రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

హోరుగాలి

రచన: బొల్లిముంత వెంకట రమణా రావు
సెప్టెంబర్ 2026

అల్లరి చేసే పిల్లవాడిలా
హఠాత్తుగా గుమ్మం తలుపు బాదుతుంది;
తీయకపోతే గుర్రుమంటుంది—
చివరికి దొంగలా
నా ఇంట్లోకి చొరబడుతుంది హోరుగాలి.
చేతికి చిక్కిందేదీ తీసుకుపోదు,
చిక్కనిదేదో ఇల్లంతా వెతుకుతుంది.
తలుపు తట్టదు,
అనుమతి అడగదు;
కిటికీ చిన్న సందు చాలు—
తన దారిని తానే చేసుకుంటుంది.
అతిథిలా వచ్చినా
ఒకచోట కుదురుగా ఉండదు;
ఏదో పోగొట్టుకున్నట్టుగా
గది గదినీ అన్వేషిస్తుంది.
ఒక్కోసారి గుర్రుమంటుంది,
కిటికీ తలుపులను బాదుతుంది,
తెరలతో పెనుగులాడుతుంది;
గోడమీది చిత్రాలను కూలదోసి
నిన్నటి ముఖాలను
నేలపై పరుస్తుంది.
బల్లమీది కాగితాలను
ఒక్క ఊపుతో ఎగరేస్తుంది.
కొన్ని పక్షులవుతాయి,
కొన్ని కాగితపు రాకెట్లవుతాయి,
మరికొన్ని గదంతా చక్కర్లు కొట్టి
ఎక్కడో వాలిపోతాయి.
నేను పట్టుకోబోయేలోపే
వాటితో మరో ఆట మొదలుపెడుతుంది.
నేను ఇల్లు సర్దుకునేలోపే
అది మళ్లీ చిందరవందర చేస్తుంది.
దాని అల్లరికి
నాకూ కోపమొస్తుంది.
అదీ కోపంగా
పిడికెడు దుమ్ము తెచ్చి
నా ముఖాన విసురుతుంది.
కళ్లు ఎర్రబడతాయి,
మంటతో నీళ్లు కారతాయి;
నేను కనురెప్పలు నలుపుకుంటుంటే
అది మరో గదిలో గుర్రుమంటుంది.
ఇక చాలనుకుని
తలుపులూ కిటికీలూ
గట్టిగా మూసేస్తాను.
అయినా వెళ్లిపోదు.
బయటే నిలబడి
తలుపులను బాదుతుంది,
కిటికీలను కుదిపేస్తుంది;
ఏ చిన్న సందు దొరుకుతుందా అని
ఇంటి చుట్టూ తిరుగుతుంది.
నేనూ మొండిగా
తలుపు తీయను.
కొద్దిసేపటికి—
తెరలు కదలవు,
చిత్రాలు పడవు,
కాగితాలు ఎగరవు,
దుమ్ము కళ్లను తాకదు.
ఇల్లంతా
నేను కోరుకున్నట్టే
ప్రశాంతంగా ఉంటుంది.
కానీ—
ఆ ప్రశాంతతలోనే
నా ఊపిరి కలవరపడుతుంది.
హోరుగాలిని
బయట నిలిపేశాననుకున్నాను;
కాసేపటికే
నా శ్వాసే
కిటికీ కోసం వెతకసాగింది.
అప్పుడే అర్థమైంది—
దాన్ని బయటకు నెట్టేస్తూ
నా ఊపిరినీ
బయటే వదిలేశానని.
తలుపు తెరుస్తాను.
అప్పటిదాకా
గుమ్మం దగ్గరే వేచిచూసినట్టుగా
ఒక్కసారిగా లోపలికి దూసుకొస్తుంది.
ఇల్లంతా అల్లకల్లోలం చేస్తుంది—
ఆ అల్లకల్లోలంలోనే
కాసేపటి క్రితం మూగబోయిన ఇల్లు
మళ్లీ ఊపిరి తీసుకుంటుంది.
ఈసారి మాత్రం
దానితో గొడవపడను.
ముఖాన దుమ్ము కొట్టినా,
కళ్లలో నీళ్లు తెప్పించినా,
అనుమతి లేకుండా వచ్చిన దాన్నే
అతిథిగా ఆహ్వానిస్తాను.
దొంగలా చొరబడినదే
చివరికి అతిథిగా మారింది;
నా కళ్లలో
నీళ్లు తెప్పించినదే
నా ఊపిరిలో
ప్రాణమై కలిసింది.
అందుకే ఇప్పుడు
అది వచ్చినప్పుడల్లా
గుమ్మం దగ్గర నిలబెట్టను—
దొంగలా వచ్చినా సరే,
అతిథిగానే ఆహ్వానిస్తాను.
బయట అది హోరుగాలి,
నాలో చేరితే ఊపిరి;
దాన్ని ఎలా దూరం పెట్టగలను?
అది నాలో సగం—
మిగిలిన సగానికి
అదే నా ప్రాణం.

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    P. Lnarasimharao September 16, 2026 4:26 am

    చక్కని భావాలను, కవితా ధోరణిలో పలికించారు
    ప్రకృతిని సహజమైన లక్షణములను తన కలములో కమనీయముగా
    పలికించారు. అభినందనలు. పో. ల. న.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • దారి
  • హోరుగాలి

ఇటువంటివే…

  1. వెలుతురు కిటికీ మూసేయకు
  2. రెండు తీరాలు
  3. అవ్యయ: విరహం
  4. అదే నేను
  5. నే ఉంటున్నది ఈ ఇంట్లోనేనా ?

సెప్టెంబర్ 2026 సంచికలో ...

  • “పో” సాహిత్య సర్వస్వం
  • ‘కాళికాంబ సప్తశతి’ సందేశం
  • అయ్యగారు – కొత్త డాక్టరు
  • ఇలియాడ్: రణరంగం-II
  • ఊరుభంగం – సమూలానువాదం : 1
  • ఎద మీటినారెవరొ ఏకాంత వేళ
  • కంప్యూటర్ చిప్ కథ – 17: రూథర్‌ఫర్డ్ – మూలకాల రూపాంతరం
  • చంద్రరేఖా విలాపం – ఎలాటి కావ్యం?
  • జొన్నవిత్తులవారి సాహిత్య స్ఫూర్తి పురస్కారం
  • ట్రిగ్గర్లు
  • నింగీ, నీరూ, నికోబార్-2
  • నువు కూడా
  • మంకుతిమ్మని మరో మిణుకు – 8 (71-80)
  • మహాకవి రావిపాటి త్రిపురాంతకుడు – III: కాలము, ఇతర విశేషాలు
  • యూట్యూబ్ లో ఈమాట: ఆగస్ట్ 2026
  • సరిగమల సరాగాలు🎶
  • సీతాంజనేయ సంభాషణం – IV
  • సెప్టెంబర్ 2026
  • హోరుగాలి
  • ‘ఆమె లేని వీధి’ — అసంపూర్ణ వ్యక్తి కథను అసంపూర్ణంగానే వదిలేసిన కథ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఎద మీటినారెవరొ ఏకాంత వేళ
ఊరుభంగం – సమూలానువాదం : 1

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.