ఎవరెస్ట్ బేస్ కాంప్ 4

మా ట్రెకింగ్ మొదలుపెట్టి నాలుగు రోజులు దాటింది.

నడక – విరామం – నడక – విరామం అన్న లయకు అలవాటుపడుతూ అయిదోరోజు ఉదయం 4410 మీటర్ల ఎత్తున ఉన్న దిన్గ్‌బోచె గ్రామం గమ్యంగా పెట్టుకుని నడక ఆరంభించాం. అతి చక్కని అమాదబ్లమ్ శిఖరాన్ని తనివితీరా చూసుకుంటూ ముందుకు సాగాం. ఇమ్జాఖోలా–ఖుంబుఖోలా చిరునదుల సంగమస్థలం దగ్గర నుంచి దిన్గ్‌బోచె లోయను కళ్ళారా చూశాం. ఆ పది కిలోమీటర్ల దూరం సాగి నాలుగువేల మీటర్ల ఎత్తును దాటి వెళ్ళినపుడు ఎదురయ్యే సవాళ్ళ గురించి ఆనాటి ఉదయం బాబూ గురంగ్ జాగ్రత్తలు చెప్పాడే గానీ మా పట్టుదలా ఉత్సాహాల పుణ్యమా అని సవాళ్ళ ఎరుకే లేకుండా ఆ సాయంత్రం అయిదుగంటల వేళ మెల్లగా మెల్లమెల్లగా అందరం దిన్గ్‌బోచె గ్రామం చేరుకున్నాం.

దిన్గ్‌బోచె గ్రామం చేరీ చేరగానే ఆ పక్కన ఉన్న చిన్న కొండ మీది చిరుస్తూపం పలకరించింది. ఆ స్తూపానికి తాపడం చేసి ఉన్న బుద్ధుని విశాల నేత్రాలు మాకేసి ప్రేమతోనూ దయగానూ చూస్తున్నట్టనిపించింది. స్తూపమూ నేత్రాలూ మాత్రమే గాకుండా ఆ ఊర్లో మా కోసం మరో ఆహ్వాన బృందం ఎదురయింది – ఏ చీకూ చింతా లేకుండా పచ్చిగడ్డి మేస్తోన్న జడలబర్రెల సమూహమే ఆ ఆహ్వాన బృందం! నాలుగు వేల మీటర్ల ఎత్తులకు చేరుకున్నాం గదా – జడలబర్రెల సీమలో అడుగు పెట్టామన్నమాట. ముందే చెప్పుకున్నట్టుగా అవి అలాంటి ఉన్నత శ్రేణి ప్రదేశాలలోనే సుఖంగా బ్రతకగలవు.

అంత ఎత్తున కూడా కూరగాయల మడులు కనిపించి ఆశ్చర్యపరిచాయి. బార్లీ, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, ముల్లంగి, ఆకుకూరలు – అక్కడ పండే పంటలు. ఆ పంట మళ్ళను, ఊరి రూపురేఖలను చూసుకుంటూ మెల్లగా బ్రైట్ స్టార్ హోటల్ అన్న మా వసతిగ్రహం చేరుకున్నాం. అక్కడ రెండు రాత్రిళ్ళు గడపబోతున్నాం. అక్కడ సదుపాయాలు బాగా ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. ఎత్తులు చేరుతున్న కొద్దీ సదుపాయాలు కనీస స్థాయికి చేరుకోవడం సహజమే గదా అనిపించింది.

హోటళ్ళు, లాడ్జ్‌లు అంటూ ఏ పేరుతో పిలిచినా, టీ-హౌస్‌లు అన్న సర్వనామంతో వ్యవహరించబడే ఈ నేపాల్ పర్వత ప్రాంతపు వసతి గృహాలు అక్కడికి వెళ్ళే ట్రెకర్లకు వరప్రసాదాలు. సాధారణంగా వీటిని స్థానిక షెర్పాలే నడుపుతూ ఉంటారు. మాలాంటి బృందాలు ఎక్కడికక్కడ టెంట్లు వేసుకోవలసిన అవసరం లేకుండా ఈ టీ-హౌస్‌లు నీడనిస్తాయి. భోజనమందిస్తాయి. ఇవే లేని పక్షంలో ట్రెకర్లలో చాలా మందికి ఈబీసీ లాంటి పదీ పన్నెండు రోజుల ప్రయాణం పెట్టుకోవడం సాధ్యమే కాదు. ట్రెకర్లకు సదుపాయంగా ఉండటంతో పాటు ఈ టీ-హౌస్‌లు స్థానికులకు ఉపాధి కూడా కల్పిస్తున్నాయి. వీటిల్లో కొన్ని కొన్ని టీ-హౌస్‌లు ఒకటో రెండు గదులు మాత్రమే ఉన్నవయితే మరికొన్ని మరింత పెద్దగా ఉండి ఇరవై ముప్పై మంది ఉన్న బృందాలకు ఆసరా ఇచ్చే శక్తి గలవి.

