అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్ – 1

ఉన్నత హిమాలయాలలో, నేపాల్ భూభాగంలో ఉన్న అన్నపూర్ణ అందరికీ బాగా పరిచితమైన పర్వతశిఖరం. నిజానికి ఈ ‘అన్నపూర్ణ’ అన్న పేరు ఒక్క శిఖరానికే పరిమితం కాదు. దగ్గరదగ్గరగా ఉన్న ముప్ఫై పై చిలుకు పర్వతాల బృందాన్ని ‘అన్నపూర్ణ మాసిఫ్’ అని పిలుస్తారు. మళ్ళా అందులో అన్నపూర్ణ అన్న పేరిట నాలుగు శిఖరాలున్నాయి. వీటన్నిటికీ మకుటాయమానం మొదటి అన్నపూర్ణ – అన్నపూర్ణ I. 8091 మీటర్ల ఎత్తు. ప్రపంచంలో 8000 మీటర్లు దాటిన శిఖరాలు అన్నీ కలసి 14 ఉంటే అందులో ఈ మొదటి అన్నపూర్ణది 10 వ స్థానం. రెండవ, మూడవ, నాలుగవ అన్నపూర్ణ శిఖరాలు కూడా 7000 మీటర్ల ఎత్తును దాటినవి. ఈ నాలుగు శిఖరాలే కాకుండా అన్నపూర్ణ పర్వత బృందంలో మరో పది శిఖరాలు 7000 మీటర్లు దాటినవి. వీటికి తోడు మరో పదహారు శిఖరాలు 6000 మీటర్లు దాటినవి. ఈ ఉన్నత శిఖరాలన్నీ రాశి పోసినట్టు ఒకే చోట ఉన్నాయి. వీటిలో గంగపూర్ణ, నీల్‌గిరి హిమల్, తిలిచో పీక్, మఛా పుఛారే అన్నవి ఇతర ప్రముఖ శిఖరాలు. ఈ 30 శిఖరాలనూ చుట్టి రావడానికి చక్కని ట్రెక్ మార్గం ఉంది; ఈ మార్గంలో మనం సాగిపోతోంటే మొట్టమొదట కనిపించేది రెండవ అన్నపూర్ణ శిఖరం. ఈ అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్ ప్రపంచంలోని అందమైన నడక మార్గాలలో ఒకటిగా పేరు పొందింది.

అన్నపూర్ణ శిఖరాలకు ఆ పేరు మన దేవత పార్వతినుంచి వచ్చిందని ఊహించడం కష్టమేమీగాదు. కైలాసశిఖరం మీద నివసించే శివుని సహచరి పార్వతి. ఆమె హిమవంతుని కుమార్తె. హిందూ పురాణపరంపరలో లక్ష్మీదేవి సంపదకు, సరస్వతి విద్యకు ప్రతీకలుగా నిలిచినట్లే అన్నపూర్ణ పౌష్టికాహార ప్రతీకగా నిలబడి కనబడుతుంది.

పర్వతాల నడుమ సుదీర్ఘకాలపు ట్రెక్‌లు చేయడం, శిఖరాలు ఎక్కడం నేను 2019లో మొదలెట్టాను. ఆ ఏడాది మేము 14మందిమి ఆఫ్రికాలోని కిలిమంజారో శిఖరాన్ని ఎక్కాం. కోవిడ్ ఉధృతం తగ్గాక 2021లో 15మందిమి మొరాకో దేశంలోని తుబ్‌కల్ శిఖరారోహణ, 2022లో 18మందిమి స్కాట్లాండ్‌లోని వెస్ట్‌ హైలాండ్‌వే ట్రెక్ – ఇలా 2019-22ల మధ్య మూడునాలుగు పెద్ద ట్రెక్‌లు చేసాం. ఆ అనుభవాల నేపథ్యంలో 2023 అక్టోబర్‌లో మొదటిసారిగా హిమాలయాల్లోకి ప్రవేశించి ఏకంగా 23 మందిమి ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ లక్ష్యంగా పెట్టుకుని 12రోజులపాటు ట్రెక్ చేసి ఏ ఇబ్బందీ అవరోధమూ లేకుండా ఆ బేస్‌క్యాంప్ చేరుకోగలిగాం. అప్పటివరకూ చేసిన ట్రెక్‌లు ఒక ఎత్తయితే ఈ ఈబీసీ ట్రెక్ ఒక ఎత్తు. పైన చెప్పిన ట్రెక్‌లన్నిటికీ సమన్వయకర్తగా, బాధ్యుడిగా వ్యవహరించడం జీవితం నాకు నేర్పిన పాఠాల్లో, అందించిన తర్ఫీదుల్లో అతి ముఖ్యమైనది.

హిమాలయాల దగ్గరికి మనం వెళ్లకుండానే ఉండాలి – ఒకసారి వెళితే మాత్రం వాటి మహాదాకర్షణ నుంచి తప్పించుకోలేం. అసలు తప్పించుకోవాలనీ అనిపించదు. ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ ట్రెక్ పరిపూర్ణ సఫలత సాధించిన తర్వాత, మళ్ళా మళ్ళా హిమాలయాలకు వెళ్ళాలి అన్న కోరిక బలపడింది. హిమాలయాలను మరింతగా ఆస్వాదించాలి అనిపించింది. అక్కడ నేను చవిచూసిన ‘శబ్దరాహిత్యం’ నన్ను వెన్నంటి పిలువసాగింది. అక్కడి ప్రశాంతత, ఆ పర్వతాల ప్రబల ఆకర్షణ, వాటితో ఏర్పడిన అనిర్వచనీయమైన అనుబంధం – మరోసారి వెళ్ళి రావాలి అన్న నిశ్చయంగా పరిణమించాయి.

ఇంతకు ముందు చెప్పినట్టు 2007లో మొదటిసారి సహచరి హేమతో కలసి నేపాల్ వెళ్ళాను. పొఖారా నగరంలో కొన్ని రోజులు గడిపాను. ఆ నగరంలోంచి కనిపించే అన్నపూర్ణ మాసిఫ్ – ముఖ్యంగా చేప తోక ఆకారంలో ఉండే మఛా పుఛారే శిఖరం, నన్ను అప్పుడే బలంగా కట్టి పడేసింది.

2007 లో మేము వెళ్ళిన సమయంలో పొఖారా ట్రెకర్లతో నిండిపోయి కనిపించింది. ఎటు చూసినా సాహస వాతావరణం. వాళ్ళంతా అన్నపూర్ణ పర్వతాలలో రోజుల తరబడి ట్రెక్ చెయ్యబోతున్నారని విని మహాముచ్చట పడ్డాను. ఆ సందర్భంగా మలి మధ్యవయసులో ఉన్న ఒక ఫ్రెంచి దంపతులతో పరిచయమయ్యింది. వాళ్ళు అప్పుడే అన్నపూర్ణ ట్రెక్ ముగించుకుని వస్తున్నారు. ఆ అనుభవపు ఆనందాలలో తలమునకలవుతూ ఉన్నారు. ‘జీవితాలను మార్చే శక్తి గల అనుభవం ఇది’ అని మురిసిపోతున్నారు. ఇలాంటి ఆనందాలకు, ఎదుటి మనిషికి అతి త్వరగా సోకే లక్షణముంది. మనకు సాధ్యమయ్యే పని కాదులే అని అనుకున్నా, నాకు మనసులో ఎక్కడో అన్నపూర్ణ మీద కుతూహలం కలిగింది. అయినా అప్పటికి నేను స్థానికంగా నడిచిన చిన్న చిన్న ట్రెక్‌లు తప్ప దూరప్రాంతాలకు వెళ్లలేదు. రెండుమూడు రోజులు పట్టే సరళమైన ట్రెక్‌లు కూడా చెయ్యలేదు. అంచేత ఉన్నతశ్రేణి హిమాలయాలలో, కనీస వసతులు లేని దుర్గమప్రాంతాలలో పదీ పదిహేను రోజులపాటు ట్రెక్ చెయ్యడమన్నది అప్పట్లో నేను కలలో కూడా ఊహించని విషయం. అయినా అలాంటి సాహసయాత్రలు చేసేవారిని చూడడం, పలకరించడం, మాటల్లో పెట్టడం మానేవాడిని కాదు. అలా ఆ ఫ్రెంచి దంపతులతో చక్కని సంభాషణ జరిగింది.

ఆ నేపథ్యంలో 2019-23ల మధ్య నేను చేసిన నాలుగు పెద్ద పెద్ద ట్రెక్‌లు – ముఖ్యంగా ఈబీసీ ట్రెక్, నాలో నమ్మకం నింపింది. విశ్వాసం కలిగించింది. అంచేత 2024లో ఎక్కడికి వెళ్లాలీ అన్న విషయం గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం కలగలేదు. ‘అన్నపూర్ణ’ అన్న నిర్ణయం అవలీలగా తీసుకోగలిగాను.

