కోటిగాని కతలు: బత్తాయిలు పోయినాయి

చుక్కలు పొడిచాయి.

ఊరంతా బువ్వ తిని నిద్దర్లకి మళ్ళింది.

ఊళ్ళో ఆరుబయట నులక మంచాల మీద పడుకుని ఎప్పటిలాగే పాడేరు ముసలమ్మలు.

దొంగ లింగయ్య గారు
ఉద్యోగపరులు

ఇల్లు దాటంగానే
ఇల్లాలు తుమ్మె
వాకిలి దాటంగానే
వరుడు తాపలికే

నంబి తంబళెదురాయె
నాగు పామెదురాయె
చెవుల పిల్లెదురాయె
చేటు వచ్చే

​కన్నాన ​బో​యేవు
​కన్నాన వచ్చేవు
కన్నాన నీ తల
ఖండింతురయ్యా!

“కన్నాన కత్తిపీట పెట్టావా?”

“ఆఁ… పెట్టాను!” అరిచారు పిల్లలు.

“వంకిన మంగళం వేశావా?”

“ఆఁ… వేశాను!” అరిచి నవ్వేరు పిల్లలు.

ఈ పాట పాడితే దొంగలు పడరని బామ్మల నమ్మకం.

రామయ్య తోటలో ​ రెన్నాల్లనించి దొంగలు పడుతున్నారంట! చెప్పింది ఓ ముసలమ్మ ఇంకో ముసలమ్మతో.

అసలుకే పీకల్దాక అప్పుల్లో ఉన్నాడు. మళ్ళా అప్పుచేసి​ తోట మీద పెట్టాడంట​!​

ఈ ఏడు పిల్ల పెళ్ళి గూడా బెట్టుకున్నాడు.

డబ్బులున్నా లేకున్నా మరి వయసొచ్చిన పిల్లకు పెళ్ళి జెయ్యాల్సిందేగా.

రామయ్య పెళ్ళాం ఆదెమ్మొచ్చి ఒకటే ఏడుపు. రెండ్రోలుగా తిండి గూడా సరింగా తింటంలేదంట. ఎవురో దొంగలు.

అక్కడే మంచం మీద వెల్లికిలా పడుకుని చుక్కలు లెక్కపెడున్న కోటి ఈ మాటలన్నీ చెవినేసుకుని మనూళ్ళో అంత దొంగలు ఎవురబ్బా అనుకుంటూ నిద్దర్లోకి జారుకున్నాడు.

వాడికి నిద్దర్లో జేమ్స్ బాండ్లాగా పిస్తోలు పట్టుకుని దొంగల వెంటబడుతున్నట్టు, వాళ్ళు అంతకన్నా ముందు పరుగున పోతున్నట్టు వాడింకా వాళ్ళ వెంటబడుతుంటే దోవలో లెక్కల మేస్టారు కనిపించి, ఏమిరా కోటీ బడి మానేసి ఎక్కడికి పోతున్నావ్? అని అడిగినట్టు ఇలా ఏవేవో కలలొచ్చాయి.

పొద్దున్నే మెలుకువొచ్చాక, కల్లో తాను జేమ్స్ బాండ్ అయినా లెక్కల మేష్టారు ఎట్టా గుర్తుబట్టాడబ్బా? అనుకున్నాడు.

గబగబా పనులన్నీ పూర్తి చేసుకుని ఈతకోసం వచ్చే స్నేహితుల కోసం ఎదురుచూస్తూ కూచున్నాడు.

వెంకీగాడి ఈల సౌండుకు తువ్వాలు తీసుకొని వరండా దాటి బయటికొస్తూ రేయ్ మల్లిగాడ్రాలా? అని అడుగుతుండగానే మల్లిగాడు మహా ఆత్రంగా పరుగున వచ్చి, “నిన్న రాత్రి రామయ్య తోటలో దొంగ దొరిగినట్టే దొరికి పారిపోయాడంట్రా!” అన్నాడు రొప్పుకుంటా.