సహజంగానే ఈ టీ-హౌస్‌ల్లోని డైనింగ్ హాళ్ళు ట్రెకర్లందరూ గుమిగూడి తమ తమ కబుర్ల ద్వారానూ, భౌతికంగానూ వెచ్చదనాన్ని పంచుకొనే ప్రదేశాలు. విడి విడి గదుల్లో నీళ్ళు గడ్డ కట్టే పరిస్థితి ఉన్నా ఇరవై పాతిక మంది ట్రెకర్లు ఒకే హాల్లో గుమిగూడినప్పుడు వారి శరీరపు ఉష్ణోగ్రత ఆ హాలును వెచ్చబరచి మరి కాస్త సహనయోగ్యం చేస్తుంది. దానితో పాటు అక్కడ నిరవధికంగా సరఫరా అయ్యే లెమన్ టీ లాంటి పానీయాల సంగతి సరేసరి. నిర్ధారిత సమయంలో అందరికీ భోజనాల సరఫరా ఉంటుంది. అక్కడి నిర్వాహకులు ముందుగానే అందరినుంచే ఆర్డర్లు తీసుకొని ఆ ప్రకారం వండి వడ్డిస్తారు. వాళ్ళు వడ్డించే లోపల అక్కడ చేరిన వివిధ బృందాల ట్రెకర్లు కబుర్లలో పడతారు. అందులో చిన్న బృందాలవాళ్ళు… పెద్ద బృందాలవాళ్ళు… ఒంటరి యాత్రికులు… అంతా ఒక బృందంగా మారి కబుర్లు చెప్పుకుంటారు. ఒకరి అనుభవాలు మరొకరు వింటారు. ఒకరి సూచనలు మరొకరు పరిగ్రహిస్తారు. వాతావరణం గురించి అప్రమత్తమవుతారు. అప్పటికే గమ్యం చేరి తిరిగి వస్తోన్న వారి దగ్గర ఉపయోగకరమైన సమాచారం సేకరిస్తారు. కలిసి చతుర్లాడతారు. కలసి నవ్వులు పూయిస్తారు. ఎవరిది ఏ బృందం అన్నది మర్చిపోయి ఒకే కుటుంబంలా వ్యవహరిస్తారు. అందరిదీ ఒకే గమ్యం. ఒకే లక్ష్యం. ఎవరెస్ట్ బేస్ కాంప్ చేరుకోవాలి. అక్కడ ఉన్న కాలా పత్థర్ చిరు శిఖరం అధిరోహించాలి. ఈ గమ్యాల విషయంలో పోటీలుండవు. లక్ష్యాల సాధన విషయంలో అసూయలకు తావే లేదు. ప్రతి ఒక్కరిలోనూ అవతలివాళ్ళంతా తమ తమ గమ్యాలు చేరుకొని రావాలన్న సాదర భావన… వసుధైక కుటుంబకమ్!

మళ్ళా టీ-హౌస్‍ల లోని సదుపాయాల దగ్గరికి వస్తే నామ్చే బాజార్ లాంటి ‘దిగువ’ ప్రదేశాలలో ఉన్న వసతి గృహాలలో కరెంటు, పంపుల్లో నీళ్ళు, వేడినీళ్ళ షవర్లు లాంటి విలాసాలు ప్రతిచోటా కనిపిస్తాయి. ముందుకు సాగి ‘ఎగువ’కు చేరేకొద్దీ ఈ విలాసాలు క్రమక్రమంగా అంతరించి అతి ప్రాథమిక స్థాయికి చేరుకొంటాయి. అక్కడ కరెంటు సదుపాయం ఉండదు. కొన్నిచోట్ల సోలార్ పేనల్స్ ద్వారా విద్యుచ్ఛక్తి అందుతుంది. అది మహా అయితే రెండు మూడు గంటలు దీపాలు వెలిగించడానికి సరిపోతుంది. ఇక వేడినీళ్ళన్న మాటే ఎత్తడానికి లేదు. నెత్తిన పైకప్పు ఉన్న గదులు దొరికే మాట నిజమే అయినా – ఇన్సులేషన్స్, హీటింగ్ అన్న ఏర్పాట్లు లేకపోవడం వల్ల; వాటి నిర్మాణం కూడా కనీస స్థాయిలో ఉండడం వల్ల ఆ గదుల్లో పడుకొన్నా ఆరుబయట పడుకున్నా పెద్దగా తేడా కనిపించదు. ఆ చలి భరించాలంటే అత్యంత నాణ్యత గల స్లీపింగ్ బాగ్ ఉండటం తప్పనిసరి. టాగ్ (థర్మల్ ఓవరాల్ గ్రేడ్) అన్న నాణ్యతా ప్రమాణం కలిగిన ఉష్ణనిరోధక పదార్థంతో చేసిన స్లీపింగ్ బాగ్‌లు మాత్రమే అక్కడే చలి సవాళ్ళకు నిలచి మనల్ని కాపాడగలవు. ఆ ఎగువ ప్రదేశాలలో మనకు ఎదురయ్యే మరో సవాలు టాయిలెట్లు కనీస స్థాయిలోనయినా లేకపోవడం. రాత్రిళ్ళు నీళ్ళు గడ్డకట్టేంత చలిలో టాయిలెట్లు, హైజీన్ అంటూ వేసారుపడటం మనకే నవ్వు తెప్పిస్తుంది.

