ఊరుభంగం – సమూలానువాదం : 1

పూర్వరంగం

కథాసంగ్రహం

భీమదుర్యోధనుల గదాయుద్ధం మొదలవనున్నదనగా, ముగ్గురు భటులు కురుక్షేత్రయుద్ధభూమికి చేరుకుంటారు. సర్వే సర్వత్రా తాండవిస్తున్న బీభత్సవిషాదాలను దాటుకొని ద్వంద్వయుద్ధం జరుగుతున్నచోటికి వస్తారు. (అందరికీ తెలిసిన) కథాప్రకారం సుశిక్షితుడైన దుర్యోధనుడి చేతిలో చావుదెబ్బలు తింటూ ఉన్న భీముడు కృష్ణుడి సూచనను అందుకొని, యుద్ధనియమాలకు విరుద్ధంగా దుర్యోధనుడి తొడలపై గదాప్రహారం చేసి అతణ్ణి నేలకూలుస్తాడు.

అంతిమఘడియల్లో ఉన్న దుర్యోధనుడు పశ్చాత్తాపానికి లోనవుతాడు. పాండవుల అంతు తేల్చుదామనుకున్న బలరాముడిని శాంతింపజేస్తాడు. ఇంతలో ధృతరాష్ట్రుడు, గాంధారి, దుర్యోధనుడి రాణులైన మాలవి, పౌరవి, దుర్జయుడనే కొడుకూ రణరంగానికి చేరుకుంటారు. వాళ్ళందరినీ దుర్యోధనుడు ఓదారుస్తాడు, కొడుకుకు హితోక్తులు చెబుతాడు. అశ్వత్థామ రంగప్రవేశం చేసి పాండవులను నిర్మూలిస్తానని ప్రతిజ్ఞ చేస్టాడు. దుర్యోధనుడు అతణ్ణి వారించే ప్రయత్నం చేస్తాడు. దుర్జయుణ్ణి రాజుగా ప్రకటిస్తాడు అశ్వత్థామ. దుర్యోధనుడి మరణంతో నాటకం ముగుస్తుంది.

కొన్ని విశేషాలు

  1. ఇదీ ఉత్సృష్ట్యంకమే. కరుణరసప్రధానం. స్త్రీపాత్రల విలాపాలు ఉన్నాయి. ప్రాకృతికమైన నాయకుడు ఉన్నాడు.
  2. స్థాపనకు ప్రధాననాటకానికీ నడుమన విష్కంభకం ఉంటుంది. రెండు అంకాల నడుమన జరిగిన కథను అప్రధానపాత్రలతో చెప్పిస్తారు విష్కంభకం/విష్కంభంలో. వేదిక మీద చూపించడానికి వీలులేని విషయాలను – ఉదాహరణకు, యుద్ధం – ఈ అప్రధానపాత్రల సంభాషణలద్వారా చెప్పిస్తారు.
  3. భీముడు, కృష్ణుడు, మిగతా పాండవులు ఇంతముఖ్యమైన ఘట్టంలో కనిపించరు. విష్కంభకంలోని సంభాషణల్లో ప్రస్తావించబడతారంతే.
  4. యుద్ధాన్ని చూపించలేదు కానీ ఈ నాటకంలో మరణాన్ని చూపిస్తారు. అది సంస్కృతనాటకనియమాలకు విరుద్ధమే. ఆధునికమైన విషాదాంతనాటకాలతో పోల్చదగ్గది ఊరుభంగం నాటకం
  5. మరిన్ని విశేషాలు మలిభాగంలో.

పాత్రలు

  1. ముగ్గురు భటులు
  2. దుర్యోధనుడు
  3. బలరాముడు
  4. ధృతరాష్ట్రుడు
  5. గాంధారి
  6. మాలవి
  7. పౌరవి
  8. దుర్జయుడు
  9. అశ్వత్థామ



(నాన్ద్యన్తే తతః ప్రవిశతి సూత్రధారః।)

సూత్రధారః:
భీష్మద్రోణతటాం జయద్రథజలాం గాన్ధారరాజహ్రదాం
కర్ణద్రౌణికృపోర్మినక్రమకరాం దుర్యోధనస్త్రోతసమ్।
తీర్ణః శత్రునదీం శరాసిసికతాం యేన ప్లవేనార్జునః
శత్రూణాం తరణేషు వః స భగవానస్తు ప్లవః కేశవః॥1॥

ఏవమార్యమిశ్రాన్విజ్ఞాపయామి। అయే కిన్ను ఖలు మయి విజ్ఞాపనవ్యగ్రే శబ్ద ఇవ శ్రూయతే! అఙ్గ! పశ్యామి।


(నాంది అనంతరం సూత్రధారుడు ప్రవేశిస్తాడు)
సూత్రధారుడు:
భీష్మద్రోణులు తీరాలుగా, సైంధవుడు నీరుగా, శకుని లోతైన నీటి మడుగుగా, కర్ణుడు అలలుగా, అశ్వత్థామ, కృపుడు మొసళ్ళుగా, దుర్యోధనుడు ప్రవాహంగా, కత్తులూ, బాణాలూ ఇసుక మేటలుగా ఉన్న శత్రునదిని అర్జునుడు ఏ తెప్ప సహాయంతో దాటాడో, ఆ తెప్ప — భగవంతుడైన కేశవుడు — శత్రుప్రవాహాన్ని దాటించుగాక!

