కళ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుంది. అది దాని జీవలక్షణం. సాహిత్యం దానికి మినహాయింపు కాదు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కథన కవిత్వ రీతులు పుట్టుకొస్తున్నాయి. నూతన అభివ్యక్తి మార్గాల కోసం అన్వేషణలు కొనసాగుతున్నాయి. కవితా వస్తువులు మారుతున్నాయి, నేపథ్యాలూ కొత్తగా కనపడుతున్నాయి. కవిత్వ లక్షణాల గురించీ, లక్ష్యాల గురించీ విభిన్న వాదనలు వినపడటమూ, సామాజిక ఆర్థిక రాజకీయ అవసరాలు ఏ కాలానికాకాలం కవిత్వాన్నీ ప్రభావితం చేయడమూ పాఠకలోకం గమనిస్తూనే ఉంది. ఇన్ని వైవిధ్యాలున్న వాతావరణంలో, ఎవరైనా ఒక కోవకు చెందిన కవిత్వాన్ని లేదా ఒకరి కవిత్వాన్ని మాత్రమే గొప్పది అనడం సాహసమనిపిస్తుంది. ఆ రకమైన అభిప్రాయం తాత్కాలికమనీ తోస్తుంది. సృజన గొప్పతనాన్ని నిర్ణయించగలిగేది కేవలం కాలం మాత్రమే. జాషువా ఖండకావ్యం పిరదౌసి, కాలం ధాటికి తట్టుకుని నిలబడ్డ అలాంటి అసాధారణమైన కవిత్వం. సరళమైన అభివ్యక్తితో గాఢమైన మానసిక దశలను చిత్రించిన తీరుకి, ఊహలకందని ఉద్వేగాలకి అక్షరరూపమిచ్చి అనుభవైకవేద్యం చేసిన సమర్థతకీ, ఇప్పుడే కాదు, ఏ కాలానికైనా ఈ కావ్యం సజీవంగా సాహిత్య లోకంలో నిలబడగలదు.
పిరదౌసి పర్షియనులు ఎంతగానో అభిమానించే 10వ శతాబ్దపు ఒక గొప్ప కవి. అతని షాహ్నామా సామానీ, గజనీ రాజుల కాలంలో రాయబడిన ఇరాన్ దేశపు చారిత్రిక ఐతిహాసం. అరవై వేల పద్యాలతో, ప్రపంచం లోనే అతి పొడుగైన ఇతిహాసంగా పేరెన్నిక గన్న గ్రంథం. అప్పటి కవిపండితులు ఎందరి లాగానో పిరదౌసి జీవితాన్ని గుఱించి కూడా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వ్యత్యాసాలు ఎన్నున్నా స్థూలంగా కథ మాత్రం ఒక్కటే. ఇదీ ఆ పిరదౌసి కథ:
రాజ్యాలకు రాజ్యాలను తన విస్తార కాంక్షతో ముట్టడించి, శత్రుసైన్యాలను చిత్తు చేసి వీరుడిగా నిలబడ్డ గజనీ మహమ్మదు ఒకనాడు తానే స్వయంగా పిరదౌసిని నిండు సభకు పిలిచి, తమ ఈ చరిత్ర అంతా ఉద్గ్రంథముగా వ్రాయమని, అలా వ్రాసిన ప్రతి పద్యానికీ ఓ బంగారు నాణెం బహుకరిస్తానని, ఆనక ఆ కృతిని తనకే అంకితమీయమనీ అడుగుతాడు. పిరదౌసి పరమ సంతోషంగా ఏకాగ్రచిత్తంతో గజనీ మహమ్మదు విజయయాత్ర వ్రాయడం మొదలెడతాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు విధివశాత్తూ మరణించాడని తెలుసుకున్నప్పుడు ఆ బాధలో విలవిల్లాడుతూ కూడా కావ్యరచనలో మగ్నమవుతాడు. అంత బాధనూ శ్రమనూ భరించి అరవయివేల పద్య రత్నాలతో షాహ్నామా అనే ఉద్గ్రంథాన్ని పూర్తి చేసి సంతృప్తిగా తిరిగి ప్రభువు కొలువులో అడుగుపెడతాడు