భారతీయతను ఎలా నిర్వచించాలి?

ఎవరు భారతీయులు అనే ప్రశ్న ఈనాడు మళ్ళీ ముందుకు వస్తోంది. పౌరసత్వ చట్టాలు కూడా చర్చనీయాంశం అయ్యాయి. భారతీయులు అంటే హిందువులు మాత్రమే అని హిందుత్వవాదులు వాదిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అసలు మూలవాసులు నవబౌద్ధులూ బహుజనులూ ముస్లిములూ అనే వాదాలు బలహీనంగానయినా వినబడుతున్నాయి.

భారతీయులు (హిందువులు) విశ్వగురువులు అని హిందూ వాదుల వాదన. దీనికి సమాధానంగా బౌద్ధులే విశ్వగురువులు అనే వాదన ఉంది. అగ్రవర్ణాలు కానివారందరూ బౌద్ధమూలాలు కలవారు అనే వాదన దీనికి తోడయింది.

ఇదే సమయంలో విలియమ్ డాల్రింపుల్ రాసిన ది గోల్డెన్ రోడ్ (The Golden Road: How Ancient India Transformed the World) అనే పుస్తకం సంచలనం తెచ్చింది. భారత్ విశ్వగురువే అంటున్నాడు డాల్రింపుల్. అయితే ఆయన బౌద్ధ భారత్ గురించి మాట్లాడుతున్నాడా? హిందూ భారత్ గురించి మాట్లాడుతున్నాడా? లేక ఇంకా ముస్లిమ్ భారత్, శక భారత్, కుషాణ భారత్, క్రైస్తవ భారత్ కూడా ఉన్నాయా?

బ్రిటిష్‌వారి పరిపాలనే కొనసాగితే ఈ ప్రశ్న ఉండేది కాదు. బ్రిటిష్ భారత్ ఉండేది. అయితే ఇప్పుడు ఎవరు ఏ వాదన చేసినా వలస ఆలోచనే తప్ప, వీళ్ళ స్వంతమేమీ లేదు. చరిత్ర అంటే గతం కాదు, పూర్తిగా వర్తమానం. వర్తమానం గతంతో చేసే సంభాషణ కూడా కాదు చరిత్ర. వర్తమానం గతంపై చేసే వ్యాఖ్యానమే చరిత్ర.

ముస్లిమ్‌లతో ఐక్యత అంటూనే ఇజ్రాయిల్ దుందుడుకు వైఖరిని కొందరు దళిత క్రైస్తవులు కూడా సమర్థిస్తారు. నవబౌద్ధులమని చెప్పుకునే కంచె ఐలయ్య వంటివారు అమెరికా వంటి పాశ్చాత్యాలలో చివరికి ఇజ్రాయిల్లో కూడా ప్రజాస్వామ్యం ఉంది కానీ ముస్లిమ్‌ దేశాలలో అసలే ప్రజాస్వామ్యం లేదు అంటారు.

చంద్రభాను ప్రసాద్ అనే దళిత మేధావి ఆఫ్ఘన్‌పై అమెరికా దాడిని ఫెమినిస్ట్ వార్ అని ఒకప్పుడు సమర్థించారు. ఆశ్చర్యం! హిందూవాదుల ఆలోచనా ధోరణి కూడా ఈ అంతర్జాతీయ విషయాలలో వీరితో సామ్యం కలిగి ఉంటుంది. జాతి వివక్షని ఇలా చాటుగా పంచుకుంటారు అందరు. ఎందుకంటే హిందుత్వ, మూలవాసీ సిద్ధాంతం, కులనిర్మూలన వాదం, నవబౌద్ధం ఇవన్నీ వలసవాద సామ్రాజ్యవాద ప్రతిధ్వనులే.

మనం చరిత్రను అర్థం చేసుకోవడంలో ఎక్కువగా స్థానికతని ఆశ్రయిస్తాం. స్వచ్ఛమయిన స్థానికత, స్వదేశీ, మూలవాసీ ఉందని భ్రమ పడతాం. ఎందుకంటే, గ్లోబలైజేషన్ ఇటీవలది, దానిలోకి మనమింకా ప్రవేశించలేదని భావిస్తాం. కానీ భారత్ అనాదిగా గ్లోబల్. చాలా ఎక్కువగా, మొదటి నుంచీ ప్రపంచదేశాలతో అనుసంధానించబడి ఉంది భారత్. ఇదే విషయాన్ని ఒక పాశ్చాత్య రచయిత మనకి పాఠం చెప్పవలసి రావటం విచిత్రం.

ఆసక్తికరంగా ఈ వాద వివాదాలకి అతీతంగా పుస్తకం మొత్తంలో విలియమ్ డాల్రింపుల్ ఒక్క మాటలో భారత్ అంటే ఏమిటి అనేదానికి సమాధానం చెప్పాడు. భారత్ అంటే జీరో! కేవలం గణిత పరిభాషలో కాక తాత్వికంగా చెప్పాలంటే అనంతం. ఇదే విషయం నేను రాసిన పురాణవేదం పుస్తకంలో వివరించాను. సూక్ష్మస్థూలాలూ పంచభూతాలలో ఆకాశం స్థానం, అనంత పునరావృత్తితో కూడిన జన్మ పరంపరా యుగ పరంపరా వంటి భావనల ద్వారా భారతీయులు అనంతాన్ని ఆవిష్కరించిన తీరుని నేను స్పష్టం చేశాను. దీని కోసం, ఖగోళశాస్త్ర గ్రంథాలూ బౌద్ధ హిందూ సిద్ధాంత గ్రంథాలూ పురాణాలూ విపులంగా ప్రస్తావించాను.

విత్తు నుంచి చెట్టు, చెట్టు నుంచి విత్తూ వలె సూక్ష్మం నుంచి స్థూలం ఆవిర్భవించి మళ్ళీ అది సూక్ష్మంలో లయిస్తుంది. సూక్ష్మమయిన ఆకాశం నుండి మిగిలిన నాలుగు భూతాలు పుట్టటం, మళ్ళీ ఆకాశంలోనే లయం కావటం, ఇది అనంత సృష్టి ప్రక్రియ. అలాగే వివిధ యుగాలు చక్రాకృతిలో పునరావృత్తి చెందటం, సృష్టి ప్రళయాలు తిరిగి రావటం, ఇలాంటివి దర్శనములలోనే కాక పురాణ కథలలో వ్యక్తం చేయబడ్డాయి. అలాగే కార్యంలోనే కారణం ఉంటుంది. అందుకే కార్యకారణ సంబంధం అంటారు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే పాశ్చాత్య భావనలో ఇది లేదు. అందువల్లనే కార్యకారణాలు కూడా పునరావృత్తి చెందుతాయి. అందుకే సృష్టికి మొదలు లేదు సృష్టికర్తా లేడు. అంతా అనాది అనంతం.

