“బొంబాయి కథలు” : అంబల్ల జనార్దన్‌

హృదయవాదీ మానవతావేదీ కథకుడైతే అతని కంట పడ్డ లోకరీతులూ, వెంటపడ్డ రాగద్వేషాల ఫణితులూ ఎలాటి రూపం పొంది, ఎటువంటి ఫలితాల్ని ఇస్తాయో ఈ “బొంబాయి కథలు” చదివితే తెలుస్తుంది.

అంబల్ల జనార్దన్‌ అచ్చమైన పదహారణాల ముంబాయి ఆంధ్రుడు. పెరిగింది ముంబాయిలో నైనా ఐదారు భాషలతో పరిచయమున్నా తెలుగీయులన్నా తెలుగు భాషన్నా చెప్పలేని మక్కువతో .. కథల్ని కథలుగా చెప్పకుండా జీవనమూలాల్ని విశదపరచడం అంబల్ల జనార్దన్‌ కి వెన్నతో కాదు పెన్నుతో పెట్టిన విద్య!!

ఈకథాసంపుటిలో 26 కథల్లో ముంబాయి నేపథ్యంలో 17 కథలు, తెలంగాణా నేపథ్యంలో 9 కథలు ఉన్నాయి. ముంబాయి మతకలహాల మారణహోమాలూ, కులకలహాల కురుక్షేత్రాలూ, మాఫియా గ్యాంగ్స్‌ మృత్యుస్పర్శలూ ఈ కథల్లో కన్పించవు. మధ్యతరగతి బతుకుల ఆలోచనలకీ ఆవేదనలకీ మోసాలకీ వ్యామోహాలకీ మనేదనలకీ మందహాసాలకీ అక్షరరూపం అంబళ్ళ జనార్దన్‌ బొంబాయి కథలు.

పుట్టిన ప్రతి మనిషికి కూడూ తోడు తో పాటు “గూడు” ముఖ్యాతిముఖ్యం. పగలల్లా పనిపాటలతో ఎక్కడెక్కడ తిరిగినా చీకటి ముసిరే వేళకి ఇంటికి చేరి విశ్రాంతి తీసుకోవాలిగా .. “కూడు పరాయిదైనా గూడు స్వంతమై వుండాలనే” ముఖ్యాంశాన్ని మల్లమ్మ చేత భర్త పోశెట్టికి సున్నితంగా చెప్పించి నిరక్షరాశ్యుల్లో కూడా మేధావులుంటారని చూపుతుంది “బయలు బతుకు” కథ.

ఎవరి నమ్మకాలు వారివి. ఎవరి అనుభవాలు కూడా వారివే. ఒకరి నమ్మకాలు మరొకరికి చాదస్తంగా అనిపించవచ్చు. అంతమాత్రాన అన్నీ అబద్ధాలు కావు. అన్నీ నగ్నసత్యాలు కావు. అంతమాత్రాన అవన్నీ ట్రాష్‌ అవ్వవు కదా అనే అంశానికి ప్రతీక “లక్కీ సెంటిమెంట్‌” కథ.

ఇనప ఊస వంకర తీయాలంటే వేడెక్కించాలి. సుత్తి దెబ్బలతో మర్దించాలి. ఇరుకు మనస్తత్వ మున్న వాళ్ళు ఇంగితం మరిచిపోయి తమ ఉనికిని ఉన్నతంగా ప్రదర్శించడానికి ప్రయత్నించి భంగపడ్తారు. ముకుందం వంకరబుద్ధిని ప్రభాకర్రావు తెలివి సరిచేసిన వైనం “ఇనుము సుత్తి” కథలో ప్రస్ఫుటమై పాఠకుల్ని ఆలోచింపచేస్తుంది.

ఆలింటివారు ఆత్మబంధువులు కదా .. పైగా వచ్చింది బామ్మర్ది. తలకెత్తుకొచ్చింది సామాన్యమైన పని కాదు. బొంబాయి పట్టణంలో ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే బాంద్రా సర్కిల్లో ఆఫీసర్‌ గార్ని కలిసి, కన్విన్స్‌ చేసే పని. పైగా ఎడ్రస్‌ కట్టే కొట్టె తెచ్చె అన్నట్టు స్పష్టంగా లేకపోవడం “ఇదండీ మా బామ్మర్ది వరుస” కథాంశం. చిరునామా సరిగ్గా లేకుండా ఎక్కడికీ వెళ్ళరాదన్న ఉపదేశాన్నీ కించిత్‌ హాస్యరసాన్నీ మేళవించిన కథిది.

ఇక్కడ బతకలేక ఎక్కడో పరాయి దేశానికి ఉదరపోషణార్థం అప్పుచేసి హయరానా పడి పనికోసం వెళ్ళిన పోశయ్య కంటికి వొంటికి విరామం విశ్రాంతి లేకుండా కడుపు కట్టుకుని సంపాయించిన సొమ్ముని భార్య మైసమ్మ పేరున కాకుండా అప్పులు తీర్చి ఆస్థి నిలబెడతాడన్న ఆశతో తండ్రికి పంపితే అతగాడు దుబారా చేయడం యాదగిరి వెళ్ళకుండానే “నిలువుదోపిడి”కి గురి కావడాన్ని గురించిన కథ, కరుణాత్మకంగా సాగుతుంది.