పిరదౌసి. కృతిని అందుకుని, బంగారు నాణాలకు బదులుగా వెండి నాణాలు ఇస్తాడు మహమ్మదు. పిరదౌసి హృదయం ముక్కలవుతుంది. అక్షరాలా ముప్పయ్యేళ్ళ శ్రమకు నిండు కొలువులో జరిగిన పరాభవం, మసలిన హృదయాన్ని, ప్రాణాన్ని ఊరకుండనివ్వదు. మసీదు గోడల మీద మాట తప్పిన మహమ్మదు గురించి వ్రాయకుండా ఉండలేకపోతాడు పిరదౌసి. అవి చదివి, పట్టరాని కోపంతో ఆ రాజద్రోహిని చంపేయమంటూ ఆదేశాలిస్తాడు మహమ్మదు. చక్రవర్తి ఆలోచనలు తెలుసుకున్న పిరదౌసి, తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యం వదిలి, భార్యాబిడ్డలతో ఎంతో ప్రయాసతో కారడవులు దాటుకుని తాను పుట్టిన తూసీ నగరానికి వెళ్ళిపోతాడు. కవి హననోద్యుక్తుడైన మహమ్మదు తరువాత ఎన్నాళ్ళకో సామంత రాజుల మాటలు విని, తప్పు తెలుసుకుని, బంగారు నాణాలు బస్తాల కెక్కించి తూసీకి భటులను పంపించి, పిరదౌసికి అందించ చూస్తాడు. ఒక ద్వారం నుండి బంగారు బస్తాలు పిరదౌసి ఇంటిలోనికి వస్తూంటే, మరొక ద్వారం గుండా కవి పార్థివ దేహాన్ని శ్మశానానికి పంపుతుంటారు. రాజభటులు నిశ్చేష్టులై, ఏమి చేయాలో పాలుబోక కవి కుమార్తెను ఆ బంగారాన్ని స్వీకరించమని అడుగుతారు. నా తండ్రిని బ్రతికినంత కాలమూ, అనుక్షణం క్షోభకు గురిచేసిన ఈ ధనాన్ని తాను ముట్టననీ, అది తమకక్కర లేదనీ ఆమె తిరస్కరిస్తుంది. వేగుల ద్వారా వార్త రాజుకు చేరుతుంది. అతడు తీవ్రమైన పశ్చాత్తాపంతో దహించుకుపోయి, చివరికి అదే ధనంతో తూసీ పట్టణంలో పిరదౌసి స్మారక స్తూపాన్ని, సత్రాన్ని నిర్మిస్తాడు.
ఒక వాస్తవ ఘటనను ఆధారశిలగా చేసుకుని తన భావనా గరిమతో పిరదౌసి లాంటి కవితాసౌధాన్ని నిర్మించుకోగలిగాడు జాషువా. కనుక, కథకు సంబంధించి జాషువాకి ఘనత ఆపాదించనవసరం లేదు. అతని ప్రతిభ మొత్తం ఆ కథను ఆశ్వాసాలుగా విడగొట్టిన పద్ధతిలో ఉంది. ఇక్కడే జాషువా తన బలాబలాలను నేర్పుగా అంచనా వేసుకున్నాడు. గజనీ మహమ్మదు రాజ్య విస్తార కాంక్షని, విజయాలని అతడు పిరదౌసిని షాహ్నామా రచించమని అడగడం మొదలుకుని, పిరదౌసికి జరిగిన అవమానమూ తదనుభవానికి విచలితుడై కవి మసీదు గోడల మీద రాజుని నిందించడం వరకూ మొత్తాన్నీ ఒకే ఆశ్వాసంలో ముగించాడు జాషువా. అడవి దారుల్లో తూసీ నగరానికి ప్రయాణమయ్యాక ఎదురైన ప్రకృతి వర్ణనలనూ, కవి అంతరంగ ఆవిష్కరణకు ఎక్కువ ఆస్కారం ఉన్న మిగిలిన కథనూ మూడు ఆశ్వాసాల్లో విస్తరించి రచించాడు. ఈ పరిచ్ఛేదమేమీ కాకతాళీయం కాదనీ, తాను చెప్పదలచుకున్నదేమిటో సుస్పష్టంగా తెలుసు కనుకే ఇంత జాగరూకతతో కథాక్రమాన్ని మలచుకున్నాడనీ పాఠకులకూ సులభంగానే అర్థమవుతుంది.