ఈ అన్నపూర్ణ ట్రెక్ అన్నది ఇపుడు దేశాదేశాల ట్రెకర్లను ఆకర్షిస్తున్నా, ప్రపంచంలోని ట్రెక్‌లలో అగ్రశ్రేణికి చెందినది అని గుర్తింపు పొందినా అనేకానేక కారణాలవల్ల ఈ సర్క్యూట్ 1970ల వరకూ ట్రెకర్లకు అందుబాటులో లేదు. ఒక్కసారి అందుబాటులోకి వచ్చాక ట్రెకర్లకు ప్రీతిపాత్రమైన యాత్రగా పరిణమించింది. సీరియస్ ట్రెకర్ల బకెట్ లిస్టుల్లో ప్రముఖంగా కనిపించే ట్రెక్‌గా రూపొందింది.

ఈ అన్నపూర్ణ ట్రెక్, దాని పేరులోని ‘సర్క్యూట్’ అన్నమాట సూచిస్తున్నట్లు పూర్తి వృత్తాకారపు మార్గం కాదు. తిరగవేసిన గుర్రపునాడా లాంటి ఆకృతి ఈ ట్రెక్ మార్గానిది. పోనీ తిరగవేసిన ఆంగ్ల అక్షరం U అనవచ్చు. అందరూ క్లాసికల్ ACT అని పిలిచే పరిపూర్ణమైన ట్రెక్ మార్గం నేపాల్ రాజధాని ఖాట్మండూకు పశ్చిమాన ఉన్న మర్సియాంగ్దీ నదీలోయలోని బేసిషహర్ అన్న పట్టణం దగ్గర మొదలై, ఉత్తర దిశలో సాగి, 5416 మీటర్ల థోరోంగ్-లా (టిబెటన్ భాషలో లా అంటే కనుమ. పాఠకుల సౌలభ్యం కోసం థోరోంగ్-లా కనుమ అని పేర్కొనడం జరుగుతోంది-అను.) కనుమ దగ్గర పశ్చిమానికి మళ్లి, ముక్తినాథ్ విష్ణుక్షేత్రం చేరుకుని, కాలీగండకి నదీలోయ మీదుగా సాగి నయాపూల్ దగ్గర అంతమవుతుంది. అంతా కలసి 221 కిలోమీటర్లు. 16 రోజులు పట్టే ట్రెక్ అది. కానీ ఈ మధ్యకాలంలో జీపులు నడిచే మట్టిరోడ్డు ఈ క్లాసిక్ ట్రెక్ మార్గంలోకి రెండువేపులనుంచీ చొచ్చుకుని రావడంవల్ల ఇపుడు ట్రెకర్లందరూ అటువేపున బేసిషహర్ పట్టణానికి ఉత్తరాన ఉన్న ధారాపాని గ్రామం దగ్గర ట్రెక్ మొదలెట్టి ఇటువేపున నయాపూల్‌కు ఉత్తరాన ఉన్న జోమ్‌సోంగ్ పట్టణంలో తమ ట్రెక్‌ను ముగిస్తున్నారు. ఇలా కుదించిన మార్గం పొడవు 94 కిలోమీటర్లు. ఏడెనిమిది రోజులు పడుతుంది.

మేము మా యాత్ర అంతా కలసి 11 రోజులు ఉండేలా ప్లాన్ చేసుకున్నాం. మొదటిరోజు అందరం ఖాట్మండూ చేరుకోవడం, రెండవరోజు బస్సులో బేసిషహర్ చేరుకోవడం, మూడవరోజు అసలు ట్రెక్ మొదలయ్యే ధారాపానీ చేరుకోవడం – ఇది మా యాత్రలో మొదటి అంకం. నాలుగవరోజున ధారాపానీలో మొదలయిన ట్రెక్ ఎనిమిదిరోజులపాటు సాగి 11 వ రోజున జోమ్‌సోంగ్‌లో ముగియాలన్నది మా ప్రణాళిక. అక్కణ్ణించి నేపాల్‌లోని రెండవ పెద్ద నగరం పొఖారాకు విమానంలో చేరుకోవచ్చు. ఆ పైన ఖాట్మండూకు మరో విమానం. ఆ తర్వాత ఎవరి దేశాలకు వాళ్ళు, ఎవరి ఊళ్ళకు వాళ్ళు..

ఈ అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్‌ను రెండు విధాలుగా చెయ్యవచ్చు; ఒకటి గడియార దిశలో; మరొకటి గడియార వ్యతిరేక మార్గంలో. మేము గడియార దిశను ఎంచుకున్నాం. అంటే బేసిషహర్‌లో మొదలుపెట్టి జోమ్‌సోంగ్‌లో ముగించడం అన్నమాట. ఇలా చేసినపుడు మేము రోజురోజుకూ చేరుకునే ‘ఎత్తు’లో చక్కని క్రమపరిణామం ఉంటుంది. ట్రెక్‌లోని అత్యున్నత బిందువు – 5416 మీటర్ల థోరోంగ్-లా కనుమ, ట్రెక్ మొదలెట్టాక ఆరవ రోజుకుగానీ చేరుకోము. ఆ ఆరు రోజుల్లో ఎత్తులకు అలవాటు పడటంలో క్రమం ఉండటం వల్ల ఆక్సిజన్ లేమివల్ల ఇబ్బందులు పడటం, ఎక్యూట్ మౌంటెన్ సిక్నెస్ పాలన పడటం – వీటికి తక్కువ ఆస్కారం ఉంటుంది. ముందే చెప్పుకున్నట్టు ఈ తిరగేసిన గుర్రపునాడా మార్గం ముందు మర్సియాంగ్దీ నదీలోయలో సాగి చివరికి కాలీగండకీ నదీలోయ దగ్గర ముగుస్తుంది. థోరోంగ్-లా కనుమ ఈ రెండు నదీలోయలకూ అనుసంధాన బిందువు.


నేను మొదటిసారి 2019లో కిలిమంజారో ట్రెక్ చేసినపుడు మా బృందపు సభ్యుల సంఖ్య 14. 2023లో ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు వెళ్ళినపుడు అది 23కు పెరిగింది. 2024నాటి అన్నపూర్ణ ట్రెక్‌కు అది ఏకంగా 35కు చేరుకొంది. ఈ సంఖ్య నేను కూడా ఊహించనిది. ఈ బృందంలో నాలుగు ఖండాల వాళ్ళున్నారు. ఐదు దేశాల వారు ఉన్నారు; యూకే, యూఎస్ఏ, ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్! ఇలాంటి వైవిధ్యభరితమైన పెద్ద బృందానికి నాయకత్వం వహించడమన్నది చాలా పెద్ద గౌరవం; అంతకన్నా పెద్ద బాధ్యత. సవాలు. ఈ 35మందిలో ఏడుగురు 2023 ఈబీసీ ట్రెక్‌కు వచ్చినవాళ్ళు. ఇంకో 22మంది ఏదో ఒక ఇతర పెద్ద ట్రెక్‌లో నాతోకలసి పాల్గొన్నవాళ్ళు – మిగిలిన ఆరుగురు మొట్టమొదటిసారిగా మా బృందంలో చేరినవాళ్ళు..

దేశాలవారీగా చూసినట్టయితే ఈ 35మందిలో ఐదుగురు యూఎస్ఏ నుంచి వచ్చిన వాళ్ళు; యూకే నుంచి ఏకంగా 21మంది. ఐదుగురు భారతదేశానికి చెందిన వాళ్లయితే ఇద్దరిద్దరు చొప్పున ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి వచ్చినవాళ్ళు. వెరసి, నాతో కలసి, 35మందిమి.

యూకేనుంచి వచ్చిన అందరితోనూ నాకు పరిచయం ఉంది. సింహం, గోపీ అయితే ముందు చెప్పిన అన్ని పెద్ద ట్రెక్‌లూ నాతో కలసి చేశారు. ఊరికే వచ్చి నడవడమే కాకుండా వాటి వాటి నిర్వహణ బాధ్యతలు కూడా ఎంతో చొరవగా పంచుకొనే వ్యక్తులు.

యూఎస్‌లోని సియాటెల్‌నుంచి వచ్చిన రమణ నాకు దూరపు బంధువు. అనుభవమున్న ట్రెకర్. ఇద్దరమూ మా ట్రెకింగ్ అనుభవాలనూ సాహసాలనూ సోషల్ మీడియాలో అప్పటికి కొంతకాలంగా పంచుకొంటూనే ఉన్నాం. నేను అన్నపూర్ణ ట్రెక్ ఏర్పాట్లు చేస్తున్నానని గమనించిన రమణ తానూ చేరతానన్నాడు. అతని స్నేహితులు సుబ్ర, శాంభవిలకు కూడా ట్రెకింగ్ అంటే ఆసక్తి. రమణ చెప్పిన మీదట వారిని కూడా మా బృందంలో చేర్చాను. అనిత, ఉమ గత ఏడాది ఈబీసీ ట్రెక్ చేసినవాళ్లే – అలా యుఎస్ఏనుంచి ఐదుగురు అయ్యారు.

