[ఇదేమీ రెండు భాగాలలో వ్రాయగలంత సరుకు కాదు. అయినా, ఈమధ్య సినిమాల ధోరణి చూసి గొప్పగా నేనూ సీక్వెల్స్ వేశాను అని చెప్పుకోడానికే ఇలా రెండు ముక్కలు, నాలుగు చెక్కలూ చేశాను. సాహిత్యబలి-1 -2 అనో, పుష్ప-1: ది ప్రూఫ్‌రీడర్, పుష్ప-2: ది ఎడిటర్ అనో, వీటికి పేర్లూ పెడదామనుకున్నాను. కాని, నా ఫ్యాన్‌బేస్ కంటే ఆ నటుల ఫ్యాన్‌బేస్ చాలా పెద్దదని తెలిసి, మానుకున్నాను.]
రండి రండి. ఇక్కడ నేను స్మోగేట్ అనే స్మోకింగ్ గన్ టెరిటరీ (నా గన్ స్పెలింగు జి ఎ న్, లైక్ అమెరికన్ సి ఎ ఎన్) లోకి వెళుతున్నాను. ఈ స్మోగేట్లో ప్రశ్నలు, ఆలోచనలు, అనుమానాలు తప్ప ఆధారాలు ఉండవు. కార్యకారణ సంబంధం బాదరాయణం కావచ్చు. ఇది తెలిసిన సమాచారంతో తెలియని కథను పూర్తి చేయడం అన్నమాట. అంతా అయ్యేసరికి, నందమూరి సుయోధనుడు శెలవిచ్చినట్లు ‘కించిత్ మధుపానాసక్తమైన మా చిత్తభ్రమ’ కూడా కావచ్చు.
ఖదీర్బాబుగారు ఒక ఏడాది క్రితం ముందుమాటకు స్పందించిన తీరు, ఇప్పుడు వెంకట్‌గారు స్పందించిన తీరు ఒకటే అన్నాను కదూ. ఈ రెంటిలోనూ కనిపించేది వకాలత్గిరీ.
ఆ ముందుమాటలో ఖదీర్బాబుగారి గురించి కాని, వారి సాహిత్యం, వారి వ్యాసంగం, వారు నిర్వహించే కథోత్సవాలు – ఆయనకు సంబంధించిన ఏ ప్రస్తావనా లేదు. ఆయన ‘ఇప్పుడే వ్రాయడం నేర్చుకుంటున్న’ రచయితల తరఫున వకాల్తా తీసుకొని అలా స్పందించారు. మేము ‘అగ్రవర్ణ సాహిత్యమూ అణచబడినవారి సాహిత్యమూ ఒకే స్థాయిలో ఉండాలనుకుంటున్నా’మన్న అపోహ ఇందుకు కారణం కావచ్చు. సౌమ్య ‘నిమ్న, బలహీన వర్గాల నుంచి సాహిత్యం రావడమే చాలా మంచి విషయం. దానికి వీళ్ళ సర్టిఫికెట్లు…’ అని చూపించిన ప్రేమ* ఈ అపోహ వల్లే కావచ్చు. చైతన్య ‘అంతమాట ఎలా అనేయగలిగారు’ అని బాధపడడం కూడా. ఈ రకంగా ఆలోచిస్తే వారి కోపానికి ఒక కారణం కనిపించవచ్చు. చూస్తూ చూస్తూ ఖదీర్బాబుగారికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వడం కష్టం. అయినా ఈసారికి పెద్దమనసు చేసుకుంటాను. కాని, మరొక్కసారి వారి ఉత్తరం చదవండి. అందులో భాష, పదాలు, ఆరోపణలను జాగ్రత్తగా గమనించండి. (నా సమాధానం కూడా మరోసారి చదవండి, ఎలానూ ఇప్పుడు నామీద మీ టైము వేస్టు చేస్కుంటూనే ఉన్నారు కాబట్టి.) వారిలో ‘వీరు మావారు’ అనే వకాలత్ ఉంది. వారి తరఫున ఆయన ధర్మాగ్రహం తెచ్చుకున్నారు, ‘మీరెవరు?’ అంటూ.
ఏమాటకామాటే… మాధవ్! సురేశ్! అంటూ ఆయన మహమ్మద్ శంకరశాస్త్రిలా అరిచి మొదలు పెట్టిన తీరు నాకు ఇప్పటికీ చెవుల్లో రింగుమంటుంది. అప్పుడప్పుడూ ఉలికిపడి నిద్ర లేస్తుంటాను కూడా.
[*సౌమ్యగారి ఈ వ్యాఖ్య చూసి నాకు మా తాతయ్య గుర్తొచ్చాడు. ‘దూరాభారం ఎక్కడికీ పోక్కర్లేదు, ఉద్యోగాలేమీ వెలగబెట్టక్కర్లేదు. ఏదోకొంచెం పూటకింత తిని ఇలా ఇంటిపట్టున పడుంటే చాలు’ అనేవాడు తన మనవడి గురించి. అది ప్రేమ. ప్రేమ ఉండాల్సింది ఇంట్లో, బడిలో కాదు. సామాజికాభ్యుదయం, సాహిత్యపరిణితి ఇవి రెండూ ఒకటి కావు. వీటికి సంబంధం లేదు. ఈ తేడా స్పష్టం కావాలి. లోబారో హైబారో, కానీ సాహిత్యంలో ఏబారూ ఉండకూడదనటం సబబేనా? నిమ్న, బలహీన వర్గాల నుంచి సాహిత్యం రావడమే చాలా మంచి విషయం – అని ఏ ఉద్దేశ్యంతో అన్నారో నాకు స్పష్టమే. కాని, వాక్యాన్ని అపార్థం చేసుకోవడం ఎంత సులభమో – అలా అనడం కాండెసెండింగ్ అని, వారిమీద జాలిపడడం అని, మసిపూసి మారేడుకాయ చేసి సౌమ్యగారిని ఒక బ్రాహ్మణీయభావజాలిగా చూపుతూ ఉదాహరణగా ఒక ముందుమాట వ్రాసి చూపించనా?!]