పాఠకులుగా మనకు కవులంటే వారి ప్రతిభ, విద్వత్తుల గురించి కొన్ని అభిప్రాయాలుంటాయి; వారిపై కొన్ని అంచనాలుంటాయి. మరి కవులు కవుల గురించి ఏమనుకోవాలి? వారెలాంటివారైతే వారి సృజన రాణిస్తుంది? అన్నది సగటు పాఠకులకుండే కుతూహలం. అందుకనే కవులు కవి గురించి, కవిత్వం గురించీ చెప్పే మాటలంటే మనకు ఆసక్తి ఎక్కువ. అలాంటి ఆసక్తిని సంతుష్టపరచే రసగుళికల్లాంటి పద్యాలు కొన్ని ప్రథమాశ్వాసం లోనే ఎదురవుతాయి. ‘తమ్మిచూలి కేలుదమ్మిని గల నేర్పు/ కవికలంబునందు కలదు,’ అనీ, ‘క్షణము గడచిన దాని వెంకకు మరల్ప/ సాధ్యమే మానవున కిలాచక్రమందు?/ దాటిపోయిన యుగములనాటి చరిత మరల పుట్టించగల సమర్థుడు,’ కవియే అనీ జాషువా నమ్మకం. అలాగే, సత్కవికి నాకున్న నిర్వచనమొకటి జాషువా కవిత్వం లోనూ చూశాన్నేను.
వసుధ శాసింపగల సార్వభౌముండగును
ధీరుడగు, భిక్షకుండగు, దీనుడగును
దుఃఖితుండగు, నిత్యసంతోషియగును
సత్కవి ధరింపరాని వేషములు గలవె!
కవి పాఠకులకేమైనా కావచ్చును కానీ, తనకు తాను కవి కాకూడదు. జాషువా అన్నట్టు, అతడు ఎన్ని అవతారాలైనా ఎత్తాలి, ఎత్తగలగాలి. దీనుడూ, దయాళుడూ, నిత్యసంతోషి, నిత్యశంకితుడు, భిక్షకుడు, భగవంతుడు అన్నీ అతడే అయినప్పుడే అందరూ అతని అక్షరాల్లో తమని తాము చూసుకుని కదలిపోయేది. ఈ రహస్యం తెలిసిన కవి చేతుల్లో ప్రాణం పోసుకున్న కారణానికే పిరదౌసి లోని ప్రతి పద్యమూ తనదైన ఉద్వేగాన్ని ప్రకటిస్తుంది.
నిజానికి పైన టూకీగా చెప్పిన కథను చదివితే, ఇట్టే అర్థమవుతుంది, ఈ కథ సున్నితమనస్కులను తేలిగ్గా కదిలించగలదనీ, కళాకారులైతే తమ సృజనలో చోటు కల్పించేంతగా ఇది విని చలించగలరనీ. జాషువా ఇందుకు మినహాయింపేమీ కాదు కానీ, కథను విప్పే క్రమంలో కొన్ని పునరుక్తులనిపించే వర్ణనలూ చేయకపోలేదు. ఉదాహరణకి, మొదటి ఆశ్వాసంలో మహమ్మదు కవిని సభకు పిలిపించి పద్యాలు వ్రాయమని అడిగే సందర్భంలో, పైన ప్రస్తావించినట్టు కవి అన్న పదానికి నిర్వచనాలుగా నిలబడగల పద్యాలు ఎన్నో వ్రాశాడు. అవి కథను ముందుకు నడిపించే పద్యాలు కావు. కేవలం కవి పట్ల జాషువా దృక్కోణాన్ని ప్రతిఫలించే ఆలోచనలు మాత్రమే. ఈ పద్యాలు ఎన్ని సార్లు చదివినా బాగుండటమూ, ఈ కాలానికీ పొసగేట్టుగా ఉండటం తరువాతి సంగతి. అలాగే, ద్వితీయాశ్వాసంలో వరుసగా ప్రకృతి వర్ణనలూ, పరమాత్మ ఈ సృష్టిని నిలబెట్టి నడిపిస్తున్న తీరును గూర్చి విస్మయుడై కీర్తించడమూ కనపడుతుంది. మొదటి ఆశ్వాసంలో కనపడ్డ పునరుక్తి దోషం ఇక్కడెందుకు లేదూ అంటే, ఒకటే కారణం. కథలో, ఈ భాగంలో పిరదౌసి అడవిలో ప్రయాణం చేస్తున్నాడు. దారీ తెన్నూ తెలీని కొత్త మార్గాల్లో ప్రయాణం, అతనికి క్షణానికో కొత్త సౌందర్యాన్ని చూపెట్టిందనుకోవడంలో అసహజమేమీ లేదు. పూటపూటకీ మారే లోకపు రంగులనీ, సెలయేటి చప్పుళ్ళనీ, ఆ వెనుకే కనపడే కొండల్నీ గుట్టల్నీ జంతువులనీ ఎన్ని పద్యాల్లో వర్ణించినా ప్రతీదీ దేనికదే సర్వస్వతంత్రంగా నిలబడగలదు. ఇటువంటి ఒక సమర్థన మొదటి ఆశ్వాసానికి ఆపాదించడం అసాధ్యం కాదు కానీ, కష్టం.