గౌరవనీయులైన మీకు విన్నవించుకుంటున్నాను. అరె! ఇదేమి, నేను నా మనవి మాటలను వినిపిస్తుండగా ఏదో శబ్దంవినబడుతున్నది? సరే, చూస్తాను.


(నేపథ్యే)
ఏతే స్మో భోః! ఏతే స్మః।


(తెర వెనుకనుంచి)
ఇదిగో వచ్చేసాము! వచ్చేసాము!

సూత్రధారః:
భవతు విజ్ఞాతమ్।

సూత్రధారుడు:
అర్థమయ్యింది.

(ప్రవిశ్య)

పారిపార్శ్వికః:
భావ కుతో ను ఖల్వేతే,

స్వర్గార్థమాహవముఖోద్యతగాత్రహోమా
నారాచతోమరశతైర్విషమీకృతాఙ్గాః
మత్తద్విపేన్ద్రదశనోల్లిఖితైః శరీరై-
రన్యోన్యవీర్యనికషాః పురుషా భ్రమన్తి॥2।।


(సహాయకుడు ప్రవేశిస్తాడు.)
సహాయకుడు:
బావా, ఎక్కణ్ణుంచి వస్తున్నారు వీళ్ళు?

స్వర్గంకోసమై, యుద్ధభూమిలో తమ దేహాలను ఆహుతిచేసుకునేందుకు బయలుదేరినవారు; వందలాది బాణాలతో, బల్లాలతో గాయపడిన అవయవాలతో ఉన్నవారు; మదగజాల దంతాలు గీసుకుపోయిన శరీరాలతో పరస్పరం పరాక్రమాలను నిగ్గుతేల్చే గీటురాళ్ళలా తిరుగుతున్నారు ఈ పురుషులు.

సూత్రధారః:
మారిష! కిం నావగచ్ఛసి। తనయశతనయనశూన్యే దుర్యోధనావశేషే ధృతరాష్ట్రపక్షే, పాణ్డవజనార్దనావశేషే యుధిష్ఠిరపక్షే, రాజ్ఞాం శరీరసమాకీర్ణే సమన్తపఞ్చకే,

ఏతద్రణం హతగజాశ్వనరేన్ద్రయోధం
సఙ్కీర్ణలేఖ్యమివ చిత్రపటం ప్రవిద్ధమ్।
యుద్ధే వృకోదరసుయోధనయోః ప్రవృత్తే
యోధా నరేన్ద్రనిధనైకగృహం ప్రవిష్టాః॥3।।

సూత్రధారుడు:
ఆర్యా, అర్థమవలేదా?

నూరుగురు కొడుకులనే కళ్ళను కోల్పోయాక, ధృతరాష్ట్రుడి పక్షాన దుర్యోధనుడొక్కడు మిగిలాక, యుధిష్ఠిరుడి పక్షాన పాండవులు, కృష్ణుడు మాత్రమే మిగిలాక, రాజుల శవాలతో నిండిన సమంతపంచకంలో – హతమైన ఏనుగులతో, గుఱ్ఱాలతో, రాజులతో, యోధులతో నిండిన ఈ యుద్ధభూమి గజిబిజి గీతలతో నిండిన చిత్రపటంలా ఉన్నది; భీమదుర్యోధనుల యుద్ధం జరుగుతుందనగా, యోధులు రాజుల ఏకైక మృత్యుగృహమనదగిన యుద్ధభూమిలోనికి ప్రవేశిస్తున్నారు.

(నిష్క్రాన్తౌ)
(స్థాపనా)


(ఇద్దరూ వెళ్ళిపోతారు.)
(స్థాపన పూర్తి అయ్యింది)


(తతః ప్రవిశన్తి భటాస్త్రయః।)

సర్వే:
ఏతే స్మో భోః! ఏతే స్మః।


(ముగ్గురు భటులు ప్రవేశిస్తారు.)
అందరూ:
ఇదిగో వచ్చేసాం! వచ్చేసాం.