“కన్విక్షన్‌” కథ చూపులకి చిన్నదే. ఆలోచిస్తే అనంతమైన అర్థం ద్యోతమౌతుంది. కోనేటి జాంబవంతులు అనబడే “కోజా” కవి కథ ఇది. మైకు ముందు మహనీయంగా ఉపన్యాసాలిస్తుంటారు. నీతి గురించీ నిజాయితీ గురించీ అలవోగ్గా గంట గంటలుగా ఉపన్యాసాలిస్తుంటారు. తన దాకా వస్తే స్వార్థం వేయి పడగలెత్తుతుంది. అవకాశాన్ని బట్టి ఎదుటివాడి మెత్తదనాన్ని బట్టి కనీసం బత్తి ఖర్చుల కోసం మనిషి మహిషి అవుతాడు. సున్నితమైన హాస్యం, సునిశితమైన ఎత్తిపొడుపుల మేళవింపు కల్గిన కథిది.

ముంబాయి నుంచి ఆంధ్ర కొచ్చిన జగన్‌కి తెలుగు భాష రాయడం చదవడం రాకపోవడంతో ఏర్పడ్డ చేదు అనుభవాలు ఎర్రబస్‌ ప్రయాణంలో జగన్‌ పక్కవాడితో “బోడితెలుగు” అని నోరు జారినందుకు ఓ పెద్దాయన ఇంగ్లీషులో ఇచ్చిన సుదీర్ఘమైన ఉపన్యాసాత్మకమైన మందలింపు, పక్కింటి బామ్మ తెచ్చిన ఉత్తరాన్ని అమెరికాలో పుట్టిపెరిగిన “క్రిష్‌” అనర్గళంగా చదివిన ఆశ్చర్యకర సంఘటన వెరసి జగన్‌కి దేశభాషలందు తెలుగు లెస్స అని తెలియ చెప్పిన కథ “శ్రీకారం”.

మోసానికి మెరుపులెక్కువంటారు. మోసం మోసులెత్తినప్పుడు మొహమాటం లేకుండా మెడమెచ్చుతనం విజృంభిస్తుంది. మాటలగారడీలో మనల్ని మనమే మరిచిపోయి గంగిరెద్దుల్లా తలాడిస్తూ సునాయాసంగా మోసపోతాం. సామాన్యులే కాదు మహామేధావులు కూడా “ఫైనాన్స్‌ మాయాజాలం” శ్లేష్మంలో పడ్డ ఈగలై పోతారన్న నగ్నసత్యాన్ని లెక్కల ప్రకారం నిరూపించి నిజం ఎరుకపరిచే కథ ఇది.

పట్నం అందచందాల్ని ఆబగా చూద్దామన్న ఆశతో వచ్చే పల్లెసీమ వాసులకు పట్నంలో ఇరుకు ఇరుకు గదులు ఇబ్బందులు అంతగా అర్థం కావు. ఆప్యాయతలు అపేక్షలూ అంతరంగంలో పొంగిపొర్లుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి ఇటువంటి స్థితిగతుల మతుల భావచిత్రణ “వైశాల్యం” కథ.

అదేం చిత్రమో
భాష తెలియని ప్రదేశంలో తెలుగు వాళ్ళిద్దరు దసూలైతే .. “ఎవరికి వారే యమునా తీరే” లా మౌనముద్ర వహిస్తారు. లేకుంటే పరాయి కిరాయి భాషలో పళ్ళికిలించుకుంటారే గానీ మాతృభాషలో మర్యాదగా మమకారం అద్దుకున్న అక్షరాలతో ఆప్యాయించుకోరు. చర్చి గేటు నుంచి నారిమన్‌ పాయింట్‌ వరకూ ఒకే బస్‌లో ప్రయాణం చేస్తున్న సుబ్బారావు చేతిలో “రచన” మాసపత్రిక, శ్యాం కుమార్‌ చేతిలో ” ఆంధ్రప్రభ” వీక్లీ పరస్పరం వాళ్ళిద్దరూ ఒకే ప్రాంతీయులని తెలియ చెప్పినా చిరునవ్వుకీ చిన్న పలకరింపుకీ నోచుకోని వాళ్ళిద్దరి అజ్ఞానాన్నీ అహంకారాన్నీ “తెలుగువాళ్ళు” అనే కథలో అద్భుతంగా అంబళ్ళ చిత్రీకరించారు.

జీవననాణానికి సుఖం బొమ్మైతే బొరుసు కష్టం. ఎపుడూ బొమ్మే కాదు బొరుసు కూడా అప్పుడప్పుడూ పడుతుంటుంది కూడ. అలాటప్పుడు ఎంతటి క్లిష్ట సమస్యనైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం అలవరరుకోవాలి. ప్రతి చిన్న విషయానికీ తీవ్రంగా స్పందించే పిల్లలకీ భర్త ఉద్యోగహోదాని ఫణంగా పెట్టి సాటివారితో పోటీ పడే భార్యలకీ “జీవితసత్యం” కథ చక్కని కనువిప్పు.

లోపాలకేం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎంత గొప్పవారికైనా ఉంటాయి. ప్రారంభదశలో అవి మరీ సహజం. క్రమక్రమంగా పరిణామదశలో తనని తాను అధికపఠనం వల్ల నొక్కుకుంటూనో చెక్కుకుంటూనో పరిణతి చెంది ప్రఖ్యాతి పొందవచ్చు. అటువంటి శక్తియుక్తులు కల్గిన అంబళ్ళ జనార్దన్‌కి మంచి కథారచయితగా “భవిష్యత్తు భద్రం” అని ఆశిద్దాం.