నువ్వు వచ్చేవనే సంబరం
కాసింతసేపే
కౌగిలింతలయ్యేక,
ముద్దులయ్యేక
మాట మొదలౌతుంది చూడు
అప్పుడే అనిపిస్తుంది
ఈ కలయిక విషాదాన్ని
మోసుకొచ్చిందని
ఎత్తిపొడుపులతో భాష
హొయలు పోయినప్పుడే
నువ్వు ఇక్కడలేవు
ఇంక మన మధ్య మౌనమే
విరిగిపోయిన పాలు
మరింక కాఫీలోకి పనికిరావు
ఎప్పటికో కాస్తంత
గాలి తగిలి ఉక్క సర్డుకుంటుంది
ఇంకా అంతర తరంగాల గమకం
మిగిలే ఉంటుంది
కంటికి పెట్టుకున్న కాటుక
ఎర్రగా ఉంటుంది
పెట్టుకున్న ఎర్ర తిలకం
నల్లగా ఉంటుంది
కుట్టేసిన పెదాలు
కిటికీలేని ఇంటిలా
అన్నీ సద్దుకుంటాయి
తిరుగు ప్రయాణం నాటికి
సముద్రం ఒడ్డున
చేతులతో తవ్విన చెలమలా కళ్ళు
రెపరెపలాడుతున్న
జెండాలా వణికే పెదాలు
అస్తమానం వేళ చెదిరిన
ఆకాశం
సంచితో తయారవుతుంది
చీకటి చేతులూపుతూ
మనమధ్య దూరం లేదు
ఎవరికి తెలియనంత
దగ్గరితనం మాత్రమే