ఒక్కమాట చెప్పుకోవాలి – ఎంత మారుమూల ఎగువ ప్రాంతానికి వెళ్ళినా తిండి తిప్పలకు పెద్దగా లోటు ఉండదు. దాల్ భాత్, నూడిల్స్ లాంటి సులభ సాధ్యమైన వంటకాలే కాకుండా చాలా చోట్ల మోమోలు, ఫ్రైడ్ రైస్, ఆమ్లెట్ లాంటివి కూడా సులభంగా దొరకడం గమనించాను. కొన్ని చోట్ల పిజ్జాలు పాస్తాలు కూడా దొరికాయి. అంతేగాకుండా మాంసాహారం కూడా బాగా దొరుకుతోంది. కానీ ఆ ప్రదేశాల్లో దొరికే మాంసాహారం తినకుండా ఉండటమే మంచిది అన్నది మాకు సాధారణంగా అందరూ చెప్పే మాట. మాంసం దిగువ నుంచి ఆ మారుమూల ప్రదేశాలకు చేరుకోవాలంటే కనీసం రెండు మూడు రోజులు పడుతుంది. అది పాడవకుండా కాపాడే రిఫ్రిజిరేషన్ వ్యవస్థ అక్కడ లేదు. అంచేత అలా నిలవ ఉన్న మాంసం తినడమంటే అనారోగ్యం కొని తెచ్చుకోవడమే అన్నది ఒక ఆలోచన. అదేం మాటా – నీళ్ళు గడ్డకట్టే చలిలో రిఫ్రిజిరేషన్ అవసరమా అన్నది మరో ఆలోచన. రాత్రిళ్ళు చలిగా ఉన్నా, పగలు బాగానే ఎండ కాస్తూ ఉంటుంది గదా అన్నది మరో వాదన. వాదనలూ ప్రతివాదనల సంగతి ఎలా ఉన్నా మా గైడ్‌లూ పోర్టర్లూ ఏ సంకోచాలూ లేకుండా మాంసాహారం తినడం గమనించాను. వారికది అలవాటైపోయింది గదా – ఏ సమస్యలూ రావు. జన్మానికోసారి ఆ ప్రాంతాలకు వెళ్ళే మాలాంటివాళ్ళు మాంసాహారం ముట్టకపోవడమే శ్రేష్ఠం అన్నది మాబోటి వాళ్ళ ఏకాభిప్రాయం.

ఈ టీ-హౌసుల్లోని డైనింగ్ హాళ్ళు మరి రెండు కారణాల వల్ల అందర్నీ ఆకర్షించడం గమనించాను. సాధారణంగా విడివిడి గదుల్లో ఉండీలేనట్టు ఉండే ఫోను సిగ్నల్ ఈ డైనింగ్ హాళ్ళల్లో మరి కాస్త బలంగానూ నిలకడగా ఉంటుంది. అంచేత ఫోన్లు చేసుకోవాలన్నా, మెసేజీలూ ఫోటోలూ పంపుకోవాలన్నా – బయట ప్రపంచంతో ఎలాంటి సంపర్కం ఏర్పరచుకోవాలన్నా – డైనింగ్ హాళ్ళకు రావడం తప్పనిసరి. మళ్ళా వాటన్నిటికీ అదనపు ఛార్జీ ఉంటుందన్నది వేరే మాట.

అన్నట్లు రూముల్లో ప్లగ్ పాయింట్లు ఉండటం అన్న సమస్యే లేదు. వాటి కోసం వెదకడం వృథా ప్రయాస. ఫోన్లు ఛార్జి చేసుకోవాలంటే డైనింగ్ హాళ్ళలో ఉండే ఒకటి రెండు ప్లగ్ పాయింట్లే ఏకైక మార్గం. వాటి దగ్గర క్యూలూ, వాటికి అదనపు ఛార్జీలు – షరా మామూలే! ఆ ఛార్జీలు మేము చేరుతున్న ప్రదేశపు ఎత్తు పెరిగే కొద్దీ ఉత్తర దిశకే చేరుకుంటాయన్న మాట ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

గడ్డకట్టే నీళ్ళ గురించి చెప్పుకున్నాం కదా – నీటి విలువ గురించి మనకు చక్కని పాఠం చెప్పే శక్తి ఆ ఎగువ గ్రామాలకు ఉంది. నిన్న మొన్నటిదాకా పదీ ఇరవై ఇచ్చి లీటరు నీళ్ళ బాటిల్ కొనడమంటే చిత్రంగా చూసే వాళ్ళం గదా, అదే సీసా ఈ ప్రదేశాల్లో అక్షరాలా అయిదు వందల రూపాయలు. ఆ నీళ్ళు వేడినీళ్ళు అన్నది వేరే మాట. ఆ వేడి నీళ్ళ బాటిల్ మళ్ళీ బహుముఖ ప్రభావశాలి. రాత్రి దాన్ని స్లీపింగ్ బాగ్‌లో జాగ్రత్తగా ఇముడ్చుకొని పడుకొంటే వెచ్చదనం ఇస్తుంది. నీళ్ళు చల్లారాక కూడా మన శరీరవు వెచ్చదనం ఆ నీళ్ళు గడ్డగట్టకుండా చూస్తుంది – దాంతో అవే నీళ్ళు ఉదయపు కాలకృత్యాలలో మనకు ఉపయోగపడతాయి. ఎటు చూసినా గడ్డకట్టిన మంచు ముక్కలు ఉన్న ప్రదేశంలో ఒక సీసా నీటికి ఐదొందలివ్వడం క్రమక్రమంగా మనకు సబబేననిపిస్తుంది!

ఏదేమైనా ఈ ఉన్నత హిమాలయాల్లో చేసే పాదయాత్రలు మనిషి ఆలోచనలనూ జీవన సరళిని సమూలంగా మార్చే శక్తి కలవి. ఆ ప్రదేశాలకు చేరుకున్న మనిషి తనతో తాను సమయం గడుపుకోడానికీ తన గురించి తాను నిశితంగా ఆలోచించుకోడానికీ ఈ ప్రయాణాలు అవకాశమిస్తాయి. మనల్ని మన మూలాలు దర్శించేలా చేస్తాయి. అప్పటిదాకా ఏ ఆలోచన లేకుండా ఎంతో సామాన్యమైనవిగా అనిపించే సౌకర్యాలే మనిషికి ఎంత విలువైనవో, అవి లభించడం ఎంత వరమో మనకు అర్థమయ్యేలా చేస్తాయి. శుభ్రమైన గది, వేడి నీళ్ళ షవరు, వెరపు కలిగించని టాయ్‌లెట్, చలీ వేడీ అనుకోకుండా నిద్రపోగలగడం – ఇవన్నీ ఎంత విలువైన సదుపాయాలో ఇలాంటి యాత్రల్లో మనకు స్పష్టమవుతుంది.