అలా ఖదీర్‌గారికి ఏదో ఒక సబబైన కారణం ఉందనుకున్నా, వెంకట్‌గారికి ఆ వెసులుబాటు లేదు. ఈ ముందుమాట ఆయన గురించి కాని, ఆయన రచనలు, నవతరంగం, ఆన్వీక్షికి, చదువు ఆప్‌ల గురించి కాని (నిజానికి ఆ ఆప్ గురించి ఒక మంచిమాటే అన్నట్టు గుర్తు) ఆయన స్నేహితుల గురించి కాని, ఆయన వ్యాపారం, వ్యాసంగం గురించి కాని – అసలు వెంకట్‌గారి ప్రపంచానికి ఏ సంబంధమూ లేని వేరొక ప్రపంచపు ముందుమాట ఇది. మరి ఈయన ఎందుకు ఇలా, ఈ స్థాయిలో ఇలా స్పందించారు? వీరికి కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎలానోలా ఇవ్వచ్చా? కష్టం. ఎందుకంటే వీరి స్పందన కూడా ‘మీరెవరు?’ అనే మొదలయింది. అందువల్ల ఇది కేవలం ఆవేశం అనుకోలేను. కనిపించింది మాత్రమే జరిగివుంటుందనుకోలేను. ఈ రెండు స్పందనల తీరు, కారణాలు వేరైనా ఇంచుమించు ఒకటే. ఆమాటకొస్తే వీరి పోస్టులకు కామెంట్లు పెట్టిన ఆ అందరిదీ ఇదే ధోరణి. ‘మీరెవరు?’
[రెండు పోస్టులకూ స్పందించిన వారు ఆ కొందరే అన్నాను కదా. పాఠకుల సౌలభ్యం కోసం వీరిని అరసబ్బు (అభ్యుదయ రచయితల సహకార బృందం) అని పిలుస్తాను. దీనివల్ల వ్రాయడం, చదవడం సులభం అవుతుంది. అమరేంద్రగారి వంటి సంయమనశీలుల నుంచి వీరిని విడదీసి సంబోధించడం సాధ్యమవుతుంది.]
‘మీరెవరు’ అంటే ఏమని? మీరు పరాయివారని. అణగారిన, నిమ్న, బలహీన, మైనారిటీ వర్గాలగురించి మాకు తప్ప మీకు మాట్లాడే అర్హత లేదని. మాకు మాత్రమే వారి బాగోగుల చింత ఉందని. మా సాహిత్యం మాదే, మా ఉద్యమాలు మావే, అని. వారిగురించి, వాటిగురించి ఇంకెవ్వరూ ఆలోచించకూడదు, విమర్శించకూడదని.
ఆహ్! విమర్శ. మళ్ళీ అదే వ్యాకరణంతో మరొక్క వాక్యం అంటాను: అణగారిన, నిమ్న, దళిత, మైనారిటీ వర్గాలకు ‘చెందినంత మాత్రాన’ వారు విమర్శకు అతీతులు కారు.
‘మీరెవరు?’ ఈ ప్రశ్నలో వినిపించేది అఘాయిత్యం. ఇది కేవలం తమకు గుత్తాధిపత్యం ఉందనుకుంటున్న వాటిపై వేరొకరి అభిప్రాయం, చొరబాటు సహించలేని ఉడుకుమోతుతనం. పోయిన ఏడాది ఒక కథ విషయంలో కాషాయవాదులు ఈమాట మీద, ఆ రచయిత మీద దాడి చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది. ఆ దాడి తరువాత, ఈమాట పద్ధతులు వివరిస్తూ ఈమాట రామాయణంలో ఇలా అన్నాను.
సోషల్ మీడియాలో వచ్చిన అభిప్రాయాలు(?) రెండు రకాలు. మొదటి రకం: బూతులు, తిట్లు, బెదిరింపులతో తమ స్పందన తెలియచేసినవారు… ఎవరో ఎక్కడో ఒక రాయి విసిరిన అలికిడి వినవస్తుంది. వెంటనే లేచి అరవడం మొదలుపెడతారు. కాసేపటికి చల్లబడి, ఇంకో రాయి విసిరిన చప్పుడు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీరి అస్తిత్వానికి మతమో, వాదమో, దేశమో, దైవమో, సినీనటులు, రాజకీయ నాయకుల పట్ల వీరాభిమానమో – ఏదో ఒక ఊతం కావాలి. వీరికి ధైర్యం మందిబలం ఇస్తుంది, సోషల్ మీడియా ఇస్తోంది.
(ఒక రెండు రోజుల తరువాత మళ్ళీ ఫేస్బుక్ తెరిచాను. నిజంగానే ఔరా అనిపించింది. వెంకట్ రాయి విసిరారు. అరసబ్బులు ఉలిక్కిపడి లేచి తలా ఒక అరుపు అరిచారు. వెంటనే చల్లబడి ఎవరి పనిలో వారు పడ్డారు$.)
ఆ కథ పట్ల భక్తుల ప్రతిచర్యకు, ఈ ముందుమాటల పట్ల వీరి స్పందనకు, ఎంత దగ్గరి పోలికలున్నాయో నేను చెప్పక్కర్లేదు. స్వభావరీత్యా భారతదేశంలో అరుణం, కాషాయం ఒకే రంగులోని రెండు చాయలు మాత్రమే. ఎలా అయితే మతదురహంకారులకు – పెద్దపెద్ద బొట్లు పెట్టుకుంటాం, జై శ్రీరాం అని అరుస్తాం, కాషాయం కట్టుకుంటాం, ప్రతినిమిషం ఇక్కడ ముస్లిముల మీద పడి ఏడుస్తాం, మమ్మల్ని ఎవరేమన్నా అంటే దేశద్రోహి, పాకిస్తాన్ తొత్తు అని గొంతెత్తి అఘాయిత్యంగా అరుస్తాం – ఒక ప్రవర్తన నియమావళి ఉందో, అంత తీవ్రంగా కాకపోయినా అభ్యుదయ, సామ్యవాదులకూ ఇంచుమించు అలాంటి నియమావళే ఉంది. విమర్శ నిజమని, సబబని ఇరువురూ కూడా చస్తే ఒప్పుకోరు. ట్రిగర్ వర్డ్స్ వినగానే నీజెర్క్ రియాక్షన్ వస్తుంది. వ్యక్తినింద ద్వారా విమర్శకు విలువ లేకుండా చేయడం ఇరుపక్షాలలోనూ కనిపిస్తుంది.
