ఈమాట ముఖపత్రసుందరుడిని నేనే కాబట్టి, బాధ్యత అంతా నాదే కాబట్టి ముందుమాట వ్రాసింది నేను అనే ఏకవచనం. క్లుప్తంగా (మీ కొలతలో కాదు) అక్టోబర్ 2024 ముందుమాట గురించి రెండు మాటలు. ఇది సంజాయిషీ కాదు. ఏ ముందుమాటపై ఎటువంటి విమర్శకైనా నేను తలవొగ్గే ఉన్నాను.
ఇంద్రప్రసాద్ తన అభిప్రాయంలో ‘సంపాదకీయ సగభాగం హుందాగా ఉంది’ అన్నారు సహృదయంతో. అనిల్ రాయల్ ‘వాడిన భాషలో అంత నిష్టూరం, కాఠిన్యం అనవసరం. దానివల్ల అసలు విషయమ్మీద చర్చ జరిగే అవకాశం శూన్యమని’ అన్నారు. నిజమే. సాహిత్యచర్చలు వెలుగు చూపాలి. వెలుగులో కూడా చూడలేని వారికి వేడి అవసరం అవుతుంది. ఇక్కడ గుర్తించవలసినది ముందుమాట అసలు అంశాన్ని గురించి ఒక్కరూ ఒక్క మాట మాట్లాడలేదని. కేవలం రెండు వాక్యాలు మాత్రమే విడిగా పట్టుకొని కూర్చున్నారని, ఆ రెంటిలోనూ మొదటి వాక్యాన్ని మరింత గట్టిగా. అంతే కాదు. ఈ రాద్ధాంతం కేవలం ‘వాడిన భాషలో నిష్ఠూరం వల్లనే కా’దని నా నమ్మకం.
వీరే కాక, ఎంతో ఓపికతో, వాక్యం వాక్యం చదివి విశ్లేషించి అపార్థాలు ఎలా ఎందుకు రావచ్చో వివరించిన స్నేహితులున్నారు. తెలుసుకున్నాను. ఆశించిన ప్రయోజనం సాహిత్యరాజకీయాలని వీలైనంత కటువుగా దూషించటం. ఎంతకాలం ఇటువంటి ధోరణి తల పైకెత్తకుండా ఉంటుందో అంతకాలం అది నెరవేరిన ప్రయోజనం. ఆశించని ప్రయోజనం నేను ఇలా చాలా కన్వీనియెంటుగా నా వ్రాతలన్నీ ఆత్మకోటింగ్ చేసుకోవడం. (quoting, coating కాదు.) నా గురించి బాధపడిన స్నేహితులున్నారు. వారిగురించి ఎమోషనల్ కాకుండా మాట్లాడడం నాకు కష్టం. అందుకని ఆవైపు పోను.
ఈముందుమాటలో కాఠిన్యం ప్రయత్నపూర్వకం. కొన్ని వేరే పదాలు వాడి ఉండవచ్చు, వాక్యాలు కొన్ని వేరే రకంగా వ్రాసి ఉండవచ్చు, ఒప్పుకుంటాను. అక్టోబర్ 2023 సంచికలో ముందుమాటపై కొంత కలకలం రేగింది. ప్రత్యేకంగా అప్పుడే తన పుస్తకం ప్రచురించుకొని, నా మాటలతో మనసు నొచ్చుకున్న నూతక్కి ఉమగారిని కలుపుకుంటూ, క్షమాపణలు చెప్పుకుంటూ నా ఉద్దేశ్యం వివరించాను. అప్పుడు అది అవసరం అయింది. ఇప్పుడా అవసరం లేదు – వెలివేత*, మురికిగుంట వంటి ఒకటి రెండు పదాలు తప్ప, నేనన్నదాంట్లో తప్పు నాకు కనిపించడం లేదు. అప్పుడూ, ఇప్పుడూ కూడా కేవలం అతికొద్దిమందినే విమర్శించాను, తప్ప అందరినీ కాదు.
(*excoriate అన్న అర్థంలో తప్ప ostracize అన్న ఉద్దేశ్యంతో ఆ పదం వాడలేదు. కాని, అది సరయిన పదం కాదు. వాడి ఉండకూడదు.)
ఇక, ఈ రాద్ధాంతానికి ఊతమయిన వాక్యాలు రెండు – అర్థం ఒకటే.