“అవునా?!” నోరెళ్ళబెట్టారు కోటి, వెంకీ.

అటువెంటనే ఈత సంగతి పక్కనపెట్టి తోట వైపుకు పరుగు పెట్టారు.

వాళ్ళంతా అలా దుమ్ము రోడ్డు మీద అలా అడ్డంగా పరుగుతీస్తుంటే నలుగురు రైతులు కండువా ఓటి భుజానేసుకుని కళ్ళు లోపలికి పీక్కుపోయి, ఎండకి నల్లగా, మట్టిలో పనిచేసి దుమ్ముగా, దిగాలుగా రోడ్డు వారగా పోతూ ఎదురొచ్చారు. ఆ ఊళ్ళో దాదాపు అందరు రైతులూ అంతే. కూరొండుకున్నా, పప్పుచారు కాచుకున్నా పండగే ఆ ఊళ్ళో. పచ్చడి మెతుకులే రోజువారీ పరమాణ్ణం. అంతా మెట్ట పంటే. మోచేతి దెబ్బ సేద్యమే. ఆ ఊళ్ళో ఆ మెట్ట దేశంలో ఆసామిని, కూలీని అందరినీ కలిపేది బీదరికం ఒకటే.

“యాడికిరా దోవకడ్డంగా పరుగు?” అని చికాకు పడ్డాడు వాళ్ళల్లో ఒకడు.

“రామయ్య తోట కాడికి!” పరుగు తీస్తూనే కేకేశాడు మల్లి.

పరుగు తీస్తూనే మాట్టాడేసుకుంటం అలవాటే ​కోటి బాచికి.

“తెల్లారి లెగిసినకాడ్నించీ రేత్రి పొద్దుపోయే దాకా తోటలోనే ఉంటాడురా.”

“రేయ్! ఎన్ని కాయలు పోయుంటాయ్ రా?”

​”చానా పోయాయంటారా! రోడ్డు తట్టు నాలుగైదు​ వరస చెట్ల కాయలు చానా మటుక్కి పోయినాయంట్రా.”

“అవునా? అసలికే తోట​ మీద అప్పులున్నాయంటగా?”

రాత్రి తానిన్న సంగతులు చెప్పాడు కోటి.

తోట దగ్గిరికి వచ్చేశారంతా.

తోటలో ​వి​రిగిపోయిన బత్తాయి కొమ్మలు, రాలిపడ్డ ఆకులు, నలిగిపోయిన మొక్కలు జూసుకుంటూ తిరుగుతున్నాడు రామయ్య. పరామర్శించడానికి వచ్చిన ఊళ్ళోవాళ్ళూ కూచునున్నారు అక్కడ.

​”రెన్నాళ్ళుగా దొంగలు పడతన్నారని, నిన్న నన్నూ​, బసవయ్యని ​కాపలాకి ​పిల్చుకొనొచ్చి​నాడు​ రామయ్య. ​తోటలో పడుకునుండేతలికి, నడి రాత్తిర్ల దొంగ! దొంగ! పట్టుకో! పట్టుకో​మ్మని ​ రామయ్య కేకలు బెట్టె. ‘దొంగోడు సంచీ​ బట్టుకోని లగెత్తాడు​ గురవయ్యా!’ అంటానే ఆడి ఎంటబడ్డాడు రామయ్య. ఎనకమాల్నే మేవూ పరుగునొస్తన్నాం. ఆడ్ని ఎట్నో అందుకోని చేతిలో ఉన్న కర్రతో కాలిమీద ఒక్క దెబ్బేసినాడు. ఆడు ​సచ్చాన్రా నాయనో అనరిచినాడు​. ​అదే ఊపులో ఇంక రెండు దెబ్బలు బడినా​యోడికి​. ​ఆ దెబ్బకి ​ఆడి చేతిసంచీ జారి కింద​బడ్డాది. కాలిరిగిందిరయ్యో! అని అంతలోనే కుంటుతోనే ​ లగెత్తి చీకట్లో జంకులవతలకి దూకిపోయినాడోడు.​ ఆనక ఎంతెతికినా ​చిక్కలా…”

​​రామయ్యతోబాటే రాత్రి కాపలాకి కూచున్న గురవడు తాపీగా చెట్టుకింద కూచుని వివరిస్తున్నాడు అక్కడున్న జనాలకి.