ఒకసారి ఇంకో ముందుమాట సందర్భంలో ఇలానే ఫేస్బుక్లో ఆరోపణలు వచ్చినప్పుడు అమరేంద్రగారు ఒక కామెంట్ పెట్టినట్టు గుర్తు. “గుడిపాటి వెంకట్ చెప్తున్నదే మాధవ్ కూడా చెపుతున్నాడు. అక్కడలేని అభ్యంతరం ఇక్కడ ఎందుకు?” అని. వారికి ఎవరైనా సమాధానం ఇచ్చారో లేదో తెలియదు. ఇది ఒక ఆధారోదాహరణ. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ మెసేజ్ ముఖ్యం కాదు. మెసెంజర్ ఎవరూ అన్నది ముఖ్యం.
సామ్యవాదుల్లో, అభ్యుదయవాదులైన సామాజిక కార్యకర్తలలో అగ్రవర్ణ దురహంకారాన్ని, వివక్షను ఎదురించి ప్రాణాలు సైతం అర్పించినవారు ఎందరో ఉన్నారు, ఉండబోతున్నారు. ఈ టెరిటరీలో, ఆ మంచివారి గురించి మనకు అనవసరం. మనం మాట్లాడుకుంటున్నది ముందుమాటలో ప్రస్తావించిన కుహనా అభ్యుదయవాదుల గురించి. (కుహనా అంటే ఒక వాదాన్ని, ఒక ఉద్యమాన్ని తమ స్వార్థానికి వాడుకునేవారు అని. స్వామికార్యం-స్వకార్యం రెండూ చూసుకోవాలనే లౌక్యం తెలిసినవారు అని. సరేనా?)
ఎలా అయితే వారి జీవన అస్తిత్వానికి మతమో, దేశమో, సినిమా నటులో ఊతమో, వీరి అస్తిత్వానికి ఈ అభ్యుదయవాదం అలా ఒక ఊతం. అందుకే వీళ్ళు కాలంతో మారరు. ఇది ఆవేదన నుంచి నిజాయితీగా పుట్టిన ఆవేశం కాదు. అలా ఆవేశించడం సమాజంలో వారి ఉనికికి కేవలం ఒక అవసరం. రాజకీయనాయకులు ప్రజల పట్ల చూపించే ప్రేమ లాంటిదే ఇది. వకాలత్గిరీ అంటే ఇదే. రాముడు వచ్చి తనను రక్షించమని భక్తులకు చెప్పాడా? లేదు. వాళ్ళే తీసుకున్నారు వారి ఊతం కోసం ఆ బాధ్యతను. ఒక వర్గంవైపు నిలబడి ప్రశ్నించడానికి ఎవరి అంగీకారమూ, అనుమతీ అక్కర్లేదు. ప్రో బోనో అని ఒకటుంది – ఆమాత్రం తెలుసు నాకు.
ఇప్పుడు మీకొక నిజం చెప్తాను. అనంతు, సత్యప్రసాద్, అపర్ణ, చైతన్య, సౌమ్య – వంటి సామాజిక చైతన్యం ఉన్నవారు… మాటవరసకు అందరూ అగ్రవర్ణాలు (ప్రతీసారీ బ్రాహ్మణులే అని ఏమనుకుంటాం, ఉద్దేశ్యం అదే అయినా) అనుకుందాం. పేర్లనుబట్టి వీరు మెజారిటీకి చెందినవారు (కాకపోయినా తేడా రాదు). వీరు జీవితమంతా మతదురహంకారానికి, సామాజికవివక్షకూ ఎదురొడ్డి పోరాడుతూనే ఉన్నారనుకుందాం. అలాంటి వీరు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చిన్న విమర్శ ఏ వాదంకోసం పోరాడుతున్నారో ఆవాదంపైనే చేశారనుకుందాం, అంతే. ఇంకేమీ అనక్కర్లేదు. ఒకప్పటిలా కాదు ఇప్పుడు. వెంటనే ‘ఎన్ని ఆశయాలు వల్లించినా, ఎంత ఆదర్శాలు వలకబోసినా ___లో దాగివున్న అగ్రవర్ణ భావజాలం ఇలా ఇప్పుడు పడగ విప్పి విషం చిమ్ముతోంది’ అని ముద్ర వేసి సదరు వాదులే వీరిని తక్షణం కేన్సిల్ చేసేస్తారు. అంటే ఎంత జీవితాన్ని ధారపోసినా ఏదో ఒక కారణం ఎప్పుడూ ఉంటుంది ఒకరిని పరాయివారని వేలెత్తి చూపడానికి. ఆ వేలు ఎప్పుడూ వేరేవారినే చూపిస్తుంటుంది.
ఇంకో నిజం చెప్తాను. అప్పుడు ఖదీర్‌గారికి నేనిచ్చిన జవాబుకు నాకు చాలా ‘లైకు’లొచ్చాయి. అవన్నీ నా గొప్పతనం మెచ్చి వచ్చాయనుకుంటున్నారా? ఇంత అమాయకులేంటండీ మీరు! అందులో సగం నేనేమన్నానో కూడా చదవలేదు. ఖదీర్ అంటే పడకపోవటం వల్ల నాకు నీజెర్కు వత్తాసు పలికారు, అంతే.