మొట్టమొదట గుర్తించవలసింది – ఈ రెండు వాక్యాలు, అవి ప్రస్తావిస్తున్న ఆయా వర్గాల కథల పట్ల తీర్మానాలు కావు. వాటి వ్యాకరణం అది కాదు. పైన చెప్పినట్టు, ఈ ముందుమాట నేపథ్యంలో, వాదనకు సహకరించడం కోసం – కేవలం వస్తువు వల్లనో, సామాజిక కారణాల వల్లనో ‘మాత్రమే’ ఒక సాహిత్యాన్ని వెలకట్టలేము అని నొక్కిచెప్పడం కోసం – అన్న వాక్యాలు అవి.
మొదట రెండవ వాక్యం:
‘బ్రాహ్మణులనో, హిందువులనో కేరికేచర్ విలన్లుగా చూపుతూ అస్తిత్వవాద సైక్లోస్టయిలు కథలు’ – ఉదాహరణలు చూపగలను. అప్రస్తుతం. అనవసరం. అయితే, ఈ వాక్యానికి కొంత అదనపు నేపథ్యం ఉంది. అస్తిత్వవాద ధోరణులపై నా విమర్శ ఈనాటిది కాదు. వ్యథ-2004 వ్రాసేటప్పటికే ఆ విషయం మీద నాకొక స్పష్టత ఉంది. అందుకు ఒక కారణం, ఇదీ:
కేతు విశ్వనాధరెడ్డి ఒకసారెప్పుడో (’90ల చివరిలో అనుకుంటా) నాతో మాట్లాడుతూ (ఇవే మాటల్లో కాదు) అన్నారు: బ్రాహ్మణ కులంలో ఉన్న దురాచారాలను రూపుమాపి, అభ్యుదయమార్గంలోకి వారిని తేడానికి పాటుపడ్డవారందరూ ఆ కులంనుంచే వచ్చారు. ఆ రకమైన ఆత్మవిమర్శ వల్లే అక్కడ మార్పు సాధ్యమయింది. ఏ ఉద్యమానికైనా ఈ ఆత్మవిమర్శ అవసరం.
అప్పటినుంచీ నేను గమనిస్తూ వచ్చాను. నిజమే. ఆత్మవిమర్శ లేని, చేసుకోని, ఏ ఉద్యమమైనా ఏ వాదమైనా అంతిమంగా పెడదారే పట్టింది, పడుతుంది. ఏ దేశంలో ఎటువంటి ఉద్యమమైనా వాటిలో ఈ ఆత్మవిమర్శ అన్నది లేనంతవరకూ వాటివల్ల సమాజానికి చిరకాలపు మంచి జరగలేదు, జరగదు. తాత్కాలికంగా కొంత మార్పు, కొంత అభ్యుదయం కనిపించవచ్చు. అంతే. ఆత్మవిమర్శ లేని ఉద్యమాలు వాటిని నడిపే వ్యక్తులకు, నాయకులకూ మాత్రమే లాభం చేకూరుస్తాయి. ఆత్మవిమర్శ లేనంతకాలం ఈ అస్తిత్వవాద/వాదసాహిత్య ఉద్యమాలపై (నేకాదు, ఏ ఉద్యమం పట్ల అయినా) నా అభిప్రాయం మారదు. ఆత్మవిమర్శ చేసుకున్న అస్తిత్వవాద కథలు ఎవరైనా కొన్ని ఉదహరించగలరా?
ఇక మొదటి వాక్యం:
ఈ వాక్యం కూడా పై వాక్యం లాగానే కేవలం ఒక తర్క ప్రతిపాదన (a logical construct). అంతకంటే ఇంకేమీ కాదు. ఉదాహరణలిస్తాను. (మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇలా పాఠాలు చెప్పవలసి రావడం ఎలా ఉన్నా…)
1. పచ్చగా ఉన్నదంతా బంగారం కాదు. (బంగారం కావడానికి అది పచ్చగా ఉండటం ఒక్కటే సరిపోదు. అందువల్ల…)
2. పచ్చగా ఉన్నంత మాత్రాన ప్రతిదీ బంగారం అయిపోదు.
ఈ వాక్యాలలోంచి మీరు మరెన్నో రకాల వాక్యాలు వ్రాయచ్చు: పచ్చగా ఉంటేనే బంగారమయిపోదు. పచ్చగా లేకుంటే మాత్రం బంగారం బంగారం కాకుండా పోదు, పచ్చగా ఉన్నంత మాత్రాన పసుపుకొమ్ము బంగారం అయిపోదు, రెండూ పచ్చగా ఉన్నా భాస్వరం భాస్వరమే, బంగారం బంగారమే… అదే సమయంలో, ‘పచ్చగా ఉన్నదంతా బంగారమే’ అని మీరు నమ్మవచ్చు. అది మీ ఇష్టం.
