ఇలియాడ్: రణరంగం-II

9. ద్వంద్వ యుద్ధానికి సవాలు

కపటమైన కల

జూస్ పంపిన కల దివినుండి భువికి, అక్కడినుండి సైకతస్థలిలో ఉన్న స్కంధావారంలోనికి, అక్కడనుండి అగమేమ్నాన్‌ నిద్రపోతూన్న గుడారంలోకి నిశ్శబ్దంగా ప్రవేశించింది.

అగమేమ్నాన్‌ తలగడ మీద వాలి, నెమ్మదిగా అతని చెవిలో రహస్యం చెప్పినట్లు చెప్పింది. “ఇటువంటి సమయంలో నీకు నిద్ర ఎలా పట్టింది? నువ్వు లేచి నీ కర్తవ్యం నెరవేర్చాలని జూస్ అభిమతం. లే! లేచి ట్రోయ్‌ని ముట్టడించు. జయం నీదే! నిద్ర లేచిన తరువాత మాత్రం ‘ఇది కేవలం కలే సుమా!’ అని నిర్లక్ష్యం చెయ్యకు,” అంటూ చీకట్లోని నీడల్లోకి కల కరిగిపోయింది.

అగమేమ్నాన్‌ తటాలున లేచేడు. ‘లేడికి లేచిందే పరుగు’ అన్నట్లు లేస్తూనే లోపల ధరించే మెత్తని పట్టు ఉడుపులు వేసుకుని, వాటి మీద యుద్ధానికి అనువైన ధగధగ మెరిసే కంచు కవచం – తొడ కవచాలు, వక్షః కవచం — ధరించేడు. భుజాలమీద కేయూర వస్త్రాలు, ఒక చేతిలో డాలు, రెండవ చేతిలో కత్తి అమర్చుకుని సర్వసన్నద్ధం అయి గుడారంనుండి బయటకి వస్తూనే సైన్యం అందరినీ సమావేశపరచమని దూతలకు ఆజ్ఞలు జారీ చేసేడు.

సైనికులంతా సమావేశం అవగానే, వారిని ఉద్దేశించి, “మనం యుద్ధానికి తయారు కావాలి! మీ ఈటెలు, బల్లేలు వాడిగా ఉన్నాయో లేదో చూసుకోండి. మీ గుర్రాలకు బాగా దాణా పెట్టండి. నీళ్ళు పట్టండి. రథాలను సిద్ధం చేసుకోండి. అందరూ కాలకృత్యాలు తీర్చుకుని, భోజనాలు చేసి, దండయాత్రకు సిద్ధంగా ఉండండి!”

ముఖ్యమైన సేనాపతులను, దండనాయకులను – అనగా, రాజా నెస్టర్, రాజా ఐడామినస్, పెద్ద ఏజాక్స్, డయొమీడీస్, ఒడిస్సియస్, మెనలెయస్‌లను – విడిగా సమీకరించి తన చుట్టూ వృత్తాకారంలో కూర్చోబెట్టుకున్నాడు. పోతరించిన ఒక ఎద్దును బలి ఇచ్చి, “దేవతలకు రాజువు, ఆకాశవీథులలో నిత్యం నివసించేవాడివి, తటిల్లత అనే ఆయుధం చేతిలో ఉన్నవాడవు అయిన జూస్ దేవుడా! ట్రోయ్ నగరం అగ్ని జ్వాలలకి ఆహుతి అయిపోయేవరకు, ప్రయాం రాజు రాజభవనాలన్నీ కాలి, బూడిదై నేలమట్టం అయేవరకు, హెక్టర్ శిరస్సు నేల కూలేవరకు, నేటి సూర్యుడు అస్తమించకుండా చూసే బాధ్యత నీదే!” అంటూ ప్రార్థన చేసేడు.

ఈ ప్రార్థన కార్యక్రమం అవగానే యుద్ధం మొదలైనట్లు సూచిస్తూ కొమ్ము బూరలు ఊదమని ఆజ్ఞాపించేడు. రథచక్రాల రాపిడికి, గుర్రపు నాడాల తాకిడికి, సైనికుల పాదాల తాడింపులకు భూమి దద్దరిల్లిపోయింది.

