(కథకుడిగా రచ్చ గెలుస్తున్న ఎస్. నారాయణ స్వామి కవిత్వంతో ఇంట గెలవబోతున్నారు.)
అయ్యా, నేనొక పాత్రని
బాబూ, నేనొక కథలో పాత్రని
దయ చూడండమ్మా, నేనొక అనాథ పాత్రని.
నన్ను పుట్టించిన వాడు ఎందుకు పుట్టించాడో తెలీదు.
పుట్టించేసి,
ఒక చింపిరి కథలో ఇరికించేసి,
తరవాత ఏం చెయ్యాలో తెలియక ఇలా లోకం మీదికి వొదిలేసి
పత్తా లేకుండా పారిపొయ్యాడు.
నాకు చాలా చరిత్ర వుంది. పూర్వ జన్మ పరిజ్ఞానమూ వుంది.
మీ పన్ల మీద మీరు పరుగులు పెడుతూ వుంటే,
మీకు శ్రమ తెలియకుండా చెబుతా వినండి.
అనగనగా కాకమ్మ కథల్లో ఆహ్లాదంగా గడిపిన బాల్యం నాది.
కాశీ మజిలీ కథల్లో కాకలు తీరిన యోధుడి వేషం నాది.
పట్టు వదలని విక్రమార్కుడికి బేతాళుడు విసిరిన ప్రశ్నలూ
కథా సరిత్సాగరం లోతుల్లోంచి పుట్టుకొచ్చిన మేలిముత్యాలూ
నా రూపాలే నాకు బాగా గుర్తుంది.
ఎందరెందరో మహా కథకులు నన్ను పొత్తిళ్ళలో ఎత్తుకుని ముద్దులాడారు.
వెండీ, పసిడీ, రాగీ, కంచూ, గాజూ, రాయీ, చెక్కా, లక్కా,
ఎన్నెన్నో విచిత్ర పదార్ధాల్తో నాకు ఎన్నెన్నో వింత రూపాల్ని చెక్కారు వారు,
అమర శిల్పులు.
మట్టి ముద్ద నైతేనేం,
కుమ్మరి చక్రమ్మీద కుండనీ కళా ఖండాన్నీ అయ్యాను.
ఇనప ముక్క నైతేనేం,
కమ్మరి కొలిమిలో కొడవలినీ గునపాన్నీ, చంద్ర హాసాన్నీ అవుతాను.
ఇన్ని జన్మలెత్తినాక, ఈ ఇరవయ్యొకటో శతాబ్దంలో,
కథా కథనంలో ఓనమాలు కూడా దిద్దుకోని నిరక్షరాస్యుడొకడు,
పాత్ర నిర్మాణ ప్రాంగణంలో తప్పటడుగులు కూడా వెయ్యలేని దద్దమ్మ ఒకడు,
రచయిత అన్న బిరుదుని ముట్టుకోడానిక్కూడా అర్హత లేని వాడొకడు
తిన్నదీ తాగిందీ అరక్క,
పైత్యం ఎక్కువై వెలపరించుకుంటూ,
దాని రంగూ వాసనా నాకు పులిమేసి,
ఇదే నీ కొత్త రూపమంటూ,
ఇదే నీ జీవితమంటూ,
ఇదీ నీ కథంటూ ..
… నా ఉజ్వ్జల చరిత్ర వాడు చదవలేదు, వాడికక్ఖర్లేదు
నాలో నిద్రాణమైన శక్తిని
వాడు ఊహా మాత్రంగా కూడా సందర్శించలేదు, లేడు.
ఈ వారపత్రికల మాసపత్రికల పేజీల్లో
ఇలా చావలేని బతుకు నా నొసట రాశాడు.
నన్నొదిలేశాడు.
నాకు మళ్ళీ ఊపిరి పోసే బలమైన కలం పోటు కోసం వెతుక్కుంటున్నా.
మీకెక్కడన్నా అది కనబడితే నన్ను మర్చి పోకండి.
బాబూ, అమ్మా, దయుంచండి. నేనొక అనాథ పాత్రని.