రాజమండ్రినుంచి వచ్చిన గంగాకిషోర్ నా మెడికల్ కాలేజీనాటి స్నేహితుడు. అతనూ అతని మిత్రుడు శ్రీనివాస్, గంగాకిషోర్ ద్వారా ట్రెక్ గురించి విన్న సుభాషిణీ మా అన్నపూర్ణ బృందంలో చేరారు. లలిత, పవన్ ఇండియానుంచి వచ్చిన ఇతర సభ్యులు.

మా 35మంది బృందంలో 30మంది వైద్యులు. 27మంది ఉభయ తెలుగురాష్ట్రాలలో తమ మూలాలు ఉన్నవాళ్ళు. ముందు చెప్పుకున్న ఐదు దేశాలలోనూ ఇపుడు విస్తరించి ఉన్నవాళ్ళు.

మా టీమ్ లోని 11మంది మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కిలిమంజారో రోజుల్లో మహిళలు వద్దనుకున్నాం. ఏడాది క్రితం ఈబీసీ ట్రెక్ పెట్టుకున్నప్పుడు బృందంలో మహిళలు ఉండాలి అని గట్టిగా కోరుకుని కూడా సందేహిస్తూ సందేహిస్తూ అనితారాణినీ, ఆమెతోపాటు ఉమనూ చేర్చుకున్నాం. మా సందేహాలు అనవసరమైనవి అని వాళ్ళు క్షణాల్లో నిరూపించారు. ఈబీసీ ట్రెక్ విజయంలో వారి పాత్ర ఎంతో ఉంది. ఆ అనుభవంవల్ల అన్నపూర్ణ ట్రెక్‌కు మహిళల రాకను మనస్ఫూర్తిగా ఆహ్వానించాం. ఈబీసీ మహిళల గురించి విన్న మా ఇతర మహిళామిత్రులు కూడా ఉత్తేజం పొంది అన్నపూర్ణ బృందంలో చేరడానికి ముందుకొచ్చారు. యూకేలోని ట్రెకర్ల స్వర్గసీమ – పీక్ డిస్ట్రిక్ట్ శివార్లలో నివసించే శైలజ మాకు సన్నిహిత కుటుంబమిత్రులు. ఆమె ముందుగా వచ్చి అన్నపూర్ణలో ట్రెక్‌లో చేరారు. ఆమెను చూసి ఆమె యూకే మిత్రులు వనతి, సుమతి ముందుకొచ్చారు. వారితోబాటు శైలజ వాళ్ళ విజయవాడ కజిన్ లలిత కూడా బృందంలో చేరారు. న్యూజిలాండ్‌లో ఉండే మా మెడికల్ కాలేజీ సీనియర్ పద్మజ, తన సోదరుడు శ్రీనితో కలసి మాతో చేరారు. అలాగే ఆస్ట్రేలియాలో ఉండే ‘చేతి’ – ఆమె తమ్ముడు అకలంక ఇచ్చిన ప్రోత్సాహం వల్ల, ‘ఛలో అన్నపూర్ణ’ అన్నారు. వీరితోబాటు యూకేలో ఉండే వినుత తన కుటుంబానికి చెంది జీకే, చేతన్‌లను చూసి స్ఫూర్తి పొంది అన్నపూర్ణ బృందపు మెంబరయ్యారు. అమెరికానుంచి వచ్చిన శాంభవి, విజయవాడనుంచి వచ్చిన సుభాషిణిల గురించి ముందే చెప్పుకున్నాం. అలా అంతా కలసి 11మంది మహిళలు!!

మునుపటి ఈబీసీ ట్రెక్ చేసిన 23మందిలో దాదాపు సగం మంది 40 ఏళ్ల లోపు వాళ్ళు. ఆ బృందపు సగటు వయసు 45. ఇపుడు మా అన్నపూర్ణ బృందపు సగటు వయసు 55!!


2023 అక్టోబర్ ఒకటో తారీఖునాటికి మేము 35మందిమీ ఖాట్మండూ నగరపు థమెల్ ప్రాంతంలో ఉన్న మల్బరీ హోటల్ చేరుకున్నాం. ప్రపంచపు నలుమూలలనుంచీ మావాళ్ళు అప్పటికి రెండు రోజులుగా ఖాట్మండూ చేరుకొంటూ వచ్చారు. గత ఏడాది ఈబీసీ ట్రెక్ కోసం ఈ హోటల్లోనే ఉన్నాం కదా – అంతా చిరపరిచితం.

దుర్గమమైన హిమపథాల్లో 35 మంది ఏకతాటిన నడవాలి అంటే బృందపు సభ్యులందరి మధ్యా అత్యుత్తమ అవగాహన ఉండటం ఎంతో అవసరం. అంచేత గత ఏడాదిగా ప్రతి ఒక్క సభ్యునితోనూ వ్యక్తిగత సంపర్కం ఏర్పరచుకొనే ప్రయత్నం చేస్తూ వచ్చాను. అలాగే బృందపు సభ్యులంతా ఒక ప్రణాళిక ప్రకారం జూమ్ మీటింగుల్లో చేరి యాత్రకు సంబంధించిన విషయాలు మాట్లాడుకునేలా ఏర్పాటు చేసాను. అన్నపూర్ణ ట్రెక్ ఆరంభించినపుడు మిగిలిన 34మందితోనూ వ్యక్తిగత పరిచయం ఉన్నది నా ఒక్కడికే. ఆ పరిచయాల నేపథ్యంలో సభ్యులందరినీ ఒకరినొకరికి జూమ్‌లో పరిచయం చేస్తూ వచ్చాను. వారందరితో నాకున్న అనుబంధం స్థాయిని కూడా పెంచుకుంటూ వచ్చాను. ఈ ప్రయత్నాల వల్ల అందరితోనూ చనువు పెరగడమే కాకుండా ఖాట్మండూ చేరినపుడు వాళ్ళెవరూ కొత్తవాళ్లుగా అనిపించలేదు.

ఆ సాయంత్రం అందరం హోటల్లో పరిచయసమావేశం ఏర్పాటు చేసుకున్నాం. బృందపు సభ్యుల కలయిక, పరస్పర పరిచయాలేగాకుండా మా యాత్రకు నిర్వాహకులుగా వ్యవహరిస్తోన్న హిమాలయన్ ట్రెకింగ్ ఎడ్వెంచర్స్ కంపెనీ వారి మనుషులను సభ్యులందరికీ పరిచయం చెయ్యడానికి ఈ సమావేశం ఉపకరించింది. ఈ కంపెనీ వారే గత ఏడాదిలో మా ఈబీసీ ట్రెక్‌కు కూడా నిర్వాహకులుగా వ్యవహరించారు. అందులో సూర్యశ్రేష్ట అన్న కంపెనీ ఏజెంట్‌తో నాకు దాదాపు మూడేళ్ళ పరిచయం. అలాగే బాబు గురంగ్ అన్న చీఫ్ గైడ్ ఎంతో అనుభవజ్ఞుడు. – ఫ్రెండ్, ఫిలాసఫర్ గైడ్ లాంటి వ్యక్తి. నాకేగాకుండా గత సంవత్సరం ఈబీసీ ట్రెక్‌కు వచ్చిన వారందరికీ – సింహం, గోపి, కిషోర్, ఆకలంక, వివేక్, అనితారాణి, ఉమ వీళ్లందరికీ సూర్యతోనూ గురంగ్‌తోనూ చక్కని పరిచయం ఏర్పడింది. ఈ పూర్వపరిచయాలు మా పదిమందినీ ఒక పటిష్టమైన జట్టుగా మార్చి మా అన్నపూర్ణ ట్రెక్ విజయవంతంగా పరిణమించడానికి తొలి అడుగులు అయ్యాయి.