ట్రోయ్ పటాలాల ప్రతిస్పందన

ట్రోయ్ నగరాన్ని రక్షించడానికి చుట్టూ దుర్భేద్యమైన, ఎత్తయిన రాతి కోట గోడలు ఉన్నాయి. వాటి బురుజులలో పారా సైనికులు నిరంతరం వేయికళ్ళతో కాపలా కాస్తూనే ఉంటారు. ఉన్నట్లుండి, శత్రుసైన్యాల గుర్రపు గిట్టలనుంచి ఎగసిపడుతున్న ధూళి ఆకాశాన్ని మబ్బులా కమ్మడాన్ని గమనించి అప్రమత్తమయేరు. క్రమంగా డెక్కల చప్పుడు, రథచక్రాల రొద వినిపించింది. నిశిత దృష్టి ఉన్న కావలివాండ్రకు, గ్రీకు సైనికుల ఛాతీల మీద ఉన్న కంచు కవచాల మీద పడి పరావర్తనం చెందిన బాల భానుని లేత కిరణాలు జిగేల్ మని మెరుస్తూ కనబడ్డాయి.

రక్షణవ్యవస్థలోనున్న భటులు పరుగు పరుగున రాజాస్థానంలోకి వెళ్ళి ఈ సమాచారాన్ని యువరాజు హెక్టర్‌కి, రాజా ప్రయాంకి తెలియజేసేరు. “రాజాధిరాజా! ఇంత పెద్ద సైన్యాన్ని మేమెప్పుడూ చూడలేదు! దూరంనుండి చూస్తూ ఉంటే సముద్రమే పొంగి పొరలి వస్తోందా అనిపిస్తోంది. వాళ్లని అడ్డుకోకపోతే కోట గోడలను అనాయాసంగా పడగొట్టి లోపలకి రాగలరేమో అనిపిస్తోంది!”

హెక్టర్ బయటకి వెళ్ళేడు, పరిస్థితిని స్వయంగా తన కళ్ళతో చూద్దామని. “కోట ద్వారాలు తెరవండి. రథికులు, పదాతులు బయటకు వచ్చి రక్షణవ్యూహంలో బారులు తీరండి. మన కోటను రక్షించే బాధ్యత మీ భుజాల మీద ఉంది!” హెక్టర్ గర్జించేడు.

ట్రోయ్ రక్షణ వ్యూహాన్ని దూరంనుండే గమనించిన గ్రీకు సైనికులు ముందుకు కదలకుండా ఆగేరు. అది చూడగానే ట్రోయ్ రాకుమారుడు పేరిస్ కొదమసింగంలా ముందుకు దూసుకు వచ్చేడు. ఒక భుజం మీద పులి చర్మం, రెండవ భుజం మీద విల్లు, నడుం దగ్గర వేళ్ళాడుతూ ఒక కరవాలం, చేతులలో రెండు ఈటెలు – ఇదీ అతని ఆహార్యం.

తను ఊళ్ళో లేనప్పుడు తన భార్యను అపహరించిన ఈ అవతారాన్ని దూరంనుండే గమనించిన మెనలెయస్, “ప్రతీకారం తీర్చుకునేందుకు, ఇదే నాకు దక్కిన అవకాశం!” అంటూ రథం మీదనుండి కిందికి దూకేడు.

ముందుకు దూసుకు వస్తూన్న మెనలెయస్‌ని చూసి పేరిస్ కాసింత వెనక్కి తగ్గి, సైనికుల శ్రేణి వెనకకు సర్దుకున్నాడు.

ఇది చూసిన హెక్టర్, “తమ్ముడూ! మెనలెయస్ భార్యను అపహరించి పట్టుకొచ్చి మన దేశం మీదకి ఈ ముప్పు తెచ్చినప్పుడు ఉన్న ధైర్యసాహసాలు ఇప్పుడు ఎక్కడికి పోయాయి? అశ్చర్యం! మన ట్రోయ్ సైనికులు ఎంత పిరికిపందలు అయిపోయేరు! మన దేశం ఈ దీనస్థితికి దిగజారక ముందు నువ్వు చేసిన ఈ పనికి ట్రోయ్ పౌరులు నిన్ను రాళ్ళతో కొట్టి చంపేసి ఉండేవారు!” అంటూ ఎత్తిపొడిచేడు.