ప్రథమః:
వైరస్యాయతనం బలస్య నికషం మానప్రతిష్ఠాగృహం
యుద్ధేష్వప్సరసాం స్వయంవరసభాం శౌర్యప్రతిష్ఠాం నృణామ్।
రాజ్ఞాం పశ్చిమకాలవీరశయనం ప్రాణాగ్నిహోమక్రతుం
సమ్ప్రాప్తా రణసంజ్ఞమాశ్రమపదం రాజ్ఞాం నభః సఙ్క్రమమ్॥4।।

భటుడు-1:
వైరాలకు నిలయమూ, పరాక్రమానికి గీటురాయీ, ఆత్మగౌరవానికీ, కీర్తికీ నివాసమూ, అప్సరసల స్వయంవరసభా, నరుల శౌర్యప్రతిష్ఠలకు నెలవూ, అంతిమసమయంలో రాజుల వీరశయ్యా, ప్రాణాలనే అగ్నితో చేసే హోమక్రతువూ, రాజులకు ఆకాశాన్ని చేరేందుకు నిచ్చెనా అయిన యుద్ధమనే ఆశ్రమపదానికి చేరుకున్నాము.

ద్వితీయః:
సమ్యగ్భవానాహ।

ఉపలవిషమా నాగేన్ద్రాణాం శరీరధరాధరా
దిశి దిశి కృతా గృధ్రావాసా హతాతిరథా రథాః।
అవనిపతయః స్వర్గం ప్రాప్తాః క్రియామరణే రణే
ప్రతిముఖమిమే తత్తత్కృత్వా చిరం నిహతాహతాః॥5।।

భటుడు-2:
బాగా చెప్పావు.

పెద్ద పెద్ద ఏనుగుల పీనుగులు ఎగుడుదిగుడు రాళ్ళతోనున్న కొండల్లా ఉన్నాయి. అతిరథులు మరణించాక వారి రథాలు రాబందులకు గూళ్ళయ్యాయి. ప్రతి క్రియకూ మరణమే పర్యవసానమైన యుద్ధంలో ఒకరినొకరు గాయపరచుకొని, చంపుకొని భూపతులందరూ స్వర్గాన్ని చేరుకున్నారు.

తృతీయః:
ఏవమేతత్।

కరివరకరయూపో బాణవిన్యస్తదర్భో
హతగజచయనోచ్చో వైరవహ్నిప్రదీప్తః।
ధ్వజవితతవితానః సింహనాదోచ్చమన్త్రః
పతితపశుమనుష్యః సంస్థితో యుద్ధయజ్ఞః॥6।।

భటుడు-3:
ఈ విధంగా ఉన్నది –

శ్రేష్ఠమైన ఏనుగుల తొండాలనే యూపస్తంభాలతో, బాణాలనే పరిచిన దర్భలతో, చచ్చి పడిన ఏనుగులనే ఎత్తైన మోపులతో, వైరమనే మండుతున్న అగ్నితో, కప్పిన జెండాలనే పందిరితో, సింహనాదమనే మంత్రంతో, పడిపోయిన పశువులతోనూ, మనుషులతోనూ ఉన్న ఈ యుద్ధం యజ్ఞాన్ని పోలి ఉన్నది.

ప్రథమః:
ఇదమపరం పశ్యేతాం భవన్తౌ।

ఏతే పరస్పరశరైర్హృతజీవితానాం
దేహై రణాజిరమహీం సముపాశ్రితానామ్।
కుర్వన్తి చాత్ర పిశితార్ద్రముఖా విహఙ్గా
రాజ్ఞాం శరీరశిథిలాని విభూషణాని॥7।।

భటుడు-1:
ఈ దృశ్యాన్నీ చూడండి.

మాంసభక్షణ కారణంగా ముక్కులు తడిసి ఉన్న ఈ పక్షులు, పరస్పరశరప్రయోగం కారణంగా హతులై ఈ రణభూమిలో పడి ఉన్న రాజుల మృతదేహాలనుంచి ఆభరణాలను తొలగిస్తూ ఉన్నాయి.

ద్వితీయః:
ప్రసక్తనారాచనిపాతపాతితః
సమగ్రయుద్ధోద్యతకల్పితో గజః।
విశీర్ణవర్మా సశరః సకార్ముకో
నృపాయుధాగారమివావసీదతి॥8।।

భటుడు-2:
యుద్ధార్థం సన్నద్ధమై వచ్చిన ఏనుగు, కవచం బద్దలై, నేలకూలి, ధనుర్బాణసహితమై, రాజుగారి ఆయుధాగారంలా దీనంగా ఉన్నది.

తృతీయః:
ఇదమపరం పశ్యేతాం భవన్తౌ।

మాల్యైర్ధ్వజాగ్రపతితైః కృతముణ్డమాలం
లగ్నైకసాయకవరం రథినం విపన్నమ్।
జామాతరం ప్రవహణాదివ బన్ధునార్యో
హృష్టాః శివా రథముఖాదవతారయన్తి॥9।।

భటుడు-3:
ఇటు చూడండి.

ధ్వజాగ్రాలనుంచి రాలిపడ్డ దండలతో అలంకృతమై, బాణాలు నాటుకొని ఉన్న రథికుడి శవాన్ని – అల్లుడిని పల్లకీ నుంచి దించుతున్న కుటుంబస్త్రీలలా – నక్కలు సంతోషంగా, రథం మీదినుంచి నేలకు దించుతున్నాయి.