పరస్పర పరిచయాల మొదటి ఘట్టం ముగిసాక మాలోని అనుభవజ్ఞులైన ట్రెకర్లు తమ తమ అనుభవాలను అందరితోనూ పంచుకొని, కొత్తగా బృందంలో చేరిన వారి ప్రశ్నలకు జవాబులిచ్చారు. సందేహాలు తీర్చారు. బృందంలోని సభ్యులంతా ఒకే వేగంతో, ఒకే నేర్పుతో, ఒకే శక్తితో ట్రెక్ బాటలో సాగలేరనీ, అందరికన్నా నింపాదిగా నడిచేవారి వేగమే బృందపు ఉమ్మడి వేగాన్ని నిర్దేశస్తుందనీ అందరమూ అంగీకారానికి వచ్చాం. అలాగే మేము తలపెట్టిన పని అనేక సవాళ్ళతో నిండినది గాబట్టీ, మా శ్రమా పట్టుదలలను దాటి అది అనేకానేక ప్రాకృతికశక్తుల నియంత్రణలో ఉంటుందిగాబట్టీ విజయమే పరమావధిగా పెట్టుకోకుండా ఏపూటకాపూట ఎలా కుదిరితే అలా సాగిపోదామని నిశ్చయించుకున్నాం. గమ్యం, లక్ష్యం చేరుకోవడం ముఖ్యమే అయినా అవి చేరుకోవడమే విజయానికి గీటురాళ్ళు అన్న భావనను మనసులలోంచి తొలగించాలని నిశ్చయించాం. ట్రెక్ అంతటికీ అత్యున్నత బిందువు థోరోంగ్-లా కనుమ దాటగలమా లేదా అన్న ఆందోళనకు మనసులో చోటివ్వగూడదని కూడబలుక్కున్నాం. ఆశయాలూ లక్ష్యాలూ విజయాలు అన్నవాటికి మరీ ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా ట్రెక్‌లోని ప్రతి అడుగునూ ఆస్వాదించడమే లక్ష్యంగా చేసుకోవాలని అంగీకరించాం. క్షేమంగా ఉండటం, క్షేమంగా ట్రెక్ ముగించడం – వీటికి అన్నిటికన్నా అధికప్రాధాన్యత ఇవ్వాలని అందరం అంగీకరించాం. ఈ అంగీకారాలు, వాటి వెనుక ఉన్న విజ్ఞత మాకు ముందు ముందు ఎంతగానో ఉపయోగపడింది.

‘అన్నపూర్ణ’లాంటి ఏ ట్రెకింగ్ యాత్రకయినా చీఫ్ గైడ్ అతి కీలకమైన వ్యక్తి. ఆ యాత్రామార్గం గురించి పరిపూర్ణమైన అవగాహన, అలాంటి యాత్రలు ఎన్నో చేసిన ఆ గైడ్ అనుభవం, ఇతర యాత్రికులకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే అతనిలో నాయకత్వ లక్షణాలు, సాంకేతిక నైపుణ్యం, క్షణాల్లో నిర్ణయాలు తీసుకొనే శక్తి ఉండటం అత్యవసరం. అలాంటి మనిషే ట్రెకింగ్ బృందాలను సరైన పద్ధతిలో నడిపించి గమ్యం చేర్చగలడు. మా బాబు గురంగ్ ఈ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న మనిషి. పై లక్షణాలతోబాటు మనుషులతో ఎంతో మర్యాదగా స్నేహంగా మసలుకొనే వ్యక్తి. అంచేత మా ఎవరెస్ట్ యాత్రలో అందరికీ ప్రీతిపాత్రుడయాడు. మాలో కొంతమందిమి రెండురోజుల క్రితం ఖాట్మండూ చేరినపుడు వచ్చి హుషారుగా అందర్నీ పలకరించాడు. పాత స్నేహితుల పునర్మిలనంలా సాగిందా పలకరింపు. కాఫీలు తాగుతూ, 35 మంది ఉన్న పెద్ద బృందాన్ని ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా ఎలా నడిపించాలీ అన్న విషయం అతనితో చర్చించాం. తనకూ ఇంత పెద్ద బృందంతో వెళ్ళడం ఇదే మొదటిసారి అనీ, బహుశా అన్నపూర్ణ ట్రెక్‌కు ఇప్పటిదాకా వచ్చిన బృందాలలో ఇదే అన్నిటికన్నా పెద్దదనీ అన్నాడు.

అలాంటి హుషారైన మనిషి మా యాత్ర మొదటిరోజున, అక్టోబర్ ఒకటిన, 35మందిమీ పరిచయసమావేశం పెట్టుకుని యాత్ర పూర్వాపరాలు చర్చించుకుంటున్నపుడు, మొహానికీ చేతులకూ కట్లు కట్టుకుని వచ్చి అందరినీ ఆందోళనకు గురి చేసాడు. మా యాత్ర సంగతి ఎలా ఉన్నా మా మిత్రునికి రెండే రెండు రోజుల్లో ఇలా ఎలా అయిందా అని కలవరపడ్డాం. వివరాల్లోకి వెళితే గత రాత్రి మోటార్ సైకిల్ ప్రమాదం జరిగిందట. ప్రమాదకరమైన దెబ్బలు తగలకపోయినా ఒళ్ళు చాలా చోట్ల కొట్టుకుపోయింది – కొన్నిచోట్ల ఆ గాయాలు పెద్దవిగానే అనిపించాయి. అవన్నీ చూసిన షాక్‌లోంచి నేను బయటపడుతోన్నపుడు, ‘ఇవన్నీ పై పై దెబ్బలు. నేను కాచుకోగలను. రెండు మూడు రోజుల్లో మానిపోతాయి. వీటివల్ల మన యాత్రకు ఏ అడ్డంకీ ఉండదు. అనుకొన్న ప్రకారం రేపు మీతోపాటు నేనూ వస్తాను’ అని భరోసా ఇచ్చాడు గురంగ్! మా బృందంలో వైద్యులకూ మందులకూ కొదవలేదుగాబట్టి గాయాలు త్వరగా మానడానికి మేమూ మా వంతు కృషి చెయ్యగలం గదా – అంతా స్థిమితపడ్డాం.

మాతోబాటు వస్తోన్న ఆరుగురు ఇతర గైడ్‌లను కూడా సూర్యశ్రేష్ట మాకు పరిచయం చేసాడు. అందులో ప్రకాష్ గురంగ్, తాము రేషమ్, సూర్య కమల్, గూర్ఖా చావ్లీ అన్నవాళ్ళు మాతో ఇంతకు ముందు ఈబీసీకి వచ్చారు. వాళ్ళను గుర్తుపట్టి పలకరించాం. వాళ్ళుకూడా పాత స్నేహితుల్లాగా నవ్వుతూ మాకు స్వాగతం పలికారు. ప్రేమ్ గురంగ్, సంజయ్ శ్రేష్ట కొత్తగా మాతో వస్తున్న వాళ్ళు.

మా బృందంలోని సుధీర్, సోమేష్, లలితలను టీమ్ డాక్టర్లుగా నియమించాం. అప్పటికే అందరం కలసి అవసరమైన వైద్యపరికరాలు, మందులు సమకూర్చుకుని ఉన్నాం. కిషోర్, జీకే లను కోశాధికారులుగా ఉండమని చెప్పాం. ఉమ్మడి ఖర్చులన్నీ వారి చేతిమీదుగా సాగాలన్నది మా అభిమతం. ఇండియానుంచి వచ్చి చేరిన ఇతర సభ్యుల సహకారంతో పవన్ 25 కిలోల పచ్చళ్లూ తినుబండారాలూ హైదరాబాదునుంచి తీసుకువచ్చాడు. యాత్ర ముందుకు సాగేకొద్దీ, ఉన్నత సీమలు చేరేకొద్దీ, కనీస అవసరాలకు కొరత ఏర్పడుతుంది. అలాంటి చోట్ల ఈ పచ్చళ్ళు, తినుబండారాల విలువ అమూల్యం అని మాకు అప్పటికే అనుభవం చెప్పింది.


రెండోరోజు అందరం హోటల్ మల్బరీలో కడుపారా బ్రేక్ ఫాస్ట్ చేసాం. ‘ఈ రుచిని ఆస్వాదిస్తూ, చక్కగా భోంచేయండి. మళ్ళా పన్నెండురోజులదాకా మీకు ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ దొరకదు,’ నవ్వుతూ మా టూర్ ఏజెంట్ సూర్య అందర్నీ ప్రోత్సహించాడు. గత ఏడాది ఎవరెస్ట్ ట్రెక్ చేసిన వాళ్ళకి సూర్య మాటల్లోని అంతరార్థం చక్కగా బోధపడింది.

170 కిలోమీటర్ల దూరాన ఉన్న బేసిషహర్ వెళ్ళడానికి రెండు మినీ బస్సులు మాట్లాడుకున్నాం. మేమున్న థమెల్ ప్రాంతం అంతా సన్నపాటి సందులు గొందులు – మినీబస్సులు కూడా రాలేవు. అంచేత జీపులు పట్టుకుని ఊళ్ళోకి వెళ్ళి అక్కడ మినీ బస్సులు ఎక్కాం. ఎక్కామేగానీ ఆ మినీ బస్సులూ నత్తలతో పోటీ పడాల్సి వచ్చింది. పైగా పీక్ అవర్ ట్రాఫిక్. ఖాట్మండూనుంచి బయటపడటానికే దాదాపు ముప్పావుగంట పట్టేసింది.

నగరంలోంచి బయటపడ్డామో లేదో, చుట్టూ చిక్కని ప్రకృతి – పచ్చని పరదా కప్పుకున్న రాజసమొలికే పర్వతాలు.. పట్టణాలు.. గ్రామాలు.. త్రిశూలీ నది – శివుని ఆయుధం త్రిశూల్ పేరిట నది. ఆ నది ఒడ్డున ఒక ఫిష్ రెస్టరెంట్లో భోజనానికి ఆగాం. నిండుగా వడివడిగా సాగిపోతోన్న వరదనీటి నది. ఆ నదీ నీళ్ళూ నల్లని తారురోడ్డు తప్పించి చుట్టుపక్కల అంతా పచ్చల సముద్రం. ఏదో మరకత ప్రపంచంలో ఈదులాడుతూ ప్రయాణం చేస్తోన్న అనుభూతి.