ఏ సంఖ్యనైననూ శూన్యముతో గుణించిన శూన్యము అగును. శూన్యమును ఏ సంఖ్యతో భాగించిననూ శూన్యము వచ్చును. కానీ ఏ సంఖ్యనైననూ శూన్యముతో భాగించినచో వచ్చునది అనంతము. అనంతము నుండీ ఏదయినా పరిమిత సంఖ్యను తీసివేసిననూ కలిపిననూ దాని విలువ మారదు. ఈ అనంతము అద్వితీయమగు పరబ్రహ్మ వంటిది. బ్రహ్మ కూడా భూత సృష్టి వల్ల కానీ లయము వల్ల కానీ మారడు’ అంటాడు భాస్కరాచార్య. పూర్ణమదః పూర్ణమిదం అనే ఉపనిషత్ శ్లోకసారం కూడా ఇదే. దశాంశమానం లేనిదే, ఇండో అరబిక్ సంఖ్యలు లేనిదే ప్రపంచ నాగరికతే లేదు. ఈ విషయాన్ని అనేకసార్లు చెప్తాడు డాల్రింపుల్. చరిత్రని, విజ్ఞానాన్ని, తత్వశాస్త్రాన్ని, మతాన్ని ఈ ఆవిష్కరణలు మార్చివేసిన తీరును స్పష్టం చేస్తాడు.

అయితే ఇది బౌద్ధ ఆవిష్కరణా? హిందూ ఆవిష్కరణా? డాల్రింపుల్ బౌద్ధుల శూన్యం అనే కాన్సెప్ట్ గురించి చెప్తూనే, పౌరాణిక తాంత్రిక విశ్వాసాలని కూడా ప్రస్తావిస్తాడు. అనంతం అనే ఆలోచన వెనక హిందూ బౌద్ధ మూలాలని స్పృశిస్తాడు.

ఉపనిషత్ పూర్ణమా? బౌద్ధ శూన్యమా? ఏది జీరోకి మూలం? ఏది గణితంలో అనంతానికి ఆధారం?

పల్లెటూర్లలో కిరాణా దుకాణానికి వెళ్ళి బియ్యం ఉందా అని అడిగితే లేకపోయినా లేదు అని చెప్పడు, నిండుకుంది అని అంటాడు. చనిపోయిన వాడిని కీర్తిశేషుడు అంటారు. వెళ్తూ, ఇంక ఉంటా అని అంటాము. ఆ విధంగానే జీరోని ఒక వైపు శూన్యంగాను, మరో వైపు పూర్ణంగానూ ఏకకాలంలో పాజిటివ్‌గా నెగెటివ్‌గానూ నిర్వచిస్తున్నాము. ఇది భారతీయులలో అనాదిగా ఉంది. బౌద్ధులు, ప్రతీదీ క్షణికం కనక ఏ వస్తువుకీ అస్తిత్వం లేదని, అంతా శూన్యమనీ అన్నారు. మరో పక్క, ఆత్మ స్థలకాలాలకి చెందదు కనుక, అది ఏది కాదో చెప్పవచ్చు కానీ, అది ఏమిటో ఇదమిత్థంగా నిర్వచించలేమని అన్నారు బ్రాహ్మణులు. కనుక ఆత్మని శూన్యమని కాక పూర్ణం (అనంతం) అని వారు అంటారు. బౌద్ధుల అనాత్మ వాదం, బ్రాహ్మణుల ఆత్మ వాదం ఒక సమాన లక్షణాన్ని పంచుకుంటాయి. అది నిర్గుణం. ఆ విధంగా జీరో ఏకకాలంలో అస్తి నాస్తిల సంగమం. జీరో అంటే విలువ లేనిది కాదు, అనంతం.

నిజమే, ఈ దశాంశమానం లేనిదే, అనంతం లేనిదే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ వరకు సాగిన మానవ ప్రస్థానం లేదు. ఈ భారతీయ మౌలికవిజ్ఞానం మొదట ఆసియా అంతటా విస్తరించింది. తరువాత యూరప్‌కి వెళ్ళింది. ఈ ప్రయాణానికి సహకరించిన భాషామాధ్యమం ఏది? ప్రధానంగా సంస్కృతం కాస్మోపాలిటన్ భాషగా ఉపకరించింది. లౌకిక సంస్కృతం ఒకటవ శతాబ్దం తరువాత బలపడింది. ఆ భాష భారత్‌ని విశ్వంతో అనుసంధానం చేసింది. సంస్కృతం నుండి చైనీస్ వంటి భాషలలోకి అనువాదాలు మొదట జరిగినా, అరబిక్ పర్షియన్ భాషలలోకి అనువాదం జరిగిన తరువాత మాత్రమే యూరప్‌లోకి కూడా భారతీయ విజ్ఞానం తత్వం వ్యాప్తి చెందాయి. అదే వికాసవాద యుగానికి బీజాలు వేసింది.

గ్రీకుల ముందు మోకరిల్లే మన వామపక్ష మేధావులకి తెలియనిది ఏమిటి అంటే, అనంతాన్ని గ్రీకులు చీకటిగా భావించారు, భయపడ్డారు. అనంతంలో వస్తువులు ఏర్పడవు అని అరిస్టాటిల్ అన్నాడు. భారతీయులు మాత్రమే అనంతాన్ని పాజిటివ్‌గా చూశారు. మొదట్లో ఇటలీలో దశాంశమానాన్ని నిషేధించి, రోమన్ సంఖ్యలనే కొనసాగించారు. కానీ అది ఎక్కువ కాలం సాధ్యం కాలేదు.

అయితే భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచ విజ్ఞానంగా మార్చింది అరబ్బులు, మొఘలులే. అంటే, భారత్‌ని విశ్వగురువు స్థాయికి తీసుకువెళ్ళింది ముస్లిమ్‌లే.

ముస్లిమ్‌లకి వ్యతిరేకమయిన రాతలు రాయడం వల్ల ఈ పుస్తకం హిందూవాదుల మన్ననలు పొందిందని కొందరు భావిస్తున్నారు. డాల్రింపుల్ పదవ శతాబ్దంలో ఘజినీ మహమ్మద్ దాడి, ఆలయాల ఆరామాల విధ్వంసం గురించి ప్రస్తావించారు. నెహ్రూ ప్రభుత్వం హిందూ ముస్లిమ్‌ సమైక్యత కోసం ముస్లిమ్ దాడుల సంగతి పాఠ్యగ్రంథాల్లో చేర్చలేదని రాశారు. (నలందా విశ్వవిద్యాలయంపై బ్రాహ్మణులే దాడి చేసి ఉండవచ్చునని డి. ఎన్. ఝా అంటున్నారు. ఇది ఒక ప్రత్యేక ఉదాహరణగా కనబడుతోంది.) అయితే ఈ దాడుల అనంతరం ముస్లిములూ హిందువుల మధ్య క్రమేపీ ఏర్పడిన స్నేహపూర్వక సంబంధాలని స్పష్టం చేశారు డాల్రింపుల్. అక్బర్ సమకాలికుడయిన ఇబ్రహీమ్ అదిల్ షాహ్ పూర్తిగా హిందూ ఆచారాలని, ధర్మాన్ని అనుసరించాడు. విజయనగర రాజులు తమని తాము హిందువులలో సుల్తానులం అని ప్రకటించుకున్నారు, ముస్లిమ్‌ వేషధారణ చేశారు. మొఘలులు రామాయణ భారతాల చిత్రకళని ప్రోత్సహించారు. అంతేకాదు, ఆనాటి శాసనాలలో ఏ మాత్రం ద్వేషం లేదు.

రచయిత వి. ఎస్. నయిపాల్ బాబ్రి మసీదు విధ్వంసాన్ని హిస్టారికల్ బాలెన్సింగ్‌గా చూశాడు. అంటే చరిత్ర అనే భావన లోనే ప్రతీకారం, ద్వేషం ఉన్నాయా? హైరార్కీ, అసమానతా ఉన్నాయా?