ఈ వర్ణనల్లోనే, ‘కుంకుమ పంకముం బులుముకున్నవి తూరుపుకొండ నెత్తముల్’ అంటాడొక చోట ఈ కవి. కాల ప్రభావాన్ని పరిగణన లోనికి తీసుకోక తప్పదేమో కానీ, ఇది పెద్ద పెద్ద కవులు మొదలుకుని ఇప్పుడిప్పుడే వచన కవిత్వం వ్రాయడం మొదలెట్టిన వారి వరకూ అందరూ వాడుకోగా అరిగిపోయిన వర్ణనే. అలాగే, విచలితమైన మనసును గురించి చెబుతూ, ‘గాలి కెదురు గట్టు కాచగోళంబయ్యె /గండు చేఁప దాఁకు కమలమయ్యె’ అని వర్ణిస్తాడు కవి. చిత్రంగా, ఈ గండు చేప తాకిన కమలం* అన్న వర్ణననే, వాల్మీకి సుందరకాండలో,
తస్యాః శుభం వామమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణవిశాలశుక్లమ్
ప్రాస్పన్దతైకం నయనం సుకేశ్యా మీనాహతం పద్మమివాభితామ్రమ్ (సుం. కాండ – సర్గ 29, 5.29.2.)
అంటూ సీత ఎడమకన్ను హనుమను కలువబోయే ముందు శుభసూచకంగా అదరడాన్ని గురించి వర్ణిస్తూ చెబుతాడు. అలాగే మేఘసందేశంలో (ఉత్తరమేఘము-34) కాళిదాసు, ‘మీనక్షోభాచ్చల కువలయశ్రీతులా మేష్యతీతి’ అంటూ మేఘం అలకాపురి చేరినప్పుడు యక్షుడి కుడికన్ను శుభసూచకంగా అదరడాన్ని గురించి చెబుతాడు. ఈ రెండు చోట్లా ఈ ఉపమానం శుభసూచకంగా చెప్పబడితే, పిరదౌసికి మాత్రం ఇది అశుభసూచకమే అయింది. పుత్రవియోగం కలిగిందని పిరదౌసికి ఈ సందర్భం లోనే తెలుస్తుంది. ఒక ప్రాచీన ప్రసిద్ధ వర్ణనని, దానికి పూర్తిగా భిన్నమైన స్ఫూర్తిలో ఒప్పించే రీతిలో వాడుకోవడం ఇక్కడ నన్నాకర్షించిన విషయం. ఈ ఇద్దరు కవుల ప్రభావమూ జాషువా మీద ఎంతో కొంత ఉండే ఉండాలి. ఎందుకంటే, జాషువ రెండవ రచన – కుశలవోపాఖ్యానం (1922). అలాగే, గబ్బిలం గురించి చెబుతూ పీఠికలో ఆయనే, ‘కాళిదాసుని మేఘసందేశము మనస్సులో ఉంచుకుని నేనీ కావ్యమును రచించితిని,’ అని చెప్పుకున్నారు.
కవిత్వంలో భాషకి ఎంత ప్రాముఖ్యత ఉందో, భావ చిత్రణకూ అంతే ప్రాముఖ్యత ఉంది. ప్రకృతి వర్ణనల్లోనూ, ఊహలకు మాత్రమే పరిమతమయ్యే దృశ్య చిత్రీకరణల్లోనూ కవులకు ఉండే స్వేచ్ఛ, అతి సహజమైన మానవ ఉద్వేగ చిత్రీకరణలో ఉండటం అరుదు. అతిగా వర్ణిస్తే అది కల్పనలానే మిగిలిపోతుంది. క్లుప్తంగా తేల్చేస్తే అనుభవం పాఠకులకు అందకపోయే ప్రమాదమూ ఉంది. కత్తి మీది సాము లాంటి ఈ గారడీని, జాషువా ఎంత నేర్పుగా చేశాడో తప్పకుండా గమనించాలి.