ఖాట్మండూనుంచి బేసిషహర్ ఐదారు గంటల దూరం. మా దారి చాలావరకు ఖాట్మండూ-పొఖారా హైవే మీదుగా సాగింది. ట్రెకర్లు, టూరిస్టులపరంగా ఈ రెండు నగరాలూ అతి ముఖ్యమైనవి. అందుకు తగ్గట్టు ఆ హైవేకూడా ఎంతో బావుంది. అలా వందా-నూటపాతిక కిలోమీటర్లు వెళ్ళాక మా బస్సులు హైవే వదిలి అచ్చమైన కొండబాట పట్టాయి. సహజంగానే వాటి వడీ ఊపూ బాగా తగ్గింది. పైగా గత కొద్దిరోజులుగా కురుస్తోన్న వర్షాల పుణ్యమా అని ఆ కొండల బాటలో అడపాదడపా లాండ్ స్లైడ్లు, రోడ్ బ్లాక్ లు – అలాగే మెలమెల్లగా ముందుకు సాగాం.

బేసిషహర్ ఇంకో గంట దూరంలో ఉందనగా రోడ్డంతా కొట్టుకుపోయి కనిపించింది. అటూ ఇటూ బిక్కుబిక్కుమంటూ వాహనాలు. ముందుకు వెళ్ళే అవకాశం లేదు. ఆదిలోనే హంసపాదా అనిపించింది. మా ట్రెక్ మొదలవకుండానే ముగియబోతోందా అనిపించింది. మాకంటే భయాలూ సందేహాలూ కలిగాయిగానీ అక్కడి వాళ్ళకి ఇవన్నీ మామూలే. మా డ్రైవర్లిద్దరూ కాసేపు మాట్లాడుకొని, స్థానికుల సలహాలు తీసుకుని బస్సులను వెనక్కి తిప్పారు. తిప్పి, పక్కనున్న గ్రామంగుండా మరో దారి పట్టుకున్నారు. చిట్టచివరికి మా ట్రెక్ యాత్ర ప్రవేశద్వారం – బేసిషహర్ పట్టణం చేరుకోగలిగాం. చీకటి పడిన మాట నిజమేగానీ అసలు చేరుకోగలగడమే మాకు ఎంతో సంతోషం కలిగించింది. మా డ్రైవర్ల చొరవా సమయస్ఫూర్తీ మమ్మల్ని బాగా ఆకట్టుకున్నాయి. వారికి అదే మాట చెప్పి అభినందించాం. మమ్మల్ని దించేశాక డ్రైవర్లు మళ్ళీ ఖాట్మండూ బాట పట్టారు – మరో ఎనిమిది గంటల ప్రయాణం వాళ్ళకి!

లమ్‌జంగ్ జిల్లాలో ఉన్న బేసిషహర్ పట్టణం ఎప్పట్నించో అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్‌కు ఆరంభబిందువుగా వ్యవహరిస్తోంది. మొన్నమొన్నటిదాకా ఆ ఊరు చేరాలంటే కాలినడకే ఏకైక మార్గం. ఇపుడు బేసిషహర్ దాకా జీపులూ బస్సులూ వెళ్ళే రోడ్లు వచ్చాయి. బేసిషహరే గాకుండా ఇంకా పై దాకా జీపులు వెళుతున్నాయి. ఇప్పటికీ ఆ కొండలూ ఆ ప్రకృతీ ట్రెకర్లను అలరించగల శక్తి గలదే అయినా, ఉన్న ఆ కాస్త మట్టిబాటను జీపులతో పంచుకుంటూ వాటిని తప్పించుకుంటూ నడవడం బాగా చీకాకు పెట్టే వ్యవహారం. అంచేత చాలామంది ట్రెకర్లు బేసిషహర్‌కు 35 కిలోమీటర్లు ఎగువన ఉన్న ధారాపానీదాకా జీపుల్లో వెళ్ళి అక్కణ్ణించి ట్రెక్ మొదలెడుతూ ఉంటారు. మేమూ అలాగే చేద్దామని నిర్ణయించుకున్నాం.

డిన్నర్ సమయంలో మా చీఫ్ గైడ్ గురంగ్ మర్నాటి ప్రయాణం గురించి వివరించాడు. జీపుల్లో ప్రయాణం.. రాళ్ళు నిండిన మట్టి రోడ్లు. దూరం 35 కిలోమీటర్లే అయినా నాలుగయిదు గంటలు తీసుకొనే, ఉండీ లేని ధారాపానీ రోడ్డు.

నాగరిక జీవితం అందించగల సౌకర్యాలకు మర్నాటినుంచీ తాత్కాలిక విరామగీతం పాడాలనీ, చక్కని హోటలు పక్కమీద పవళించే అవకాశం మరో పదీ పన్నెండు రోజులకుగానీ దక్కదనీ – ఆ అవగాహనతో అందరం నిద్రకు ఉపక్రమించాం.


రోడ్డు అంటున్నామేగానీ బేసిషహర్ – ధారాపానీల మధ్య ఉన్నది అతి ప్రాధమికమైన మట్టి బాట. జీపులు అంటున్నామేగానీ అక్కడ కనిపించేది ఒక్క మహింద్రా వాళ్ళ బొలెరో మాత్రమే. గైడ్‌లతో కలసి మా బృందంలో ఉన్నది 42మంది. అంతా కలసి ఆరు జీపులు మాట్లాడుకున్నాం.

మేం వెళుతోన్న ధారాపానీ గ్రామం నేపాల్‌లోని మనంగ్ జిల్లాలో ఉంది. దారంతా కొండచరియల్లో సాగింది. ఒక పక్కన నిలువుగా ఆకాశాన్ని తాకుతోన్న కొండ, మరో పక్క అడుగు ఏమారితే పాతాళానికి చేర్చే నిట్టనిలువు కొండచరియ – బిక్కుబిక్కుమంటూ మేము. జీపులు అక్కడి మలుపులు తిరుగుతున్నపుడు ప్రాణాలు బిగబట్టి మా గుండెల చప్పుళ్ళు మేమే వింటూ కూర్చున్నాం. ఏదేమైనా మా డ్రైవర్లు అనుభవజ్ఞులూ, నైపుణ్యంకలవాళ్ళూ అని మెల్లమెల్లగా బోధపడింది. పోయిన ధైర్యాలు తిరిగి వచ్చాయి.

యథాప్రకారం ఎటు చూసినా పచ్చదనం. అడవికి తోడుగా ఆ ప్రాంతాల్లో మెట్లుమెట్లుగా సాగుభూములు. చక్కని ప్రకృతి దృశ్యాలు. ఆ ఆహ్లాదకరమైన పరిసరసీమ మాలోని భయాందోళనలకు చక్కని ఔషధంగా పనిచేసింది. స్థిమితపడ్డాం. దారిలో కనిపించే గ్రామాలూ, పొలాల్లో పనిచేసే గ్రామస్తులూ – ఫర్వాలేదు, మనమేమీ విచిత్రలోకాల్లో లేము; ఇది మనమెరిగిన ప్రపంచమే అన్న భరోసానిచ్చాయి. వీళ్ళూ మనలానే జీవిస్తున్నారు – తమతమ దైనందిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్న ఏకీభావం కలిగించాయి.

దారిలో సియాంగె అన్న సుందరమైన గ్రామంలో భోజనానికి ఆగాం. మేమాగిన చోట నిడుపాటి జలపాతం ఉంది. ఆ నీళ్ళు ఒక వంతెన దిగువనుంచి పారి వెళ్ళి లోయ అడుగున పరవళ్ళు తొక్కుతోన్న మర్సియాంగ్దీ నదిలో కలుస్తున్నాయి. అన్నపూర్ణ మాసిఫ్ ప్రాంతాన పుట్టిన ఈ మర్సియాంగ్దీ నది మొత్తం 150 కిలోమీటర్లు ప్రవహించి త్రిశూలీ నదిలో కలుస్తుంది. మా బృందంలోని యూఎస్‌కు చెందిన సుబ్ర కు వైట్ వాటర్ రాఫ్టింగ్‌లో అనుభవం ఉంది. ‘రాఫ్టింగ్ సాహసికులకు అసలు సిసలు సవాళ్ళు అందించగల నదీప్రవాహం ఇది,’ అని మర్సియాంగ్దీ గురించి వ్యాఖ్యానించారు సుబ్ర.