చరిత్ర అనేది ఆబ్జెక్టివ్ పరిశోధన అనే నమ్మకం ఉంది. చరిత్ర అనేదానికి ఒక తాత్వికతని కూర్చిన వాడు జర్మన్ తత్వవేత్త హెగెల్. ఈ చారిత్రక భావన ద్వారా ఇండియన్ అనంత భావనకి హద్దులు ఏర్పరిచాడు హెగెల్. పరిణామవాదాన్ని జత చేశాడు. విశ్వచైతన్యం (స్పిరిట్) తనని తాను వివిధ దశలలో ఆవిష్కరించుకొంటూ నిమ్నస్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదుగుతుంది. దాని నుంచి వ్యక్తి చైతన్యం ఆవిష్కరించబడుతుంది. ఈ చైతన్యం ఇండియా ఆఫ్రికా లాంటి చోట్ల వెనుకబడి ఉంది. యూరప్‌లో ఉన్నత స్థాయికి చేరింది అని హెగెల్ అన్నాడు. ఈ విధంగా, అనంతంలో అంతవరకూ లేని స్థల కాల పరిమితుల్ని చరిత్ర పరమయిన హైరార్కీని హెగెల్ ప్రవేశపెట్టాడు. మానవ కేంద్రక (anthropocentric) దృష్టియే దానికి కారణం. అది యూరప్ కేంద్రక దృష్టి (Eurocentric) కూడా.

ఈ హెగెల్ వాదాన్నే మార్క్స్ భౌతికంగా అన్వయిస్తూ ‘భారత్ అచారిత్రక దశలో కదలిక లేకుండా నిలిచిపోయింది. కులవ్యవస్థ దానికి ఉదాహరణ. చారిత్రకంగా ఉన్నత దశకి చెందిన బ్రిటిష్‌వారు విముక్తి చేస్తా’రని భావించాడు. కోశాంబి, దేవీప్రసాద్ చటోపాధ్యాయ వంటి వామపక్ష మేధావులు ఈ ఆలోచనలనే జీర్ణించుకొన్నారు.

అనంతం అనే భావనలో చరిత్ర అనేది లేదు. అందుకే ఎన్ని వైవిధ్యాలు, వైరుధ్యాలూ ఘర్షణలూ ఉన్నా, వాటికి ప్రతీకారం కానీ బాలెన్సు చెయ్యడం అనే ఆలోచన కానీ ఆ రోజులలో రాలేదు. చరిత్ర అనే భావన బలపడ్డాక భారత్‌ని ఎలా చూడాలీ అనే చర్చ మొదలయింది. భారత్ వెనుకబాటుతనంలో మగ్గిపోతూ ఉన్న సమయంలో బ్రిటిష్‌వారు ఉద్ధరించారు అన్న వాదన మొదలయింది. అది భారతీయులలో ఆత్మన్యూనతను కూడా పురిగొల్పింది. ఆర్య సమాజ్ స్థాపించిన దయానంద సరస్వతి వేదకాలం లోనే ఆధునిక టెక్నాలజీ అత్యాధునిక ఆయుధాలూ సైన్సు ఉన్నాయనీ సుపీరియారిటి కాంప్లెక్స్‌తో వాదించాడు. హిందుత్వ వాదులకు ఆ వాదనే ఆధారం.

మనుషుల మధ్య జాతిపర వైరుధ్యాలూ రాగద్వేషాలూ ఎప్పుడూ ఉన్నాయి. కానీ బ్రిటిష్‌వారు వచ్చాక చరిత్ర పేరుతో వైరుధ్యాల్ని స్థిరీకరించి టెక్స్టువలైజ్ చేసి, స్వదేశీ-విదేశీ, ఆర్య-ద్రావిడ, హిందు-ముస్లిమ్… ఇలా ఏమాత్రం కలవని అస్తిత్వాలు ఉన్నాయని ధృవీకరించారు. ‘అనంత’ విశాల దృష్టిని బలహీనపరిచి సంకుచితం చేశారు. దానితో పురాణ ఇతిహాసాలని అర్థం చేసుకోడంలో కూడా మార్పు వచ్చింది. ఈ సంకుచిత చారిత్రక వలసవాద దృష్టితో వామపక్ష, బహుజన, హిందుత్వవాదులు అందరూ ప్రభావితులయ్యారు.

భారత్ ఎప్పుడూ డైనమిక్, గ్లోబల్. బ్రిటిష్‌ సామ్రాజ్యానికి ముందు విదేశీ వ్యాపారంలో అగ్రస్థానంలో ఉంది. బ్రిటిష్‌వారు వచ్చాకే భారతీయులు కళ్ళు తెరిచారు అనే వాదన కమ్యూనిస్టులలో బలంగా ఉండేది. కానీ ఇటీవల విప్లవ రచయితల సంఘం (విరసం) ప్రచురించిన భారత బడా బుర్జువా వర్గం (సునీతి కుమార్ ఘోష్) పుస్తకం చూస్తే, బ్రిటిష్‌వారి రాకకు ముందు భారత్ అనేక రంగాలలో పురోగతిలో ఉండగా, బ్రిటిష్‌వారు భారత్‌ని విధ్వంసం చేశారు అనే విషయాన్ని కమ్యూనిస్టులు కూడా పట్టించుకోక తప్పలేదు అనిపిస్తుంది.

మార్పు అనేది సహజం అని తెలుసుకోవడానికి ఇంగితజ్ఞానం చాలు. మార్పు లేని సమాజం ఎక్కడా ఉండదు. సముద్రయాన నిషేధం, కుల కట్టుబాట్లూ ధర్మశాస్త్రాలలో ఉండవచ్చు. కానీ క్రీస్తు పూర్వం నుంచీ భారతీయులు సుదీర్ఘకాలం విదేశాలకు వెళుతూ వచ్చారు. విదేశీయులను పెళ్ళి చేసుకున్నారు. కంబోడియా ప్రజలలో దక్షిణాది జాతుల జన్యుసంపర్కం ఎక్కువని డాల్రింపుల్ రాస్తాడు. అక్కడికి వెళ్ళిన బ్రాహ్మణులు కూడా, స్థానికులని పెళ్ళి చేసుకున్నారు. బ్రాహ్మణ స్త్రీలని కంబోడియా రాజులు పెళ్ళి చేసుకునేవారు.

మనుస్మృతిలో ఏడు తరాలు కలిసిపోతే బ్రాహ్మణులు శూద్రులు అవుతారు శూద్రులు బ్రాహ్మణులు అవుతారు అని ఉంది. విదేశాల నుండి వచ్చి ఇక్కడ రాజ్యాలు స్థాపించిన శకులూ కుషాణులూ మొదలయిన వారు సంస్కృత పేర్లు పెట్టుకున్నారు. వాసుదేవుడు, రుద్రదాముడు… ఇలా పేర్లు మార్చుకున్నారు. వీళ్ళు యజ్ఞాలు కూడా చేశారు. అల్ బెరూనీ ఖగోళశాస్త్రాన్ని టోలెమీ నుంచి కాదు బ్రహ్మగుప్తుడి నుంచి నేర్చుకున్నానని అన్నాడు.