ఇప్పుడు ఎవరికీ విమర్శ అవసరం లేదు, విధేయత తప్ప. మీరు మైనారిటీ ఐనా, దళితులు అయినా సరే. మీనుంచి ఒక్క విమర్శ రాగానే మీవారికే మీరు _తోలు కప్పుకున్న_ అయిపోతారు. అంటే ఏమిటంటే, ఎంత ఆదర్శం, ఎంత అభ్యుదయం మీలో ఉన్నా, ఆట అధికారిక నియమాల ప్రకారమే ఆడాలి. అంతవరకే మీ గుర్తింపు అక్కడ. ఏం జరిగిందో తెలియదు కాని, ఈ ఆత్మవిమర్శ గురించే ఏదో అడగబోయి మొన్నీమధ్యే పూడూరి రాజిరెడ్డి ఇలానే కేన్సిల్ కాబడ్డారని విన్నాను. ఇంకాసేపట్లో నేనూ కాబోతున్నాను. వెల్చేరు నారాయణరావు పట్ల కొన్ని దశాబ్దాలపాటు అ.సా. సాహిత్యకారులు మౌనం ఎందుకు పాటించారో తెలుసా మీకు (మార్చ్ 2021 ముందుమాట)? ఆత్మవిమర్శ చేసుకోని వ్యక్తులనుంచి, ఆత్మవిమర్శకు చోటులేని సమాజాలు, ఉద్యమాలనుంచి వచ్చే ఫలితాలు ఇలానే ఉంటాయి, ఉన్నాయి, ఉండబోతున్నాయి. ప్రశ్న ఎంత సబబు, విమర్శ ఎంత సమంజసం అనే ఆలోచన మాత్రం ఎవరికీ ఉండదు. ఆత్మవిమర్శ చేసుకోని, చేసుకోలేని ఏవాదమైనా, ఏ ఉద్యమమైనా కేవలం ఒక మతం. ఈమాట రామాయణం వ్యాసంలో నేనన్నది ఇదే:
మనలో పేరుకొని పోయిన ఈ న్యూనత మనల్ని భిన్నదృక్కోణాలను చూడనివ్వదు. ఇతరుల ఉద్దేశ్యాలకు గౌరవం ఇవ్వనివ్వదు. వారి ప్రతి మాటా వక్రంగా వినపడుతుంది. వారి ప్రతి చర్య వెనుక ఏదో గూడుపుఠాణీ కనపడుతుంది… ఆత్మవిశ్వాసం లేని ఎవరైనా తమ నమ్మకాలపై ఏ కొద్దిపాటి హాస్యాన్నయినా విమర్శనయినా ఎంతమాత్రమూ సహించలేరు…
ఈ అభ్యుదయవాదుల ఆదర్శం సమసమాజం కాదు. తమసమాజం.
ఈమాట అంటే ఎందుకు…?
బద్ధకపు రచయితలు వాడే ట్రోప్ వాడతాను – పడక్కుర్చీలో వాలి కళ్ళు మూసుకోండి. గతం మీ కళ్ళముందు కదలాడసాగిస్తాను. ముఖ్యంగా ఈ తరం వారికి. ఆవో బచ్ఛో తుమ్హే సునావూ ఐసీ ఏక్ కహానీ!
ఎక్ థా గాఁవ్ జహాఁకా… అనగా అనగా, అప్పటి సమ్యుక్తాంధ్రప్రదేశంలో సామ్యవాదపెద్దలు కొందరు ఉండేవారు. వారు సాహిత్యాన్ని వారి స్వంత ఆస్తిగా, హక్కుగా భావించేవారు. వారు సమాజంలో మెజారిటీ కానివారందరికీ పెద్దదిక్కు, వకాలత్గిరిబాబులు. సాహిత్యం ఎలా నడచుకోవాలో కఠినంగా నిర్వచించి, ఎంతో నియమనిష్ఠలతో తనని కాపాడుతుండేవారు. భక్తిశ్రద్ధలతో వారు చెప్పినట్లు నడుచుకోవడమే సాహిత్యసతీమణికి ఉన్న ఏకైక పాతివ్రత్యధర్మం. ఇంటిబైట అడుగు పెట్టడం, పదిమందితో స్నేహం చేయడం నేరం. ఎలానో ఆడవారు కొందరు సాహసించి ఆమెతో కొన్ని కథలు చెప్పించారు, చెప్పించుకున్నారు. వెంటనే ఈ పెద్దలు వారిని వంటింటి రచయిత్రులని, గయ్యాళిగంపలనీ దీవించి, సాహిత్యానికి చెడు తిరుగుళ్ళు తిరగవద్దని వార్నింగిచ్చారు. అంతా సజావుగా ఉంది అనుకునే లోపలే శంకరాభరణం అని ఒక సినిమా వచ్చి వీరికి ఉన్న కాస్త నిద్ర కూడా లేకుండా చేసింది (అది ‘ముక్కిపోయి ఎవరూ చూడని’ సినిమా అయివుంటే ఏ ఇబ్బందీ ఉండేది కాదు). కొందరు పోకిరి మగవాళ్ళు ఆమెతో సావాసం చేయడం, అది ఊరందరికీ వినోదాన్నివ్వడం వారి కంటపడింది. నువ్వు క్షుద్రసాహిత్యానివి, ప్రగతినిరోధకసాహిత్యానివి, మాకు తలవంపులు తెస్తున్నావని వారు మళ్ళీ కోపం తెచ్చుకున్నారు. ఏది పాప్యులర్ అయినా సమాజం నాశనమైపోతోందని అరిచే ఆ పెద్దలు రానురానూ డానల్డ్ (అదే, డొనాల్డు) ట్రంపల్లే మాట్లాడ్డం మొదలు పెట్టారు, అప్పటికి ఆయనెవరో మనకెవరికీ తెలియకపోయినా.
కాలక్రమేణా ఊరు మారిపోయింది. టీవీలు నిద్రపోడం మానేశాయి. వారపత్రికలు మూలపడ్డాయి. ప్రభుత్వాలు దేశాలను ప్రైవేటు కంపెనీలలాగా నడిపాయి. ప్రాఫిట్ మోటివ్ ప్రజాస్వామ్యం వోగ్ లోకి వచ్చింది. పబ్లిక్ కాలేజీలు మరుగున పడ్డాయి. హ్యుమానిటీస్, సోషల్ స్టడీస్‌కు విలువ పూర్తిగా పోయింది. అభ్యుదయానికి, ముందుతరం నాయకులను తయారుచేయడానికి ఆలయాలయిన కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కాస్తా పిల్లలను మరమనుషులుగా తయారుచేసే కర్మాగారాలయాయి. వేసవి సెలవలలో వేసట మాత్రమే మిగిలింది కిండర్ గార్టెన్ పిల్లలకు కూడా. బిట్ బ్యాంకులొక్కటే చదవదగిన/వలసిన సాహిత్యం. డబ్బు ఒక్కటే ఆశయం ఆదర్శం గమ్యం. రచయితలు కొందరు ప్రవచయితలయారు. ఈ వాతావరణంలో, ఉండీ లేనట్టు, లేకుండీ ఉన్నట్లు సాహిత్యం అలా మిగిలిపోయింది.