సర్వే:
అహో ను ఖలు నిహతపతితగజతురగనరరుధిరకలిలభూమిప్రదేశస్య విక్షిప్తవర్మచర్మాతపత్రచామరతోమర శరకున్తకవచకబన్ధాదిపర్యాకులస్య శక్తిప్రాసపరశుభిణ్డిపాలశూలముసలముద్గరవరాహకర్ణకణయకర్పణ-శఙ్కుత్రాసిగదాదిభిరాయుధైరకీర్ణస్య సమన్తపఞ్చకస్య ప్రతిభయతా।

అందరూ:
అహో!

చచ్చిపడి ఉన్న ఏనుగుల, గుఱ్ఱాల, మనుషుల రక్తంత తడిసి బురదలైన నేలతో, చెల్లాచెదురై పడిఉన్న రాజచిహ్నాలైన డాళ్ళతో, ఛత్రచామరాలతో, రకరకాల ఆయుధాలతో, కాళ్ళు చేతులు లేని మొండాలతో నిండిపోయిన ఈ కురుక్షేత్రం ఎంత భయానకంగా ఉన్నది!

ప్రథమః:
ఇహ హి,

రుధిరసరితో నిస్తీర్యన్తే హతద్విపసఙ్క్రమా
నృపతిరహితైః స్త్రస్తైః సూతైర్వహన్తి రథాన్ హయాః।
పతితశిరసః పూర్వాభ్యాసాద్ ద్రవన్తి కబన్ధకాః
పురుషరహితా మత్తా నాగా భ్రమన్తి యతస్తతః॥10।।

భటుడు-1:
ఇక్కడ –

వీరపురుషులు చచ్చిపడిన ఏనుగులను వంతెనలుగా చేసుకొని రక్తనదులను దాటుతున్నారు. సారథులు నేలజారిన, రాజులు లేని శూన్యరథాలను గుఱ్ఱాలు అటూ ఇటూ తిప్పుతున్నాయి. తలలు తెగిన మొండాలు అలవాటు చొప్పున ముందుకు ఉరుకుతున్నాయి. మావటివాళ్ళు లేని ఏనుగులు అంతటా తిరుగుతున్నాయి.

ద్వితీయః:
ఇదమపరం పశ్యేతాం భవన్తౌ। ఏతే,

గృధ్రా మధూకముకులోన్నతపిఙ్గలాక్షా
దైత్యేన్ద్రకుఞ్జరనతాఙ్కుశతీక్ష్ణతుణ్డాః।
భాన్త్యమ్బరే వితతలమ్బవికీర్ణపక్షా
మాంసైః ప్రవాలరచితా ఇవ తాలవృన్తాః॥11।।

భటుడు-2:
ఇంకో దృశ్యాన్నీ చూడండి –

ఇప్ప పూవుల మొగ్గలవలె పెద్దగా, పచ్చగా ఉన్న కళ్ళతో, బలి చక్రవర్తి ఏనుగుయొక్క అంకుశంలా వంపు తిరిగి, పదునుగా ఉన్న ముఖాలతో, రెక్కలను సాచి, ముక్కున గరచిన మాంసం ముక్కలతో పగడాలు పొదిగిన తాటాకు విసనకర్రలలా ఉన్నాయి, గద్దలు.

తృతీయః:
ఏషా నిరస్తహయనాగనరేన్ద్రయోధా
వ్యక్తీకృతా దినకరోగ్రకరైః సమన్తాత్।
నారాచకున్తశరతోమరఖడ్గకీర్ణా
తారాగణం పతితముద్వహతీవ భూమిః॥12।।

భటుడు-3:
మృతులైన గుఱ్ఱాలతో, ఏనుగులతో, రాజులతో, వీరులతో, అంతటా పరచుకొన్న తీక్ష్ణ సూర్యకిరణాలతో, నారాచాలతో, బల్లాలతో, బాణాలతో, విచ్చుకోలలతో, కత్తుతో నిండిపోయిన ఈ భూమి ‘నక్షత్ర సమూహం నేలరాలిందా?’ అన్నట్లున్నది.

ప్రథమః:
అహో ఈదృశ్యామప్యవస్థాయామవిముక్తశోభా విరాజన్తే క్షత్రియాః। ఇహ హి,

స్రస్తోద్వర్తినేత్రషట్పదగణా తామ్రోష్ఠపత్రోత్కరా
భ్రూభేదాఞ్చితకేసరా స్వముకుటవ్యావిద్ధసంవర్తికా।
వీర్యాదిత్యవిబోధితా రణముఖే నారాచనాలోన్నతా
నిష్కమ్పా స్థలపద్మినీవ రచితా రాజ్ఞామభీతైర్ముఖైః॥13।।

భటుడు-1:
ఓహ్, ఇటువంటి అవస్థలోనూ కళను కోల్పోకుండా ప్రకాశిస్తున్నారు ఈ క్షత్రియులు.