చైనాలోని టావోయిజం మతస్థులు మొదట బుద్ధుడిని విదేశీయుడని వ్యతిరేకించారు కానీ తరువాత చైనీయులు బుద్ధుడిని దేవుడిగా ఆరాధించారు. అలాగే భారతీయులు కూడా చైనావారినీ ఇతర విదేశీయులనీ మ్లేచ్ఛులు అన్నప్పటికీ తరువాత వారిని కలుపుకున్నారు. అందుకే వరాహమిహిరుడు శాస్త్రజ్ఞులయిన యవనులని గౌరవించాలని అన్నాడు.

వివిధభాషలతో నిండిన భారత్‌లో సంస్కృతం ఒక అనుసంధాన భాషగా పరిణమించింది. అందుకే బౌద్ధ జైన హిందూమతాలు ఆ భాషను అభివృద్ధి చేశాయి. ఇలా ఒక కాస్మోపాలిటన్ భాషగా విస్తరించిన సంస్కృతంలో ఇతర సంస్కృతులతో కలయిక వల్ల వచ్చిన మార్పులు ప్రతిబింబించాయి. ఏడవ శతాబ్దానికి చెందిన పల్లవ రాజు మహేంద్రవర్మ రాసిన మత్త విలాస ప్రహసనంలో, శైవులు వైదిక కర్మకాండని అనుసరించే ఛాందస బ్రాహ్మణులని పరిహసించటం కనపడుతుంది. కల్లుపాకని యజ్ఞశాలతో పోలుస్తాడు. భగవదజ్జుక ప్రహసనంలో బ్రాహ్మణ సన్యాసి దేహంలో వేశ్య ఆత్మ ప్రవేశించినట్లు, దాని వల్ల స్వచ్ఛంద ప్రవర్తన వచ్చినట్లూ చూపుతాడు. గుప్తుల కాలంలో కాళిదాసు రాసిన శాకుంతలంలోని మత్స్యకారుడు తనకీ యజ్ఞంలో పశుహింసకి పాల్పడే బ్రాహ్మణుడికీ తేడా ఏమిటని ప్రశ్నిస్తాడు. వైదిక కర్మకాండను తిరస్కరించి సన్యాసం స్వీకరించిన శంకరాచార్యుడిని వైదిక బ్రాహ్మణులు వెలివేశారు, ఆయన పుస్తకాలు తగులబెట్టారు (శంకర విజయం). శంకరాచార్యుడిని ప్రతిభా భారతి అనే బ్రాహ్మణ స్త్రీ కామశాస్త్రంలో ప్రశ్నలు వేసి ఓడిస్తుంది (అంతకు చాలా కాలం ముందే కామశాస్త్రం కూడా రచించబడింది). క్రమేపీ రిచువల్ బ్రాహ్మణుల పైన మాత్రమే కాదు, బౌద్ధ సన్యాసుల పైన కూడా విమర్శ మొదలయింది. తాంత్రికం భోగాన్ని కూడా యోగంగా మార్చింది. ప్రపంచం వ్యాపారమయం అయ్యే కొద్దీ, విదేశీయానం పెరిగే కొద్దీ ఈ మార్పులు తప్పలేదు. ఆధునిక కాలంలో కూడా ఈ ఘర్షణ ఉంది. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ ఇంగ్లండులో ఆహార నియమాల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురుకొన్నారు. ఒకప్పుడు సముద్రయానం చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకునేవారు. ఇప్పుడు వీసాలు ప్రసాదించే చిలుకూరు బాలాజీ అవతరించాడు.

ఇది కొత్త కాదు. గ్రీకు కళని అనుకరిస్తూ గాంధారపద్ధతిలో బౌద్ధ విగ్రహాలు వెలిశాయి. వెయ్యి సంవత్సరాల చరిత్రలో హిందూ బౌద్ధ శిల్పాలు ఆసియా అంతటా ఎక్కడికి అక్కడ స్థానిక సంస్కృతులనీ పద్ధతులనీ స్వీకరించాయి. రామాయణ భారత కథలూ పురాణాలూ వివిధ దేశాలూ ప్రాంతాలలో స్థానిక మార్పులతో విస్తరించాయి.

అయితే భారత్‌పై ఒక ఆరోపణ ఉంది. అది వైరుధ్యాల పుట్ట. నిజమయిన మార్పు శూన్యం. వివిధ వైరుధ్యాలు సహజీవనం చేస్తాయి అనేదే ఆ విమర్శ. కోశాంబి దగ్గర నుంచి దేవీప్రసాద్ చటోపాధ్యాయ వరకు ఇదే ఆరోపణ చేస్తారు. అసలు మార్క్స్ విమర్శ కూడా అదే. భారత్‌లో విజ్ఞానమూ విశ్వాసమూ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతాయి అని దేవీప్రసాద్ చటోపాధ్యాయ ఆరోపణ. కానీ ఇది భారత్‌కు సంబంధించిన ప్రత్యేక లక్షణమేమీ కాదు. మానవ చరిత్ర అంతా అంతే, ఎక్కడయినా. కోశాంబి ఇలా అన్నాడు:

స్వయంపోషక గ్రామాల ఆవిర్భావంతో రూపొందిన హిందూమతానికి ఆ సామాజిక పునాది నుండి వచ్చిన పరిమితులు అన్నీ ఉన్నాయి. కాలాన్ని ఋతువులతో లెక్కించడం వల్ల అది కాలచక్రం అయింది. ఈ కాలచక్రాన్ని నాలుగు యుగాల ప్రాతిపదిక మీద విభజించారు. కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలలో కాలం ఉన్నత దశ నుండి హీన దశకు మారుతుంది, తిరిగి ప్రళయం వచ్చి మళ్ళీ కృతయుగం ప్రారంభం అవుతుంది. ఈ కాలచక్రానికి ఋతుచక్రానికీ పోలిక ఉంది. గ్రామంలో నివసించి కులవ్యవస్థను పటిష్ఠం చేయటం బ్రాహ్మణుని కర్తవ్యం. కులాలుగా కలుపుకున్న గణాల దేవతలూ ఆచారాలూ హిందూ మతంలో కలిసిపోయాయి. ఇంత భిన్నమయిన సంప్రదాయాలను కలుపుకోవాలంటే తార్కికతను విడిచిపెట్టాలి. రాజనీతి, ధర్మం, శాస్త్రం, శాసనం, సాహిత్యం అన్నీ పురాణాలతోనూ మూఢ విశ్వాసాలతోనూ కలిసిపోయాయి. సంకుచితమయిన మౌఢ్యం సమాజాన్ని ఆవరించింది. తార్కిక వైరుధ్యాలను నిరభ్యంతరంగా దిగమింగగల నైజం హిందూసమాజం మీద ఈనాటి దాకా నిలిచి పోయింది. కాలం సైతం కాలచక్రం అయింది. ఇది అనాది అనంతం.