ఇదిలా ఉండగా, స్వీయకృతాపరాధమైన వై2కె అభాసోత్పాతంవల్ల అవెర్రికాకు మళ్ళీ తలుపులు బార్లా తెరవక తప్పలేదు. హెచ్1బివేట అన్న ఆట మనవాళ్ళకు ఆటపట్టయింది. తెలుగునాటనుంచి ఒక మహాప్రవాహం మొదలయింది (ఇప్పటికీ సాగుతోంది). ఆకాశాత్ పతితం తోయం యథాగచ్ఛంతి సాగరం – అలా అన్ని చదువులు కేవలం ఐ.టి. ఉద్యోగాలలోకి ప్రవహించాయి. సాహిత్యం లాగానే ఐ.టి. కూడా. మీకు ఏ కనీసార్హతా అక్కర్లేదు. అమెరికా మొత్తంలో ఉన్నన్ని విశ్వవిద్యాలయాలు కేవలం కుకట్‌పల్లిలో (ఆమీర్‌పేట్? హూ గేవ్ ఏన్ ఎఫ్!) ఒక వీధిలోనే ఉండేవంటే, రోజుకు వేలసంఖ్యలో ఉన్నతవిద్యాపట్టభద్రులు ఆ ఆలయాలనుంచి వెలువడేవారంటే అతిశయోక్తి కాదు. ‘అడ్డదారులెన్నయినా తొక్కు, అమెరికాలో ఐటీ ఉద్యోగం పట్టు!’ ఇదే ఆ కాలపు ఆబాలగోపాలవయోజనవృద్ధులందరికీ యుద్ధనినాదం, జీవితాదర్శం. అలా అమెరికా చేరిన నవతెలుగుసమాజం, ముందుతరాలు పడకగదిలోనో, పూజగదిలోనో దాచుకున్న తెలుగు సాంస్కృతిక చిహ్నాన్ని – కులం, రాజకీయం, చలనచిత్రం, అనే మూడు తలల సింహాన్ని – బోనాల వలె తలపై ధరించి వీధిమార్గం పట్టింది. (సింహపు నాలుగవ తల కూడా ఉందని, దాని పేరు బిరియాని అని తరువాతెప్పుడో కానీ తెలిసిరాలేదు.) అమెరికాలో అలా తెలుగు సాంస్కృతిక వెలుగు తీరంనుంచి తీరానికి వ్యాపించింది. తెలుగువాడు ఎక్కడున్నా తెలుగువాడే అని కొందరు తొడలు కొట్టుకున్నారు. కొందరు మెడలు పట్టుకున్నారు. ఇంకొందరు తలలు తట్టుకున్నారు. మరికొందరు తలలు సిగ్గుతో ఎక్కడో పెట్టుకున్నారు. ఏ తలలు ఎక్కడున్నాయో ఆ తలలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. అలా అమెరికా రెండవ తెలుగు రాష్ట్రమయింది. ఇప్పుడు చీలితే నాలుగవది రావచ్చు. అ.తె.వారి కథలు అనంతం! వీళ్ళు డయాస్పోరులు కారు. కేవలం డాండెలియన్ స్పోరులు. (అయ్యో, అయ్యో. చూసుకోకుండా చాలా చాలా ముందుకొచ్చాను. పీఛే ముఢ్.)
అదలా ఉండబోతుండగా, ‘97లో, అగ్రఉగ్రసామ్రాజ్యవాదాగ్రం నుంచి ఒక ప్రకటన వెలువడింది: ‘తానా నవలల పోటీ – ప్రథమ బహుమతి లక్ష రూపాయలు!’ సామ్యవాద తెలుగు సమాజం ఉలిక్కిపడింది (అప్పటికే ఈ ఉలికిపాటు మూర్ఛరోగమేమో అనుకునేంత తరచుగా రాసాగింది). మా ముందుతరం ప్రవాసి అయిన వేలూరిగారు (ఈయన సామ్యవాది నియో-మార్క్సిస్టు వెరైటీ అని వదంతి) ‘అయ్యబాబోయ్! లక్ష రూపాయలే‘ అని వ్యాసోచించారు. తెలుగునాట కలకలం రేగింది. ‘సాహిత్యంపై డాలర్ కబ్జా!’ ‘రచయితల ఆకలిని కబళిస్తున్న సామ్రాజ్యాంధ్ర దురహంకారం’ – అచటివారు ఎచటివారు ఇటువచ్చిన తెలుగువారు… అంటూ పత్రికలలో ఇచటివారు ఆవేశాక్రోశాలతో వచించారు. ఎవరితోనూ చెడకూడదనుకునే కొందరు తెలుగమెరికన్ అపాలజిస్టులు మనం మనం ఎడం ఎడం, కుడి ఎవరూ లేరిక్కడ అని వీరికి సర్దిచెప్పబోయారు. కానీ వీరు వినలేదు. ఆ పోటీ బహుమతి మొదట రేగడి విత్తులు అనే ఒక నవలకు వచ్చింది. తెలంగాణా సాహిత్యకారులకు ఆ ‘వలసవాద’ నవలకు బహుమతి ఇవ్వడం కళ్ళల్లో రేగడిమట్టి కొట్టింది. ఆపైన చుక్కలన్నీ తీసేస్తే, ఒక వెదురు పొదను మిగిల్చి కథ సైజులో మిగిలే త…ప…న…కు ఆ ప్రైజు వచ్చింది. ఇది సంస్కారవంతులు కొందరికి కోపం తెప్పించింది. ఇలా గడప దాటిన సాహిత్యం అమెరికన్ వీసాకు అప్లయ్ చేసుకుంది పొలిటికల్ అసైలమ్ కాటగిరీలో. (ఇప్పుడు డ్యూయల్ సిటిజెన్షిప్ ఉంది తనకు.)
