జూన్ 2019

ఈనాడే పుట్టిందీ కాదు, ఈ ఏటితోనే పోయేదీ కాదు. ఎవరు మహాకవి? ఎవరు ఎందుకు కాదు? అన్న చర్చలు సమయసందర్భాలతో నిమిత్తం లేకుండా తెలుగు సాహిత్య సమూహాలలో ఉండుండీ అలజడి రేపడానికి కారణం లేకపోలేదు. మనకు కవిత్వాన్ని (ఆ మాటకొస్తే ఏ సాహిత్య ప్రక్రియనైనా) చదివి అర్థం చేసుకోవడం కన్నా ముందే, అది రాసిన కవిని, ఆ కవిత్వాన్ని ఒక వాద-భావ-వర్గ ప్రాతిపదికలపై ఒక మూసలో పడేయడం మీద మోజు ఎక్కువ. కవిత్వం పలికించిన స్వరం కన్నా, దాన్ని వినిపించిన శరీరం పట్ల ఆసక్తి ఎక్కువ. మనముందున్న నాలుగు పంక్తులు ఏం చెబుతున్నాయన్న స్పృహ కన్నా, కవిని పట్టి కుదిపివేసిన ఏ అనుభవం ఎలా మూర్తిమంతమై పదాలలోకి ఒదిగింది అన్న వివేచన కన్నా, ఆ పంక్తుల వెనుక ఉన్న మనుష్యులు, వారితో ముడిపడ్డ రాజకీయాలూ మనకు ముఖ్యం. ఇక్కడ కవిత్వాన్ని కవిని విడదీసి చూడలేం, కవిత్వాన్ని రాజకీయాన్ని విడదీసి మాట్లాడలేం, కులమతాలకు అతీతంగా కవిని గౌరవించలేం.

కవిత్వం తమ స్వార్థం కోసం సామాజిక రాజకీయ వైషమ్యాలను రేకెత్తించి పబ్బం గడుపుకోవాలనుకునే అవకాశవాదుల చేతిలో ఒదగాల్సిన ఆయుధం కాదు. మన ప్రస్తుత అవసరాల కోసం పనికి రావాల్సిన పనిముట్టు అసలే కాదు. సృజన ఉద్దేశము వేరు. దాని ప్రయోజనమూ లక్ష్యమూ వేరు. కవిత్వానికి రంగూ రుచీ వాసనా ఉండాలన్న మాటలు నిజమైన కవిత్వ ప్రేమికులకు చెప్పే రహస్యం ఒకటైతే, కవిత్వం కూడా రాజకీయంగా మారిపోయిన నేటి తెలుగు సాహిత్య వాతావరణంలో, ఈ మాటలు స్ఫురింపజేసే అర్థం మరొకటి. విశ్వనాథ ఏ కాలం వాడో జాషువా అదే కాలం వాడు. జీవిత నేపథ్యం, జీవన విధానం, అవి ఇరువురిలో కలుగజేసిన స్పందనలు పోల్చలేనివి. ఆ భిన్నత్వమే భిన్న దృక్పథాలను సమానంగా పోషిస్తూ, సాహిత్యానికి జీవలక్షణాన్ని ఆపాదిస్తుంది. అందరి కవిత్వమూ మనకు నచ్చక్కర్లేదు. కాని, ఎవరి కవిత్వం పట్ల సహానుభూతి ఉన్నదో వారిని మెచ్చుకోవడం కన్నా ఎవరి పట్ల వ్యతిరేకత ఉన్నదో వారిని చులకన చేయడం ప్రస్తుతం మనం అలవర్చుకున్న ఏకైక సాహిత్యావసరం. మహాకవి, యుగకవి వంటి డొల్ల పదాల మీద ఉన్న ఆసక్తి, వాటిని తమకు నచ్చిన పేర్లకు అతికించడంలో ఉన్న శ్రద్ధ, స్వయంసంపూర్ణమూ సర్వస్వతంత్రమూ అయిన కవిత్వం మీద ఉండి ఉంటే, బహుశా ఈ చర్చలెంత హానికరమో, అనవసరమో కొంతయినా అర్థమయ్యేదేమో. మనుష్యులుగా ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు, బలహీనతలు, నమ్మకాలు వారికుండటంలో అనౌచిత్యం ఏమీ లేదు కానీ, సాహిత్యపు ముసుగులో కొందరు ఎక్కడికక్కడ స్వయంలబ్ధి సమూహాలుగా విడివడి నిర్లజ్జగా తమ రాజకీయాలను, ద్వేష ప్రకటనలనూ సాహిత్యంగా, సాహిత్యావసరంగా అమ్మజూడటమే ప్రస్తుత తెలుగు సాహిత్య వాతావరణం లోని విషాదం. గొంతు ఎవరిది పెద్దదయితే వారిదే అధికారం అనుకొనే ధోరణిలోనే ప్రపంచమంతా ఉన్నది. కాని సాహిత్యసృజనని కూడా అదే తీరున విమర్శించలేం నియంత్రించలేం అన్న వివేకం కొరవడిన స్థితిలో ఉన్నాం. చివరకు, కవి రాసిన కవిత్వం గురించి మాట్లాడగలమే కాని, రాయని కవిత్వం గురించి ఎందుకు రాయలేదని కవిని ప్రశ్నించలేం, నిందించలేం అన్న కనీస సాహిత్య సంస్కారం కూడా మనకు అలవడని అధమస్థాయిలో ఉన్నాం మనం. ఈ పుట్టకురుపు ఉన్నది, ఇంతగా ప్రబలిందీ కేవలం తెలుగు సాహిత్యావరణంలోనేనా!