అబ్బో చానా కత జరిగిందిరా అనుకుంటూ చెవులు రిక్కించి వింటున్నారు కోటీ, మల్లి, వెంకీ.

“దొంగోడు జడిసిపోయుంటాడ్లే. ఇంక ​ నీ తోట జోలికి రాడులే. గుండె నిబ్బరం జేసుకో.” రామయ్యకి సలహా ఇచ్చాడు ఊళ్ళో ఓ పెద్ద మనిషి.

సంగతంతా తెలిసింది గాబట్టి ఇంక అట్నుంచి అటు ఈతకి బయల్దేరారు జతగాళ్ళంతా. దోవలో అంతా దీని గురించే మాట్లాడుకుంటూ నడిచారు.

నిజానికి ఆ ఊళ్ళో రేకులు ఎత్తుకుబోవడం, తుప్పుబట్టిన పంపు గొట్టాలు ఎత్తుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం, పిల్లలు చెట్టెక్కి దొంగతనంగా కాసిని మామిడి కాయలో, జామకాయలో దొంగతనంగా కోసుకుని తినడం ఇవే పెద్ద దొంగతనాలు. అంతకుమించి పోవడానికి పెద్దగా ఏమీ ఉండవు. ఆ ఊళ్ళో బీదలే ఎక్కువ. కొద్దిమంది కలిగిన వాళ్ళు ఉన్నా కొంచెమే కలిగిన వాళ్ళు. ఉన్నంతలో గుట్టుగా బతుకుతున్నవాళ్ళు.

ఈత ముగించుకొని, భోజనాలు జేసి, ఆటల్లో పడ్డ కోటి అండ్ కో ఊళ్ళోకి జీపొచ్చిన సంగతి విని హడావిడిగా వెళ్ళి గుంపులో కలిసి జీపు ఆగిన చోటుకి పోయారు.

“ఏందీ సంగతి? ఏవయ్యింది?”

“ఊళ్ళోకి ఆపీసర్లొచ్చారు.”

“ఎంతుకు?”

“దానాలు పిల్చుకొచ్చినాడంట!”

“అవునా?”

“రామయ్య మీద కేసంట!”

“ఎంతుకు? ఏంది దానాలు కుంటుతన్నాడు?”

“అంటే రామయ్య తోటలో… ఈడి పనేనా ఎట్ట?”

“నీకిప్పుడు ఎలిగిందిరా బలుబు!”

“ఈ సంగతి అయ్యోరికి దెలిసిందో లేదో?”

పరుగున పోయి అయ్యవారికి ఈ వార్తని ఉప్పందించారు ముగ్గురూ.

​అప్పటికే అయ్యగారికి విషయం తెలిసింది. సాంబడితో దీని గురించే ఆరా తీస్తున్నాడాయన.