ఇదిలా ఉంటూండగా, అమెరికాలో 9/11 సంభవించింది. వెంటనే తెలుగునాట కొందరు సామ్యవాద కౌస్ ఆ దినం వారింట దీపావళి పర్వదినం అన్నంతగా సంబరాలు చేసుకున్నారు. ‘కాగితం పులి కళ్ళల్లో భయం’ అని కొన్ని కవితలను రాసచ్చేసీపారేశార్. బిన్‌లాదెన్ మహనీయుడికి రక్తాశ్రువులతో అంకితం ఇచ్చీపడేశార్, అపరిచితుడు సినిమాలో పాట లాగా. ఇది చూసి, ఒళ్ళు మండిన మళ్ళీ వేలూరిగారే (ఈయన కొంతకాలం ఈమాట సంపాదకుడు, ఇది వదంతి కాదు) వీరిని 35మార్కుల కమ్యూనిస్టులని వ్యాసేకేశారు. ఒక ఖండాంతర యుద్ధం మొదలయింది. సోషల్ మీడియా లేని, వెబ్ ఇప్పటంత కాని చీకటియుగం కావడంతో స్పందనలు, ప్రతిస్పందనలు పత్రికాముఖంగా నడిచాయి. పాపం వారూ వీరూ కూడా తమ వాదనలను పత్రికామర్యాదకు భంగం వాటిల్లకుండా వ్రాస్తూ ఉండేవారంటే మీరు నమ్మరు. సామ్యవాదుల తాలూకు అఘాయిత్యం ఉండేది కాని, ఇప్పటి ఇతరవాద, ప్రత్యేకించి మతవాద గొంతులతో పోల్చుకుంటే అదేమంత లెక్కలోకి రాదు. ఇలా అమెరికా వీరికి శత్రువు కావడంతో ఇరాక్ మీద అమెరికా యుద్ధం ప్రకటించినప్పుడు (స్టుపిడ్ చిన్న బుష్!) వీరు కొందరు సద్దామును ప్రేమించారు, అమెరికాను శపించారు. ‘మీరే మీరే సద్దామూ, మా దేవుడు మీరే సద్దామూ’ అని ఆ మానవీయనియంతను వేనోళ్ళ కీర్తించారు. ఎస్. వి. క్రిష్ణారెడ్డి సినిమాలో హీరో వెనుక ఎక్స్ట్రాలవోలె తెర ఒక సగభాగంలోనే నృత్యించారు, శత్రువుకు శత్రువు మిత్రుడనే భ్రమతో (విశ్వాసంతో? నమ్మకంతో? నిర్ణయంతో? నిశ్చయంతో?). మళ్ళీ కొందరి తలలు ఎక్కడనో పెట్టుకోబడ్డాయి. ముందూ వెనుకలుగా ఇదీ చరిత్ర.
అదలా ఉండగా, అప్పటినుంచీ ఆ తరపు ఉమ్మడికుటుంబ సామ్యవాదులకు, వారి వారసత్వపు తె.తె.వారికీ అమెరికా మీది కోపం అ.తె.వారి మీదకూ మళ్ళి, తమ స్వంతమనుకున్న సాహిత్యం ఇలా సామ్రాజ్యవాద డాలర్ నియంతల చేతిలో కబ్జా అయిపోవడం పట్ల ఏర్పడ్డ కినుక, అసంతృప్తి, న్యూనత (ఈ పదం ముందు వాడిన ఒక సందర్భం గుర్తుందా?) నివురు కప్పిన నిప్పుల్లా కణకణలాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ పెద్దరికం లేదు. సామ్యవాదులమీద నమ్మకం పోయిన స్త్రీలు, నిమ్నవర్గాలు, మైనారిటీలు ఎవరి అస్తిత్వం కోసం వారి ఉద్యమాలు వారు ఎంచుకున్నారు, అలా వారు శాటిలైట్ సామ్యవాదులయారు. సామ్యవాదమతగ్రంథాన్ని కాదనలేక, సమాజంలో మార్పులు అంగీకరించలేక ఆ తరం సామ్యవాదులు అలా మిగిలిపోయేరు, ఆ పాతరోజులు తిరిగి వస్తాయన్న ఆశతో దిగంతాలవైపుకు చూస్తూ. ఇప్పుడున్న అభ్యుదయవాదులలో ఆ పాతవాసనలు ఇంకా మిగిలివుండటంతో అమెరికామీద సహజాతంగా ఉన్న ద్వేషం కొంత అలానే ఉండిపోయింది, ఇచ్చిపుచ్చుకోవడాలు ఎంత పెరిగినా కూడా. అదే సంప్రదాయం ఇప్పుడు నిమ్న/దళిత/అణగారిన వర్గాల కొమ్ముకాస్తున్న అభ్యుదయవాదులూ కొనసాగిస్తున్నారు. అమెరికా మీద ఆ ద్వేషం ఇప్పటికీ, అమెరికానుంచి ఎవరు ఏమన్నా వారి స్పందనలలో బయటపడుతూ ఉంటుంది. (నిజంగా కాకున్నా తూచ్ తూచ్ అని లోపల చెప్పుకుంటారు కదా.) వీరంతా ఇలా కండిషన్డ్ పీపుల్స్ లాగా శత్రువు శత్రువు మనకు మిత్రుడు, ఇద్దరూ శత్రువులే అయితే మౌనం పాటించాలి వంటి నియమావళినే ఇప్పటికీ పాటిస్తున్నారు. ఎవరికీ దేనిగురించీ పూర్తి స్పష్టత లేదు. పంచతంత్రాన్ని ఈమాట ముందుమాటలా పైపైనే చదివినవారి తంత్రాలు ఇలానే ఉంటాయి.