నిర్భీతితో ఉన్న ఈ రాజన్యుల ముఖాలు – పైకి తిరిగిఉన్న కళ్ళు తుమ్మెదల గుంపుల్లా, ఎర్రని పెదవులు రేకుల దొంతరలా, కనుబొమలు కేసరాలలా,కిరీటాలు దుద్దులా, గుచ్చుకొని ఉన్న బాణాలు తూళ్ళలా – ప్రతాపమనే సూర్యుడి వల్ల వికాసాన్ని పొందిన నేల తామరల్లా ఉన్నాయి.

ద్వితీయః:
ఈదృశనామపి క్షత్రియాణాం మృత్యుః ప్రభవతీతి న శక్యం ఖలు విషమస్థైః పురుషైరాత్మబలాధానం కర్తుమ్।

భటుడు-2:
ఇటువంటి వీరులను సైతం మృత్యువు లోబరచుకోగలుగుతుంది. ఆపదలకు లోనైన వారు తమ పరాక్రమాన్ని చూపలేరు కదా.

తృతీయః:
మృత్యురేవ ప్రభవతి క్షత్రియాణామితి।

భటుడు-3:
మృత్యువు వీరులను లోబరచుకున్నదంటావా?

ప్రథమః:
కః సంశయః।

భటుడు-1:
సందేహమా?

ద్వితీయః:
మా మా భవానేవమ్

స్పృష్ట్వా ఖాణ్డవధూమరఞ్జితగుణం సంశప్తకోత్సాదనం
స్వర్గాక్రన్దహరం నివాతకవచప్రాణోపహారం ధనుః।
పార్థేనాస్త్రబలాన్మహేశ్వరరణక్షేపావశిష్టైః శరై-
ర్దర్పోత్సిక్తవశా నృపా రణముఖే మృత్యోః ప్రతిగ్రాహితా॥14।।

భటుడు-2:
అలా అనవద్దు.

అర్జునుడు – ఖాండవవనపు పొగచే మలినమైన నారితో ఉన్నదీ, సంశప్తకులను నశింపజేసినదీ, నివాతకవచుల ప్రాణాలను కానుకగా చేసి స్వర్గపు దుఃఖాన్ని హరింపజేసినదీ అయిన గాండీవమనే – ధనుస్సును తాకి, మహేశ్వరుడితో పోరాడాక మిగిలిపోయిన బాణాలతోనూ, అస్త్రబలంచేతనూ, గర్వాతిశయానికి లోనైన ఈ రాజులను మృతువుకు అప్పగించాడు.

సర్వే:
అయే శబ్దః।

కిం మేఘా నినదన్తి వజ్రపతనైశ్చూర్ణీకృతాః పర్వతా
నిర్ఘాతైస్తుములస్వనప్రతిభయైః కిం దార్యతే వా మహీ।
కిం ముఞ్చత్యనిలావధూతచపలక్షుబ్ధోర్మిమాలాకులం
శబ్దం మన్దరకన్దరోదరదరీః సంహత్య వా సాగరః॥15॥
భవతు, పశ్యామస్తావత్।



(సర్వే పరిక్రామన్తి।)

అందరూ:
అరె, ఏమిటా చప్పుడు?

మబ్బులు ఉరుముతున్నాయా? వజ్రాయుధపు దెబ్బలకు పర్వతాలు పొడి అయిపోతున్నాయా? భయంకరమైన శబ్దం చేస్తున్న తుఫాను గాలులు భూమిని చీల్చివేస్తున్నాయా? తనగర్భంలోనున్న మంథరపర్వతపు గుహలను గాలికి చెలరేగిన పెను అలలు తాకినప్పుడు సముద్రం వెలువరిస్తున్న శబ్దమా? సరే, వెళ్ళిచూద్దాము.


(అందరూ వెళ్ళిపోతారు.)

ప్రథమః:
అయే ఏతత్ఖలు ద్రౌపదీకేశధర్షణావమర్షితస్య పాణ్డవమధ్యమస్య భీమసేనస్య భ్రాతృశతవధక్రుద్ధస్య మహారాజదుర్యోధనస్య చ ద్వైపాయనహలాయుధకృష్ణవిదురప్రముఖానాం కురుయదుకులదైవతానాం ప్రత్యక్షం ప్రవృత్తం గదాయుద్ధమ్।

భటుడు-1:
ఓహో,

ద్రౌపదిని జుట్టుపట్టి ఈడ్చినందుకు కోపించిన పాండవమధ్యముడైన భీమసేనుడికి , నూరుగురు తమ్ముల వధ కారణంగా క్రుద్ధుడై ఉన్న దుర్యోధనుడికి – వ్యాసమహర్షి, బలరాముడు, కృష్ణుడు, విదురుడు మొదలైన కౌరవయాదవపూజ్యుల సమక్షంలో గదాయుద్ధం మొదలయ్యింది.