డిన్నరు సమయంలో వైజాగ్ నుంచి వచ్చిన విష్వంత్ అన్న వ్యక్తి కలిశాడు. మరో నలుగురు సహచరులతో కలిసి ఈబీసీ ట్రెక్ చేస్తున్నారాయన. కాసేపు మాట్లాడుకున్నాం. అనుభవాలు పంచుకున్నాం. మాలానే ట్రెకింగ్ ధ్యానంలో మునిగిపోయిన మరికొంత మంది ఆసక్తికరమైన వ్యక్తులు దారి పొడవునా కనిపిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గరా తమకే ప్రత్యేకమైన యాత్రనుభవాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడడం, ఆ అనుభవాలు వినడం – దానికదే మాలాంటి మొదటిసారి ఈబీసీ ట్రెక్ చేస్తున్నవారికి గొప్ప ప్రేరణ.

3820 మీటర్ల దెబోచె దగ్గర ఆనాడు ట్రెకింగ్ ఆరంభించిన మేము సాయంత్రం 4410 మీటర్ల దిన్గ్‌బోచె గ్రామం చేరుకున్నాం గదా – ఆనాడు అంతా కలసి 590 మీటర్లు ఎగువకు చేరామన్న మాట. నిపుణులు నిర్దేశించే 500 మీటర్లు దాటి మరెన్నో అడుగులు వేశామన్నమాట. గాలి పలుచబడడం మాకు తెలిసిపోతోంది. అందరం ఆక్సిజన్ స్థాయి కొలిచి చూసుకున్నాం. నాది 82 శాతం వచ్చింది.


దిన్గ్‌బోచెలో రెండు రాత్రుళ్ళు గడపాలన్నది మా ఆలోచన.

నాలుగు వేల మీటర్ల ఎత్తు దాటడం, నిన్నటిరోజు 500 మీటర్లను మించి ఎగువకు చేరుకోవడం – ఈ రెండూ కారణాలు ఈ రెండు రాత్రుల ఆలోచనకు. ఉన్నత ప్రాంతాలకు చేరుకొంటోన్న కొద్దీ త్వరత్వరగా గమ్యాలు చేరుకోవడం కన్నా, నింపాదిగా శరీరాన్ని మారుతోన్న భౌగోళిక పరిస్థితులకు అలవాటు చెయ్యడం, ఆ సామరస్యం కుదిరిన తర్వాత ముందుకు అడుగులు వెయ్యడం అతి ముఖ్యం. ఈ ఎక్లమటైజేషన్ కోసం గైడ్‌లు అనుసరించే మరో చక్కని మార్గమంది: ట్రెకర్లను పగటిపూట బాగా ఉన్నత ప్రదేశాలకు తీసుకు వెళ్ళి రాత్రి ఉండటానికి మాత్రం కాస్తంత దిగువకు తీసుకొస్తారు. ‘పగటిపూట ఎగువకు చేరి, రాత్రి దిగువన విశ్రమించు’ అన్నది ఆ ప్రాంతాల్లో అందరూ పాటించే సరళ నియమం.

ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్‌లో నేను టిబెటియన్ బ్రెడ్ రుచి చూశాను. కరకరలాడే బ్రెడ్డు అది. వేయించిన పిండితో చేస్తారు. కాలరీలు పుష్కలంగా ఉండే రొట్టె అది. శరీరం పడే శ్రమకు అనుగుణంగా సత్తువని అందించే శక్తి కలిగినదా టిబెటియన్ బ్రెడ్. బ్రేక్‌ఫాస్ట్ ముగించాక అందరం దగ్గర్లో ఉన్న నాగార్జున పర్వతం ఎక్కడానికి బయల్దేరాం. 4700 మీటర్ల ఎత్తున ఉందా పర్వతం. అంతా కలసి మూడున్నర గంటలు పట్టేసింది.

ఊహించే ఉంటారు – ఆ పర్వతానికి రెండవ శతాబ్దంలో ధాన్యకటకం–అమరావతి ప్రాంతాన కృష్ణానదీ తీరాన నివసించిన ఆచార్య నాగార్జున అన్న బౌద్ధమత తత్త్వవేత్త పేరు పెట్టారు. మహాయాన బౌద్ధంలో మాధ్యమిక మార్గం ఆవిష్కరించిన చరిత్ర పురుషుడు నాగార్జునుడు. ఈనాడు టిబెట్, చైనా, కొరియా, వియత్నాం, జపాన్ దేశాలలో బౌద్ధమత అనుయాయులు అనుసరిస్తోన్న మార్గం నాగార్జునాచార్యుడు ఆవిష్కరించినదే.