కృతిని అంకితమిచ్చేందుకు రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ మహీపతి, ‘గడ్డము దువ్వుచు మందహాసవాసిత ముఖుడై,’ సభలో చదువుదువు రమ్మని పిలుస్తాడట. అతనిలో ఈ కవి నా మాట నమ్మి ముప్పయేళ్ళు ఏమి వ్రాశాడో అన్న ఉత్సాహం కానీ, అదెలా ఉండబోతోందోనన్న ఉత్కంఠ కానీ, లేశమాత్రమైనా ఉన్నట్టు కనిపించవు. ఆ ‘గడ్డము దువ్వుచు’ అన్న రెండు పొడి పొడి మాటలతో, నృపతి నిర్లక్ష్యధోరణిని సూచనామాత్రంగా చెప్పేశాడు జాషువా. సరిగ్గా ఆ మరుసటి పద్యంలోనే, పిరదౌసి సభలోకి రావడాన్ని ఇలా చెప్తాడు: ‘హేమసమ్మిళితకీర్తిన్ కాంచు కౌతుహలంబున, లజ్జావతియై స్వయంవర సభాభూమిన్ ప్రవేశించు ముగ్ధను బోల్గ్రంథము చంకబెట్టుకుని యాస్థానంబు డాయంజనెన్.’
స్వయంవరం వేళ సభలో ప్రవేశించే ముగ్ధలా ఒకింత సిగ్గుతో, తనకు రాబోయే కీర్తినీ, బంగారాన్నీ చూసుకోవాలన్న కుతూహలంతో ఆ గ్రంథమును చంకన పెట్టుకుని వస్తాడట పిరదౌసి. స్వయంవరానికై సభలో అడుగుపెట్టే యువరాణికి వేనకోట్ల కలలుంటాయి. లెక్కకు మిక్కిలి కోర్కెలుంటాయి. తనకు అన్ని విధాలా తగిన వరుడొకడు ఉంటాడనీ, అతనికే తాను వరమాల వేస్తాననీ నమ్మి వస్తుంది. ఆమె సౌందర్యం/ వ్యక్తిత్వం అన్నేళ్ళుగా నగిషీలు చెక్కుకుని నాడు తొలిసారిగా మరొకరకు అంకితమవ్వబోతోంది. పిరదౌసి చేతిలోని షానామా కూడా అంతే. ఆ పోలిక గురించి ఆలోచించిన కొద్దీ అందులోని సౌందర్యం పొరలుపొరలుగా విస్తరించుకు పోతూ మనను ముగ్ధులను చేస్తుంది. జాషువా ఎంత పకడ్బందీగా దీనిని వాడాడో చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. అదీ కాక, ముందు పద్యంలో రారాజు నిర్లక్ష్యం చెప్పి, ఇప్పుడీ కవి అమాయకమైన ఆశని, అంచనాలని చెబుతోంటే, జరగబోయేది ఊహకంది మన మనసు విచలితం కాకుండా ఉంటుందా? ఆఫ్గన్ సభామండపానికి మనను లాక్కుపోయి నిలబెట్టిన జాషువా నేర్పుకి ఇదొక మెచ్చుతునక.
జాషువా తెలుగు ఎంత తేటగా ఉంటుందో అంత గుంభనం గానూ ఉంటుంది. అతను వాడినవి బలమైన ప్రతీకలే కానీ, భాష భయపెట్టదు. కవిత్వ సౌందర్యం బరువైన పదాల్లో కాదు, బరువైన భావాలను తేలిక పదాల్లో పెట్టడం లోనే ఉంటుందని తెలిసిన వాళ్ళకి పిరదౌసి నచ్చుతుంది. సాక్షాత్తూ పిరదౌసియే పూని అంతరంగ చిత్రణ చేయించాడా అన్నంత ఉదాత్తంగా ఆ పాత్రని మలచాడు జాషువా. అతని ఏకాగ్రతని, అతను పొందిన పరాభవాన్ని, అందులో నుండి పొరలి వచ్చిన దుఃఖాన్ని, ముప్పయేళ్ళ సేవకు ఈ ‘నిరాశాంకిత బాష్పములేనా ప్రతిఫలమూ’ అని ప్రశ్నిస్తూ వ్రాసిన ఉత్తరాలనూ – ఇంతే గాఢతతో, ఆర్ద్రతతో వేరెవరూ వ్రాయలేరనిపిస్తుంది.