ద్వితీయః:
భీమస్యోరసి చారుకాఞ్చనశిలాపీనే ప్రతిస్ఫాలితే
భిన్నే వాసవహస్తిహస్తకఠినే దుర్యోధనాంసస్థలే
అన్యోన్యస్య భుజద్వయాన్తరతటేష్వాసజ్యమానాయుధే
యస్మింశ్చణ్డగదాభిఘాతజనితః శబ్దః సముత్తిష్ఠతి॥16।।

భటుడు-2:
అందమైన బంగారపు రాయివంటిదీ, బలిష్టమైనదీ అయిన భీముడి ఎదను తగులుతున్న దుర్యోధనుడి గదా, ఐరావతపు తొండంలా కఠినంగా ఉండే దుర్యోధనుడి మూపును మోదుతున్న భీముడి గదా – ఆ ఇరువురి భుజస్కంధాల మధ్యనే జరుగుతున్న ప్రచండగదాప్రహారాలనుంచి ఈ శబ్దం పుడుతున్నది.

తృతీయః:
ఏష మహారాజః,

శీర్షాత్కమ్పనవల్గమానమకుటః క్రోధాగ్నికాక్షాననః
స్థానాక్రామణవామనీకృతతనుః ప్రత్యగ్రహస్తోచ్ఛ్రయః।
యస్యైషా రిపుశోణితాద్ర్రకలిలా భాత్యగ్రహస్తే గదా
కైలాసస్య గిరేరివాగ్రరచితా సోల్కా మహేన్ద్రాశనిః॥17।।

భటుడు-3:
ఇదిగో, దుర్యోధనమహారాజు…

తలపై ఊగుతూ ఎగిరిపడుతున్న కిరీటంతో, క్రోధాగ్నితో నిండిన కళ్ళతో, తన కదలికలకు అనువుగా కుంచించిన శరీరంతో, ఇప్పుడే చేతులు పైకెత్తాడు. అతడి హస్తాగ్రాన ఉన్న గద – శత్రువు రక్తంతో తడిసిపోయి – కైలాసపర్వతపు అగ్రభాగాన నిప్పులు వెదజల్లుతూ ఉన్న ఇంద్రుడి వజ్రాయుధంలాగా ఉన్నది.

ప్రథమః:
ఏష సమ్ప్రహారరుధిరసిక్తాఙ్గస్తావద్దృశ్యతాం పాణ్డవః।

నిర్భిన్నాగ్రలలాటవాన్తరుధిరో భగ్నాంసకూటద్వయః
సాన్ద్రైర్నిర్గలితప్రహారరుధిరైరాద్ర్రీకృతోరః స్థలః।
భీమో భాతి గదాభిఘాతరుధిరక్లిన్నావగాఢవ్రణః
శైలో మేరురివైష ధాతుసలిలాసారోపదిగ్ధోపలః॥18।।

భటుడు-1:
దుర్యోధనుడి గదాప్రహారాలవల్ల నెత్తుటితో తడిసిన శరీరంతో ఉన్న భీముణ్ణి చూడండి. చిట్లిన నుదురునుంచి రక్తం కారుతున్నది, భుజస్కంధాలు విరిగాయి. దెబ్బలు తగిలిన వక్షస్థలం చిక్కని నెత్తురుతో తడిసి ఉన్నది. గదాఘాతాలు చేసిన గాయాలు రక్తంలో తడిసి గడ్డకట్టి, ధాతుజలం అలుముకున్న శిలలతో నిండిన మేరుపర్వతంలా ఉన్నాడు.

ద్వితీయః:
భీమాం గదాం క్షిపతి గర్జతి వల్గమానః
శీఘ్రం భుజం హరతి తస్య కృతం భినత్తి।
చారీం గతిం ప్రచరతి ప్రహరత్యభీక్ష్ణం
శిక్షాన్వితో నరపతిర్బలవాంస్తు భీమః॥19।।

భటుడు-2:
దుర్యోధనుడు భయంకరమైన గదను విసురుతున్నాడు. పైకి ఎగురుతూ గర్జిస్తున్నాడు. వేగంగా భుజాలను వెనక్కు లాగుకుంటున్నాడు. భీముడి దెబ్బలనుంచి తప్పుకుంటున్నాడు. గుండ్రంగా తిరుగుతున్నాడు. మళ్ళీ మళ్ళీ వేటు వేస్తున్నాడు. దుర్యోధనమహారాజు గదాయుద్ధంలో నేర్పరి. భీముడేమో మహాబలవంతుడు.