నాగార్జున శిఖరం నుంచి దిగువన ఉన్న దిన్గ్‌బోచె లోయ, చుకుంగ్ లోయ ఎంతో మనోహరంగా కనిపించాయి. ఆ లోయల అవతలి వేవున లోత్సె, మకాలు, ఐలండ్ పీక్, అమాదబ్లమ్, కాంగ్తేగ, థామ్ సెర్కు, కాంగ్డే లాంటి హిమ శిఖరాలు కట్టని గోడలా నిలబడి దృశ్యాన్ని రాజసం చేస్తున్నాయి. మరోవేపు చూస్తే ఫెరిచె లోయ; దానికి అవతలి గట్టున తొబుచె, చొలాత్సె, లొబుచె లాంటి హిమగిరులు… గైడ్లు చూపించిన దిశలో జాగ్రత్తగా చూస్తే మాకు గోక్యో లోయను ఎవరెస్ట్ బేస్ కాంప్‌తో కలిపే చోలా కనుమ కనిపించింది. ఆ కనుమ 5400 మీటర్ల ఎత్తున ఉందట! ఆనాడు మకాలు శిఖరం కనిపించింది గదా – గత మూడు రోజులుగా చూస్తోన్న ఎనిమిదివేల మీటర్ల నిడివిని మించిన ఎవరెస్టు, లోత్సె శిఖరాలతో పాటు మరో మూడవ అష్టసహస్ర శిఖరపు దర్శనం మాకు లభించిందన్నమాట.

అవన్నీ చూస్తోంటే హిమాలయాల సౌందర్యం వర్ణించడానికీ కొనియాడడానికీ వేయి నోళ్ళ ఆదిశేషుడినికైనా సాధ్యమేనా అనిపించింది. ఐరోపా, ఆఫ్రికా, అమెరికా ఖండాలలోని హిమశిఖరాలతో నాకు బాగానే పరిచయముంది. కానీ ఈ భూప్రపంచం మీద హిమాలయాలతో సౌందర్యపరంగా గానీ రాజస గాంభీర్యపరంగా గానీ అవి ఏవీ సరి తూగవని ఖచ్చితంగా చెప్పగలను. ఆరోజు ఆకాశం నిర్మలంగా ఉండటంతో ఎంతెంతో దూరాన ఉన్న శిఖరాలు కూడా మాకు స్పష్టంగా కనిపించి మురిపించాయి.

నాగార్జున శిఖరం మీద నుంచి పరీక్షగా చూస్తే ఇమ్జా సరోవరంలో పుట్టి, దిన్గ్‌బోచె లోయలో పారుతోన్న ఇమ్జాఖోలా నది కనిపించింది. అటువేపు ఫెరిచె లోయలో ఖుంబు గ్లేషియర్‌లో పుట్టి పారుతోన్న ఖుంబుఖోలా నది కనిపించింది. అలా పారుతోన్న ఆ నదుల హొయలూ లయలూ గమనించాలంటే మామూలు ట్రెకింగ్ రోజుల్లో సాధ్యం కాదు. ఇదిగో ఇలా ఎక్లమటైజేషన్ కోసం సమయం తీసుకుని మళ్ళా ఆ విరామంలోనే అభ్యాసం కోసం సయాంగ్ బోచె గ్రామానికో నాగార్జున పర్వతానికో వెళ్ళినప్పుడు ఏ ఒత్తిడి లేకుండా ఆడుతూ పాడుతూ పరిసరాలను మరింత ఉల్లాసంగా చూసి ఆనందించే అవకాశం లభిస్తుంది. దానికి నిర్మలాకాశం తోడయితే ఇక చెప్పేదేముందీ!

సాయంత్రం మేమంతా దిన్గ్‌బోచె గ్రామంలోని షాపుల్ని చూడ్డానికి బయల్దేరాం. షాపులు అన్నవి ఉన్న చిట్టచివరి గ్రామం అది. మా గైడ్ పుస్తకాలను సంప్రదిస్తే ఆ ఊళ్ళో ఉన్న ఫ్రెంచ్ కఫే అన్న చోట చక్కని కేకులూ చిక్కని కాఫీ దొరుకుతాయని తెలిసింది. ఈ కఫేను వెతుకుతూ ముందుకు సాగాం. చిట్టచివరికి ఊరికి అవతలి కొసన ఆ కఫే కనిపించింది. విశాలమైన పచ్చిక బయలు, గడ్డి మేస్తున్న జడలబర్రెలు, వాటికి తోడు రెండు చిట్టి బౌద్ధస్తూపాలు… అంతా బానే ఉంది గానీ ఆ ఫ్రెంచ్ కఫే మూతబడి కనిపించింది! దాని ఘనచరిత్ర గతంలో కలసిపోయిందన్నమాట. అక్కడ కనిపించిన ఒకరిద్దరు స్థానికులు ‘కఫే 4410’ ప్రయత్నించండి… అదీ బావుంటుంది అని సలహా ఇచ్చారు.

కాస్తంత వెతకగా కఫే 4410 కనిపించింది. ఆ కఫే పేరులోని 4410 అన్న సంఖ్య ఆ ప్రదేశపు ఎత్తును సూచిస్తోందన్నమాట. ఇపుడా కఫే 4410నే దిన్గ్‌బోచె గ్రామంలోని ముఖ్యమైన కాఫీ షాపన్న మాట. వెళ్ళి తలుపు తెరిచాం. లోపలంతా కోలాహలం, గందరగోళం! కుర్చీలూ, సోఫాలు ట్రెకర్లతో కిక్కిరిసి కనిపించాయి. ఊళ్ళోని ట్రెకర్లందరూ అక్కడే గుమిగూడారా అనిపించింది. అందులో మా బృందంలోని వాళ్ళూ కనిపించి పలకరించారు!

