సందుక
నువ్వెప్పుడూ యింతే .
మనం కలిసినప్పుడల్ల
ఆ పాతకాలపు సందూకను
తీయిస్తవు .
దాన్ని తీసినప్పుడల్ల
పైనున్న దుమ్ము చెదిరిపోయి
మన చిన్నతనం
మాసిపోతుందేమోనని
నాకు ఒకటే రంది.
సందుక మూత
కిర్రుమంటు
తెరుచుకుంటుంటే
‘తిన్నవా బిడ్డా’ అంటూ
వీపు నిమిరే నాయనమ్మ
తొక్కులాట యాదికొస్తది.
పల్లె నుండి పట్నందాకా
సర్వీసు బస్సులో ప్రయాణం
చేసిన పేదరికపు
గునకపూలు
ఇంటినిండ పూస్తయి.
రంగు పోయిన
పక్షి ఈకలూ
ఎండి పోయిన
బంతిపూల రిక్కలు
రాలిపోయిన
బంగారుపురుగు రెక్కలూ….
మనం నీటి మీద
దుంకులాడించిన
పెంకాసు ముక్కలూ..
ముదురు రంగులోకి
జీర్ణమవుతున్న
అట్టలు లేని పుస్తకాలూ …
ఎప్పుడో గాని కాలానికి
మత్తడి దుంకే
మన వూరి చెరువును
గుర్తు తెచ్చే
ఒకటో రెండో
సగం చినిగిపోయిన
కరపత్రాలు.
‘అంతా ఐపోయిందిప్పుడు
కాలం ఐపోయింది ‘
ముసలి కాగితం రాలిపడుతున్న
పుస్తకాల్ని ఒకటొకటిగా
బయటకు తీస్తూ అంటవు .
‘ వీటిల్లో ఈ రాతలకింక
కాలం చెల్లిపోయింది
చెరిపేయాలి వీటన్నిటినీ ‘
ఊపిరి పోసిన
ఒక్కో వాక్యం కింద
అరిగిన పెనిసిలుతో
గీసుకున్న గీతలు
అక్కడక్కడా మడుచుకున్న
కమ్మలూ
పక్కన మార్జినులల్ల
రాసుకున్న నోట్సూ …..
సందూక
అడుగు నుంచి
తెరలు తెరలుగా
బాగా పరిచయమున్న
ఒక కొత్త సువాసన
చుట్టుముడుతుంది.
చెంపకానించుకున్నప్పుడు
వెచ్చని వాగు నీటి కింది
గరుకైన ఇసుక
మెత్తదనం ఆపేక్షగా తగుల్తుంది.
‘అత్తా పత్తా లేకుండా
వీడెక్కడ తిరుగుతుండో ‘
పాత కళ్ళద్దాల్లోంచి
తండ్లాడే బాపు
కండ్లల్లో మెదులుతాడు.
కొమ్మల్ని తాకంగానే
జల జలా రాలే
ఒనగాయల్లా
ఒక్కో కాయితం లోనుండీ
గడచిన క్షణాలు
ఉక్కిరి బిక్కిరి చేస్తయి .
‘యెట్ల చెరిపేసుకుంటం ?
అరచేతుల్లో భాగమైన వాటిని….
యెంత యెలిసి పోయినా
యెట్లా పారేసుకుంటం ?
మన తొలియవ్వనాల
రంగుల రంగుల
ఉద్రేకాల్ని?
యెట్లా విడదీస్తాం ?
మన ఇంట్లో ఒక అందమైన
మూలగా అమరిపోయిన
సందూకను …. ‘
గడచిన మనల్ని
మనం మళ్ళీ
అతిజాగ్రత్తగా మడత పెట్టుకుని
సందూకలో
భద్రపర్చుకుందాం.
ఎప్పుడైన
ఏదో పోగొట్టుకున్నట్టు
ఓర్చుకోలేని దుఖము
కలిగినప్పుడు
ఇంట్లో ఈ జాగకాడికొచ్చి
సందూక బుజానికి
తల ఆనించుకుంటే
యెంతో ఊరట !
—
అర్ర
యేమేమో చెప్తవు.
యెన్నెన్నో చూపిస్తవు.
‘ యీ అర్ర బాగా ఇరుకై పోయింది
దీన్నిండ ముక్క వాసనొస్తుంది. ‘
గోడలకి నిండిన నీటి చెమ్మ
అల్లుక పోయిన పాదుష్టు –
గడ్డి రాలుతున్న పిట్టలొదిలేసిన గూళ్ళు.
‘దీని తూర్పు దర్వాజ మూసుక పోయింది
యింక ఒకటే తొవ్వ బయటకు …’
పచ్చ పచ్చ చెమనులనూ
మెరిసే సిమెంటు అద్దాలనూ
చూయిస్తూ ‘ పా బయటకు ‘ అంటవు –
ఆశపడీ లోభ పడీ
పడమటి తొవ్వలో
నడిచిన కొద్దీ
పచ్చని పచ్చికకింది
పల్లేరుగాయలు కుచ్చుకుంటయి.
యెందుకో యెన్నేండ్లయిన
యీ విశాలమయిన జాగల ఇరుకై
వుక్కిరి బిక్కిరి అయితది నాకు.
రివ్వుమని కొట్టె చల్లగాలిలో
వుబ్బర పోస్తది నాకు.
యెంతనయిన చెప్పు.
మళ్ళా ఆ అర్రలోనే
నాకు వూపిరాడుతది.
మాసిన సున్నం గోడలమీది
యెలిసిపోని జాజు రంగు మీదనే
ఇంకా మనసు గుంజుతది.
యీ అర్ర గోడలే కద
మనకు గోడల్ని కూలగొట్టే
సోయి నిచ్చింది.
యీ అర్ర చెత్తు నీడల్నే కద
మనం గీతల్ని మలిపెయ్యాలని
కొత్త పాటలు పాడినం.
యియ్యాలెందుకో
దర్వాజలు మూసుకపోయినయని
అర్రను పాడు పెడదామంటే
మనసొప్పుత లేదు.
‘యెవ్వరుంటలేరు కదా’
అని యిడిసి పెట్టి పోయినంక
చయిన్ తో నిద్ర పడతలేదు.
తల్ల సుంటి అర్ర
మెత్తని వొడి లోనే
మల్లా మల్లా
తల పెట్టుకు
పండుకోవాలనిపిస్తది.
తలుపులన్ని బార్లా తెరిసి
యెగిరిపోయిన పిట్టలన్నిటిని
లోపలకు పిలవాలని
ఒక్కటే ఆరాటమనిపిస్తది.
(అర్ర అంటే గది అని)
(రాసేటప్పుడు జావెద్ అఖ్తర్ మేరా కమ్రా యాద్ ఆతా హై గుర్తుకు లేదు కానీ యెక్కడో సబ్ కాన్షస్ లో చక్కర్లు కొట్టే వుంటుంది)
[“సందుక” లోని మరికొన్ని కవితలు రచయిత వెబ్ సైట్ లో చదవగలరు. -సంపాదకులు]