“ఏం జరిగుంటుంది ​సాంబయ్యా? దానాలు అట్టాంటి పని జేశాడంటావా?” అని అయ్యవారంటే ​-​

“దానాలు కూతురికి జబ్బు చేసిం​దయ్యా. ​ఆడి ​చేతిలో చిల్లిగవ్వ లేదు.​ ఊరంతా అప్పు​లే. ​ఇంక ​ఊళ్ళో ​అప్పు పుట్టే దిక్కు లేదు. నాలుగు డబ్బులు దొరికితే నల​బై అవసరాలు సి​ద్ధంగా ఉం​టయ్యి ​దానాలకి. మడి చెక్క పండిపండక, కూలి పనికి మొగుడూ పెళ్ళాం ఇద్దరూ పో​త​న్నా ఇం​టో ఆడికాడికే.​ ఇంకిప్పుడు సీజను గూడా గాదు గదయ్యా. ఆ కూలి పని గూడా లేదు. ​దానికి తోడు పిల్లకి జబ్బు​. పిల్ల జబ్బుకని డబ్బు కోసం నాలుగు కాయలు కోసి అమ్ముకుంటే తప్పేముందిలే, ఎవరు చూడొచ్చారు అను​కొనుంటాడయ్యా. ​డబ్బులేమోచ్చినయ్యో గాని, కా​లిరగ్గొట్టుకున్నాడు.”

“ప్రభుత్వ పథకం కింద బర్రెగొడ్లు ​ఇప్పిం​చాం ​​గాదూ?”

“అయ్యెప్పుడో అమ్ముకున్నాడయ్యా.”

“ఎవర్రా ఆఫీసర్లని పిల్చుకు రమ్మని సలహా చెప్పింది?”

“ఆడికి పట్నంలో బంధువులున్నారంటయ్యా. ఆళ్ళు చెప్పారంట కేసు పెట్టమని. ఆ​డి పరిస్తితి అట్టాంటిది. కాలిరిగింది గదయ్య. మనమే ఆడ్ని నిలబెట్టి పంచాయితీ బెడతామని అనుమానం వచ్చుంటాది​.” ​

​అంతా విని తల పంకించారు అయ్యగారు. ​

ఈ సంభాషణ​ ఇంక ​అక్కడికి ఆపి బడి వైపుకి బయలుదేరారు ​అంతా. ​​​అక్కడే పెట్టారు కచేరి. చడీ చప్పుడూ లేని చిన్న ఊళ్ళో చీమ చిటుక్కుమన్నా పెద్ద వార్తే.

“అరేయ్! అయ్యగారొచ్చినార్రా.” జనాల్లో కదలికొచ్చింది.

“అరేయ్! కుర్చీలు కూడా రెడీగా ఏసినార్రా ఎవురో.”

“అరేయ్​!​ ఆళ్ళేరా ​అపీస​ర్లు!”

కోటీకి, మల్లి, వెంకీలకీ అంతా భలే కొత్తగా ఉంది. జరిగేదంతా ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నారు ముగ్గురూ.

“నీ పేరు?”

“దానాలయ్య.”

“కంప్లైంటు ఇచ్చింది నువ్వే కదూ?”

“అవునయ్య.”

“సరే, ఎవురు నిన్ను కొట్టింది?”

“ఈ రామయ్య, అయ్య!”

రామయ్య మొహం పాలిపోయింది.

జనం​తో ​బాటే చెవులు రిక్కించారు స్నేహితులు ముగ్గురూ. ఇలాంటిది చూడ్డం ఇదే మొదటిసారి వాళ్ళందరికీ. కోటిగాడు వాడి బాచి ముందు వరసలో కూచుని ఉత్సాహంగా చూస్తున్నారు. ఏదైనా గొడవ వస్తే రెండు పార్టీలు అయ్యగారి దగ్గరికి పోవడమే గానీ చిన్న విషయాలకి ఇట్లా బయటినించి పోలీసుల్ని గానీ ఆఫీసర్లని గానీ తీసుకురావడం ఇదే మొదలు. అంతమటుకు తెలుసు ముగ్గురికీ.

“ఏందిరా, అపీసరు తెగ రాస్తన్నాడు?”

“కతంతా కాగితాల మీదకెక్కించి టౌన్ల పెద్దోళ్ళకి జెప్తాడ్రా.”

“అవునా?”

“మరి, రాసేదేవిటికి?”

ఒకాఫీసరు అయ్యగారి వైపు తిరిగి, “వీడు కొట్టించున్నాడు కాబట్టి వచ్చాడు. వీడు కొట్టాడు కాబట్టి ఇక్కడికొచ్చాడు. నువ్వెందుకొచ్చావ్?” అని దురుసుగా అడిగేటప్పటికి మల్లిగానికి భలే కోపం వచ్చింది.