దేశ కాలాలను, విశ్వాన్నీ ఇలా ‘అనంతం’గా నిర్వచించే దృష్టి ప్రపంచ నాగరికతకీ విజ్ఞానాభివృద్ధికీ మూలం. ఈ ఆవిష్కరణలకి శాస్త్ర గ్రంథాలు మాత్రమే కాదు పురాణాలూ విశ్వాసాలూ కూడా తోడ్పడ్డాయి. దీనిలో వైరుధ్యాలను కాదు, సమగ్రతని చూడాలి. ఇది వెనుకబాటు కాదు, పూర్తిగా పురోగతి. ఇలా ఋతువులూ యుగాలూ చక్రాకృతిలో ‘అనంతం’గా పునరావృతి చెందడం అనే భావన జీరో, అనంతం, అనంత విశ్వం, చివరికి భూకేంద్రక సిద్ధాంతాన్ని నిరాకరించే లాజిక్‌కి దారితీసింది. కోశాంబిగారి వెస్టర్న్ కొలోనియల్ బుద్ధి ఈ సత్యాన్ని గుర్తించడంలో విఫలమయింది. భారత దేశాన్ని గురించి కొలోనియల్ దృష్టితో ఆలోచించడం వల్ల సంస్కృత భాష గురించి ఇలా తప్పుడు ప్రతిపాదనలు చేస్తాడు కోశాంబి:

గుప్తుల కాలం నుండి సంస్కృతం ప్రజల భాష కాకపోవడమే కాక పాలక వర్గాల నిత్య జీవిత వ్యవహార భాష కూడా కాదు. సంస్కృత భాషను కాపాడింది బ్రాహ్మణులు కావడం వల్ల ఆ భాషకే పౌరోహిత్య లక్షణాలు గ్రామీణ లక్షణాలు సంక్రమించాయి. గణిత ఖగోళ శాస్త్రాల మీద సంస్కృతంలో చేసిన రచనలు కంఠస్థం చేయడం సులభమే కానీ అర్థం చేసుకోవడం కష్టం.

కోశాంబి చెప్పినట్ట్లు సంస్కృతం గ్రామీణ పురోహిత భాష కాదు. అది అంతర్జాతీయ భాషగా ప్రపంచ గమనాన్ని శాసించింది. మొదట చైనీసులోకి, తరువాత అరబిక్ పర్షియన్ భాషలలోకీ సంస్కృత సాహిత్యం, తత్వం, శాస్త్ర గ్రంధాలూ అనువాదమై యూరప్‌కు వెళ్ళి వికాసవాద యుగానికి తోడ్పడ్డాయి. డాల్రింపుల్ చెప్పింది ఇదే. కోశాంబి చరిత్ర గురించి ఇలా చెప్తాడు:

గత రెండు వేల సంవత్సరాల కాలంలో భారత ఖండంలో జరిగిన మార్పు అంతా స్వయం పోషక గ్రామాలు, భూస్వామ్యం బలపడటం మాత్రమే. బ్రిటిష్‌వారు వచ్చే వరకూ ఇదే పరిస్థితి.

ఇది కూడా పూర్తి నిజం కాదు. ప్రపంచ వేదికపై నాగరికత పురోగమనంలో విజ్ఞానశాస్త్ర పురోగమనంలో భారత్ ఈ రెండువేల సంవత్సరాల కాలంలో ఎంతో సాధించింది. వ్యాపార రంగంలో కూడా ముందుంది. దీనికి ముస్లిమ్‌లు కూడా ఎంతో సహకరించారు. పాశ్చాత్యదేశాలలో తమ మతానికి విరుద్ధమయిన భావాలు వ్యక్తం చేసినందుకు మేధావులనీ శాస్త్రవేత్తలనీ చంపుతున్న కాలంలో ఇక్కడ అక్బర్ లాంటి రాజులు సకల మతాల సమ్మేళనం కోసం వివిధ సిద్ధాంతాల మధ్య సమన్వయపూరిత చర్చ కోసం గొప్ప కృషి చేశారు. ఈ విషయాన్ని వెండీ డోనిగర్ (Wendy Doniger) కూడా రాశారు. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చటం వల్ల బ్రిటిష్‌వారు వచ్చాక మాత్రమే చరిత్ర మొదలయింది అనే భ్రమని కల్పిస్తుంది. ఇది ముస్లిమ్‌ వ్యతిరేకతకీ చివరికి హిందుత్వకీ దారితీసింది. దేవీప్రసాద్ చటోపాధ్యాయ భారతీయ విజ్ఞానశాస్త్రంలోని వైరుధ్యాల గురించి ఇలా మాట్లాడతాడు:

The first question naturally is: What really is meant by science in ancient India? The answer is suggested by the following considerations.

In ancient India, the only discipline that promises to be fully secular and contains clear potentials of the modern understanding of natural science is medicine. The other disciplines more talked of in the orthodox circles are phonetics (shiksha), grammar (vyakarana), etymology (nirukta), metrics (chandas), calendrical astronomy (jyotisa) and even geometry — the last in the restricted sense of being a part of ritual technique (kalpa). Like the ritual technique, however, all these originate in the priestly circles, as parts of their scriptural lore. The traditional word for these is vedanga — limbs of Veda or scripture. These disciplines thus bear the birthmarks of anti-secularism and face formidable difficulties in developing towards science proper. The priests are interested in super-naturalism and mystification of nature. They are therefore strongly opposed to “the simple conception of nature just as it is, without alien addition”, which, it is the basic purpose of science to work out, and on which is based “the system of behavior by which man acquires mastery of his environment”.

By contrast, medicine—in spite of its historically inevitable humble beginnings—takes already in the ancient period the momentous step from magico-religious therapeutics to rational therapeutics, i.e. in the terminology of the physicians themselves, from daiva-vyapaasraya bheshaja to yukti-vyapaasraya bheshaja.

ఆస్తికత్వం-నాస్తికత్వం భావవాదం-భౌతికవాదం మిస్టిసిజం-రియలిజం… ఇలా కంపార్ట్‌మెంటలైజేషన్ చేస్తాడు దేవీప్రసాద్ చటోపాధ్యాయ. ఇది సమగ్ర దృష్టిని కుంటుపరుస్తుంది. ఖగోళ గణిత శాస్త్రాల అభివృద్ధిలో మహాయాన బౌద్ధం, ఉపనిషత్ తత్వం, వైదిక కర్మకాండా నిర్వహించిన పాత్రని అందుకే చూడలేకపోయాడు.

ఇలా కోశాంబి, చటోపాధ్యాయ వంటి మేధావులు భారతీయతలో వైరుధ్యాలను మాత్రమే చూడటం వెనుక మార్క్స్ ప్రభావం ఉంది. మార్క్స్‌పై ఆనాటి క్రైస్తవ యూరోపియన్ వలసవాద ప్రభావం ఉంది.

ఒక వైపు ఇంద్రియ లోలత్వం మరో వైపు శరీరాన్ని హింసలపాలు చేసే సన్యాసిత్వం. లింగాన్ని పూజించే మతం అదే సమయంలో జగన్నాథ రథాన్ని కొలిచే మతం. బైరాగులూ వేశ్యలూ ఒకే దైవాన్ని కొలిచే మతం హిందూమతం. అంతే కాదు, జంతువులని పూజించడం ద్వారా ప్రకృతిపై సార్వభాముడైన మానవుడిని ప్రకృతి స్థాయికి దిగజార్చే మతం హిందూమతం అంటూ మార్క్స్ భారతీయతని వైరుధ్యమయంగా వెనుకబాటుగా చిత్రీకరించాడు. తరువాత మార్క్స్ ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. కానీ భారతీయ మేధావులలో మాత్రం మార్పు రాలేదు. భారత్, చైనా, రష్యాలను ఇంగ్లిష్ వలస ఆధిపత్యం మాత్రమే ఉద్ధరించగల అనాగరిక దేశాలుగా మొదట భావించిన మార్క్స్, వలసవాద భావజాలం నుంచి తర్వాత బయటపడ్డాడు. ఆ దేశాలలోని కమ్యూనిటేరియన్ జీవిత విధానం సమసమాజానికి దారి తీస్తుంది అని ‘లేట్ మార్క్స్’ భావించాడని అంటాడు మార్క్సిస్టు మేధావి కెవిన్ అండర్సన్.