సియాంగె గ్రామంలో ప్రిన్సికా ఫాన్సీ అన్న టీ హౌస్‌లో భోజనానికి ఆగాం కదా – అక్కడ మాకు పళ్ళేల మీద దాల్ భాత్ దర్శనమిచ్చింది. ఆ నేపాల్ ప్రాంతాల్లో సర్వాంతర్యామిలా దర్శనమిచ్చే ఈ దాల్‌భాత్ నిజానికి ఒక పరిపూర్ణమైన ఆహారం. నోటికి నచ్చినా లేకున్నా ట్రెక్ చేసిన అన్ని రోజులూ రెండు పూటలా అదే మా పోషకాహారం అని అందరికీ తెలుసు. కొంతమంది ఆ పరిసరాల్లోని సెలయేళ్లలో దొరికే చేపలతో వండిన కూరలు కూడా తెప్పించుకొని తమ తమ ఆత్మారాముళ్లను శాంతపరచారు.

కాస్త దూరం వెళ్ళేసరికి ఓ లాండ్‌స్లైడ్, అది సృష్టించిన రోడ్‌బ్లాక్, అటూ ఇటూ ఆగి నిలచిన పదీ పన్నెండు జీపులూ కనిపించాయి. మేము నిరాశపడేలోపే ఓ జేసీబీ వచ్చి రాళ్ళను తొలగించి జీపులు పట్టే దారిని ఏర్పరచింది. కట్టు విడిచిన గుర్రాల్లా మా జీపులన్నీ ముందుకు సాగాయి.

ఇంకాస్త ముందుకు వెళ్ళాక రోడ్డులోని ఒక భాగం దిగువనున్న లోయలోకి జారిపడిపోయి కనిపించింది. ‘ఒకప్పుడు అక్కడ రోడ్డు ఉండేది’ అన్న ఛాయలు ఏమన్నా ఉన్నాయా అని చూస్తే ఆ మిగిలిన కొద్ది ఛాయలూ జీపు పట్టే వెడల్పు లేనివి. మళ్ళా అందరం మా ఆందోళన ముసుగులు బయటకు తీసి మొహాలకు తగిలించుకున్నాం. ఇహ ముందుకు ఎలా సాగగలమో మా ఊహకు అందలేదు. ఈ పరమపద సోపానపటంలో ఎక్కడ చూచినా పాములే అనిపించింది. మా డ్రైవర్లు మాత్రం ఏ ఆందోళనా లేకుండా కబుర్లలో పడిపోయారు. క్షణాల్లో ఎదుటివేపునుంచి జేసీబీ ప్రత్యక్షమయింది. మిగిలి ఉన్న కాస్త రోడ్డును తొలిచి విశాలం చేసింది. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తోన్న జీపులన్నీ బిరబిరా సాగిపోయాయి. మేము ఉపద్రవాలు అనుకొంటున్నవి ఆ ప్రాంతాల్లో అతి సాధారణమనీ, అక్కడి జీవితాన్ని ఇవేవీ భంగపరచలేవనీ మాకు బోధపడింది.

ఆ రోజు ఆకాశం బాగా మబ్బేసి ఉంది. అడపాదడపా వాన పడుతోంది. మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో తాల్ అన్న ఊరు చేరుకున్నాం. నదీలోయలో ఉన్న ముచ్చటైన గ్రామమది. లోయలో మర్సీయాంగ్దీ నది మెలికలు తిరుగుతూ ప్రవహిస్తోంది. లోయకు రెండు వైపులా నిడుపాటి పర్వతాలు.

తాల్ దగ్గర మేము ‘అన్నపూర్ణ కన్సర్వేషన్ ఏరియా’లోకి అడుగు పెట్టాం – నేపాల్ దేశంలోకెల్లా అతి పెద్ద రక్షిత పర్యావరణ ప్రాంతమది. అన్నపూర్ణ ట్రెక్‌లో మొట్టమొదటి చెక్ పాయింట్ మాకు అక్కడ తటస్థపడింది. అన్నపూర్ణ సర్క్యూట్ ఆ 7629 చదరపు కిలోమీటర్ల రక్షితప్రాంతంగుండా సాగుతుంది. ఆ ప్రాంతంలోకి ప్రవేశించాలంటే ముందే ఫీజు కట్టి పర్మిట్ తీసుకోవాలి. మా ట్రెక్ దారిలో వివిధ చెక్ పాయింట్ల దగ్గర ఆ పర్మిట్లు చూపించవలసి ఉంటుంది. మా ఏజెంట్ సూర్య మా పర్మిట్లన్నీ చక్కగా ముందే సంపాదించి ఉంచాడు.

మొదట్లో మేమంతా సాయంత్రం నాలుగుగంటల వేళ జీపులు వదిలి ధారాపానీవరకూ నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లాలనుకున్నాం. మబ్బులు కమ్మిన ఆకాశం, అపుడపుడు పడుతోన్న వాన మమ్మల్ని ఆ పని చెయ్యకుండా ఆపాయి. తిన్నగా ధారాపానీదాకా జీపుల్లో వెళ్లిపోయాం. ఆ రాత్రి మాకు ‘గూర్ఖా ఇన్’ అన్న టీ హౌస్‌లో వసతి ఏర్పాట్లు జరిగాయి.

మామూలుగా నాలుగయిదు గంటలు పట్టే బేసిషహర్ – ధారాపానీ ప్రయాణం వర్షాలు, రోడ్‌బ్లాక్‌లు, దారి కొట్టుకుపోవడం వగైరాల పుణ్యమా అని రోజంతా పట్టేసింది. సాయంత్రానికల్లా వర్షం మరింత ఉధృతమయింది. ఆగకుండా కుంభవృష్టి! ఈవర్షం రాత్రికయినా తగ్గకపోతే రేపటి కార్యక్రమం కొండెక్కుతుందా అన్న బెంగ అందరిలోనూ ప్రవేశించింది. బెంగపడతామేకానీ వర్షం సమస్యకు పరిష్కారమంటూ లేదని తెలుసు. మేము చెయ్యగలిగిందల్లా ‘రేపు ఉదయానికల్లా తగ్గించు బాబూ’ అని వానదేవుడిని వేడుకోవడమే! అదే చేసాం. రాత్రి భోజనాలు ముగిసాక బాబు గురంగ్ మర్నాటి దారి గురించి అందరికీ వివరంగా చెప్పాడు. రేపు ఉదయానికల్లా వాన తగ్గి చక్కని సూర్యకాంతి అలుముకోవాలని కోరుకుంటూ అంతా ఆ నాటికి వీడ్కోలు చెప్పాం.


కోరికలు గుర్రాలయితే కావచ్చుగానీ వర్షంలో పనికొచ్చే ఓడలు కాలేవు గదా!

మర్నాటి ఉదయం ఏదో పగబట్టినట్టు వానే వాన. మేము మరీ అతిగా ప్రార్థించామేమో – వాన తగ్గటం అటుంచి మరింత చిక్కనయింది. ఎడతెగని కుండపోత. దగ్గరగా ఉన్నవి కూడా కనిపించనంత తీవ్రమైన వాన. తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించలేదు. ఆరోజు మేము 22 కిలోమీటర్ల దూరాన ఉన్న ఛామె గ్రామందాకా వెళ్లాలని అనుకున్నాం – దూరం బాగా ఎక్కువ. చీకటిపడే లోపల ఆ ఊరు చేరాలంటే వర్షం ఆగేదాకా ఎదురుచూడటం కుదరదు. ఒకవేళ ఎదురుచూసినా, వర్షం తగ్గే అవకాశాలు వీసమంతయినా కనిపించడం లేదు.

ఇహ వర్షానికి అడ్డం పడి వెళ్లడమొక్కటే మాకున్న ఏకైక మార్గం. ఇది కొత్తవాళ్ళకే కాదు, మాలోని అనుభవజ్ఞులకు కూడా ‘అన్నప్రాశన నాడే ఆవకాయ పెట్టడం’ లాంటి పరీక్ష. పోనీ వెళ్లాల్సింది ఒకటీ రెండు కిలోమీటర్లా అంటే అదీ కాదు. ఏకంగా 22 కిలోమీటర్లు.

మేము బయల్దేరుతోన్న ధారాపానీ 1860 మీటర్ల ఎత్తున ఉంది. ముందురోజు బయల్దేరి వచ్చిన బేసిషహర్ 760 మీటర్లు. రాత్రికి చేరుకోవాలనుకుంటున్న ఛామె 2630 మీటర్లు. అంటే మేమంతా హిమాలయాల ఉన్నత శ్రేణుల్లోకి క్రమక్రమంగా వెళుతున్నామన్నమాట. పోల్చి చూస్తే ఎవరెస్ట్ ట్రెక్‌లో మా యాత్ర ఏకంగా 2830 మీటర్ల ఎత్తున ఉన్న లుక్లానుంచి మొదలయింది. ఇపుడు మేము ఎంచుకున్న మార్గంలో ఎక్లమటైజేషన్ క్రమం సులువుగా ఉండి, నాలుగయిదువేల మీటర్లకు మించిన ఎత్తుకు చేరుకున్నపుడు శరీరం అందుకు అలవాటు పడి సంసిద్ధమవుతుందన్నమాట.