ఇదీ ఫ్లాష్‌బాక్. పిల్లలూ! ఇప్పుడు అర్థమయిందా, ఇలా కాలం చెల్లిన ఒక చరిత్ర ఉందని, ఆ పాత బ్యాగేజీ ఈమాట భుజాలమీదనే ఇప్పటికీ ఒద్దన్నా బలవంతంగా ఉంచబడుతోందని. ఇలా వాడుకోబడుతోందని! ఎందుకు ఇంకా అరలు, అరసబ్బులు, అరసబ్బు నాయకులు కొందరు ఆ రోజులనే పట్టుకువేలాడుతున్నారో? వారి స్పందనలలో కొన్ని పడికట్టు పదాలు కనిపిస్తూ ఉంటాయో? వారిలో ఇంకా ఆ కోపం అలాగే రగులుతోందో? ఇప్పుడు నేను “ఇది అచ్చం క్షత్రియపుత్రుడు సినిమాలో లానే” అంటాను. మీరు ముక్తకంఠంతో “అవును మాధవ్సార్! మీరు అచ్చం కమల్‌హసన్ లానే” అనాలి, సరేనా?
[అయితే ఈ సాహిత్యపుత్రుడి కథలో నేను ప్రస్తావించిన కొందరు ఇముడుతారు. మరికొందరు ఆ కాలపు సామ్యవాదులు ఇముడుతారు. ఎంతోకొంతగా మరికొందరు *.వాదులూ ఇముడుతారు. ఈ కథలో ఎక్కడా ఇమడనిది వెంకట్‌గారు. ఈ చరిత్రలో వారు భాగం కారు. వారూ, నాలానే, విదేశాలకు వెళ్ళారు. అక్కడ చదువుకున్నారు. కార్పొరేట్ ఉద్యోగాలతో అలసిపోయి తమ అభిరుచుల వ్యాసంగంలో గడపడానికి, నాలా కాదు, ఇండియా వచ్చారు. చెప్పానుగా వారి పట్ల నా అభిప్రాయం వేరేగా ఉందని. ఇప్పుడు ఖదీర్బాబుగారు ఎందుకలా ఆవేశపడ్డారో అర్థం అవచ్చేమో కాని, వెంకట్‌గారు ఇప్పుడిలా ఎందుకు ఆవేశపడ్డారో ఇంకా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. వారి నింద కేమ్ వే ఔట్ ఆఫ్ లెఫ్ట్ ఫీల్డ్. ఇలా ఎందుకు, ఇలా ఎలా? ఎవరిదగ్గరయినా యండమూరిగారి కాంటాక్ట్ ఇన్ఫో ఉందా? అడుగుతాను, ఆయన ఒక నవల వ్రాయగలరేమో ఈ మిస్టరీని ఛేదిస్తూ (యెస్, యెస్. హి విల్ బి పెయ్డ్ హాండ్సమ్లీ!) కాని, వారి ఇగోని అందుకోగలనో లేదో తెలియదు, మేమిద్దరం ఒకటే హైటు అయినాకూడా.]
ఏ సమాజంలో అయినా ఒకే మతానికి, భాషకి, సంస్కృతికీ చెందిన అత్యధికులు – మెజారిటీ ప్రజలు, ఉంటారు. వారి బాధ్యత, కర్తవ్యం వారికి భిన్నమైన ప్రజలకు – మైనారిటీలకు, భద్రతనివ్వడం. అంటే, తుపాకీ పట్టుకొని పహారా కాయమని కాదు. మైనారిటీ ప్రజలలో ఏ రకమైన అభద్రతాభావం కలగకుండా చూసుకోవడం. వారికి తమతో సమానంగా స్వేచ్ఛ, అవకాశాలు ఇవ్వడం. వారిపట్ల వివక్ష లేకుండా ప్రవర్తించడం. వ్యవస్థీకృత వివక్షను గమనించి, గుర్తించి ప్రక్షాళించడం. ఇది సామాజిక, సామూహికస్థాయిలో వర్తించే బాధ్యత, వైయక్తికస్థాయిలో ఆచరించవలసిన కర్తవ్యం. ఏ దేశంలో అయినా ఏ ప్రాంతంలో అయినా మైనారిటీ ప్రజల మనసుల్లో అభద్రతాభావం కొంత ఉంటుంది. అందువల్ల వారు వివక్ష లేనిచోట కూడా అది ఉందనుకొనే అవకాశం సహజంగానే కొంత ఉంటుంది. బలవంతులైన వారు బలహీనుల ఆవేశం పట్ల ఎలా సహనం చూపాలో, మెజారిటీ కూడా మైనారిటీకి ఆ వెసులుబాటు ఇవ్వాలి. వారికి కొంచెం ఎక్కువ జాగా ఇవ్వాలి. ప్రత్యేకించి, వీరికీ వారికీ మధ్య సాంఘిక, ఆర్థిక అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు. ఇందులో కానీ…లు లేవు. ఎందుకూ ఎక్కువ జాగా అని కాషాయలంగోటీలలా నీలగకండి. అసమానతలు ఉన్న సమాజంలో, న్యాయం అందరికీ ఒకేలా అందదు. చట్టం అందరినీ ఒకేలా కాపాడలేదు. అందుకని ఆ ఎక్కువ జాగా (నిజానికి అదంత ఎక్కువేమీ కాదు).
ముంబయిలో ఇప్పటికీ ముస్లిమ్‌లకు కొన్ని హౌసింగ్ సొసైటీలలో అపార్ట్మెంట్లు అమ్మరని విన్నాను. ఎన్నో ఊళ్ళల్లో కొన్ని ఏరియాలలో ముస్లిములకు, నిమ్నవర్ణాలకూ ఇళ్ళు అద్దెకివ్వరు. ఆర్థికంగా, సామాజికంగా ఇంకా అట్టడుగునే ఉన్న దళితులపై వివక్ష, దౌర్జన్యం కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళ జీవితాలు ఏమీ మారలేదు. మొన్నకుమొన్న ముస్లిమ్ అన్న అనుమానంతో, గోరక్షక దళం ఒకటి ఒక కుర్రవాడిని చంపింది. చంపినాక తెలిసింది ఆ కుర్రవాడు హిందువని. కాకపోతే మాత్రం? ముస్లిమ్ అనిపిస్తే చంపేస్తారా? ఈ అధికారం, ఈ బాధ్యత వారికి వారిచ్చుకున్నదే కదా! ఇది విని ఏం చేయాలో తెలియని ఆవేశంలో, ఏమీ చేయలేని అసమర్థతతో (ఇంపొటెంట్ రేజ్ అన్నది పొ.క. పదమేనా?) మీరైనా, నేనైనా కడుపుమంటతో ఎలా రగిలిపోకుండా ఉంటాం?