ఏడవ శతాబ్దానికి చెందిన వూ జెటియన్ అనే చైనా రాణిని స్థానిక కన్‌ఫ్యూషియస్ ప్రత్యర్థులు రాణిగా గుర్తించటానికి నిరాకరిస్తారు (ఈ రాణి ఆస్థానం లోని వాడే నలందాలో పనిచేసిన హ్యూయన్ త్సాంగ్). కన్‌ఫ్యూషియస్ సిద్ధాంతం ప్రకారం, పురుషులు మాత్రమే పరిపాలనకి అర్హులు. అప్పుడు బౌద్ధులు బుద్ధుడే స్వయంగా తాను విమల ప్రభ అనే రాణిగా ఆయుధాన్ని ధరించి అవతరిస్తానని చెప్పాడని, ఈ రాణి స్వయంగా బుద్ధుని అవతారమనీ సమర్థన కల్పిస్తారు. ఆ రాణి పరిపాలనా కాలంలోనే చైనా భాషలోకి బౌద్ధ సాహిత్యం మాత్రమే కాదు, సంస్కృతంలోని ఖగోళశాస్త్రం, గణితం, విజ్ఞానం అనువాదం అయ్యాయి. అయితే తాంత్రిక పద్ధతులు, జ్యోతిషం ఇంకా అనేక నమ్మకాలూ సైన్సూ, గణితాలతో సహజీవనం చేశాయి. అసలు తాంత్రిక ముగ్గులలోని వృత్తాకారం నుంచే జీరో సింబల్ వచ్చింది అంటాడు డాల్రింపుల్.

విశ్వాసం విజ్ఞానం ఎప్పుడూ ఎక్కడా విడివడి లేవు. అయితే విశ్వాసాలలో మార్పు రావచ్చు. భారతీయ విశ్వాసాలలో మానవుడు కేంద్రం కాదెప్పుడూ. అనంత విశ్వంలో, ప్రకృతిలో, అనంత జీవులలో అతడు విడదీయరాని భాగం. అజంతా చిత్రకళలో పురాణ కల్పనలలో జాతక కథలలో ఇదే వాస్తవం కనపడుతుంది. క్రైస్తవ పాశ్చాత్యం దీనికి భిన్నంగా మానవుడిని కేంద్రం చేసింది. దేవుడికి ప్రతిరూపంగా మానవుడిని నిలిపింది. ఆ పాశ్చాత్య దృష్టికి పూర్తిగా భిన్నమయిన అనంతం, అనంత విశ్వం, దశాంశగణితం అనే భావనలు పాశ్చాత్య తత్త్వవిజ్ఞానాల్ని ప్రభావితం చేశాయి. ఈ విజ్ఞానం మరింత పరిశోధన ద్వారా పెరిగే కొద్దీ అనంత విశ్వంలో సృష్టికర్తా మనిషీ కూడా కరిగి మాయమైపోయారు. అయితే అప్పటికీ పాశ్చాత్యం మానవుడు, మానవ ప్రగతీ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంది.

అమెరికాలో ప్రజలు చాలా మంది కొన్ని వేల సంవత్సరాల క్రితం మాత్రమే భూమి ఆవిర్భవించింది అని నమ్ముతారనీ, భూమి బల్లపరుపుగా ఉందని విశ్వసిస్తారనీ మేధావి నోమ్ చామ్‌స్కీ (Noam Chomsky) అంటారు. అలాగే టాల్‌స్టాయ్‌ని విమర్శిస్తూ ‘అనంతంలో మానవ ప్రగతి, అభివృద్ధి, సాధ్యం కావు’ అంటారు అమెరికన్ ప్రాగ్మాటిస్టు జాన్ డూవీ (John Dewey) శిష్యుడు అంబేడ్కర్. అనంతం కాని ఫైనైట్ వరల్డ్‌లో మాత్రమే మనిషికి ప్రత్యేక స్థానం సాధ్యం. పాశ్చాత్య క్రైస్తవ భావజాలమూ అదే.

అందుకే, అనంతం అనే భావనని చరిత్ర గమనంలోకి కుదించాడు హెగెల్. దాని ఆధారంగా మానవ పురోగమనాన్ని ఊహించాడు మార్క్స్. నేటి మార్క్సిస్టు స్లవోజ్ జిజెక్ (Slavoj Žižek) బౌద్ధాన్నీ భారతీయ తత్వాన్నీ తిరస్కరిస్తూ, ఎథీయిస్ట్ క్రిస్టియానిటీ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు.

అందువల్ల విశ్వాసం విజ్ఞానం కలగలిసి నడిచేది భారత్‌లోనే కాదు, అన్ని చోట్లా అంతే. అయితే, క్రైస్తవ పాశ్చాత్యం ఒక ఆంథ్రపోసెంట్రిక్ బిలీఫ్ సిస్టమ్. ఈ వాస్తవాన్ని వామపక్ష మేధావులు కప్పిపుచ్చుతారు.

అయితే మానవుడిని కేంద్రంగా చేసుకుని తత్వాన్నీ విజ్ఞానాన్నీ రూపొందిస్తే తప్పేముంది? అది ప్రగతికి సోపానం కదా? మానవ జాతి అభివృద్ధికి ఉపకరిస్తుంది కదా? మానవులు అందరూ సమానులే అన్న భావన గొప్పది కదా? ప్రపంచానికి ఎంతో విజ్ఞానాన్ని ప్రసాదించిందని చెప్పే భారత్ కులవ్యవస్థలో మగ్గిపోతుండగా క్రైస్తవ పాశ్చాత్యం మానవుడే మహనీయుడని చాటుతోంది కదా అని అడగవచ్చు.

మనం భారత్‌ని భారతీయ సంస్కృతినీ పూర్తిగా ప్రపంచం నుంచి విడదీసి చూసే ధోరణితో ఈ ప్రశ్న అడుగుతాం. కులవ్యవస్థని మనువు మాత్రమే కాదు, బ్రిటిష్‌వారు కూడా తిరగరాశారు. క్రిమినల్ ట్రైబ్స్, మార్షల్ ట్రైబ్స్ అని కులాలని వర్గీకరించారు. జనాభా లెక్కలలో వర్ణ వ్యవస్థనీ మతాలనీ స్పష్టంగా విడదీసి వర్గీకరించారు. కులాలు కూడా అలా నిరంతరం మారుతూ వచ్చాయి. బ్రిటిష్‌వారు వాటిని డాక్యుమెంట్స్‌గా మార్చి స్థిరీకరించారు. అందువల్ల బ్రిటిష్‌వారి మానవతావాదం చాలా లొసుగులతో కూడినది.

అసలు సమస్య ఏమిటంటే పాశ్చాత్యులు మార్పుకీ పురోగతికీ చరిత్రకీ చిహ్నం అయితే, భారతీయులు తిరోగతికీ చరిత్రహీనతకీ చిహ్నం అనే క్రైస్తవ మిషనరీల ఆలోచనలని కమ్యూనిస్టుల దగ్గరనుంచీ అందరూ బలపరుస్తూ వచ్చారు. అందుకు విరుద్ధంగా అనంతం, జీరో అనే భారతీయ ఆవిష్కరణలు పాశ్చాత్య వికాసయుగానికి మూలం అనేంతవరకూ వెళుతున్నారు విలియమ్ డాల్రింపుల్.