అంతా బానేవుందిగానీ మరి ఈ కుండపోత వర్షం?!

ఏ మనిషికైనా, ముఖ్యంగా నగరవాసులకు – జోరుగా వర్షం పడుతోందీ అంటే వెంటనే చూరుకోసం వెదుక్కోవడం సహజంగా పెల్లుబికే లక్షణం. ఆ ఉదయాన అందరి మనసుల్లోనూ ఒకటే ప్రశ్న – ఈ జోరువానలో కొండదారిలో 22 కిలోమీటర్లు నడచి ఎనిమిదివందల మీటర్ల ఎగువన ఉన్న ఛామె చేరుకోగలమా? అసలది మనుషులన్న వారికి సాధ్యమేనా?!

ట్రెక్ అంతా ముగిసిన తర్వాత కొంతమంది చెప్పనే చెప్పారు: ‘ఇదంతా వదిలేసి శుభ్రంగా ఇంటికి వెళిపోదామనిపించింది. అసలీ ట్రెక్కూగిక్కూ ఎందుకు పెట్టుకున్నాంరా దేవుడా అనిపించింది,’ .. అయినా ఆ పూట అందరూ తమ భయాలూ ఆలోచనలూ తమలోనే ఉంచుకున్నారు!

ఆ క్లిష్టపరిస్థితిలో నాకు 2022 లో స్కాట్లాండ్‌లోని ‘వెస్ట్ హైలాండ్ వే’ లో చేసిన ట్రెక్ గుర్తొచ్చింది. ఆ రోజూ హోరున వాన. గుంటలు గతుకుల కాలిబాటలు… దిట్టమైన తొడుగులు వేసుకున్నా తడిసి ముద్దయిన బూట్లు. అయినా రోజంతా ఆ వానలో పడి ట్రెక్ చేస్తూనే వెళ్ళాం. అలా వెళ్ళడం అసాధ్యమేమీ కాదని గ్రహించాం. ఇపుడు నేను ఆ మాట అంటే నాతోపాటు ఆ స్కాట్లాండ్ ట్రెక్ చేసిన సింహం, గోపి, కిషోర్ నా నమ్మకాన్ని పంచుకుంటారని తెలుసు.. అయినా అన్నపూర్ణ హిమాలయాలలో కురుస్తోన్న జోరువానలో మాది మహా మైనారిటీ అభిప్రాయం అనీ తెలుసు..

అయినా నలుగురం కూడబలుక్కుని, ఆనాడు మేమంతా ఆ వానలో నడచి వెళ్లాల్సిన అవసరాన్ని మిగతా వాళ్ళకి నింపాదిగా వివరించి చెప్పాం. అప్పటికే బాబు గురంగ్, ‘ఇదంతా ఇక్కడ మామూలే. పర్లేదు. ఇంకా మనం ఆరంభంలోనే ఉన్నాం. నడిచెయ్యవచ్చు. అసాధ్యమేం కాదు,’ అని చెప్పాడు. అంతేగాకుండా ‘వర్షం అనుకుని ఇక్కడే ఈ రోజు ఉండిపోయిన పక్షంలో మన ముందుముందు కార్యక్రమం తీవ్రంగా దెబ్బతింటుంది. బుకింగ్ లన్నీ చేజారిపోతాయి. ఒకసారి చేజారాక 35మందికి అప్పటికప్పుడు వసతీ భోజనాలు దొరకడం దాదాపు అసాధ్యం’ అనీ చెప్పాడు.

మొత్తానికి బాబు, మిగిలిన గైడ్లు, మాలోని అనుభవజ్ఞులైన సభ్యులు, మెలమెల్లగా మిగిలిన అందరికీ ‘పదండి వెళదాం. అసాధ్యమనుకొంటున్నాం గానీ ఇది సాధ్యమే. మేమున్నాం గదా, మీరు సంకోచించకండి’ అని నచ్చచెప్పారు. వారిలోని భయాలనూ అనుమానాలనూ తగ్గించి, ముందుకు సాగడానికి మానసికంగా సిద్ధపరచారు. ఎండయినా వానయినా చలి అయినా వేడి అయినా ప్రకృతిని యథాతథంగా స్వీకరించి ముందుకు వెళ్లడమే ఇలాంటి యాత్రల్లో ఎంతో అవసరం అని నచ్చచెప్పారు. పైగా మన దగ్గర రైన్ కోట్లు, బూట్ల తొడుగులు, పొడిదుస్తులు, వర్షానికి ఆగే బాక్‌పాక్‌లు – అన్ని పరికరాలూ ఉన్నాయి. నడవటం మొదలెడితే వర్షం తగ్గినా తగ్గవచ్చు.. ఇలాంటి ట్రెక్‌లలో మనం ప్రకృతి ఒడిలో ఉంటూ ఉంటాం. ప్రకృతిశక్తుల గురించి ఫిర్యాదులు చెయ్యకూడదు. పదండి ముందుకు’ అంటూ పాఠం చెప్పి ప్రోత్సహించారు. నేనుకూడా ‘బాబూ గురంగ్, ఇతర గైడ్లు ఎంతో అనుభవజ్ఞులు. ఊరికే పదండి పదండి అనరు. ఎక్కడ ముందుకు సాగాలో, ఎక్కడ ఆగి నిలవాలో బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళ మాట విందాం. వాళ్ళ సలహా పాటిద్దాం’ అని నచ్చచెప్పాను.

చివరికి 35మందిమీ వర్షంతో చెలిమి చెయ్యడానికే నిర్ణయించుకున్నాం.


ఒకసారి నిర్ణయం తీసుకున్నాక అందరం గబగబా సిద్ధమై పోయి అరగంటలో నడకదారి పట్టుకున్నాం. ఆ వానకు అలవాటుపడడానికి మరో అరగంట పట్టింది. ఆ తర్వాత ‘వానలో నడవడమే మనిషికి సహజం’ అన్నంతగా అలవాటు పడిపోయాం! మరి కాసేపటికి వాన సంగతే మరచిపోయాం!!

దారంతా వాగులూ వంకలూ.. నాలుగురోజులుగా అడ్డూ ఆపూ లేకుండా వాన పడుతోందట – దారంతా చిన్న చిన్న సెలయేళ్లు. వర్షం కురిసిందంటే కొండబాటల్లో సెలయేళ్లూ కాలువలూ పుట్టుకురావడం ఎంతసేపూ!!

మధ్యాహ్నమయేసరికి మా రైన్ కోట్లు, బూట్ల తొడుగులు, బూట్లు, బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. ఎంత ‘రక్షణ కవచాలు’ ధరించినా అవన్నీ జోరుహోరు వానముందు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. మా బట్టలూ బాక్‌పాక్‌లూ తడిసి ముద్దయ్యాయి. అన్ని ‘కష్టాల’లోనూ ఆ వర్షం సృష్టించిన అసంఖ్యాకమైన జలపాతాలు మాకు ఎంతగానో సంబరం కలిగించాయి. కొంతమంది ఉత్సాహవంతులు కేరింతలు మొదలెట్టారు. మరికొంతమంది బుద్ధిమంతులు ఆ జలపాతాలను లెక్కపెట్టడం మొదలెట్టారు. లెక్క నలభై-ఏభై దాటాక ఆ పని సాధ్యం కాదులే అని విరమించారు. వర్షమే లేకపోతే అంత అపూర్వమైన జలదర్శన భాగ్యం మాకు కలిగేదా?!

దారిలో మాకు బగర్చాప్, దనక్యు అన్న గ్రామాలు కనిపించాయి. ఆ గ్రామాల ఆరంభంలోనూ చివరిలోనూ బౌద్ధ మతప్రతీకలున్న స్వాగతద్వారాలు పలకరించాయి. వాటిల్ని ‘కని’ అంటారట.

ధారాపాని దాటిన దగ్గర్నుంచి పరిసరాలు హిందూమతంనుంచి బౌద్ధమతంవేపు మరలుతోన్న సాంస్కృతిక పరిణామక్రమం కనిపించింది. చోర్టన్‌లనే చిట్టి స్థూపాలు కనిపించాయి. ప్రార్థనా వర్తులస్తంభాల ఉనికిని గమనించాను. ‘అవును. మనం హిందూమతప్రభావం ఉన్న ప్రదేశాలనుంచి టిబెటన్ బుద్ధిజం నిండిన ఊళ్ళవేపు వెళుతున్నాం,’ అని బాబు గురంగ్ నిర్ధారించాడు. ‘మన ట్రెక్ చివరి దశలో వచ్చే జోమ్‌సోంగ్ పట్టణం, ముస్తంగ్ జిల్లా, అందులోని ఎగువ ముస్తంగ్ ప్రాంతం ముందునుంచీ టిబెటన్ బౌద్ధభూమి’ అని వివరించాడు.

