సఖియ
రావోయి చందమామ
నీ వెన్నెల కౌగిట్లో మద్యం సేవిస్తాను
చంద్ర కిరణాల వేళ్ళని ఇలా ఇవ్వు
వెచ్చని వూపిరుల హుక్కా అందిస్తాను
నీ మచ్చల చెంపని చూపించవోయ్
నిప్పు రవ్వల చిటికెలు వేస్తాను
ముద్దెట్టు నా మెడ వొంపులో-
నిన్ను సెగలు కక్కే సూర్యుణ్ణి చేస్తాను.
కవిత రాయి
మబ్బులని పేర్చి
లిఖించు ఏవో కొండగాలులలో
అవి చినుకులై రాలి
లోతైన లోయలలో
మొలకలై లేస్తాయి.
ఆ సడి లేని అడవి దారుల్లో
అందుకో ఇక
ఏదో ఒక గాలి పాటని-
పచ్చని చెట్లు మబ్బులని తాకి
నిద్ర మత్తు నేల గుండెల మీద
రంగు రంగుల పూలు రాల్చి
తడి ముద్దులు కానుకిస్తాయి