవునా?!” నోరెళ్ళబెట్టారు కోటి, వెంకీ.
అటువెంటనే ఈత సంగతి పక్కనపెట్టి తోట వైపుకు పరుగు పెట్టారు.
వాళ్ళంతా అలా దుమ్ము రోడ్డు మీద అలా అడ్డంగా పరుగుతీస్తుంటే నలుగురు రైతులు కండువా ఓటి భుజానేసుకుని కళ్ళు లోపలికి పీక్కుపోయి, ఎండకి నల్లగా, మట్టిలో పనిచేసి దుమ్ముగా, దిగాలుగా రోడ్డు వారగా పోతూ ఎదురొచ్చారు. ఆ ఊళ్ళో దాదాపు అందరు రైతులూ అంతే. కూరొండుకున్నా, పప్పుచారు కాచుకున్నా పండగే ఆ ఊళ్ళో. పచ్చడి మెతుకులే రోజువారీ పరమాణ్ణం. అంతా మెట్ట పంటే. మోచేతి దెబ్బ సేద్యమే. ఆ ఊళ్ళో ఆ మెట్ట దేశంలో ఆసామిని, కూలీని అందరినీ కలిపేది బీదరికం ఒకటే.
“యాడికిరా దోవకడ్డంగా పరుగు?” అని చికాకు పడ్డాడు వాళ్ళల్లో ఒకడు.
“రామయ్య తోట కాడికి!” పరుగు తీస్తూనే కేకేశాడు మల్లి.
పరుగు తీస్తూనే మాట్టాడేసుకుంటం అలవాటే కోటి బాచికి.
“తెల్లారి లెగిసినకాడ్నించీ రేత్రి పొద్దుపోయే దాకా తోటలోనే ఉంటాడురా.”
“రేయ్! ఎన్ని కాయలు పోయుంటాయ్ రా?”
”చానా పోయాయంటారా! రోడ్డు తట్టు నాలుగైదు వరస చెట్ల కాయలు చానా మటుక్కి పోయినాయంట్రా.”
“అవునా? అసలికే తోట మీద అప్పులున్నాయంటగా?”
రాత్రి తానిన్న సంగతులు చెప్పాడు కోటి.
తోట దగ్గిరికి వచ్చేశారంతా.
తోటలో విరిగిపోయిన బత్తాయి కొమ్మలు, రాలిపడ్డ ఆకులు, నలిగిపోయిన మొక్కలు జూసుకుంటూ తిరుగుతున్నాడు రామయ్య. పరామర్శించడానికి వచ్చిన ఊళ్ళోవాళ్ళూ కూచునున్నారు అక్కడ.
”రెన్నాళ్ళుగా దొంగలు పడతన్నారని, నిన్న నన్నూ, బసవయ్యని కాపలాకి పిల్చుకొనొచ్చినాడు రామయ్య. తోటలో పడుకునుండేతలికి, నడి రాత్తిర్ల దొంగ! దొంగ! పట్టుకో! పట్టుకోమ్మని రామయ్య కేకలు బెట్టె. ‘దొంగోడు సంచీ బట్టుకోని లగెత్తాడు గురవయ్యా!’ అంటానే ఆడి ఎంటబడ్డాడు రామయ్య. ఎనకమాల్నే మేవూ పరుగునొస్తన్నాం. ఆడ్ని ఎట్నో అందుకోని చేతిలో ఉన్న కర్రతో కాలిమీద ఒక్క దెబ్బేసినాడు. ఆడు సచ్చాన్రా నాయనో అనరిచినాడు. అదే ఊపులో ఇంక రెండు దెబ్బలు బడినాయోడికి. ఆ దెబ్బకి ఆడి చేతిసంచీ జారి కిందబడ్డాది. కాలిరిగిందిరయ్యో! అని అంతలోనే కుంటుతోనే లగెత్తి చీకట్లో జంకులవతలకి దూకిపోయినాడోడు. ఆనక ఎంతెతికినా చిక్కలా…”
రామయ్యతోబాటే రాత్రి కాపలాకి కూచున్న గురవడు తాపీగా చెట్టుకింద కూచుని వివరిస్తున్నాడు అక్కడున్న జనాలకి.
అబ్బో చానా కత జరిగిందిరా అనుకుంటూ చెవులు రిక్కించి వింటున్నారు కోటీ, మల్లి, వెంకీ.
“దొంగోడు జడిసిపోయుంటాడ్లే. ఇంక నీ తోట జోలికి రాడులే. గుండె నిబ్బరం జేసుకో.” రామయ్యకి సలహా ఇచ్చాడు ఊళ్ళో ఓ పెద్ద మనిషి.
సంగతంతా తెలిసింది గాబట్టి ఇంక అట్నుంచి అటు ఈతకి బయల్దేరారు జతగాళ్ళంతా. దోవలో అంతా దీని గురించే మాట్లాడుకుంటూ నడిచారు.
నిజానికి ఆ ఊళ్ళో రేకులు ఎత్తుకుబోవడం, తుప్పుబట్టిన పంపు గొట్టాలు ఎత్తుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం, పిల్లలు చెట్టెక్కి దొంగతనంగా కాసిని మామిడి కాయలో, జామకాయలో దొంగతనంగా కోసుకుని తినడం ఇవే పెద్ద దొంగతనాలు. అంతకుమించి పోవడానికి పెద్దగా ఏమీ ఉండవు. ఆ ఊళ్ళో బీదలే ఎక్కువ. కొద్దిమంది కలిగిన వాళ్ళు ఉన్నా కొంచెమే కలిగిన వాళ్ళు. ఉన్నంతలో గుట్టుగా బతుకుతున్నవాళ్ళు.
ఈత ముగించుకొని, భోజనాలు జేసి, ఆటల్లో పడ్డ కోటి అండ్ కో ఊళ్ళోకి జీపొచ్చిన సంగతి విని హడావిడిగా వెళ్ళి గుంపులో కలిసి జీపు ఆగిన చోటుకి పోయారు.
“ఏందీ సంగతి? ఏవయ్యింది?”
“ఊళ్ళోకి ఆపీసర్లొచ్చారు.”
“ఎంతుకు?”
“దానాలు పిల్చుకొచ్చినాడంట!”
“అవునా?”
“రామయ్య మీద కేసంట!”
“ఎంతుకు? ఏంది దానాలు కుంటుతన్నాడు?”
“అంటే రామయ్య తోటలో… ఈడి పనేనా ఎట్ట?”
“నీకిప్పుడు ఎలిగిందిరా బలుబు!”
“ఈ సంగతి అయ్యోరికి దెలిసిందో లేదో?”
పరుగున పోయి అయ్యవారికి ఈ వార్తని ఉప్పందించారు ముగ్గురూ.