అసలికే, ఎవడు వాడు ఎచ్చటి వాడు ఇటువచ్చిన తెల్లవాడు​,తగిన శాస్తి చెయ్యరా! అనే ​పాట వాడికి ప్రాణం కంటే ఒక్కరవ్వ ఎక్కువే.

రెండడుగులు ముందుకేసి, ‘వోయ్యోవ్, మాట సక్కంగ రానీ. యాడ్నించో వచ్చి మా అయ్యోరినే నువ్వెందుకొచ్చినావ్ అంటున్నవేంది?’ అంటూ ఆఫీసరు మీదికి పోబోయాడు సాంబడు. సాంబడి వెనకాలే పదిమంది లేచి నిలబడ్డారు. వాళ్ళను వారించి కూచోబెడుతున్న జనాన్ని చూసి, ‘అబ్బా! మనూరికి మొనగాడంటే సాంబడే రా!’ అన్నాడు మల్లిగాడు ఉత్సాహంగా కోటి భుజం మీద చెయ్యేసి. ఆఫీసరు కుర్చీలో కూర్చుని కర్చీపుతో మొహం తుడుచుకున్నాడు.

“కొద్దో గొప్పో చదువుకున్న వాడిని కాబట్టి, మీలాంటి పెద్దలు వచ్చినప్పుడు వీళ్ళ తరఫున మాట్లాడ్డానికి నన్ను పిలుస్తూ ఉంటారు,” ఊరిజనాల వంక చూపిస్తూ శాంతంగా సమాధానం ​చెప్పేరు అయ్యగారు. ​​

“బాబూ! నా తోటలో దొంగని పట్టుకునేదానికి కాపేశినాం. చీకట్లో దొంగతనం చేసి పారిపోతా ఉంటే కొట్టింది నిజమే గాని, కొట్టింది ఎవుర్నో నాకెట్టా తెలుత్తాదీ?” న్యాయం తన పక్షానే ఉన్నదని ధ్వనించేటట్టు రామయ్య చెప్తుంటే, అవున్నిజమే కదా అనుకున్నారు జతగాళ్ళు ముగ్గురూ.

“కతలు చెప్పమాక. తోటలోకొచ్చాడని కులం పేరుతో తిట్టి, కొట్టి కాలిరగ్గొట్టినావు. నీ మీద కేసు రాయాల.”

ఓ ఆఫీసరు హూంకరించేటప్పటికి, వామ్మో! కేసా! రామయ్యని జైల్లో పెడతారా ఏందిరా? అని ​గుసగుసలు పోయేరు జనం. ​

“అసలు మడిసినే చూడ్లేదంటే కులం పేరుతో తిట్టినానా?” రామయ్య మిగతా జనం సపోర్టు కోసం చుట్టూ చూశాడు. అతని స్నేహితులు ముందుకొచ్చి ఆఫీసర్ల చుట్టూ చేరి రామయ్య తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడ్డం మొదలెట్టారు. అయినా ఆఫీసర్లు దానాలు తరఫున రామయ్య మీద కేసు పెట్టేటట్టే ఉన్నారు.

“ఏందొరే, ఆపీసర్లేందీ, అంత దాష్టీకం చేస్తా ఉండారే?” అన్నాడు వెంకీ గాడు.

అయ్యగారు కలగజేసుకున్నారు. ఊళ్ళో వ్యవహారం బయటికి పోకూడదనుకున్నారు.