ఆర్డర్లిచ్చే చోట చిన్నపాటి క్యూ ఉంది. వెళ్ళి అంతా రికమెండ్ చేసిన ఆప్రికాట్ కేక్, చాక్లెట్ బ్రౌనీ, కాఫీ ఆర్డరు చేశాం. కాఫీ దివ్యంగా ఉంది. కేక్‌లు రుచిగా ఉన్నాయి. సముద్రమట్టానికి నాలుగు కిలోమీటర్ల ఎగువున అక్కడి షెర్పా షెఫ్‌ల చెప్పుకోదగ్గ పాకప్రావీణ్యం చవిచూసే అవకాశం మాకా రోజు లభించింది.

అందరం బుద్ధిగా తిరిగి మా టీ-హౌస్‍కు చేరుకున్నాం. ఆనాటి రాత్రి మాకు ఎదురవబోయే శీతల సమయాలను భయంభయంగా ఊహించుకుంటూ డైనింగ్ హాల్లో బైఠాయించాం. భోజనం పెద్దగా సహించకపోయినా మా దుబాయ్ మిత్రులు విజయ్, మోహన్ తీసుకు వచ్చిన పచ్చళ్ళు మా తిండికి కాస్తంత పదును ఇచ్చాయి. రాత్రి తొమ్మిది అవగానే మేమందరం డైనింగ్ హాలు ఖాళీ చెయ్యాల్సి వచ్చింది – గైడ్‍లూ పోర్టర్లూ రాత్రి పడుకోనేది అక్కడే మరి. ఏ మాటకా మాట – ఆ ప్రదేశం వాళ్ళందరికీ సరిపడదూ, ఇరుకిరుకూ అన్నమాట నిజమే గానీ మా ఐస్ బాక్సుల్లాంటి గదులలో పోలిస్తే డైనింగ్ హాలే కాస్తంత వెచ్చన అని చెప్పాలి!


22 అక్టోబర్ 2022.

మా ట్రెక్‌లో ఏడవ రోజు.

ఆ ఉదయం దిన్గ్‌బోచె గ్రామం వదిలి థుక్లా వేపుగా సాగిపోయాం. దిన్గ్‌బోచె గ్రామాన్ని విడిచి పెట్టడానికి ఫెరిచె అన్న చిన్న పాటి మూపుర ప్రాంతం– రిడ్జ్ –ఎక్కవలసి వచ్చింది. ఆ మూపురం చేరుకోగానే హిమశిఖరాల తోరణం మా కళ్ళముందు విచ్చుకుంది. తొబూచె (6495 మీటర్లు), చొలాత్సె (6440), లొబుచె (6119) శిఖరాలు, పరిసర ప్రాంతంలోని చోలా అన్న మంచు నిండిన విశాలమైన ప్రదేశం… దిగంతాల దాకా విస్తరించిన అపురూప దృశ్యమది.

అక్కణ్నించి ఖుంబుఖోలా వరకూ మా నడక సమతల ప్రాంతంలో సాగింది. ఎత్తులు ఎక్కడం దిగడం అవసరం లేని ఆ హిమసీమలో మేమంతా మెల్ల మెల్లగా సాగిపోయాం. అలా మూడు గంటలు నడిచాక, నాలుగు కిలోమీటర్లు గడిచాక మా గమ్యం – థుక్లా గ్రామం చేరుకున్నాం. పట్టుమని పది ఇళ్ళయినా లేని చిరు గ్రామమది – యాక్ లార్డ్స్ అన్న టీ-హౌస్‌లో మా నివాసం. అంత చిన్న ఊళ్ళోనూ మాదే కాకుండా మరో టీ-హౌస్ ఉంది! ఖుంబుఖోలా నదీతీరాన ఉందా థుక్లా గ్రామం. సముద్రమట్టానికి 4620 మీటర్ల ఎత్తు. అంటే వృక్షరేఖను దాటి బాగా ఎగువకు చేరామన్నమాట! గడ్డీ తుప్పలూ తప్ప చెట్లూ మొక్కలూ అన్న మాటే లేని ప్రాంతం… రాళ్ళూ రప్పలూ దుమ్మూ ధూళీ తప్ప పచ్చదనాన్ని ఆశించనైనా ఆశించకూడని ఉన్నత ప్రదేశాలవి.

చాలామంది ట్రెకర్లు థుక్లాలో ఆగకుండా మరో నాలుగు గంటల దూరాన ఉన్న లొబూచె అన్న మరికాస్త పెద్ద గ్రామం చేరుకుంటూ ఉంటారు. మేము ట్రెక్ ఆరంభానికి బాగా ముందే, మా ఏజంటు సూర్యశ్రేష్ఠతో చేసుకున్న సంప్రదింపుల్లో – ఈ థుక్లా గ్రామంలో ఒకరోజు ఉండేలా ప్లాను చేశాను. త్వరపడి వెళ్ళేకన్నా ఒక రాత్రి ఆగి ఎక్లమటైజేషన్ ప్రక్రియ మరి కాస్త పుష్టిగా జరిగేలా చూసుకోవడం మంచిదని నా భావన. దానితో పాటు మరో చక్కని కారణం కూడా మేము థుక్లాలో ఓ రాత్రి గడపడానికి దోహదం చేసింది: ఆ పక్కనే ఉన్న జోంగ్లా పోఖోరి సరోవరం చూసి వెళ్ళాలంటే థుక్లాలో ఆగడం తప్పనిసరి.