ఈ వాక్యం నేను అన్నది:
– సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల ‘గురించి’ ‘వ్రాసినంత మాత్రాన’ అవి సాహిత్య రత్నాలయిపోవు.
ఈ వాక్యం – అవి సాహిత్యం కావు అనటం లేదు. ‘వ్రాసినంత మాత్రాన’ ‘రత్నాలు’ – అంటే గొప్ప సాహిత్యం – అయిపోవు అని అంటున్నది. ఈ వాక్యం – ఇవి వ్రాసేవారు ఎవరైనా కావచ్చు, అని కూడా చెప్తున్నది. ఇప్పుడు, ఈ వాక్యం చివరను “… రత్నాలు కాకుండాపోవు” అని మార్చి అది ఏ అర్థాన్నిస్తుందో చూడండి. వ్యతిరేకార్థంగా కనిపించినా ఇదీ చెప్తున్నది అదే. రత్నాలు అవుతాయి అని కచ్చితంగా చెప్పటం లేదు. అవచ్చు కాకపోవచ్చు అని కదా.
ఈ వాక్యాలు నేను అననివి:
– సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాలు వ్రాసినవి సాహిత్యరత్నాలు కావు.
– సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసినవి సాహిత్యరత్నాలు కావు.
మొదటి వాక్యం ఆ వర్గాలనుంచి మంచి రచయితలు రారు, రాలేరు అన్న అర్థాన్నిస్తుంది. రెండవ వాక్యం ఆ జీవితాల గురించి వ్రాసినది మంచి సాహిత్యం కాదు, కాలేదు అన్న అర్థాన్నిస్తుంది.
ఈ రెంటికీ భిన్నంగా నేను వ్రాసిన వాక్యం ‘అక్కడనుంచి వచ్చినంత మాత్రాన’ అంటున్నది. అంటే మంచి సాహిత్యం అనిపించుకోడానికి రచయిత ఎవరు లేదా వస్తువు ఏమిటి అన్న ఒక్క లక్షణమే సరిపోదు (అదనంగా మరికొన్ని లక్షణాలు అవసరం) అని మాత్రమే ఆ వాక్యపు అర్థం. దీనినుంచి, నేను వ్రాయని పై రెండువాక్యాల అర్థాన్ని ఎవరైనా ఎలా తెచ్చుకోగలిగారో నాకు అర్థం కావటం లేదు. ఈ వర్గాలనుంచి సాహిత్యరత్నాలు రావని, రాలేవని నేను వారిని, వాటిని నిరసిస్తున్నానన్న అర్థం ఈ వాక్యంలో ఎలా కనపడుతోంది? ఇవి నీ-జెర్క్ రియాక్షనరీలకు ట్రిగర్ వర్డ్స్ అయివుండాలి, అంతకంటే వేరే వివరణ లేదు.
అమరేంద్రగారి అభిప్రాయానికి ఈమాటలో ఇచ్చిన జవాబులో ఈ వాక్యాల బదులు వేరే వాక్యాలు వ్రాసివుంటే ఈ విపరీతార్థాలు వచ్చేవి కావన్నాను. ఉదా:
అగ్రవర్ణాల గురించి వ్రాసినంత మాత్రాన అది గొప్ప సాహిత్యం అవదు. వారిని కేరికేచర్లుగా చిత్రీకరించినంత మాత్రాన అది గొప్ప అస్తిత్వవాద సాహిత్యమూ అవదు.
పర్లేదా? బానే ఉందా? సంయమనంతో ఉందా? మరి ఇలా ఎందుకనలేదు? అగ్రవర్ణాలు వ్రాసినవే, అగ్రవర్ణాల గురించి వ్రాసినవే గొప్ప సాహిత్యమని ఎవరూ అనలేదు. కనీసం నేను వినలేదు. (వినే ఉంటే, ఇలా ఒక ముందుమాటలో ఒక వాక్యం కాదు, ఒక మూడు ముందుమాటలు ఆ ఒక్క అంశాన్నే చర్చిద్దును, మరింత కఠినంగా.) ‘అలా ఎవరూ పైకి అనరు, కానీ అది చాపకింద నీరులా…’ అని గొణగకండి. వ్యవస్థీకృత వివక్ష గురించి నాకు తెలుసు. ఈ ముందుమాట సందర్భం అది కాదు.