ఈ ఎత్తిపొడుపుకి పేరిస్ ఇచ్చిన సమాధానం విన్న హెక్టర్ తన చెవులని తానే నమ్మలేకపోయేడు. “అన్నా! నిజమే. ఉన్న మాట చెప్పేవు. నన్ను నిజంగా ఇప్పుడు కడితేరా, కసితీరా యుద్ధం చేయమంటావా? ఇక్కడ ఉన్న ట్రోయ్ సైన్యాన్ని, గ్రీకు సైన్యాన్ని వారి ఆయుధాలని పక్కన పెట్టి ఒక ద్వంద్వయుద్ధం తిలకించమని చెప్పు. నేను, మెనలెయస్‌తో ద్వంద్వయుద్ధం చేసి గెలుస్తాను. మాలో ఎవరు గెలిస్తే వారిదే హెలెన్! అప్పుడు ఈ యుద్ధానికి కారణం తొలగిపోతుంది. మనవాళ్ళు, గ్రీకులు ఎవరి సంసారాల దగ్గరకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు!”

మెనలెయస్-పేరిస్ ద్వంద్వయుద్ధం

హెక్టర్ బోర విరుచుకుని ముందుకి వచ్చేడు! “ఒక్క నిమిషం! అందరూ నా మాట వినండి! మీ ఆయుధాలు కింద పెట్టండి. మా పేరిస్ మీ మెనలెయస్‌తో ద్వంద్వయుద్ధం చేస్తాడు. ఎవరు గెలిస్తే వారికి హెలెన్ దక్కుతుంది! అప్పుడు యుద్ధం ఆగిపోయినట్లే కదా!”

ఒక్క క్షణం యుద్ధరంగంలో నిశ్శబ్దం ఆవరించింది. మెనలెయస్‌ సాలోచనగా అన్నాడు, “మా ఇద్దరి మధ్య వచ్చిన ఘర్షణ కారణంగా రెండు పక్షాలలోనూ ఎంత జననష్టం వచ్చిందో చూస్తూనే ఉన్నాం! స్పర్ధలు వచ్చింది మా ఇద్దరి మధ్యనే కదా. కనుక నేను ఈ సవాలుని అంగీకరిస్తున్నాను.”

ఇరు పక్షాల సైనిక శ్రేణులు అస్త్రాలని కింద పెట్టి, రథాలను ఎదురెదురుగా బారులు తీర్చి నిలిపేరు.

ఒక సేవకుడు రెండు గొర్రెలని నడిపించుకుని వచ్చేడు. ద్రాక్ష సారాతో నిండిన బంగారు పాత్ర దోసిలితో పట్టుకుని మరొక సేవకుడు ఎదురుగా నిలబడ్డాడు. రాజా అగమేమ్నాన్ ముందుకు వచ్చి, “దేవదేవుడు జూస్ సాక్షిగా, నా మనస్సాక్షిగా చెబుతున్నాను. ఈ పోటీలో పేరిస్ గెలిస్తే హెలెన్ అతని వెంట వెళుతుంది, మేము తిరిగి గ్రీస్ వెళ్ళిపోతాము. కానీ బంగారు కురులతో మెరుస్తూన్న మెనలెయస్ గెలిస్తే హెలెన్ మాతో గ్రీస్ వచ్చేస్తుంది!” అంటూ తన ఒరలోంచి ధగధగలాడే కంచు కత్తిని లాగి ఒక్క వేటుతో గొర్రెల కుత్తుకలు ఖండించేడు. రక్తసిక్తమైన భూమి మీద బంగారు పాత్రలో ఉన్న ద్రాక్షసారాని ధారలా పోస్తూ, “ఎవరైతే ఈ ఒప్పందాన్ని మొదట అతిక్రమిస్తారో వారి శిరస్సు వెయ్యి వ్రక్కలై, వారి రక్తం కూడా ఈ ధారలో కలిసిపోవు గాక!” అన్నాడు.

