ముకుల

కుప్పిలి పద్మగారి పదో కథా సంపుటం, ఇరవయ్యో పుస్తకం ముకుల. ఇందులో 2019 నుండి 2024 వరకు రాసిన కథలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు, సమకాలీన సమాజంలో ఆ కాలంలో జరిగిన‌ ముఖ్యమైన సంఘటనల ఆధారంగా రాసినవి.

“సమస్తం మూసుకుపోయినా మానవ హృదయ స్పర్శ మాత్రం యెప్పుడూ మరో హృదయాన్ని వెలిగించాలని తాపత్రయపడుతుంది. మనిషిని మించిన ఆక్సిజన్ లేదు. యెప్పటికైనా మనిషి స్పర్శే ప్రాణ వాయువు.” అన్న రచయిత్రి ముందుమాటలు ఈ పుస్తకానికి ఆయువుపట్టు. మనిషితనం మీద సందేహాలు కలిగే కాలంలో ఇంత భరోసా ఇచ్చే మాటలను ప్రేమించకుండా ఎలా ఉండగలం? ఆ మాటల కొనసాగింపుగా “కాలం స్పర్శను నిషేధించగల్గింది కానీ మనుషుల మధ్య ప్రేమను నిషేధించలేకపోయింది” అంటూ కరోనా కాలంలో జరిగిన సంఘటనలూ సంఘర్షణల నుండి గొప్ప కథలను అందించారు. లాక్‌డౌన్ సమయంలోని భౌతిక, మానసిక అనుభవాలన్నీ వీటిలో రికార్డ్ అయ్యాయి. “లాక్‌డౌన్‌లో సొంత ఊళ్ళకు వేల కిలోమీటర్లు నడిచి వెళ్ళిన వలస కూలీల పాదాలు చెదిరిన కలల్లా, చితికిన ఆశల్లా ఉన్నాయి” అనటంతో వాళ్ళ దుర్భర పరిస్థితి మరోసారి కళ్ళ ముందు మెదిలింది. “మనల్ని మానసికంగా దుర్భలుల్ని చేసేది వలస. ఈ వలసలతో మన నట్టింట్లో భయంకొలిపే నిశ్శబ్దం అలుముకుంటుంది. మనల్ని మనం తిరిగి నిలబెట్టుకోడానికి, మనల్ని మనం అన్వేషించుకోవటానికి మన మూలాలవైపు సుదీర్ఘమైన నడక మొదలుపెట్టాం.” అనే మాటలు వలసల గురించి ఆలోచించేలా చేసాయి. కరోనా రోజులకు సంబంధం లేని మెట్రోకావల కథ ముగింపు కూడా వలస కూలీ తన సొంతూరు వెళ్ళిపోడమే. “పిల్లల భద్రత కోసమో, మనది అని చెప్పుకునే ఇంత నేల కోసమో, అస్తిత్వం కోసమో మనం అమెరికా నుండి వచ్చేసాం కదా! అలాగే మన పనమ్మాయి సొంతూరుకు వెళ్ళిపోవడానికి ఆమె కారణాలు ఆమెకు ఉంటాయి.” అంటాడు ఆ కథలో యజమాని పాత్రలో ఉన్న వ్యక్తి. వలసల కంటే ఉన్న ఊర్లో పనిచేసుకొని బతకడం మంచిది అనే అభిప్రాయం కనిపించింది రచయిత్రి మాటల్లో. వలసతో ఏం కోల్పోతున్నామో అందరికీ తెలుసు. కానీ వేరే దేశానికైనా, పట్టణానికైనా మన వలసలు తప్పట్లేదు. ఎక్కడ ఆపాలో తెలుసుకోగలిగే శక్తి మనిషి మెదడు నుండే పుట్టాలి. ఈ కథలు అట్లాంటి మెదడుకు మేత.

“తన చుట్టూ కొంత సందడి సృష్టించుకోవాల్సిన అవసరం మరోసారి కలిగింది కమలినికి” అన్న పద్మగారి వాక్యం నన్ను చాలా ఆకర్షించింది. ఇది లాక్‌డౌన్‌, ఐసోలేషన్ సమయాల్లో మాత్రమే కాదు, ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన వాక్యం. ఒక్కో వ్యక్తీ ఒంటరి ద్వీపంగా మిగిలే ఈ కాలంలో మనకు కావలసిన సందడేదో మనం సృష్టించుకోవల్సిందే.