సరే. నిజంగా ‘అణచబడినవారి సాహిత్యాన్ని నిరసించడం, సాహిత్యాన్ని నేనెంచుకున్న ప్రమాణాల మీద తిరస్కరించడం’ నా ధోరణి అనిపిస్తే జులై 2024 ముందుమాట (మార్చ్ 2020 ముందుమాట కూడా) ఇలా ఎందుకు వ్రాశాను? అందులో:
ఎన్నాళ్ళగానో గొంతుల్లోనే నొక్కివేయబడ్డ కథలకు, నిరసనలకు, ఆశలకు ఇప్పటి సాహిత్యం ఒక స్వరాన్నిస్తోంది. ఇలా నాణానికి ఆవలి వైపుని, తరాలు మారినా చల్లారని లోపలి ఆవేదనలని, ఇప్పటి సాహిత్యం చూపించగలుగుతోంది. మారుతున్న సమాజపు పోకడలను ఇలా తెలుగు సాహిత్యంలోకి యువరచయితలు తేవడం తప్పకుండా అవసరం, అభిలషణీయం –
అని ఆహ్వానించాను. అదే సమయంలో, రచయిత స్వయంగా వెళ్ళి సమర్థించుకోలేని ఆ తావుల్లో కూడా రచన స్వంతంగా మనగలగాలి. అలా జరగాలంటే, యువరచయితలు తమ కథననైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి, అని సూచించాను. (నువ్వెవడివి బోడి సూచనలివ్వడానికి అంటే నేను వ్రాసింది మీరు చదువుతున్నారు కాబట్టే.)
పాడిందే పాటలా, నేను కూడా ఎప్పుడు చెప్పినా ఒకే మాట. కథను ఆసక్తిగా చదివించేలా వ్రాయండి. వాక్యం దిద్దుకోండి. ఇది అందరికీ సహజంగా రాదు. అందుకని ప్రయత్నించండి. చదవండి. నేర్చుకోండి.
నా ముందుమాటలు క్రమం తప్పకుండా చదివేవారికి ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. నాదగ్గర కొత్తగా చెప్పడానికి ఎన్నో సంగతులు లేవని, ఉన్న నాలుగు మాటలే ఇలా తిప్పి తిప్పి చెప్తుంటానని, ఎన్నిరకాలుగా చెప్పినా అంతఃసూత్రం ఇదేనని.
ఇంకెవరూ చెయ్యలేదు కాబట్టి, నా ముందుమాటను నేనే విమర్శించుకుంటాను, నేను రచయితలకు అచ్చు ఎలా రివ్యూ పంపుతానో అదే పద్ధతిలో నాకు నేనే పంపుకుంటాను (ఇది స్వకాయప్రవేశం. అన్వర్‍గారన్న పరకాయప్రవేశం కాదు):
మాధవ్‍గారూ:
‘సాహిత్యకళావారసత్వ సంపదను నిరర్థకమని, అప్రస్తుతమని విసర్జించే వారిని, ముందు తరపు రచయితలను చదవక్కర్లేదని, వారినే ఇంకా ప్రస్తావించడంలో ఏదో అజెండా, ఏదో వ్యూహం ఉందని, అందువల్లనే తమకు రావలసిన గుర్తింపు రావటం లేదనే ఒక ప్రమాదకర ధోరణిని ముందుకు తెస్తున్న కొందరు రచయితలను తెగనాడటం మాత్రమే ఈ ముందుమాట ఉద్దేశ్యం’ అని స్థూలంగా అర్థమయింది.
సమాజంలో… మురికిగుంట. చివరిది తప్ప ఈ వాక్యాలు బాగున్నాయి. చెప్పదలచుకున్న విషయానికి నాంది పలుకుతున్నాయి. ప్రగతివిరుద్ధం కాబట్టి జడత్వాన్ని సూచిస్తూ నిలవనీరు అన్నారనుకుంటాను. కాని ఉద్దేశ్యం, ఆవేశం అర్థమవుతున్నా మురికిగుంట అన్న పోలిక ఈ సందర్భానికి నప్పలేదు. ముందు చెప్పిన వాక్యాలతో పొసగలేదు. అభ్యుదయచలనశీలతకు వ్యతిరేకార్థాన్ని ఇవ్వవలసిన పద్ధతిలో ఇవ్వటం లేదు. సాహిత్యంలో వాడే ఉపమానాలకు, ప్రతీకలకు బైట ప్రపంచంలో కొన్ని సహజధర్మాలు ఉంటాయి. వాటికి విరుద్ధంగా సాహిత్యంలో వాటిని వాడకూడదు కదా.