తృతీయః:
ఏష వృకోదరః,

శిరసి గురునిఖాతస్రస్తరక్తాద్ర్రగాత్రో
ధరణిధరనికాశః సంయుగేష్వప్రమేయః।
ప్రవిశతి గిరిరాజో మేదినీం వజ్రదగ్ధః
శిథిలవిసృతధాతుర్హేమకూటో యథాద్రిః॥20।।

భటుడు-3:
ఇదిగో భీముడు –

తలపైని పెద్దగాయంనుంచి స్రవిస్తున్న రక్తంతో ఒళ్ళంతా తడిసి ఉన్నాడు. పర్వతసమానుడు. యుద్ధంలో అపరిమితమైన పరాక్రమం చూపేవాడు. వజ్రాయుధం కాల్చివేయగా, శిలలనుంచి ధాతువులు కరిగి ప్రవహించిపోగా నేలకూలుతున్న మేరుపర్వతంలాగా ఉన్నాడు.

ప్రథమః:
ఏష గాఢప్రహారశిథిలీకృతాఙ్గం నిపతన్తం భీమసేనం దృష్ట్వా,

ఏకాగ్రాఙ్గులిధారితోన్నతముఖో వ్యాసః స్థితో విస్మితః

భటుడు-1:
బలమైన దెబ్బలవల్ల దేహం శిథిలమై పడిపోతున్న భీమసేనుణ్ణి చూసి…

తన వేలి కొసన తన ముఖాన్ని ఎత్తి నిలిపి ఆశ్చర్యంగా చూస్తున్నాడు వ్యాసుడు.

ద్వితీయః:
దైన్యం యాతి యుధిష్ఠిరోఽత్ర విదురో బాష్పాకులాక్షః స్థితః।

భటుడు-2:
యుధిష్ఠిరుడు దీనంగా ఉన్నాడు. ఇక్కడ విదురుడు కన్నీరు కారుస్తున్నాడు.

తృతీయః:
స్పృష్టం గాణ్డివమర్జునేన గగనం కృష్ణః సముద్వీక్షతే

భటుడు-3:
అర్జునుడు గాండీవాన్ని ముట్టుకున్నాడు. కృష్ణుడు ఆకాశాన్ని తేరిపారా చూస్తున్నాడు.

సర్వే:
శిష్యప్రీతతయా హలం భ్రమయతే రామో రణప్రేక్షకః॥21।।

అందరూ:
శిష్యుడిపట్ల ప్రీతితో నాగలిని తిప్పుతూ యుద్ధాన్ని చూస్తున్నాడు బలరాముడు.

ప్రథమః:
ఏష మహారాజః,

వీర్యాలయో వివిధరత్నవిచిత్రమౌలి-
ర్యుక్తోఽభిమానవినయద్యుతిసాహసైశ్చ।
వాక్యం వదత్యుపహసన్నతు భీమ! దీనం
వీరో నిహన్తి సమరేషు భయం త్యజేతి॥22।।

భటుడు-1:
దుర్యోధనమహారాజు –

పరాక్రమానికి నెలవైనవాడు, అనేకరకాలైన రంగురంగుల రత్నాల కిరీటాన్ని ధరించిన, గర్వమూ, వినయమూ, ప్రకాశమూ, సాహసమూ కలవాడై, పరిహాసపూర్వకంగా అంటున్నాడు “భీమా! దీనుడిని వీరుడు సంహరించడు. భయాన్ని విడిచిపెట్టు.” అని.

ద్వితీయః:
ఏష ఇదానీమపహాస్యమానం భీమసేనం దృష్ట్వా స్వమూరుమభిహత్య కామపి సంజ్ఞాం ప్రయచ్ఛతి జనార్దనః।

భటుడు-2:
ఇదిగో, ఇప్పుడు అపహసించబడుతున్న భీమసేనుణ్ణి చూసి తన తొడను చరుచుకుంటూ ఏదో సైగ చేస్తున్నాడు, కృష్ణుడు.

తృతీయః:
ఏష సంజ్ఞయా సమాశ్వాసితో మారుతిః,

సంహృత్య భ్రుకుటీర్లలాటవివరే స్వేదం కరేణాక్షిపన్
బాహుభ్యాం పరిగృహ్య భీమవదనశ్చిత్రాఙ్గదాం స్వాం గదామ్।
పుత్రం దీనముదీక్ష్య సర్వగతినా లబ్ధ్వేవ దత్తం బలం
గర్జన్ సింహవృషేక్షణః క్షితితలాద్భూయః సముత్తిష్ఠతి॥23।।

భటుడు-3:
ఆ సైగతో ఊరట పొందిన భీమసేనుడు –

నొసలు ముడిచి, నుదుటన చెమటను చేతితో విదిలిస్తూ, ‘చిత్రాంగద’ తన గదను రెండు చేతులతో పట్టుకొని, భయంకరవదనుడై, శ్రేష్ఠమైన సింహపు చూపును కలవాడై, దీనుడైన తన కుమారుడిని చూసి వాయుదేవుడు ఇచ్చిన బలాన్ని పొందినట్లు, గర్జిస్తూ, నేలమీదినుంచి మరొకసారి పైకి లేచాడు.