మామూలు రోజుల్లోనే అంతంత మాత్రంగా ఉన్న జీవితాలు కరోనాలో ఎంత అతలాకుతలం అయ్యాయో వివిధ వర్గాల కథలతో కళ్ళముందుంచారు. వీటిలో పరిమళ అగరుబత్తులు తయారుచేస్తూ కుటుంబానికి అండగా ఉండే అమ్మాయి. కమలిని టీ తోటల్లో పనిచేస్తుంది. సంజన బ్యుటీషియన్. వెంకట్ మినియాప్పోలిస్‌లో ఉద్యోగి. వీళ్ళంతా కరోనా క్లిష్ట సమయాన్ని ఎలా ఎదుర్కున్నారో, దాన్నుండి ఎలా ఎదిగారో ఈ కథల్లో చూడొచ్చు. వైవిధ్యమైన జీవితాలు, స్ఫూర్తిదాయకమైన పాత్రలు ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. పల్లె నుండి పట్టణానికి వచ్చి లాక్‌డౌన్‌లో నాలుగుగోడల మధ్య చిక్కుకుపోయిన ముసలాయన కథ, ఇదే నేపథ్యంలో నడిచినా భిన్నమైనది.

‘ముకుల’ – దేశ నలుమూలలా స్త్రీలపై జరిగే అరాచకాలను చూసి భయపడ్డ ఒక టీనేజ్ అమ్మాయి మానసిక సంఘర్షణ ఆధారంగా నడిచే కథ. ఆడపిల్లల తల్లిదండ్రుల ఆందోళన తెలుసు కానీ అమ్మాయిలు ఇంత అభద్రతాభావంతో నలిగిపోతున్నారా అన్న ఆలోచనతో పాఠకులు కదిలిపోయేలా నడిచిన కథనమిది. భవిష్యత్తులో కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అమ్మాయిలు, చుట్టూ జరిగే దుర్మార్గాలను చూసి ఇంట్రోవర్టులుగా మారుతున్నారా? మనుషుల మీద నమ్మకాన్ని కోల్పోతున్నారా? బయటకు నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే ఆడపిల్లల మనసులో ఉన్న ఈ భయాలు పోయేదెలా? ఎన్ని చట్టాలు వచ్చినా ఈ అత్యాచారాలు ఆగట్లేదు. రూపు మార్చుకొని మరింత వికృతంగా అవుతున్నాయి. కథలో వీటికి సమాధానంగా “తమకూ సమాజానికీ మధ్య శరీరమే ఒక సరిహద్దు అనీ తమను తామే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలనే” నిర్ణయానికి వచ్చింది ముకుల. అనవసర యుద్ధాలనేకమున్న ప్రపంచంలో మన యుద్ధాన్ని మనమే చేయటం నేర్చుకోవాలి భయాలకు యీల్డ్ కావద్దు అంటుంది ముకుల స్నేహితురాలు. ఇలా సమస్యల చర్చ నుండి పరిష్కార దిశగా సాగే యువతుల పయనం స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆలోచనలు వికసించే దశలో ఉన్న అమ్మాయికీ, కథకూ, పుస్తకానికీ ‘ముకుల’ పేరు అన్నివిధాలా సమంజసంగా ఉంది.

పద్మగారు అనేక సంవత్సరాలుగా రాస్తూ, నూటా నలబై అయిదు కథలు రాసిన తర్వాత కూడా అంతే తాజాగా, నిర్మలంగా ఎలా రాయగలుగుతున్నారని ఎప్పుడూ అనుకుంటాను. సునిశితమైన పరిశీలన, విస్తృతమైన పరిశోధన, అనుభూతి చెందే సున్నితమైన హృదయం వల్లే ఇది సాధ్యమైందని ఈ పుస్తకం చదివాక అర్థమైంది. ఈ పుస్తకంలో నాకు అన్నిట్లోకి ఎక్కువ నచ్చిన కథ మణిపూర్ – ఎక్స్. ఎక్కడో మణిపూర్‌లో జరిగిన సంఘటన తన అనుభవమా లేక పక్కనే ఉండి చూసారా అనుకునేలా ఉంది. ఎంత పరిశోధన చేస్తే ఇలా రాయగలిగి ఉంటారు? ఈ సంపుటిలో మానసిక అంశాలను ఎంత లోతుగా విశ్లేషించి రాశారో సామాజిక, రాజకీయ అంశాలనూ అంతే లోతుగా రాసారు.

నీడలమధ్య సీతాకోకచిలుకలు కథ పిల్లల పెంపకం, చదువులు, పిల్లల ఆలోచనా విధానం గురించిన కథ. ఇది చాలా మంచి వస్తువు. దీని పైన విస్తృతంగా చర్చ జరగాలి. వ్యక్తిగతంగా నాకూ ఈ విషయం పట్ల కొంత కలవరం ఉంది. కానీ నిజానికి పిల్లల పెంపకం అంత కష్టమైన విషయమా? మమ్మల్ని మీరు పెంచక్కర్లేదు, పెరగనిస్తే చాలు అంటున్నారు పద్మగారి కథల్లోని పిల్లలు. అలా చేస్తే పెంపకం ఎంత తేలిక! అలా జరగాలంటే, తల్లిదండ్రులు సరైన వ్యక్తిత్వంతో ఎదిగి పిల్లలకు మంచి ఉదాహరణగా నిలిస్తే చాలేమో.