ఈ పోలిక… నిలుస్తున్నారు. ప్రస్తుతసాహిత్యసమాజాన్ని మురికిగుంటగా పోల్చారు. కళాకారులకు, సృజనశీలులకు కులం, మతం, వాదం వంటి బురద అంటించడం ఇప్పుడు సాహిత్యకారులు కూడా చేస్తున్నారు అన్నారు. అయితే వారసత్వసాహిత్యసంపద, ఆవెంటనే ఇది… ప్రాపర్ సెగ్వే అంటాం కదా. అది లేదు. ఇది అయోమయానికి దారి తీస్తోంది. ‘ఈ నేపథ్యంలో’ అని తర్వాత వాక్యం మొదలు పెట్టి మీ ముందుమాటకు కేన్వాస్ ఏమిటో చెప్పే ప్రయత్నం చేశారు కాని అది సరిపోతుందనుకోను.
మీరన్నదానిలో తప్పేమీ లేదు. మన వారసత్వసాహిత్య సంపద అమూల్యమన్న అభిప్రాయం నాది కూడా. అందరికీ అన్నిరకాల సాహిత్యమూ నచ్చకపోవచ్చు. అదంతా చదవడమూ అవసరం కాకపోవచ్చు. మారే కాలంతో మన విలువలూ మారుతాయి, తప్పదు. అందుకే ఆ సాహిత్యాన్ని గుడ్డిగా ఒప్పుకోమనకుండా, ‘దానినుండి నేర్చుకొని, సమకాలీన పరిస్థితులతో అన్వయించుకొని ఆపైన ఆ సంపదకు తమ వంతు జ్ఞానాన్ని జోడించి…’ అని మీరనడం బాగుంది. ముందుమాట మొదలు పెట్టిన వాక్యాలతోటీ పొసుగుతోంది.
మన ముందుతరం రచయితలను ఎందుకు చదవాలో సూచించారు, వారి రచనలలో ఉన్న ప్రత్యేకత ఏమిటో చెప్పడం ద్వారా. తన రచనావ్యాసంగం పట్ల, సాహిత్యం పట్ల గౌరవం ఉన్న రచయిత ఎలా ప్రవర్తిస్తాడు? లేదూ పైన అన్న గుర్తింపు ధోరణి ఉన్న రచయిత ఎటువంటి పాఠకులను ఆశిస్తాడు? ఈ రెండవ రకం రచయితకు రచనను విశ్లేషణాత్మకంగా చదివే పాఠకులు అక్కర్లేదు. ట్రిగర్ వర్డ్స్ అంటారే, అవి తగలగానే మెచ్చుకొని తలలూపే పాఠకులు కావాలి (ఫెబ్యువరి 2020 ముందుమాట చూడండి). వారిని నాసిరకం పాఠకులు అని మీరనడంలో అంత తప్పేమీ నాకు కనిపించలేదు. కాని, పొలిటికల్ కరక్ట్‌నెస్ (పొ.క.) కోసం వేరే పదం వాడితే బాగుండేది.
భాష ఇంత కటువుగా ఉండవలసిన అవసరం లేదని మా సహపాదకుల అభిప్రాయం. మీరెప్పుడూ చెప్తూ ఉంటారు, వస్తువు ఏదయినా సరే వచనం సరిగా ఉండాలని. దృక్పథం ఏదయినా సరే సాహిత్యవిలువలు ఉండాలని. ఆ ఆదర్శానికి, ఈ ముందుమాటను ఒక ఉదాహరణగా చూపటం కష్టం.
