చింత

విడిపోయిన కొప్పులాటి రాత్రిమీద
వాలుతున్న మంచు
నాలుగ్గోడల మధ్య
ఎగుడు దిగుడు శ్వాసతో
పెనవేసుకున్న మూగనోము
నా లోలోపల నైరూప్యచిత్రంలా
మగతలో ఊపిరి కూడదీసుకుంటున్న కల
ఒంటరిపాటుకి
తేనెతుట్టెను వేలాడదీసిపోతావు
కావలి కాస్తూ కాస్తూ మైమరుపులో
వాలిపోతా నీ భుజం మీద

కనికట్టులా
తెరిచిన తలుపురెక్కలు
తొలగిన మంచుతెరలు
విచ్చుకుంటున్న ఎర్రమందారం
తొడిమతెగిన చోట చిక్కుకొన్న చూపు

ఇంతే. ఇంతే.
ఏకాంత రాత్రి. ఏకాకి పగలు.
మంచు తలపు, బతుకు చింత
నెమరేస్తూ, నెమరేసుకుంటూ
నువ్వు అల్లిన వలలో
ఎరనూ నేనే గురినీ నేనే
వల పన్నిన చోట చిక్కుకొన్న చూపుతో…