ముందే చెప్పినట్లు మా ట్రావెల్ ఏజెంట్ సూర్య స్థిరమైన మనిషి. ఏదో ఒకలాగా ఒక టూరు ముగించేసి మరో టూరుకేసి వెళ్ళాలని ఆత్రపడడు. తన కస్టమర్ల బాగోగులు, రక్షణ, సంతృప్తి అతనికి ముఖ్యం. అంచేత మొదటినుంచి చివరిదాకా కస్టమర్ల తరఫున పూర్తి బాధ్యత తీసుకుని వారివారి అభిరుచులు, శక్తి, అనుభవం – ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టూర్లు రూపకల్పన చేసే మనిషి సూర్య. ఆ ధోరణి మాకెంతో నచ్చింది. అతని మీద పూర్తిగా ఆధారపడవచ్చని నాకు ముందు నుంచీ నమ్మకం కలిగింది. ఇలా ఏజెంటూ కస్టమర్ల మధ్య పరస్పర అవగాహనా విశ్వాసం ఉండటం ఏ యాత్ర అయినా సఫలం కావడానికి ఎంతో అవసరం. సూర్యకు ఉన్న అనుభవం, ఇతరుల అవసరాలను గ్రహించే శక్తి పుణ్యమా అని మా యాత్ర అంతా ఎంతో సంతృప్తిగా, ప్రమాదరహితంగా సాగింది. దారిలో వచ్చే సుందరమైన చిరు శిఖరాలనూ సరోవరాలనూ మా యాత్రామార్గంలో చేర్చడం వల్ల ఒకవేపు మరువలేని దృశ్యాలను చూసిన అనుభూతి, మరోవేపు సగటు యాత్రికునికి అవసరమైనంత ఎక్లమటైజేషన్ – ఈ రెండు ఫలాలూ సూర్య దూరవృష్టి వల్ల మాకు దక్కాయి.

మా యాక్ లాడ్జ్ టీ-హౌస్‌లో స్థిరపడి నింపాదిగా భోజనం ముగించాక అందరం ఆ మధ్యాహ్నం జోంగ్లా పోఖోరి సరోవరం కేసి చిన్నపాటి ట్రెక్ ఆరంభించాం. చొలాత్సె గ్లేసియర్ నుంచి జాలువారే నిర్మలజలాలు ఆ కొండల మధ్య పోగుపడి సృష్టించిన నీలాలూ పగడాల రాశి జోంగ్లా పోఖోరి సరోవరం. ఆ ఒడ్డుకు చేరిన ఏ మనిషయినా అక్కడి సౌందర్యం ప్రశాంతతల ప్రభావంలో పడి మైమరచిపోవడం తప్పనిసరిగా జరిగే పని. చుట్టూ హిమశిఖరాలు… మెలమెల్లగా సరోవరంతో కూడుకుంటున్న జలధారలు… గాలి వీచినా వినిపించేంత నిశ్శబ్ద సౌందర్యం – అతిలోక భావన కలిగించే వాతావరణమది. ఈ చిరు సరోవరాల నుంచే చిన్న చిన్ననదులు ప్రాణం పోసుకుని ముందుకు సాగి దూధ్‌కోసి లాంటి హిమాలయ నదీ ప్రవాహాలకు మూలాధారాలవుతాయి.

మా గైడ్ బాబూ గురంగ్ కూడా మా భావనలకు సరితూగే వివరణ ఇచ్చాడు: ఈ తటాకం ఇక్కడ అందరు నడిచే బాటకు కాస్తంత పెడగా హిమనగాల నడుమన దాగి ఉన్న మణిమాణిక్యం. ఈబీసీ ట్రెక్‌కు వచ్చే చాలా మంది దీనిని విస్మరించి గమ్యం కేసి సాగిపోతూ ఉంటారు. అలా గాకుండా నాలుగు క్షణాలు ఆగి ఇటువేపు అడుగులు వేసేవారికి దక్కే సంతోషం సంతృప్తి వెలకట్టలేనివి.

మొత్తానికి ఆ చిట్టి తటాకం చూసి రావడమన్నది మాలో మధురమైన జ్ఞాపకాన్ని నింపింది. ఏ తొందరపాటూ లేకుండా ఆ జలరాశులతో ఊసులాడాక సాయంత్రం వేళ మెల్లగా మా టీ-హౌస్ కేసి నడక ఆరంభించాం. సూర్యస్తమయ సమయం కదా – క్రమక్రమంగా విభిన్న వర్ణాలు సమకూర్చుకుంటూ పరిసరాలన్నీ కనువిందు చేశాయి.

అలా తిరిగి నడుస్తున్నపుడు ఇరవై రెండేళ్ళనాటి జ్ఞాపకం ఒకటి మనసులో విచ్చుకుని పలకరించింది. అది 2000 సంవత్సరం. వేసవికాలం. నాటింగ్‌‍హమ్‌షైర్ లోని రాంప్టన్ హాస్పిటల్‌లో ఎనిమిది వారాలు పని చేశాను. మేమంతా డాక్టర్ల క్వార్టర్లలో ఉండేవాళ్ళం. సాయంత్రాలు బాగా విరామం దొరికేది. మైళ్ళకొద్దీ నడకలు, ఆ నడకల్లో అంతులేని కబుర్లు – మా నిత్యకృత్యం. ఆ ప్రక్రియలో మాతో పాటు నివసిస్తోన్న ఏభై అయిదేళ్ళ డాక్టర్ రజ్దాన్ అన్న భారతీయ వైద్యుడు నా మీద గాఢముద్ర వేశారు. ఆయన ఒక యాత్రా పిపాసి. హిమాలయాలలో ట్రెకింగ్ చెయ్యడానికి సాటి డాక్టర్లను ప్రోత్సహించి తీసుకువెళ్ళడం ఆయనకు ఇష్టమైన విషయం. అలాంటి హిమాలయాల యాత్రలకు బృందపు సభ్యులను సంసిద్ధం చెయ్యడం కోసం ముందుగా వారందరినీ వారాంతవు శెలవుల్లో ఇంగ్లండ్ లోని పీక్ డిస్ట్రిక్ట్, లేక్ డిస్ట్రిక్ట్ కొండల్లోకి, వేల్స్ ప్రాంతానికి చెందిన బ్రెకన్ బీకన్స్ పర్వత శ్రేణి లోకి తీసుకు వెళ్ళేవారాయన. అలా ట్రెకింగ్ వెళ్ళివచ్చిన డాక్టర్ల కబుర్లన్నీ ఎంతో ఆసక్తితో వింటూ ఉండేవాడిని. అంతే ఆసక్తితో ఆ వివరాలు ఇతర డాక్టర్లతో పంచుకొంటూ ఉండేవాడిని. ఇరవై పాతికేళ్ళ తర్వాత నేను ఆరాధించిన డాక్టర్ రజ్దాన్ చేసిన పనినే నేనూ చేస్తానని, బృందాలు బృందాలుగా స్నేహితుల్ని ఇంగ్లండ్ కొండల్లోను, హిమాలయాల్లోనూ తిప్పి వదులుతాననీ ఆనాడు నేను ఊహించనయినా ఊహించలేదు.