ఈ రకమైన ధోరణి వేళ్ళపై లెక్కపెట్టగలిగిన ఏ కొద్దిమందిదో కదా. దానికి ఇంత కోపం, వారి ప్రస్తావన అవసరమా? అని అడిగాను. మీరు అవునని జవాబిచ్చారు. ‘సాహిత్యాన్ని స్వార్థం కోసం రాజకీయం చేయబూనడం నా దృష్టిలో క్షమించరాని నేరం, చేసేది ఒకరైనా నూరైనా. అందుకే ఇంత నిష్ఠూరం. ఇంత ఆవేశం. ఇదే అంశం మీద మరొక్కసారి ముందుమాట వ్రాయవలసి వస్తే అది ఇంతకంటే కఠినంగా ఉండబోతుందని ముందుగానే మీకు తెలియచేయడమైనది. కొన్ని విత్తనాలను మొలకెత్తనివ్వనే కూడదు’ అని అన్నారు. ఇదే అంశంపై మీరు ప్రచురించిన జూన్ 2019 ముందుమాట చూడండని కూడా అన్నారు. చూశాను, చదివాను కూడా.
సరే. ఇక కాదనను. మీ ఉద్దేశ్యం మీకు స్పష్టం అని మాకూ స్పష్టం. మీ ముందుమాటను ప్రచురిస్తాము. కాని, పైన చెప్పిన కారణాలవల్ల మీపై కొంత విమర్శ రావచ్చు. ఇంత నింపాదిగా వాక్యం వాక్యం చదివి అర్థం చేసుకోవడం, వివేచించడం, ఆపైన విమర్శించడం పత్రికాసంపాదకుడిగా, రచయితగా, ప్రచురణకర్తగా, సాహిత్యాభిలాషిగా మాకు అవసరం. అది మా బాధ్యత, మా ఉద్యోగధర్మం, మా కర్తవ్యం. కాని, అలానే పాఠకులూ ప్రవర్తిస్తారని ఆశించడం ప్రస్తుతసమాజంలో, ఇప్పుడున్న సాహిత్యవాతావరణంలో అసాధ్యం అని మీకు చెప్పకతప్పదు. ఆంగ్లంలో ఒక వాడుక ఉంది – టు కమ్ ఔట్ ఆఫ్ ది లెఫ్ట్ ఫీల్డ్ అని. అలా ఈముందుమాటకు, దీనితో ఏ సంబంధమూ లేని విమర్శ ఎడమవైపునుంచే కాదు ఏవైపు నుంచీ రాదనే ఆశిస్తాను.
నమస్తే
మాధవ్ మాచవరం
ఈమాట సంపాదకుల తరఫున.
అప్పుడు ఖదీర్‌బాబుగారు, ఇప్పుడు వెంకట్‌గారూ నాపై ఆగ్రహించిన కారణం, అది ప్రకటించిన తీరు ఇంచుమించు ఒకటే, అని మొదట్లో అన్నాను. ఆపైన, ఖదీర్‌బాబుగారి పోస్ట్, వెంకట్‌గారి పోస్ట్, రెంటికీ వచ్చిన కామెంట్లలో ఒక ప్రెడిక్టబుల్ నారేటివ్ కనిపించింది అని కూడా అన్నాను. ఇప్పుడు ఈ రెండు ముందుమాటలలో ఉన్న సామాన్యాంశాలు ఏమిటీ అని చూడండి.
అక్టోబర్ 2023 ముందుమాట – నా రచనలు ఎవరూ చదవరు, నా పుస్తకాలు ఎవరూ కొనరు, ఉచితంగా ఇచ్చినా చదవరు. కారణం తెలుగు ప్రజలలో సాహిత్యాభిలాష కనుమరుగవటం – అని వాపోయిన ‘కొందరు’ రచయితల గురించి.
అక్టోబర్ 2024 ముందుమాట – నా రచనలు ఎవరూ చదవరు, నా పుస్తకాలు ఎవరూ కొనరు, ఉచితంగా ఇచ్చినా చదవరు. ఇంకా ఆ ముందుతరం పేర్లు, రచనలే పట్టుకొని వేలాడుతున్నారు – అని ఆరోపించిన ‘కొందరు’ రచయితల గురించి.
ఈ ‘కొందరిలో’ తమ రచనలో నాణ్యతను నిజాయితీగా అంచనా వేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది?’ అని నేను మొదటిసారి అడిగాను. రెండవసారి అరిచాను.
ఈ రెండు ముందుమాటలు అందరు రచయితలనూ ఒకే తాటికి కట్టలేదు. ఈ రెండు ముందుమాటలవల్ల నన్ను నిందించినవారు వీటిని చదవవలసిన పద్ధతిలో చదివి, ఆపైన విమర్శించివుంటే అందులో నాకు అభ్యంతరం ఏముంటుంది? అది వీరెవరికీ చదవడం రాకపోవడం వల్ల అని అనుకోడం కష్టం.