ఈ తతంగం ఇలా జరుగుతూ ఉండగా ఒక వార్తాహరిణి హెలెన్ వాటికకి పరుగున వెళ్లి, “అమ్మా! త్వరగా వచ్చి, ఏమి జరుగుతున్నదో చూడండి! రెండు నిమిషాల క్రితం గ్రీకు సేనలు, ట్రోయ్ సేనలు ఒకరి జుట్లు మరొకరు పట్టుకునే స్థితిలో ఉన్నారు. మరుక్షణంలో అంతా తిరగబడింది. మీ కోసం రాజా మెనలెయస్‌కి, యువరాజు పేరిస్‌కి మధ్య ద్వంద్వయుద్ధం జరగబోతూంది.”

ఏమి జరుగుతోందో స్వయంగా తన కళ్ళతో చూడడానికి హెలెన్ కోట బురుజుల దగ్గరకి పరిగెత్తుకుని వెళ్ళింది. అశ్రువులు చిప్పిల్లుతూన్న ఆ నీలి కళ్ళతో ఆమె అందం ద్విగుణీకృతం అయింది. రెండు సేనావాహినులు ఆమెకోసం ప్రాణాలు త్యాగం చెయ్యడానికి ఎందుకు సన్నద్ధులవుతున్నారో చూస్తూన్న జనాలకి అప్పుడు అర్థమైంది.

వస్తూన్న హెలెన్‌ని దూరంనుండే చూసి, రాజా ప్రయాం ఆమెని దగ్గరకి పిలచి, ఆత్మీయంగా చేరదీసి, “ఇలా రా అమ్మా! నీ పూర్వపు భర్త మెనలెయస్, అతని సైన్యం, నీ కోసం యుద్ధం చెయ్యడానికి ఎలా సిద్ధంగా ఉన్నారో చూడు!”

“మీరు నా తండ్రిలాంటి వారు. మీ యెడల నాకు అటువంటి భక్తిభావం ఉంది. కానీ మనం ఒకరినొకరు కలుసుకోకుండా ఉండుంటే ఎంత బాగుండేదో కదా అని ఇప్పుడు అనిపిస్తోంది! నా భర్తను, కన్నబిడ్డను వదిలేసి పేరిస్‌తో ఇక్కడకి రాకపోయి ఉంటే ఎంత బాగుండేదో కదా! మనకు ఈ ఇక్కట్లు తప్పేవి కదా?”

రాజా ప్రయాం ఓదార్పు ధోరణిలో హెలెన్ జుత్తు నిమురుతూ, “జరిగిన దానికి నిన్ను తప్పుబట్టలేము. కానున్నది కాక మానదు. ఆ ఒలింపస్ కొండ మీద ఉన్న దేవుళ్ళు చేసిన పని ఇది. వాళ్ళే ఈ యుద్ధాన్ని మన నెత్తి మీద రుద్దుతున్నారనడంలో సందేహం లేదు!”

ద్వంద్వయుద్ధానికి రణరంగం సిద్ధం చెయ్యబడింది. ప్రత్యర్థులు ఎక్కడెక్కడ నిలబడాలో, వారు విసిరే ఈటెల ప్రయాణాలకి అవధులు ఏమిటో, వగైరాలన్నీ నేల మీద ముగ్గు గీతలతో గుర్తించబడ్డాయి.

పేరిస్ పాదాలకు రక్షలు, తొడలకి కవచాలు, మోకాలి చిప్పలకూ, కాళ్ళకూ తోలు కవచాలను బిగించి కట్టేందుకు అమర్చిన వెండి తునకలు, ఛాతీని రక్షించడానికి కంచు కంచుకం, ఎడమ భుజంనుండి వేళ్ళాడుతూ ఉన్న ఎద్దు చర్మపు డాలు, కుడి చేతిలో తళతళ మెరుస్తూన్న కరవాలం! అతడి తలమీద శిరస్త్రాణం గుర్రపు తోకలో ఉండే జుట్టుతోటీ, రంగురంగుల పక్షి ఈకలతోటీ అలంకరించబడి రాజసంతో మెరుస్తూంది.

మెనలెయస్‌ కూడా రక్షక సరంజామాతో, గ్రీకు ఆభరణాలతో విరాజిల్లుతూ రంగంలో సిద్ధంగా నిలుచున్నాడు.