“కొట్టిన మాట వాస్తవమే. కాలిరిగినది నిజమే. కొట్టించుకున్నవాడు బాధ పడుతున్నాడు. కొట్టినవాడు అంతకంటే బాధపడుతున్నాడు. దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోగలిగితే అందరికీ మంచిది​.” అన్నారు. ​

బేరసారాలకి తెరలేపిన​ట్ట​యింది అక్కడ. చీకటి పడ్డదాకా మాటలు సాగుతూనే ఉన్నాయి. ఇరవై వేలతో మొదలైయింది బేరం. కాలు కూడా విరిగింది కాబట్టి అంతకన్నా తగ్గేదే లేదని మొండికేసుకుని కూచున్నారు ఆఫీసర్లు.

“అతని తాహతుకు తగ్గట్టు అడిగితే ఏదైనా ఇవ్వగలడు గానీ తలకు మించింది ఎక్కడ్నించి తెస్తాడు? కాస్త చూసి పోవాలి మీరు​.” అయ్యగారు ఆఫీసర్లని వాస్తవం లోకి తెచ్చారు.

మొహమొహాలు చూసుకుంటూ గుసగుసలాడుకున్నారు వాళ్ళు. విడతలు విడతలుగా ఇద్దరేసి లేవడం, పక్కకు వెళ్ళి మాట్లాడుకుని రావడం ఇలా కొంతసేపు జరిగాక చివరకు, మేము ముగ్గురం. తలా నాలుగు వేలు, జీపుకొక రెండు వేలు, మొత్తం పధ్నాలుగు ఇవ్వండి. దీన్నింతటితో ముగిద్దాం అన్నారు.

రామయ్య అయ్యగారిని పక్కకు పిలిచాడు. బసవయ్య, సాంబడు, గురవడు కూడా వారితో గుమిగూడి మంతనాలు చేశారు. అందరూ అంగీకారానికి వచ్చినట్టు తల ఊపుకుని వచ్చి కూచున్నారు. మరి చెప్పరా! అని సాంబడు రామయ్యని ముందుకు తోశాడు. రామయ్య నీళ్ళు నములుతుంటే బసవయ్య –

“అయ్యా! మా బీదరికం మీకు తెలియంది కాదు.​ కాసిని ​కాయలు పోయినందుకే రేయంతా నిద్దర మానుకుని కాపలాకి కూకున్నాడు. అలాంటిది మీకంత డబ్బులు యాడ్నించి తెత్తాడు? మీరు కాత్త సూసి పోవాల. తలా పది నూర్లు దీసుకోండి. జీపు మీరెప్పుడూ దిరిగేదే గదా దానిగ్గూడా డబ్బులేవిటికి?” అని దాన్ని అంతటితో తెగ్గొట్టబోయాడు.

ఆఫీసర్లకి సర్రున కోపం వచ్చింది.

“సరే, అయితే కానీయండి. కేసు రాయాల్సిందే. జీపులో ఉన్న కేసు కాయితాలు పట్రా, పోరా!” డ్రైవరుకి పురమాయించాడు వాళ్ళలో ఒక ఆఫీసరు.

“కేసే రాసే మాటయితే ఇంత చర్చ దేనికి? ఆయన ఇవ్వగలిగినంత ఇప్పిస్తాను. మీకు సమ్మతమైతే నేను ఇంకొక మాట మాట్లాడతాను. లేదూ కేసే పెడతామంటే ఎవరికీ ప్రయోజనం ఉండదు. ఆలోచించండి​.” అని అయ్యగారు చెప్పేసరికి ఆఫీసర్లకి అసలుకే మోసం వచ్చేటట్టు ఉందని ఆదుర్దా ​పు​ట్టింది.

“మీరు పెద్దవారు. మీ మాట తీసెయ్యలేం. చివరి మాట మీరే చెప్పండి.” గౌరవంగా బేరానికి దిగారు.

“తలా పదిహేను వందలు ఇస్తాడు. తీసుకుని వెళ్ళండి.” అని అయ్యగారు అనగానే, “మీరు చెప్పినట్టే కానిద్దాం. మరి జీపుకొక అయిదొందలు ఇవ్వండి,” అని కొసరు అడిగారు వాళ్ళు వాచీలు చూసుకుంటూ.