అయితే, విచిత్రంగా భారతీయ జ్ఞానం సైన్సూ కూడా వారి కులవివక్షలో భాగం అని భావించారు వామపక్ష వాదులు. భారతీయుల అజ్ఞానం మాత్రమే కాదు, భారతీయ విజ్ఞానం కూడా వారి వివక్షపూరిత మానసిక స్థితికీ మార్పులేనితనానికి గుర్తు అని వారి ఉద్దేశ్యం.

ఎస్. జి. సర్దేశాయి అనే కమ్యూనిస్టు విలియమ్ డాల్రింపుల్ కంటే చాలాముందే భారతీయుల విజ్ఞానము యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పారు. అయితే అది బ్రాహ్మణుల, వేదాంతులలోని వివక్షాపూరిత మనస్తత్వానికీ సోమరితనానికీ దృష్టాంతంగా భావించాడు. డాల్రింపుల్ మాత్రం జగద్గురుత్వంగా భావించాడు. అంతే తేడా. ఎస్. జి. సర్దేశాయి మాటలు ఇవి:

బహుశా బ్రాహ్మణ సంప్రదాయంలో భాగంగా గణితశాస్త్రం అభివృద్ధి చెందింది. వివిధ రకాలయిన యజ్ఞవేదికలు నిర్మించడానికి, క్షేత్రగణితం అవసరమయింది. ఈ క్షేత్రగణిత సమస్యలను సాధించటంలో బ్రాహ్మణ పురోహితుల పాత్ర ఎంతా, యజ్ఞవేదికలు నిర్మించిన తాపీ మేస్త్రీల పాత్ర ఎంత అన్నది లోతుగా పరిశీలించవలసిన విషయం.

ఇతర దేశాలలో కంటే ప్రాచీన భారతంలో అంకగణితం ఎక్కువగా అభివృద్ధి చెందింది. సంఖ్యలను రాసేటప్పుడు సున్నా కూడా ఒక అంకే అన్న ఆశ్చర్యకరమయిన విషయం కనిపెట్టడం, దశాంశమానంలో స్థానాన్ని బట్టి అంకెల విలువ హెచ్చటం తగ్గటం జరుగుతుందన్న విషయాన్ని కనుక్కోవడం ప్రపంచ గణితశాస్త్రంలో విప్లవాత్మక పరిణామం. కూడికలు, తీసివేతలు, గుణకార భాగహారాలూ గణిత శాస్త్రానికి పునాది. దశాంశమానం మాత్రమే వీటిని సాధ్యమయ్యేలా చేస్తుంది. లేదంటే, చాలా చిన్న సంఖ్యలు రాయడానికి ఇతర పద్ధతులు పనికిరావచ్చునేమో. రోమన్ సంఖ్యాలిపిలో తొమ్మిదిని, డెబ్భై తొమ్మిదినీ రాసి మొదటి సంఖ్యతో రెండవ సంఖ్యని హెచ్చించటమో భాగించటమో చెయ్యటానికి ప్రయత్నిస్తే అది ఎంత కష్టమయిన పనో తెలుస్తుంది. గ్రీకులు కూడా అక్షరాలనే అంకెలకు కూడా ఉపయోగించారు. కానీ భారత దేశంలో పద్ధెనిమిది స్థానాలున్న సంఖ్యలతో కూడా ప్రాథమిక గణిత విద్యార్థులు లెక్కలు కట్టేవారు. అంకగణితంతో పాటు బీజగణితం కూడా భారతదేశంలో గణనీయంగా అభివృద్ధి చెందింది.

ఇది ఎలా సాధ్యమయింది? సూక్ష్మాతిసూక్ష్మమయిన వేదాంత సూత్ర చర్చ బ్రాహ్మణుల బుద్ధులకు పదును పెట్టింది. అమూర్త భావాలను గురించి ఆలోచించే శక్తిని ఇచ్చింది. రాశుల పరిణామాలను, వాటి పరస్పర సంబంధాలనూ అత్యంత అమూర్త పద్ధతిలో తెలియజేసే శాస్త్రం గణితం. అనంతత్వాన్ని గురించి, అత్యంత సూక్ష్మరూపంలోని పరిణామాల గురించి, గతం భవిష్యత్తుల అనంతత్వాన్ని గురించి, శూన్యానికీ అనంతానికీ ఉన్న సంబంధాన్ని గురించి, అనంతత్వం నుంచి అనంతత్వాన్ని తీసివేస్తే ఏం మిగులుతుందన్న భావాన్ని గురించి, అస్తిత్వ నాస్తిత్వాల గురించీ ఆలోచించటం వేదాంతవాదులకి ఊపిరి.

కమ్యూనిస్టు ఎస్. జి. సర్దేశాయి రాసిన ఈ మాటలకన్నా భారతీయ విజ్ఞానంలోని గొప్పతనాన్ని మరెవరూ చెప్పలేరు. ఈ విషయాన్నే డాల్రింపుల్ పునరుక్తి చేశారు. అయితే సర్దేశాయి ఈ జ్ఞానాన్నంతటినీ మొత్తంగా ఇలా తిరస్కరిస్తాడు, నిందిస్తాడు.

  1. ఇతర శాస్త్రాలతో పోల్చితే గణితశాస్త్రాన్ని అధ్యాయనం చెయ్యడానికి తక్కువ శారీరక శ్రమ చాలు. అంటే ఇది సోమరి విజ్ఞానం.
  2. గణితశాస్త్ర ఆవిష్కరణలు పాలకులకూ పాలితులకూ మధ్య ఘర్షణని సృష్టించవు. అంటే ఇది విప్లవాత్మకం కాదు.
  3. గణిత శాస్త్రాకాశంలో ఎంత విహారం చేసినా వర్ణ వ్యవస్థకి ముప్పు రాదు. అంటే ఇది కులనిర్మూలనకి పనికి రాదు.

ఈ మూడు కారణాలతో బ్రాహ్మణులు సృష్టించిన సైన్సుని కూడా వివక్షగా కులతత్వంగా తిరస్కరిస్తాడు సర్దేశాయి. పాశ్చాత్య విజ్ఞానాన్ని ఇటువంటి ప్రమాణాలతో ఎవరైనా తిరస్కరిస్తారా? ఇంక సైంటిఫిక్ ఆబ్జెక్టివిటీ అని వీళ్ళు చెప్పే మాటలకు అర్థం ఏమిటి?

అయితే, గణిత ఖగోళ విజ్ఞానాలని నేడు ఇలా అజ్ఞానంగా తిరస్కరించటం కష్టసాధ్యం. అందువల్ల నవబౌద్ధులు తెలివిగా సంస్కృత భాషలో ఏమీ లేదనీ అంతా ప్రాకృతంలోనే ఉందని అంటారు. కానీ ఆర్యభట్టు, బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యులు, అలాగే వైద్య శాస్త్రకర్తలు చరకుడు, శుశ్రుతుడూ మొదలయిన వారు సంస్కృతంలోనే రాశారు. అలాగే ఫ్రిట్స్ స్టాల్ లాంటి ఇండాలజిస్ట్లు, వైదిక కర్మకాండపై ఆధారపడి రచించబడిన శుల్బసూత్రాలలో గణితం, జామితి లాంటి శాస్త్రాలుండటాన్ని స్పష్టం చేస్తున్నారు.