గోరక్షకులు, నా గాడిద! ఎ మాన్ ఫ్రమ్ మెడ్రాస్, హాజ్ ఎ మాగ్నిఫిసెంట్… అన్న లిమరిక్ తెలుసుకోవాలి మీరు. గాడిద అనంగానే కొంటె అర్థాలు తీయకుండా.
నేను అప్పుడప్పుడూ (బి12 వైటమిను లోపం రాకుండా ఉండటం కోసమే) పైన మాత్రమే కాలి, కోస్తే లోపల పచ్చిగానే ఉన్న (రేర్ అంటాం లేండి) ఫిలే మిన్యాఁ (కమీడియన్ వీర్ దాస్ చెప్పినట్టు ఇండియన్లకు అది ఫిలెట్ మిగ్నాన్) అను గోమాంసపు వంటకాన్ని ప్రీతితో ఆరగించి సంతృప్తితో హోలీ కౌ! యూ ఆర్ రియల్లీ హోలీ బేబీ! అంటూ పొట్ట నిమురుకుంటాను, అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనుకున్నట్టు. అమెరికన్లకు తినడం తెలియదు, వెల్ కుక్డ్ బీఫ్ తింటారని యూరపియన్లు నవ్వుకుంటారట. పాపం, వారికి నా గురించి తెలియదు. (నేను రాకముందు అమెరికాలోనూ ఇండియాలోలా ఆవులు రోడ్ల మీద తిరుగుతుండేవని, నేనొచ్చిన కొన్నేళ్ళకు అవి మాయమయిపోయాయని నేనంటే కిట్టని వాళ్ళు ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు, మనవాళ్ళు ఇళ్ళు కొనుక్కొని గృహప్రవేశానికి చేసుకునే సత్యనారాయణ స్వామివ్రతంలో కలుసుకున్నప్పుడు, కథాసంవిధానం వింటూ, పులిహోర ప్రసాదం తింటూ.) ఈ నిజం ఇప్పుడు వాట్సాప్ ఫార్వర్డ్ అయిపోతుంది. ఇక నేను ఇండియాకు ఏ ఫిషింగుబోటు పొట్టలోనో దాక్కుని వెళ్ళాలి ఎవరికీ తెలియకుండా, ఖదీర్బాబుగారు వారి కథావనభోజనాలకు పిలిచినా, వెంకట్‌గారు ఆన్వీక్షికి ఆఫీసుకు రమ్మన్నా… రస్పుతిన్ను రాజాధికారులు డిన్నరుకు ఆహ్వానించినట్టు. అమ్మో! కాని, వారు పిలిస్తే పోకుండా ఎవరైనా ఉండగలరా?
ఆహ్వానం అంటే గుర్తొచ్చింది, మొన్న కన్నెగంటి రామారావుగారి పోస్టు కూడా ఎఫ్.బి.లో చూశానని. ఆయన ఈసారి ఖదీర్బాబుగారి కథావార్షికానికి ఆహ్వానితులట. సాహిత్యంలో లెక్కలు, లెక్కల్లో సాహిత్యం అని మాట్లాడతారట. (సుత్తి చేతిలో ఉంటే ప్రతీదీ మేకులా కనిపిస్తుందని – ఒక సామెత!) ఎవరు ఆ వీకెండ్ ఈ మీట్‌కి రాబోతున్నారా అనేది ఆయనకు తెలీదట. ఇంకెవరికీ తెలీదుట. చెప్పకూడదుట. అడగకూడదట. అంతా రహస్యమట. నాకు తిన్న స్టేకు కాస్తా ఉప్మాలా అరిగిపోయింది. జేమ్స్ బాండ్ సినిమాలో స్పెక్టర్ సంస్థ మీటింగులు గుర్తొచ్చాయి! ఖదీర్‌బాబు మోనోకిల్లుతో, చేతిలో పిల్లితో బ్లోఫెల్డ్ ఆహార్యంలో కంటగట్టారు! ఇక, నా పుత్రరత్నం (నాకు పుట్టినంత ‘మాత్రాన’ రత్నమయిపోడు, తెలుసు!) నాతో చూపించడానికి ప్రయత్నించి విఫలమయిన స్క్విడ్ గేమ్ అన్న సీరియల్ గుర్తొచ్చింది, వెళ్ళిన వాళ్ళను తలుచుకుంటే!
అన్నట్టు, రామారావుగారికి కూడా ఎక్కడ ఏది మాట్లాడకూడదో ఎవరైనా నేర్పించాలి! ఆయన మొన్నెక్కడో ‘తెలుగు భాషను సాహిత్యం నుండి రక్షించాలి’ అని ప్రకటించి ఆపైన వివరణ ఏదీ ఇచ్చినట్టు లేరు. ఇంకేముంది! ఏం జరగాలో అదే జరిగింది. ఆయన ఉద్దేశ్యం బహుశా నేను నవంబర్ 2020 ముందుమాటలో వెలిబుచ్చిన అభిప్రాయంతో పోలినదనుకుంటాను. ఆ ముందుమాట నుంచి రెండు వాక్యాలు.
తార్కిక వివేచన పూర్తిగా పక్కకు తప్పుకున్నాక, వాక్యాల్లోని రసహీనతను పట్టిచ్చే సాధనమేదీ మిగల్లేదు. కథలూ కవితల ద్వారా ఆగ్రహావేశాలు ప్రకటించే తెలుగు సాహిత్యకారులు వ్యాసం ద్వారా తమ వివేచనను కూడా ప్రకటించడం నేర్చుకోనంతకాలం తెలుగు భాష బోలు శబ్దాల రణగొణధ్వనిగానే మిగులుతుంది తప్ప ఆలోచనను పెంపొందించే భాష కాలేదు.
జిస్ తరఫ్ జాయియే హైఁ ఖోక్లే లఫ్జోఁక హుజూమ్
కౌన్ సంఝే యహాఁ ఆవాజ్కి గెహరాయీకో – అంటాడు కవి షఫీ హసన్.
సాహిత్యంలో ఎటువంటి గొంతులు మనకు అవసరం?