ప్రథమః:
హన్త పునః ప్రవృత్తం గదాయుద్ధమ్। అనేన హి,

భూమౌ పాణితలే నిఘృష్య తరసా బాహూ ప్రమృజ్యాధికం
సన్దష్టోష్ఠపుటేన విక్రమబలాత్ క్రోధాధికం గర్జతా।
త్యక్త్వా ధర్మఘృణాం విహాయ సమయం కృష్ణస్య సంజ్ఞాసమం
గాన్ధారీతనయస్య పాణ్డుతనయేనోర్వోర్విముక్తా గదా॥24।।

భటుడు-1:
అయ్యో! మళ్ళీ మొదయయ్యింది గదాయుద్ధం. భీముడు –

భూమిని అరచేతితో చరుస్తూ, అనేకపర్యాయాలు వేగంగా భుజాలను చరుచుకుంటూ, క్రింది పెదవిని కొరుకుకుంటూ, అతిశయించిన పరాక్రమంతో, హెచ్చవుతున్న కోపంతో గర్జిస్తూ, ధర్మవిహితమైన కరుణను విడిచిపెట్టి, యుద్ధనియమాన్ని లెక్కచేయకుండా, కృష్ణుడి సైగతో – దుర్యోధనుడి తొడలపైకి తన గదను విసిరాడు

సర్వే:
హా ధిక్ పతితో మహారాజః।

అందరూ:
అయ్యో! పడిపోయాడు మహారాజు!

తృతీయః:
ఏష రుధిరపతనద్యోతితాఙ్గం నిపతన్తం కురురాజం దృష్ట్వా ఖముత్పతితో భగవాన్ ద్వైపాయనః। య ఏషః,

హేలాసంవృతలోచనేన హలినా నేత్రోపరోధః కృతః
దృష్ట్వా క్రోధనిమీలతం హలధరం దుర్యోధనాపేక్షయా।
సమ్భ్రాన్తైః కరపఞ్జరాన్తరగతో ద్వైపాయనజ్ఞాపితో
భీమః కృష్ణభుజావలమ్బితగతిర్నిర్వాహ్యతే పాణ్డవైః॥25।।

భటుడు-3:
స్రవిస్తున్న రక్తం కారణంగా మెరుస్తున్న దేహంతో ఉన్న కురురాజును చూసి వ్యాసుడు ఆకాశంలోకి ఎగిరాడు.

అరమోడ్పు కన్నులతో ఉన్న బలరాముడు కన్నులను మూసుకున్నాడు. దుర్యోధనుడిపట్ల ప్రేమతో, కుపితుడై, కళ్ళను మూసుకున్న బలరాముడిని చూసి, తత్తరపడుతున్న పాండవులు – వ్యాసుడి సూచన ప్రకారం – తమ చేతులను పంజరంలా అమర్చి, కృష్ణుడి భుజాన్ని ఆలంబనంగా చేసుకొన్న భీముడిని దూరంగా తీసుకెళ్ళారు.

ప్రథమః:
అయే అయమప్యమర్షోన్మీలితరభసలోచనో భీమసేనాపక్రమణముద్వీక్షమాణః ఇత ఏవాభివర్తతే భగవాన్ హలాయుధః। య ఏషః,

చలవిలులితమౌలిః క్రోధతామ్రాయతాక్షో
భ్రమరముఖవిదష్టాం కించిదుత్కృష్ట మాలామ్।
అసితతనువిలమ్బిస్రస్తవస్త్రానుకర్షీ
క్షితితలమవతీర్ణః పారివేషీవ చన్ద్రః॥26।।

భటుడు-1:
అరె! కోపంతో వేగంగా కదులుతున్న కళ్ళను తెరిచి, పూజ్యుడైన బలరాముడు భీమసేనుడిని పక్కకు తప్పించడాన్ని గమనిస్తూ, ఇటే వస్తున్నాడు, బలరాముడు. కిరీటం కదిలి, కంపిస్తూ ఉన్నది. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. తుమ్మెదలు మకరందపానం చేస్తూ ఉన్న పూలదండను కొంచెం పక్కకు నెట్టి ఒంటిపై జారుతున్న నల్లని వస్త్రాన్ని పట్టుకొని, మేఘావృతుడైన చంద్రుడిలా ఉన్నాడు

ద్వితీయః:
తదాగమ్యతాం వయమపి తావన్మహారాజస్య ప్రత్యనన్తరీభవామః।

భటుడు-2:
ఐతే, రండి. మహారాజు దగ్గరకు వెళదాము.

ఉభౌ:
బాఢమ్। ప్రథమః కల్పః।


(నిష్క్రాన్తాః।)
విష్కమ్భకః।

ఉభౌ:
అలాగే. మంచి ఆలోచన!

(వెళ్ళిపోతారు)
విష్కంభకం సమాప్తం.