సుదూరపు గిరి శిఖరాల మధ్య ఎడతెగని ట్రెక్‌లతో సాగిపోతున్నపుడు – ఆ నడక పదులకొద్దీ బృందపు సభ్యులతో సాగినా – మనతో మనం సంభాషించుకొనే అవకాశం పుష్కలంగా లభించగలదన్న విషయం నేను బాగా గమనించాను. అలా నా ఆలోచనలను గాలిపటాల్లా ఎగరనీయడం, నా జ్ఞాపకాలను నేను తీరిగ్గా నెమరువేసుకోవడం, అడపాదడపా సాటి ట్రెకర్లతోనూ గైడ్‍లూ పోర్టర్లతో కబుర్లాడటం – ఈ యావత్ ప్రక్రియలో అరుదైన ఏకాంత సౌఖ్యాన్ని అనుభవించడం, గొప్ప ఆనంద హేతువులవి. అలా ఆలోచనలూ కబుర్ల మధ్య సమయం తెలియకుండా గడిచిపోతున్నపుడు ఏదో ఒక చోట హిమాలయాల దివ్యమంగళ సౌందర్యసీమ కళ్ళముందు నిలబడి భౌతిక ప్రపంచంలోకి పట్టుబట్టి లాక్కురావడం, అది మరో బాణీ పారవశ్యానికి హేతువు అవడం కూడా నాకు నిత్యానుభవమే. ఈ భౌతిక మానసిక ప్రపంచాల మధ్య డోలాయమానం, ఆ అనుభవాలను, అనుభూతులనూ ఆవాహన చేసుకోవడం, మనసులో ఇంకించుకోవడం జరిగాక – అవన్నీ మరపురాని శాశ్వత అనుభవాలుగా ఇవన్నీ మనసులో ముద్రించుకుపోతాయి. మనం ప్రకృతిలో ఒక భాగం అన్న భావనకు ఈ అవగాహన దారి తీస్తుంది. అలా ప్రకృతికి మనల్ని మనం సమర్పించుకోగలగడం అలౌకిక సౌఖ్య హేతువు అవుతుంది. మన భౌతిక శరీరాలన్నీ ప్రకృతి జనితాలే అని, అవి ఎప్పటికీ ప్రకృతిలో భాగంగానే ఉండి తీరతాయని, మనం మనల్ని ఎంతగా స్వంతం చేసుకోవాలని ప్రయత్నించినా ఈ ‘మనం’ అనేది అనంత ప్రకృతిలో అంతర్భాగమని, ఈ మనం అనే భౌతిక ఉనికి ఏనాటికో ఒకనాటికి ప్రకృతి ఒడిలోకి తిరిగి చేరుతుందనీ – ఎరుక కలుగుతుంది. ఈ ఎరుక మనల్ని మనమే ఒక కొత్త కోణం నుంచి దర్శించుకొనేలా చేస్తుంది. మోహాలకూ ప్రలోభాలకూ దూరంగా నిలవగల శక్తిని ఇస్తుంది.

నిత్యజీవితంలో మనం చూసేదీ పాల్గొనేదీ ఎడతెగని పరుగుల ప్రక్రియలో. చేయవలసిన పనులు, వాటి గడువులు, టార్గెట్లు, ఎపాయింట్‌మెంట్లు – పరుగులే పరుగులు. ఇష్టమున్నా లేకపోయిన అలాంటి కార్యకలాపాలలోకి అడుగు పెట్టినపుడు మన సమయం మన చేతుల్లోంచి జారిపోతుంది. నిలకడగా, స్థిరంగా ఆలోచించి ముందుకు సాగే అవకాశం కోల్పోతాం. ఆ పరుగుల జీవితం లోంచి ఒక్క అడుగు అవతలకి వేసి ఇలాంటి యాత్రలకు ఉపక్రమిస్తే మనం కోల్పోతున్న మనలోని మనల్ని మళ్ళీ చేజిక్కించుకునే అవకాశం వస్తుంది. తీరిగ్గా మనలోకి తొంగిచూసుకొనే అవకాశం కలుగుతుంది. ఆలోచనలకూ వివేచనకూ ఆస్కారం లభిస్తుంది. కోల్పోయిన మనలోని మనిషి తిరిగి మనకు దక్కినట్టు అనిపిస్తుంది. అందుకే ఈ యాత్రలు నన్ను పదేపదే రా రమ్మని పిలుస్తూ ఉంటాయి…

(సశేషం)