నేటి సైంటిస్టులు కూడా ప్రాచీన బ్రాహ్మణులవంటి వారే. వాళ్ళు కూడా పాలకుల మీద ఆధారపడి ఉండవలసిందే. రాజుల, పాలకుల, ధనవంతుల ఆశ్రయం లేకపోతే బౌద్ధంతో సహా ఏ మతమూ ఇంతలా విస్తరించేది కాదు. పాలకుల మెప్పుని పొందనిదే అవి వృద్ధి చెందేవి కావు. నేటి సైన్సు కూడా అంతే!

మార్క్స్ భారత్‌పై బ్రిటిష్‌ దురాక్రమణ గురించి ఇలా చెప్తాడు.

“ఇండియాపై వరుసగా దండెత్తి వచ్చిన అరబ్బులూ తురుష్కులూ తార్తారులూ మొఘలులూ అనతి కాలంలోనే హిందూ దేశస్తులు అయిపోయారు. నిర్వివాదమయిన చారిత్రక నియమాన్ని అనుసరించి అనాగరికులైన విజేతలు తమ పాలితుల ఉన్నత నాగరికత చేత జయించబడ్డారు. బ్రిటిష్‌వారు ఉన్నత నాగరికత కలిగిన తొలి విజేతలు అయినందున హిందూ నాగరికత ప్రభావానికి అతీతంగా ఉండిపోయారు.”

నిజానికి భారతీయ నాగరికత ప్రభావం వలనే బ్రిటిష్‌వారు బలపడి భారత్‌ని జయించారు అని అంటాడు డాల్రింపుల్.

భారతీయ ఖగోళ గణిత విజ్ఞానాలు పాశ్చాత్యానికి వెళ్ళి ప్రాగ్మాటిక్ లక్షణాల్ని క్రమేపీ సంతరించుకున్నాయి. ఆ విజ్ఞానం పాశ్చాత్యంలో అభివృద్ధి చెంది, తిరిగి వచ్చి భారతదేశాన్నే వ్యాపారం పేరుతో ఆక్రమించింది. ఇది భారతీయులపై కేవలం భౌతిక విజయమే కాదు. భావజాల దురాక్రమణ కూడా.


రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో అమెరికాలో అణుబాంబు పరీక్ష జరిగింది. దాన్ని నిర్వహించిన శాస్త్రవేత్త ఓపెన్‌హైమర్ ఆ మహావిస్ఫోటనాన్ని చూస్తూ భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని తలుచుకున్నాడు: కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధః (Now I am become Death, the Destroyer of Worlds.)

ఇంతకీ భారతీయులు, భారతీయ బ్రాహ్మణ విజ్ఞానం చివరికి వినాశనానికి మూలమా? ఆంథ్రొపోసెంట్రిక్ యూరప్ అమెరికాలు, ఇండియా అనే కొరివితో తల గోక్కున్నాయా?

మన తెలుగు దేశంలో పుట్టి అమెరికా స్విట్జర్లండులలో పెరిగి, దేశదిమ్మరిగా జీవించిన భారతీయ తత్వవేత్త యు. జి. కృష్ణమూర్తి చెప్పినట్టుగా ‘థాట్ ఈజ్ ఫాసిస్ట్’ అంటే ‘అసలు మానవ ఆలోచనే వినాశకరమయినది’ అన్నదే సత్యమేమో!


కొన్ని ముఖ్యమయిన గ్రంథాలు:

  1. The Golden Road: How Ancient India Transformed the World – William Dalrymple. Bloomsbury Publ. 2024.
  2. ప్రాచీన భారతదేశంలో ప్రగతి సంప్రదాయవాదం – ఎస్. జి. సర్దేశాయి (అనువాదం: వల్లంపాటి వెంకట సుబ్బయ్య), విశాలాంధ్ర ప్రచురణ, 1988.
  3. ‘The US is One of the Most Fundamentalist Countries in the World’ Interview With Noam Chomsky by Meera Srinivasan, The Wire, January 31, 2016.
  4. The Evolution of Pragmatism in India: Ambedkar, Dewey, and the Rhetoric of Reconstruction – Scott R Stroud. U of Chicago Press, 2023.
  5. ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – మార్క్స్, ఎంగెల్స్ (అను: ఉప్పల లక్ష్మణరావు)
  6. ప్రాచీన భారత దేశ చరిత్ర: డి. డి. కోశాంబి పరిచయం – కె. బాలగోపాల్, హెచ్.బి.టి. 1986.
  7. భారత చరిత్ర పరిచయ వ్యాసాలు – డి. డి. కోశాంబి (అను: హెచ్చార్కె), 2008.
  8. Science and Society in Ancient India by Debiprasad Chattopadhyaya
  9. Marx at the Margins: On Nationalism, Ethnicity, and Non-Western Societies by Kevin Anderson. U of Chicago Press, 2016.
  10. Reason in Revolt: Dialectical Philosophy and Modern Science – Alan Woods and Ted Grant. Algora Publishing, 2003.
  11. Discovering the Vedas: Origins, Mantras, Rituals, Insights- Frits Staal. Penguin Global, 2009.
  12. Who Got Einstein’s Office? Eccentricity and Genius at the Institute for Advanced Study- Ed Regis. Basic Books, 1988.
రాణి శివశంకర శర్మ

రచయిత రాణి శివశంకర శర్మ గురించి: రాణి శివశంకరశర్మ 'ది లాస్ట్ బ్రాహ్మిణ్' ద్వారా తెలుగు సాహిత్య రంగంలో సంచలనం సృష్టించిన రచయిత. ఆధునిక నాగరికత, సమాజం, రాజకీయాలను భారతీయ తాత్విక దృక్కోణంతో సునిశితంగా విశ్లేషించిన ‘ది లాస్ట్ బ్రాహ్మిణ్' ఇంగ్లీషు, కన్నడ, సంస్కృతాది పలు భాషల్లోకి అనువాదమై దేశవిదేశాల్లో ఆదరణకు నోచుకుంది. 'ది లాస్ట్ బ్రాహ్మిణ్' వెలువడ్డ ఆరేళ్ల అనంతరం దానికి కొనసాగింపుగా వచ్చిన 'గ్రహాంతరవాసి' నవల ప్రచురితమైంది. రాజకీయాలు, మతం, తత్వశాస్త్రం, సాహిత్యాల గురించి మౌలికప్రశ్నలను రేకెత్తించిన 'గ్రహాంతరవాసి' కూడా ఇప్పటికే ఇంగ్లీషులోకి అనువాదమైంది. వారి మరో రచన 'అమెరికనిజం' ఆ మధ్య కన్నడంలో విడుదలై ప్రశంసలు అందుకుంది. ఆయన కథల తొలిసంపుటి ‘రోబోబుద్ధ'గా, మలిసంపుటి 'పూజారి 2040'గా ప్రచురితమయ్యాయి. ఈయన రచించిన నృత్యరూపకాలు 'హిందుత్వ', 'ధర్మోరక్షతి రక్షితః'ను కూచిపూడి కళాకారిణి స్వాతి సోమనాథ్ ప్రదర్శించడమే కాక సీడీలుగా తీసుకొచ్చారు. కాళిదాసు నాటకాన్ని నవలగా మలచిన రచన 'శకుంతల' అందరి మన్ననలు పొందింది. ...