ఉదయాకాశంపై ఎంత బంగారుద్రవం ఒలికిపోనీ,
పసిపాప నవ్వుల ఎన్ని తెల్లని సీతాకోకలు ఎగరనీ,
యువతి కన్నుల ఎన్ని ఇంద్రధనువులు గాలిపటాలై ఊగనీ,
కెరటాల చివర్ల నిండువెన్నెల ఎన్ని వజ్రాలు పొదగనీ,
దయగల హృదయాలెన్ని భూమిని సారవంతం చేయనీ,
దుఃఖితుల కన్నీరెంతగా జీవితాన్ని ప్రార్థించనీ, శపించనీ
అవన్నీ
పరుచుకున్న ఆకాశంలోనే నువ్వూ
జ్వలిస్తున్న కాంతిలోనే నువ్వూ
తడుస్తున్న జీవితంలోనే నువ్వూ
భాగంగా, ఎడంగా
దీనంగా, గర్వంగా
దైవంగా, హీనంగా
కలగంటూ, మేలుకొంటూ
మొదలౌతూ, ముగుస్తూ
కాలంలా, స్థాణువులా ఉన్నట్లూ, లేనట్లూ
అవన్నీ ఉన్నాయో, లేవో అవసరం లేనట్లు,
నువు ఉన్నావో, లేవో తెలిసీ, తెలియనట్లు,
కదిలీ, కదలని గాలితెరలా
రాలీ, రాలని కలలా.