మొదటి దెబ్బ కొట్టడానికి ఎవరికి అవకాశం ఇవ్వాలో నిర్ణయించడానికి హెక్టర్ తన శిరస్త్రాణం తీసి, దానిని తిరగేసి, అందులో రెండు గుండ్రని రంగు గులకరాళ్లు వేసేడు. మెనలెయస్‌ ఎరుపు రంగు రాయిని ఎన్నుకున్నాడు. పేరిస్‌కి పచ్చ రాయి దక్కింది. హెక్టర్ శిరస్త్రాణాన్ని జోరుగా కుదపగా పేరిస్ ఎన్నుకున్న పచ్చ గులకరాయి నేల మీద పడింది. అనగా, మొదటి దెబ్బ కొట్టే అవకాశం పేరిస్‌కి వచ్చింది.

మెనలెయస్‌, పేరిస్ తమ తమ నిర్దిష్ట స్థానాలకు చేరుకున్నారు. ఇద్దరూ ఈటెలను పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ప్రేక్షకులు ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. అకస్మాత్తుగా పేరిస్, గిర్రున తిరుగుతూ, ఈటెను విసిరేడు. అది గురి తప్పకుండా జోరుగా వెళ్ళి మెనలెయస్‌ జబ్బకు రక్షణగా ఉన్న మందపాటి తోలు కవచానికి తగిలింది. ఈటె చివర ఉన్న కంచు ముల్లు ఒంగిపోయింది తప్ప మెనలెయస్‌కి దెబ్బ తగలలేదు.

ప్రతిస్పందనగా మెనలెయస్‌ ఈటెను తన బలం అంతా ఉపయోగించి జాగ్రత్తగా పేరిస్ ఛాతీకి గురి పెట్టి వదిలేడు. ఇది గురి తప్పకుండా ఛాతీని రక్షించడానికి వాడిన కంచుకాన్ని ఛేదించింది కానీ సమయానికి పేరిస్ ఒడుపుగా పక్కకు తిరగడంతో అది ఛాతీని కేవలం గీరుకుంది. కొద్దిగా రక్తపు జీర బయటపడింది.

ఈ దెబ్బను తట్టుకుని పేరిస్ కోలుకునేలోగా మెనలెయస్‌ కత్తిని దూసి పేరిస్ మీదికి లంఘించి అతని నడినెత్తి మీద ఒక్క వేటు వేసేడు! ఆ దెబ్బ పేరిస్ శిరస్త్రాణపు వెన్నుపట్టు మీద తగిలిందేమో, కత్తి ఛిన్నాభిన్నం అయిపోయింది కానీ పేరిస్‌కి ఏమీ కాలేదు.

తన ప్రయత్నం ఇలా నిష్ఫలం అయిపోవడం చూసి, ఆశాభంగం చెందిన మెనలెయస్ ఆవేశంతో పేరిస్ శిరస్త్రాణం పైన మెరుస్తూన్న అలంకారపు గుర్రపు జుట్టుని చేత్తో పట్టుకుని గట్టిగా తలని ఊగించడం మొదలుపెట్టేడు. ఆ ఊపుకు, ఆ శిరస్త్రాణాన్ని మెడకు కట్టిన తోలు పటకా పేరిస్ కంఠానికి ఉరితాడులా బిగుసుకుపోతూ ఉంటే పేరిస్ ప్రాణాలు అక్కడికక్కడే పోయి ఉండేవి – ఏఫ్రొడైటీ మధ్యలో కలగజేసుకుని అడ్డుకోకపోతే.

ఏఫ్రొడైటీ అదృశ్య హస్తం ఆ తోలు పటకాని తెంపేసింది! ఇలా పరిణమించిన సంఘటననుండి తేరుకుని మెనలెయస్‌ తన ఈటెను మరొకసారి అందుకున్నాడు. దాన్ని గురిపెట్టి విసిరేలోగా ఎక్కడనుండి వచ్చిందో చిక్కని పొగమంచు చుట్టూ కప్పేసింది. ఆ మంచులో ఏమీ కనిపించలేదు. అప్పుడు ఏఫ్రొడైటీ, తన వాడైన పేరిస్‌ని ఎత్తుకుపోయి రాజప్రాసాదపు లోతుల్లో ఎక్కడో దాచేసింది.

(సశేషం)


వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి:

వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.

 ...