ఈమాట సంపాదక వర్గానికి మాధవ్ మాచవరం పేరు గత కొన్నేళ్ళుగా సమానార్థకంగా స్థిరపడింది. 1998లో స్థాపించబడిన ఈమాట పత్రికకు తొలినాళ్ళ నుండి ఎందరో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ తమ సేవలు అందిస్తూ ఉన్నా, 2008లో సంపాదక వర్గంలో సభ్యునిగా చేరిన మాధవ్, అనతికాలంలోనే ప్రధాన సంపాదకునిగా మారి ఈ పత్రిక పూర్తి బాధ్యతలను తన తలకెత్తుకొని గత కొన్నేళ్ళుగా ఈమాటను దాదాపు ఒంటిచేత్తో నడిపిపించాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన ఈ పదిహేడేళ్ళ సేవలకు స్వల్ప విరామాన్ని ప్రకటిస్తూ, మాధవ్ మార్చి సంచిక తరువాత నుండి ఈమాట సంపాదకవర్గం నుండి పక్కకు తప్పుకున్నారు. కొత్త రచయితలను ప్రోత్సహించి రాయించడం దగ్గర నుండీ, వాళ్ళతో రచనకు సంబంధించి సుదీర్ఘమైన చర్చలు చేస్తూ వాళ్ళ ఆలోచనల్లో స్పష్టత తీసుకొచ్చే దాకా; కొత్త శీర్షికలకు ఆలోచన చెయ్యడం నుండి, ప్రత్యేక సంచికలు తీసుకు రావడంలో చొరవ చూపడం దాకా మాధవ్ ఈమాటకు అందించిన తోడ్పాటు అమూల్యమైనది. ఎందరో రచయితలు తమ తమ రచనల పట్ల మాధవ్ చూపిన శ్రద్ధకి, మొదలెట్టిన చర్చకి, ఆ రచన మీద నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలకి ప్రభావితమయి మళ్ళీ మళ్ళీ ఈమాటకే రచనలు పంపడం, ఎడిటర్‌గా మాధవ్ శ్రద్ధను, పత్రిక మీద, రచనల మీద వెచ్చించిన సమయాన్ని తేటతెల్లం చేస్తాయి. మరీ ముఖ్యంగా, ప్రచురణలో ఈస్తటిక్స్ విషయంలోను, పత్రిక విడుదలకు సంబంధించిన సమయపాలన విషయంలోను, మాధవ్ చూపిన క్రమశిక్షణే ఈమాట పత్రికను మిగతా ఆన్లైన్ పత్రికల నుండి ప్రత్యేకంగా నిలబెట్టింది. రచయితకు చెప్పదలచుకున్న విషయంపై పూర్తి అవగాహన, స్పష్టత ఉండాలని; అవి రచనలో కనిపించేలా, రాసిన రచనను అక్షరం అక్షరం సరిదిద్దుకుంటూ మెరుగు పర్చుకోవాలని బలంగా నమ్మటమే కాకుండా సంపాదకునిగా ఈ విషయంపై పలు రచయితలను ఒప్పించి, వారి రచనలను పరిష్కరించడానికి ఎంతో ఓపికతో వారితో కలిసి పనిచేసి ప్రచురించడంలో మాధవ్ చూపిన పట్టుదల అనితరసాధ్యమైనది. ఈమాటకు రచనలు పంపాలంటే ఒక స్థాయి ఉండాలి అన్న మాటల నుండి, ఈమాట సంపాదకుల విమర్శ కఠినంగా ఉంటుందనే మాట దాకా, ఈమాట మీద వచ్చిన ఎన్నో ప్రశంసలకు, విమర్శలకు కూడా ఒకరకంగా మాధవ్ పనితీరే కారణం. సంపాదకుడిగానే గాక, మాధవ్ తన రచనలతోనూ ఎన్నో ఈమాట సంచికలను సుసంపన్నం చేశారు. సునిశితమైన విమర్శా వ్యాసాలను, వ్యంగ్య రచనలను, అనువాద కథలను మాధవ్ ఈమాటలో ప్రచురించారు. గత కొన్నేళ్ళుగా ఈమాటలో ముందుమాటల ద్వారా, సంపాదకీయాల ద్వారా సాహిత్య ప్రపంచాన్ని తనదైన గొంతుతో విశ్లేషిస్తూ, విమర్శిస్తూ ఆ ప్రపంచపు పోకడలను, అక్కడి లోపాలను, మెరుగుపరుచుకునే మార్గాలను చర్చకు తెస్తూనే ఉన్నారు. తన అవిరామ కృషిని మనస్పూర్తిగా అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విరామం స్వల్ప వ్యవధికే పరిమితం కావాలని, త్వరలోనే మాధవ్ తిరిగి సంపాదకత్వం చేపట్టాలని ఈమాట తరఫున కోరుకుంటున్నాం.
ఈ రచయిత నుంచే...
ఇటువంటివే…
మే 2025 సంచికలో ...
- అక్కమహాదేవి వచనాలు – 5
- అలలు మోసిన వాడు
- అల్ బిదా హోటల్ వర్క్!
- అస్తిత్వవాద సాహిత్యం: 3అ. నీచ
- ఆ గోడకు ఒక కిటికీ ఉండేది!
- ఆకులేఖలు
- ఆనందమయదేశంలో నేను
- ఉపమా రఘోశ్చాపి
- ఉషోదయం
- ఎక్కడంటే?
- ఓ కైక కథ
- కంప్యూటర్ చిప్ కథ – 2: ప్రయోగ శాస్త్రానికి నాంది గిల్బర్ట్ గ్రంథం – “ది మేగ్నెట్”
- కలలకి కూడా రెక్కలు రాని కాలమైతే
- గుప్పెడు మాటలు
- చివరి కచేరి
- తయారుగా…
- పంచేంద్రియాలు: 3 వినికిడి
- భారతీయులకు హేతు చింతన ఉందా?
- ముకుల
- మే 2025
- మౌనంబంతట మాటలాడె… (2వ భాగం)
- యూట్యూబ్‌లో ఈమాట: ఏప్రిల్ 2025
- రెండు శరీరాలు
- షాంగ్రి-లా – 1