గోడకావల వనాలు కథలో కుటుంబ సుఖం గురించి మాత్రమే ఆలోచించే తండ్రిని ఉద్దేశించి “మనిషిగా బతకడానికి కావాల్సిన సహృదయ సమాజాన్ని తామింకా చేరుకోలేదు. యిక సుఖమనే మాటెక్కడ” అని రాసారు పద్మ. అలాంటి సహృదయ సమాజాన్ని ఆశించగలమా? ముందు తరాలు ఆ దిశగా పయనిస్తున్నారా? ఊహల్లో అయినా ఎంత బాగుందది. ఎన్నో గోడలకావల ఎంతోమంది ఆలోచనలు, పోరాటాల నుండి ఇప్పుడున్న స్థితికి చేరుకున్నాం. ఇప్పటి ఏఐ తరం సహృదయ సమాజాన్ని కలలు కని దాన్ని చేరగలిగితే…

ఇంటి పని, వంట పని దగ్గర వచ్చే గొడవల కారణంగా ఈ తరంలో ఎన్నో జంటలు విడిపోతున్నాయి. అంత పెద్ద సమస్యగా బయటకు కనిపించదు కానీ ప్రస్తుత కాలంలో ఇది పెద్ద సమస్యే. దీని గురించి పద్మగారు అన్ని కోణాల్లో వివరంగా రాసారు. “యెవరో ఒకరు సర్దుకుపోవడం అంటే, ఆ ఒకరూ ఎవరన్నదే ఈ తరం ప్రశ్న.”; “మేము తమ్ముడ్ని సరిగ్గా పెంచలేదా నీలూ.. నీతో, అక్కతో ఇంట్లో పనిచేయించినట్టే, నేర్పించినట్టే వాడినీ పెంచుంటే వాడు ఈ పనులన్నీ తన భార్యవి మాత్రమే అని యింత గట్టిగా నమ్మేవాడు కాదేమో!”; “వంట పనీ, ఇంటి పనీ రావటం మరొకరి కోసం కాదు. ఎవరికి వారు కంఫర్టబుల్‌గా, సుఖంగా, హ్యాపీగా, శాంతిగా బ్రతకటానికి అవసరం.” ఇలాంటి ఆలోచింపచేసే వాక్యాలు ఈ కథలో ఉన్నాయి.

మామూలుగా మనుషుల కళ్ళను తప్పించుకుపోయే జీవితాలను కుప్పిలి పద్మ కలం పట్టుకుంటుంది. మిగతా ప్రపంచం చూపించని కోణాలను గొప్ప సహానుభూతితో పరిచయం చేస్తుంది. సమకాలీన సమాజం ఇంకా అలవాటుపడని పోకడలను, సమాజం ఈ రోజు కాకపోతే రేపైనా ఒప్పుకు తీరాల్సిన కొన్ని కాలనుగుణమైన మార్పులను పరిచయం చేసి, వాటికి సిద్ధకపడక తప్పదని ముందస్తుగా హెచ్చరిస్తుంది. కొంచం జాగ్రత్త నేర్పుతుంది. కొంత మర్యాదా మప్పుతుంది. అర్బన్ జీవితం అందిచ్చే జీవితావకాశాలను, అక్కడ తట్టుకు నిలబడాల్సిన అంశాలను తొణకని గొంతుతో పాఠకుల ముందుకు తేవడం ద్వారా, ఈ ప్రపంచాన్ని తూచుకునే అవకాశాన్ని ఇక్కడివాళ్ళకే వదిలిపెడుతుంది. చెప్పేదేదో సరళంగా, సూటిగా చెప్పి, చలం అన్నట్టు కాస్త మౌనానికీ కాస్త ధ్యానానికీ వెసులుబాటూనిచ్చే కథలివి. సహజంగా ఆమె కవయిత్రి కావడం వల్ల, భాషలో ఎనలేని తాజాదనం వ్యక్తమవుతూ ఉంటుంది. ఎన్నో కథల్లో రోజువారీ జీవితం నుండీ కూడా కొసరుకోగల సౌందర్యస్పృహ ఎదురుపడి పఠనానుభవాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది. అందుకే ఈ కథలు పాఠకులను నిరాశపరిచే అవకాశం బహుస్వల్పం.