దారిలో మాకు తిమాంగ్ హిల్ అన్న నిడుపాటి కొండ తటస్థపడింది. దాని శిఖరాగ్రం పరిసరాలనుంచి 500 మీటర్ల ఎత్తున ఉంది. ఆ వర్షంలో కొండను ఎక్కడం శ్రమతో కూడిన పనే.. దారి దారిలా కాకుండా పోటెత్తిన వాగులా అనిపించింది. అక్కడి సెలయేళ్లలోని రాళ్ళూ బండల సాయంతో మా బూట్లు పూర్తిగా మునిగిపోకుండా నడిచే ప్రయత్నం చేసాం. అయినా మాకో జలపాతం ఎదురయినపుడు దానిగుండా నడవడం తప్ప మరో మార్గం లేకపోయింది. ఇహ బూట్లు, మునగడాలూ అన్న తాపత్రయాలకు అర్థమే లేకుండా పోయింది!

ప్రేమ్ అన్న మా గైడు ఒకతను, ‘వాతావరణం బావున్న రోజున ఈ తిమాంగ్ శిఖరం పై నుంచి 8000 మీటర్ల పై చిలుకు ఎత్తున ఉన్న మనాసలు శిఖరం కనబడుతుంద’ని చెప్పాడు. ఆ దారిలోని అడవి, శీతల ప్రదేశాలలో పెరిగే వృక్షాలతో నిండిపోయి కనిపించింది. పైన్, మేపుల్, ఓక్, కోనిఫెరస్ జాతి వృక్షాలు విరివిగా కనిపించాయి. ఆ ఓక్ వృక్షాల కొమ్మలు నాచుమొక్కలతోనూ, చిట్టి బరణి (ఫెర్న్)ల తోనూ నిండి ఉన్నాయి. ఆ చెట్ల దిగువన పొదలూ లతలూ కనిపించాయి. వాటిలో కొన్ని తప్పకుండా వైద్యానికి పనికొచ్చేవి అయి ఉంటాలి. ప్రాచీన భారతీయ వైద్యవిధానం – ఆయుర్వేదం – స్థూలంగా హిమాలయాలలో దొరికే వనమూలికల మీదే ఆధారపడి రూపొందింది. ఒకప్పుడు ఋషులూ ఆయుర్వేద వైద్యులూ మూలికలకోసం తిరుగాడిన వనసీమలలో ఇపుడు నేను అడుగు పెట్టానా అన్న భావన కలిగింది.

ఇపుడు మేము నడుస్తున్నది దిగువ హిమాలయాలలోని అడవులలో… మర్సియాంగ్దీ నదీలోయలోని పర్వతాల సానువుల్లో ఉన్న అరణ్యాలలో.. ఆ లోయకు అటూ ఇటూ ఎగసి నిలచిన పచ్చని పర్వతచరియల్ని చూస్తోంటే ప్రకృతి తన కళాత్మకతనంతా ఇక్కడే పొందుపరచిందా అనిపించింది. పచ్చని అడవులు, వరి పొలాలు, జలపాతాలు – అన్నీ చక్కగా అమరిపోయి ఉన్న ఆ సుందరసీమ ప్రకృతి గీసిన బృహత్తర వర్ణ చిత్రం కాదూ?!

మేమంతా చిన్న చిన్న బృందాలుగా విడివడి నడిచాం. వర్షం గురించి పట్టించుకోవడం మానేసి మనసారా కబుర్లు చెప్పుకుంటూ నడిచాం. మా చిరుబృందంలో బర్మింగ్‌హామ్‌నుంచి వచ్చిన రవి, రవీంద్ర; అనిత, శైలజ, లలిత, రేషమ్ సభ్యులయ్యారు. ఇందులో రవీంద్ర జనరల్ ప్రాక్టీషనర్. నేను 2001-2004 మధ్య బర్మింగ్‌హామ్‌లో పనిచేసినపుడు మా రెండు కుటుంబాలూ ఆ నగరపు శివార్లలోని బ్రోమ్స్ గ్రోవ్ – రెడిచ్ అన్న ఊళ్ళలో ఉండేవి. రెండిటిమధ్య ఏడు మైళ్ళ దూరం. తరచూ కుటుంబాలతో కలిసేవాళ్ళం. ఆ ప్రాంతాలలోని ఇండియన్ డాక్టర్లతో కలిసి ఓ బాడ్మింటన్ క్లబ్ కూడా ప్రారంభించాం.

మా చిరుబృందంలోని మిగతావాళ్ళు ఒకరినొకరు పరిచయాలు చేసుకుని స్నేహాలు పండించుకునే ప్రక్రియలో ఉండగా నేనూ రవీంద్ర పాత జ్ఞాపకాల తవ్వకంలో పడ్డాం. వాళ్ళ పాపలిద్దరూ ఇపుడు పెరిగి పెద్దై మెడికల్ స్కూలుకు వెళుతున్నారట. నేను లండన్ దగ్గరి న్యూబెరీకి మారిన తర్వాత బర్మింగ్‌హామ్ మిత్రులతో సంపర్కం సడలింది. అరుదుగా ఎక్కడైనా కలసినా ఆ కలయిక క్షణాల్లో ముగిసేది. ఈ అన్నపూర్ణ ట్రెక్‌వల్ల రవీంద్రతో తీరిగ్గా మాట్లాడుకొంటూ మా స్నేహాన్ని పునరుద్ధరించుకొనే అవకాశం కలిగింది.

మా రైన్‌కోట్లూ, వాటర్‌ప్రూఫ్ పాంట్లూ మొదట్లో బాగానే ఉపయోగపడ్డాయి. కానీ ఏ మాత్రం ఆగని వర్షం కదా – అది మెల్లగా ఈ రైన్‌కోట్ల సందుల్లోంచి దూరిపోయి బట్టల్ని తడిపేసింది. అదృష్టవశాత్తూ గాలి అంతగా వీయలేదు. అలాగే మేము ఆ రోజు నడచిన దారి మరీ ఎత్తైన ప్రదేశంలో లేదు. అంచేత పూర్తిగా తడిసినా చలి మమ్మల్ని పెద్దగా బాధపెట్టలేదు. అయినా ఉండనే ఉంది గదా, ‘నిండా మునిగిన వారికి చలేమిటీ!’

మెల్లగా మా కాలిబాట, దిగువన ఉన్న తిమాంగ్ గ్రామం కేసి సాగింది. ఆ గ్రామంలోని ఒయాసిస్ టీ హౌస్ అన్న చోట భోజనం చేసాం. ఆ డైనింగ్ హాలు మధ్యలో కట్టెల మంట వేసి ఉంది. చక్కని వెచ్చదనం. అందరం మా పైబట్టలు, సాక్సు, బూట్లు విప్పదీసి మంట దగ్గర వెచ్చబరుచుకున్నాం.

భోజనం చేసిన తర్వాత నడక కొనసాగించాం. వర్షం కాస్తంత తగ్గింది; కానీ పూర్తిగా వెలవలేదు. దారంతా జలపాతాలు – కొండలు, చెట్లు, అడవి కడిగిన ముత్యాల్లా ఉన్నాయి. వర్షం కురిసేటపుడు అడవి అందాలే వేరు. ఆ సొగసు, తాజాదనం మామూలు సమయాల్లో కనిపించదు. అసలు అలా వానలో నడవగలగడమే మా అదృష్టం అనిపించింది. అడవి, మర్సియాంగ్దీ నది, వంతెనలు, గ్రామాలు – సాగిపోతోన్న నడక మాది.

చిట్టచివరికి చీకటి పడకముందే ఛామె గ్రామం చేరుకోగలిగాం. చేరిన తర్వాత కూడా ‘మేమేనా ఇలా వర్షాన్ని జయించి 22 కిలోమీటర్లు నడిచి గమ్యం చేరింది’ అనిపించింది. ఛామె గ్రామంలోకి ప్రవేశిస్తున్నపుడు అక్కడి అధికారులు పర్మిట్లు చెక్ చేసారు.

ఏదేమైనా మా బృందం ఎంతో ధైర్యంతో, ఎంతో పట్టుదలతో మా ట్రెక్‌లోని మొట్టమొదటి రోజునే ప్రకృతి పెట్టిన పరీక్షలు ఎదుర్కొని విజయం సాధించిందని చెప్పాలి. ఆదిలోనే హంసపాదు అనుకొన్నది కాస్తా ఆనాటి అనుభవం మా దీక్షకూ ఓర్మికీ గీటురాయిగా పరిణమించింది. అవసరమయితే ఎంత వానలోనయినా నడిచేయవచ్చనీ అదేమీ అసాధ్యం కాదనీ అందరికీ స్పష్టమయింది. ఈ అనుభవం పరస్పర సహకారస్ఫూర్తిని పెంపొందించగలిగింది. అసలిలా వానలో నడిచే అవకాశం దొరకడమే ఒక వరం అని కూడా అనిపించింది. ఎంత నల్లని మేఘానికయినా వెండి అంచులు ఉంటాయి గదా!

(సశేషం)