చిన్న కాగితం పొట్లాం ఒకటి సాంబయ్య కండువా చాటుగా రామయ్య కివ్వడం, అది రామయ్య ఆఫీసరు చేతిలో పెట్టడం మౌనంగా చూశారు కోటి గాడి బ్యాచంతా.

అప్పు చేసి తెచ్చిన డబ్బు ఆఫీసరు చేతిలో పె​డతన్నాడని, పాత అప్పులకి ఇది తోడైం​దిరా దేవుడా​!​ అని అల్లంత దూరంలో కూచున్న రామయ్య భార్య​ ​పక్కనున్న ఆడోళ్ళకి చెప్పి కళ్ళు తుడుచుకోవడం చూ​సేరు అంతా​.

ఈ వ్యవహారం ఇలా లాభదాయకంగా ముగియడంతో ఆనందంగా అయ్యగారికి నమస్కారం పెట్టి సెలవు తీసుకుని జీపెక్కి బయలుదేరారు ఆఫీసర్లు.

ఏమి జరుగుతోందో దానాలికి అర్ధం కాలేదు కాసేపు. దానాలు కుంటుతూ జనాలని దాటుకుని జీపు దగ్గిరికి చేరుకునే సరికి ఇద్దరు ఆఫీసర్లు అప్పటికే జీపులో కూచున్నారు. బడి గేటు బయట మూడో ఆఫీసరుని గబుక్కున ఆపి, ‘కాలిరిగింది బాబు, నాకేమన్నా ఇప్పించండి,’ అని దీనంగా అడిగాడు. కొంచెం బరువు ఆనినప్పుడల్లా జివ్వున లాగుతో కాలు.

“దొంగతనం చేసింది గాక డబ్బులు గూడానా? వాళ్ళున్నప్పుడే ఎందుకడగలా? ఇప్పుడు నాదాంట్లోంచి నీకు తీసివ్వాల్న? ఇదిగో. పో​!” అంటూ ఓ యాభై ఉదారంగా చేతిలోపెట్టి తన సీట్లో కూచుంటే –

నీరుకావి పంచె సద్దుకుంటూ స్కూలు మెట్ల మీద కూలబడ్డ రామయ్యని, కాలిరిగిన నెప్పితో యాభై చేతిలో పట్టుకుని గోడని ఆనుకునిలబడ్డ దానాల్ని, కండువా తీసి దులుపుకుని పైకేసుకుంటున్న అయ్యగారిని, కోటిగాడిని, వాడి స్నేహితులని, ఊళ్ళో చోద్యం చూస్తూ నిలబడ్డ సమస్త జనాలను, చెట్టుచేమల్ని, గొడ్డుగోదాలను దాటుకుంటూ అప్పనంగా అయిదు వేలు పొట్టలో వేసుకుని దుమ్ము రేగ్గొట్టుకుంటూ సాగిపోయింది జీపు.

​ఎవరిళ్ళకి వాళ్ళు పోయారు. ​

​మళ్ళా ఎప్పటిలాగే చుక్కలు పొడిచాయి.

ఊరంతా బువ్వ తిని నిద్దర్లకి మళ్ళింది.

నులక మంచాల మీద బామ్మలు ఎప్పటిలాగే పాడేరు.

దొంగ లింగయ్య గారు
​ఉద్యోగ పరులు ​

ఇల్లు దాటంగానే
ఇల్లాలు తుమ్మె
వాకిలి దాటంగానే
వరుడు తాపలికే
​…

ఆ రోజు జరిగిందంతా ఆలోచిస్తూ నిద్దర్లోకి జారుకున్నాడు కోటిగాడు. వాడి కల్లో​ ఈసారి ​ఏ దొంగా పడలేదు​ గానీ రామయ్య, దానాలు​ ఆకాశమెత్తు బత్తాయి గుట్టల్లో కూచుని​ –

తె​ల్లవార్లూ కాయలు లెక్కబెడుతూనే ఉన్నారు. ​